ఎంసెట్ కౌన్సెలింగ్ జరిగేనా ?
Published Sat, Aug 17 2013 3:13 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలనకోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురుకానున్నాయి. ఈనెల 19నుంచి ప్రారంభం కానున్న ఎంసెట్ సర్టిఫికెట్ల పరి శీలనను అడ్డుకుంటామని సమైక్యాంధ్ర జేఏసీ శుక్రవారం ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మే10న జరిగిన ఎంసెట్ ఫలితాలను జూన్‌లో విడుదలచేసిన ప్రభుత్వం కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోవడంలో విఫలమైంది. ఇతర రాష్ట్రాల ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటికే తరగతులు ప్రారంభం కాగా, ఇక్కడ అటువంటి పరిస్థితి లేకపోవడంతో ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన ప్రతిభావంతులు ఆవేదన చెందుతున్నారు. ఎంసెట్‌తో పాటు జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలు రాసిన పలువురు విద్యార్థులు ఎంసెట్ ప్రకటనరాని కారణంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారు.
ఫలితాలు విడుదలైన మూడు నెలల తరువాత ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎట్టకేలకు నోటిఫికేషన్ జారీచేసింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల19 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జరగనుండగా, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన విద్యార్థులకు 22 నుంచి కళాశాలల ఎంపిక కోసం వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఇదంతా సజావుగా ఉండగా.. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో కౌన్సెలింగ్ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం నాలుగు హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. వాటిలో మూడు గుంటూరు నగర పరిధిలోనూ, మరొకటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఉంది.
జిల్లా నలుమూలలా ఉన్న విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్‌కౌన్సెలింగ్ కోసం గుంటూరు రావాల్సి ఉంది. సమైక్య ఉద్యమ ప్రభావంతో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో విద్యార్థులు గుంటూరు చేరుకోవాలంటే కష్టమే. రవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు తప్పేట్టులేదు. 19నుంచి ప్రారం భం కానున్న సర్టిఫికెట్ల పరిశీలనకు ఏఎన్‌యూ క్యాంపస్‌తో పాటు గుంటూరులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన విద్యార్థులు మళ్లీ కళాశాలల ఎంపికకు ఆ కేంద్రాల్లో వెబ్ కౌన్సెలింగ్‌కో హాజరుకావాల్సి ఉంది. రెండుసార్లు జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు రవాణా ఏర్పాట్లులేక విద్యార్థులు ప్రైవేటు వాహనాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement