నెల రోజుల గరిష్టం
128 పాయింట్లు ప్లస్
26,881కు చేరిన సెన్సెక్స్
మళ్లీ 8,000 దాటిన నిఫ్టీ
చివర్లో పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్లు నష్టాల నుంచి బయటపడి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 128 పాయింట్లు పుంజుకుని 26,881 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ సైతం 36 పాయింట్లు లాభపడి 8,028 వద్ద నిలిచింది. తద్వారా మళ్లీ 8,000 మైలురాయికి ఎగువన ముగిసింది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 5.6%కు చేరుతుందన్న ప్రపంచ బ్యాంకు అంచనాలు, ఆసియా, యూరప్ మార్కెట్ల లాభాలు దేశీయంగా సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయని విశ్లేషకులు తెలి పారు. ఇదికాకుండా అక్టోబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు నేపథ్యంలో జరిగిన షార్ట్ కవరింగ్ కూడా మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు పేర్కొన్నారు.
సన్ ఫార్మా జోష్
సెన్సెక్స్ దిగ్గజాలలో సన్ ఫార్మా 4.3% పుంజుకోగా, సిప్లా, టాటా పవర్, ఎస్‌బీఐ, గెయిల్, ఐసీఐసీఐ 3-2% మధ్య పురోగమించాయి. అయితే మరోవైపు హీరోమోటో, భారతీ, హెచ్‌యూఎల్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్‌జీసీ, మారుతీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ 1.5-0.5% మధ్య నష్టపోయాయి.