Sun Pharma
-
రూ.లక్షల కోట్ల వ్యాపారం.. ఈ కోడలివే కీలక బాధ్యతలు
చాలా మంది భారతీయ బిలియనీర్లు తమ వ్యాపారాల్లో కీలక బాధ్యతలను తమ కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు కూడా ఆ బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూ వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. అలాంటి వారిలో కరిష్మా షాంఘ్వి (Karishma Shanghvi) ఒకరు.దేశంలోని అత్యంత సంపన్నమైన ఫార్మా బిలియనీర్ దిలీప్ షాంఘ్వీకి (Dilip Shanghvi) కోడలు కరిష్మా షాంఘ్వి. రూ.4.40 లక్షల కోట్ల సంస్థ అయిన సన్ ఫార్మాకు (Sun Pharma) ఆయన చైర్మన్, ఎండీ. ఫోర్బ్స్ ప్రకారం ఆయన నెట్‌వర్త్ 28.7 బిలియన్ డాలర్లు. సన్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన తన కుమారుడు అలోక్ షాంఘ్వీని కరిష్మా వివాహం చేసుకున్నారు.చురుగ్గా సామాజిక కార్యక్రమాలుసన్ ఫార్మాకు సంబంధించిన కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తూ కరిష్మా షాంఘ్వి మంచి పేరు తెచ్చుకున్నారు. దేశంలోని ప్రముఖ చమురు, గ్యాస్ కంపెనీ దిలీప్ షాంఘ్వీ ప్రమోట్ చేసిన సన్ పెట్రోకెమికల్స్లో డైరెక్టర్‌గా కూడా ఆమె వ్యవహరిస్తన్నారు.ముంబైలో తక్కువ ఖర్చుతో మెరుగైన విద్యను అందించే అంతర్జాతీయ పాఠశాల అయిన శిఖా అకాడమీకి కరిష్మా డైరెక్టర్, వ్యవస్థాపకురాలు. ఇది అల్పాదాయ వర్గాల పిల్లలకు సేవలు అందిస్తోంది. అలాగే విద్య ఆరోగ్య సంరక్షణ రంగాలలో సేవలందిస్తున్న శాంతిలాల్ షాంఘ్వీ ఫౌండేషన్‌తో కూడా ఆమె కలిసి పనిచేస్తున్నారు.ఉన్నత విద్యావంతురాలుఅశోకా యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, బోర్డ్ ఆఫ్ మేనేజ్మెంట్లో కూడా కరిష్మా సభ్యురాలిగా ఉన్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి విద్యలో మాస్టర్స్ డిగ్రీ (Ed.M.) పొందిన ఆమె వార్టన్ స్కూల్ నుండి ఎకనామిక్స్‌లో బీఎస్ చదివారు. అలాగే బయో ఇంజినీరింగ్‌లో బీఏఎస్, బయోటెక్నాలజీలో ఎంస్, సౌత్ ఏషియన్ స్టడీస్‌లో మైనర్ పూర్తి చేశారు. ఇవన్నీ యూఎస్‌లోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి అందుకున్నారు. -
భారత్ ఫార్మా కంపెనీలకు అమెరికా కీలక ఆదేశాలు
భారత్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీలు డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, సన్ ఫార్మా మరియు అరబిందో ఫార్మాకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) కీలక ఆదేశాలు జారీ చేసింది. తయారీ సమస్యల కారణంగా యూఎస్ మార్కెట్లో ఉన్న ఉత్పత్తులను రీకాల్ చేయాలని ఆదేశించింది. న్యూజెర్సీలోని ప్రిన్స్టన్లో ఉన్న డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ జావిగ్టర్ (Javygtor), సాప్రోప్టెరిన్ డైహైడ్రోక్లోరైడ్ను రీకాల్‌కు సిద్ధమైంది. సన్ ఫార్మా సైతం ఫంగల్ ఇన్ఫెక్షన్ల చికిత్సకు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బి లిపోసోమ్ రీకాల్ చేస్తున్నట్లు యూఎస్ఏఫ్డీఏ తెలిపింది.అదే విధంగా, అరబిందో ఫార్మా అమెరికన్ మార్కెట్లో ఆందోళనకు చికిత్స చేయడానికి ఉపయోగించే క్లోరాజెపేట్ డిపోటాషియం టాబ్లెట్లను (3.75 mg, 7.5 mg) రీకాల్ చేస్తోంది. -
టారో.. సన్ ఫార్మా సొంతం
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన టారో ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ పూర్తిగా సన్‌ఫార్మా సొంతం కానుంది. ఇప్పటికే టారో ఫార్మాలో సన్ ఫార్మాకు 78.48% వాటా ఉంది. కంపెనీలో మిగిలిన 21.52% వాటాను కూడా కొనుగోలు చేయనున్నట్టు సన్ ఫార్మా ప్రకటించింది. ఇందుకు రూ.2,891.76 కోట్లు వ్యయం చేయనున్నట్టు తెలిపింది. టారో ఫార్మాలో మిగిలిన షేర్లను ఒక్కోటీ 43 డాలర్ల చొప్పున సొంతం చేసుకునేందుకు అంగీకారం కుదిరినట్టు పేర్కొంది. జనరిక్ డెర్మటాలజీ మార్కెట్లో టారో కీలక సంస్థగా ఉన్నట్టు సన్‌ఫార్మా తెలిపింది. బీఎస్ఈలో సన్‌ఫార్మా షేరు 3 శాతం లాభపడి రూ.1,336 వద్ద ముగిసింది. -
క్షీణించిన సన్ ఫార్మా లాభం
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ రంగ దిగ్గజం సన్ ఫార్మా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం స్వల్పంగా 2 శాతం నీరసించి రూ. 2,022 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 2,061 కోట్లు ఆర్జించింది. అయితే సర్దుబాటు తదుపరి నికర లాభం 14 శాతం పుంజుకుని రూ. 2,345 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 10,764 కోట్ల నుంచి రూ. 12,145 కోట్లకు ఎగసింది. అంచనాలకు అనుగుణంగా అన్ని విభాగాలూ వృద్ధి బాటలో సాగుతున్నట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ పేర్కొన్నారు. యూఎస్ ఫార్ములేషన్ అమ్మకాలు 12 శాతం బలపడి 47.1 కోట్ల డాలర్లను తాకాయి. ఇవి ఆదాయంలో 33 శాతంకాగా.. దేశీ విక్రయాలు మొత్తం ఆదాయంలో 30 శాతం వాటాను ఆక్రమిస్తున్నట్లు దిలీప్ వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు బీఎస్ఈలో 0.4 శాతం లాభంతో రూ. 1,141 వద్ద ముగిసింది -
కంటి సమస్యకు సన్ ఫార్మా ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కన్ను పొడిబారడం వంటి సమస్యలకు పరిష్కారంగా సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ సెక్వా పేరుతో ఔషధాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సలు పరిమితులను కలిగి ఉన్నాయని కంపెనీ తెలిపింది. నానోమిసెల్లార్ టెక్నాలజీతో భారత్‌లో అందుబాటులో ఉన్న మొదటి ఔషధం ఇదేనని సన్ ఫార్మా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తి కంటే భారతదేశంలో ఈ సమస్య ప్రాబల్యం ఎక్కువగా ఉంది. సమస్య ఉత్పన్నమైతే కంట్లో దురద, నలుసు పడ్డట్టు అనిపించడం, ఎరుపెక్కడం, మంట, నొప్పి, ఒత్తిడి, నీరు కారడం వంటి ఇతర లక్షణాలు ఉంటాయి. -
సన్ ఫార్మా లాభం అప్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 11 శాతం ఎగసి రూ. 2,262 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,047 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,626 కోట్ల నుంచి రూ. 10,952 కోట్లకు బలపడింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 7,562 కోట్ల నుంచి రూ. 8,625 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో దేశీ ఫార్ములేషన్ల అమ్మకాలు 8 శాతంపైగా పుంజుకుని రూ. 3,460 కోట్లను తాకాయి. యూఎస్ విక్రయాలు 14 శాతం ఎగసి 41.2 కోట్ల డాలర్ల(రూ. 3,400 కోట్లు)కు చేరాయి. గ్లోబల్ స్పెషాలిటీ అమ్మకాలు మరింత అధికంగా 27 శాతం జంప్‌చేసి 20 కోట్ల డాలర్లను అందుకున్నాయి. వర్ధమాన మార్కెట్ల నుంచి ఫార్ములేషన్ల విక్రయాలు 7 శాతం బలపడి 25.9 కోట్ల డాలర్లను(రూ. 2,140 కోట్లు) తాకాయి. అయితే ఇతర దేశాల నుంచి ఆదాయం 4 శాతం క్షీణించి 18.1 కోట్ల డాలర్లకు పరిమితమైనట్లు సన్ ఫార్మా వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు ఎన్ఎస్ఈలో 1.6 శాతం లాభంతో రూ. 1,033 వద్ద ముగిసింది. చదవండి: ఎయిర్టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే! -
అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా ఉత్పత్తుల రీకాల్
న్యూఢిల్లీ: పలు కారణాలతో అమెరికా మార్కెట్ నుంచి సన్ ఫార్మా, అరబిందో ఫార్మా, జూబిలెంట్ సంస్థలు వివిధ ఉత్పత్తులను రీకాల్ చేస్తున్నట్లు అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్ఎఫ్డీఏ ఒక నివేదికలో పేర్కొంది. విటమిన్ బీ12 లోపం చికిత్సలో ఉపయోగించే సైనాకోబాలమిన్ ఇంజెక్షన్‌కు సంబంధించి 4.33 లక్షల వయాల్స్‌ను అరబిందో ఫార్మా రీకాల్ చేస్తోంది. ఏప్రిల్ 5న ఈ ప్రక్రియ ప్రారంభించింది. మరోవైపు, కళ్లలో సహజసిద్ధంగా నీటి ఉత్పత్తిని చేసేందుకు తోడ్పడే ’సెక్వా’ ఔషధాన్ని సన్ ఫార్మా వెనక్కి రప్పిస్తోంది. ఏప్రిల్ 1న ఈ ప్రక్రియ ప్రారంభించింది. అటు జూబిలెంట్ క్యాడిస్టా ఫార్మా .. మిథైల్ప్రెడ్నిసొలోన్ ట్యాబ్లెట్లకు సంబంధించి 19,222 బాటిల్స్‌ను రీకాల్ చేస్తోంది. -
సీఎం జగన్‌తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి భేటీ
సాక్షి, అమరావతి: ఫార్మాస్యూటికల్స్ రంగంలో పెద్ద కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా రాష్ట్రంలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పడానికి ఆసక్తిగా ఉంది. దీనిలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని క్యాంపు కార్యాయంలో కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వీ కలిశారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. పారిశ్రామిక ప్రగతికోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. అవకాశాలను వినియోగించుకోవాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. సమగ్రాభివృద్ధి ధ్యేయంగా తీసుకుంటున్న చర్యలనూ ముఖ్యమంత్రి వివరించారు. దీనిపై దిలీప్ సంఘ్వీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. ప్లాంట్ ఏర్పాటు ప్రకటన రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పర్యావరణ హిత విధానాలపై సీఎం ఆలోచనలు తనను ముగ్దుడ్ని చేశాయని సన్‌ఫార్మా అధినేత సంఘ్వీ పేర్కొన్నారు. -
కోవిడ్-19 విపత్తు వేళ ఉద్యోగులకు అండగా కంపెనీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్-19 విపత్తు వేళ ఉద్యోగులు, వారి కుటుంబాలకు కంపెనీలు అండగా నిలుస్తున్నాయి. వైరస్ బారినపడ్డ సిబ్బందికి టెలి హెల్త్‌కేర్, వ్యాక్సినేషన్, వైద్యానికయ్యే ఖర్చుల చెల్లింపు, వేతనంతో కూడిన సెలవులు ఇవ్వడంతోపాటు కోవిడ్–19 కేర్ సెంటర్లను ఏర్పాటు చేసిన సంస్థలు ఒక అడుగు ముందుకేశాయి. కోవిడ్–19తో ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబానికి మేమున్నామంటూ పెద్ద మనసుతో ముందుకొస్తున్నాయి. ఆర్థిక సాయం, వేతనం చెల్లించడంతోపాటు కుటుంబ సభ్యులకు కొన్నేళ్లపాటు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తున్నాయి. ఆధారపడ్డ పిల్లల చదువు పూర్తి అయ్యే వరకు ఆ బాధ్యతను భుజాన వేసుకుంటున్నాయి. మరణించిన ఉద్యోగి కుటుంబ సభ్యులకు ఉద్యోగం, ఉపాధి కల్పించేందుకు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. కంపెనీలు ఎలాంటి సాయం చేస్తున్నాయంటే.. టాటా స్టీల్: బాధిత కుటుంబం/నామినీకి 60 ఏళ్ల వయసు వచ్చే వరకు వేతనం, వైద్యం, హౌజింగ్ సౌకర్యం. పిల్లల గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు సాయం. సన్ ఫార్మా: రెండేళ్ల వేతనం, పిల్లల గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు ఆర్థిక తోడ్పాటు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్: ఉద్యోగులకు రూ.30 లక్షల బీమా. ఉద్యోగి మరణిస్తే బీమా మొత్తాన్ని కుటుంబానికి చెల్లింపు. ఒక ఏడాదికి సమానమైన వేతనం. అమెజాన్: వైరస్ బారినపడ్డ ఫ్రంట్‌లైన్ బృంద సభ్యుడు హోం క్వారంటైన్లో ఉంటే రూ.30,600ల గ్రాంట్. బీమా కవరేజ్ మించి ఆసుపత్రి బిల్లు అయితే అదనంగా రూ.1.9 లక్షల వరకు రీఇంబర్స్. బజాజ్ ఆటో: మరణించిన ఉద్యోగి కుటుంబానికి రెండేళ్ల వరకు ఆర్థిక మద్దతు. పిల్లల గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యే వరకు సాయం. కుటుంబ సభ్యులందరికీ అయిదేళ్లపాటు ఆరోగ్య బీమా. టెక్ మహీంద్రా: కోవిడ్ సపోర్ట్ పాలసీ కింద అదనపు ప్రయోజనాలు. అర్హులైన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు. నైపుణ్య శిక్షణ. 12వ తరగతి వరకు పిల్లల చదువుకు అయ్యే ఖర్చును తిరిగి చెల్లిస్తారు. బజాజ్ అలియాంజ్: బీమాకు అదనంగా రూ.1 కోటి వరకు ఆర్థిక సాయం. గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు ఇద్దరు పిల్లలకు ఏటా రూ.2 లక్షల వరకు చెల్లింపు. అయిదేళ్ల వరకు ఆరోగ్య బీమా. సీమెన్స్: రూ.25 లక్షల ఆర్థిక సాయం. ఒక ఏడాది వేతనం. ఆరోగ్య బీమా, పిల్లల చదువుకు తోడ్పాటు. మహీంద్రా అండ్ మహీంద్రా: అయిదేళ్లపాటు వేతనం. రెండింతల వార్షిక పరిహారం. 12వ తరగతి వరకు ఇద్దరు పిల్లలకు ఏటా చెరి రూ.2 లక్షల వరకు చెల్లింపు. టీవీఎస్ మోటార్: గరిష్టంగా మూడింతల వార్షిక స్థూల వేతనం చెల్లింపు. ఫ్యామిలీ వెల్ఫేర్ ఫండ్ అదనం. మూడేళ్లపాటు ఆరోగ్య బీమా. ఇద్దరు పిల్లలకు అండర్ గ్రాడ్యుయేషన్ వరకు విద్య. ఓయో: ఎనమిది నెలల వేతనం, మూడేళ్ల వార్షిక వేతనానికి సమానమైన టెర్మ్ ఇన్సూరెన్స్. అయిదేళ్లపాటు పిల్లల చదువు. అయిదేళ్లపాటు రూ.3 లక్షల వరకు ఆరోగ్య బీమా. బోరోసిల్: రెండేళ్లపాటు వేతనం, పిల్లల చదువుకు తోడ్పాటు. ముతూట్ ఫైనాన్స్: మూడేళ్లకుపైగా పనిచేసిన ఉద్యోగి మరణిస్తే ఆ కుటుంబానికి రెండేళ్ల వేతనం చెల్లిస్తారు. మూడేళ్లలోపు ఉంటే ఒప్పంద ఉద్యోగులకూ ఒక ఏడాది వేతనం ఇస్తారు. అదనంగా వన్ టైం చెల్లింపు సైతం ఉంది. సొనాలికా: డీలర్లు, వారి ఉద్యోగుల కోవిడ్–19 చికిత్స కోసం రూ.25,000 వరకు వైద్య ఖర్చులు. ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.50 వేల వార్షిక వైద్య, విద్య ఖర్చులకు ఇది అదనం. మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ.2 లక్షల సాయం. చదవండి: అలర్ట్: జూన్ 30లోగా ఎఫ్డీ దారులు ఈ ఫామ్‌లు నింపాల్సిందే -
సన్ ఫార్మా స్పీడ్- హెచ్‌సీసీ బోర్లా
కోవిడ్-19 నేపథ్యంలో దేశీయంగా ఫార్మా కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. మార్చి కనిష్టాల నుంచి మార్కెట్లు రికవరీ బాట పట్టాక హెల్త్‌కేర్ రంగ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ బాటలో ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కౌంటర్ మరోసారి వెలుగులో నిలుస్తోంది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికం నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో నిర్మాణ రంగ కంపెనీ హిందుస్తాన్ కన్స్ట్రక్షన్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి సన్ ఫార్మా లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్‌సీసీ నష్టాలతో డీలాపడింది. వివరాలు చూద్దాం.. సన్ ఫార్మాస్యూటికల్ ఈ ఏడాది మార్చి మూడో వారంలో రూ. 315 వద్ద కనిష్టాన్ని తాకిన హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మా షేరు తదుపరి లాభపడుతూ వస్తోంది. ఈ బాటలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో సన్ ఫార్మా షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 560 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 564 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది! వెరసి గత ఐదు నెలల్లో 76 శాతం దూసుకెళ్లింది. వన్‌టైమ్ చార్జీల కారణంగా ఈ ఏడాది క్యూ1లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన భారీ నష్టం ప్రకటించినప్పటికీ.. మార్జిన్లు మెరుగుపరచుకోవడం, స్పెషాలిటీ ప్రొడక్టుల విక్రయాలను నిలుపుకోవడం వంటి సానుకూల అంశాలు ఈ కౌంటర్‌కు బలాన్నిస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. హెచ్‌సీసీ లిమిటెడ్ కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్- జూన్)లో హెచ్‌సీసీ రూ. 406 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(201920) క్యూ1లో రూ. 100 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2815 కోట్ల నుంచి రూ. 1690 కోట్లకు క్షీణించింది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో హెచ్‌సీసీ షేరు 6 శాతం పతనమై రూ. 6.30 వద్ద ట్రేడవుతోంది. మిడ్ సెషన్‌కల్లా ఈ కౌంటర్లో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో కలిపి 2.5 కోట్ల షేర్లు చేతులు మారడం గమనార్హం! -
స్వల్పకాలంలో రెట్టింపు లాభాల్ని ఇచ్చే 3 షేర్లు ఇవే..!
రిస్క్ రివార్డును ఎదుర్కోనగలిగే ఇన్వెస్టర్లకు అటో, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకుల షేర్లను సిఫార్సు చేస్తామని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ విశ్లేషకుడు విజయ్ జైన్ తెలిపారు. ఈ రంగాలకు చెందిన షేర్లు మాత్రమే స్టాక్ మార్కెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. నిఫ్టీ ఇండెక్స్‌లో మెటల్ షేర్లు వాటి కాంజెస్టింగ్ జోన్ నుండి మీడియం-టర్మ్ సగటులను బ్రేక్ అవుట్ చేస్తున్నాయని ఆయన్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్వల్పకాలానికి రెట్టింపు లాభాల్ని ఇచ్చే 3స్టాకులను సిఫార్సు చేస్తున్నారు. 1. షేరు పేరు: ఎన్ఎండీసీ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.86 స్టాప్ లాస్: రూ.68 అప్ సైడ్: 15.60శాతం విశ్లేషణ: డైలీ, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో సుధీర్ఘ కన్సాలిడేషన్ తరువాత బలమైన వ్యాల్యూమ్స్‌తో షేరు బ్రేక్అవుట్ చూసింది. ఈ మెటల్ సెక్టార్లో ఇటీవల పాజిటివ్ మూమెంటమ్ నెలకొంది. రిలిటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (ఆర్ఎస్ఐ) దాని యావరేజ్ లైన్ నుంచి అప్‌వర్డ్ క్రాస్ చేస్తోంది. ఈ సంకేతాలు రానున్న రోజుల్లో షేరు భారీ ర్యాలీని సూచిసున్నాయి. 2. షేరు షేరు: సన్ ఫార్మా రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.535 స్టాప్ లాస్: రూ.425 అప్ సైడ్: 14.6శాతం విశ్లేషణ: గత నెలలో రూ.505 గరిష్టాల నుండి దిద్దుబాటు తర్వాత ధర, సమయం వారీగా షేరు కరెక్షన్ను పూర్తి చేసిందని మేము(రిలయన్స్ సెక్యూరిటీస్) నమ్ముతున్నాము. రాబోయే కొద్ది వారాల్లో ప్రస్తుత స్థాయిల నుండి మెరుగ్గా రాణించేందుకు అవకాశం ఉంది. 3. షేరు పేరు: వోల్టాస్ రేటింగ్: బై టార్గెట్ ధర: రూ.520 స్టాప్ లాస్: రూ.425 అప్ సైడ్: 13శాతం విశ్లేషణ: ఈ స్టాక్ బలమైన వాల్యూమ్‌లతో సబ్ రూ .430 వద్ద డబుల్ బాటమ్‌ను ఏర్పాటు చేసింది. ఆర్ఎస్ఐ ఇండెక్స్ యావరేజ్ బాండ్... సగటు బాండ్‌ను దాటి పైకి వెళ్లింది. ప్రస్తుత స్థాయిల నుంచి షేరు రాణిస్తుందని నమ్ముతున్నాము. రోజువారీ చార్టులలో డబుల్-బాటమ్ సపోర్ట్ ఓవర్‌సోల్డ్ స్టేటస్ రానున్న రోజుల్లో పదునైన అప్ మూమెంటమ్‌ను సూచిస్తున్నాయి. -
సన్‌ఫార్మా : అంచనాలు మిస్
సాక్షి, ముంబై: ఫార్మా దిగ్గజం సన్ ఫార్యాస్యూటికల్స్ నిరాశాజనక క్యూ3 ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) డిసెంబర్ క్వార్టర్లో నికరలాభం 26 శాతం తగ్గి 913.52 కోట్ల డాలర్లకు చేరుకుంది. గత క్యూ3లో రూ.1,242 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.914 కోట్లకు తగ్గిందని సన్ ఫార్మా తెలిపింది. వ్యయాలు రూ.6,203 కోట్ల నుంచి రూ.6,923 కోట్లకు పెరగడం వల్ల నికర లాభం తగ్గిందని సన్ ఫార్మా ఎండీ దిలిప్ సంఘ్వి తెలిపారు. కార్యకలాపాల ఆదాయం రూ.7,657 కోట్ల నుంచి రూ.8,039 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. రూ. 1 ముఖ విలువ గల ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. భారత్‌లో బ్రాండెడ్ వ్యాపారం బాగా ఉందని, క్యూ 3 తో పాటు తొమ్మిది నెలల కాలానికి రెండంకెల వృద్ధిని సాధించిందని సంఘ్వి తెలిపారు. ఆంకాలజీ ఉత్పత్తులకు చైనాలోని ఆస్ట్రాజెనెకాతో లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా కొత్త మార్కెట్లలో తమ పోర్ట్‌ఫోలియోను పెంచుకోనున్నామన్నారు. ఏఐఓసీడీ అవాక్స్ డిసెంబర్, 2019 నివేదిక ప్రకారం భారత ఫార్మా మార్కెట్లో అగ్రస్థానం తమ కంపెనీదేనని, రూ1.4 లక్షల కోట్ల మార్కెట్లో 8.2 శాతం మార్కెట్ వాటా తమ చేతిలోనే ఉందని పేర్కొన్నారు. -
ఆల్‌టైమ్ హైకి సెన్సెక్స్
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి సంబంధించిన ప్రతిపాదన విషయమై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలతో కొనుగోళ్లు జోరుగా సాగాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉన్నా, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి ఇండెక్స్‌లో వెయిటేజీ అధికంగా షేర్ల జోరుతో స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసలు పతనమై 71.86కు చేరినప్పటికీ, మన మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, 40,816 పాయింట్లను తాకిన సెన్సెక్స్ చివరకు 182 పాయింట్ల లాభంతో 40,652 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది జీవిత కాల గరిష్ట స్థాయి ముగింపునకు 2 పాయింట్లు తక్కువ. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్‌కు ఒక పాయింట్ తక్కువగా 11,999 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 99 పాయింట్లు లాభపడిన నిఫ్టీ, చివరకు 59 పాయింట్ల లాభంతో సరిపెట్టుకుంది. రోజంతా లాభాలే..:లాభాల్లో ఆరంభమైన సెన్సెక్స్ రోజంతా అదే జోరు చూపించింది. ఇంట్రాడేలో 346 పాయింట్ల లాభంతో ఆల్‌టైమ్ హై, 40,816 పాయింట్లను తాకింది. సెన్సెక్స్ ఆల్‌టైమ్ హైకు చేరడం, నిఫ్టీ ఇంట్రాడేలో 12,000 పాయింట్ల ఎగువకు ఎగబాకడంతో పై స్థాయిల్లో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో మధ్యాహ్న లాభాలు తగ్గాయి. ఇంధన, ఫార్మా, ఆయిల్, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు లాభపడగా,రియల్టీ, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లు నష్టపోయాయి. కొనసాగిన ‘రిలయన్స్’ రికార్డ్‌లు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ రికార్డ్ల మీద రికార్డ్‌లు సృష్టిస్తోంది. షేర్ ఆల్‌టైమ్ హై, మార్కెట్ క్యాప్ రికార్డ్‌లు బుధవారం కూడా కొనసాగాయి. ఇంట్రాడేలో 4.1 శాతం లాభంతో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.1,572ను తాకిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చివరకు 2.4 శాతం లాభంతో రూ.1,547 వద్ద ముగిసింది. ఈ కంపెనీ టెలికం విభాగం రిలయన్స్ జియో టారిఫ్‌లను పెంచనున్నట్లు ప్రకటించడంతో ఈ షేర్ జోరుగా పెరిగింది. ఇక ఈ కంపెనీ మార్కెట్ క్యాప్(ఈ కంపెనీ మొత్తం షేర్లను ప్రస్తుత ధర వద్ద గుణిస్తే వచ్చే మొత్తం) రూ.10 లక్షల కోట్ల మార్క్‌కు చేరువయింది. మార్కెట్ ముగిసేనాటికి రూ.9,80,700 కోట్ల మార్కెట్ క్యాప్‌తో అత్యధిక మార్కెట్ క్యాప్ గల భారత కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.9,96,415 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఈ షేర్ 37 శాతం లాభపడింది. కంపెనీ మార్కెట్ క్యాప్ (13,600 కోట్ల డాలర్లు) బ్రిటిష్ ఇంధన దిగ్గజం, బీపీపీఎల్సీని దాటేసింది. న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌కు ముందు బీపీపీఎల్‌సీ మార్కెట్ క్యాప్ 13,000 కోట్ల డాలర్ల రేంజ్లో ఉంది. -
క్యూ2 లో సన్ ఫార్మాకు భారీ లాభాలు
సాక్షి, ముంబై : హెల్త్‌కేర్ దిగ్గజం సన్‌ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 1065 కోట్ల లాభం ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 270 కోట్ల నష్టం ప్రకటించింది. ఆసమయంలో కంపెనీ వన్‌టైమ్ నష్టం రూ. 1214 కోట్లను భరించాల్సివచ్చింది. తాజా సమీక్షా కాలంలో కంపనీ రెవెన్యూ 17.1 శాతం పెరిగి రూ. 8123 కోట్లను చేరింది. దేశీయ, అంతర్జాతీయ విక్రయాలు పెరగడం కంపెనీ రెవెన్యూ పెరుగుదలకు దోహదం చేసింది. క్యు2లో కంపెనీ ఎబిటా 17 శాతం దూసుకుపోయి రూ. 1790 కోట్లను చేరింది, కానీ మార్జిన్ మాత్రం ఫ్లాట్‌గా 22 శాతం వద్దే నమోదయింది. సమీక్షా కాలంలో కంపెనీ ఇతర ఆదాయాలు దాదాపు 43 శాతం పడిపోయి రూ. 201 కోట్లకు చేరాయి. దేశీయ మార్కెట్లో సన్ ఫార్మా నంబర్ 1 స్థానంలో ఉందని, ఫార్మా మార్కెట్ పరిశోధనా సంస్థ జూన్ -2019 నివేదిక ప్రకారం132,000 కోట్ల రూపాయలతో సుమారు 8.2 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంద సంస్థ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. క్యూ 2 ఆదాయాలపై సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సాంఘ్వి మాట్లాడుతూ, క్యూ 2, పనితీరు నిరంతర వృద్ధి వేగాన్ని ప్రదర్శిస్తోందనీ, ఈ ఏడాది గైడెన్స్‌కు అనుగునంగా ఉందని పేర్కొన్నారు. ప్రధానంగా దేశీయ విక్రయాలు 35 శాతం పెరిగి రూ. 2515 కోట్లను తాకగా, ఇతర మార్కెట్లలో విక్రయాలు 49 శాతం పెరిగి 16.1 కోట్ల డాలర్లను చేరాయి.ఇతర మార్కెట్లలో ముఖ్యంగా వర్ధమాన మార్కెట్లలో విక్రయాలు మంచి మెరుగుదల చూపాయి, ఇదే సమయంలో యూఎస్ విక్రయాలు మాత్రం యథాతధంగా కొనసాగాయి. ఈ త్రైమాసికంలో యుఎస్ అమ్మకాలు 424 మిలియన్ డాలర్లు, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఫ్లాట్ . అయితే మొత్తం ఏకీకృత అమ్మకాలలో 30 శాతం వాటా ఉంది. మొదటి సగం అమ్మకాలు 763 మిలియన్ డాలర్లు, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 6 శాతం వృద్ధిని నమోదు చేసింది.ఈ గురువారం ముగింపులో షేరు దాదాపు మూడున్నర శాతం లాభపడి442.50 రూపాయల వద్ద ముగిసింది. -
రెండు యూనిట్లు మూత: సైంటిస్టులపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : వరుస నష్టాలు లేదా ఖర్చులు తగ్గించుకునే క్రమంలో కార్పొరేట్ దిగ్గజాలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఇప్పటికే మారుతి సుజుకి తాత్కాలిక ఉద్యోగులను తొలగించగా, ఫార్మ దిగ్గజం సన్‌ఫార్మ కూడా బాటలో ఇదే పయనిస్తోంది. రెండు యూనిట్లను మూసి వేయడంతో ఇక్కడ పనిచేస్తున్న సైంటిస్టులను పెద్ద సంఖ్యలో తొలగించింది. క్లినికల్ ఫార్మకాలజీ విభాగంలో పనిచేస్తున్న 85 మందికి ఉద్వాసన పలికింది. వడోదర ఆర్ అండ్ డి యూనిట్లలో పనిచేస్తున్న వీరిని ముందస్తు సమాచారం లేకుండానే వేటు వేసింది. ఇది ఉద్యోగుల్లో ఆందోళనకు దారి తీసింది. వడోదరలోని తాండల్జా, అకోటాలోని తమ రెండు కేంద్రాల్లో సేవలను నిలిపివేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వాటిని బయో-ఈక్వెలెన్స్ స్టడీస్‌కు ఉపయోగించినట్టు చెప్పింది. అయితే, ఈ యూనిట్లలో తమ కార్యకలాపాలను నిలిపివేసి, ఇతర సౌకర్యాలకు మార్చామని సన్ ఫార్మాస్యూటికల్స్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఆర్ అండ్ డి కార్యకలాపాలలో పెట్టుబడులు కొనసాగిస్తామని పేర్కొంది. బయో-ఈక్వెలెన్స్ స్టడీస్ నిర్వహించే క్లినికల్ ఫార్మకాలజీ యూనిట్ల (సీపీయూ) సరైన వినియోగాన్ని నిర్ధారించడానికి వడోదరలోని తాండల్జా, అకోటాలోని రెండు కేంద్రాలలో కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని సన్‌ఫార్మ ప్రతినిధి చెప్పారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల జీతం ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పింది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన నేపథ్యంలో ఉద్యోగులను నియంత్రించేందుకు బౌన్సర్లను వినియోగించారన్న వార్తలు సోషల్ మీడియాలోగుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలను సన్‌ఫార్మ ఖండించింది. బాధిత ఉద్యోగులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు తెలిపింది. అవుట్‌ప్లేస్‌మెంట్ కోసం సహాయం చేస్తున్నామని ప్రకటించింది. నిబంధనలకనుగుణంగానే వ్యవహరిస్తున్నామనీ రెగ్యులేటరీ అధికారులకు పూర్తి సమాచారాన్ని అందిస్తున్నామనికూడా కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. -
భళా సన్‌ఫార్మా : లాభాలు 4శాతం అప్
సాక్షి, ముంబై: దేశీయ ఫార్మా దిగ్గజం త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఈ ఏడాది క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో సన్ ఫార్మా నికర లాభం నాలుగు రెట్లు ఎగసి రూ. 1242 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం పెరిగి రూ. 7933 కోట్లను అధిగమించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 48 శాతం జంప్‌చేసి రూ. 2,153 కోట్లను తాకింది. మార్జిన్లు 21.8 శాతం నుంచి 27.8 శాతానికి బలపడ్డాయి. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ షాక్‌తో ఇటీవల భారీగా నష్టపోయిన సన్ ఫార్మా షేరు ఫలితాల నేపథ్యంలో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 2.2 శాతానికిపైగా లాభపడింది. మరోవైపు బ్రోకరేజ్ సంస్థలు సన్‌ఫార్మా షేరుకు బై కాల్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. -
కుట్ర జరుగుతోంది.. జోక్యం చేసుకోండి
న్యూఢిల్లీ: కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు తమ కంపెనీకి, కంపెనీ వాటాదారులకు నష్టం కలిగించే, విద్వేషపూరిత విధానాలకు పాల్పడుతున్నారంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్స్ ఫిర్యాదు చేసింది. ఈ విషయమై జోక్యం చేసుకోవాలని సెబీని చైర్మన్ అజయ్ త్యాగిని కోరుతూ సన్ ఫార్మా ఒక లేఖ రాసింది. నిరాధారమైన ఫిర్యాదులు, ఆరోపణల కారణంగా వాటాదారుల విలువ భారీగా హరించుకుపోయిందని ఈ లేఖలో కంపెనీ పేర్కొంది. ఈ కుట్రలో కొన్ని మీడియా సంస్థల, వ్యక్తుల పాత్ర ఉందని ఈ విషయమై పూర్తిగా విచారణ జరపాలని కోరింది. సన్ ఫార్మాకు వ్యతిరేకంగా సెబీకి రెండో ప్రజావేగు ఫిర్యాదు అందిందన్న వార్తల నేపథ్యంలో సన్ ఫార్మా షేర్ భారీగా నష్టపోయింది. కంపెనీకి వ్యతిరేకంగా సెబీకి అందిన రెండో ఫిర్యాదు ఇది. తాజా వార్తలతో శుక్రవారం ఈ కంపెనీ షేర్ 8% క్షీణించి రూ.390 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8,735 కోట్లు ఆవిరైంది. -
సన్ ఫార్మా చేతికి జపాన్ పోలా ఫార్మా
న్యూఢిల్లీ: భారత ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా... జపాన్‌కు చెందిన పోలా ఫార్మా కంపెనీని కొనుగోలు చేయనుంది. పోలా ఫార్మాను 10 లక్షల డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు సన్ ఫార్మా వెల్లడించింది. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.7 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా చర్మ సంబంధిత ఔషధాల సెగ్మెంట్లో తమ స్థానాన్ని మరింతగా పటిష్టం చేసుకోవడం లక్ష్యంగా పోలా ఫార్మాను టేకోవర్ చేస్తున్నామని సన్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ వైస్–ప్రెసిడెంట్ కీర్తి గనోర్కార్ తెలిపారు. దీని కోసం పోలా ఫార్మాతో ఒక నిశ్చయాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నామన్నారు. ఈ కంపెనీ టేకోవర్ వచ్చే ఏడాది జనవరి 31 కల్లా పూర్తవుతుందన్నారు. పోలా ఫార్మా స్థానిక నైపుణ్యం, సన్ ఫార్మా అంతర్జాతీయ పటిష్టతలు కలగలసి జపాన్‌లో మరింత వృద్ధిని సాధిస్తామని సన్ ఫార్మా జపాన్ హెడ్ జునిచి నకమిచి వ్యాఖ్యానించారు. పోలా ఫార్మా ఆదాయం 11 కోట్ల డాలర్లు.... పోలా ఫార్మా కంపెనీ జపాన్‌లో జనరిక్, బ్రాండెడ్ ఔషధాలకు సంబంధించి పరిశోధన, తయారీ, విక్రయం, మార్కెటింగ్ కార్యకలాపాలను సాగిస్తోంది. ప్రధానంగా చర్మ సంబంధిత ఔషధాలను ఈ కంపెనీ తయారు చేస్తోంది. ఈ కంపెనీకి జపాన్‌లో రెండు ప్లాంట్లున్నాయి. గత ఏడాదిలో ఈ కంపెనీ 11 కోట్ల డాలర్ల ఆదాయాన్ని, 70 లక్షల డాలర్ల నికర నష్టాన్ని చవిచూసింది. సన్ ఫార్మా కంపెనీ జపాన్ ఫార్మా మార్కెట్లోకి 2016లో ప్రవేశించింది. నొవార్టిస్‌కు చెందిన 14 ప్రిస్క్రిప్షన్ బ్రాండ్ల కొనుగోళ్ల ద్వారా సన్ ఫార్మా జపాన్ మార్కెట్లోకి అడుగిడింది. జపాన్ ఫార్మా మార్కెట్ 8,480 కోట్ల డాలర్ల రేంజ్లో ఉంటుందని అంచనా. 1.13 లక్ష కోట్ల డాలర్ల ప్రపంచ ఫార్మా మార్కెట్లో జపాన్ ఫార్మా మార్కెట్ వాటా 7.5 శాతంగా ఉంది. పోలా ఫార్మా టేకోవర్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ 3 శాతం వరకూ నష్టపోయి రూ.511 వద్ద ముగిసింది. -
సన్‌ఫార్మాకు రూ.219 కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు ఊహించని విధంగా ఫార్మా దిగ్గజం సన్‌ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.219 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాలను ప్రకటించింది. అమెరికాలో మోడఫినిల్ యాంటీ ట్రస్ట్ కేసు పరిష్కారం కోసం రూ.1,214 కోట్లను కేటాయించడంతో లాభా లు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ కేసులో ప్రత్యర్థి పార్టీలకు చెల్లించాల్సిన మొత్తాన్ని అంచనా వేసి ఈ మేరకు పక్కన పెట్టినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ కేసులో కొన్ని పార్టీలతో ఇప్పటికే సన్‌ఫార్మా ఒప్పందం కూడా చేసుకుంది. విశ్లేషకులు మాత్రం రూ.975 కోట్ల లాభాన్ని నమోదు చేయవచ్చన్న అంచనాతో ఉన్నారు. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం రూ.912 కోట్లు. కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.6,590 కోట్ల నుంచి రూ.6,846 కోట్లకు వృద్ధి చెందింది. ‘‘కంపెనీ వ్యాపార వాస్తవ ఆరోగ్య స్థితికి రెండో త్రైమాసికం ఫలితాలు నిదర్శనం కావు. మా ప్రధాన వ్యాపార కార్యకలాపాలను బలోపేతం చేయడంపై దృష్టి కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో పనితీరు పట్ల సానుకూలంగానే ఉన్నాం. అమెరికాలో లుమ్యాను విడుదల చేయడం పట్ల సంతోషంగా ఉన్నాం’’ అని సన్‌ఫార్మా ఎండీ దిలీప్‌సంఘ్వి పేర్కొన్నారు. దేశీయ అమ్మకాలు డౌన్ దేశీయంగా బ్రాండెడ్ ఫార్ములేషన్ల అమ్మకాల ద్వారా ఆదాయం 16 శాతం తగ్గి రూ.1,860 కోట్లుగా ఉంది. వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు రూ.1,416 కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏ మాత్రం మార్పు లేదు. అమెరికా మార్కెట్లో అమ్మకాల ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.2,484 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం అమ్మకాల్లో అమెరికా వాటా 35 శాతంగా ఉండటం గమనార్హం. అమెరికా, వర్ధమాన మార్కెట్లు మినహా మిగిలిన ప్రపంచ మార్కెట్లలో ఫార్ములేషన్ల అమ్మకాల ఆదాయం 2 శాతం వృద్ధి చెంది రూ.784 కోట్లుగా నమోదైంది. పరిశోధన, అభివృద్ధి వ్యయాలు రూ.452 కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.511 కోట్ల కంటే తగ్గాయి. బీఎస్ఈలో మంగళవారం సన్‌ఫార్మా షేరు 5 శాతం నష్టపోయి రూ.561.70కు పడిపోయింది. -
స్టాక్స్ వ్యూ
సన్ ఫార్మా - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.630 టార్గెట్ ధర: రూ.670 ఎందుకంటే: భారత్‌లో టర్నోవర్, మార్కెట్ క్యాప్ పరంగా అతి పెద్ద ఫార్మా కంపెనీ ఇదే. భారత్‌తో పాటు అమెరికా, ఇతర దేశాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 50 ప్లాంట్లు ఉన్నాయి. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 16% వృద్ధితో రూ.7,224 కోట్లకు పెరిగింది. భారత ఫార్ములేషన్ వ్యాపారం 22 శాతం వృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణం.అమెరికా వ్యాపారం 12 శాతం పెరగ్గా, టారో విభాగం అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నిర్వహణ ఆదాయం 47%వృద్ధితో రూ.1,607 కోట్లకు పెరిగింది. ఇతర వ్యయాలు తక్కువగా ఉండటంతో ఎబిటా మార్జిన్లు 5% పెరిగి 22%కి పెరిగాయి. ఇతర ఆదాయం అధికంగా ఉండటం, నిర్వహణ పనితీరు పటిష్టంగా ఉండటంతో నికర లాభం 88% వృద్ధితో రూ.988 కోట్లకు పెరిగింది. అమెరికా జనరిక్స్ వ్యాపారంలో సమస్యలున్నప్పటికీ, స్పెషాల్టీ డైవర్సిఫికేషన్ మంచి ఫలితాలనిస్తోంది. జనరిక్స్ వ్యాపారంలో ధరల ఒత్తిడి కారణంగా స్పెషాల్టీ ఔషధాలపై ఈ కంపెనీ దృష్టిసారిస్తోంది. భవిష్యత్తు వృద్ధికి కీలకమయ్యే అంశాల్లో ఇది కూడా ఒకటి కానున్నది. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి 153 ఔషధాలకు ఆమోదం పొందాల్సి ఉంది. అమెరికా వ్యాపారం రెండేళ్లలో 15% చక్రగతి వృద్ధితో రూ.1,11,631 కోట్లకు పెరుగుతుందని అంచనా. దేశీయ ఫార్ములేషన్స్ రంగంలో అగ్రస్థానం ఈ కంపెనీదే. రెండేళ్లలో ఈ వ్యాపారం 15% చక్రగతి వృద్ధి తో రూ.10,586 కోట్లకు చేరుతుందని భావిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధి సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది. లాభాల మార్జిన్లు సగటు కంటే అధికంగా ఉండటం, రాబడి నిష్పత్తులు ఆరోగ్యకరంగా ఉండటం, అమెరికా జనరిక్స్, బయోసిమిలర్స్ వ్యాపారాల్లో అపార అవకాశాలు, హలోల్ ప్లాంట్ సమస్య తీరిపోవడం.. సానుకూలాంశాలు. కఠినతరం అవుతున్న అమెరికా ఎఫ్‌డీఏ నిబంధనలు, ధరల ఒత్తిడి కొనసాగుతుండటం... ప్రతికూలాంశాలు. బంధన్ బ్యాంక్ - కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ.674 టార్గెట్ ధర: రూ.825 ఎందుకంటే: పశ్చిమ బెంగాల్లో 2001లో సూక్ష్మ రుణ సంస్థగా కార్యకలాపాలు ప్రారంభించింది. 2014లో ఆర్బీఐ నుంచి షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్ లైసెన్స్‌ను పొందింది. పెద్ద నోట్ల రద్దు, ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మ రుణ సంక్షోభం వంటి సమస్యలున్నప్పటికీ, గత ఐదేళ్లలో రుణాలు 51% చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. నిర్వహణ వ్యయాలపై నియంత్రణ, నిలకడైన రుణ నాణ్యత కారణంగా రాబడి నిష్పత్తులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి. ఈ బ్యాంక్ సాధారణ రుణాలను కూడా ఇవ్వడం మొదలు పెట్టింది. అయినప్పటికీ, నికర వడ్డీ మార్జిన్ 9% రేంజ్‌లోనే ఉండగలదని అంచనా వేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో స్థూల మొండి బకాయిలు 0.51 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో ఇవి 1.2%రేంజ్‌లోనే ఉండొచ్చని భావిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో వ్యయానికి, ఆదాయానికి గల నిష్పత్తి తక్కువగా (35 శాతంగా) ఉంది. రిటర్న్ ఆన్ అసెట్(ఆర్‌ఓఏ) 3.5–4%, రిటర్న్ ఆన్ ఈక్విటీ(ఆర్ఓఈ) 20 శాతం కంటే అధికంగా ఉండొచ్చని భావిస్తున్నాం. ఈ ఏడాది జూన్ 30 నాటికి నిర్వహణ ఆస్తులు రూ.32,340 కోట్లుగా ఉన్నాయి. మూడేళ్లలో రుణాలు 37 శాతం, డిపాజిట్లు 33 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందుతాయని అంచనా. నిర్వహణ ఆస్తులు బాగా వృద్ధి చెందడం, బ్యాంకింగ్ రంగంలోనే అత్యధిక మార్జిన్లు (9–10 శాతం) ఉండటం, నిలకడైన రుణ నాణ్యత, సూక్ష్మ రుణాలపై రాబడులు అధికంగా ఉండటం, తక్కువ వడ్డీ వ్యయమయ్యే డిపాజిట్లు... ఇవన్నీ సానుకూలాంశాలు. -
సన్ ఫార్మా లాభం రూ.982 కోట్లు
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం, సన్ ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.983 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.425 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అమెరికాలో కోర్టు కేసుల సెటిల్మెంట్ కారణంగా రూ.951 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని, అందుకని గత క్యూ1లో నికర నష్టాలు వచ్చాయని సన్ ఫార్మాç ఎమ్డీ దిలీప్ సంఘ్వి తెలియజేశారు. ఇక గత క్యూ1లో రూ.6,209 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.7,224 కోట్లకు ఎగసిందని చెప్పారాయన. ఈ క్యూ1లో ఎబిటా మార్జిన్ 21.3 శాతానికి చేరిందన్నారు. ఈ క్యూ1లో అన్ని ప్రధాన మార్కెట్లలో మంచి వృద్ధి సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కంపెనీ రూ.900 కోట్ల నికరలాభాన్ని, రూ.6,957 కోట్ల ఆదాయాన్ని సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. సన్ ఫార్మా ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. స్పెషాల్టీ ఉత్పత్తులపై భారీ పెట్టుబడులు.. భారత్‌లో బ్రాండెడ్ ఫార్ములేషన్స్ అమ్మకాలు ఈ క్యూ1లో 22 శాతం పెరిగి రూ.2,152 కోట్లకు పెరిగాయని దిలీప్ సింఘ్వి పేర్కొన్నారు. అమెరికా అమ్మకాలు 8 శాతం పెరిగి రూ.2,654 కోట్లకు వృద్ధి చెందాయని వివరించారు. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి రెండు స్పెషాల్టీ ఉత్పత్తులకు ఆమోదాల కోసం ఎదురు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మరిన్ని స్పెషాల్టీ ఉత్పత్తులు అందుబాటులోకి తేనున్నామని, ఈ సెగ్మెంట్‌పై భారీగా పెట్టుబడులు పెట్టామని వెల్లడించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సన్ ఫార్మా ఇండస్ట్రీస్ షేర్ 7 శాతం లాభంతో రూ.602 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 8 శాతం లాభంతో రూ.608ని కూడా తాకింది. -
సన్ ఫార్మా లాభం 7% అప్
న్యూఢిల్లీ: ఔషధ రంగ దిగ్గజం సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ. 1,309 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ4లో నమోదైన రూ.1,224 కోట్లతో పోలిస్తే 7 శాతం అధికం. క్యూ4లో ఆదాయం రూ.7,137 కోట్ల నుంచి రూ. 6,977 కోట్లకు తగ్గింది. అమెరికా మార్కెట్లో అమ్మకాలు దెబ్బతిన్నా... భారత్ సహా వర్ధమాన దేశాల్లో ఆదాయాలు మెరుగుపడటంతో లాభాల్లో వృద్ధి సాధించగలిగినట్లు సన్ ఫార్మా తెలిపింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను నికర లాభం 69 శాతం క్షీణించి రూ.6,964 కోట్లకు తగ్గగా, ఆదాయం సైతం రూ. 31,578 కోట్ల నుంచి రూ. 26,489 కోట్లకు క్షీణించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.1 ముఖవిలువ గల షేరు ఒక్కింటిపై రూ.2 చొప్పున డివిడెండ్ చెల్లించాలని బోర్డు తీర్మానించింది. సెప్టెంబర్ ఆఖరు వారంలో దీన్ని చెల్లించనున్నట్లు సంస్థ తెలిపింది. అమెరికాలో జనరిక్ ఔషధాలకు సంబంధించి ధరలపరమైన ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ, గడిచిన నాలుగు త్రైమాసికాల్లో క్రమంగా పనితీరు మెరుగుపర్చుకుంటూ వస్తున్నామని సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి తెలిపారు. శుక్రవారం సన్ ఫార్మా షేర్లు బీఎస్ఈలో 0.97 శాతం పెరిగి రూ. 466.55 వద్ద క్లోజయ్యాయి. -
75% తగ్గిన సన్ ఫార్మా లాభం
న్యూఢిల్లీ: సన్ ఫార్మా నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో 75 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,472 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.365 కోట్లకు తగ్గిందని సన్ ఫార్మా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,925 కోట్ల నుంచి రూ.6,653 కోట్లకు తగ్గిందని సన్ ఫార్మా ఎమ్డీ, దిలీప్ సంఘ్వి చెప్పారు. రూ.513 కోట్ల వాయిదా పడిన వన్‌టైమ్ పన్ను సర్దుబాటు కారణంగా ఈ క్యూ3లో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించారు. నిర్వహణ లాభం 41 శాతం క్షీణించి రూ.1,453 కోట్లకు, మార్జిన్ 9 శాతం పతనమై 21.8 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు. భారత వ్యాపారం 6 శాతం వృద్ధి... అమెరికా మార్కెట్లో అమ్మకాలు 35 శాతం తగ్గి 33 కోట్ల డాలర్లకు చేరాయని, ఇది మొత్తం అమ్మకాల్లో 32 శాతానికి సమానమని వివరించారు. అమెరికా మార్కెట్లో జనరిక్ ఔషధ ధరలపై ఒత్తిడి కొనసాగుతుండడమే అమ్మకాలు తగ్గడానికి కారణమని వివరించారు. అమెరికాలో జనరిక్ ఔషధాలకు సంబంధించి ధరల విషయంలో సమస్యాత్మక వాతావరణం నెలకొన్నదని వివరించారు. అయినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంతో పోల్చితే ఈ క్యూ3లో లాభదాయకత మెరుగుపడిందని పేర్కొన్నారు. భారత్‌లో బ్రాండెడ్ ఫార్ములేషన్స్ వ్యాపారం 6 శాతం వృద్ధితో రూ.2,085 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇతర వర్ధమాన దేశాల్లో అమ్మకాలు 10 శాతం వృద్ధితో 19 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ 2.5 శాతం నష్టపోయి రూ.574 వద్ద ముగిసింది. -
సన్ ఫార్మా లాభం 59 శాతం డౌన్
న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద ఫార్మా కంపెనీ, సన్ ఫార్మా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 59 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.2,235 కోట్లుగా ఉన్న కంపెనీ నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ2లో రూ.912 కోట్లకు తగ్గిందని సన్ ఫార్మా తెలిపింది. ధరల ఒత్తిడి కారణంగా అమెరికా జనరిక్ మార్కెట్లో అమ్మకాలు క్షీణించడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ఎండీ, దిలిప్ సంఘ్వి చెప్పారు. ఆదాయం రూ.8,260 కోట్ల నుంచి 20 శాతం తగ్గి రూ.6,650 కోట్లకు చేరిందని వివరించారు. మొత్తం వ్యయాలు 6 శాతం పెరిగి రూ.579 కోట్లకు చేరాయని వివరించారు. మెల్లమెల్లగా పుంజుకుంటాం... అమెరికా జనరిక్స్ మార్కెట్లో ధరల ఒత్తిడి, స్పెషాల్టీ బిజినెస్ కోసం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు విస్తరిస్తుండడడం ఈ క్యూ2 పనితీరుపై ప్రభావం చూపించాయని సంఘ్వి చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో పనితీరు మెల్లమెల్లగా పుంజుకోగలదన్న అంచనాలున్నాయని చెప్పారు. భారత్‌లో బ్రాండెడ్ ఫార్ములేషన్స్ అమ్మకాలు 11 శాతం వృద్ధితో రూ.2,221 కోట్లకు పెరిగాయని. మొత్తం అమ్మకాల్లో ఈ వ్యాపార విభాగం వాటా 34 శాతమని వివరించారు. అమెరికా అమ్మకాలు 44 శాతం క్షీణించి 31కోట్ల డాలర్లకు తగ్గాయని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అమ్మకాలు 16 శాతం వృద్ధితో 20 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. మిశ్రమంగా ఫలితాలు సన్ ఫార్మా ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈ కంపెనీ రూ.6,861 కోట్ల ఆదాయంపై రూ.802 కోట్ల నికర లాభం ఆర్జించగలదన్న అంచనాలున్నాయి. నికర లాభం అంచనాలను మించగా, ఆదాయం అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ 1.1 శాతం నష్టపోయి రూ.526 వద్ద ముగిసింది. -
భారీగా నష్టపోయిన సన్‌ఫార్మా
ముంబై: దేశీయ పార్మా దిగ్గజం ఫలితాల్లో భారీగా కుదేలైంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సన్‌ఫార్మా మార్కెట్ అంచనాలను మించి భారీ నష్టాలను మూటగట్టుకుంది. క్యూ1 లో రూ. 425కోట్ల నికర నష్టాలను నమోదు చేసింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికానికి రూ .424.92 కోట్లు నష్టపోయినట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. దాదాపు వెయ్యి కోట్ల లాభాలను ఆర్జించనుందని ఎనలిస్టులు అంచనావేశారు. ఆదాయం 25శాతం క్షీణించింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ. 8,256 కోట్లతో పోలిస్తే ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ .6,208.79 కోట్లుగా నిలిచింది. ఎబిటామార్జిన్లు 17. 6 శాతంగా నిలిచాయి. మరోవైపు వన్ టైం లాస్‌గా రూ. 950.5 కోట్లను నష్టపోయినట్టు సన్ ఫార్మా ప్రకటించింది. జులై 2017 నెలలో మోడఫినిల్కు సంబంధించి యాంటీట్రస్ట్ వ్యాజ్యానికి సంబంధించి మొత్తం 147 మిలియన్ డాలర్లు చెల్లించాలని కంపెనీ అంగీకరించిందని తెలిపింది. ఈ ఫలితాల నేపథ్యంలో సన్‌పార్మా కౌంటర్ 3శాతం నష్టపోయింది. -
సన్ ఫార్మా, శామ్సంగ్ బయోలాజిక్స్ ఒప్పందం
సోరియాసిస్ ఔషధ తయారీపై 359 కోట్ల డీల్ న్యూఢిల్లీ: దేశీయ ఔషధోత్పత్తుల దిగ్గజం సన్‌ఫార్మా, దక్షిణ కొరియా కంపెనీ శామ్సంగ్ బయోలాజిక్స్ మధ్య భారీ తయారీ ఒప్పందం ఒకటి కుదిరింది. సోరియాసిస్ చికిత్సకు వాడే టిల్డ్రాకిజుమాబ్ అనే ఔషధాన్ని తయారు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇరు కంపెనీలు మంగళవారం సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఈ కాంట్రాక్టు విలువ రూ. 359 కోట్లని, డీల్‌కు సంబంధించిన ఇతర ఆర్థిక వివరాలు గోప్యమైనవని ఆ ప్రకటన పేర్కొంది. ఒప్పందం ప్రకారం ఔషధ తయారీ కాంట్రాక్టు శామ్సంగ్ బయోలాజిక్స్కు సన్‌ఫార్మా ఇస్తుంది. -
యాంటీ-కొలెస్టరాల్ డ్రగ్‌పై సన్ ఫార్మాకు అనుమతి
న్యూఢిల్లీ: దేశీ హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అమెరికా హెల్త్ రెగ్యులేటర్ నుంచి యాంటీ-కొలెస్టరాల్ డ్రగ్ జెనెరిక్ వెర్షన్ టాబ్లెట్ కు ఆమోదం పొందింది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు ఉపయోగించే జెటియా జెనెరిక్ వెర్షన్ ఎజిటిమీబీ మాత్రలకు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించింది. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించేందుకు వినియోగించే జెటియా ట్యాబ్లెట్లను అమెరికా మార్కెట్లో విక్రయించేందుకు తాజాగా అనుమతి లభించినట్లు కంపెనీ పేర్కొంది. సన్ ఫార్మా బిఎస్ఇ ఫైలింగ్ లోతెలిపింది. 10 మి.గ్రా. మాత్రలకు తుది ఆమోదం పొందినట్టు చెప్పింది. దీంతో సన్ ఫార్మా స్యూటికల్ ఇండస్ట్రీస్ స్టాక్ బిఎస్ఇలో 1.19 శాతం పెరిగింది. -
ఫ్లాట్ గా ప్రారంభమైన మార్కెట్లు
ముంబై : బంగారం వంటి మరికొన్ని వస్తువులు, సేవలపై పన్ను శ్లాబులు ఎలా ఉండబోతున్నాయనే సస్పెన్షన్ కు జీఎస్టీ కౌన్సిల్ తెరదించిన అనంతరం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లు ఊగిసలాట ధోరణిలో నడుస్తున్నాయి. సెన్సెక్స్ 17.94 పాయింట్ల నష్టంలో 31,225 వద్ద, నిఫ్టీ 5.10 పాయింట్ల లాభంలో 9658గా ట్రేడవుతోంది. ప్రారంభంలో సన్ ఫార్మా, సిప్లా, బీహెచ్ఈఎల్, అదానీ పోర్ట్స్, హీరో మోటార్ కార్ప్, భారతీ ఇన్ ఫ్రాటెల్, ఐఓసీ, ఇండియాబుల్స్ హౌజింగ్, అరబిందో ఫార్మా లాభాలు పండించాయి. అదేవిధంగా ఐటీసీ, లుపిన్, కోల్ ఇండియా, విప్రో, హెచ్డీఎఫ్సీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ 15 పైసలు బలపడి 64.32 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కట్లో బంగారం ధరలు 253 రూపాయలు పైకి జంప్ చేశాయి. ప్రస్తుతం 28,905 రూపాయలుగా ఉన్నాయి. -
లాభనష్టాల మధ్య పటిష్టంగా మార్కెట్లు
ముంబై: దేశీ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అనంతరంఆరంభంలో భారీ సెల్లింగ్ ప్రెసర్ తో దాదాపు 150పాయింట్లకు పైగా మార్కెట్ పతనమైనంది. కానీ వెనువెంటనే కోలుకుని లాభాల బాటపట్టాయి. తీవ్ర లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఒక దశలో దాదాపు సెంచరీ లాభాలను సాధించిన సెన్సెక్స్ 63 పాయింట్లు ఎగిసి 31,090 వద్ద నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 9603వద్ద కొనసాగుతున్నాయి. అయితే బెంచ్ మార్క్‌లు రెండూ సాంకేతిక స్థాయిల వద్ద స్థిరంగా కొనసాగుతుండడం విశేషం. .మెటల్, ఎఫ్ఎంసిజి, చమురు, గ్యాస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా ఐటీ ఫార్మా భారీ పతనాన్ని నమోదు చేశాయి. సన్ ఫార్మా, టెక్ మహీంద్రా టాప్ లూజర్‌గా ఉన్నాయి. మార్చి త్రైమాసికం ఫలితాలు ప్రభావం చూపిస్తున్నట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. మిడ్ క్యాప్ ఇండెక్స్ స్మాల్ క్యాప్ సూచీ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. అరబిందో ఫార్మా, అదానీ పోర్ట్స్, యస్ బ్యాంక్, లూపిన్, ఐసిఐసిఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఒఎన్‌జిసి, విప్రో, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్ కూడా నష్టపోయాయి. మరోవైపు హెచ్‌డిఎఫ్‌సి, హిందాల్కో, ఇండియాబూల్స్ హౌసింగ్ ఫైనాన్స్, వేదాంత, బిపిసిఎల్ లాభపడ్డాయి. అటు డాలర్ మారకరంలో రూపాయి13 పైసలు క్షీణించి రూ.64.57వద్ద ఉంది. బంగారం ఎంసీఎక్స్‌మార్కెట్ లో భారీగా లాభపడింది. రూ.229 లుఎగిసి రూ. 28,890 వద్ద వుంది. -
సన్ ఫార్మా లాభంలో 14% క్షీణత
అమెరికా మార్కెట్లో ధరల ఒత్తిళ్ల ప్రభావం న్యూఢిల్లీ: సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 14 శాతం తక్కువగా లాభాన్ని నమోదు చేసింది. అమెరికా మార్కెట్లో ధరల పరంగా ఒత్తిళ్లు ప్రభావం చూపించడంతో లాభం రూ.1,223 కోట్లకు పరిమితం అయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం రూ.1,416 కోట్లుగా ఉంది. అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంలోనూ తగ్గుదల చోటు చేసుకుంది. 2016 మార్చి త్రైమాసికంలో ఆదాయం రూ.7,415 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో అది రూ.6,825 కోట్లకు తగ్గింది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2016–17)లో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం రూ.6,964 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.4,545 కోట్ల కంటే 53 శాతం వృద్ధి చెందింది. ఆదాయం సైతం రూ.27,888 కోట్ల నుంచి రూ.30,264 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుపై రూ.3.5 డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. దిలీప్ సంఘ్విని తిరిగి ఐదేళ్ల పాటు 2023 మార్చి వరకు కంపెనీ ఎండీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన సీఎఫ్‌వోగా సీఎస్ మురళీధరన్‌ను నియమించింది. కొత్త ఔషధాలపై పెట్టుబడులు కొనసాగుతాయి అమెరికాలో జనరిక్ మందుల ధరల పరంగా ఎదురైన సవాళ్లు నాలుగో త్రైమాసికం పనితీరుపై ప్రభావం చూపించినట్టు సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి తెలిపారు. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై : ఆసియన్ మార్కెట్ల నుంచి వస్తున్న బలహీనమైన సంకేతాలతో సోమవారం స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 91 మేర పాయింట్ల నష్టంలో 29,370 వద్ద కొనసాగుతుండగా... నిఫ్టీ 28.60 పాయింట్ల నష్టంలో 9122 వద్ద ట్రేడవుతోంది. సన్ ఫార్మాకు చెందిన దాద్రా యూనిట్ ఆడిట్ లో భాగంగా 11 అబ్సర్వేషన్స్ ను అథారిటీలు చేపట్టాలని అమెరికా ఎఫ్‌డీఏ ఆదేశాలు జారీచేయగా.. సన్ ఫార్మా షేర్లు 2 శాతం మేర పడిపోతున్నాయి. కంపెనీకున్న అమెరికా సప్లయిర్స్ లో హలోల్ తర్వాత అతిపెద్ద యూనిట్ దాద్రా యూనిటే. టోరెంట్ ఫార్మాకు చెందిన రెండు ప్లాంట్స్ ను తిరిగిపరిశీలించాలని అమెరికా ఎఫ్‌డీఏ పేర్కొంది. దీంతో ఆ కంపెనీ షేర్లు కూడా ట్రేడింగ్ ప్రారంభంలో 2 శాతం నష్టపోయాయి. ఇదే సమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ పై ఎలాంటి అబ్సర్వేషన్స్ ను అమెరికా ఆదేశించకపోవడంతో ఆ కంపెనీ షేర్లు 2 శాతంపైగా లాభాలను ఆర్జిజిస్తున్నాయి. అటు డాలర్ తో రూపాయి మారకం విలువ ఫ్లాట్ గా 64.42 వద్ద ప్రారంభమైంది. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో చాలా ఆసియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడుతోంది. మరోవైపు పసిడి దూకుడుగా 193 రూపాయల లాభంలో 29,422 రూపాయల వద్ద కొనసాగుతోంది. -
ఫలితాల్లో తుస్: నష్టాల్లో షేర్లు
ముంబై : ఆటో, ఫార్మా, రియల్ ఎస్టేట్ స్టాక్స్ బుధవారం స్టాక్ మార్కెట్లకు భారీగా దెబ్బకొడుతున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లకు పైగా పడిపోతుండగా.. నిఫ్టీ తన కీలక మార్కు 8750 కిందకి దిగజారింది. నిరాశజనకమైన ఫలితాలను ప్రకటించడంతో టాటా మోటార్స్, సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ భారీగా నష్టపోతున్నాయి. టాటా మోటార్స్ 8.51 శాతం ఢమాల్ మని 441.00 వద్ద షేరు ధర నమోదవుతోంది. 2016 డిసెంబర్ 7 తర్వాత ఇదే కనిష్ట స్థాయి. ఒకానొక దశలో టాటా మోటార్స్ షేర్లు 13 శాతం మేర నష్టపోయాయి. అంచనావేసిన దానికంటే చాలా చెత్తగా టాటా మోటార్స్ తన ఫలితాలను ప్రకటించడంతో నేటి మార్కెట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. డిసెంబర్ క్వార్టర్లో ఈ కంపెనీ 96 శాతం లాభాలను కోల్పోయింది. మొదటిసారి త్రైమాసిక లాభాలు పడిపోయినట్టు ప్రకటించిన సన్ ఫార్మా కూడా 3.56 శాతం నష్టపోతోంది. ధరల విషయం, సరఫరా అంశాలు కంపెనీ విక్రయాలను ఫార్మాకు అతిపెద్ద మార్కెటైన యూఎస్‌లో దెబ్బతీశాయని సన్ ఫార్మా తెలిపింది. మధ్యాహ్నం 12.35 వద్ద, సెన్సెక్స్ 210 పాయింట్లు పడిపోయి 28,129 వద్ద ట్రేడైంది. నిఫ్టీ సైతం 68 పాయింట్ల డౌన్‌తో 8,724గా నమోదైంది. నిఫ్టీ ఆటో 2 శాతం పైగా, నిఫ్టీ ఫార్మా 1.3 శాతం పడిపోయాయి. కేంద్రప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు కంపెనీ క్వార్టర్లీ ఫలితాలను దెబ్బతీసినట్టు తెలిసింది. డీఎల్ఎఫ్ లిమిటెడ్, స్పైస్ జెట్ డిసెంబర్ క్వార్టర్లో పడిపోయాయి. ప్రస్తుతం డీఎల్ఎఫ్ షేర్లు 6శాతం, స్పైస్ జెట్ షేర్లు 6.8 శాతం క్షీణించాయి. -
సన్ ఫార్మా లాభం రూ.1,472 కోట్లు
• క్యూ3లో 5 శాతం తగ్గుదల... • మొత్తం ఆదాయం రూ.7,913 కోట్లు న్యూఢిల్లీ: సన్ ఫార్మా కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రూ.1,472 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు సాధించిన నికర లాభం(రూ.1,545 కోట్లు)తో పోల్చితే 5 శాతం క్షీణత నమోదైంది. గత క్యూ3లో రూ.7,122 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో రూ.7,913 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వి తెలిపారు. ప్రస్తుత వ్యాపార వృద్ధిపై దృష్టిని కొనసాగిస్తున్నామని, తక్షణం ఆదాయం అందించకపోయినప్పటికీ, ప్రత్యేక విభాగాలపై పెట్టుబడులు పెడుతున్నామని వివరించారు. అదనపు డైరెక్టర్ నియామకం.. మొత్తం అమ్మకాల్లో 26 శాతం వాటా ఉన్న భారత బ్రాండెడ్ ఫార్ములేషన్స్ విభాగం అమ్మకాలు 5 శాతం వృద్ధితో రూ.1,969 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. మొత్తం ఆమ్మకాల్లో 45 శాతం వాటా ఉండే అమెరికా వ్యాపారం 4 శాతం వృద్ధితో 51 కోట్ల డాలర్లకు పెరిగిందని వివరించారు. తమ కంపెనీలకు చెందిన 424 అండా(అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్)లకు అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపిందని, ఎఫ్‌డీఏ ఆమోదం కోసం 149 అండాలను దరఖాస్తు చేశామని, 14 అండాలకు తాత్కాలిక ఆమోదం పొందామని వివరించారు. ఇక తమ కంపెనీ అదనపు డైరెక్టర్‌గా కళ్యాణసుందరమ్ సుబ్రహ్మణ్యమ్ను నియమించామని సంఘ్వి చెప్పారు. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేర్ 0.7 శాతం క్షీణించి రూ.650 వద్ద ముగిసింది. -
సన్‌ఫార్మా చేతికి నోవార్టిస్ క్యాన్సర్ ఔషధం
ఒప్పందం విలువ 17.5 కోట్ల డాలర్లు న్యూఢిల్లీ: నొవార్టిస్‌కు చెందిన క్యాన్సర్ ఔషధాన్ని ప్రముఖ ఫార్మా కంపెనీ సన్ ఫార్మా కొనుగోలు చేస్తోంది. నొవార్టిస్‌కు చెందిన ఒడొమ్జో అనే క్యాన్సర్ ఔషధాన్ని 17.5 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయనున్నామని సన్ ఫార్మా తెలిపింది. దీనికి సంబంధించిన తమ, తమ అనుబంధ కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఈ ఔషధం కొనుగోలుతో తమ బ్రాండెడ్ క్యాన్సర్ ఔషధాల పోర్ట్‌ఫోలియో మరింతగా విస్తరిస్తుందని సన్‌ఫార్మా గ్లోబల్ హెడ్ (బిజినెస్ డెవలప్మెంట్) కీర్తి గనోర్కర్ తెలిపారు. ఈ ఔషధానికి అమెరికా ఎఫ్‌డీఏ నుంచి ఈ ఏడాది జూలైలో ఆమోదం లభించింది. ఈ ఔషద కొనుగోలు వార్త నేపథ్యంలో బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ ఇంట్రాడేలో రూ.625 గరిష్ట స్థాయిని తాకి, చివరకు 0.8 శాతం నష్టంతో రూ.609 వద్ద ముగిసింది. -
సన్‌ఫార్మా చేతికి రష్యా కంపెనీ
• బయోసింటెజ్‌లో 85.1% వాటా కొనుగోలు.. • డీల్ విలువ రూ.400 కోట్లు... న్యూఢిల్లీ: దేశీ ఫార్మా అగ్రగామి సన్ ఫార్మా.. రష్యా కంపెనీ జేఎస్సీ బయోసింటెజ్‌ను కొనుగోలు చేసింది. ఇరు కంపెనీల మధ్య ఈ ఒప్పందానికి సంబంధించి సంతకాలు పూర్తరుునట్లు బుధవారం ప్రకటించింది. బయోసింటెజ్‌లో 85.1 శాతం వాటాను చేజిక్కించుకుంటున్నామని.. ఇందుకోసం 2.4 కోట్ల డాలర్లను చెల్లిస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా ఆ కంపెనీకి చెందిన 3.6 కోట్ల డాలర్ల రుణాన్ని కూడా తామే భరించాల్సి వస్తుందని సన్‌ఫార్మా వెల్లడించింది. దీనిప్రకారం చూస్తే... మొత్తం డీల్ విలువ 6 కోట్ల డాలర్లు(దాదాపు రూ.400 కోట్లు)గా లెక్కతేలుతోంది. రష్యాతోపాటు సీఐఎస్(కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్) దేశాల్లో బయోసింటెజ్కు తయారీ, మార్కెటింగ్ కార్యకలాపాలు ఉన్నాయని సన్‌ఫార్మా ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానంగా హాస్పిటల్ ఔషధ విభాగంపై(డోసేజ్ ఫార్మ్స్, ఇంజెక్షన్లు, బ్లడ్ సబ్స్టిట్యూట్స్, బ్లడ్ ప్రిజర్వేటివ్స, జెల్స్, క్రీమ్స్ ఇతరత్రా) దృష్టిసారిస్తున్న ఈ రష్యా కంపెనీ 2015 ఏడాదిలో 5.2 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. ‘వ్యూహాత్మక వర్థమాన మార్కెట్లలో పెట్టుబడి ప్రణాళికల్లో భాగంగానే తాజా డీల్‌ను కుదుర్చుకున్నాం. దీనివల్ల రష్యా ఫార్మా మార్కెట్లో మరింత పట్టు సాధించేందుకు దోహదం చేస్తుంది’ అని సన్‌ఫార్మా వర్థమాన మార్కెట్ విభాగం హెడ్ అలోక్ సంఘ్వి పేర్కొన్నారు. -
ట్రంప్ షాక్ వెనక్కి: భారీ లాభాల్లో మార్కెట్లు
ట్రంప్ ఎఫెక్ట్‌తో బుధవారం ట్రేడింగ్‌లో అతలాకుతలైన దేశీయ మార్కెట్లు సర్దుకొని గురువారం సెషన్ ప్రారంభంలో భారీ లాభాలలో ప్రారంభమయ్యాయి. ప్రపంచమార్కెట్ల వేగవంతం దేశీయ సూచీలకు బాగా కలిసివచ్చింది. దీంతో సెన్సెక్స్ 350 పాయింట్లకు పైగా ఎగిసింది. ప్రస్తుతం 376.32 పాయింట్ల లాభంతో 27,628 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 122.85 పాయింట్ల లాభంతో 8,554గా ట్రేడ్ అవుతోంది. సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంకు, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంకు టాప్ గెయినర్స్‌గా లాభాలు పండిస్తున్నాయి. ప్రారంభంలో ఇన్ఫోసిస్, ఐటీసీ, లుపిన్ షేర్లు నష్టపోయాయి. అటు ట్రంప్ టోర్నడో నుంచి ఆసియన్ మార్కెట్లు కోలుకున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయ కెరటం ఎగురవేయడంతో, ఎన్నికల సందిగ్థత నుంచి గ్లోబల్ మార్కెట్లు తేరుకున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం ధర 30 రూపాయల నష్టంతో 29,850గా కొనసాగుతోంది. కానీ డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసలు బలపడి 66.34గా ఉంది. -
ఎస్టోనియా జీడీపీ ముకేశ్ అంబానీ సంపద
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, దేశంలోనే నెంబర్ వన్ కుబేరుడైన ముకేశ్ అంబానీ సంపద.. యూరప్‌లోని ఎస్టోనియా దేశ జీడీపీకి (22.69 బిలియన్ డాలర్లు) సమానంగా ఉందని ఫోర్బ్స్ ఇండియా పేర్కొంది. ముకేశ్ అంబానీ సంపద విలువ 22.7 బిలియన్ డాలర్లు. ఈయన తర్వాతి స్థానాల్లో సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ (16.9 బిలియన్ డాలర్లు), హిందూజా కుటుంబం (15.2 బిలియన్ డాలర్లు) ఉన్నారు. అలాగే విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ 15 బిలియన్ డాలర్ల సంపదతో నాల్గవ స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ ఆఫ్రికాలోని మొజాంబిక్ దేశ జీడీపీ (14.69 బిలియన్ డాలర్లు) కన్నా ఎక్కువ. ఇక ఐదో స్థానంలో పల్లోంజి మిస్త్రీ (13.9 బిలియన్ డాలర్లు) ఉన్నారు. -
సన్ ఫార్మాకు అమెరికాలో ఎదురు దెబ్బ
-
సన్ ఫార్మా మందుల భారీ రీకాల్
ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ కి అమెరికాలో ఎదురు దెబ్బ తగిలింది. డిప్రెసివ్ డిజార్డర్ చికిత్స లో వాడే బుప్రోపియాన్ హైడ్రోక్లోరైడ్ మాత్రలను భారీ ఎత్తునరీ కాల్ చేస్తోంది. బుప్రోపియాన్ హైడ్రోక్లోరైడ్ ఎక్స్టెండెడ్ 50 మి.గ్రా మాత్రలున్న 31, 762 సీసాలను ఉపసంహరించుకోనుంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తన తాజా ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది. డిజల్యూషన్ స్పెసికేషన్స్ సమర్పించడంలో పెయిలైన కారణంగా అమెరికా దేశవ్యాప్తంగా ఈ రీకాల్ చేస్తున్నట్టు తెలిపింది. ఇది క్లాస్ 3రీకాల్ అని నివేదించింది. వీటిని సన్ ఫార్మా కు చెందిన హలోల్ కర్మాగారంలో ఉత్పత్తి చేసినట్టు మాచారం. -
స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
ముంబై : వరుసగా ముందు రెండు సెషన్లలో నష్టాలు పాలైన స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. 10 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ 33.31 పాయింట్ల లాభంలో 28,320 గా నమోదవుతోంది. నిఫ్టీ 9 పాయింట్ల లాభంతో 8706 వద్ద ట్రేడ్ అవుతోంది. మెటల్, ఎఫ్ఎమ్సీజీ సూచీలు మినహా మిగతా మేజర్ రంగ సూచీలన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. ఏఫ్రిల్-జూన్ త్రైమాసికంలో అంచనావేసిన దానికంటే తక్కువ ఆదాయాలను ఆర్జించడంతో, ఈ కంపెనీ షేర్లు 2 శాతానికి పైగా పతనమవుతున్నాయి. టాటా స్టీల్ కూడా క్యూ1 ఫలితాలతో ఆ కంపెనీ షేర్లు 1.61 శాతం పడిపోతున్నాయి. అదేవిధంగా అదానీ పోర్ట్స్, ఐటీసీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, జీ ఎంటర్టైన్మెంట్, భారతీ ఇన్ఫ్రాటెల్ నష్టాలను గడిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, సన్‌ఫార్మా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, హిందాల్కో, బీపీసీఎల్, యస్ బ్యాంకులు లాభాలను ఆర్జిస్తున్నాయి. సోమవారం అమ్మకాల ఒత్తిడితో సతమతమైన పబ్లిక్ రంగ బ్యాంకులు నేటి ట్రేడింగ్‌లో రికవరీ అయ్యాయి. నిఫ్టీ పీఎస్‌యూ, ఎన్ఎస్ఈ సబ్ ఇండెక్స్ 1.6 శాతం మేర పెరిగింది. 2.1 శాతం లాభంతో బ్యాంకు ఆఫ్ బరోడా నిఫ్టీ టాప్ గెయినర్‌గా కొనసాగుతోంది. మరోవైపు వాల్ స్ట్రీట్ నుంచి వస్తున్న నెగిటివ్ సంకేతాలతో ఆసియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ రెండు వారాల కనిష్ట స్థాయిలో ప్రారంభమైంది. ముందటి సెషన్ ముగింపుకు 7 పైసలు పడిపోయిన రూపాయి, డాలర్‌కు 66.99గా ఉంది. -
సన్ ఫార్మా లాభం 3 రెట్లు అప్
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా నికర లాభం(కన్సాలిడేటెడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలానికి మూడు రెట్లు పెరిగింది. గత క్యూ1లో రూ.556 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో 266 శాతం వృద్ధితో రూ.2,034 కోట్లకు పెరిగిందని సన్ ఫార్మా తెలిపింది. పన్ను వ్యయాలు బాగా పెరిగినప్పటికీ, ఆదాయం, నిర్వహణ పనితీరు మెరుగుపడడం వల్ల నికర లాభంలో ఈ స్థాయి వృద్ధి సాధించామని పేర్కొంది. మొత్తం ఆదాయం రూ.6,761 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.8,243 కోట్లకు పెరిగిందని వివరించింది. నిర్వహణ లాభం(ఇబిటా) 65 శాతం వృద్ధితో రూ.2,921 కోట్లకు పెరిగిందని, మార్జిన్ 930 బేసిస్ పాయింట్లు పెరిగి 35.4 శాతానికి పెరిగాయని తెలిపింది. పన్ను వ్యయాలు రూ.113 కోట్ల నుంచి మూడు రెట్ల వృద్ధితో రూ.353 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ఆర్థిక ఫలితాలు బాగా ఉన్నప్పటికీ, బీఎస్ఈలో సన్ ఫార్మా షేర్ 1 శాతం వరకూ నష్టపోయి రూ.802 వద్ద ముగిసింది. -
ఫలితాల్లో దూసుకుపోయిన సన్ ఫార్మా
ముంబై: భారతీయ ఫార్మా దిగ్గజం సన్ ఫార్మా మెరుగైన ఫలితాలను ప్రకటించింది. వడోదరకు చెందిన ఈ కంపెనీ అంచనాలను మించి ఆర్థిక ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో నికర లాభం రూ. 556 కోట్ల నుంచి రూ. 2034 కోట్లకు దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం కూడా 22 శాతం ఎగసి రూ. 8243 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) 65 శాతం పెరిగి రూ. 2921 కోట్లుగా నమోదైంది. ఇబిటా మార్జిన్లు కూడా 26.1 శాతం నుంచి 35.4 శాతానికి భారీగా బలపడ్డాయి. ఈ కాలంలో రూ. 685 కోట్లమేర అనూహ్య నష్టాలు(ఎక్సెప్షనల్ లాస్) నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. అలాగే పన్ను వ్యయాలు రూ. 113 కోట్ల నుంచి రూ. 353 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. ఈ ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు భారీగా లాభపడింది. ముగింపులో 0.95 శాతం లాభపడి రూ. 800 దగ్గర స్థిర పడింది. -
ఓటీసీ విభాగంలోకి సన్ ఫార్మా ‘సన్ క్రోస్’ బ్రాండ్
ముంబై: దిగ్గజ ఔషధ కంపెనీ ‘సన్ ఫార్మా’ తాజాగా తన సన్‌స్క్రీన్ బ్రాండ్ ‘సన్క్రోస్’ను ఓటీసీ విభాగం కింద మళ్లీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. అంటే కంపెనీ ఈ ప్రొడక్ట్‌ను ఇక నుంచి ఓవర్ ద కౌంటర్ (ఓటీసీ) విభాగం కింద కూడా విక్రయిస్తుంది. ఇప్పటి వరకు సన్క్రోస్ కేవలం ప్రిస్క్రిప్షన్ విభాగంలోనే అందుబాటులో ఉండేది. ఇపుడది ఓటీసీ, ప్రిస్క్రిప్షన్ అనే రెండూ విభాగాల్లోనూ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. -
స్టాక్స్ వ్యూ
సన్ ఫార్మా : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ ప్రస్తుత ధర: రూ.868 టార్గెట్ ధర: రూ.940 ఎందుకంటే: డిసెంబర్ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. నికర లాభం 258 శాతం వృద్ధితో రూ.1,400 కోట్లకు పెరిగింది. ఆదాయం రూ.7,070 కోట్లకు పెరిగింది. గ్లాక్సోస్మిత్‌లైన్(జీఎస్కే) నుంచి కొనుగోలు చేసిన ఓపియేట్స్ వ్యాపారం కన్సాలిడేట్ అవుతుండడం కంపెనీకి ప్రయోజనం కలిగించనున్నది. లాభదాయకం కాని విదేశీ ప్లాంట్లను మూసేసింది. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదం కోసం 156 అండాలు(అబ్రివియేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్) పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవలే మార్కెట్లోకి తెచ్చిన గ్లీవెక్ ఔషధానికి పోటీ తక్కువగా ఉండడం కంపెనీకి ప్రయోజనం కలిగించే అంశం. ఈ ఔషధానికి అమెరికాలో 200 కోట్ల డాలర్ల మార్కెట్ ఉంది. ర్యాన్‌బాక్సీ విలీన ఫలాలు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కంపెనీకి అందనున్నాయి. హలోల్ ప్లాంట్‌పై యూఎస్ఎఫ్డీఏ ఆందోళన వ్యక్తం చేయడంతో గత ఏడాది ఏప్రిల్ నుంచి చూస్తే ఈ షేర్ 30 శాతం తగ్గింది. ఇప్పుడు ఈ హలోల్ ప్లాంట్‌ను ఈ కంపెనీ అప్‌గ్రేడ్ చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో హలోల్ ప్లాంట్‌ను మళ్లీ తనిఖీ చేయాల్సిందిగా యూఎస్‌ఎఫ్‌డీఏను సన్ ఫార్మా ఆహ్వానిస్తోంది. రానున్న కాలంలో భారత్‌లో విక్రయాలు పుంజుకోనున్నాయి. మూడేళ్లలో ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) 23 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని అంచనా. 2017-18 అంచనా ఈపీఎస్‌కు 25 రెట్లు అయిన రూ.940 టార్గెట్ ధరను ఏడాది కాలంలో ఈ షేర్ చేరుతుందని భావిస్తున్నాం. నీల్కమల్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.1.102 టార్గెట్ ధర: రూ.1,215 ఎందుకంటే: మౌల్డెడ్ ఫర్నిచర్ తయారీలో, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఉత్పత్తుల తయారీలో అగ్రగామి సంస్థ. వివిధ సెగ్మెంట్లలో విభిన్నమైన ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తోంది. హోమ్ బ్రాండ్ కింద లైఫ్‌స్టైల్ ఫర్నిచర్, ఫర్నిషింగ్స్, యాక్సెసరీలను విక్రయిస్తోంది. మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకనుగుణంగానే ఉన్నాయి. గత క్యూ3లో రూ.8 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 139 శాతం వృద్ధితో రూ.20 కోట్లకు పెరిగింది. అలాగే ఆదాయం రూ.422 కోట్ల నుంచి 1 శాతం వృద్ధితో రూ.428 కోట్లకు ఎగిసింది. గత క్యూ3లో రూ.5.67గా ఉన్న ఈపీఎస్(షేర్ వారీ ఆర్జన) ఈ క్యూ3లో 13.53కు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో నికర లాభం 243 శాతం వృద్ధి చెంది రూ.71 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి నికర లాభం రూ.20 కోట్లుగా ఉంది. ఏడాది కాలానికి హోమ్ బ్రాండ్ టర్నోవర్ 13 శాతం వృద్ధిని సాధించింది. షేర్ వారీ ఆర్జన (ఈపీఎస్) ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.68గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.78గానూ ఉండొచ్చని భావిస్తున్నాం. రెండేళ్లలో నికర లాభం 39 శాతం, నికర అమ్మకాలు 6 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. జమ్మూ ప్లాంట్ విస్తరణ పూర్తయి, ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభం కావడం కంపెనీకి కలసివచ్చే అంశం. మధ్య, దీర్ఘకాలినికి రూ.1215 టార్గెట్ ధరకు ప్రస్తుత ధరలో ఈ స్క్రిప్ను కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నాం. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
రివైటల్ హెచ్ కొత్త బ్రాండ్ అంబాసిడర్ గా ధోని
న్యూఢిల్లీ: ఫార్మా రంగ దిగ్గజ కంపెనీ సన్‌ఫార్మాకు చెందిన హెల్త్ సప్లిమెంట్ బ్రాండ్ ‘రివైటల్ హెచ్’కు ఇక నుంచి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ఎం ఎస్ ధోని బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. రివైటల్ హెచ్ బ్రాండ్ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ధోని కొనసాగుతారని సన్‌ఫార్మా గ్లోబల్ హెల్త్‌కేర్ బిజినెస్ ప్రకటించింది. రివైటల్ హెచ్ బ్రాండ్‌కు దేశంలోని ఉత్తర, మధ్య, తూర్పు ప్రాంతాల్లో డిమాండ్ ఉందని, ఇక పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుదలకు ధోని భాగస్వామ్యం దోహదపడుతుందని కంపెనీ తెలిపింది. భారతీయుల దైనందిన జీవితంలో రివైటల్ హెచ్ ఒక భాగంగా మారుతుందని ధోని ఆకాంక్షించారు. రివైటల్ హెచ్‌కు ఇదివరకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. -
లాభాల స్వీకరణతో డౌన్
► 145 పాయింట్ల నష్టంతో ► 25,592 పాయంట్లకు సెన్సెక్స్ ► 48 పాయింట్ల నష్టంతో 7,786కు నిఫ్టీ అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. దీంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 145 పాయింట్లు నష్టపోయి 25,592 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 7,786 పాయింట్ల వద్ద ముగిశాయి. క్రిస్మస్ సందర్బంగా ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కావడం, వచ్చే వారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారని, ట్రేడింగ్ మందకొడిగా ఉందని నిపుణులంటున్నారు. ఐటీ, లోహ, ఎఫ్ఎంసీజీ, వాహన షేర్లు నష్టపోయాయి. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముడి చమురు ధరల పతనం, పార్లమెంట్లో అధికార, ప్రతిపక్షాల మధ్య రగడ చెలరేగుతుండడం.. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయని నిపుణులు పేర్కొన్నారు. హెచ్1బీ, ఎల్1 వీసాలపై అమెరికా కాంగ్రెస్ స్పెషల్ ఫీజును విధించడంతో ఐటీ కంపెనీలు నష్టపోయాయి. కాల్ డ్రాప్స్ విషయమై వచ్చే నెల 6 వరకూ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ట్రాయ్ వెల్లడించడంతో టెలికాం షేర్లు లాభపడ్డాయి. నేడే లిస్టింగ్: అల్కెమ్ ల్యాబొరేటరీస్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ షేర్లు నేడు(బుధవారం) స్టాక్ బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్ట్ కానున్నాయి. ఇష్యూ ధరలు డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ రూ.550, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ రూ.1,350గా ఉన్నాయి. కాగామ్యాట్రీమోనిడాట్కామ్, క్విక్ హీల్ టెక్నాలజీస్ ఐపీఓలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓల ద్వారా మ్యాట్రిమోనిడాట్కామ్ సంస్థ రూ.600-700 కోట్లు, క్విక్ హీల్ కంపెనీ రూ.250 కోట్లు సమీకరిస్తాయని అంచనా. -
2-3 ఏళ్లలో కొత్త డ్రగ్‌లు
సన్‌ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ వెల్లడి హైదరాబాద్, సాక్షి : వచ్చే 2-3 సంవత్సరాల్లో కొత్త మందుల కోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ఎఫ్డీఏ) వద్ద అప్లికేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సన్‌ఫార్మా తెలియజేసింది. ‘‘మా సంస్థకు చెందిన పరిశోధన విభాగం సన్‌ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ కంపెనీ (స్పార్క్) ప్రస్తుతం మూడు డ్రగ్‌లకు సంబంధించి పనిచేస్తోంది. అవిపుడు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయి’’ అని సన్‌ఫార్మా మేనేజింగ్ డెరైక్టర్ దిలీప్ సంఘ్వీ చెప్పారు. గురువారమిక్కడ ఐఎస్బీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘‘కొన్నేళ్ల కిందట మేం ఒక ఆలోచన చేశాం. కొత్త ఆవిష్కరణలు చేసే విభాగాన్ని విడిగా చేయాలనే ఉద్దేశంతో స్పార్క్ ను ఏర్పాటు చేశాం. ఇపుడా కంపెనీ మూడు ఉత్పత్తులపై పనిచేస్తూ క్లినికల్ ట్రయల్స్ దశకు తీసుకొచ్చింది. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే రెండు మూడేళ్లలో మేం మా సొంత కొత్త ఉత్పత్తుల్ని యూఎస్ఎఫ్డీఏ వద్ద నమోదు చేసే అవకాశం ఉంది’’ అని వివరించారు. అయితే ఈ మూడు మందులూ ఏఏ రంగాలకు సంబంధించినవనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం సంస్థకు దాదాపు 1800 మందికి పైగా రీసెర్చ్ సైంటిస్టులున్నారు. -
టాప్ ఎగ్జిక్యూటివ్స్‌ను తొలగించిన సన్‌ఫార్మా
ముంబై: ఫార్మా దిగ్గజం సన్‌ఫార్మా.. 18మంది టాప్ ర్యాంక్ ఉద్యోగులపై వేటు వేసింది. సీఈవో, ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న ఉద్యోగులను రాజీనామా చేయాల్సిందిగా కోరింది. సీఈవోగా ఉన్న ఇంద్రజిత్ బెనర్జీ, యూగుల్ సిగ్రితో పాటు, మరో 18 మందిని కంపెనీని వీడాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. అందుకుగాను వీరికి స్పెషల్ ప్యాకేజీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉన్నత హోదాలో ఉన్న ఉద్యోగుల తొలగింపుపై సన్ ఫార్మా వివరణ ఇచ్చుకుంది. 'వారిని కొనసాగించేందుకు, వారి ప్రతిభా పాటవాలను పూర్తిగా వినియోగించుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాం, కానీ విఫలమయ్యాం. చాలా పారదర్శకంగా, సున్నితంగా ఈ వ్యవహారాన్ని డీల్ చేశామని' సన్‌ఫార్మా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గత కొన్ని నెలలుగా నష్టాల్లో ఉన్న కంపెనీ గట్టెక్కించేందుకే సన్‌ఫార్మా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. రెండు పెద్ద కంపెనీల విలీనం తర్వాత మొదటి సారి కంపెనీ కష్టాలను ఎదుర్కొంటోందని వారు పేర్కొంటున్నారు. కాగా గతంలో ర్యాన్బ్యాక్సీతో జత కట్టి కష్టాల్లో పడ్డ జపాన్‌కు చెందిన దైచీ శాంక్యో కంపెనినీ 2014 ఏప్రిల్‌లో సన్ ఫార్మా టేకోవర్ చేసింది. అలాగే 2016 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లాభాలు తగ్గుముఖం పట్టనున్నాయనే అంచనాల నేపథ్యంలో, కష్టాల నుంచి గట్టెక్కడం కోసం కంపెనీ మల్లగుల్లాలు పడుతోంది. -
సన్ ఫార్మాకు ర్యాన్‌బాక్సీ ఎఫెక్ట్
క్యూ4లో రూ.888 కోట్ల నికర లాభం న్యూఢిల్లీ: ఔషధ రంగ దిగ్గజ కంపెనీ, సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి రూ.888 కోట్ల నికర లాభాన్ని(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలానికి రూ.1,587 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొంది. ర్యాన్‌బాక్సీ విలీనం, అమెరికా మార్కెట్లలో కొన్ని ఔషధాల ధరలు తగ్గించడం వల్ల నికర లాభం తగ్గిందని కంపెనీ వివరించింది. నికర అమ్మకాలు 2013-14 క్యూ4లో రూ.4,044 కోట్లుగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.6,145 కోట్లుగా ఉన్నాయని తెలిపింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి వస్తే... 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.3,141 కోట్లుగా ఉన్న నికర లాభం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.4,541 కోట్లకు పెరిగిందని వివరించింది. నికర అమ్మకాలు రూ.16,004 కోట్ల నుంచి రూ.27,287 కోట్లకు పెరిగాయని పేర్కొంది. ర్యాన్‌బాక్సీ కంపెనీని కొనుగోలు చేసినందున ఆర్థిక ఫలితాల(పూర్తి సంవత్సరం, క్యూ4 కూడా)ను పోల్చడానికి లేదని కంపెనీ స్పష్టం చేసింది. మొత్తం అమ్మకాల్లో అమెరికా మార్కెట్ వాటా 50 శాతంగా ఉందని వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేర్ ఎన్ఎస్ఈలో 1 శాతం వృద్ధితో రూ.966 వద్ద ముగిసింది. -
సన్ ఫార్మాకు దైచీ గుడ్‌బై
* కంపెనీలో మొత్తం 9% వాటాల విక్రయం * డీల్ విలువ దాదాపు రూ. 20,420 కోట్లు న్యూఢిల్లీ: దాదాపు ఏడేళ్ల క్రితం జపాన్ ఫార్మా దిగ్గజం దైచీ శాంక్యో.. భారత మార్కెట్లో మొదలుపెట్టిన ప్రయాణం ఎట్టకేలకు ముగిసింది. సన్ ఫార్మాలో తనకున్న మొత్తం 9 శాతం వాటాలను విక్రయించే ప్రక్రియ పూర్తయినట్లు దైచీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2008లో ర్యాన్‌బాక్సీ ల్యాబరేటరీస్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుతో దైచీ శాంక్యో భారత మార్కెట్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రూ. 22,000 కోట్లు వెచ్చించి 21 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో ర్యాన్‌బాక్సీని సన్ ఫార్మాకి దాదాపు 4 బిలియన్ డాలర్లకు షేర్ల మార్పిడి పద్ధతిపై విక్రయించింది. సన్‌లో ర్యాన్‌బాక్సీ విలీనం గత నెలలో పూర్తయ్యింది. విలీన సమయానికి ర్యాన్‌బాక్సీలో దైచీకి 63.4 శాతం వాటాలు ఉన్నాయి. డీల్ ప్రకారం ర్యాన్‌బాక్సీ షేరు ఒక్కింటికి 0.8 సన్ ఫార్మా షేరు లభిస్తుంది. దీన్ని బట్టి దైచీ శాంక్యోకు సన్ ఫార్మాలో 9 శాతం మేర వాటాలు దక్కాయి. తాజాగా మంగళవారం సన్ ఫార్మాలో మొత్తం 21,49,69,058 షేర్ల విక్రయం పూర్తయినట్లు దైచీ శాంక్యో తెలిపింది. దైచీ ఈ ప్రకటన చేసే సమయానికి సన్ ఫార్మా షేరు ధర రూ. 950 స్థాయిలో కదలాడింది. దీని ప్రకారం షేర్ల విక్రయం డీల్ విలువ సుమారు రూ. 20,420 కోట్లుగా ఉండొచ్చని అంచనా. దైచీ శాంక్యో ప్రస్తుతం 50 పైగా దేశాల్లో ఉత్పత్తులు విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ర్యాన్‌బాక్సీ కొనుగోలుతో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద స్పెషాలిటీ జనరిక్ ఫార్మా దిగ్గజంగా సన్ ఫార్మా అవతరించింది. దేశీయంగా అత్యధిక మార్కెట్ వాటా దక్కించుకుంది. కుదుపుల ప్రయాణం..: ర్యాన్‌బాక్సీ కొనుగోలుతో భారీగా ఎదగొచ్చని భావించిన దైచీ శాంక్యోకు ఏడేళ్లూ కష్టకాలంగానే గడిచాయి. తయారీ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ర్యాన్‌బాక్సీకి హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న పౌంతా సాహిబ్, బాటామండీ ప్లాంట్లు, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ ప్లాంటు నుంచి ఔషధాలను 2008లో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నిషేధించింది. అదే ఏడాది పత్రాలను ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడిందంటూ అమెరికా న్యాయస్థానంలో కేసులూ నమోదయ్యాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా ర్యాన్‌బాక్సీ ఔషధాల నాణ్యత పరంగా సవాళ్లు ఎదురైనప్పటికీ దైచీ మాత్రం ముందుకు సాగింది. ర్యాన్‌బాక్సీతో కలిసి హైబ్రీడ్ మోడల్‌ను రూపొందించింది. దీని ప్రకారం ర్యాన్‌బాక్సీ సొంత బ్రాండ్ పేరిటే కాకుండా మాతృసంస్థ కోసం కూడా జనరిక్ ఔషధాల పరిశోధనలపై దృష్టి పెట్టింది. అటు కొత్త ఔషధాల పరిశోధన కార్యకలాపాలను దైచీ చేపట్టింది. సన్ షేర్లు డౌన్.. దైచీ శాంక్యో వైదొలిగిన ప్రకటనతో మంగళవారం సన్ ఫార్మా షేర్లు 11 శాతం క్షీణించాయి. బీఎస్ఈలో 8.86 శాతం తగ్గి రూ. 952 వద్ద,ఎన్ఎస్ఈలో 8.8 శాతం తగ్గి రూ. 952 వద్ద ముగిశాయి. ఈ పరిణామంతో సన్ ఫార్మా మార్కెట్ విలువ రూ. 23,453 కోట్లు హరించుకుపోయి రూ. 2,28,191 కోట్లకు తగ్గింది. -
సన్ ఫార్మాలో ర్యాన్‌బాక్సీ విలీనం పూర్తి
న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం సన్ ఫార్మాలో ర్యాన్‌బాక్సీ విలీనం పూర్తయ్యింది. ఇందుకు సంబంధించిన అనుమతులన్నీ రావడంతో విలీన ప్రక్రియ పూర్తయినట్లేనని సన్ ఫార్మా ఇండస్ట్రీస్ పేర్కొంది. ఆయా హైకోర్టుల నుంచి వచ్చిన అనుమతులను సంబంధిత రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు సమర్పించినట్లు వివరించింది. 2014 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లవుతుందని కంపెనీ తెలిపింది. గతేడాది ఏప్రిల్‌లో ర్యాన్‌బాక్సీని 4 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేస్తున్నట్లు సన్ ఫార్మా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సన్ ఫార్మా చేతికి జీఎస్కే ఓపియేట్స్ వ్యాపారం
న్యూఢిల్లీ: గ్లాక్సోస్మిత్లైన్కు చెందిన ఆస్ట్రేలియాలోని ఓపియేట్స్(మత్తుమందుల) వ్యాపారాన్ని సన్‌ఫార్మా కొనుగోలు చేసింది. ఓపియేట్స్ వ్యాపారంలో మరింత వృద్ధి సాధించే వ్యూహాంలో భాగంగా జీఎస్కే వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నామని సన్ ఫార్మా పేర్కొంది. ఎంతకు కొనుగోలు చేసిన వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. మధ్య స్థాయి నుంచి తీవ్రమైన నొప్పుల నివారణ ఔషధాలను జీఎస్కే ఓపియేట్స్ రూపొందిస్తుంది. నల్లమందు నుంచి ఉత్పన్నమయ్యే ముడి పదార్ధాల ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ డీల్‌లో భాగంగా లాట్రోబ్(టాస్మానియా), పోర్ట్ ఫెయిరీ(విక్టోరియా)ల్లోని ప్లాంట్లను, తయారైన ఔషధాల నిల్వలతో సహా జీఎస్కే కంపెనీ సన్‌ఫార్మాకు బదిలీ చేస్తుంది. ఈ రెండు ప్లాంట్లలోని ఉద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తామని సన్ ఫార్మా వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టుకల్లా ఈ డీల్ పూర్తవతుందని అంచనా. ఈ కొనుగోలు నేపథ్యంలో సన్ ఫార్మా షేర్ ఎన్ఎస్ఈలో 2 శాతం లాభంతో రూ.943 వద్ద ముగిసింది. -
ఆయన సంపద రూ 1.32 లక్షల కోట్లు
-
సన్, ర్యాన్‌బాక్సీ విలీనానికి షరతులతో ఓకే
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ దిగ్గజాలు సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీల మధ్య విలీనానికి ఎట్టకేలకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 24,000 కోట్లు) విలువైన ఈ విలీనానికి సీసీఐ కొన్ని షరతులు విధించింది. వీటి ప్రకారం కొన్ని రకాల ఉత్పత్తులను ఇతర సంస్థలకు విక్రయించడమేకాకుండా, పోటీ నివారణ వంటి అంశాలకు సంబంధించి ఒప్పందంలో మార్పులను సైతం చేపట్టవలసి ఉంటుంది. రెండు దిగ్గజాలు విలీనమైతే దేశీయంగా అతిపెద్ద ఫార్మా సంస్థ ఆవిర్భవించడంతోపాటు, ప్రపంచంలోనే ఐదో పెద్ద కంపెనీగా సన్-ర్యాన్‌బాక్సీ నిలుస్తుంది. వివాద పరిష్కారం ప్రకారం ‘టామ్సులోసిన్ప్లస్ టోల్టరోడిన్’ సంబంధిత మొత్తం ఉత్పత్తులను సన్ ఫార్మా ఇతర సంస్థలకు విక్రయించాల్సి ఉంటుంది. వీటిని ప్రస్తుతం టామ్లెట్ బ్రాండ్‌తో కంపెనీ మార్కెట్లో విక్రయిస్తోంది. ఇదే విధంగా ర్యాన్‌బాక్సీ కూడా లియుప్రోలిన్ సంబంధ ఉత్పత్తులన్నింటినీ ఇతర సంస్థకు అమ్మేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీటిని ఎలిగార్డ్ బ్రాండ్‌తో మార్కెట్లో విక్రయిస్తోంది. దీంతోపాటు ర్యాన్‌బాక్సీ టెర్లిబాక్స్, రోసువాస్ ఈజెడ్, ఒలానెక్స్ ఎఫ్, రేసిపర్ ఎల్, ట్రిలోవాన్స్లను సైతం విక్రయించాలి. వెరసి సన్ ఫార్మా ఒకటి, ర్యాన్‌బాక్సీ ఆరు చొప్పున ఉత్పత్తులను వొదులుకోవలసి ఉంటుంది. ఇందుకు ఆరు నెలల గడువును సీసీఐ విధించింది. తద్వారా మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతున్న పోటీ వాతావరణాన్ని కొనసాగించవచ్చునని సీసీఐ అభిప్రాయపడింది. -
మార్కెట్లో కొత్త రికార్డులు
అంతటా సానుకూల పరిణామాలతో దేశీ స్టాక్‌మార్కెట్లు రికార్డు పరుగులు కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 28,500 మార్కును, నిఫ్టీ 8,500 మార్కును అధిగమించాయి. ప్రస్తుత శీతాకాల సమావేశంలో మరిన్ని సంస్కరణలు ఉండొచ్చన్న ఆశలు ఒకవైపు.. చైనా, యూరప్‌లో అదనంగా ఆర్థిక సహాయక ప్యాకేజీలు రావొచ్చన్న అంచనాలు మరోవైపు ఇందుకు దోహదపడ్డాయి. చైనా అనూహ్యంగా వడ్డీ రేట్లను తగ్గించడం మరో కారణంగా నిల్చింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఆల్ టైం గరిష్టమైన 28,541.96 స్థాయిని, నిఫ్టీ 8,534.65 పాయింట్ల స్థాయిని తాకాయి. చివరికి 164.91 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 28,499.54 వద్ద, 52.80 పాయింట్ల లాభంతో నిఫ్టీ 8,530.15 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో 467 పాయింట్ల (1.66 శాతం) మేర పెరిగినట్లయింది. ‘డిజిన్వెస్ట్‌మెంట్’లో ఇన్వెస్ట్: ఎల్ఐసీ ఇదిలావుండగా... కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల్లో డిజిన్వెస్ట్‌మెంట్ (వాటాల విక్రయం) మొదలెట్టిన పక్షంలో తాము మరిన్ని షేర్లను కొనుగోలు చేస్తామని ఫిక్కీ నిర్వహించిన ఒక సదస్సులో ఎల్ఐసీ చైర్మన్ ఎస్కే రాయ్ తెలిపారు. ఐపీవో బాటలో 13 సంస్థలు న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడుతున్న నేపథ్యంలో దాదాపు డజను పైగా కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా వైజాగ్ స్టీల్, వీడియోకాన్ డీ2హెచ్ సహా 13 కంపెనీలు ప్రాస్పెక్టస్ ముసాయిదాను సెబీకి సమర్పించాయి. అటు ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్..ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్‌కి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇవన్నీ మే లో ఎన్నిక ఫలితాల అనంతరం సెబీకి పత్రాలు సమర్పించాయి. వీటిలో లావాసా కార్పొరేషన్, యాడ్‌ల్యాబ్స్, ఓర్టెల్ కమ్యూనికేషన్స్, మాంటెకార్లో ఫ్యాషన్స్ సంస్థల ఐపీఓలకు సెబీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
సన్ ఫార్మా లాభం 15 శాతం ప్లస్
న్యూఢిల్లీ: దేశీ ఫార్మా దిగ్గజం సన్ ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి రూ. 1,572 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 1,362 కోట్లతో పోలిస్తే ఇది 15% అధికం. ఇదే కాలానికి నికర అమ్మకాలు కూడా 13% పుంజుకుని రూ. 4,751 కోట్లకు చేరాయి. అంచనాలకు అనుగుణంగా గరిష్ట స్థాయిలో లాభదాయకతను సాధించగలిగినట్లు కంపెనీ ఎండీ దిలీప్ సంఘ్వి పేర్కొన్నారు. దేశీయంగా బ్రాండెడ్ జనరిక్స్ అమ్మకాలు 21% ఎగసి రూ. 1,152 కోట్లను తాకగా, యూఎస్‌లో ఫినిష్డ్ డోసేజ్ విక్రయాలు 15% పెరిగి 48.1 కోట్ల డాలర్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది. ఇందుకు టారో పనితీరు దోహదపడినట్లు వెల్లడించింది. కాగా, పరిశోధన, అభివృద్ధి విభాగంపై దాదాపు 7% అధికంగా రూ. 312 కోట్లను వెచ్చించినట్లు వివరించింది. సమీక్షా కాలంలో మెర్క్‌అండ్ కంపెనీతో టిల్డ్రాకిజుమాబ్ ఔషధానికి సంబంధించి ప్రపంచవ్యాప్త ప్రత్యేక లెసైన్సింగ్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
నెల రోజుల గరిష్టం
128 పాయింట్లు ప్లస్ 26,881కు చేరిన సెన్సెక్స్ మళ్లీ 8,000 దాటిన నిఫ్టీ చివర్లో పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్లు నష్టాల నుంచి బయటపడి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 128 పాయింట్లు పుంజుకుని 26,881 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ సైతం 36 పాయింట్లు లాభపడి 8,028 వద్ద నిలిచింది. తద్వారా మళ్లీ 8,000 మైలురాయికి ఎగువన ముగిసింది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 5.6%కు చేరుతుందన్న ప్రపంచ బ్యాంకు అంచనాలు, ఆసియా, యూరప్ మార్కెట్ల లాభాలు దేశీయంగా సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయని విశ్లేషకులు తెలి పారు. ఇదికాకుండా అక్టోబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు నేపథ్యంలో జరిగిన షార్ట్ కవరింగ్ కూడా మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు పేర్కొన్నారు. సన్ ఫార్మా జోష్ సెన్సెక్స్ దిగ్గజాలలో సన్ ఫార్మా 4.3% పుంజుకోగా, సిప్లా, టాటా పవర్, ఎస్బీఐ, గెయిల్, ఐసీఐసీఐ 3-2% మధ్య పురోగమించాయి. అయితే మరోవైపు హీరోమోటో, భారతీ, హెచ్‌యూఎల్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, మారుతీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ 1.5-0.5% మధ్య నష్టపోయాయి. -
రూ.100 లక్షల కోట్లకు చేరువలో మార్కెట్ విలువ
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ సూచీలు కొత్త రికార్డులతో దూసుకెళుతున్న నేపథ్యంలో మార్కెట్ విలువసైతం భారీగా పుంజుకుంటోంది. వెరసి బీఎస్ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ. 100 లక్షల కోట్లకు చేరువైంది. ప్రస్తుతం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 96,25,517 కోట్లను తాకింది. మరో రూ. 3.74 లక్షల కోట్లు జమ అయితే రూ. 100 లక్షల కోట్ల మైలురాయిని చేరుతుంది. గత శుక్రవారానికి ఈ విలువ డాలర్ల రూపేణా 1.58 ట్రిలియన్లకు చేరింది. కాగా, ఈ ఏడాది జూన్‌లో మార్కెట్ విలువ మళ్లీ 1.5 ట్రిలి యన్ డాలర్లను తాకగా, తొలిసారి 2007లో ట్రిలియన్ డాలర్ల క్లబ్లో భారత్ మార్కెట్ చేరింది. అయితే మార్కెట్ల పతనంతో 2008 సెప్టెంబర్‌లో మార్కెట్ విలువ పడిపోగా, తిరిగి 2009 మేలో ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. ఈ బాటలో 2013 ఆగస్ట్‌లో మరోసారి మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్ల దిగువకు పడినప్పటికీ 2014లో తిరిగి ప్రాభవాన్ని పొందింది. సాఫ్ట్వేర్ దిగ్గజం టీసీఎస్ రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను అధిగమించి రికార్డు సృష్టించింది. -
జపాన్ వైపు ఫార్మా చూపు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఫార్మాస్యూటికల్ మార్కెట్ జపాన్‌ది. వార్షిక మార్కెట్ పరిమాణం 65 బిలియన్ డాలర్లు( రూ.3, 90,000 కోట్లు).ఇందులో జనరిక్స్ ఔషధాల వాటా కేవలం 6.6 శాతం. ఈ అవకాశమే రాష్ట్రానికి చెందిన ప్రధాన ఔషధ కంపెనీలయిన డాక్టర్ రెడ్డీస్, సువెన్, మైలాన్, అరబిందో ఫార్మా లాంటి సంస్థలను జపాన్ మార్కెట్ ఆకర్షిస్తోంది. జపాన్ జనరిక్స్ మార్కెట్లో పాగా వేసేందుకు డాక్టర్ రెడ్డీస్ రెండేళ్ల క్రితం ఫ్యూజీఫిల్మ్స్ సంస్థతో ఒక జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో ఆ భాగస్వామ్యం విజయవంతం కాలేదు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన అనంతంరం జనరిక్స్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రధాన ఫార్మా కంపెనీలుప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ‘మేం ఇప్పటికీ జపాన్ మార్కెట్లో ప్రవేశించేందుకు ఆసక్తితోనే ఉన్నాం. దీనికి సంబంధించిన అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం..సరైన ప్రణాళికతో జపాన్ మార్కెట్లో ప్రవేశించాలన్నదే మా ప్రాధాన్యత. ప్రస్తుతం మా ముందున్న ఆప్షన్లు మూడు...ఒకటి.. మంచి పార్ట్నర్ను వెతకటం. రెండు..ఏదైనా ఓ కంపెనీని కొనుగోలు చేయటం.. ఇక చివరిగా మేమే స్వంతంగా ఆ మార్కెట్లో ప్రవేశించటం (ఆర్గానిక్ వృద్ధి). మేం ఈ మూడు ఆప్షన్లను పరిశీలిస్తున్నాం. అయితే ఇంతవరకూ ఏ ఒక్క మార్గాన్ని ఎంచుకోలేదు’ అని డాక్టర్ రెడ్డీస్ సంస్థ సాక్షి ప్రతినిధికి ఈ మెయిల్ ద్వారా తెలిపింది. జపాన్ ఆకర్షణ ఇదీ..: జపాన్ ఆరోగ్య శాఖ 2002 జూన్‌లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం అన్ని హాస్పిటల్స్ జనరిక్స్ ఔషధాలనే వినియోగించాలి. ప్రభుత్వం చేపట్టిన డయాగ్నాస్టిక్ ప్రొసీజర్ కాంబినేషన్ ప్రోగ్రాం ద్వారా హాస్పిటల్స్ వినియోగదారులకు అందించే ఆరోగ్య సేవలకు విడివిడిగా కాకుండా ఒకే స్థిరమైన ఛార్జీలను చెల్లించేలా పథకాన్ని రూపొం దించింది. నోవార్టిస్, గ్లాక్సోస్మిత్‌క్లైన్, నోవో నోర్డిస్క్, ఐసాయి, నిప్పో, టకేడా లాంటి సంస్థల ఔషధాలు గత రెండు సంవత్సరాల కాలంలో పేటెంట్స్ కోల్పోవడంతో జనరిక్స్ మార్కెట్లో విదేశీ కంపెనీలకు అవకాశాలు లభించినట్లయింది. జీవన ప్రమాణాలు పెరగటంతో అదే నిష్పత్తిలో వృద్ధుల జనాభా పెరగటం కూడా హెల్త్‌కేర్ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. బల్క్ డ్రగ్స్‌కూ పెద్ద మార్కెట్టే.. బల్క్‌డ్రగ్స్ వినియోగంలో జపాన్ పెద్ద మార్కెట్టేనని విర్చో లేబరేటరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. విర్చో సంస్థ గత 15 సంవత్సరాలుగా బల్క్‌డ్రగ్స్‌ను జపాన్‌కు ఎగుమతి చేస్తోందన్నారు. అయితే మిగతా దేశాలకన్నా జపాన్‌తో వ్యాపారం చేయటం అంత ఆశామాషీ కాదన్నారు.నాణ్యత విషయంలో ఎంతో జాగరూకత అవసరమన్నారు. బల్క్‌డ్రగ్ కేంద్రంగా దేశవ్యాప్త గుర్తింపు పొందిన హైదరాబాద్ సంస్థలు జపాన్ మార్కెట్‌పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఎదురయ్యే సవాళ్లు.. జపాన్ సంపన్న దేశం కావటంతో వినియోగదారులు నాణ్యమైన ఔషధాలనే కోరుతున్నారు. ధర కన్నా నాణ్యతకు అక్కడ పెద్ద పీట వేస్తున్నారు. కొత్తగా మార్కెట్లో ప్రవేశించే బ్రాండ్లకు అంత త్వరగా ఆకర్శితులు కారన్నది పలు సంస్థల అనుభవం. మరీ ముఖ్యంగా చైనా, ఇండియా ఉత్పత్తులంటే వారికి నాణ్యమైనవి కావన్న అభిప్రాయం నాటుకుపోవడం కూడా మన దేశ కంపెనీలకు మైనస్ పాయింటే అని ఇండో-జపనీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి అతుల్ సక్సేనా తెలిపారు. -
సన్-ర్యాన్‌బాక్సీ విలీనంపై రచ్చబండ
న్యూఢిల్లీ: సన్ ఫార్మాలో ర్యాన్‌బాక్సీ ల్యాబ్స్ విలీనంపై వ్యాఖ్యలు పంపించాల్సిందిగా సాధారణ పౌరులతో సహా స్టేక్‌హోల్డర్లందరినీ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) గురువారం కోరింది. దాదాపు 400 కోట్ల డాలర్ల విలువైన ఈ విలీనంపై 15 రోజుల్లోగా కామెంట్లు పంపించాలని సూచించింది. రెండు కంపెనీల విలీనంవల్ల సంబంధిత వ్యక్తి/ సంస్థపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉంటుందో ఆధార పత్రాలతో పంపాలని పేర్కొంది. తగిన రుజువుల్లేని అభ్యంతరాలను పట్టించుకోబోమని స్పష్టం చేసింది. ఓ విలీన ఒప్పందంపై ప్రజల వ్యాఖ్యలను సీసీఐ కోరడం ఇదే ప్రథమం. మార్కెట్లో పోటీపై ఈ విలీనం ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రాథమికంగా అభిప్రాయానికి వచ్చిన అనంతరం ప్రజల వ్యాఖ్యలను సీసీఐ కోరింది. సన్‌ఫార్మా - ర్యాన్‌బాక్సీ విలీనం సంబంధిత మార్కెట్లో పోటీపై గణనీయ ప్రతికూల ప్రభావం చూపుతుందా అనే అంశంపై ప్రజలను సంప్రదించే ప్రక్రియను ప్రారంభించినట్లు సీసీఐ తెలిపింది. మాలిక్యూల్స్‌కు సంబంధించిన అంశాలే ఈ ఉదంతంలో ప్రధానమైనవని సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా ఇటీవలే పేర్కొన్నారు. విలీనం కారణంగా మార్కెట్లో అవాంఛనీయ పోటీ ఏర్పడుతుందా అనేది ముఖ్యమైన అంశమని చెప్పారు. విలీనం ఆచరణలోకి వస్తే ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద స్పెషాలిటీ జెనెరిక్స్ కంపెనీ ఆవిర్భవిస్తుంది. ఇండియాలో అతిపెద్ద ఫార్మా కంపెనీ ఏర్పడుతుంది. ఈ కంపెనీకి 65 దేశాల్లో కార్యకలాపాలు ఉంటాయి. ఐదు ఖండాల్లో 47 ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయి. విలీన ప్రతిపాదనకు సంబంధించిన వివరాలను నిర్ణీత ఫార్మాట్లో ప్రజల ముందుంచాలని సీసీఐ గత నెల 27న ఆదేశించింది. ఫార్మా రంగంలో ప్రవేశానికి పెద్దగా అవరోధాలు లేకపోవడంతో పెద్ద సంఖ్యలో కంపెనీలు విభిన్న ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. ఈ రంగంలో 20 వేలకుపైగా రిజిస్టర్డ్ యూనిట్లున్నాయి. వీటిలో 250 ప్రముఖ కంపెనీలకు కలిపి ఔషధ మార్కెట్లో 70 శాతం వాటా ఉంది. విలీనం తర్వాత దేశీయ మార్కెట్లో తమ వాటా దాదాపు 9.2 శాతానికి చేరుతుందని సన్‌ఫార్మా, ర్యాన్‌బాక్సీ కంపెనీలు సీసీఐకి తెలిపాయి. ఇందులో ర్యాన్‌బాక్సీ వాటా 3.87 శాతం కాగా సన్‌ఫార్మా వాటా 5.33 శాతంగా ఉంది. విలీనం పూర్వాపరాలు... సమస్యల్లో ఉన్న ప్రత్యర్థి కంపెనీ ర్యాన్‌బాక్సీని చేజిక్కించుకుంటున్నట్లు సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ గత ఏప్రిల్‌లో ప్రకటించింది. ఒప్పందం విలువ 400 కోట్ల డాలర్లనీ, 80 కోట్ల డాలర్ల బకాయి కూడా ఇందులో ఉందనీ వెల్లడించింది. 2013లో ర్యాన్‌బాక్సీ ఆదాయం 180 కోట్ల డాలర్లతో పోలిస్తే ఒప్పందం విలువ 2.2 రెట్లు అధికం. ఆ లెక్కన ఒక్కో ర్యాన్‌బాక్సీ షేరు ధర రూ.457 అవుతుంది. ఈ రెండు కంపెనీల ఈక్విటీలు ట్రేడయ్యే బీఎస్ఈ, ఎన్ఎస్ఈల నుంచి ఈ ఒప్పందానికి నిరభ్యంతర పత్రం లభించింది. ఈ ఒప్పందానికి తదుపరి అనుమతిని హైకోర్టు నుంచి పొందాల్సి ఉంది. -
సృజనాత్మక సంస్థల్లో హెచ్‌యూఎల్, టీసీఎస్
న్యూయార్క్: అభివృద్ధికి వినూత్న ఆలోచనలు సృష్టించేవిగా ఇన్వెస్టర్లు భావిస్తున్న ప్రపంచంలోని 100 అత్యంత సృజనాత్మక కంపెనీలతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో ఐదు భారతీయ కంపెనీలకు చోటు దక్కింది. హిందుస్థాన్ యూనిలీవర్ 14, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 57వ ర్యాంకుల్లో నిలిచాయి. లార్సెన్ అండ్ టూబ్రో 58, సన్ ఫార్మా ఇండస్ట్రీస్ 65, బజాజ్ ఆటో 96వ స్థానాల్లో ఉన్నాయి. కాలిఫోర్నియా కేంద్రంగా గల క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ వరుసగా నాలుగో ఏడాదీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఓ కంపెనీ భవిష్యత్తులో ఎలాంటి వినూత్న ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తెస్తుంది, ఆ కంపెనీ ప్రస్తుత వ్యాపార విలువ కంటే మున్ముందు ఎంత అధిక ఆదాయాన్ని ఆర్జిస్తుందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారనే అంశాల ఆధారంగా ఇన్నోవేషన్ ప్రీమియంను లెక్కించామని ఫోర్బ్స్ తెలిపింది. హిందుస్థాన్ యూనిలీవర్‌కు 54.7 శాతం, ఐటీ దిగ్గజం టీసీఎస్‌కు 39.58 శాతం, లార్సెన్ అండ్ టూబ్రోకు 39.4 శాతం ఇన్నోవేషన్ ప్రీమియం వచ్చిందని పేర్కొంది. సన్ ఫార్మాకు 38.34 శాతం, బజాజ్ ఆటోకు 31.73 శాతం ఇన్నోవేషన్ ప్రీమియం వచ్చిందని వివరించింది. ఫోర్బ్స్ జాబితాలో చోటు లభించిన వాటిలో 41 కంపెనీలు అమెరికాకు చెందినవి కాగా మరో 29 కంపెనీలు యూరప్‌నకు చెందినవి. -
చిన్న షేర్లు విలవిల
ఇటీవల నెమ్మదించిన చిన్న, మధ్యతరహా షేర్లలో బుధవారం ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.7% పతనంకాగా, స్మాల్ క్యాప్ మరింత అధికంగా 2.5% జారింది. వెరసి ట్రేడైన షేర్లలో ఏకంగా 2049 నష్టపోగా, కేవలం 871 బలపడ్డాయి. మరోవైపు రోజంతా లాభనష్టాల మధ్య కదిలిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 38 పాయింట్లు లాభపడి 25,919 వద్ద ముగియగా, 13 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 7,740 వద్ద స్థిరపడింది. ఇది 2 వారాల గరిష్టం. ప్రధానంగా ఎఫ్ఎంసీజీ రంగం 2.2% పుంజుకోవడం మార్కెట్లకు అండగా నిలిచింది. దిగ్గజాలు ఐటీసీ, హెచ్‌యూఎల్ 2.5% స్థాయిలో జంప్‌చేయగా, హెచ్డీఎఫ్సీ, సన్ ఫార్మా 2% లాభపడటం ద్వారా మద్దతు అందించాయి. బ్లూచిప్స్ డీలా, రియల్టీ బోర్లా సెన్సెక్స్ దిగ్గజాలలో బీహెచ్ఈఎల్ 6.5% పతనమైంది. క్యూ1 ఫలితాలు నిరుత్సాహపరచడం ఇందుకు కారణమైంది. ఈ బాటలో కోల్ ఇండియా, హిందాల్కో, టాటా పవర్, ఎస్బీఐ, ఎల్అండ్టీ, యాక్సిస్ 3-2% మధ్య నీరసించాయి. ఇక మరోవైపు అమ్మకాలు పెరగడంతో రియల్టీ ఇండెక్స్ సైతం 5%పైగా తిరోగమించింది. యూనిటెక్ 17% కుప్పకూలగా, ఇండియాబుల్స్, అనంత్‌రాజ్, హెచ్‌డీఐఎల్, డీబీ, డీఎల్ఎఫ్ 8-4% మధ్య దిగజారాయి. -
సన్ ఫార్మా,రాన్బాక్సీల విలీనానికి ఓకే
-
మూడో రోజూ నష్టాలే
96 పాయింట్ల క్షీణత 25,105కు చేరిన సెన్సెక్స్ రుతుపవనాల ఆలస్యం, ఇరాక్ అంతర్యుద్ధ సంక్షోభం కలగలసి దేశీయంగా సెంటిమెంట్‌ను బలహీనపరచాయి. దీంతో వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్లు నీరసించాయి. సెన్సెక్స్ 96 పాయింట్లు క్షీణించి 25,105 వద్ద నిలవగా, 29 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ 7,511 వద్ద ముగిసింది. ఇది రెండు వారాల కనిష్టంకాగా, ఇంతక్రితం జూన్ 5న మాత్రమే సెన్సెక్స్ ఈ స్థాయిలో 25,019 వద్ద ముగిసింది. వెరసి సెన్సెక్స్ మూడు రోజుల్లో 416 పాయింట్లు కోల్పోయింది. కాగా, సెన్సెక్స్ రోజు మొత్తం పలుమార్లు హెచ్చుతగ్గులకు లోనైంది. గరిష్టంగా 25,276, కనిష్టంగా 25,056 పాయింట్ల మధ్య కదిలింది. ప్రధానంగా హెల్త్‌కేర్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ రంగాలు దాదాపు 1% నష్టపోగా, వినియోగ వస్తు సూచీ 3.5% ఎగసింది. గురువారం రూ. 420 కోట్లకుపైగా విలువైన షేర్లను విక్రయించిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 221 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. వర్షాభావంపై భయాలు మార్కెట్‌పై ఉన్నాయి. 26 నుంచి అంజనీ సిమెంట్ ఓపెన్ ఆఫర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంజనీ పోర్ట్లాండ్ సిమెంట్‌లో మెజార్టీ వాటాను కొనుగోలు చేసిన తమిళనాడుకు చెందిన చెట్టినాడ్ సిమెంట్స్ గరిష్టంగా 26 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.10 ముఖ విలువ కలిగిన షేరును రూ.61.75 ధర చెల్లించి గరిష్టంగా 47.81 లక్షల షేర్లను (26 శాతం) కొనడానికి ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. జూన్ 26న ప్రారంభమయ్యే ఈ ఓపన్ ఆఫర్ జూలై 9తో ముగుస్తుంది. రెండు నెలల క్రితం చెట్టినాడ్ సిమెంట్, అంజనీ సిమెంట్ ప్రమోటర్ అయిన కె.వి.విష్ణు రాజు నుంచి 20.58 శాతం వాటను కోనడంతో చెట్టినాడ్ వాటా 41.16 శాతానికి చేరింది. దీంతో చెట్టినాడ్ సిమెంట్ ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. శుక్రవారం అంజనీ సిమెంట్ షేరు రూ. 59.70 వద్ద ముగిసింది. -
ఆదుకున్న ఐటీ
రోజంతా ఒడిదుడుకులు చివరికి స్వల్ప లాభాలు ఒక దశలో 25,711కు సెన్సెక్స్ 25,584 వద్ద ముగింపు తొలుత లాభాలతో మొదలైన మార్కెట్లు ఆపై అధిక భాగం నష్టాలకు లోనయ్యాయి. చివర్లో తిరిగి కోలుకుని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం సెషన్లో 25,711 పాయింట్ల వద్ద కొత్త చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ మిడ్ సెషన్లో అమ్మకాలు పెరగడంతో కనిష్టంగా 25,347కు చేరింది. ఈ స్థాయి నుంచి 236 పాయింట్లు కోలుకుంది. వెరసి 3 పాయింట్ల లాభంతో 25,584 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ెహ చ్చుతగ్గులను చవిచూసి చివరికి 2 పాయింట్లు పెరిగి 7,656 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, మార్కెట్లను 2% స్థాయిలో పుంజుకున్న ఐటీ, హెల్త్‌కేర్ రంగాలు ఆదుకున్నాయి. మరోవైపు రియల్టీ ఇండెక్స్ 3% పతనమైంది. ఎఫ్ఐఐల పెట్టుబడులు సోమవారం రూ. 537 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 682 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 1,215 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. సెన్సెక్స్‌లో ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 3-2% మధ్య పుంజుకోగా, హెల్త్‌కేర్ షేర్లు సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 3-1% చొప్పున లాభపడ్డాయి. అయితే మరోవైపు భెల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హీరోమోటో, సెసాస్టెరిలైట్ 2.5% స్థాయిలో డీలాపడగా, యాక్సిస్, ఎస్బీఐ, ఎన్టీపీసీ 1.5% చొప్పున నష్టపోయాయి. ఇక రియల్టీ షేర్లు శోభా, ఇండియాబుల్స్, ఒబెరాయ్, డీఎల్ఎఫ్, యూనిటెక్ 6-3% మధ్య నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,834 లాభపడగా, 1,272 నష్టపోయాయి. -
సన్, ర్యాన్‌బాక్సీల విలీనానికి తొలగిన అడ్డంకులు
సాక్షి, హైదరాబాద్: సన్‌ఫార్మా, ర్యాన్‌బాక్సీల విలీనానికి అడ్డంకులు తొలగిపోయాయి. ర్యాన్‌బాక్సీలో సన్‌ఫార్మా విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు శనివారం ఎత్తివేసింది. అంతేకాక విలీన ప్రక్రియకు సంబంధించి సన్‌ఫార్మా అనుబంధ కంపెనీ సిల్వర్ స్ట్రీట్ భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందన్న పిటిషనర్ల ఆరోపణలపై చేస్తున్న విచారణను చట్ట ప్రకారం పూర్తిస్థాయిలో చేపట్టాలని సెబీని ఆదేశించింది. న్యాయమూర్తి గుండా చంద్రయ్య శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విలీన ప్రకటనకు ముందే సిల్వర్ స్ట్రీట్ భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, ఈ మొత్తం వ్యవహారంపై సెబీ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై ర్యాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి హైకోర్టు నివేదించి, రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై నిర్ణయం వెలువరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం జస్టిస్ గుండా చంద్రయ్య ఇరుపక్షాల తరఫున సుదీర్ఘ వాదనలు విని నిర్ణయాన్ని శనివారం వెలువరిస్తానని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఆయన శనివారం ఉత్తర్వులు జారీ చేస్తూ, విలీన ప్రక్రియపై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కె.రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుంటూ, ఇన్సైడర్ ట్రేడింగ్‌పైనే తమ ప్రధాన అభ్యంతరమని, దానిపై సెబీ విచారణ జరుపుతున్నందున, దానిని రికార్డ్ చేసి ఈ వ్యాజ్యాలను పరిష్కరించాలని కోరారు. నిర్ణీత వ్యవధిలోపు విచారణ పూర్తి చేసేలా సెబీని ఆదేశించాలని అభ్యర్థించారు. దీనిపై సెబీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణను నిర్దిష్ట కాల వ్యవధిలోపు పూర్తి చేయడం సాధ్యం కాదని తెలిపారు. దీంతో న్యాయమూర్తి, ఇన్సైడర్ ట్రేడింగ్‌పై చట్ట ప్రకారం పూర్తిస్థాయిలో విచారణ జరపాలని సెబీని ఆదేశిస్తూ, ఈ వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సన్‌ఫార్మా, రాన్‌బాక్సీ విలీనంపై స్టే ఎత్తివేత
హైదరాబాద్ : ఔషధ రంగంలో దిగ్గజాలైన సన్‌ఫార్మా, రాన్బాక్సీల విలీన ప్రక్రియపై హైకోర్టు శనివారం స్టే ఎత్తివేసింది. సుప్రీంకోర్టు సూచనతో హైకోర్టు తక్షణ చర్య తీసుకుంది. రాన్‌బాక్సీలో సన్‌ఫార్మా విలీన ప్రకటనకు ముందే సన్‌ఫార్మాకు చెందిన అనుబంధ సంస్థ భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, ఈ మొత్తం వ్యవహారంపై సెబీ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు వాటాదారులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దాంతో విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి హైకోర్టు నివేదించి, రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై నిర్ణయం వెలువరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల నేపథ్యంలో జస్టిస్ గుండా చంద్రయ్య స్టే ఎత్తివేస్తూ నిర్ణయాన్ని వెల్లడించారు. -
సన్ ఫార్మా, ర్యాన్‌బాక్సీ విలీనంపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఔషధ రంగంలో దిగ్గజాలైన సన్‌ఫార్మా, రాన్బాక్సీల విలీన ప్రక్రియపై హైకోర్టు శనివారం తన నిర్ణయాన్ని వెలువరించనున్నది. తమ విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపధ్యంలో శనివారం ఇచ్చే ఉత్తర్వులపై సర్వత్రా ముఖ్యంగా వ్యాపార వర్గాల్లో ఆసక్తి నెలకొని ఉంది. రాన్‌బాక్సీలో సన్‌ఫార్మా విలీన ప్రకటనకు ముందే సన్‌ఫార్మాకు చెందిన అనుబంధ సంస్థ భారీ ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిందని, ఈ మొత్తం వ్యవహారంపై సెబీ విచారణకు ఆదేశించాలంటూ ఇద్దరు వాటాదారులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు విలీన ప్రక్రియను నిలుపుదల చేస్తూ గత నెలలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై రాన్‌బాక్సీ, సన్‌ఫార్మాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి హైకోర్టు నివేదించి, రెండు రోజుల్లో ఈ వ్యవహారంపై నిర్ణయం వెలువరించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల నేపథ్యంలో శుక్రవారం జస్టిస్ గుండా చంద్రయ్య విచారణ జరిపారు. ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై తాము ఇప్పటికే దర్యాప్తు చేపట్టామని, తాము ఏమీ చేయడం లేదన్న పిటిషనర్ల ఆరోపణల్లో అర్ధం లేదని సెబీ తరఫు న్యాయవాది వై.సూర్యనారాయణ కోర్టుకు నివేదించారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సెబీ దర్యాప్తు సాగుతోందని, అందువల్ల మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని సన్‌ఫార్మా, రాన్‌బాక్సీ, దైచీ కంపెనీల తరఫు సీనియర్ న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు, విలీన ప్రక్రియకు సంబంధం లేదని, అందువల్ల విలీన ప్రక్రియను ఆమోదించాలని వారు కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంపై శనివారం తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని స్పష్టం చేశారు. -
చిన్న షేర్లకు డిమాండ్
స్టాక్ మార్కెట్ల జోరు కొసాగుతోంది. జీడీపీపై అంచనాలతో బుధవారం హైజంప్ చేసిన మార్కెట్లు గురువారం సైతం కొత్త రికార్డులను సాధించాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 22,792ను తాకగా, నిఫ్టీ గరిష్టంగా 6,819ను చేరింది. ఇవి చరిత్రాత్మక గరిష్ట స్థాయిలు కాగా, అమ్మకాల ఒత్తిడితో ఇండెక్స్‌లు చివర్లో డీలాపడ్డాయి. వెరసి సెన్సెక్స్ కేవలం 13 పాయింట్ల లాభంతో 22,715 వద్ద నిలవగా, నిఫ్టీ యథాతథంగా 6,796 వద్దే స్థిరపడింది. కాగా, ఇటీవల జోరుమీదున్న చిన్న షేర్లు ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో మరోసారి దూసుకెళ్లాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు మార్కెట్లను మించుతూ 0.6% బలపడగా, ట్రేడైన షేర్లలో 1,551 లాభపడ్డాయి. 1,251 షేర్లు తిరోగమించాయి. మోడీ ఎఫెక్ట్‌తో అదానీ ఎంటర్ప్రైజెస్ 22% జంప్‌చేయడం విశేషం! క్యాపిటల్ గూడ్స్, రియల్టీ ఓకే బీఎస్ఈలో పవర్ ఇండెక్స్ 2.5% పుంజుకోగా, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ 1.5% లాభపడ్డాయి. అయితే హెల్త్‌కేర్ అదే స్థాయిలో డీలాపడింది. పవర్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో రిలయన్స్ ఇన్ఫ్రా, భారత్ ఎలక్ట్రానిక్స్, పుంజ్‌లాయిడ్, క్రాంప్టన్ గ్రీవ్స్, జిందాల్ సా, టాటా పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ, భెల్, ఎన్టీపీసీ, పీటీసీ, సద్భావ్ ఇంజినీరింగ్ 9-2.5% మధ్య దూసుకెళ్లాయి. ఇక రియల్టీ షేర్లు హెచ్‌డీఐఎల్, యూనిటెక్, ఇండియాబుల్స్ 5.5-3% మధ్య బలపడ్డాయి. హెల్త్‌కేర్‌లో అరబిందో, స్ట్రైడ్స్, గ్లెన్‌మార్క్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, సన్ ఫార్మా 3.5-2% మధ్య నీర సించాయి. మిడ్ క్యాప్స్ జోష్ సెన్సెక్స్ దిగ్గజాలలో ఎస్బీఐ 2.5%, హెచ్‌యూఎల్ 1.5% చొప్పున లాభపడగా, ఇన్ఫోసిస్, ఐటీసీ, ఐసీఐసీఐ 1%పైగా నష్టపోయాయి. ఇక మిడ్ క్యాప్స్‌లో బీఈఎంఎల్, మహీంద్రా సీఐఈ, జిందాల్ స్టెయిన్లెస్, ఎస్ఆర్ఎఫ్, ఎస్సార్ ఆయిల్, ఎన్సీసీ, ఎడిల్వీజ్, శ్రేయీ ఇన్ఫ్రా, ఎస్సార్ పోర్ట్స్ 18-7% మధ్య ఎగశాయి. బుధవారం రూ. 1,044 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. 343 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. -
సన్-ర్యాన్‌బాక్సీ డీల్‌పై సెబీ దృష్టి
న్యూఢిల్లీ: ర్యాన్‌బాక్సీని చేజిక్కించుకోవడం కోసం సన్ ఫార్మా కుదుర్చుకున్న మెగా ఒప్పందంపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ దృష్టిసారిస్తోంది. ఈ డీల్ ప్రకటనకు ముందు ర్యాన్‌బాక్సీ షేర్ల ట్రేడింగ్‌లో తీవ్ర అవకతవకలు చేటుచేసుకున్నాయని.. ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారంటూ అనేక ఫిర్యాదులు సెబీకి అందడమే దీనికి కారణం. సుమారు 400 కోట్ల డాలర్ల(80 కోట్ల డాలర్ల రుణంతో కలిపి)కు ర్యాన్‌బాక్సీని కొనుగోలు చేస్తున్నట్లు సన్ ఫార్మా ఈ నెల 7న ప్రకటించడం తెలిసిందే. పూర్తిగా షేర్ల కేటాయింపు రూపంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే, గత వారంలో ర్యాన్‌బాక్సీ షేర్లలో అనూహ్య కదలికలు నమోదయ్యాయి. మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 మధ్య ర్యాన్‌బాక్సీ షేరు ధర బీఎస్ఈలో 26 శాతం ఎగబాకడం విశేషం. బుధవారం 4.9 శాతం ఎగసిన ఈ షేరు రూ.467 వద్ద ముగిసింది. డీల్ ప్రకటనకు ముందు ర్యాన్‌బాక్సీ షేరు కదలికలను గమనిస్తే.. ఇంట్రీడేలో భారీ పరిమాణంలో ట్రేడింగ్ జరిగినట్లు అవగతమవుతోందని.. ముందుగానే ఒప్పందం లీకయిఉండొచ్చన్న అనుమానాలను ఫిరాదుదారులు వ్యక్తం చేశారు. దీంతో స్టాక్ ఎక్స్ఛేంజీలు, క్లియరింగ్ సంస్థల నుంచి సెబీ ట్రేడింగ్ డేటాను సేకరించడం ప్రారంభించిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. సెబీకి ఫిర్యాదు చేసిన వారిలో స్టాక్ బ్రోకర్లతోపాటు ఇన్వెస్టర్ అసోసియేషన్లు, ఫండ్ సంస్థలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్స్ఛేంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా కూడా ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ర్యాన్‌బాక్సీ-సన్ డీల్ గురించి ఎక్స్ఛేంజీలకు ఆదివారం అర్ధరాత్రే సమాచారం అందిఉండొచ్చని, అధికారిక ప్రకటనకు ముందే సమాచారాన్ని అందుకున్న అనుమానిత సంస్థలపై సెబీ దృష్టిసారిస్తున్నట్లు కూడా ఆయా వర్గాలు చెబతున్నాయి. ఇన్సైడర్ ఆరోపణలు అవాస్తవం: సన్ ఫార్మా ర్యాన్‌బాక్సీతో డీల్ విషయంలో తమ పూర్తిస్థాయి అనుబంధ సంస్థ సిల్వర్‌స్ట్రీట్ డెవలపర్స్ ఎల్‌ఎల్‌పీపై వచ్చిన ఇన్సైడర్ ఆరోపణలను సన్ ఫార్మా ఖండించింది. సిల్వర్‌స్ట్రీట్ డెవలపర్స్‌కు గతేడాది సెప్టెంబర్ నాటికి ర్యాన్‌బాక్సీలో ఎలాంటి వాటా లేదు. అయితే, డిసెంబర్ చివరికల్లా 1.41 శాతం వాటాను ఈ సంస్థ కొనుగోలు చేసింది. ఈ ఏడాది మార్చి 31నాటికి ఈ వాటా 1.64 శాతానికి పెరిగింది. అయితే, ర్యాన్‌బాక్సీలో సిల్వర్‌స్ట్రీట్ షేర్ల కొనుగోలు అంశం ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన కిందికి రాదని సన్ ఫార్మా ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వీ బావమరిదైన సుధీర్ వి. వాలియా... సిల్వర్‌స్ట్రీట్ భాగస్వాముల్లో ఒకరంటూ వార్తల్లోకి రావడం విశేషం. దీన్ని కూడా సన్ ఫార్మా ఖండించింది. సన్ ఫార్మా షేరు ధర బుధవారం బీఎస్ఈలో 6.91 శాతం లాభపడి రూ.628 వద్ద ముగిసింది. ర్యాన్బాక్సీపై కొనసాగుతున్న ఈయూ ఆంక్షలు ర్యాన్‌బాక్సీకి చెందిన తోన్సా, దేవాస్ ప్లాంట్ల నుంచి ఔషధ ఉత్పత్తులను యూరప్‌కు ఎగమతి చేయకుండా విధించిన సస్పెన్షన్ కొనసాగుతుందని యూరోపియన్ నియంత్రణ సంస్థ ఈఎంఏ పేర్కొంది. ఈ ప్లాంట్లలో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించిదన్న ఆరోపణలతో ఈఎంఏ ఆంక్షలు విధించింది. దీనిపై దర్యాప్తు జరుగుతోందని, దేవాస్ ప్లాంట్‌లో అంతర్జాతీయ తనిఖీలు ఈ ఏడాది జూన్‌లో జరగనున్నట్లు ఈఎంఏ ప్రతినిధి వెల్లడించారు. కాగా, తోన్సా ప్లాంట్‌కు సంబంధించి తయారీ ప్రమాణాలపై ఇచ్చిన ధ్రువీకరణను భారతీయ అధికారులు వెనక్కితీసుకున్నట్లు కూడా చెప్పారు.అమెరికా నియంత్రణ సంస్థ యూఎస్ ఎఫ్‌డీఏ కూడా భారత్‌లో ర్యాన్‌బాక్సీకి చెందిన మొత్తం నాలుగు ప్లాంట్‌లో నాణ్యాతా ప్రమాణాలను పాటించడం లేదంటూ తమ దేశానికి జరిగే ఎగుమతులను నిషేధించడం తెలిసిందే. -
6,600 దాటేసింది!
విదేశీ సానుకూల సంకేతాలు, దేశీయంగా పుంజుకున్న సెంటిమెంట్ మార్కెట్లకు ఉత్సాహాన్నిస్తున్నాయి. దీనికి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) పెట్టుబడులు జత కలుస్తున్నాయి. వెరసి స్టాక్ ఇండెక్స్‌లు మరోసారి రికార్డులు నెలకొల్పాయి. ప్రధానంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,600 పాయింట్ల కీలక స్థాయిని అధిగమించడ ం బుధవారం ట్రేడింగ్‌లో విశేషం. 12 పాయింట్లు లాభపడి 6,601 వద్ద నిలిచింది. ఇక మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ కూడా 40 పాయింట్లు బలపడి 22,095 వద్ద ముగిసింది. ఇవి కొత్త రికార్డులు! గత రెండు రోజుల్లో రూ. 2,700 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా దాదాపు రూ. 1,005 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలు చేయడం ఇందుకు దోహదపడింది. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 356 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 22,172ను తాకగా, నిఫ్టీ 6,627ను చేరింది. ఇవి మార్కెట్ చరిత్రలోనే గరిష్ట స్థాయిలు! ఎఫ్‌అండ్‌వో ముగింపు నేపథ్యంలో జరిగిన షార్ట్ కవరింగ్ కూడా మార్కెట్ల దూకుడుకి సహకరిస్తున్నట్లు నిపుణులు తెలిపారు. మెటల్స్ జోరు గోవాలో మైనింగ్‌పై నిషేధం తొలగనుందన్న వార్తలతో బీఎస్ఈలో మెటల్ ఇండెక్స్ 3% ఎగసింది. సెయిల్, సెసాస్టెరిలైట్, హిందాల్కో, జిందాల్ స్టీల్, కోల్ ఇండియా, టాటా స్టీల్ 6-2% మధ్య పురోగమించాయి. ఈ బాటలో క్యాపిటల్ గూడ్స్, ఆయిల్ రంగాలు 1.5% స్థాయిలో పుంజుకోగా, హెల్త్‌కేర్ మాత్రం 2% నష్టపోయింది. గ్లెన్‌మార్క్, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, బయోకాన్, సన్ ఫార్మా, ఇప్కా ల్యాబ్, దివీస్ 4-2% మధ్య నీరసించాయి. ఇక మిగిలిన దిగ్గజాలలో టాటా మోటార్స్, ఎల్అండ్టీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ, ఓఎన్జీసీ, ఎస్బీఐ, గెయిల్, ఆర్ఐఎల్, బజాజ్ ఆటో, భారతీ 2.7-1.2% మధ్య బలపడగా, టీసీఎస్, ఎంఅండ్ఎం, ఐటీసీ 2-1% మధ్య డీలాపడ్డాయి. మార్కెట్లు లాభపడినప్పటికీ ట్రేడైన షేర్లలో 1,610 నష్టపోగా, 1,272 లాభపడ్డాయి. -
వారసత్వ షేర్ల దూకుడు
న్యూఢిల్లీ: తదుపరి తరం బిజినెస్ లీడర్లకు వారసత్వంగా లభించిన షేర్లు లాభాల దూకుడును ప్రద ర్శిస్తున్నాయి. ఈ జాబితాలో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రోలతోపాటు ఫార్మా దిగ్గజం సన్ తదితరాలున్నాయి. కుటుంబానికి చెందిన లేదా సంస్థలు, ట్రస్ట్‌ల చేతిలో ఉన్న షేర్లను పరిగణించకుండా చూస్తే... 40 ఏళ్లలోపు పిల్లలకు ప్రమోటర్ల నుంచి వారసత్వంగా అందిన షేర్ల విలువ 2013లో రూ. 14,000 కోట్లకు ఎగసింది. ఈ జాబితాలో ఇన్ఫోసిస్ అగ్రస్థానంలో ఉంది. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల పిల్లల వద్దనున్న సంయుక్త షేర్ల విలువ 50% జంప్‌చేసి రూ. 10,720 కోట్లకు చేరింది. దీనిలో నారాయణ మూర్తి సంతానం అక్షత, రోహన్ మూర్తిలకున్న వాటా విలువ రూ. 5,700 కోట్లను తాకగా, నందన్ నీలేకని సంతానం నిహార్, జాహ్నవిల వాటా విలువ రూ. 1,200 కోట్లకు చేరింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీలో నమోదైన గణాంకాల ప్రకారం ఇన్ఫోసిస్ సహప్రమోటర్ క్రిస్ గోపాలకృష్ణన్ కుమార్తె మేఘన వాటా రూ. 215 కోట్లకు, కె.దినేష్ కుమార్తెలు దివ్య, దీక్షల వాటా రూ. 980 కోట్లకు, ఎస్డీ శిబూలాల్ కుమార్తెలు శ్రుతి, శ్రేయాల వాటా రూ. 2,610 కోట్లకు ఎగసింది. ఈ బాటలో విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ కుమారులు రిషద్, తారిఖ్లకున్న షేర్ల విలువ సైతం 40% లాభపడింది. విప్రో ఐటీ బిజినెస్‌కు చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రిషద్కున్న 6.87 లక్షల షేర్ల విలువ రూ. 38 కోట్లను తాకగా, తారిఖ్ వాటా విలువ రూ. 15 కోట్లయ్యింది. ఇక సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీ కుమారుడు ఆలోక్ సంఘ్వీ, అతని సోదరి విధికున్న సంయుక్త వాటా విలువ 55% పుంజుకుని రూ. 330 కోట్లకు చేరింది. సన్ ఫార్మా అంతర్జాతీయ మార్కెటింగ్ టీమ్‌కు జనరల్ మేనేజర్‌గా ఆలోక్ పనిచేస్తున్నారు. గోద్రెజ్ వారసులూ ఉన్నారు... సిప్లా ప్రమోటర్ ఎంకే హమీద్ సంతానం కమిల్, సమీనాల వాటా నామమాత్ర వృద్ధినే సాధించింది. దీంతో సిప్లాలో వీరి వాటా విలువ 2012లో నమోదైన రూ. 850 కోట్ల స్థాయిలోనే ఉండిపోయింది. మరోవైపు ముకేశ్ అంబానీ సంతానం ఈషా, ఆకాశ్, అనంత్లకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) షేర్ల విలువ సైతం పెద్దగా మార్పులు లేకుండా రూ. 600 కోట్ల వద్దే నిలిచిపోవడం గమనార్హం. కాగా, అనిల్ అంబానీ సంతానమైన జైఅన్మోల్, జైఅన్శూల్కున్న అడాగ్ కంపెనీల వాటా విలువ రూ. 31 కోట్లుగా నమోదైంది. ఆర్‌కామ్ విలువ పుంజుకోగా, రిలయన్స్ క్యాప్, రిలయన్స్ ఇన్ఫ్రా షేర్ల ధరలు క్షీణించడమే దీనికి కారణం. ఇక గోద్రెజ్ వారసులు తన్య, పిరోషా, నిసబ, ఫిరోజ్లకున్న గోద్రెజ్ ఇండస్ట్రీస్‌లో 13% వాటా, గోద్రెజ్ క న్జూమర్లో 17% వాటాల విలువ రూ. 960 కోట్లకు చేరింది. ఇదే విధంగా ఓపీ జిందాల్ గ్రూప్‌లోని తదుపరితరం నాయకులు తరిణి, తన్వి, పార్థల వాటాల విలువ కాస్త తగ్గి రూ. 560 కోట్లకు పరిమితమైంది. వీరికి జేఎస్పీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీలలో వాటాలున్నాయి. ఇక ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా కుమారుడు అనంత్‌కు సియట్, కేఈసీ ఇంటర్నేషనల్‌లో ఉన్న వాటా విలువ కూడా పెద్దగా లాభపడింది లేదు. ఇందుకు సియట్ షేరు పుంజుకున్నప్పటికీ, కేఈసీ దిగజారడం కారణంగా నిలిచింది. అయితే వోకార్డ్ ప్రమోటర్ హబీల్ కోర్కీవాలా కుమారులు ముర్తజా, హోజిఫాలకున్న వోకార్డ్ షేర్ల విలువ 70% తరిగిపోయింది. వోకార్డ్ షేరు ఆ స్థాయిలో పతనంకావడం ప్రభావం చూపింది. -
చివర్లో రివ్వున పైకి
తొలుత లాభాలతో మొదలైన మార్కెట్లు మధ్యలో కొంతమేర వెనక్కు తగ్గినప్పటికీ చివర్లో మళ్లీ పుంజుకున్నాయి. వెరసి సెన్సెక్స్ చివరి అర్థగంటలో పెరిగిన కొనుగోళ్లతో 200 పాయింట్లు ఎగసి గరిష్టంగా 20,013ను తాకింది. ఆపై స్వల్పంగా వెనక్కుతగ్గి 158 పాయింట్ల లాభంతో 19,962 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 5,900ను అధిగమించింది. చివరికి 49 పాయింట్లు జమ చేసుకుని 5,899 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు 2-1.3% మధ్య బలపడ్డాయి. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సమావేశాలపై దృష్టిపెట్టిన ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు ట్రేడింగ్ పట్ల పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో మార్కెట్లు అక్కడక్కడే సంచరిస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అయితే యూరప్ మార్కెట్లు ప్రోత్సాహకరంగా ట్రేడవుతుండటంతో సెంటిమెంట్ సానుకూలంగా మారిందని తెలిపారు. 24 షేర్లు లాభాల్లోనే : సెన్సెక్స్-30లో 24 షేర్లు లాభాలతోనే ముగియగా, ఎన్టీపీసీ, టాటా పవర్ 3%పైగా పురోగమించాయి. మిగిలిన దిగ్గజాలలో ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, ఎల్అండ్టీ, మారుతీ, ఆర్ఐఎల్, ఐటీసీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.4-1.2% మధ్య లాభపడ్డాయి. మరోవైపు భెల్ దాదాపు 5% పతనంకాగా, హీరోమోటో 2.8%, సెసా గోవా 1.6% చొప్పున క్షీణించాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% బలపడగా, ట్రేడైన షేర్లలో 1,221 లాభపడ్డాయి. 1,112 నష్టపోయాయి.