సన్ ఫార్మా
న్యూఢిల్లీ: సన్ ఫార్మా నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో 75 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.1,472 కోట్లుగా ఉన్న నికర లాభం(కన్సాలిడేటెడ్) ఈ క్యూ3లో రూ.365 కోట్లకు తగ్గిందని సన్ ఫార్మా తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,925 కోట్ల నుంచి రూ.6,653 కోట్లకు తగ్గిందని సన్ ఫార్మా ఎమ్‌డీ, దిలీప్ సంఘ్వి చెప్పారు. రూ.513 కోట్ల వాయిదా పడిన వన్‌టైమ్ పన్ను సర్దుబాటు కారణంగా ఈ క్యూ3లో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని వివరించారు. నిర్వహణ లాభం 41 శాతం క్షీణించి రూ.1,453 కోట్లకు, మార్జిన్ 9 శాతం పతనమై 21.8 శాతానికి తగ్గాయని పేర్కొన్నారు.
భారత వ్యాపారం 6 శాతం వృద్ధి...
అమెరికా మార్కెట్లో అమ్మకాలు 35 శాతం తగ్గి 33 కోట్ల డాలర్లకు చేరాయని, ఇది మొత్తం అమ్మకాల్లో 32 శాతానికి సమానమని వివరించారు. అమెరికా మార్కెట్లో జనరిక్ ఔషధ ధరలపై ఒత్తిడి కొనసాగుతుండడమే అమ్మకాలు తగ్గడానికి కారణమని వివరించారు. అమెరికాలో జనరిక్ ఔషధాలకు సంబంధించి ధరల విషయంలో సమస్యాత్మక వాతావరణం నెలకొన్నదని వివరించారు. అయినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంతో పోల్చితే ఈ క్యూ3లో లాభదాయకత మెరుగుపడిందని పేర్కొన్నారు. భారత్‌లో బ్రాండెడ్ ఫార్ములేషన్స్ వ్యాపారం 6 శాతం వృద్ధితో రూ.2,085 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇతర వర్ధమాన దేశాల్లో అమ్మకాలు 10 శాతం వృద్ధితో 19 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సన్ ఫార్మా షేర్ 2.5 శాతం నష్టపోయి రూ.574 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment