న్యూఢిల్లీ: ఫార్మా దిగ్గజం, సన్ ఫార్మా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.983 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ రూ.425 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అమెరికాలో కోర్టు కేసుల సెటిల్మెంట్ కారణంగా రూ.951 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని, అందుకని గత క్యూ1లో నికర నష్టాలు వచ్చాయని సన్ ఫార్మాç ఎమ్‌డీ దిలీప్ సంఘ్వి తెలియజేశారు.
ఇక గత క్యూ1లో రూ.6,209 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.7,224 కోట్లకు ఎగసిందని చెప్పారాయన. ఈ క్యూ1లో ఎబిటా మార్జిన్ 21.3 శాతానికి చేరిందన్నారు. ఈ క్యూ1లో అన్ని ప్రధాన మార్కెట్లలో మంచి వృద్ధి సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కంపెనీ రూ.900 కోట్ల నికరలాభాన్ని, రూ.6,957 కోట్ల ఆదాయాన్ని సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేశారు. సన్ ఫార్మా ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి.
స్పెషాల్టీ ఉత్పత్తులపై భారీ పెట్టుబడులు..
భారత్‌లో బ్రాండెడ్ ఫార్ములేషన్స్ అమ్మకాలు ఈ క్యూ1లో 22 శాతం పెరిగి రూ.2,152 కోట్లకు పెరిగాయని దిలీప్ సింఘ్వి పేర్కొన్నారు. అమెరికా అమ్మకాలు 8 శాతం పెరిగి రూ.2,654 కోట్లకు వృద్ధి చెందాయని వివరించారు. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి రెండు స్పెషాల్టీ ఉత్పత్తులకు ఆమోదాల కోసం ఎదురు చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని స్పెషాల్టీ ఉత్పత్తులు అందుబాటులోకి తేనున్నామని, ఈ సెగ్మెంట్‌పై భారీగా పెట్టుబడులు పెట్టామని వెల్లడించారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో సన్ ఫార్మా ఇండస్ట్రీస్ షేర్ 7 శాతం లాభంతో రూ.602 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 8 శాతం లాభంతో రూ.608ని కూడా తాకింది.
Comments
Please login to add a commentAdd a comment