సర్టిఫికెట్ల పరిశీలనకు అధిక సంఖ్యలో హాజరు
Published Mon, Aug 26 2013 5:00 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఏఎన్‌యూ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కేంద్రంలో ఆదివారం జరిగిన ఎంసెట్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వర్సిటీ అధ్యాపకులు శనివారం సామూహిక సెలవు ప్రకటంచడంతో సర్టిఫికెట్ల పరిశీలన నిలిపివేయడం, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ గుంటూరులోని గుజ్జనగుండ్ల కేంద్రం వారు నిరవధికంగా విధులు బహిష్కరించడంతో.. అక్కడి విద్యార్థులకు కూడా ఏఎన్‌యూలో పరిశీలన జరపాలని నిర్ణయించారు. దీంతో ఆదివారం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఆన్‌లైన్ కౌన్సెలింగ్ కేంద్రంతో పాటు క్యాంటిన్ ప్రాంగణం నిండిపోయింది.
ఇంజినీరింగ్ కళాశాలల వారితో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ఆలస్యం..
వర్సిటీ కేంద్రంలో విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరుకావడంతోపాటు బయటి ఇంజినీరింగ్ కళాశాలల ప్రతినిధులు కౌన్సెలింగ్ కేంద్రానికి వచ్చి విద్యార్థులను తమ కళాశాలకు ఆప్షన్ ఎంచుకోవాలని కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగే ప్రాంతంలో కళాశాలల ప్రతినిధులు విద్యార్థులను పిలిచి సమూహాలుగా మీటింగ్‌లు పెట్టడం వల్ల గందరగోళ పరిస్థితి నెలకొంటోంది. దీనివల్ల నిర్వాహకులు ఏ ర్యాంకు వారిని రిజిస్ట్రేషన్ కు పిలిచారనేది విద్యార్థులు గ్రహించడంలో అసౌకర్యం తలెత్తుతోంది. ఇంజినీరింగ్ కళాశాలల వారు కౌన్సెలింగ్ కేంద్రం ప్రాంగణంలోకి రాకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ వారు యథేచ్ఛగా రిజిస్ట్రేషన్ వద్దకే వచ్చి హడావుడి చేయడం గమనార్హం!
యూనివర్సిటీలో సరైన భోజన వసతి లేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నానాఅవస్థలు పడుతున్నారు. ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు నుంచి ఇదే పరిస్థితి ఉన్నా.. ఆదివారం అధిక సంఖ్యలో తరలిరావడంతో మరింత ఇబ్బందులు ఎదురయ్యాయి. వర్సిటీలో క్యాంటిన్ ఉన్నా టీ, అరకొర అల్పాహారాన్ని మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. కౌన్సెలింగ్ నిర్వాహకులు, వర్సిటీ అధికారులు భోజన వసతి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Advertisement
Advertisement