Online counseling
-
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల్లో బడుగులకే సర్కార్ పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర వర్గాలకు న్యాయం చేకూరింది. ప్రముఖ కళాశాలల్లో కీలకమైన కోర్సుల్లో ఈ వర్గాలకు చెందిన వేలాది మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. గతంలో ఆన్లైన్ విధానం లేనందున కళాశాలల్లోని వివిధ కోర్సుల సీట్లను ఆయా యాజమాన్యాలు ఇష్టానుసారం భర్తీ చేసుకునేవి. రిజర్వేషన్ల విధానాన్ని పాటించకుండా ఆ వర్గాలకు కేటాయించాల్సిన సీట్లను కూడా అధిక ఫీజులు తీసుకొని తమకు నచ్చిన వారికి కేటాయించేవి. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కళాశాలల్లో అన్ని కోర్సుల సీట్ల భర్తీకి ప్రభుత్వం ఆన్లైన్ విధానం తప్పనిసరి చేసింది. 2020–21 విద్యా సంవత్సరానికి ఉన్నత విద్యామండలి ద్వారా ఆన్లైన్ కౌన్సెలింగ్ విధానంలో ఆయా కోర్సుల సీట్లు భర్తీ చేయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు వారి కోటా ప్రకారం సీట్లు భర్తీ చేసింది. అంతేకాకుండా మొత్తం సీట్లలో 33.5 శాతం మహిళలకు కేటాయించింది. ఇటీవల ముగిసిన డిగ్రీ ఆన్లైన్ కౌన్సెలింగ్ ప్రక్రియలోని గణాంకాలే దీనికి నిదర్శనం. రిజర్వుడ్ వర్గాలకు 79.26 శాతం సీట్లు రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, తదితర నాన్ ప్రొఫెషనల్ యూజీ కోర్సులు నిర్వహించే విద్యా సంస్థల్లో 152 ప్రభుత్వ, 120 ఎయిడెడ్, 1,062 ప్రైవేటు, 2 యూనివర్సిటీ కళాశాలలున్నాయి. వీటిలో మొత్తం 4,96,055 సీట్లు ఉండగా రెండు విడతల ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో 2,60,103 సీట్లు భర్తీ చేశారు. ఈ సీట్లలో 2,06,173 (79.26 శాతం) సీట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు లభించాయి. బీసీలకు అత్యధికంగా 1,40,340 సీట్లు దక్కగా.. ఎస్సీలకు 52,668, ఎస్టీలకు 13,165 సీట్లు కేటాయించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 2,117 సీట్లు దక్కాయి. బీఎస్సీకే ఎక్కువ ప్రాధాన్యం రెండు విడతల కౌన్సెలింగ్‌లో ఎక్కువ మంది విద్యార్థులు బీఎస్సీలో చేరేందుకు ఆసక్తిని చూపారు. భర్తీ అయిన 2,60,103 సీట్లలో 1,30,923 మంది బీఎస్సీ, 84,547 మంది బీకాం, 28,244 మంది బీఏ కోర్సులను ఎంచుకున్నారు. ఇక బీబీఏ, బీసీఏ, బీవీఓసీ, బీహెచ్ఎం, కమ్యూనికేషన్ టెక్నాలజీ వంటి ఇతర కోర్సుల్లో 16,389 మంది చేరారు. మిగిలిన సీట్లు 2.35 లక్షలకు పైనే.. మొత్తం సీట్లలో రెండు విడతల ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా 2,60,103 సీట్లు భర్తీ కాగా ఇంకా 2,35,952 సీట్లు మిగిలి ఉన్నాయి. వీటిని స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా ఆయా కళాశాలలు భర్తీ చేయనున్నాయి. వీటిని కూడా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఆయా వర్గాలకు కేటాయించనున్నారు. వీటిని కూడా కలిపితే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయించే సీట్ల సంఖ్య మరింత పెరగనుంది. -
డిగ్రీ ఫీజు చెల్లింపులు ఆన్లైన్లోనే
సాక్షి, హైదరాబాద్: డిగ్రీలో ఆన్లైన్ కౌన్సెలింగ్‌లో సీటు లభించినా కాలేజీకి వెళ్లి రిపోర్టు చేసి ఫీజు చెల్లి స్తేనే ఆ విద్యార్థికి సీటు కన్ఫార్మ్ చేసే విధానికి ఇక చెక్ పడనుంది. విద్యార్థులు ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి తమ సీటు కన్ఫర్మ్ చేసుకునే విధానం రాబోతోం ది. ఈ మేరకు డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల కమిటీ కసరత్తు ప్రారంభించింది. విద్యార్థులు ఆన్లైన్లోనే ఫీజు చెల్లిం చేలా చర్యలు చేపట్టేందుకు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కమిటీ సిద్ధమవుతోంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2019–20 విద్యా సంవత్సరంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల సన్నాహక సమావేశం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి, మండలి సెక్రటరీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. డిగ్రీ ఫస్టియర్ ప్రవేశాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా సేవలను మరింత సులభతరం చేయాలని నిర్ణయిం చారు. ఈసారి ప్రవేశాల ప్రక్రియను పూర్తి పేపర్‌లెస్ గా నిర్వహించనున్నట్లు లింబాద్రి తెలిపారు. విద్యార్థు ల రిజిస్ట్రేషన్ సమయంలో వచ్చే వన్‌టైమ్ పాస్వర్డ్ నుంచి మొదలుకొని కాలేజీలో చేరే వరకు అంతా ఆన్లైన్లోనే సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నుంచి ఇంటర్ పూర్తయిన విద్యార్థులతోపాటు ఆంధ్రప్రదేశ్ బోర్డు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ తదితర బోర్డుల నుంచి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను కూడా ఆన్లైన్లోనే సేకరించి వెరిఫికేషన్ పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. హెల్ప్లైన్ల ద్వారా సమస్యల పరిష్కారం.. విద్యార్థుల సమస్యలన్నింటినీ హెల్ప్‌లైన్ కేంద్రంలోనే పరిష్కరించేలా అధికారం కల్పిస్తామని లింబాద్రి పేర్కొన్నారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు అందరికీ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు వారు వెబ్సైట్లో ఫలితాలను డౌన్లోడ్ చేసుకునేప్పుడే డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు వివరాలు కూడా డౌన్లోడ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందులో ప్రవేశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు ఇస్తామని, అందులో విద్యార్థులు ఎలా డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలో ఉంటుందని స్పష్టం చేశారు. -
వైద్య ఉద్యోగుల్లో బదిలీల టెన్షన్
లబ్బీపేట : వైద్య ఉద్యోగుల్లో బదిలీల టెన్షన్ నెలకొంది. వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేయడంతో ఎంతో కాలంగా నగరంలోనే తిష్టవేసిన ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఐదేళ్లు నిండిన వారందరినీ కచ్చితంగా బదిలీ చేయాలని, రెం డేళ్లు నిండిన వారిని రిక్వెస్ట్‌పై బదిలీ చేయవచ్చని పేర్కొనడంతో ఎవరు బదిలీ అవుతారనే ఆందోళన మొదలైంది. ఇక్కడ పనిచేస్తున్న వారిలో జోనల్ కేడర్‌లో మూడింట రెండొం తుల మంది ఐదేళ్లకుపైగా సర్వీసు పూర్తి చేసిన వారుండగా, పదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న వారు సగంమంది ఉన్నారు. వారందరికీ బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ కౌన్సెలింగ్ ఈ బదిలీల కౌన్సెలింగ్‌ను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఒకేచోట ఐదేళ్లు పైగా పనిచేస్తున్నవారు ఎక్కడికి కోరుకుంటున్నారో ఆప్షన్స్ ఇస్తే వాటికనుగుణంగా బదిలీ చేస్తారు. రాజకీయ సిఫార్సులు చెల్లుబాటయ్యే అవకాశాలు లేవని తెలిసింది. ఇప్పటికే పలువురు సిఫార్సుల కోసం రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ైవె ద్య, ఆరోగ్యశాఖ బదిలీ కమిటీ చైర్మన్‌గా పూనం మాలకొండయ్య ఉండడంతో సిఫార్సులు పట్టించుకోరని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో 109 మంది స్టాఫ్ నర్సులుండగా.. వారిలో మూడో వంతు మంది బదిలీ అయ్యే అవకాశముంది. సీనియారిటీ ఆధారంగా దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బంది నగరంలో ఉన్నారు. హెడ్‌నర్సులు ప్రస్తుతం 25 మంది పనిచేస్తుండగా, వారిలో ఆరుగురు బదిలీ అయ్యే అవకాశం ఉంది. సీనియర్అసిస్టెంట్లు పదేళ్లుగా పనిచేస్తుండడంతో వారు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. హెచ్‌వీలు, ల్యాబ్‌టెక్నీషియన్స్, హెల్త్ అసిస్టెంట్లపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉంది. -
ఆసెట్ ఫలితాలు విడుదల
జూన్ 7 నుంచి ఆన్లైన్ కౌన్సెలింగ్ ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : ఆంధ్ర విశ్వవిద్యాలయం, పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, సమీకృత ఇంజినీరింగ్ ఏయూ ఈఈటీ 2014 కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలు గురువారం ఉదయం వీసీ జి.ఎస్.ఎన్.రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ర్యాంక్ కార్డులు, కౌన్సెలింగ్ విధానం, తేదీల వివరాలను www.andnra university.edu.in,www.audoa.in వెబ్సైట్లో పొందుపర్చినట్టు చెప్పారు. కౌన్సెలింగ్ వివరాలు : ప్రవేశ ప్రక్రియను ఆన్లైన్ విధానంలో అమలు చేస్తున్నారు. ఏయూ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు ర్యాంక్ కార్యులను డౌన్లోడ్ చేసుకోవాలి. ఎన్సీసీ, సీఏపీ విభాగాల వారికి జూన్ 7న, వికలాంగులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల విద్యార్థులకు జూన్ 8న ప్రవేశాల సంచాలకుల కార్యాలయం లో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. జూన్ 9 నుంచి 12 వరకు విశాఖపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, విజయవాడలలో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జూన్ 9 నుంచి 14 వరకు ర్యాంకుల వారీగా వెబ్ ఆప్షన్లు విద్యార్థులు ఆన్లైన్ విధానంలో ఎంపిక చేసుకోవాలి. మొదటి దశ సీట్ల కేటాయింపు వివరాలను జూన్ 15న విడుదల చేస్తారు. ఈ దశలో ప్రవేశాలు పొందిన విద్యార్థులు జూన్ 15 నుంచి 18లోగా ఫీజులు చెల్లించాలి. జూన్ 20, 21 తేదీలలో రెండో దశ కౌన్సెలింగ్‌కు సర్టిఫికెట్ల పరిశీలన జరుపుతారు. రెండో దశకు జూన్ 21 నుంచి 23వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవలసి ఉంటుంది. రెండో దశ సీట్ల కేటాయింపు జూన్ 24న జరుపుతారు. రెండో దశలో సీట్లు పొందినవారు జూన్ 25 నుంచి 28లోగా ఫీజులు చెల్లించాలి. విభాగాల వారీగా ఖాళీల వివరాలను జూన్ 29న వెబ్‌లో ఉంచుతారు. వర్సిటీ కళాశాలల్లో ఖాళీలను జూన్ 30, జూలై ఒకటో తేదీలలో స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తారు. అనుబంధ కళాశాల్లో మిగులు సీట్లను జూలై 2,3 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ల విధానంలో భర్తీ చేపట్టనున్నారు. విభాగా వారీ ర్యాంకర్లు : లైఫ్‌సెన్సైస్ విభాగంలో డి.షాలిని (విశాఖ) ప్రథమ, జి.వి హర్షిత(విశాఖ) ద్వితీయ, జి.బి కృష్ట(ప్రకాశం) తృతీయ, ఫిజికల్సైన్స్లో పి.సాయికుమార్ (పశ్చిమ గోదావరి) ప్రథమ, డి.ఆర్.ఎల్.అంబికామణి(తూర్పుగోదావరి) ద్వితీయ, ఎ.మంగబాబు (తూర్పుగోదావరి) తృతీయ, మ్యాథమెటికల్ సైన్స్‌లో ఎం.లక్ష్మీప్రియ (విశాఖ) ప్రథమ, ఎస్.రమ్య (విశాఖ) ద్వితీయ, సి.హెచ్.డి.ఎల్.ప్రసన్న (తూర్పుగోదావరి) తృతీయ ర్యాంకులు సాధించారు. కెమికల్ సైన్స్‌లో ఎస్.మనీష్‌కుమార్ రెడ్డి(వైఎస్ఆర్ కడప) ప్రథమ, ఎం.సుప్రియ (తూర్పుగోదావరి) ద్వితీయ, పి.వి.సౌందర్య(విశాఖ) తృతీయ, జియాలజీలో ఎస్.యు.ఉమావెంకటేశ్వరరావు(పశ్చిమగోదావరి) ప్రథమ, కె.అలెక్సీ మరియా ద్వితీయ, ఎల్.లోకనాథ్(ఒరిస్సా) తృతీయ, హ్యూమానిటీస్, సోషల్‌సైన్స్‌లో కె.రాజు (విశాఖ) ప్రథమ, కె.కె.ప్రద్యుమ్న (విశాఖ) ద్వితీయ, ఇ.శ్రీనివాసరావు (శ్రీకాకుళం) తృతీయ, ఆంగ్లంలో డి.ఉమా శంకర్ (విశాఖ) ప్రథమ, ఎ.ప్రణీత (విశాఖ) ద్వితీయ, ఆర్.శాన్సి(విశాఖ) తృతీయ, తెలుగులో ఎం.సత్యారావు (విజయనగరం) ప్రథమ, పి.ధనుంజయరావు (విజయనగరం) ద్వితీయ, బి.వీరబాబు(కృష్ణా)తృతీయ స్థానాలలో నిలచారు. ఐదేళ్ల సమీకృత ఇంజినీరింగ్ కోర్సుకు నిర్వహించిన ఏయూఈఈడీలో డి.ల లిత్ రాజ్ (విజయనగరం) ప్రథమ, జి.జయధర్ (విజయనగరం) ద్వితీయ, జి.సాయి కిరణ్(విశాఖ) తృతీయ స్థానాలలో నిలిచారు. -
ఆన్లైన్లో బాధ చెప్పెయ్..!
రాజేశ్ బాగానే పని చేస్తాడు. బాస్ చెప్పిన పని చేసుకు పోతుంటాడు. ఎంత బాగా చేసినా నిత్యం ధుమధుమలాడే బాస్ అంటే రాజేశ్‌కు భయంతో పాటు కోపం కూడా ఉంది. ఈ సంగతి ఎవరితో చెప్పుకున్నా బాస్‌కు తెలిసే ప్రమాదం ఉంది. దాంతో మౌనంగా ఉండిపోతున్నాడు. గవర్నమెంట్ ఆఫీసులో పదేళ్లకుపైగా క్లర్కుగా పనిచేస్తున్న అనన్యకు ప్రమోషన్ రావటమే లేదు. అందుకు కారణం ఆఫీసు రాజకీయాలు. వీటిపై ఎంత కోపం వచ్చినా ఆమె నిస్సహాయంగా ఉండిపోతోంది. రాజేశ్, అనన్య అనే కాదు. చాలామందికి ఇలాంటి సమస్యలు ఉంటూనే ఉంటాయి. కాకపోతే ఎవరితోనైనా చెప్పుకుంటే విషయం బయటకు పొక్కుతుందేమోనన్న భయం. అలాగని ఎంతోకాలం మనసులోనే దాచుకుని ఉండలేరు. మరేం చేయాలి? తమ వివరాలు బయటపెట్టకుండా తమ మనోవేదనను ఎవరితోనైనా పంచుకునే అవకాశం వస్తే...? సరిగ్గా ఈ అవసరాన్ని తీర్చడానికే కొన్ని వెబ్సైట్లు అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్ కౌన్సెలింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పటికే వేలాది మంది భారతీయులు ఈ సైట్లను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కౌన్సెలింగ్ పొందారు. ‘ముక్కూ మొహం తెలియని స్నేహితుడితో నా మనో సంఘర్షణను చెప్పుకున్నాక నా మనసులోంచి ప్రతికూల ఆలోచనలు తొలగిపోతున్నాయి...’ అనేది కౌన్సెలింగ్ అనంతరం ఓ వైద్య విద్యార్థిని మాట. సాధారణంగా భారతీయులు తమ మనోవేదనను ప్రొఫెషనల్ కౌన్సెలర్లతో చెప్పుకోవడానికి బిడియపడుతుంటారు. ఇప్పుడు ఇలాంటి సేవలు ఆన్లైన్లో లభిస్తుండడంతో పరిస్థితిలో మార్పు వస్తోంది. తమ వివరాలు చెప్పకుండానే ఆన్లైన్ ద్వారా సైకాలజిస్టులు, కౌన్సెలర్ల సూచనలు, సలహాలతో ఊరట పొందుతున్నారని ముంబైకి చెందిన సైకాలజిస్టు కరణ్ ఖటావు చెప్పారు. ఇంటర్నెట్ను వినియోగించే కార్పొరేట్ ఉద్యోగులు, విద్యార్థులు పలువురు ఆన్లైన్లో స్వాంత్వన పొందుతున్నట్లు తెలియజేశారు. ఈ తరహా సేవలందిస్తున్న షేరింగ్దర్ద్.కామ్‌కు ఇప్పటికే 43 వేల మందికిపైగా రిజిస్టర్డ్ యూజర్లుండడం గమనార్హం. చాలా సులువుగా తమ సమస్యలను చెప్పుకునే అవకాశం ఉండడం ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు ఆదరణ పెంచుతోంది. నెట్ అందుబాటులో ఉంటే చాలు, ఇలాంటి సేవలు 24 గంటలూ లభిస్తాయని ఎథోస్హెల్త్కేర్.కామ్ కౌన్సెలర్ డాక్టర్ ఎస్కే శర్మ చెప్పారు. వ్యక్తిగతంగా వచ్చి కౌన్సెలింగ్ పొందేవారి కంటే ఆన్లైన్, ఫోన్లో సంప్రదించే వారే ఎక్కువన్నారు. లేడీస్‌తో మాట్లాడాలంటే భయం... కౌన్సెలింగ్ సైట్లను 18-25 ఏళ్ల వయస్కులే ఎక్కువగా సందర్శిస్తున్నారు. ఇతరులతో సంబంధాలు విచ్ఛిన్నం కావడం, మహిళలతో మాట్లాడాలంటే బెరుకు వంటి అంశాలపై కౌన్సెలింగ్ పొందుతున్నారు. ఇక 25-40 ఏళ్ల ఏజ్ గ్రూప్ వారు ఆఫీసు రాజకీయాలు, పని ఒత్తిడి, చేస్తున్న ఉద్యోగంలో అసంతృప్తి వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. సంస్కృతి, సంప్రదాయాల కారణంగా తాము పురుషులతో పోటీ పడలేకపోతున్నామని పలువురు మహిళలు వాపోతున్నారు. తమకు తగిన సూచనలిచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. -
సర్టిఫికెట్ల పరిశీలనకు అధిక సంఖ్యలో హాజరు
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఏఎన్‌యూ ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో ఆదివారం జరిగిన ఎంసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వర్సిటీ అధ్యాపకులు శనివారం సామూహిక సెలవు ప్రకటంచడంతో సర్టిఫికెట్ల పరిశీలన నిలిపివేయడం, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ గుంటూరులోని గుజ్జనగుండ్ల కేంద్రం వారు నిరవధికంగా విధులు బహిష్కరించడంతో.. అక్కడి విద్యార్థులకు కూడా ఏఎన్‌యూలో పరిశీలన జరపాలని నిర్ణయించారు. దీంతో ఆదివారం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆన్లైన్ కౌన్సెలింగ్ కేంద్రంతో పాటు క్యాంటిన్ ప్రాంగణం నిండిపోయింది. ఇంజినీరింగ్ కళాశాలల వారితో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఆలస్యం.. వర్సిటీ కేంద్రంలో విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావడంతోపాటు బయటి ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చి విద్యార్థులను తమ కళాశాలకు ఆప్షన్ ఎంచుకోవాలని కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే ప్రాంతంలో కళాశాలల ప్రతినిధులు విద్యార్థులను పిలిచి సమూహాలుగా మీటింగ్‌లు పెట్టడం వల్ల గందరగోళ పరిస్థితి నెలకొంటోంది. దీనివల్ల నిర్వాహకులు ఏ ర్యాంకు వారిని రిజిస్ట్రేషన్ కు పిలిచారనేది విద్యార్థులు గ్రహించడంలో అసౌకర్యం తలెత్తుతోంది. ఇంజినీరింగ్ కళాశాలల వారు కౌన్సెలింగ్ కేంద్రం ప్రాంగణంలోకి రాకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వారు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ వద్దకే వచ్చి హడావుడి చేయడం గమనార్హం! యూనివర్సిటీలో సరైన భోజన వసతి లేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నానాఅవస్థలు పడుతున్నారు. ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు నుంచి ఇదే పరిస్థితి ఉన్నా.. ఆదివారం అధిక సంఖ్యలో తరలిరావడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్సిటీలో క్యాంటిన్ ఉన్నా టీ, అరకొర అల్పాహారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. కౌన్సెలింగ్ నిర్వాహకులు, వర్సిటీ అధికారులు భోజన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.