లాభాల స్వీకరణతో డౌన్
► 145 పాయింట్ల నష్టంతో
► 25,592 పాయంట్లకు సెన్సెక్స్
► 48 పాయింట్ల నష్టంతో 7,786కు నిఫ్టీ
అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించారు. దీంతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,800 పాయింట్ల దిగువకు పడిపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 145 పాయింట్లు నష్టపోయి 25,592 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 48 పాయింట్లు నష్టపోయి 7,786 పాయింట్ల వద్ద ముగిశాయి. క్రిస్మస్ సందర్బంగా ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కావడం, వచ్చే వారం డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు కావడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారని, ట్రేడింగ్ మందకొడిగా ఉందని నిపుణులంటున్నారు.
ఐటీ, లోహ, ఎఫ్‌ఎంసీజీ, వాహన షేర్లు నష్టపోయాయి. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముడి చమురు ధరల పతనం, పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య రగడ చెలరేగుతుండడం.. ఈ అంశాలన్నీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపించాయని నిపుణులు పేర్కొన్నారు. హెచ్1బీ, ఎల్1 వీసాలపై అమెరికా కాంగ్రెస్ స్పెషల్ ఫీజును విధించడంతో ఐటీ కంపెనీలు నష్టపోయాయి. కాల్ డ్రాప్స్ విషయమై వచ్చే నెల 6 వరకూ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోమని ట్రాయ్ వెల్లడించడంతో టెలికాం షేర్లు లాభపడ్డాయి.
నేడే లిస్టింగ్: అల్కెమ్ ల్యాబొరేటరీస్, డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ షేర్లు నేడు(బుధవారం) స్టాక్ బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్ట్ కానున్నాయి. ఇష్యూ ధరలు డాక్టర్ లాల్ పాథ్‌ల్యాబ్స్ రూ.550, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ రూ.1,350గా ఉన్నాయి. కాగామ్యాట్రీమోనిడాట్‌కామ్, క్విక్ హీల్ టెక్నాలజీస్ ఐపీఓలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఐపీఓల ద్వారా మ్యాట్రిమోనిడాట్‌కామ్ సంస్థ రూ.600-700 కోట్లు, క్విక్ హీల్ కంపెనీ రూ.250 కోట్లు సమీకరిస్తాయని అంచనా.