రూ.100 లక్షల కోట్లకు చేరువలో మార్కెట్ విలువ
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ సూచీలు కొత్త రికార్డులతో దూసుకెళుతున్న నేపథ్యంలో మార్కెట్ విలువసైతం భారీగా పుంజుకుంటోంది. వెరసి బీఎస్‌ఈలో లిస్టయిన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్) రూ. 100 లక్షల కోట్లకు చేరువైంది. ప్రస్తుతం బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 96,25,517 కోట్లను తాకింది. మరో రూ. 3.74 లక్షల కోట్లు జమ అయితే రూ. 100 లక్షల కోట్ల మైలురాయిని చేరుతుంది.
గత శుక్రవారానికి ఈ విలువ డాలర్ల రూపేణా 1.58 ట్రిలియన్లకు చేరింది. కాగా, ఈ ఏడాది జూన్‌లో మార్కెట్ విలువ మళ్లీ 1.5 ట్రిలి యన్ డాలర్లను తాకగా, తొలిసారి 2007లో ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో భారత్ మార్కెట్ చేరింది. అయితే మార్కెట్ల పతనంతో 2008 సెప్టెంబర్‌లో మార్కెట్ విలువ పడిపోగా, తిరిగి 2009 మేలో ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. ఈ బాటలో 2013 ఆగస్ట్‌లో మరోసారి మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్ల దిగువకు పడినప్పటికీ 2014లో తిరిగి ప్రాభవాన్ని పొందింది. సాఫ్ట్‌వేర్ దిగ్గజం టీసీఎస్ రూ. 5 లక్షల కోట్ల మార్కెట్ విలువను అధిగమించి రికార్డు సృష్టించింది.