
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో వరుసగా మూడేళ్లపాటు 25 శాతం ప్రవేశాలు లేని కాలేజీలపై చర్యల విషయంలో అనుసరించాల్సిన విధానంపై ఉన్నత విద్యా మండలి తర్జనభర్జన పడుతోంది. 25% ప్రవేశాలను కోర్సుల వారీగానే చూడాలా? కాలేజీల వారీగా చూడాలా? అన్న విషయంలో కొంత ఆలోచనల్లో పడింది. అయితే కాలేజీల వారీగా చూస్తే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆలోచనకు వచ్చింది. దీంతో వరుసగా మూడేళ్లలో 25% లోపే ప్రవేశాలు ఉన్న కోర్సుల్లోనే ఈసారి ప్రవేశాలకు అనుమతించవద్దన్న అభిప్రాయానికి వచ్చింది. అదే విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
మరోవైపు ప్రైవేటు కాలేజీలకు అనుమతి ఇచ్చిన ఉన్నత విద్యామండలి గతంలో ప్రవేశాలు లేవని, ఇప్పుడు కోర్సులకు ఎలా అనుమతి నిరాకరిస్తారన్న విషయంలో కొంత గందరగోళం నెలకొంది. గతంలో 25 శాతంలోపే ప్రవేశాలు ఉన్న కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరంలో కూడా ప్రవేశాలు జరగవని ఎలా ముందుగానే ఊహించి నిర్ణయం తీసుకుంటారన్న వాదనను యాజమాన్యాలు తెరపైకి తెచ్చాయి. దీంతో వర్సిటీలు, ఉన్నత విద్యామండలి ఆలోచనల్లో పడ్డాయి. ప్రవేశాలు పూర్తయ్యాక వాటిల్లో చేరిన విద్యార్థుల తరలింపు అనేది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి వరుసగా మూడేళ్లపాటు 25 శాతంలోపు ప్రవేశాలు ఉన్న కోర్సులకు వర్సిటీల స్థాయిలోనే అనుబంధ గుర్తింపును నిరాకరించాలన్న ఆలోచనలకు వచ్చాయి. ఈనెల 19న జరిగే వైస్ చాన్స్‌లర్ల సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది.
నెలాఖరులోగా అనుబంధ గుర్తింపు
ప్రస్తుతం రాష్ట్రంలో 51 కాలేజీల్లో వరుసగా మూడేళ్లలో ఒక్క విద్యార్థి చేరకపోగా, మరో 200 కాలేజీల్లో 25 శాతంలోపే ప్రవేశాలు ఉన్నాయి. వాటన్నింటిపై త్వరలోనే విధానపర నిర్ణయాన్ని ఉన్నత విద్యామండలి ప్రకటించనుంది. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను ఈనెల 31లోగా పూర్తి చేయాలని యూనివర్సిటీలను ఆదేశించింది. ఈలోగా ఆ ప్రక్రియ పూర్తయితేనే మే 8వ తేదీన డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేయవచ్చని యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment