న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 11 శాతం ఎగసి రూ. 2,262 కోట్లను అధిగమించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 2,047 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 9,626 కోట్ల నుంచి రూ. 10,952 కోట్లకు బలపడింది.
అయితే మొత్తం వ్యయాలు రూ. 7,562 కోట్ల నుంచి రూ. 8,625 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో దేశీ ఫార్ములేషన్ల అమ్మకాలు 8 శాతంపైగా పుంజుకుని రూ. 3,460 కోట్లను తాకాయి. యూఎస్ విక్రయాలు 14 శాతం ఎగసి 41.2 కోట్ల డాలర్ల(రూ. 3,400 కోట్లు)కు చేరాయి. గ్లోబల్ స్పెషాలిటీ అమ్మకాలు మరింత అధికంగా 27 శాతం జంప్‌చేసి 20 కోట్ల డాలర్లను అందుకున్నాయి. వర్ధమాన మార్కెట్ల నుంచి ఫార్ములేషన్ల విక్రయాలు 7 శాతం బలపడి 25.9 కోట్ల డాలర్లను(రూ. 2,140 కోట్లు) తాకాయి. అయితే ఇతర దేశాల నుంచి ఆదాయం 4 శాతం క్షీణించి 18.1 కోట్ల డాలర్లకు పరిమితమైనట్లు సన్ ఫార్మా వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో సన్ ఫార్మా షేరు ఎన్‌ఎస్‌ఈలో 1.6 శాతం లాభంతో రూ. 1,033 వద్ద ముగిసింది.
చదవండి: ఎయిర్‌టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment