సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ కోర్సులకు రానురాను ఆదరణ తగ్గుతోంది. ఉపాధి, ఉద్యోగావకాశాలున్న కోర్సులకు మాత్రమే డిమాండ్ ఉండడంతో విద్యార్థులు వాటివైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతమున్న కాలేజీల్లో కోర్సులు, సీట్లకు తగ్గట్టుగా విద్యార్థుల సంఖ్య ఉండడం లేదు. అయినా సరే కొత్త కాలేజీలకు అనుమతులు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి రంగం సిద్ధం చేస్తుండడంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే కాలేజీల సంఖ్య ఎక్కువై ప్రమాణాలు లేకుండా బోధన సాగుతోందని, ఇంకా కాలేజీలను పెంచడం వల్ల ఫలితమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాలేజీల్లో కనీస సదుపాయాలు, సరైన బోధన ఉండటం లేదని ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని సరిచేసి ఇప్పుడున్న కాలేజీల్లోనే బోధన ప్రమాణాలను నెలకొల్పాల్సిన మండలి దీనికి విరుద్ధంగా మరిన్ని ప్రైవేటు కాలేజీలకు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధమవుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం కొంతమందికి లబ్ధి చేకూర్చడం కోసమే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నత విద్యామండలి కమిటీయే తేల్చినా..
రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల స్థితిగతులపై ఉన్నత విద్యామండలి ఇంతకుముందు జేఎన్‌టీయూఏ మాజీ రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ కె.వి.రమణారావు, న్యాయ నిపుణులు సుధేష్ ఆనంద్, ఉన్నత విద్యామండలి డిప్యూటీ డైరెక్టర్ కృష్ణమూర్తితో కూడిన కమిటీతో పరిశీలన చేయించింది. ఈ కమిటీ 3 నెలల క్రితం మండలికి నివేదిక ఇచ్చింది. రాష్ట్రంలో డిమాండ్ కంటే ఎక్కువగా డిగ్రీ కాలేజీలున్నాయని, వీటిలోనే తగినంత చేరికలు లేనప్పుడు కొత్త కాలేజీల అవసరం లేదని కమిటీ స్పష్టం చేసింది.
కుప్పలుతెప్పలుగా కాలేజీలకు అనుమతులు ఇవ్వడం వల్ల ప్రమాణాలు అడుగంటిపోతున్నాయని తెలిపింది. డిగ్రీ కాలేజీల ఏర్పాటు పేరిట అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని, కొన్ని యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి ఫీజులు, స్కాలర్‌షిప్‌లు, ఇతర మొత్తాలను వసూలు చేసుకోవడానికి అనేక అక్రమాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. తాను నియమించిన కమిటీయే ప్రస్తుతమున్న డిగ్రీ కాలేజీలు ఎలా ఉన్నాయో నివేదిక ఇచ్చినా ఉన్నత విద్యామండలి ఆ నివేదికను పక్కన పెట్టేసింది.
కమిటీ పరిశీలనలో తేలిన అంశాలివే..
కమిటీ పరిశీలనలో తేలిన అంశాలు ఏమిటంటే.. రాష్ట్రంలో ఏటా 5.49 లక్షల మంది పదో తరగతి పాసవుతున్నారు. వీరిలో 3.64 లక్షల మంది ఇంటర్మీడియెట్‌లో చేరుతుండగా 2.91 లక్షల మంది ఉత్తీర్ణులవుతున్నారు. అయితే ఇంటర్‌లో ఉత్తీర్ణులయ్యే వారి కంటే ఎక్కువగా డిగ్రీ కాలేజీల్లో సీట్లు ఉన్నాయి. మొత్తం 1422 కాలేజీల్లో 146 ప్రభుత్వ, 124 ప్రైవేటు ఎయిడెడ్ కాలేజీలు కాగా తక్కిన 1152 కాలేజీలు ప్రైవేటువే. ఒక్క ప్రైవేటు కాలేజీల్లోనే 3.29 లక్షల డిగ్రీ సీట్లున్నాయి. కానీ వీటిలో చేరుతున్నవారి సంఖ్య కేవలం 1.29 లక్షలు మాత్రమే. అంటే.. ప్రైవేటు కాలేజీల సీట్లలో సగం కూడా భర్తీ కావడం లేదు.
70 శాతానికి పైగా కాలేజీలకు సొంత భవనాలు, ఇతర సదుపాయాలు, అర్హులైన బోధన సిబ్బంది లేరు. ఈ కాలేజీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. మూడేళ్ల డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధిస్తున్న వారి సంఖ్య ఏటా కేవలం 40 వేల వరకు మాత్రమే ఉంటోంది. ఆయా కాలేజీల్లో ప్రమాణాలు ఎలా ఉంటున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఉన్నత విద్యామండలి కొత్త కాలేజీల ఏర్పాటు ఏయే మండలాల్లో అవసరమో తెలుసుకోవడానికి 2015–16, 2017–18లలో సర్వేలు చేయించింది. ఈ రెండు సర్వేల్లో కూడా కొత్తగా డిగ్రీ కాలేజీలు కావాలని ఎవరి నుంచి వినతులు రాలేదు.
పైగా ఆయా మండలాల్లో అప్పటికే ఉన్న కాలేజీల్లో సీట్లే భర్తీ కావడం లేదని తేలింది. వీటన్నిటితో నిపుణుల కమిటీ నివేదిక రూపొందించి ఉన్నత విద్యామండలికి ఇచ్చింది. కొత్తగా డిగ్రీ కాలేజీలకు అనుమతులు అవసరం లేదని, ఇప్పుడున్న కాలేజీల్లో బోధనా ప్రమాణాల పెంపునకు చర్యలు చేపట్టాలని సూచించింది. అయితే ఈ కమిటీ నివేదికను పక్కన పెట్టిన ఉన్నత విద్యామండలి కొత్త కాలేజీలకు అనుమతులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment