ఫలితాలతో దిశా నిర్దేశం | Q4 earnings estimates indicate gradual revival in economy, say brokerages | Sakshi
Sakshi News home page

ఫలితాలతో దిశానిర్దేశం

Published Mon, Apr 14 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 5:59 AM

ఫలితాలతో దిశా నిర్దేశం

ఫలితాలతో దిశా నిర్దేశం

న్యూఢిల్లీ: ఈ వారం ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితమైనప్పటికీ జనవరి-మార్చి(క్యూ4) ఫలితాలు, మార్చి నెలకు ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ల దిశను నిర్దేశిస్తాయని స్టాక్ నిపుణులు పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం(14న) బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్‌ఈ), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ)లకు సెలవు ప్రకటించ గా, గుడ్‌ఫ్రైడే కారణంగా శుక్రవారం(18న) సైతం మార్కెట్లు పనిచేయవు. కాగా, మంగళవారం(15న) సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ క్యూ4 ఫలితాలను ప్రకటించనుంది. ఈ బాటలో 16న టీసీఎస్, మైండ్‌ట్రీ, 17న విప్రో, హెచ్‌సీఎల్ టెక్ క్యూ4 పనితీరును వెల్లడించనున్నాయి. ఇక ఆయిల్ రంగ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్‌ఐఎల్) 18న ఫలితాలను ప్రకటించనుంది. ఐటీ సేవల సంస్థ సీఎంసీ మరింత ముందుగా అంటే 14న 2013-14 ఏడాది ఫలితాలను వెల్లడించనుండగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 15న, జీఎస్‌కే ఫార్మా 17న క్యూ4 ఫలితాలను ప్రకటించనున్నాయి. వెరసి సమీప కాలానికి బ్లూచిప్ కంపెనీల ఫలితాలు మార్కెట్ల నడకపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు పేర్కొన్నారు.

 మంగళవారం ఎఫెక్ట్
 మంగళవారం వెల్లడికానున్న ఇన్ఫోసిస్ ఫలితాలతో సీజన్ ఊపందుకోనుండగా, అదే రోజు ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్నాయి. మార్చి నెలకుగాను ఓవైపు టోకు ధరల(డబ్ల్యూపీఐ), మరోవైపు రిటైల్ ధరల(సీపీఐ) గణాంకాలు వెల్లడికానున్నాయి. ఈ రెండు అంశాల నేపథ్యంలో ట్రేడింగ్ మొదలుకానున్న మంగళవారానికి ప్రాధాన్యత ఏర్పడిందని విశ్లేషకులు వివరించారు. వీటికితోడు మార్కెట్లు ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టాయని తెలిపారు. మే నెల 12తో ముగియనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడనున్న సంగతి తెలిసిందే.

 6,800 కీలకం
 ఇన్ఫోసిస్ ఫలితాలకుతోడు, ద్రవ్యోల్బణ గణాంకాలు ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని బొనాంజా పోర్ట్‌ఫోలియో సీనియర్ రీసెర్చ్ విశ్లేషకులు నిధి సరస్వత్ అభిప్రాయపడ్డారు. విదేశీ సంకేతాలు, ఎన్నికల ఫలితాలు కూడా సమీప కాలానికి మార్కెట్లపై చెప్పుకోదగ్గ ప్రభావాన్ని చూపుతాయని అంచనా వేశారు. రానున్న కాలంలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 6,800 పాయింట్ల స్థాయి కీలకంగా నిలవనుందని చెప్పారు. ఈ స్థాయికి ఎగువన కొనుగోళ్లు మరింత పుంజుకుంటాయని అంచనా వేశారు.

 రూపాయి కదలికలూ
 ఎఫ్‌ఐఐల పెట్టుబడుల ధోరణి, అంతర్జాతీయ అంశాలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని అత్యధిక శాతం మంది నిపుణులు పేర్కొన్నారు. ఈ వారం మొత్తానికి మంగళవారంనాటి ట్రేడింగ్ కీలకంగా నిలవనుందని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్‌లిక్ చెప్పారు. ఇన్ఫోసిస్ ఫలితాలు, ద్రవ్యోల్బణ గణాంకాల ఆధారంగా ట్రేడర్లు స్పందిస్తారని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడం మేలని సూచించారు. ఇటీవల కొంత పుంజుకున్న పారిశ్రామికోత్పత్తి మళ్లీ నీరసించడం గమనించదగ్గ అంశమని నిపుణులు వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) మైనస్ 1.9%కు చేరిన విషయం విదితమే. అయితే గడిచిన వారం చివర్లో మార్కెట్లు కొంతమేర మందగించినప్పటికీ... ప్రామాణిక సూచీ సెన్సెక్స్ మొత్తంగా 269 పాయింట్లు లాభపడి 22,629 వద్ద ముగియడం విశేషం!

 ఎఫ్‌ఐఐల జోష్...
 న్యూఢిల్లీ: దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఈ నెలలో ఇప్పటివరకూ (ఏప్రిల్ 11) నికరంగా రూ. 7,764 కోట్ల(130 కోట్ల డాలర్లు) విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇందుకు ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు దోహదపడుతున్నట్లు నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు రూ. 29,960 కోట్లకు(దాదాపు 5 బిలియన్ డాలర్లు) చేరాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వెల్లడించిన తాజా గణాంకాలివి. కొత్త ప్రభుత్వం సంస్కరణల అమలును వేగవంతం చేస్తుందన్న అంచనాలకుతోడు, ఆర్థిక వ్యవస్థ మరిం త పుంజుకుంటుందన్న ఆశలు ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిస్తున్నాయన్నారు. రానున్న కాలంలోనూ విదేశీ పెట్టుబడుల జోష్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.

 బ్లూచిప్స్ జోరు
 ముంబై: మార్కెట్ల జోరుకు నిదర్శనంగా టాప్-10 బ్లూచిప్ కంపెనీల మార్కెట్ విలువ కూడా పెరుగుతోంది. వెరసి సెన్సెక్స్‌లో భాగమైన ఏడు దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) గత వారం లో మొత్తంగా రూ. 28,234 కోట్లమేర ఎగసింది. వీటిలో కోల్ ఇండియా, ఎస్‌బీఐ ముందువరుసలో ఉన్నాయి. అయితే ఓఎన్‌జీసీ, ఐటీసీ, ఇన్ఫోసిస్ విలువ క్షీణించింది. కోల్ ఇండియా మార్కెట్ విలువ రూ. 6,980 కోట్లు పెరిగి రూ. 1,85,101 కోట్లకు చేరగా, ఎస్‌బీఐ మార్కెట్ విలువకు రూ. 6,723 కోట్లు జమయ్యి రూ. 1,48,889 కోట్లను తాకింది. ఈ బాటలో టీసీఎస్ విలువ రూ. 4,730 కోట్లు పుంజుకోగా, హెచ్‌డీఎఫ్‌సీ రూ. 3,519 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 2,890 కోట్లు, ఆర్‌ఐఎల్ విలువ రూ. 2,795 కోట్లు చొప్పున పెరిగాయి. ఇదే సమయంలో ఓఎన్‌జీసీ మార్కెట్ విలువలో రూ. 4,662 కోట్లమేర కోతపడగా, ఇన్ఫోసిస్ విలువ రూ. 4,574 కోట్లు క్షీణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement