'రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే రాజధాని నిర్మాణం'
హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన రాజధాని అంశం త్వరలోనే ఓ కొలిక్కి రానుంది. కొత్త రాజధాని ఏర్పాటు నిర్ణయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ ఈ రోజు వివరణ ఇచ్చారు. రాజధాని నిర్మాణం అనేది తమ పరిధిలో ఉండదని.. అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని ఆయన తేల్చిచెప్పారు. ఈ మేరకు శనివారం భేటీ అయిన శివరామకృష్ణన్ కమిటీ సుదీర్ఘ చర్చల అనంతరం వివరణ ఇచ్చింది. రాజధాని నిర్మాణం అనేది తమ చేతుల్లో ఉండదని, అది కేవలం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని శివరామకృష్ణన్ కమిటీ తెలిపింది. తాము సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామని ఆ కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ తెలిపారు.
'ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని కలిసాం. ఆయన రాజధాని ఫలనా చోట ఉండాలని మాకు సూచించలేదు. అలాగే మా సభ్యుల బృందం గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ లను కలిసాం. త్వరలోనే ప్రతిపక్ష నాయకున్ని కూడా కలుస్తాం' అని ఆయన స్పష్టం చేశారు. దీనిపై ఆగస్టు 10 లోపు తుది నివేదికను కేంద్రానికి సమర్పించాల్పి ఉందన్నారు. రాజధాని నిర్మాణానికి రహదారులు, నీటి వనరులు అతి ముఖ్యమైనవిగా ఆయన పేర్కొన్నారు. కొత్తగా రాజధాని నగరాన్ని నిర్మించడం కష్టమని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రస్తుతం ఉన్న నగరాల్లో ఏదో నగరాన్ని ఎంపిక చేసుకోవాలన్నారు.