Motilal Oswal Securities
-
లంచం ఆరోపణలు.. మోతీలాల్ ఓస్వాల్ స్పందన
మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఎంఓఏఎంసీ) కళ్యాణ్ జ్యువెల్లర్స్లో పెట్టుబడులకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా లంచం ఆరోపణలు ఎదుర్కొంటుంది. వీటిపై కంపెనీ స్పందించింది. ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇవి నిరాధారమైనవని, దురుద్దేశపూరితమైనవని, పరువు నష్టం కలిగించేవిగా పేర్కొంది.ఆరోపణల నేపథ్యంకల్యాణ్ జ్యువెలర్స్‌లో గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి ఎంఓఏఎంసీ అధికారులు లంచం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పుకార్లు కళ్యాణ్ జ్యువెల్లర్స్ షేరు గణనీయంగా పతనం కావడానికి కారణమైంది. ఇది గత రెండు వారాల్లో సుమారు 37% క్షీణించింది. ఈ తరుణంలో కంపెనీ స్పందించింది.కంపెనీ స్పందన..ఈ ఆరోపణలను ఖండిస్తూ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. స్వార్థ ప్రయోజనాలున్న వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పింది. ఇటీవల వచ్చిన లంచం ఆరోపణలు కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేసింది. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. సమగ్రతకు, అత్యున్నత ప్రమాణాలు నిర్వహించడానికి కంపెనీ నిబద్ధతతో ఉంటుందని పేర్కొంది. ఈ నిరాధార ఆరోపణల వల్ల దశాబ్దాలుగా సంస్థ, నాయకత్వం నిర్మించుకున్న మంచి పేరును చెడగొట్టడానికి స్వార్థ ప్రయోజనాలు ఉన్న వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. విశ్వసనీయ, అధికారికంగా ధ్రువీకరించిన సమాచార వనరులపైనే ఆధారపడాలని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాటాదారులందరినీ కోరింది. కంపెనీ తన పెట్టుబడిదారులు, పంపిణీదారులు, వాటాదారులపరంగా అత్యున్నత స్థాయి ప్రమాణాలను అనుసరిస్తుందని తెలిపింది.ఇదీ చదవండి: టిక్‌టాక్ పునరుద్ధరణ.. ట్రంప్ పుణ్యమే..!స్టాక్ ధరలపై ప్రభావంమోతీలాల్ ఓస్వాల్ వివరణతో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ)లో కల్యాణ్ జ్యువెల్లర్స్ షేర్లు రికవరీ అయ్యాయి. లంచం ఆరోపణలను కంపెనీ ఖండించడంతో షేరు ధర 9 శాతానికి పైగా పెరిగింది. -
జపాన్ వైపు ఫార్మా చూపు..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఫార్మాస్యూటికల్ మార్కెట్ జపాన్‌ది. వార్షిక మార్కెట్ పరిమాణం 65 బిలియన్ డాలర్లు( రూ.3, 90,000 కోట్లు).ఇందులో జనరిక్స్ ఔషధాల వాటా కేవలం 6.6 శాతం. ఈ అవకాశమే రాష్ట్రానికి చెందిన ప్రధాన ఔషధ కంపెనీలయిన డాక్టర్ రెడ్డీస్, సువెన్, మైలాన్, అరబిందో ఫార్మా లాంటి సంస్థలను జపాన్ మార్కెట్ ఆకర్షిస్తోంది. జపాన్ జనరిక్స్ మార్కెట్లో పాగా వేసేందుకు డాక్టర్ రెడ్డీస్ రెండేళ్ల క్రితం ఫ్యూజీఫిల్మ్స్ సంస్థతో ఒక జాయింట్ వెంచర్ సంస్థను ఏర్పాటు చేసింది. వివిధ కారణాలతో ఆ భాగస్వామ్యం విజయవంతం కాలేదు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన అనంతంరం జనరిక్స్ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రధాన ఫార్మా కంపెనీలుప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. ‘మేం ఇప్పటికీ జపాన్ మార్కెట్లో ప్రవేశించేందుకు ఆసక్తితోనే ఉన్నాం. దీనికి సంబంధించిన అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం..సరైన ప్రణాళికతో జపాన్ మార్కెట్లో ప్రవేశించాలన్నదే మా ప్రాధాన్యత. ప్రస్తుతం మా ముందున్న ఆప్షన్లు మూడు...ఒకటి.. మంచి పార్ట్నర్ను వెతకటం. రెండు..ఏదైనా ఓ కంపెనీని కొనుగోలు చేయటం.. ఇక చివరిగా మేమే స్వంతంగా ఆ మార్కెట్లో ప్రవేశించటం (ఆర్గానిక్ వృద్ధి). మేం ఈ మూడు ఆప్షన్లను పరిశీలిస్తున్నాం. అయితే ఇంతవరకూ ఏ ఒక్క మార్గాన్ని ఎంచుకోలేదు’ అని డాక్టర్ రెడ్డీస్ సంస్థ సాక్షి ప్రతినిధికి ఈ మెయిల్ ద్వారా తెలిపింది. జపాన్ ఆకర్షణ ఇదీ..: జపాన్ ఆరోగ్య శాఖ 2002 జూన్‌లో జారీ చేసిన ఆదేశాల ప్రకారం అన్ని హాస్పిటల్స్ జనరిక్స్ ఔషధాలనే వినియోగించాలి. ప్రభుత్వం చేపట్టిన డయాగ్నాస్టిక్ ప్రొసీజర్ కాంబినేషన్ ప్రోగ్రాం ద్వారా హాస్పిటల్స్ వినియోగదారులకు అందించే ఆరోగ్య సేవలకు విడివిడిగా కాకుండా ఒకే స్థిరమైన ఛార్జీలను చెల్లించేలా పథకాన్ని రూపొం దించింది. నోవార్టిస్, గ్లాక్సోస్మిత్‌క్లైన్, నోవో నోర్డిస్క్, ఐసాయి, నిప్పో, టకేడా లాంటి సంస్థల ఔషధాలు గత రెండు సంవత్సరాల కాలంలో పేటెంట్స్ కోల్పోవడంతో జనరిక్స్ మార్కెట్లో విదేశీ కంపెనీలకు అవకాశాలు లభించినట్లయింది. జీవన ప్రమాణాలు పెరగటంతో అదే నిష్పత్తిలో వృద్ధుల జనాభా పెరగటం కూడా హెల్త్‌కేర్ మార్కెట్‌కు కలిసొచ్చే అంశం. బల్క్ డ్రగ్స్‌కూ పెద్ద మార్కెట్టే.. బల్క్‌డ్రగ్స్ వినియోగంలో జపాన్ పెద్ద మార్కెట్టేనని విర్చో లేబరేటరీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ నారాయణరెడ్డి చెప్పారు. విర్చో సంస్థ గత 15 సంవత్సరాలుగా బల్క్‌డ్రగ్స్‌ను జపాన్‌కు ఎగుమతి చేస్తోందన్నారు. అయితే మిగతా దేశాలకన్నా జపాన్‌తో వ్యాపారం చేయటం అంత ఆశామాషీ కాదన్నారు.నాణ్యత విషయంలో ఎంతో జాగరూకత అవసరమన్నారు. బల్క్‌డ్రగ్ కేంద్రంగా దేశవ్యాప్త గుర్తింపు పొందిన హైదరాబాద్ సంస్థలు జపాన్ మార్కెట్‌పై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఎదురయ్యే సవాళ్లు.. జపాన్ సంపన్న దేశం కావటంతో వినియోగదారులు నాణ్యమైన ఔషధాలనే కోరుతున్నారు. ధర కన్నా నాణ్యతకు అక్కడ పెద్ద పీట వేస్తున్నారు. కొత్తగా మార్కెట్లో ప్రవేశించే బ్రాండ్లకు అంత త్వరగా ఆకర్శితులు కారన్నది పలు సంస్థల అనుభవం. మరీ ముఖ్యంగా చైనా, ఇండియా ఉత్పత్తులంటే వారికి నాణ్యమైనవి కావన్న అభిప్రాయం నాటుకుపోవడం కూడా మన దేశ కంపెనీలకు మైనస్ పాయింటే అని ఇండో-జపనీస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి అతుల్ సక్సేనా తెలిపారు. -
ఫలితాలతో దిశా నిర్దేశం
న్యూఢిల్లీ: ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితమైనప్పటికీ జనవరి-మార్చి(క్యూ4) ఫలితాలు, మార్చి నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ల దిశను నిర్దేశిస్తాయని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం(14న) బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ)లకు సెలవు ప్రకటించ గా, గుడ్‌ఫ్రైడే కారణంగా శుక్రవారం(18న) సైతం మార్కెట్లు పనిచేయవు. కాగా, మంగళవారం(15న) సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలను ప్రకటించనుంది. ఈ బాటలో 16న టీసీఎస్, మైండ్‌ట్రీ, 17న విప్రో, హెచ్‌సీఎల్ టెక్ క్యూ4 పనితీరును వెల్లడించనున్నాయి. ఇక ఆయిల్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 18న ఫలితాలను ప్రకటించనుంది. ఐటీ సేవల సంస్థ సీఎంసీ మరింత ముందుగా అంటే 14న 2013-14 ఏడాది ఫలితాలను వెల్లడించనుండగా, ఇండస్ఇండ్ బ్యాంక్ 15న, జీఎస్కే ఫార్మా 17న క్యూ4 ఫలితాలను ప్రకటించనున్నాయి. వెరసి సమీప కాలానికి బ్లూచిప్ కంపెనీల ఫలితాలు మార్కెట్ల నడకపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం ఎఫెక్ట్ మంగళవారం వెల్లడికానున్న ఇన్ఫోసిస్ ఫలితాలతో సీజన్ ఊపందుకోనుండగా, అదే రోజు ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. మార్చి నెలకుగాను ఓవైపు టోకు ధరల(డబ్ల్యూపీఐ), మరోవైపు రిటైల్ ధరల(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ రెండు అంశాల నేపథ్యంలో ట్రేడింగ్ మొదలుకానున్న మంగళవారానికి ప్రాధాన్యత ఏర్పడిందని విశ్లేషకులు వివరించారు. వీటికితోడు మార్కెట్లు ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టాయని తెలిపారు. మే నెల 12తో ముగియనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడనున్న సంగతి తెలిసిందే. 6,800 కీలకం ఇన్ఫోసిస్ ఫలితాలకుతోడు, ద్రవ్యోల్బణ గణాంకాలు ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు నిధి సరస్వత్ అభిప్రాయపడ్డారు. విదేశీ సంకేతాలు, ఎన్నికల ఫలితాలు కూడా సమీప కాలానికి మార్కెట్లపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపుతాయని అంచనా వేశారు. రానున్న కాలంలో ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,800 పాయింట్ల స్థాయి కీలకంగా నిలవనుందని చెప్పారు. ఈ స్థాయికి ఎగువన కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని అంచనా వేశారు. రూపాయి కదలికలూ ఎఫ్ఐఐల పెట్టుబడుల ధోరణి, అంతర్జాతీయ అంశాలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని అత్యధిక శాతం మంది నిపుణులు పేర్కొన్నారు. ఈ వారం మొత్తానికి మంగళవారంనాటి ట్రేడింగ్ కీలకంగా నిలవనుందని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. ఇన్ఫోసిస్ ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ట్రేడర్లు స్పందిస్తారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మేలని సూచించారు. ఇటీవల కొంత పుంజుకున్న పారిశ్రామికోత్పత్తి మళ్లీ నీరసించడం గమనించదగ్గ అంశమని నిపుణులు వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) మైనస్ 1.9%కు చేరిన విషయం విదితమే. అయితే గడిచిన వారం చివర్లో మార్కెట్లు కొంతమేర మందగించినప్పటికీ... ప్రామాణిక సూచీ సెన్సెక్స్ మొత్తంగా 269 పాయింట్లు లాభపడి 22,629 వద్ద ముగియడం విశేషం! ఎఫ్ఐఐల జోష్... న్యూఢిల్లీ: దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ (ఏప్రిల్ 11) నికరంగా రూ. 7,764 కోట్ల(130 కోట్ల డాలర్లు) విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు దోహదపడుతున్నట్లు నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ దేశీ స్టాక్స్‌లో ఎఫ్ఐఐల పెట్టుబడులు రూ. 29,960 కోట్లకు(దాదాపు 5 బిలియన్ డాలర్లు) చేరాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. కొత్త ప్రభుత్వం సంస్కరణల అమలును వేగవంతం చేస్తుందన్న అంచనాలకుతోడు, ఆర్థిక వ్యవస్థ మరిం త పుంజుకుంటుందన్న ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయన్నారు. రానున్న కాలంలోనూ విదేశీ పెట్టుబడుల జోష్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. బ్లూచిప్స్ జోరు ముంబై: మార్కెట్ల జోరుకు నిదర్శనంగా టాప్-10 బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ కూడా పెరుగుతోంది. వెరసి సెన్సెక్స్‌లో భాగమైన ఏడు దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) గత వారం లో మొత్తంగా రూ. 28,234 కోట్లమేర ఎగసింది. వీటిలో కోల్ ఇండియా, ఎస్బీఐ ముందువరుసలో ఉన్నాయి. అయితే ఓఎన్జీసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్ విలువ క్షీణించింది. కోల్ ఇండియా మార్కెట్ విలువ రూ. 6,980 కోట్లు పెరిగి రూ. 1,85,101 కోట్లకు చేరగా, ఎస్బీఐ మార్కెట్ విలువకు రూ. 6,723 కోట్లు జమయ్యి రూ. 1,48,889 కోట్లను తాకింది. ఈ బాటలో టీసీఎస్ విలువ రూ. 4,730 కోట్లు పుంజుకోగా, హెచ్డీఎఫ్సీ రూ. 3,519 కోట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ. 2,890 కోట్లు, ఆర్ఐఎల్ విలువ రూ. 2,795 కోట్లు చొప్పున పెరిగాయి. ఇదే సమయంలో ఓఎన్జీసీ మార్కెట్ విలువలో రూ. 4,662 కోట్లమేర కోతపడగా, ఇన్ఫోసిస్ విలువ రూ. 4,574 కోట్లు క్షీణించింది.