
సన్ ఫార్మాకు దైచీ గుడ్‌బై
దాదాపు ఏడేళ్ల క్రితం జపాన్ ఫార్మా దిగ్గజం దైచీ శాంక్యో..భారత మార్కెట్లో మొదలుపెట్టిన ప్రయాణం ఎట్టకేలకు ముగిసింది.
* కంపెనీలో మొత్తం 9% వాటాల విక్రయం
* డీల్ విలువ దాదాపు రూ. 20,420 కోట్లు
న్యూఢిల్లీ: దాదాపు ఏడేళ్ల క్రితం జపాన్ ఫార్మా దిగ్గజం దైచీ శాంక్యో.. భారత మార్కెట్లో మొదలుపెట్టిన ప్రయాణం ఎట్టకేలకు ముగిసింది. సన్ ఫార్మాలో తనకున్న మొత్తం 9 శాతం వాటాలను విక్రయించే ప్రక్రియ పూర్తయినట్లు దైచీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 2008లో ర్యాన్‌బాక్సీ ల్యాబరేటరీస్‌లో మెజారిటీ వాటాల కొనుగోలుతో దైచీ శాంక్యో భారత మార్కెట్లో ప్రవేశించిన సంగతి తెలిసిందే.
అప్పట్లో రూ. 22,000 కోట్లు వెచ్చించి 21 కోట్ల షేర్లను కొనుగోలు చేసింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో ర్యాన్‌బాక్సీని సన్ ఫార్మాకి దాదాపు 4 బిలియన్ డాలర్లకు షేర్ల మార్పిడి పద్ధతిపై విక్రయించింది. సన్‌లో ర్యాన్‌బాక్సీ విలీనం గత నెలలో పూర్తయ్యింది. విలీన సమయానికి ర్యాన్‌బాక్సీలో దైచీకి 63.4 శాతం వాటాలు ఉన్నాయి. డీల్ ప్రకారం ర్యాన్‌బాక్సీ షేరు ఒక్కింటికి 0.8 సన్ ఫార్మా షేరు లభిస్తుంది. దీన్ని బట్టి దైచీ శాంక్యోకు సన్ ఫార్మాలో 9 శాతం మేర వాటాలు దక్కాయి.
తాజాగా మంగళవారం సన్ ఫార్మాలో మొత్తం 21,49,69,058 షేర్ల విక్రయం పూర్తయినట్లు దైచీ శాంక్యో తెలిపింది. దైచీ ఈ ప్రకటన చేసే సమయానికి సన్ ఫార్మా షేరు ధర రూ. 950 స్థాయిలో కదలాడింది. దీని ప్రకారం షేర్ల విక్రయం డీల్ విలువ సుమారు రూ. 20,420 కోట్లుగా ఉండొచ్చని అంచనా. దైచీ శాంక్యో ప్రస్తుతం 50 పైగా దేశాల్లో ఉత్పత్తులు విక్రయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 30,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. ర్యాన్‌బాక్సీ కొనుగోలుతో ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద స్పెషాలిటీ జనరిక్ ఫార్మా దిగ్గజంగా సన్ ఫార్మా అవతరించింది. దేశీయంగా అత్యధిక మార్కెట్ వాటా దక్కించుకుంది.
కుదుపుల ప్రయాణం..: ర్యాన్‌బాక్సీ కొనుగోలుతో భారీగా ఎదగొచ్చని భావించిన దైచీ శాంక్యోకు ఏడేళ్లూ కష్టకాలంగానే గడిచాయి. తయారీ నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలతో ర్యాన్‌బాక్సీకి హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న పౌంతా సాహిబ్, బాటామండీ ప్లాంట్లు, మధ్యప్రదేశ్‌లోని దేవాస్ ప్లాంటు నుంచి ఔషధాలను 2008లో అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నిషేధించింది. అదే ఏడాది పత్రాలను ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడిందంటూ అమెరికా న్యాయస్థానంలో కేసులూ నమోదయ్యాయి.
అయితే, ప్రపంచవ్యాప్తంగా ర్యాన్‌బాక్సీ ఔషధాల నాణ్యత పరంగా సవాళ్లు ఎదురైనప్పటికీ దైచీ మాత్రం ముందుకు సాగింది. ర్యాన్‌బాక్సీతో కలిసి హైబ్రీడ్ మోడల్‌ను రూపొందించింది. దీని ప్రకారం ర్యాన్‌బాక్సీ సొంత బ్రాండ్ పేరిటే కాకుండా మాతృసంస్థ కోసం కూడా జనరిక్ ఔషధాల పరిశోధనలపై దృష్టి పెట్టింది. అటు కొత్త ఔషధాల పరిశోధన కార్యకలాపాలను దైచీ చేపట్టింది.
సన్ షేర్లు డౌన్..
దైచీ శాంక్యో వైదొలిగిన ప్రకటనతో మంగళవారం సన్ ఫార్మా షేర్లు 11 శాతం క్షీణించాయి. బీఎస్‌ఈలో 8.86 శాతం తగ్గి రూ. 952 వద్ద,ఎన్‌ఎస్‌ఈలో 8.8 శాతం తగ్గి రూ. 952 వద్ద ముగిశాయి. ఈ పరిణామంతో సన్ ఫార్మా మార్కెట్ విలువ రూ. 23,453 కోట్లు హరించుకుపోయి రూ. 2,28,191 కోట్లకు తగ్గింది.