ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్యాంధ్ర సెగ
Published Tue, Aug 20 2013 5:32 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
గుంటూరు ఎడ్యుకేషన్/ గుంటూరు రూరల్, న్యూస్‌లైన్: ఎంసెట్ కౌన్సెలింగ్‌కు తొలిరోజే అడ్డం కులు ఎదురయ్యాయి. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ప్రభుత్వపాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది కౌన్సెలింగ్‌ను బహిష్కరించడంతో గుంటూరుజిల్లాలోని రెండు పాలి టెక్నిక్ కళాశాలల్లో తొలిరోజు విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన నిలిచిపోయింది. షెడ్యూల్ ఆధారంగా ఎంసెట్-2013 కౌన్సెలింగ్‌లో భాగంగా ఎంపీసీ స్ట్రీమ్‌లో ఇంజినీరింగ్, బి.ఫార్మసీ కోర్సు ల్లో ప్రవేశం కోసం సోమవారం సర్టిఫికెట్ల పరిశీ లన ప్రారంభమైంది. గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల, సాంబశివపేట లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఒకటో ర్యాంకు నుంచి 4,000ర్యాంకు వరకు గుజ్జనగుండ్లలో సర్టిఫికెట్ల పరిశీలన జరగాల్సిఉండగా, కళాశాలకు చేరుకున్న అధ్యాపకులు, సిబ్బంది రాష్ట్రశాఖ పిలుపు మేరకు తాము విధులను బహిష్కరిస్తున్నామని కోఆర్డినేటర్ జీఎంసీ కేశవరావుకు చెప్పి వెళ్లిపోయారు. తొలుత ఉదయం 9.00 గంటలకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని విద్యార్థులను పిలువగా 96వ ర్యాంక్ సాధించిన వేజెండ్ల వేద మౌనిక అనే విద్యార్థిని హాజరయ్యింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయగా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసేందుకు సిబ్బంది లేక విద్యార్థినిని వెనక్కు పంపివేశారు.జిల్లావ్యాప్తంగా తరలివచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు కౌన్సెలింగ్ జరుగుతుందేమననే ఆశతో కళాశాల ప్రాంగణంలోని చెట్లకింద గంటల కొద్దీ సమయాన్ని గడిపారు.
కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న విద్యార్థి జేఏసీ
సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని కౌన్సెలింగ్ కేంద్రంలో కౌన్సెలింగ్ నిర్వహించరాదంటూ సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు కళాశాల ప్రధాన ద్వారం వద్ద బైఠాయించారు. విద్యార్థి జేఏసీ కోఆర్డినేటర్ ఎం. వెంకటరమణ, జిల్లా కన్వీనర్ రావిపాటి సాయికృష్ణ, నూనె పవన్‌తేజ తదితరులు గంటసేపు ఆందోళన నిర్వహించి వెళ్లిపోయిన అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సర్టిఫికెట్ల పరిశీలన ఆలస్యంగా ప్రారంభించారు. నల్లపాడు, గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరగకపోవడంతో ఆయా కళాశాలల్లో హాజరుకావాల్సిన విద్యార్థులు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చేరుకున్నారు. దీంతో ఇక్కడి హెల్ప్‌లైన్ కేంద్రం విద్యార్థులతో కిక్కిరిసింది.
ఇక్కడ తొలిరోజు నాలుగు వేల మంది ర్యాంకర్లను మాత్రమే పిలువగా, రెండు పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ ప్రారంభం కాకపోవడంతో ఆయా సెంటర్లకు వెళ్లిన విద్యార్థులు మధ్యాహ్నం నుంచి ప్రభుత్వ మహిళా కళాశాలకు తరలివచ్చారు. ఈ ఒక్క కేంద్రంలోనే ఒకటి నుంచి 12,000ర్యాంకు వరకు గల విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించాల్సి వచ్చింది. సర్టిఫికెట్ల పరిశీలనకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు హాజరుకాగా, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారుల బాధ్యతలను కళాశాల అధ్యాపకులే నిర్వర్తించారు. రాత్రి 10 గంటల వరకు ఏకబిగిన సర్టిఫికెట్ల పరిశీలన జరగ్గా 400 మంది విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. హెల్ప్‌లైన్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.
Advertisement
Advertisement