నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
Published Mon, Aug 19 2013 5:05 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఎంసెట్ -2013 కౌన్సెలింగ్‌లో భాగంగా ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభం కానుంది. జిల్లాలో నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాల పరిధిలో ఆదివారం సాయంత్రానికి ఏర్పాట్లు పూర్తిచేశారు. నాలుగింటిలో రెండు పాలిటెక్నిక్ కళాశాలలు కావడంతో అక్కడ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందా లేదా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో సిబ్బంది కౌన్సెలింగ్‌కు హాజరుకాబోమని స్పష్టంచేశారు. గుంటూరు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌లో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది శనివారం మూకుమ్మడి సెలవు పెట్టారు. నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విధులు బహిష్కరించి, ఆందోళనా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఈ రెండు కళాశాలల్లో ప్రిన్సిపల్స్ మాత్రమే ఉండడంతో కౌన్సెలింగ్ నిర్వహణపై చేతులెత్తేశారు. గుజ్జనగుండ్ల పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సెలింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయగా, నల్లపాడు కళాశాలలో ఏర్పాట్లు చేయలేదు సరికదా.. ఆదివారం మూసి ఉంది. గుంటూరు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాట్లుచేశారు. మహిళా కళాశాల సిబ్బంది సమ్మెలో ఉండగా, అధ్యాపకులు అందుబాటులో ఉన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం విద్యార్థులు రాష్ట్రంలో ఎక్కడైనా హాజరమ్యే అవకాశం ఉండడంతో జిల్లాకు చెందిన ఎంసెట్ ర్యాంకర్లు సర్టిఫికెట్ల పరిశీలన కోసం ముందుగానే తెలంగాణ జిల్లాలకు వెళ్లారని తెలుస్తోంది. ఆర్టీసీ సిబ్బంది సమ్మెతో బస్సులు లేక విద్యార్థులు వారి వెంట వచ్చే తల్లిదండ్రులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో విద్యార్థులు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉండగా రెవెన్యూ సిబ్బంది సమ్మెతో ధ్రువపత్రాల జారీ నిలిచిపోయింది.
తొలిరోజు సర్టిఫికెట్ల పరిశీలన జరిగేదిలా..
ఎంసెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం ఒకటి నుంచి 15 వేల ర్యాంకుల వరకు విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలించనున్నారు. ఒకటి నుంచి 4000 ర్యాంకు వరకు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో, 4001 నుంచి 8000 ర్యాంకు వరకు నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలలో, 8001 నుంచి 12,000 ర్యాంకు వరకు ప్రభుత్వ మహిళా కళాశాలలో, 12,001 నుంచి 15,000 వరకు ఏఎన్‌యూలో హాజరుకావాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులు కళాశాలల ఎంపిక కోసం ఈనెల 22 నుంచి వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాల్సి ఉంది.
నేటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: ఎంసెట్ కౌన్సెలింగ్ భాగంగా సోమవారం నుంచి ఎంసెట్ ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమవుతుంది. వర్సిటీ ఆన్‌లైన్ హెల్ప్ సెంటర్‌లో సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లుచేశారు. తొలి రోజు మొదటి ర్యాంకు నుంచి 15 వేల ర్యాంకు వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని హెల్ప్‌లైన్ సెంటర్ అధికారులు తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఏపీ ఎన్జీవోల పిలుపుమేరకు వర్సిటీ అధ్యాపకేతర సిబ్బంది ఐదు రోజులుగా సమ్మెలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ సెంటర్‌లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. నిర్వాహకులు మాత్రం ఉన్నత విద్యామండలి సూచనల మేరకు సర్టిఫికెట్ల పరిశీలన జరిపేందుకు సిద్ధమవుతున్నారు.
Advertisement
Advertisement