జపాన్ వైపు ఫార్మా చూపు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఫార్మాస్యూటికల్ మార్కెట్ జపాన్‌ది. వార్షిక మార్కెట్ పరిమాణం 65 బిలియన్ డాలర్లు( రూ.3, 90,000 కోట్లు).ఇందులో జనరిక్స్ ఔషధాల వాటా కేవలం 6.6 శాతం. ఈ అవకాశమే రాష్ట్రానికి చెందిన ప్రధాన ఔషధ కంపెనీలయిన డాక్టర్ రెడ్డీస్, సువెన్, మైలాన్, అరబిందో ఫార్మా లాంటి సంస్థలను జపాన్ మార్కెట్ ఆకర్షిస్తోంది.
జపాన్ జనరిక్స్ మార్కెట్లో పాగా వేసేందుకు డాక్టర్ రెడ్డీస్ రెండేళ్ల క్రితం ఫ్యూజీఫిల్మ్స్ సంస్థతో ఒక జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో ఆ భాగస్వామ్యం విజయవంతం కాలేదు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన అనంతంరం జనరిక్స్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రధాన ఫార్మా కంపెనీలుప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.
‘మేం ఇప్పటికీ జపాన్ మార్కెట్లో ప్రవేశించేందుకు ఆసక్తితోనే ఉన్నాం. దీనికి సంబంధించిన అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం..సరైన ప్రణాళికతో జపాన్ మార్కెట్లో ప్రవేశించాలన్నదే మా ప్రాధాన్యత. ప్రస్తుతం మా ముందున్న ఆప్షన్లు మూడు...ఒకటి.. మంచి పార్ట్‌నర్‌ను వెతకటం. రెండు..ఏదైనా ఓ కంపెనీని కొనుగోలు చేయటం.. ఇక చివరిగా మేమే స్వంతంగా ఆ మార్కెట్లో ప్రవేశించటం (ఆర్గానిక్ వృద్ధి). మేం ఈ మూడు ఆప్షన్లను పరిశీలిస్తున్నాం. అయితే ఇంతవరకూ ఏ ఒక్క మార్గాన్ని ఎంచుకోలేదు’ అని డాక్టర్ రెడ్డీస్ సంస్థ సాక్షి ప్రతినిధికి ఈ మెయిల్ ద్వారా తెలిపింది.
జపాన్ ఆకర్షణ ఇదీ..: జపాన్ ఆరోగ్య శాఖ 2002 జూన్‌లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం అన్ని హాస్పిటల్స్ జనరిక్స్ ఔషధాలనే వినియోగించాలి. ప్రభుత్వం చేపట్టిన డయాగ్నాస్టిక్ ప్రొసీజర్ కాంబినేషన్ ప్రోగ్రాం ద్వారా హాస్పిటల్స్ వినియోగదారులకు అందించే ఆరోగ్య సేవలకు విడివిడిగా కాకుండా ఒకే స్థిరమైన ఛార్జీలను చెల్లించేలా పథకాన్ని రూపొం దించింది. నోవార్టిస్, గ్లాక్సోస్మిత్‌క్లైన్, నోవో నోర్డిస్క్, ఐసాయి, నిప్పో, టకేడా లాంటి సంస్థల ఔషధాలు గత రెండు సంవత్సరాల కాలంలో పేటెంట్స్ కోల్పోవడంతో జనరిక్స్ మార్కెట్లో విదేశీ కంపెనీలకు అవకాశాలు లభించినట్లయింది. జీవన ప్రమాణాలు పెరగటంతో అదే నిష్పత్తిలో వృద్ధుల జనాభా పెరగటం కూడా హెల్త్‌కేర్ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం.
బల్క్ డ్రగ్స్‌కూ పెద్ద మార్కెట్టే..
బల్క్‌డ్రగ్స్ వినియోగంలో జపాన్ పెద్ద మార్కెట్టేనని విర్చో లేబరేటరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. విర్చో సంస్థ గత 15 సంవత్సరాలుగా బల్క్‌డ్రగ్స్‌ను జపాన్‌కు ఎగుమతి చేస్తోందన్నారు. అయితే మిగతా దేశాలకన్నా జపాన్‌తో వ్యాపారం చేయటం అంత ఆశామాషీ కాదన్నారు.నాణ్యత విషయంలో ఎంతో జాగరూకత అవసరమన్నారు. బల్క్‌డ్రగ్ కేంద్రంగా దేశవ్యాప్త గుర్తింపు పొందిన హైదరాబాద్ సంస్థలు జపాన్ మార్కెట్‌పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
ఎదురయ్యే సవాళ్లు..
జపాన్ సంపన్న దేశం కావటంతో వినియోగదారులు నాణ్యమైన ఔషధాలనే కోరుతున్నారు. ధర కన్నా నాణ్యతకు అక్కడ పెద్ద పీట వేస్తున్నారు. కొత్తగా మార్కెట్లో ప్రవేశించే బ్రాండ్లకు అంత త్వరగా ఆకర్శితులు కారన్నది పలు సంస్థల అనుభవం. మరీ ముఖ్యంగా చైనా, ఇండియా ఉత్పత్తులంటే వారికి నాణ్యమైనవి కావన్న అభిప్రాయం నాటుకుపోవడం కూడా మన దేశ కంపెనీలకు మైనస్ పాయింటే అని ఇండో-జపనీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి అతుల్ సక్సేనా తెలిపారు.