డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో బడుగులకే సర్కార్‌ పెద్దపీట | AP Govt given big platform for degree online admissions | Sakshi
Sakshi News home page

డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాల్లో బడుగులకే సర్కార్‌ పెద్దపీట

Published Wed, Feb 24 2021 5:07 AM | Last Updated on Wed, Feb 24 2021 5:07 AM

AP Govt given big platform for degree online admissions - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు న్యాయం చేకూరింది. ప్రముఖ కళాశాలల్లో కీలకమైన కోర్సుల్లో ఈ వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. గతంలో ఆన్‌లైన్‌ విధానం లేనందున కళాశాలల్లోని వివిధ కోర్సుల సీట్లను ఆయా యాజమాన్యాలు ఇష్టానుసారం భర్తీ చేసుకునేవి. రిజర్వేషన్ల విధానాన్ని పాటించకుండా ఆ వర్గాలకు కేటాయించాల్సిన సీట్లను కూడా అధిక ఫీజులు తీసుకొని తమకు నచ్చిన వారికి కేటాయించేవి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లో అన్ని కోర్సుల సీట్ల భర్తీకి ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానం తప్పనిసరి చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి ఉన్నత విద్యామండలి ద్వారా ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ విధానంలో ఆయా కోర్సుల సీట్లు భర్తీ చేయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వారి కోటా ప్రకారం సీట్లు భర్తీ చేసింది. అంతేకాకుండా మొత్తం సీట్లలో 33.5 శాతం మహిళలకు కేటాయించింది. ఇటీవల ముగిసిన డిగ్రీ ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియలోని గణాంకాలే దీనికి నిదర్శనం. 

రిజర్వుడ్‌ వర్గాలకు 79.26 శాతం సీట్లు  
రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, తదితర నాన్‌ ప్రొఫెషనల్‌ యూజీ కోర్సులు నిర్వహించే విద్యా సంస్థల్లో 152 ప్రభుత్వ, 120 ఎయిడెడ్, 1,062 ప్రైవేటు, 2 యూనివర్సిటీ కళాశాలలున్నాయి. వీటిలో మొత్తం 4,96,055 సీట్లు ఉండగా రెండు విడతల ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో 2,60,103 సీట్లు భర్తీ చేశారు. ఈ సీట్లలో 2,06,173 (79.26 శాతం) సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు లభించాయి. బీసీలకు అత్యధికంగా 1,40,340 సీట్లు దక్కగా.. ఎస్సీలకు 52,668, ఎస్టీలకు 13,165 సీట్లు కేటాయించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 2,117 సీట్లు దక్కాయి.  

బీఎస్సీకే ఎక్కువ ప్రాధాన్యం 
రెండు విడతల కౌన్సెలింగ్‌లో ఎక్కువ మంది విద్యార్థులు బీఎస్సీలో చేరేందుకు ఆసక్తిని చూపారు. భర్తీ అయిన 2,60,103 సీట్లలో 1,30,923 మంది బీఎస్సీ, 84,547 మంది బీకాం, 28,244 మంది బీఏ కోర్సులను ఎంచుకున్నారు. ఇక బీబీఏ, బీసీఏ, బీవీఓసీ, బీహెచ్‌ఎం, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ వంటి ఇతర కోర్సుల్లో 16,389 మంది చేరారు.  

మిగిలిన సీట్లు 2.35 లక్షలకు పైనే.. 
మొత్తం సీట్లలో రెండు విడతల ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ ద్వారా 2,60,103 సీట్లు భర్తీ కాగా ఇంకా 2,35,952 సీట్లు మిగిలి ఉన్నాయి. వీటిని స్పాట్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఆయా కళాశాలలు భర్తీ చేయనున్నాయి. వీటిని కూడా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఆయా వర్గాలకు కేటాయించనున్నారు. వీటిని కూడా కలిపితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించే సీట్ల సంఖ్య మరింత పెరగనుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement