సన్ ఫార్మా లాభంలో 14% క్షీణత
అమెరికా మార్కెట్లో ధరల ఒత్తిళ్ల ప్రభావం
న్యూఢిల్లీ: సన్ ఫార్మా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 14 శాతం తక్కువగా లాభాన్ని నమోదు చేసింది. అమెరికా మార్కెట్లో ధరల పరంగా ఒత్తిళ్లు ప్రభావం చూపించడంతో లాభం రూ.1,223 కోట్లకు పరిమితం అయింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వచ్చిన లాభం రూ.1,416 కోట్లుగా ఉంది. అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంలోనూ తగ్గుదల చోటు చేసుకుంది. 2016 మార్చి త్రైమాసికంలో ఆదాయం రూ.7,415 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో అది రూ.6,825 కోట్లకు తగ్గింది. పూర్తి ఆర్థిక సంవత్సరం (2016–17)లో కంపెనీ కన్సాలిడేటెడ్ లాభం రూ.6,964 కోట్లుగా నమోదైంది.
అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.4,545 కోట్ల కంటే 53 శాతం వృద్ధి చెందింది. ఆదాయం సైతం రూ.27,888 కోట్ల నుంచి రూ.30,264 కోట్లకు పెరిగింది. ఒక్కో షేరుపై రూ.3.5 డివిడెండ్ ఇవ్వాలని కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. దిలీప్ సంఘ్విని తిరిగి ఐదేళ్ల పాటు 2023 మార్చి వరకు కంపెనీ ఎండీగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన సీఎఫ్‌వోగా సీఎస్ మురళీధరన్‌ను నియమించింది.
కొత్త ఔషధాలపై పెట్టుబడులు కొనసాగుతాయి
అమెరికాలో జనరిక్ మందుల ధరల పరంగా ఎదురైన సవాళ్లు నాలుగో త్రైమాసికం పనితీరుపై ప్రభావం చూపించినట్టు సన్ ఫార్మా ఎండీ దిలీప్ సంఘ్వి తెలిపారు.