న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు ఊహించని విధంగా ఫార్మా దిగ్గజం సన్‌ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.219 కోట్ల కన్సాలిడేటెడ్ నష్టాలను ప్రకటించింది. అమెరికాలో మోడఫినిల్ యాంటీ ట్రస్ట్ కేసు పరిష్కారం కోసం రూ.1,214 కోట్లను కేటాయించడంతో లాభా లు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ కేసులో ప్రత్యర్థి పార్టీలకు చెల్లించాల్సిన మొత్తాన్ని అంచనా వేసి ఈ మేరకు పక్కన పెట్టినట్లు కంపెనీ తెలియజేసింది. ఈ కేసులో కొన్ని పార్టీలతో ఇప్పటికే సన్‌ఫార్మా ఒప్పందం కూడా చేసుకుంది.
విశ్లేషకులు మాత్రం రూ.975 కోట్ల లాభాన్ని నమోదు చేయవచ్చన్న అంచనాతో ఉన్నారు. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ ఆర్జించిన లాభం రూ.912 కోట్లు. కన్సాలిడేటెడ్ ఆదాయం మాత్రం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.6,590 కోట్ల నుంచి రూ.6,846 కోట్లకు వృద్ధి చెందింది. ‘‘కంపెనీ వ్యాపార వాస్తవ ఆరోగ్య స్థితికి రెండో త్రైమాసికం ఫలితాలు నిదర్శనం కావు. మా ప్రధాన వ్యాపార కార్యకలాపాలను బలోపేతం చేయడంపై దృష్టి కొనసాగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో పనితీరు పట్ల సానుకూలంగానే ఉన్నాం. అమెరికాలో లుమ్యాను విడుదల చేయడం పట్ల సంతోషంగా ఉన్నాం’’ అని సన్‌ఫార్మా ఎండీ దిలీప్‌సంఘ్వి పేర్కొన్నారు.
దేశీయ అమ్మకాలు డౌన్
దేశీయంగా బ్రాండెడ్ ఫార్ములేషన్ల అమ్మకాల ద్వారా ఆదాయం 16 శాతం తగ్గి రూ.1,860 కోట్లుగా ఉంది. వర్ధమాన మార్కెట్లలో అమ్మకాలు రూ.1,416 కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఏ మాత్రం మార్పు లేదు. అమెరికా మార్కెట్లో అమ్మకాల ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.2,484 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం అమ్మకాల్లో అమెరికా వాటా 35 శాతంగా ఉండటం గమనార్హం.
అమెరికా, వర్ధమాన మార్కెట్లు మినహా మిగిలిన ప్రపంచ మార్కెట్లలో ఫార్ములేషన్ల అమ్మకాల ఆదాయం 2 శాతం వృద్ధి చెంది రూ.784 కోట్లుగా నమోదైంది. పరిశోధన, అభివృద్ధి వ్యయాలు రూ.452 కోట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.511 కోట్ల కంటే తగ్గాయి. బీఎస్‌ఈలో మంగళవారం సన్‌ఫార్మా షేరు 5 శాతం నష్టపోయి రూ.561.70కు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment