cost price
-
‘కృష్ణా’లో దూకిన మిర్చి రైతు
ఐదెకరాల్లో పంట సాగు చేసి అప్పుల పాలు.. దిక్కుతోచక బలవన్మరణం వెల్దుర్తి (మాచర్ల): కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కక గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం దావుపల్లి తండాకు చెందిన రమావత్ లాలూనాయక్(46) అనే మిర్చి రైతు కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. లాలూనాయక్ తనకున్న రెండెకరాల సొంత భూమితో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. ఎకరానికి రూ.80 వేలు పెట్టుబడి పెట్టాడు. మూడెకరాల కౌలుతో కలిపి పెట్టుబడి రూ.4.45 లక్షలు అయింది. వ్యవసాయ పనుల నిమిత్తం రూ.లక్షన్నరదాకా అప్పు చేశాడు. ఐదు ఎకరాలు బోర్ల కింద సాగు కావడంతో ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున మొత్తం 100 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కూలీలు, అత్యవసర ఖర్చుల కోసం క్వింటాలు రూ.2 వేల చొప్పున 40 క్వింటాళ్లు అమ్మగా రూ.80 వేలు వచ్చింది. మూడేళ్లుగా నష్టాలే మిగులుతుంటే ఈ లెక్కన అప్పులెప్పుడు తీరుతాయని తీవ్రంగా కలత చెందాడు. ఆత్మహత్య తప్ప మరో మార్గం లేదని భావించి ఆదివారం గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో దూకాడు. జాలర్లు, చెంచులు లాలూనాయక్‌కు కాపాడేందుకు ప్రయత్నించినా అప్పటికే మృతి చెందాడు. -
మిర్చి రైతు కన్నెర్ర!
► గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన రైతులు ► చిల్లర సాయంతో రైతుకు వనగూరేది శూన్యం ► మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే మిర్చి కొనుగోలు చేయాలి ► రైతులు, రైతు సంఘాల నేతల డిమాండ్ ► ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ వద్ద హైవేపై బైఠాయింపు ► పంటను దహనం చేసి నిరసన గిట్టుబాటు ధర కోసం రెండు నెలలుగా డిమాండ్ చేస్తున్నా పాలకులు పట్టించుకోలేదని మిర్చిరైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకొంటూనే రైతుల్ని మోసగిస్తున్నారని మండిపడ్డారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని, ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే సర్కారు చోద్యం చూస్తోందని ఆందోళనకు దిగారు. సోమవారం ఒంగోలు వ్యవసాయ మార్కెట్‌కమిటీ వద్ద రైతులు, రైతులు సంఘ నాయకులు రాస్తారోకో చేశారు. రహదారిపై మిర్చిని దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: రైతులు పండించిన మిర్చి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం క్వింటాకు రూ.1,500 ఇస్తామంటూ చేతులు దులుపుకునే ప్రయత్నానికి దిగడంపై రైతులు, రైతు సంఘ నాయకులు మండిపడుతున్నారు. బాబు సర్కారు ఇస్తామన్న చిల్లర పైసల వల్ల రైతులకు వనగూరే ప్రయోజనం ఏమి లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణం ప్రభుత్వమే నాఫెడ్, మార్క్‌ఫెడ్‌ల ద్వారా మిర్చి కొనుగోళ్లు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఇచ్చే రూ.1,500 సాయంతోనైనా ప్రభుత్వమే మిర్చి కొనుగోలు చేపట్టాలని వారు కోరుతున్నారు. నేరుగా కొంటేనే మిర్చి రైతకు మేలు.. ప్రభుత్వరంగ సంస్థలు నేరుగా మిర్చి కొనుగోళ్లకు దిగితే వ్యాపారులు సైతం అదే ధర ఇచ్చి మిర్చి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే రైతులకు మేలు చేకూరుతుంది. అలా కాకుండా వ్యాపారుల ద్వారానే మిర్చిని కొనుగోలు చేయించి కేవలం కొంత మంది రైతులకు రూ.1,500 సాయం మాత్రమే ఇస్తామని ప్రభుత్వం చెప్పడం వల్ల వ్యాపారులు మిర్చి ధరలను మరింతగా తగ్గించే అవకాశం ఉంది. అదే జరిగితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం మిర్చి కొనుగోలు చేయక కేవలం అరకొర సాయంతో సరిపెట్టడం వల్ల వ్యాపారులు మరింతగా ధరలు తగ్గించే పరిస్థితి ఉంటుందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. ఇలా జరిగితే ప్రభుత్వం రైతులకు కాకుండా వ్యాపారులకే సాయం అందించినట్లవుతుందని రైతులతో పాటు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. రూ.8వేల లోపు మార్కెట్ ధర ఉంటేనే రాయితీకి రైతులు అర్హులని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. ప్రస్తుతం తేజ రకం మిర్చి ధర మార్కెట్లో రూ.7,300 వరకు ఉంది. రూ.8000 మార్కెట్ ధర ప్రకారం ఈ లెక్కన సదరు రైతుకు రూ.700 మించి ప్రభుత్వ సాయమందే అవకాశం లేదు. అలా కాకుండా మార్కెట్ ధరల మేరకు ప్రభుత్వమే కనీసం రూ.1,500 అదనంగా ఇచ్చి మొత్తం మిర్చిని కొనుగోలు చేస్తే రైతుకు కొంత మేరైనా ఉపయోగకరంగా ఉంటుంది. ఎగుమతులకూ విఘాతం.. సంక్షోభం ఎదురైన 1998–99, 2004–05 సంత్సరాల్లో మార్క్‌ఫెడ్ ద్వారానే కొనుగోళ్లు చేశారు. దీంతో మార్కెట్‌తో పోటీగా ధరలు పెరిగాయి. 2007, 2014లో ఇలాంటి సంక్షోభంలోనే ప్రభుత్వం శనగలను కొనుగోలు చేసింది. ఆ తర్వాత ధరలు పెరిగిన సందర్భాలున్నాయి. అదే జరిగితే ప్రభుత్వానికి మంచి లాభం ఉంటుంది. రైతులకు అరకొర సాయం అందించి సరుకు కొనుగోలు చేయకపోవడం వల్ల పండించిన పంట ఎగుమతులు ఆగిపోయి కోల్డ్ స్టోరేజ్‌లకు పరిమితం కావాల్సి ఉంది. ఇదే జరిగితే వచ్చే ఏడాది సాగుపై ఈ ప్రభావం ఉంటుంది. రైతులు తగిన మోతాదులో సదరు పంట సాగు చేసే అవకాశం ఉండదు. ప్రభుత్వమే మిర్చి కొనుగోళ్లు చేపట్టిన పక్షంలో ఎగుమతులకు అవకాశం ఉంటుంది. అలా జరిగితే ధరలు సైతం పెరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారులు పోటీ పడి సరుకు కొనే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం తక్షణం స్పందించి చిల్లర సాయం పక్కనపెట్టి స్వయంగా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి మిర్చి కొనుగోలును చేపట్టాలని రైతులతో పాటు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కోత కూలీ వచ్చేలా లేదు.. జిల్లావ్యాప్తంగా లక్షా 50 వేల ఎకరాల్లో రైతులు మిరప సాగు చేశారు. పంట దిగుబడి తగ్గిన నేపథ్యంలో సగటున 7 నుంచి 8 క్వింటాళ్ల వరకు మిర్చి దిగుబడి వచ్చింది. గతేడాది బేడిగ రకం మిర్చి క్వింటా రూ.18 వేలు ఉండగా, తేజ రకం మిర్చి రూ.13 వేల వరకు ఉంది. ప్రస్తుతం బేడిగ రకం రూ.7 వేల లోపు ఉండగా తేజ రకం రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు మాత్రమే ఉంది. ఈ పరిస్థితుల్లో మిర్చి అమ్మకానికి పెడితే రైతులకు పంట కోత కూలీ కూడా వచ్చే పరిస్థితుల్లేవు. కౌలుతో కలుపుకొని ఎకరానికి లక్షా 20 వేల నుంచి లక్షా 50 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుత దిగుబడి, ధరను పోల్చి చూస్తే ఎకరానికి రూ.80 వేలకు తగ్గకుండా రైతుకు నష్టం వస్తోంది. ఒక వేళ ధర వచ్చే వరకు పంటను కోల్డ్ స్టోరేజీల్లో దాచుకుందామన్న గుంటూరు ప్రాంత వ్యాపారులు ఆ అవకాశం కూడా లేకుండా చేశారు. -
మిర్చికి ధర లేదని రైతు ఆత్మహత్య
- ఎనిమిది ఎకరాల్లో సాగు - పెట్టుబడికి రూ.ఐదు లక్షల అప్పు భూపాలపల్లి రూరల్: మిర్చికి గిట్టుబాటు ధర రాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు చేనులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. జయశంకర్ భూపాలపల్లిలోని జం గేడుకు చెందిన రైతు దొంగల సారయ్య(55) ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చి వేశాడు. సాగు కోసం రూ. 5 లక్షల వరకు అప్పు చేశాడు. 9 విడతలుగా పది క్వింటాళ్ల మిర్చి అమ్మగా.. రవాణా ఖర్చులు పోను రూ. 30 వేలు మిగిలాయి. మరో 30 క్వింటాళ్ల మిర్చి కల్లంలోనే ఉంచి ధర కోసం ఎదురు చూస్తున్నాడు. రోజులు గడుస్తున్నా.. ధర పెరగకపోవడంతో భోజనం కూడా సరిగా చేయలేదని కుటుంబసభ్యులు చెప్పారు. గతేడాది కూతురి పెళ్లి కోసం చేసిన అప్పులు , వడ్డీలకు ఈ ఏడాది మిర్చి పంట కోసం తెచ్చిన అప్పు తోడవడంతో సారయ్య ఆందోళనకు గురై నట్లు తెలిపారు. దీంతో శని వారం మధ్యాహ్నం మిర్చి తోట వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆయనను వరంగల్‌కు తరలి స్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. తాండూరులో మరో రైతు.. తాండూరు(నాగర్‌కర్నూలు): నాగర్‌కర్నూలు జిల్లా తాండూరు మండలం చర్లతిర్మలాపూర్ కు చెందిన రైతు గంజాయి అడిమయ్య(40) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అడిమయ్య 8 ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి వేశాడు. వర్షాభావంతో పంటలు ఎండి పోయాయి. రూ. 5 లక్షల వరకు ఉన్న అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో మన స్తాపంతో శనివారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. -
గిట్టుబాటు ధర కల్పించండి సీఎస్‌కు టీపీసీసీ విజ్ఞప్తి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న కాంగ్రెస్ నేతలు మల్లురవి, సుధీర్‌రెడ్డి, వీహెచ్, కోదండరెడ్డి, పొన్నాల సాక్షి, హైదరాబాద్: మిర్చి, కందులతో పాటు అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వానికి టీపీసీసీ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్‌ను టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు, టీపీసీసీ కిసాన్‌సెల్ అధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తదితరులు సోమవారం కలిశారు. అనంతరం వారు మీడియాతో మాట్లా డుతూ... ప్రజా సమస్యలపై కలవడానికి కూడా సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వడం లేదని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. గిట్టుబాటు ధర లేక మార్కెట్ యార్డులో మిర్చి తగలబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి, కందులను కొను గోలు చేయడంలో ప్రభుత్వం విఫలమైం దని విమర్శించారు. రైతులను దళారులు దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం పట్టించు కోవ డం లేదని టీపీసీసీ కిసాన్‌సెల్ అధ్య క్షుడు ఎం.కోదండరెడ్డి ఆరోపించారు ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 421 జీవో వల్ల పరిహారం అందడం లేదన్నారు. నేడు కాంగ్రెస్ ముఖ్యుల సమావేశం: టీపీసీసీ ముఖ్యుల సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై సమన్వయంతో పోరాటం చేయడానికి ప్రణాళిక అవసరమనే ఉద్దేశంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన ఒక హోటల్లో నేతలు సమావేశం కానున్నారు. -
ఆశలన్నీ ధరలపైనే..
►నేటి నుంచి పొగాకు వేలం ►12 కేంద్రాల్లో ప్రారంభం కానున్న కొనుగోళ్లు ►ఏర్పాట్లు పూర్తి చేసిన టుబాకో బోర్డు అధికారులు ► సరాసరి ధర కిలోకి రూ.135 కోరుతున్న రైతులు ఈ ఏడాది పొగాకు వేలానికి రంగం సిద్ధమైంది. ప్రకృతి ప్రతికూలతల మధ్య శ్రమించి సాగు చేసిన పంటను అమ్ముకునేందుకు రైతులు సిద్ధమయ్యారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది సాగుతో పాటు, ఉత్పత్తి కూడా తగ్గడంతో ధరలపైనే కోటి ఆశలు పెట్టుకున్నారు. పెరిగిన సాగు ఖర్చులు, రెండేళ్ల నుంచి వరుస నష్టాల నేపథ్యంలో ఈసారైనా మద్దతు ధర దక్కుతుందో లేదోననే సంశయంతో ఉన్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న వేలంలో అన్ని రకాల పొగాకుకు సరాసరి మద్దతు ధర రూ.135 ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు టూటౌన్ /కందుకూరు : జిల్లాలో బుధవారం నుంచి పొగాకు అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 28,022 మంది పొగాకు రైతులు ఉండగా.. 21,137 బ్యారన్లు ఉన్నాయి. మొత్తం 14 వేలం కేంద్రాలు ఉండగా వాటిలో రెంటిని ఈ ఏడాది కుదించారు. పొదిలి–1, 2 కేంద్రాలను కలిపి ఒకే కేంద్రంగా ఏర్పాటు చేశారు. అలాగే వెల్లంపల్లి –1, 2 కేంద్రాలను కూడా కలిపి ఒక వేలం కేంద్రం చేశారు. దీంతో 14 ప్లాట్‌ఫారాలు కాస్త 12 వేలం కేంద్రాలయ్యాయి. కందుకూరు–1, కందుకూరు–2, ఒంగోలు–1, ఒంగోలు–2, టంగుటూరు–1, టంగుటూరు–2, కనిగిరి, కొండపి, కలిగిరి, డీసీపల్లి, వేలం కేంద్రాల్లో బుధవారం నుంచి అమ్మకాలు ప్రారంభించేందుకు బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వీటిలో కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాలు నెల్లూరు జిల్లా పరిధిలో పనిచేస్తున్నాయి. 82 మిలియన్ కిలోలకు అనుమతి..ఈ ఏడాది ప్రతికూల వాతావరణంలో రైతులు పొగాకు పంటను సాగు చేశారు. జిల్లాలో మొత్తం 82 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతిచ్చింది. ఇందులో ఎస్ఎల్ఎస్ పరిధిలో 40.5 మిలియన్ కిలోల ఉత్పత్తికి అనుమతివ్వగా 23 మిలియన్ కిలోల ఉత్పత్తి మాత్రమే వచ్చే అవకాశం ఉందని టుబాకో బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు జిల్లాలో ఉన్న ప్రతికూల వాతావరణం దెబ్బకు ఇంకా తగ్గే అవకాశం కూడా లేకపోలేదని చెబుతున్నారు. ఎస్బీఎస్ పరిధిలో 42 మిలియన్ ఆథరైజ్డ్ ఇవ్వగా ప్రస్తుత పరిస్థితిని బట్టి 30 నుంచి 32 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా. అదే విధంగా రైతు ప్రతినిధులు, రైతులు కూడా ఇదే అంచనాతో ఉన్నారు. గత నాలుగేళ్లుగా పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో పాలకులు విఫలమైన కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. చాలా మంది అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయినా అటు బోర్డులోనూ, ఇటు పాలకుల్లో మార్పు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ పరిస్థితుల్లో బోర్డు కూడా పంట ఉత్పత్తిని ఏటా తగ్గించుకుంటూ వస్తోంది. బ్రెజిల్, జింబాబ్వే, టాంజినియా, అమెరికా దేశాలలో పొగాకు ఉత్పత్తి బారీగా పెరగటం, ప్రపంచ వ్యాప్తంగా సిగరెట్ల వాడకం తగ్గడం వలన పొగాకుకు గిరాకీ పడిపోయింది. దీంతో రైతులకు గిట్టుబాటు ధర దక్కని పరిస్థితి నెలకొంది. వాస్తవ పరిస్థితిని గమనించిన కేంద్రం 2014–15 నుంచి పొగాకును తగ్గించేందుకు వ్యూహం పన్నింది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 172 మిలియన్ కిలోల పంట ఉత్పత్తిని క్రమేణా తగ్గించుకుంటూ వస్తోంది. మరుసటి ఏటా 120 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి బోర్డు అనుమతిచ్చింది. దీంట్లో ఒక్క ప్రకాశం జిల్లాలోనే 82 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతిచ్చింది. వర్షాభావ పరిస్థితుల్లో పంట సాగు చేయడం వలన ఖర్చులు పెరిగాయి. దీనికి తోడు ఆలస్యంగా నాట్లు వేయడంతో పంట నాణ్యత, దిగుబడి బాగా తగ్గింది. ఒక్కొక్క బ్యారన్‌కు రైతులు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశారు. నుంచి ప్రారంభమయ్యే వేలం కేంద్రాలను పొగాకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్బీఎస్ ఆర్ఎం ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రారంభ ధర రూ.170 ఇవ్వాలి...: బుధవారం నుంచి ప్రారంభమయ్యే వేలం కేంద్రాలలో ఎఫ్–1 గ్రేడ్ రకానికి రూ.160 నుంచి రూ.170 వరకు రేట్ ఇవ్వాలని రైతు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్–2 గ్రేడ్‌కు రూ.150 నుంచి రూ.160 వరకు రేట్ ఇచ్చే విధంగా చూడాలని రైతులు మంగళవారం ఎస్బీఎస్ ఆర్ఎం ఉమామహేశ్వరరావుకు వినతిపత్రం ఇచ్చారు. మిగిలిన గ్రేడ్లకు (లోగ్రేడ్, మీడియం గ్రేడ్లకు) రూ.100 నుంచి రూ.140 తగ్గకుండా రేట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సరాసరి రూ.135 ఉండేటట్లుచూడాలని విజ్ఞప్తి చేశారు. వేలం కేంద్రాలు ప్రారంభమయిన రోజునే నిర్ణయించిన రేట్లు అమలు చేయాలని తెలిపారు. ఇదే విషయాన్ని ఇటీవల జిల్లాకు వచ్చిన పొగాకు బోర్డు ఇన్చార్జీ సెక్రటరీ పట్నాయక్‌కు విన్నవించారు. మరీ రైతులకు గిట్టుబాటు ధర వస్తుందో లేదో బుధవారం వరకు వేచి చూడాలి. -
అన్నదాత ఆక్రందన.
-
అప్పుడే రైతుకు రుణ విముక్తి
⇒ పంట ఉత్పత్తి, గిట్టుబాటు ధర, నికరాదాయం పెరగాలి.. ⇒ ఆ దిశగా శాస్త్రవేత్తలు, అధికారులు కృషి చేయాలి ⇒ వ్యవసాయ మంత్రి పోచారం సాక్షి, హైదరాబాద్: పంట ఉత్పత్తి, గిట్టుబాటు ధర, నికరాదాయం.. ఈ మూడు పెరిగితేనే రైతులు రుణ విముక్తులవుతారని, ఆ దిశగా శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు కలసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ మేనేజ్మెంట్ (నార్మ్)లో సోమవారం జరిగిన ‘వ్యవసాయంలో నైపుణ్యాభివృద్ధి’పై వర్క్‌షాప్‌ను పోచారం ప్రారంభించారు. మొత్తం 8 రాష్ట్రాల నుంచి 400 మంది వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయంపై వచ్చే ఆదాయం రైతుల జీవన వ్యయానికే సరిపోతుంటే ఇక వారి కుటుంబాలకు మెరుగైన జీవితం ఎలా అందుతుందని ప్రశ్నించారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయి కానీ అంతే మొత్తంలో రైతుల ఆదాయాలు పెరగలేదని పేర్కొన్నారు. డిపాజిట్ చేయడానికి రైతులు రావాలి.. కేంద్ర బడ్జెట్లో ప్రతి ఏడాది వ్యవసాయ రుణాలను పెంచుతున్నారని, అసలు రుణమే అవసరం లేకుండా సొంతంగా పెట్టుబడుల ను సమకూర్చుకోగలిగే స్థితికి రైతులు చేరుకోవాలని ఆకాంక్షించారు. రైతులు రుణాల కోసం కాదు లాభాలను డిపాజిట్ చేయడానికి బ్యాంకులకు వచ్చే రోజు రావా లన్నారు. 1947లో 50 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉన్న దేశ ఆహారధాన్యాల దిగుబడులు 2017లో 272 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరడం సంతోషమన్నారు. అయితే సగటు దిగుబడులను ఇతర దేశాలతో పోల్చినప్పుడు తక్కువగా ఉన్నాయని తెలిపారు. పాలీహౌస్‌లకు ప్రోత్సాహం రాష్ట్రంలో పాలీహౌస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం అధిక ప్రోత్సాహం కల్పిస్తుందని పోచారం తెలిపారు. ఎకరాకు రూ.40 లక్ష లు ఖర్చు కాగా.. రూ.30 లక్షలు సబ్సిడీగా సమకూరుస్తున్నామని వివరించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు 1,000 ఎకరాల్లో పాలీహౌస్‌ల నిర్మాణానికి అను మతులిచ్చామని వెల్లడించారు. వచ్చే ఏడా ది 3,000 ఎకరాల్లో నిర్మించడానికి సహకా రం అందించాల్సిందిగా కేంద్ర వ్యవసాయ మంత్రిని కోరగా.. ఆయన అంగీకరించా రని తెలిపారు. వ్యవసాయ రంగం బాగుప డాలంటే సాంకేతికత, పెట్టుబడులు, యాంత్రీకరణ పెరగాలని పేర్కొన్నారు. -
స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయండి
• కేంద్రానికి పోచారం విజ్ఞప్తి • నకిలీ విత్తనాల నియంత్రణకు చట్టం తేనున్నట్లు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: పంటల ఉత్పాదకత పెంచి, గిట్టుబాటు ధర కల్పించేందుకు స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయాలని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలో భారత వ్యవసాయ పరిశోధన మండలి 88వ వార్షిక సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశ వ్యవసాయ రంగంలో ఇప్పటి వరకు జరిపిన పరిశోధనలు రైతులకు ఏ మేరకు లాభం చేకూర్చాయి, విభిన్నమైన భౌగోళిక, నైసర్గిక పరిస్థితుల దృష్ట్యా భవిష్యత్తులో పంటల ఉత్పాదకతను పెంచడానికి ఎలాంటి పరిశోధనలు అవసరం అన్న అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో మంత్రి పోచారం పాల్గొని ప్రసంగించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, పంటకు అయిన పెట్టుబడి కంటే అధికంగా అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని పేర్కొన్నారు. వ్యవసాయంపై స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేస్తామని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందని, దీనిపై ప్రధాని మోదీ కూడా హామీ ఇచ్చారని చెప్పారు. ఇప్పటికైనా కమిషన్ సిఫార్సులను అమలు చేసి రైతులకు ప్రయోజనం కల్పించాలని కోరారు. కేంద్ర మంత్రితో భేటీ సమావేశంలో ప్రసంగించిన అనంతరం అక్కడే కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో పోచారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి రైతు పొలంలో భూసార పరీక్షలు నిర్వహించాలని, దీని కోసం తెలంగాణకు మినీ భూసార పరీక్షల లేబోరేటరీలను కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో ఒక జిల్లాలో ఒక పంటను విలేజ్ యూనిట్‌గా పరిగణించి.. మిగతా పంటలను మండల యూనిట్లుగా పరిగణించడం అశాస్త్రీయమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఒక జిల్లాకు ఒక పంటను విలేజ్ యూనిట్‌గా పరిగణించడంతో రైతులకు పరిహారం అందడంలో ఇబ్బందులు వస్తున్నాయని వివరించారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో.. జిల్లాకో కృషి విజ్ఞాన కేంద్రాన్ని కేటాయించాలని కోరారు. మిరప విత్తన చట్టం తెస్తాం.. రాష్ట్రంలో నకిలీ విత్తనాలను సరఫరా చేసే ఏజెంట్లు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని.. అందుకు అనుగుణంగా ప్రత్యేక చట్టాలను రూపొందిస్తామని పోచారం తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో మిరప విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోతే.. ఆ మేరకు సంబంధిత సంస్థల నుంచి పరిహారం వసూలు చేసి, రైతులకు అందించేలా నిబంధనలు చేర్చుతామని వెల్లడించారు. -
‘కంది’పోతున్న రైతులు
గిట్టుబాటు కాని ధర ► గతేడాది రూ.9600.. ఇప్పుడు రూ.5050 ► జిల్లాలో 5,862 ఎకరాల్లో సాగు సిరిసిల్ల : రైతులు పత్తికి ప్రత్యామ్నాయంగా కంది పంట వేసుకోవాలని ఖరీఫ్ ఆరంభంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో చాలామంది రైతులు పత్తికి బదులు కందిని సాగుచేశారు. ప్ర స్తుతం గిట్టుబాటు ధర లభించక అన్నదాతలు అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలోని 13 మండలాల్లో 5862 ఎకరాల్లో కంది పంటను సాగు చేశారు. ఖరీ ఫ్ సీజన్ లో వేసిన కంది పంట ఇప్పుడు చేతికందుతుండగా.. మద్దతు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన పెట్టుబడులు.. ఈ ఏడాది కాలం మంచిగా కావడంతో వ్యవసాయ పెట్టుబడులు పెరిగాయి. భూమి దున్నడం నుంచి విత్తనాలకు, విత్తుకోవడం, ఎరువులు, కలుపుతీత వరకు అన్ని కూలీలు పెరిగాయి. ఎకరం కంది సాగుకు రూ. 8వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చులయ్యాయి. నల్లరేగడి భూముల్లో ఎకరానికి 4 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. తేలిక నేలల్లో మూడు క్వింటాళ్ల మేరకు దిగుబడి వచ్చింది. అటు దిగుబడి లేక.. ఇటు గిట్టుబాటు ధర లేక కంది రైతులు దిక్కులు చూస్తున్నారు. అరకొర మద్ధతు ధర.. కంది గింజలకు గత ఏడాది బహిరంగ మార్కెట్లోనే క్వింటాలు ధర రూ.8800 నుంచి రూ. 9600 వరకు పలికింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాలు ధర రూ 4625 ప్రకటించగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.425 బోనస్ ప్రకటించింది. దీంతో కందులకు రూ.5050 మద్ధతు ధర ఉంది. సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ యార్డు, రుద్రంగి మార్కెట్ యార్డుల్లో కందుల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఎకరానికి మూడు, నాలుగు క్వింటాళ్ల దిగుబడి రావడంతో ఈ లెక్కన కంది రైతులకు పెట్టుబడులు సైతం చేతికి వచ్చే అవకాశం లేకుండా పోయింది. అదే పత్తి వేసుకున్న రైతులకు ధర బాగా పలికింది. -
రైతు బాగోగులు పట్టవా?
► కొనుగోలు బాధ్యతలనుంచి తప్పించుకుంటున్న జేసీఐ ► సగం కొనుగోలు కేంద్రాలు ఇతర సంస్థలకు ► అందుబాటులో ఉంచని జేసీఐ కేంద్రాలు ► గిట్టుబాటు ధర రానీయకుండా చేసేందుకేనని రైతుల మండిపాటు ► మద్దతు దర కావాలంటే 60 కిలోమీటర్లు వెళ్లాల్సిందే! అసలే జిల్లాలో గోగునార ఉత్పత్తి అంతంత మాత్రంగా ఉంటోంది. నానా కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడమే దీనికి కారణం. ఇవేమీ పట్టించుకోని జూట్కార్పొరేషన్ కొనుగోలు కేంద్రాల సంఖ్యను తగ్గించేసి... కొన్నింటిని ప్రైవేటుకు అప్పగిస్తోంది. రైతులకు మద్దతు ధర చెల్లించకుండా తప్పుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని రైతులు వాపోతున్నారు. జేసీఐ కేంద్రాలకే విక్రరుుంచి... మద్దతు ధర పొందాలంటే కచ్చితంగా సుదూరంప్రయాణించాల్సిందే. విజయనగరం కంటోన్మెంట్: గోగు రైతుకు ప్రభుత్వం మద్దతు ధర అందనివ్వకుండా చేస్తోంది. ప్రైవేటు వర్తకులకు లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నదని రైతులు వాపోతున్నారు. గోగు అధికంగా పండించే చోట జేసీఐ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకుండా దూరంగా ఏర్పాటు చేస్తున్నారు. అంత దూరం నారను తీసుకెళ్ల లేక, తప్పనిసరి పరిస్థితుల్లో రైతాంగం దళారులకు అప్పగిస్తోంది. జేసీఐ సంస్థ పూర్తి స్థారుులో గోగునార కొనుగోలు చేయలేక ఇప్పుడు మరో సంస్థకు కొనుగోలు బాధ్యత అప్పగించింది. ఇందులో భాగంగా క్వింటాలుకు రూ.30 కమీషన్ పద్ధతిన నేకాఫ్ సంస్థకు రెండు జిల్లాల్లో సగం కేంద్రాలను అప్పగించింది. వీరి ఆధ్వర్యంలో శనివారం నుంచి గోగు నార కొనుగోళ్లను నేకాఫ్ అధికారులు ప్రారంభించనున్నారు. విస్తీర్ణం తగ్గడానికి కారణం సర్కారే... ఒకప్పుడు జిల్లాలో 65వేల హెక్టార్లలో గోగు సాగయ్యేది. సర్కారు ఇచ్చే మద్దతు ధర గిట్టుబాటు కాకపోవడంతో క్రమేపీ విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఇటీవలే మళ్లీ సాగు విస్తీర్ణం పెంచుకుంటున్న తరుణంలో మళ్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో ఈ పంట మళ్లీ తగ్గవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వారికి మద్దతు ధర అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలను ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటుచేసి గోగునార కొనుగోలు చేయాల్సిన జేసీఐ(జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) కొనుగోలును కూడా కమీషన్ పద్ధతిపై మరో సంస్థకు అప్పగించింది. జిల్లాలో ఉన్న పలు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసిన జూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు రెండు జిల్లాల్లో కలిపి ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా అందులో సగం కమీషన్ పద్ధతిపై నేకాఫ్కు(జాతీయ వ్యవసాయ దారుల ఉత్పత్తుల కొనుగోలు, ప్రొసెసింగ్, రిటైలింగ్ సహకార సంఘాల సమాఖ్య)అప్పగించింది. జిల్లాలో గజపతినగరం, చీపురుపల్లి, డొంకినవలస, పార్వతీపురం, బొబ్బిలి, బలిజిపేట కేంద్రాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు, రాజాం కేంద్రాలను ఈ ఏడాది ప్రారంభించనున్నారు. ఇందులో నేకాఫ్కు పొందూరు, గజపతినగరం, చీపురుపల్లి, డొంకినవలస కేంద్రాలను అప్పగించారు. మిగతా కేంద్రాలు జేసీఐ నిర్వహించనుంది. మద్దతు ధర కావాలంటే 60 కిలోమీటర్ల ప్రయాణం జిల్లాలోని డొంకినవలస తదితర కొనుగోలు కేంద్రాల్లో ప్రెస్‌లు లేవని(జూట్‌ను బేళ్లుగా కట్టే యంత్రాలు) దూరంగా ఉన్న గజపతినగరం వంటి కొనుగోలు కేంద్రాల వద్దకు జూట్‌ను తీసుకురావాలని నేకాఫ్ అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని డొంకినవలస కొనుగోలు కేంద్రానికి బొబ్బిలి సమీపంలోని గ్రామాలు, తెర్లాం మండల గ్రామాల రైతులు నారను విక్రరుుంచేందుకు తీసుకువచ్చేవారు. ఇప్పుడు గజపతినగరం తీసుకువెళ్లాలంటే బోలెడంత వ్యయం అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏంచేస్తున్నట్టు? బొబ్బిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ డొంకినవలస కొనుగోలు కేంద్రానికి ప్రెస్ ఏర్పాటు చేయకపోవడం దారుణమని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. మా నుంచి పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేసిన(సెస్సులు) మార్కెట్ కమిటీ తమకు ఆ మాత్రం న్యాయం చేయలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. పాల్తేరు, వాడాడ, తె ర్లాం మండలంలోని సుదూర ప్రాంతాలనుంచి వచ్చే రైతులు గజపతినగరం ఎలా తీసుకెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. సిబ్బంది లేకే జిల్లాలో జేసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గోగు కొనేందుకు సిబ్బంది లేరు. పలువురు రిటైర్డ్ అవుతున్నా కొత్తగా నియామకాలు జరగడం లేదు. నేకాఫ్ సిబ్బందితో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకుని గోగు కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది లక్ష క్వింటాళ్లు లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం ఇప్పటికే కొనుగోలు ప్రారంభించాం. నేకాఫ్ శనివారం నుంచి కొనుగోలు చేపడుతుంది. - జి.రమణ కుమార్, రీజనల్ మేనేజర్, జేసీఐ, విజయనగరం మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను అడిగాం.. బొబ్బిలి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌ను జ్యూట్ ప్రెస్‌ను అమర్చాలని కోరాం. ఆయన మరమ్మతులు చేరుుస్తామన్నారు. ఈ లోగా మేం కొనుగోళ్లు ప్రారంభిస్తున్నాం. అందుకే అప్పటి వరకూ కొనుగోలు కేంద్రాన్ని గజపతినగరంలో ఏర్పాటు చేశాం. అక్కడికే రావాలని రైతులను కోరుతున్నాం. - పి.వి.ఎస్.ఎల్.ఎన్.శాస్త్రి, నేకాఫ్ మేనేజర్ -
‘గిట్టుబాటు’ బాధ్యత ప్రభుత్వానిదే..
త్వరలో వ్యవసాయ, ఉద్యాన శాఖల్లో ఖాళీలన్నీ భర్తీ: పోచారం యాచారం: పంట పండించే శ్రమ రైతులదైతే.. దానికి గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత ప్రభుత్వానిదని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రజలకు సరిపడా కూరగాయలు, పండ్లు, పూలను అందించాలనే లక్ష్యంతో పంట కాలనీలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గునుగల్ గ్రామంలో సోమవారం పంట కాలనీల ప్రాముఖ్యత, రైతులకు కల్పించే రాయితీలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ... మహానగరంతో పాటు శివారు ప్రాంత ప్రజలకు అవసరమైన కూరగాయలు, పండ్లు, పూలలో 70 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అవుతున్నాయని, ధరలు కూడా అధికంగా ఉంటున్నాయని అన్నారు. దీంతో స్థానికంగానే వీటిని పండించాలని సీఎం సూచించారని... అందుకనుగుణంగాప్రభుత్వం ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, షాద్‌నగర్ నియోజకవర్గాల్లో పంట కాలనీలను ఏర్పాటు చేస్తోందన్నారు. వ్యవసాయం, ఉద్యానం రెండూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉద్యోగ ఖాళీలన్నీ త్వరలో భర్తీ చేస్తామన్నారు. పంట కాలనీల రాయితీ కోసం రూ.వెయియ కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రంగారెడ్డి జిల్లాతో పాటు కొత్తగా ఏర్పడిన వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని 5 లక్షల ఎకరాలకు పాలమూరు, డిండి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని మరో మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యాన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారథి, కమిషనర్ వెంకటరాంరెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. -
‘ధర తెగ్గోత’పై అన్నదాత ఆగ్రహం
-మార్కెట్ యార్డు ముట్టడి సుభాష్‌నగర్ జాతీయ వ్యవసాయ మార్కెట్ (నామ్) సర్వర్ డౌన్ ఉందనే నెపంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు వచ్చిన సరుకులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని సోమవారం రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. రోజురోజుకూ మొక్కజొన్న, సోయా ధర తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెంది అధికారులు, వ్యాపారులను నిలదీశారు. ధర ఎందుకు తగ్గిస్తున్నారని ప్రశ్నించారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో సుమారు 500 మందిపైగా రైతులు మార్కెట్‌కమిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ-ట్రేడింగ్ పనిచేయడం లేదని వ్యాపారులు ఇష్టానుసారంగా ఓపెన్యాక్షన్ ద్వారా క్రయ, విక్రయాలు జరుపుతున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నామ్ సర్వర్ డౌన్ ఉండటంతో రైతులకు సరుకుకు సంబంధించిన లాట్ నెంబర్లు ఇవ్వలేదు. ఉదయం సర్వర్ పనిచేయడంతో కొంతమందికి మాత్రమే ఇచ్చారు. దీంతో మిగతా వారికి సరుకును ఓపెన్ యాక్షన్ ద్వారా వ్యాపారులు కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఇందులో మక్కలకు రూ.1250, సోయాకు రూ.2500 లోపే ధర పలుకుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఓపెన్యాక్షన్ ద్వారా తక్కువ ధర వస్తుందని రైతులు అధికారులను నిలదీశారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో రైతులంతా కలిసి మార్కెట్ కమిటీ కార్యాలయం వద్దకు తరలివచ్చి మార్కెట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మార్కెట్‌కమిటీ సెక్రటరీ సంగయ్య రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు విన్పించుకోలేదు. నామ్ సర్వర్ సక్రమంగా లేకపోవడం వల్లే సమస్య ఎదురవుతుందని, ఈ-ట్రేడింగ్‌ను రద్దు చేయాలన్నారు. మొక్కజొన్న, సోయా గురువారం నాటి ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌చేశారు. దీంతో అధికారులు, కమీషన్ ఏజెంట్లను పిలిపించి కొంతమంది రైతులతో కలిసి చర్చలు జరిపారు. చివరకు సోయా ఎ గ్రేడ్ రకానికి రూ.2675, మొక్కజొన్నను రూ.1435 లకు కొనుగోలు చేస్తామని ట్రేడర్లు హామీనివ్వడంతో రైతులు శాంతించారు. విషయం తెలుసుకున్న నగర సీఐ, పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించారు. -
ఉద్యాన రైతులు విలవిల
కాశినాయన : గిట్టుబాటు ధర లేక ఉద్యాన రైతులు విలవిలలాడుతున్నారు. ఏటా పెరుగుతున్న సాగు ఖర్చులతో పాటు సమానంగా పెరగాల్సిన ధరలు అందుకు విరుద్దంగా తగ్గుతూ అన్నదాతను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయి. కరువు సీమలో కాసులు కురిపిస్తాయన్న ఆశతో బొప్పాయి, అరటి పంటలను సాగు చేసిన రైతులు ధరలు పతనం కావడంతో దిగాలు పడుతున్నారు. బొప్పాయి రైతులు కూలీల ఖర్చులు కూడా గిట్టుబాటు కాకపోవడంతో కాయలను తోటల్లోనే వదిలేస్తున్నారు. దీంతో కాయలు చెట్లకే మాగి రాలిపోతున్నాయి. బొప్పాయి, అరటి పంటలు చేతికొచ్చేందుకు 9 నెలల సమయం పడుతుంది. ఎకరా బొప్పాయి సాగుకు 40 వేల నుంచి 50 వేల రూపాయల ఖర్చవుతుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో టన్ను ధర 3 వేల రూపాయలు పలుకుతుంది. అయినా కూడా వ్యాపారులు పంట కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. అరటిపంట లేనప్పుడు ధర పెరుగుతుంది : ఎకరా అరటిపంటను సాగు చేయాలంటే 50 వేల నుంచి 70 వేల రూపాయలు ఖర్చవుతుంది. గతేడాది ఇదే నెలలో టన్ను ధర 10 వేల నుంచి 15 వేల రూపాయల ధర పలకడంతో రైతులు కూడా మొదటి ఏడాదిలో పెట్టిన పెట్టుబడి సొమ్ము అయింది. ఢిల్లీకి చెందిన వ్యాపారులు కడప, పులివెందులలలో మకాం వేసి ప్రతిరోజు 70 నుంచి 100 లారీల అరటికాయలను ఎగుమతి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రైతుల పరిస్థితి దీనంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్‌కు అరటికాయలను పంపిస్తే టన్నుకు 6 వేల రూపాయలు మాత్రమే ఇస్తామని వ్యాపారులు మొండికేసి కూర్చున్నారు. అయితే ఈ సమయంలో సకాలంలో వర్షాలు లేకపోవడంతో గెల సన్నబారిపోయింది. మండలంలో 50 ఎకరాల్లో బొప్పాయి, 700 ఎకరాల్లో అరటి పంటలను సాగుచేశారు. మొదటి సంవత్సరం పంటను ప్రస్తుతం టన్ను 6 వేల నుంచి 10 వేల రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారు. రెండవ సంవత్సరం పంటకు 5 వేల నుంచి 7 రూపాయలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. రైతు సరుకు లేనప్పుడు వ్యాపారులు ధరను పెంచుతారు. అయితే ప్రస్తుతం ధరకు సరుకును అమ్ముకుంటే పెట్టుబడి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉద్యానవనశాఖ అధికారులు, పాలకులు స్పందించి అరటి, బొప్పాయి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ఈ సారీ మద్దతు లేదు
చెరకు రైతులపై కనికరం చూపని ప్రభుత్వం గత ఏడాదిలాగే గిట్టుబాటు ధర రూ.2300లే ఏటా పెట్టుబడులు పెరుగుతున్నందున గిట్టుబాటు కాదంటున్న రైతులు పాత బకాయిలూ చెల్లించని సుగర్ ఫ్యాక్టరీలు తీపిని పంచే చెరకు రైతుకు మాత్రం ఏటా నష్టాల చేదే మిగులుతోంది. పాలకుల అలసత్వం వల్ల అడుగడుగునా చెరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా గిట్టుబాటు ధర లేదని గగ్గోలు పెడుతున్న చెరకు రైతుపై ఈ ఏడాది కూడా ప్రభుత్వం కనికరం చూపలేదు. ఏటా పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ అందుకు తగ్గట్టు గిట్టుబాటు ధర పెంచకుండా ఈ సారీ అన్యాయమే చేసింది. చోడవరం: వరి, చెరకు, నూనె గింజలు, అపరాలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్ర ఆహార మండలి ఏటా ఆయా పంటల సాగు గడువుకు ముందే ఫెయిర్అండ్ రెమ్యునిరేటివ్ ప్రైస్ (ఎఫ్ఆర్పీ) గిట్టుబాటు ధర ప్రకటిస్తుంది. కేంద్రం ప్రకటించిన గిట్టుబాటు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత జోడించి రైతులకు ఇస్తుంది. ప్రభుత్వాలు ప్రకటించిన ధర రైతులకు గిట్టుబాటు కాకపోయినప్పటికీ కనీసం ఇంత ధర వస్తుందనే ఒక లెక్క ఉండి రైతులు ఆయా పంటల సాగు విస్తీర్ణంపై ఆసక్తి చూపేవారు. ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరకు రైతులను నిండా ముంచాయనే చెప్పాలి. ఒక పక్క ఏటా వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగిపోతున్నాయి. విత్తనం, ఎరువులు, పురుగుల మందులు, కూలీ ధరలు భారీగా పెరిగి పోయాయి. గతేడాదే టన్నుకు రూ.2300 ప్రకటిస్తేనే గిట్టుబాటు కాలేదని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేయగా ఈ ఏడాది కనీసం ఒక్క రూపాయి కూడా అద నంగా పెంచకుండా మళ్లీ టన్నుకు రూ.2300గా ఎఫ్ఆర్పీ ప్రభుత్వం ప్రకటించింది. దీనితో చెరకు సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది. 30 శాతం తగ్గిన చెరకు సాగు జిల్లాలో ఏటా లక్షా 80వేల ఎకరాల్లో చెరకు సాధారణ విస్తీర్ణం కాగా గత రెండేళ్లలో విస్తీర్ణం 30 శాతం మేర తగ్గిపోయింది. పంచదార, బెల్లం ధరలు రోజుకో ధర ఉండటంతో చెరకు రైతులు అప్పుల పాలవుతున్నారు. గత ఏడాది టన్నుకు రూ.2300 ఎఫ్ఆర్పీకి రూ.60 ఫ్యాక్టరీలు కలిపి టన్నుకు రూ.2360 కనీస మద్దతు ధర ప్రకటించింది. ఈ ఏడాది కనీసం రూ.2500 ఎఫ్ఆర్పీ ధరను ప్రకటిస్తే మరికొంత ఫ్యాక్టరీలు కలిపి కనీసం టన్నుకు రూ.2700అయినా వస్తుందని రైతులు ఆశించారు. కాని వారి ఆశలు ఆడియాశలయ్యాయి. మరో పక్క గతేడాది బకాయిలు ఇంకా ఫ్యాక్టరీలు రైతులకు ఇవ్వలేదు. జిల్లాలో రూ. 30 కోట్లకు పైబడి బకాయిలు చెల్లించాల్సి ఉంది. రైతులు ప్రత్యామ్నాయంగా సరుగుడు సాగుకు మళ్లిపోతున్నారు. గోవాడ, తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలు ఈ ఏడాది 8.3 లక్షల టన్నుల క్రషింగ్ లక్ష్యం పెట్టుకున్నాయి. ఆ దిశగా ప్లాంటేషన్ చేయాలని రైతులను చైతన్య పరిచినప్పటికీ గిట్టుబాటు ధర ప్రకటన ఆశాజనకంగా లేకపోవడం, పాత బకాయిలు నేటికీ ఫ్యాక్టరీలు చెలించకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపైనే ఆసక్తి చూపుతున్నారు. దీంతో అటు రైతులు, ఇటు ఫ్యాక్టరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
పత్తికి రికార్డు ధర
కష్టపడి పండించిన తెల్లబంగారం రైతుకు సిరులు కురిపిస్తోంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి రికార్డు ధర పలికింది. క్వింటా పత్తి రూ. 6020 పలకడంతో.. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ మార్కెట్లో రూ.5900 పలికింది. -
చెరకు సాగు చేదు!
గిట్టుబాటుకాక రైతుల విముఖత ఏటా తగ్గుతున్న సాగు నాలుగేళ్లుగా పడిపోతున్న చక్కెర ఉత్పత్తి సుగర్ ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకం సుగర్ ఫ్యాక్టరీలు, చెరకు రైతులు ఒకరిపై ఒకరు ఆధారపడి మనుగడ సాగించడం పరిపాటి. కావలసినంత చెరకు రైతులు పండిస్తేనే ఫ్యాక్టరీలు సక్రమంగా నడుస్తాయి. అలాగే ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో బకాయిలు చెల్లిస్తేనే రైతుల జీవనం సాఫీగా సాగుతుంది. అయితే జిల్లాలో ఇప్పుడు ఈ పరిస్థితి దారి తప్పింది. పెరిగిన పెట్టుడులకు అనుగుణంగా సుగర్ ఫ్యాక్టరీలు ధర చెల్లించలేకపోతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కరువైంది. దీంతో గిట్టుబాటు కాక రైతులు చెరకు సాగుపై విముఖత చూపుతున్నారు. ఏటా చెరకు సాగు తగ్గుతూ ఉండటంతో చెరకు ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పాయకరావుపేట: జిల్లాలో సహకార రంగంలో నడుస్తున్న నాలుగు సుగర్ ఫ్యాక్టరీల్లో ఇప్పటికే తుమ్మపాల కర్మాగారం ఈ ఏడాది మూతపడింది. మిగతా ఫ్యాక్టరీల పరిస్థితి కూడా అంతంతమాత్రమే. తాండవ సుగర్ ఫ్యాక్టరీని పరిశీలిస్తే ఇది తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల పరిధిలోని రైతుల భాగస్వామ్యంతో నడుస్తోంది. నాలుగేళ్లుగా చెరకు సాగు విసీర్ణం తగ్గుతూ వస్తుండటంతో ఈ ఫ్యాక్టరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చెరకు సాగు గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృషి ్టసారించడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో నిర్దేశించిన లక్ష్యం మేరకు క్రషింగ్ జరగడం లేదు. దీంతో నిర్వహణ భారం పెరిగి ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. రైతులకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోతున్నారు. తగ్గిన సాగు విస్తీర్ణం తాండవ ఫ్యాక్టరీ పరిధిలో 5389 మంది రైతులు షేర్ హోల్డర్లుగా ఉన్నారు. 2015-16 సీజన్లో రెండు లక్షల టన్నుల చెరకు క్రషింగ్ లక్ష్యం కాగా 1,57,787 టన్నులు మాత్రమే చేశారు. సుమారు 42 వేల టన్నులు తగ్గింది. 10, 500 ఎకరాల్లో ఉండే చెరకు సాగు విస్తీర్ణం 9482 కు తగ్గిపోయింది. దీంతో పూర్తిస్థాయిలో క్రషింగ్ జరగలేదు. ఉత్పత్తయిన పంచదార నిల్వలను బ్యాంకులో తాకట్టుపెట్టి రైతులకు రూ. 25 కోట్లు చెల్లించారు. 2014-15కు సంబంధించి రైతులటు రూ. 6.4 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. పెరిగిన పెట్టుబడులు దుక్కు నుంచి విత్తనం, ఎరువులు, నీటి తడులు, కలుపు నివారణ, జడలు కట్టడం, పురుగు మందులు, నరకడం, ఫ్యాక్టరీకి సరఫరా చేసేందుకు ఎకరాకు రూ.65 వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు దిగుబడి సాధారణ రకం 25, ఒంటి కన్ను మొక్క వేస్తే 30 టన్నులు వచ్చింది. ఫ్యాక్టరీ టన్నుకు రూ.2391 మద్దతు ధర ప్రకటించింది. 25 టన్నుల దిగబడి వచ్చిన వారికి రూ. 59,775, 30 టన్నులు వచ్చిన వారికి రూ.71,730 వచ్చింది. అంటే ఏడాదంతా కష్టపడినా పెట్టుబడిరాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీస మద్దతు ధర టన్నుకు రూ. 2500 ఇవ్వాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రికవరీలో ప్రథమం తాండవ ఫ్యాక్టరీ వరసగా రెండేళ్లలో రికవరీలో ప్రథమ స్థానంలో నిలిచింది. సహకార రంగంలో తాండవ సుగర్స్ 2014-15, 2015-16లో 9.61, 9.63 శాతం రికవరీ సాధించింది. -
మాట తప్పింది
ధాన్యం కొనుగోలును మొక్కుబడిగా చేస్తున్న ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా దెబ్బతిన్న వరి పంట 3లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గిన దిగుబడి ఇప్పటివరకు ప్రభుత్వం కొన్న ధాన్యం 32,626 టన్నులు ఒక్క టన్ను కూడా బుడ్డలు కొనని వైనం తాజాగా బుడ్డలు కొనుగోలు చేయాలంటూ ఆదేశం 30వేల టన్నులు మాత్రమే కొంటామంటూ ప్రకటన ఆందోళనలో అన్నదాతలు రైతులు పండించిన వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పింది. జిల్లావ్యాప్తంగా 3లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో 75 వేల మెట్రిక్ టన్నులు సన్నాలు రకం (1010), మిగిలిన 2.25లక్షల మెట్రిక్ టన్నుల (ఏడీటీ-37) రకం ధాన్యం ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 32,626 టన్నుల సన్నాలు ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. ఒక క్వింటాలు కూడా బుడ్డలు కొనుగోలు చేయలేదు. బుధవారం నుంచి బుడ్డలను కొనుగోలు చేస్తామని పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నా, కేవలం 30వేల టన్నులు మాత్రమే కొంటామని ప్రకటించడం గమనార్హం. ప్రభుత్వం మాట తప్పడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు: జిల్లావ్యాప్తంగా రైతులు ఈ ఏడాది వరి పంటను అధికంగా సాగుచేశారు. నవంబర్‌లో భారీ వర్షాలు కురిశాయి. జలాశయాలు నిండాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈఏడాది వరి పంట పెద్దమొత్తంలో సాగైంది. జిల్లా సాధారణ విస్తీర్ణం 35వేల హెక్టార్లు కాగా 82వేల హెక్టార్లు వరి సాగైంది. 30 శాతం సన్నాలు రకం, 70 శాతం బుడ్డల రకం వరిని రైతులు సాగుచేశారు. ప్రస్తుతం శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి తదితర ప్రాంతాల్లో వరి కోతలు మొదలయ్యాయి. 40 నుంచి 50 శాతం పంట కోతకు వచ్చింది. ధాన్యం బాగా పండితే ఒక ఎకరాకు 30 బస్తాలు దిగుబడి వచ్చేది. అయితే ఈ ఏడాది సుడిదోమ, మెడవిరుపు, తెల్లచీడ తదితర తెగుళ్లు సోకడంతో పంట చాలామేరకు దెబ్బతింది. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం దాదాపు నాలుగు వేల హెక్టార్లల్లో పంట పూర్తిగా దెబ్బతింది. మిగిలిన పంటలో సైతం దిగుబడి సగానికి సగం తగ్గినట్లు తెలుస్తోంది. సాగు విస్తీర్ణం ప్రకారం పూర్తిస్థాయిలో పంట దిగుబడి వచ్చి ఉంటే 4.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చేది. కానీ పంట దెబ్బతినడంతో 3లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. 3లక్షల టన్నుల్లో 75వేల మెట్రిక్ టన్నులు సన్నాలు రకం ధాన్యం ఉండగా, 2.25లక్షల మెట్రిక్ టన్నుల బుడ్డల రకం ధాన్యం ఉంది. సన్నాలు మాత్రమే కొన్న ప్రభుత్వం ప్రభుత్వం రైతులు అధికంగా సాగుచేసిన ఏడీటీ-37 రకం (బుడ్డలు) ధాన్యం కొనలేదు. కేవలం సన్నాలు రకం మాత్రం అరకొరగా కొనుగోలు చేసింది. ఇప్పటివరకు 17కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటాల్‌కు రూ.1,450 చొప్పున 36,626 టన్నుల ధాన్యం కొన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది నామమాత్రపు కొనుగోలు కిందే లెక్క. రైతులు అత్యధికంగా పండించిన బుడ్డలు రకం ధాన్యాన్ని ఒక్క కింట్వాల్ కూడా కొనుగోలు చేయలేదు. పైగా తెగుళ్లు సోకడంతో బుడ్డల రకం ధాన్యం పనికి రాకుండా పోయిందని, ధాన్యం కొనుగోలు చేసినా నూక తప్ప బియ్యం వచ్చే పరిస్థితి లేదని పౌరసరఫరాల శాఖాధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే 12 టన్నుల బుడ్డలు కొని మిషన్ ఆడించి పరిశీలించగా మొత్తం నూక వస్తోందని, దీంతో విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేసి బుడ్డల కొనుగోలుకు ప్రత్యేక అనుమతి కోసం వేచి చూడాల్సి వచ్చిందని వారు పేర్కొంటున్నారు. బయ ట మార్కెట్లో బుడ్డలు కొనేవారు కరువడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ఇచ్చి కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు అధికంగా పెట్టి ఆరుగాలం శ్రమించినా వరి తెగుళ్ల బారిన పడి సగానికి సగం కూడా దిగుబడి రాలేదని ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు కూడా రావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండించిన ధాన్యం అయినా ప్రభుత్వం తక్షణం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎఫ్‌సీఐకి బుడ్డలు.. కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్ జిల్లాలో పండిన బుడ్డలు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ప్రభుత్వం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. బుధవారం నుంచి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని విజయవాడ ధాన్యం మిల్లులకు తరలించాలని సూచించింది. అక్కడ ధాన్యాన్ని బాయిల్ చేసి ఎఫ్సీఐకు తరలించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం విజయవాడ రైస్ మిల్లర్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం నుంచి బుడ్డల రకం ధాన్యాన్ని క్వింటాల్ రూ.1,410 చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారి జయరాములు ‘సాక్షి’కి తెలిపారు. అయితే జిల్లావ్యాప్తంగా దాదాపు 2లక్షల టన్నులు బుడ్డల ధాన్యం ఉండగా కేవలం 30వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేస్తామనడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో మిగిలిన ధాన్యాన్ని రైతులు ఎక్కడ ఎలా అమ్ముకోవాలో తెలియని పరిస్థితి నెలకుంది. మరోవైపు బయట మార్కెట్ లో బుడ్డల రకం ధాన్యం ధర తక్కువ ఉంది. క్వింటాల్ రూ.800 మించి కొనే పరిస్థితి లేదు. ధాన్యాన్ని కొంటామన్న ప్రభుత్వం మాట తప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
చెరకు వేయలేం!
గిట్టుబాటు ధర పెంచాలి, బకాయిలు చెల్లించా షుగర్స్ కమిషనర్‌ను నిలదీసిన రైతులు కారు ముందు రైతు సంఘం నాయకుల బైఠాయింపు చోడవరం: గిట్టుబాటు ధర ఇవ్వాలని, చెరకు బకాయిలు చెల్లించాలని రైతులు రాష్ట్ర సుగర్స్ కమిషనర్ మురళిని నిలిదీశారు. సోమవారం గోవాడ సుగర్ ప్యాక్టరీకి వచ్చిన కమిషనర్‌ను రైతులు చుట్టుముట్టారు. క్రషింగ్ సీజన్ కావడంతో ఫ్యాక్టరీకి చెరకు తీసుకొచ్చిన రైతులు, పరిసర గ్రామాల రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మునుపెన్నడూలేని విధంగా ఈ ఏడాది సకాలంలో చెరకు బకాయిలు చెల్లింపులో చాలా ఆలస్యం జరిగిందని, పెట్టుబడులకు తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నామని రైతులు గగ్గోలు పెట్టారు. తమ కష్టాలు చెప్పుకుందామంటే పాలకవర్గం, అధికారులు పట్టించుకోవడం లేద ని ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నుకు రూ.3 వేలు గిట్టుబాటు ధర ఈ ఏడాది ఇవ్వాలని, లేదంటే వచ్చే ఏడాది నుంచి చెరకు పంట వేయలేమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది దశలవారీగా పేమెంట్స్ ఇస్తామని యాజమాన్యం చెబుతోందని, అలాకాకుండా అంతా ఒకే సారి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. చెరకు ఫ్యాక్టరీలను, రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ధ్వజమెత్తారు. హుద్‌హుద్ తుఫాన్‌కు ఫ్యాక్టరీ నష్టపోయినా కనీసం ఇన్సూరెన్సు కూడా ఇవ్వలేదన్నారు. టన్నుకు మూడు వేలు ఇవ్వాలి అనంతరం ఎపీ చెరకు రైతు సంఘం నాయకులు మరికొంత మంది రైతులు వచ్చి కమిషనర్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. కమిషనర్ కారు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. అనకాపల్లి సుగర్ ప్యాక్టరీని తెరిపించాలని, టన్నుకు రూ.3 వేలు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాతబకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గోవాడ ఫ్యాక్టరీలో కటింగ్ ఆర్డర్లు సక్రమంగా ఇవ్వడం లేదని, ఫ్యాక్టరీలో జరిగిన అవినీతిపై వెంటనే విచారణ నివేదిక బహిర్గతం చేయాలని, యంత్రాల కొనుగోలులో అవకతవలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ కిందకు దిగి రైతు సంఘం నాయకులతో మాట్లాడారు. బకాయిలు నెలాఖరులోగా చెల్లిస్తామని, మిగతా విషయాలను ప్రభుత్వం దృ ష్టికి తీసుకెళతామన్నారు. అంతకు ముందు వడ్డాది చెరకు కాటాను, రేవళ్లు ప్రాంతంలో రైతులను కలిసి చెరకు సాగుపై కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలి తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలంటూ కార్మికులు సుగర్స్ కమిషనర్‌ను కోరారు. సిబ్బందికి సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న గోవాడ యాజమాన్యం అదనంగా ఇష్టారాజ్యంగా కాంట్రాక్టు సిబ్బందిని నియమిస్తోందని గుర్తింపు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు తోట శంకరావు, శరగడం రామునాయుడు కమిషనర్ దృష్టికి తెచ్చారు. కారుణ్య నియామకాలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా పదవీవిరమణ వయస్సును 60ఏళ్లకు పెంచాలని కోరారు. తమను పర్మినెంట్ చేయాలని, జీతభత్యాలు పెంచాలని ఫ్యాక్టరీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు బండారు శ్రీనివాసరావు, ఫ్యాక్టరీ సెక్యూరిటీ కంట్రోల్ లేబర్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు జె.రమణ, టి.గంగరాజు కోరారు. -
ధర పతనంతో ఆగిన ఊపిరి
కంబదూరు(చిత్తూరు జిల్లా): పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో టమాట రైతు గుండె ఆగిపోయింది. పంటచేలోనే ఆ రైతు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం జెక్కిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. గొల్ల నాగన్నకు 20 ఎకరాలు పొలం ఉంది. పెళ్లి సమయంలో కుమార్తెకు నాలుగెకరాలు పంచి ఇచ్చారు. 12 ఎకరాలు వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేస్తూ మూడేళ్లుగా చాలా నష్టపోయారు. నాలుగెకరాలలో ఐదు బోర్లు వేయించగా ఒక బోరులో మాత్రమే నీరు పడింది. బోర్ల కోసం రూ. 1.20 లక్షలు ఖర్చు చేశారు. నాలుగెకరాల తోటలో రెండెకరాలలో 448 రకం టమాటను ట్రెల్లీస్ (కర్రల ఏర్పాటు విధానం)తో సాగు చేశాడు. ఇందు కోసం రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. గురువారం ఉదయం భార్య తో కలిసి పదిమంది కూలీలతో తోటకు వెళ్లారు. పంట తొలగించి 15 కిలోల సామర్థ్యం గల 150 బాక్సులు నింపుతున్నారు. 15 కిలోల టమాట బాక్సు రూ. 30ల ప్రకారం ఓ వ్యాపారితో ధర కుదుర్చుకున్నాడు. ఈ ప్రకారం 150 బాక్సులకు రూ. 4500 మాత్రమే వస్తుంది. ఇందులో 10 మంది కూలీలకు రూ. 2 వేల దాకా కూలీ చెల్లించారు. ఇక మిగిలేది రూ. 2500 అని నిర్ధారించుకున్న రైతు మనోవేదనకు గురై కుంగిపోయాడు. పంటచేలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఆయనకు తిమ్మాపురం ఏపీజీపీలో రూ. 1.08 లక్ష పంట రుణం, రూ. 1977 రీషెడ్యుల్ రుణం ఉండగా రుణమాఫీ కింద రెండింటికి కలిపి రూ. 25,583 మాఫీ అయ్యింది. -
గిట్టుబాటు ధర కోసం పత్తి రైతుల ఆందోళన
పత్తికి గిట్టుబాటు ధర లభించటం లేదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం బాలెంలో చోటుచేసుకుంది. గ్రామంలో ఉన్న మంజీత్ కాటన్ కంపెనీ సీసీఐ అధికారులతో కుమ్మక్కై తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేస్తోందని సోమవారం ఉదయం మిల్లు ఆవరణలోనే రైతులు ధర్నాకు దిగారు. మిల్లులోని ఒక షెడ్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం అధికారులు ప్రకటించారు. అయితే, మిల్లు నిర్వాహకులు షెడ్డును ఇవ్వకపోవటంతో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. పెపైచ్చు క్వింటాలుకు పత్తి రూ.4 వేలు పలుకుతుండగా రూ.3 వేలకే మిల్లు కొనుగోలు చేస్తోందని రైతులు ఆరోపించారు. దీనిపై రెండు వందల మంది రైతులు మిల్లు ఆవరణలో ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న అధికారులతో వాగ్వాదానికి దిగారు. -
అరటి రైతు గిలగిల
9 నెలలకే పండిపోతున్న వైనం తగ్గిన కాయ పరిమాణం పడిపోయిన ధర ఎకరాకు రూ.1.5 లక్షల నష్టం కానరాని ఉద్యానశాఖాధికారులు తాడేపల్లి రూరల్: గతేడాది అరటి పంటను సాగు చేసిన రైతులు ఒకింత ఆధాయాన్ని పొందారు. అయితే ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఏటా ఈ సీజన్లో పెళ్ళిళ్లు, శుభముహుర్తాలు, పండుగలు ఉండటంతో అరటికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది అందుకు విరుద్దుంగా అరటి రైతులు నష్టాలు చవిచూసే పరిస్థితి తల్తెతింది. జిల్లాలోని అరటితోటల పెంపకానికి కృష్ణాతీరం పేరొందిన ప్రాంతం. తుళ్లూరు, తాడేపల్లి, దుగ్గిరాల, కొల్లిపర తదితర మండలాల్లో వేలాది ఎకరాలలో అరటి పంటను రైతులు సాగుచేస్తున్నారు. ఎకరానికి కౌలుతో కలిపి రూ. 90 వేలు పెట్టుబడి అవుతోంది. వర్షాలు సకాలంలో కురువకపోవడంతో బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేయడం వల్ల అరటి రైతులకు ఈ సంవత్సరం కలిసి రాలేదని రైతులు చెబుతున్నారు. పంట వేసిన దగ్గర నుండి 11 నెలలకు పంట చేతికి వస్తుంది. ఈ ఏడాది మాత్రం 8-9 నెలలోనే అరటి గెలలు పండి ధర సగానికి సగం పడిపోయింది. ఈ సంవత్సరం వర్షాలు లేక, ఎండా కాలాన్ని తలపిస్తుండడంతో గెలలు ముందుగానే పక్వానికి వస్తున్నాయి కానీ కాయ పరిమాణం మాత్రం చాలా తక్కువగా ఉంటోంది. అదే 11 నెలలకు గనుక పక్వానికి వస్తే ఇప్పుడున్న సైజుకు రెండింతలు ఉంటుంది. దాంతో మార్కెట్లో కూడా అనుకున్న రేటు వస్తుందని రైతులు అంటున్నారు. ఆగిపోయిన ఎగుమతులు.. మన ప్రాంతంలో పండిన అరటి గెలలు రాజస్తాన్, మహారాష్ట్ర, ఒరిస్సా, బెంగాల్ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. గెల 9 నెలలకే పండడంతో ఇతర రాష్ట్రాల ఎగుమతి ఆగిపోయింది. రూ. 250లకు అమ్ముడుపోయిన గెల రూ. 100-130 లకే అమ్మాల్సి వస్తోంది. ఎకరానికి రూ.1.5 లక్షలు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. అరటి తోటల్లో లోపాలను గుర్తించి, సలహాలు సూచనలు ఇచ్చే చర్యలు ఉద్యానవన శాఖాధికారులు చేపట్టలేదని రైతులు వాపోతున్నారు. -
టమాట రైతులకు గడ్డుకాలం
గణనీయంగా తగ్గిన ధరలు కష్టాల్లో అన్నదాతలు పెట్టుబడులు కూడా దక్కని వైనం టమాట రైతులకు గడ్డుకాలం వచ్చిపడింది. గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు గణనీయంగా తగ్గడంతో అన్నదాత కుదేలవుతున్నాడు. ఓ వైపు పట్టుగూళ్ల ధరలు తగ్గి పట్టు పరిశ్రమ రైతును దెబ్బతీస్తుంటే మరో వైపు ప్రత్యామ్నాయంగా సాగు చేసిన టమాటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కోలారు : పట్టు సాగు తర్వాత కోలారు జిల్లాలో రైతులు అత్యధికంగా టమాట సాగుపైనే ఆధారపడి ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, పొరుగు రాష్ట్రాల్లో టమాట దిగుబడి ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది కోలారు జిల్లాలో టమాట సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో 15 కిలోల టమాట బాక్స్ ధర రూ. 700 నుంచి రూ. 1,500 వరకు పలికింది. అప్పట్లో టమాట సాగు చేసిన రైతుల ఇంటిలో కాసుల వర్షమే కురిసింది. ఈ నేపథ్యంలోనే కోలారు జిల్లా వ్యాప్తంగా 9,695 హెక్టార్ల(23,956 ఎకరాలు)లో ఈ ఏడాది రైతులు టమాట సాగు చేశారు. పంట దిగుబడి కూడా భారీగానే వచ్చింది. కోలారు జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో టమాట వ్యాపారం పుంజుకుంది. ఒక ఎకరా విస్తీర్ణంలో టమాట పండించేందుకు రైతులు రూ. 70 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు పెట్టారు. ఈ లెక్కన మార్కెట్లో ఒక బాక్స్ టమాట రూ. 275 నుంచి రూ. 300 వరకు అమ్ముడు పోతే రైతులకు గిట్టుబాటుగా ఉంటుంది. గిట్టుబాటు కాని ధర రెండు వారాలుగా కోలారు మార్కెట్లో ఒక బాక్స్ టమాట ధరలు రూ. 30 నుంచి రూ. 150 వరకు పలుకుతున్నాయి. ఈ ధర రైతులు పంట దిగుబడిని మార్కెట్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చులకు సైతం సరిపోవడం లేదు. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా టమాట దిగుబడి గణనీయంగా ఉండడంతో ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి పంట ఎగుమతి కావడం లేదు. ఫలితంగా కోలారు జిల్లాలోని పలు మార్కెట్ యార్డులో టమాట నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. ఇదే సందర్భంలో కీటకాల వల్ల టమాటలో నాణ్యత తగ్గి ధర పడిపోవడానికి కారణమవుతోంది. కీటకాల వల్ల నష్టపోయిన టమాటను ఏపీఎంసీ యార్డ్ వద్ద కుప్పలుగా పడేస్తున్నారు. మరి కొందరు రైతులు పంట పీకేందుకు అయ్యే కూలీల ఖర్చు కూడా గిట్టుబాటు కావడం లేదంటూ పొలంలోనే పంటను వదిలేస్తున్నారు. ఆసియాలోనే రెండవ స్థానంలో ఉన్న కోలారు ఎపీఎంసీ యార్డుకు నిత్యం 200 లోడ్ల టమాట వస్తోంది. ధరలు తగ్గిన సమయంలో టమోటా నిలువ చేయడానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని టమోటా సంస్కరణా ఘటకాన్ని నరసాపురం పారిశ్రామిక వాడలో ప్రారంభించాలని రైతుల డిమాండు, తద్వారా ధరలు తగ్గిన సమయంలో సంస్కరణా కేంద్రాలకు టమాట తరలించి రైతులకు గిట్టుధర అందించడానికి సాధ్యమవుతుందని పలువురు సూచిస్తున్నారు. -
రోడ్డెక్కిన పొగాకు రైతులు
టంగుటూరు: గిట్టుబాటు ధర కోసం పొగాకు రైతులు రోడ్డెక్కారు. గిట్టుబాటు ధరలు ఎలాగూ లేవు. కనీసం నిన్నమొన్నటి ధరలు కూడా అమాంతం రూ.20 తగ్గించడంతో ఆగ్రహించిన స్థానిక రెండో పొగాకు వేలం కేంద్రం రైతులు కొనుగోళ్లు నిలిపేశారు. వేలం కేంద్రం ఎదురుగా స్థానిక ఆర్అండ్బీ రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ నిలిపి తమ నిరసన తెలిపారు. రెండో పొగాకు వేలం కేంద్రంలో గురువారం ఎం.నిడమలూరు రైతులు 339 పొగాకు బేళ్లు కొనుగోళ్లకు ఉంచారు. వరుసగా 65 బేళ్ల వరకు వేలం జరగ్గానే గిట్టుబాటు ధర లేదంటూ రైతులు కొనుగోళ్లను అడ్డుకున్నారు. వెంటనే వేలం కేంద్ర సూపరింటెండెంట్ మనోహర్ చొరవ తీసుకొని వ్యాపారులు, రైతులతో చర్చించారు. కనీసం నిన్న మొన్నటి ధరలకు కూడా రూ.20 వరకూ తగ్గించి వేశారంటూ రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరువర్గాలతో చర్చించి వారి అంగీకారం మేరకు తిరిగి వేలం ప్రారంభించారు. వరుసగా 20 బేళ్లకు వేలం ముగిసినా ధరల్లో మార్పులేమీ లేకపోవడంతో రైతులు కొనుగోళ్లు మరొకసారి అడ్డుకున్నారు. మరింత పతనమైన ధరలతో ఆగ్రహంగా ఉన్న రైతులు వేలం కేంద్రం ఎదురుగా ఉన్న ఆర్అండ్బీ రోడ్డుపై బైఠాయించారు. ఆ మార్గంలో రాకపోకలు నిలపేశారు. వ్యాపారులు తాము ఇచ్చిన ఇండెంట్ ప్రకారం పొగాకు కొనుగోలు చేయాలని, టుబాకో బోర్డు రైతుల పక్షం వహించి న్యాయం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఎస్టీసీని రంగంలోకి దించి గిట్టుబాటు ధర చెల్లించి పొగాకు కొనుగోలు చేయాలని రైతులు నినదించారు. పోలీసుల సూచనలతో సూపరింటెండెంట్ రైతుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. వేలం కేంద్రం సూపరింటెండెంట్ మాట్లాడుతూ పరిస్థితిని టుబాకో బోర్డుకు పరిస్థితి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. -
మామిడిరైతులకు అందని గిట్టుబాటు ధర
-
చేయూత ఏదీ?
ధర్మవరం : చేనేత కార్మికునికి చచే ్చదాకా సగం గుంత.. సచ్చినాక నిండు గుంత అన్న నానుడి అక్షర సత్యం అవుతోంది. మగ్గం గుంతల్లోనే ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. ఎదుగూ బొదుగూ లేని జీవితాలతో కార్మికులు అవస్థ పడుతున్నారు. పవర్‌లూమ్స్‌పై విరివిగా తయారవుతున్న వస్త్రాలు చేనేత రంగం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. జిల్లాలోని ధర్మవరం, సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లి, ఉరవకొండ, సిండికేట్‌నగర్, యాడికి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో 80 వేల కుటుంబాలకు పైగా చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా జిల్లాలో 5లక్షల మందికి పైగా చేనేత రంగంలో ఉపాధి పొందుతున్నారు. పవర్‌లూమ్స్‌పై పలు డిజైన్లలో చీరలు తయారవుతుండడం, వాటినే చేనేత చీరలుగా తక్కువ ధరకు వ్యాపారులు విక్రయిస్తుండడంతో చేనేత చీరలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఏడాదికి రూ. కోటి విలువైన చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి దాకా ఆ దిశగా చర్యలు చేపట్టిన పాపానపోలేదు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడమే తప్ప ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చేనేత కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉన్నత చదువులకు దూరం చేనేతల పిల్లలు ఉన్నత చదువులకు నోచుకోవడం లేదు. కుటుంబం గడవటమే కష్టంగాఉన్న నేపథ్యంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి 10వ తరగతితో సరిపెడుతున్నామని చేనేత కార్మికులు చెబుతున్నారు. చేనేత సహకార సంఘాలున్నా అధిక శాతం మంది కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్దనే పనిచేయాల్సి వస్తోంది. వారు నిర్ణయించిందే ధర. ఇచ్చేదే కూలి. పాలకులకు పట్టనిహెల్త్ కార్డులు నిత్యం మగ్గం గుంతలో గడిపే చేనేత కార్మికులకు అనారోగ్యం చేస్తే ఆసుపత్రికి వెళ్లేందుకు చేతిలో పైసా ఉండని పరిస్థితి. 2012 ఆగస్టు15న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రీయ స్వచ్చత బీమా యోజన పేరిట ఆరోగ్య పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒక చేనేత కుటుంబంలో ఐదుగురు సభ్యులకు రూ. 37,500 కేటాయించాలని నిర్ణయించారు. ఏడాదిలో ఈ మొత్తాన్ని దేశంలోని ఏ ఆసుపత్రిలో అయినా వాడుకోవచ్చునని సూచించారు. అయితే.. ఆ హెల్త్ కార్డుల కాలపరిమితి ముగుస్తోందని కార్మికులు చెప్పడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరునెలల గడువును పెంచారు. ఆ గడువు గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. కార్మికులు కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. రుణాల్లోనూ మొండిచేయే.. ఎలాంటి హామీ లేకుండా ఒక్కొక్క చేనేత కుటుంబానికి రూ.25వేల నుంచి రూ.1.50 లక్షలవరకు రుణాలను మంజూరు చేసేవారు. వీటిపై ప్రభుత్వమే 84 శాతం గ్యారంటీ ఇచ్చేది. అయితే.. ఈ నిధులను రూ.25 వేలకు మించి ఇవ్వడం లేదని చేనేత నాయకులు చెబుతున్నారు. జిల్లాలో ఈ రుణాలను పొందినవారు వందల్లో ఉంటారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేనేత కార్మికుల కోసం బడ్జెట్లో ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.46 కోట్లతోనే సరిపెట్టారు. ఇందులో ఖర్చులు, చేనేతశాఖ సిబ్బంది వేతనాలు పోను ఎంత మేర కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. చేనేత ఆత్మహత్యలు పెరుగుతాయి ఇప్పటికే చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటువంటి తరుణంలో ఊతమివ్వాల్సిన ప్రభుత్వాలు మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం పట్టించుకోకపోతే చేనేత రంగం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే చీరలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందే. లేకపోతే చేనేతల సత్తా ఏమిటో ప్రభుత్వానికి తెలియజేస్తాం. -పోలా రామాంజినేయులు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేనేత రంగాన్ని విస్మరించారు బడ్జెట్లో చేనేత రంగానికి కేటాయించిన నిధులను చూస్తే ప్రభుత్వం కార్మికులను పూర్తిగా విస్మరించిందని చెప్పొచ్చు. ఇప్పటికే చేనేత రంగం పూర్తిగా దెబ్బతినింది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ రంగమే మనుగడ కష్టం. అదీకాక చేనేత రంగానికి చేయూతగా ఉన్న పథకాలన్నింటినీ ఒకేగాటన కట్టారు. దీని వల్ల కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. -జింకా చలపతి, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గతంతో పోల్చితే చాలా తక్కువ ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కేటాయించిన రూ.48 కోట్లు కేవలం అధికారులకు సంబంధించిన వేతనాలు, ఇతరత్రా వాటికే సరిపోతాయి. ఇక కార్మికులకు ఏమి ప్రయోజనం? అసలే గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్న చేనేత రంగానికి ఇది అశనిపాతమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైంది. చేనేతలను మోసం చేసిన ఏ ప్రభుత్వానికీ మనుగడ ఉండదు. -రంగన అశ్వర్థనారాయణ, కాంగ్రెస్‌నాయకుడు 18డిఎంఎం02ఎ- మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడు 18డిఎంఎంఎ02బి- పోలా రామాంజినేయులు 18డిఎంఎం012స- జింకాచలపతి 18డిఎంఎం02డి- రంగన అశ్వర్థనారాయణ -
టమాఠా కిలో రూ.1.90 పైసలే..
జిన్నారం : రైతు కాయకష్టం పశువుల పాలైంది. చేతికొచ్చిన టమాటా పంట పొలానికే పరిమితమైంది. తెంపితే కూలీల ఖర్చులు మీదపడతాయని అలాగే వదిలేశారు.. మార్కెట్లో ధర లేకపోవడంతో ఎందుకూ పనికిరాకుండా కుళ్లిపోతోంది. ఈ దుస్థితిని చూసి రైతన్న కంటనీరు పెడుతున్నాడు. జిన్నారం మండలం గుమ్మడిదల, కానుకుంట, కొత్తపల్లి, నల్లవల్లి, అనంతారం, సోలక్పల్లి, జిన్నారం తదితర గ్రామాల్లో రైతులు సుమా రు 400 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఆరు నెలల క్రితం పంటకు ఎక్కువగా డిమాండ్ ఉండడంతో రైతులు టమాటా సాగుకు మొగ్గు చూపారు. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ఎకరా టమాటా సాగుకు రూ.20 నుంచి రూ.25 వేల వరకు వెచ్చించారు. ఖర్చులన్నీ పోనూ రైతుకు ఏటా రూ.10 నుంచి రూ.20 వేలు మిగిలేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 26 కిలోల టమాటా బాక్సు ప్రస్తుతం మార్కెట్లో రూ.50 పలుకుతుంది. అంటే కిలో ధర రూ.1.90 పైసలన్నమాట. రైతులు చేనులోంచి మార్కెట్‌కు 26 కిలోల టమాటా బాక్సును తరలించేందుకు రూ.100 ఖర్చవుతుంది. అంటే ఒక్క బాక్సుపై రూ.50 నష్టం వస్తుంది. పంటను సాగు చేస్తే దిగుబడులు రావాలి.. కాని అదనంగా ఖర్చవుతుందని భావించిన రైతులు టమాటాను తెంపేందుకు కూడా ఇష్టపడటం లేదు. దీంతో మండల వ్యాప్తంగా 400 ఎకరాల్లో రైతులు పంటను చేనులోనే వదిలేశారు. ఈ పంట లాభాల మాట అటుంచి కూలి ఖర్చులుకూడా గిట్టుబాటు కాక చేనులోనే వదిలేసి చేతులు దులుపుకొన్నారు. ప్రస్తు తం పంట పశువులకు మేతగా మారింది. రూ. 25 వేల వరకు ఖర్చు చేసిన పంట చేతికి రాకపోవటంతో రైతులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. -
సోలార్ డ్రయ్యర్‌తో మేలు
ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే అయినకాడికి తెగనమ్ముకోవడమో లేక చెత్తకుప్పలో పారేయడమో కాకుండా.. వ్యవసాయోత్పత్తులను చక్కగా శుద్ధిచేసి, రూపం మార్చి అమ్ముకోగలిగితే రైతు కుటుంబాలు లేదా రైతు సంఘాల ఆదాయం బాగా పెరుగుతుంది. ఉదాహరణకు.. టమాటా మార్కెట్ ధర బాగా తగ్గిపోయినప్పుడు టమాటాలను ముక్కలు కోసి ఒరుగులుగా ఎండబెట్టి, పొడి చేసి అమ్ముకునే వీలుంది. సంప్రదాయ పద్ధతుల్లో కన్నా సోలార్ డ్రయ్యర్ల సహాయంతో ఈ పనిచేస్తే వేగంగా పని కావడంతోపాటు, సరుకు నాణ్యత కూడా చాలా బాగుంటుంది. టమాటాతోపాటు కొబ్బరి, ద్రాక్ష, అంజూర, క్యారెట్, మామిడి, ఉల్లి, కరివేపాకు, అల్లం, గోధుమగడ్డి వంటి వ్యవసాయోత్పత్తులతోపాటు మాంసం, చేపలు, రొయ్యలను కూడా ఈ పద్ధతిలో వేగంగా, పరిశుభ్రమైన వాతావరణంలో ఎండబెట్టవచ్చు. మాంసాన్ని సోలార్ డ్రయ్యర్లో ఒక్క రోజులోనే దుమ్మూ ధూళి పడకుండా ఎండబెట్టవచ్చని, కిలో మాంసం ఎండబెడితే అరకిలో ఒరుగులు వస్తాయని ఎన్ఐఆర్డీ కన్సల్టెంట్ ఖాన్ ‘సాక్షి’తో చెప్పారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ(ఎన్ఐఆర్డీ- రాజేంద్రనగర్, హైదరాబాద్) ఇందుకు మార్గం చూపుతోంది. ఎన్ఐఆర్డీ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రామీణ సాంకేతిక ప్రదర్శనలో హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలు సోలార్ డ్రయ్యర్లను ప్రదర్శించాయి. సొసైటీ ఫర్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్(040-23608892) 8 కిలోలు, 50 కిలోలు, 100 కిలోల సామర్థ్యం కలిగిన సోలార్ డ్రయ్యర్లను అందుబాటులోకి తెచ్చింది. టీవేవ్ పవర్‌టెక్ సంస్థ (040-27266309) సోలార్ డ్రయ్యర్లను ప్రదర్శనకు ఉంచింది. డ్రయ్యర్లను కొనుగోలు చేసే మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి 40 శాతం రాయితీ లభించే వీలుందని చెబుతున్నారు. సోలార్ ఫ్రిజ్‌లు సైతం అందుబాటులోకి వచ్చాయి. విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే రైతులు, మత్స్యకారులు, యువతీ యువకులు సోలార్ డ్రయ్యర్ల ద్వారా స్వయం ఉపాధి పొందవచ్చు. వివరాలకు ఎన్ఐఆర్డీలోని గ్రామీణ మౌలిక సదుపాయాల కేంద్రం ప్రొఫెసర్ అండ్ హెడ్ డాక్టర్ శివరాం (94408 46605 టజీఠ్చిః జీటఛీ.జౌఠి.జీ)ను సంప్రదించవచ్చు. - దండేల కృష్ణ, సాగుబడి డె్స్క్ -
పంటలను ప్రభుత్వమే కొనాలి
రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన: గవర్నర్ కదిరి: ‘సంక్రాంతి అంటే రైతుల పండుగ. రైతన్న కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. మార్కెట్లో రైతులకు అన్యాయం జరుగుతోంది. అక్కడంతా దళారుల హవా నడుస్తోంది. వారే లాభాలు గడిస్తున్నారు. రైతన్న మాత్రం పెట్టుబడులు కూడా చేతికందక నష్టపోతున్నాడు. అందుకే రైతు పండించిన పంటను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తే మంచిది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలి’ అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన అనంతపురం జిల్లా కదిరిలో శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లో కూడా సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని పేర్కొన్నారు. మళ్లీ పాత రోజులు రావాలని కోరారు. గవర్నర్ వెంట మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎంపీ నిమ్మల కిష్టప్ప, వైఎస్సార్సీపీ స్థానిక ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తదితరులున్నారు. -
కష్టకాలం
2014 రైతన్నను నిండా ముంచింది. వర్షాభావం వెంటాడి పంట చేలు ఎండిపోయాయి. ఖరీఫ్ సాంతం కష్టాలతోనే సాగింది. రబీపై ఆశలూ సన్నగిల్లుతున్నా యి. అరకొర వర్షాలకు అంతంతమాత్రంగా సాగు చేసిన పంటలు సరైన దిగుబడి రాక.. ఆ కొద్ది పంటలకూ గిట్టుబాటు ధరలేక.. పెట్టుబడులు కూడా పూడని పరిస్థితుల్లో జిల్లాలో పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఖమ్మం వ్యవసాయం: 2014 రైతన్నలకు ఏమాత్రం కలిసి రాలేదు. వర్షాభావ పరిస్థితులు వెంటాడటంతో నిత్యం కష్టాలతోనే కలిసి సాగారు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సరైన సమయానికి పంటలు వేయలేకపోయారు. వ్యవసాయశాఖ ఒకటి తలిస్తే..అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. జలాశయాల్లోకి నీరు చేరకపోవడంతో ప్రధాన పంటల్లో ఒకటైన వరి సాగు విస్తీర్ణం పడిపోయింది. అరకొరగా పండిన పంటలకు సరైన ధర కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. రుణమాఫీ ప్రకటించిన ప్రభుత్వం స్వల్పమొత్తం..అది కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో రైతులు అప్పులపాలయ్యారు. ప్రైవేట్ వడ్డీలకు తెచ్చి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు. అటు పంటలు కలిసిరాక..ఇటు అప్పులు కావడంతో గుండెచెదిరిన రైతులు బలవణ్మరణానికి పాల్పడ్డారు. కన్నీటి‘వర్షం’ ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభం నుంచి వర్షాలు అనుకూలంగా కురవలేదు. సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షాలు కురిశాయి. తొలకరి నెల జూన్‌లో సాధారణ వర్షపాతం 132 మి.మీ కాగా కేవలం 29.7 మి.మీ వర్షపాతం నమోదైంది. అంటే -77.5 మి.మీ వర్షపాతం తక్కువగా కురిసింది. జూలైలో 314 మి.మీ వర్షపాతానికి గాను 241.6 మి.మీ, ఆగస్టులో 280 మి.మీలకు 188.1 మి.మీలు, సెప్టెంబర్‌లో 164 మి.మీలకు 179 మి.మీ, అక్టోబర్‌లో 106 మి.మీలకు 96.8 మి.మీలు, నవంబర్‌లో 21 మి.మీలకు 14 మి.మీల వర్షపాతం మాత్రమే కురిసింది. మొత్తంగా ఖరీఫ్ (జూన్ నుంచి సెప్టెంబర్)లో కేవలం 53 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. మొత్తం 890 మి.మీ వర్షపాతానికి గాను 638 మి.మీ అంటే - 252 మి.మీ తక్కువ వర్షపాతం నమోదైంది. కష్టాల ‘సాగు’ తొలకరి నుంచి వర్షాలు అనుకూలించపోవడంతో ఈ ఏడాది పంటల విస్తీర్ణం బాగా తగ్గింది. ఖరీఫ్ సీజన్లో సాగు సాధారణ విస్తీర్ణం 3,51,257 హెక్టార్లుగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది. కేవలం 3,31,494 హెక్టార్లలో మాత్రమే పంటలు వేసినట్లు గుర్తించింది. వరి సాధారణ సాగు విస్తీర్ణం 1,32,727 హెక్టార్లు కాగా కేవలం 1,12,461 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. పత్తి 1,62,402 హెక్టార్లకు గాను 1,68,232 హెక్టార్లు, మొక్కజొన్న 14,305 హెక్టార్లకు 14,692, పెసర 8,883 హెక్టార్లకు 6,248 హెక్టార్లు, కంది 6,977 హెక్టార్లకు 3,726, వేరుశనగ 357 హెక్టార్లకు 183, మినుము 261 హెక్టార్లకు 16, మిరప 20,135 హెక్టార్లకు 20,875, చెరకు 3,978 హెక్టార్లకు 4,545, పసుపు 372 హెక్టార్లకు 109 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. వర్షాభావ ప్రభావం రబీ పంటలపైనా పడింది. రబీ వరి సాగు విస్తీర్ణం 36,481 హెక్టార్లకు 2,343 హెక్టార్లు, జొన్న 1937 హెక్టార్లకు 208, మొక్కజొన్న 19,021 హెక్టార్లకు 7,187, పెసర 4,527 హెక్టార్లకు 4,197, మినుము 3,779 హెక్టార్లకు 1,858, వేరుశనగ 5,873 హెక్టార్లకు 3,329, మిరప 8,465 హెక్టార్లకు 5,603, పొగాకు 2,914 హెక్టార్లకు 1,544 హెక్టార్లలో మాత్రమే సాగు చేశారు. రబీలో 87,178 హెక్టార్ల సాగు విస్తీర్ణానికి గాను ఇప్పటి వరకు కేవలం 27,180 హెక్టార్లలో మాత్రమే పంటలు వేశారు. పెట్టుబడులు మోత వర్షాభావ పరిస్థితులతో పెట్టుబడులు కూడా పెరిగాయి. వర్షాలు అనుకూలించకపోవటంతో పత్తి విత్తనాలను మూడు సార్లు వేశారు. వరి నార్లు రెండు సార్లు పోశారు. పెసర, మొక్కజొన్న తదితర విత్తనాలను కూడా రెండు సార్లు వేశారు. విత్తనాలు వేసినప్పుడల్లా దుక్కులు చేయాల్సి వచ్చింది.ఎరువులు వేయక తప్పలేదు. ఇలా పెట్టుబడులు అధికమయ్యాయి. పత్తి ఎకరానికి దాదాపు రూ. 25 వేల వరకు, వరికి రూ.20 వేల వరకు, మొక్కజొన్నకు రూ.15వేల వరకు, పెసర, మినుము పంటలకు రూ.10 వేలు, మిరపకు దాదాపు రూ.80 నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడులు పెట్టారు. ఎండిన పైరు.. వర్షాభావ పరిస్థిలు, కరెంట్ కోతలతో పలుచోట్ల పంటలు ఎండిపోయాయి. బయ్యారం, ఇల్లెందు, గుండాల, టేకులపల్లి, కారేపల్లి, కామేపల్లి, గార్ల, పాల్వంచ, కొత్తగూడెం, ముల్కలపల్లి, మధిర, వైరా, ఎర్రుపాలెం, బోనకల్లు, చింతకాని తదితర మండలాల్లో మొక్కజొన్న ఎండిపోయింది. కంకి దశకు వచ్చిన సమయంలో వర్షం లేకపోవటంతో దెబ్బతింది. తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్, గార్ల, కారేపల్లి, కామేపల్లి, గుండాల తదితర మండలాల్లో పలు చోట్ల బావులు, బోర్ల కింద వేసిన వేసిన వరి, ఇతరత్ర పంటలూ ఎండిపోయాయి. దిగుబడులూ అంతంతే.. వేసిన పంటలకు సరైన నీటి యాజమాన్యం లేకపోవటంతో పంట దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. ఎకరానికి 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడులు రావల్సిన పత్తి కేవలం 3 నుంచి 5 క్వింటాళ్లకు మించి రాలేదు. వర్షాలు లేకపోవటానికి తోడు తెగుళ్లు ఆశించటం దిగుబడులపై ప్రభావం పడింది. వరి ఎకరాకు 32 నుంచి 35 బస్తాల వరకు దిగుబడి రావల్సి ఉండగా సగటున 20 నుంచి 25 బస్తాల వరకే వచ్చింది. మొక్కజొన్న 25 నుంచి 30 బస్తాల వరకు దిగుబడులు రావల్సి ఉండగా 10 బస్తాలకు మించలేదు. ఇలా అన్ని పంటల దిగుబడులూ తగ్గాయి. భారీగా నష్టం.. రైతులు భారీగా నష్టపోయారు. కొందరు రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రాలేదు. పత్తి ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి కాగా సగటున 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. దాదాపు రూ.16 వేలు నష్టం వాటిల్లింది. వరికి 20 వేలు పెట్టుబడి పెట్టగా 14 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ.4 వేల వరకు నష్టం. మొక్కజొన్నకు 15 వేలు పెట్టుబడి కాగా 10 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. 6వేల మేరకు నష్టం వాటిల్లింది. పెసర, మినుము విషయంలోనూ రూ.4వేలు నష్టపోవాల్సి వచ్చింది. గిట్టుబాటు కాని ధరలు ఈ ఏడాది పండిన పంటలకు కనీసం గిట్టుబా టు ధరలు కూడా రాలేదు. దిగుబడులు తగ్గినా ధరలు ఆశాజనకంగా ఉంటే పెట్టుబడులు అయినా పూడేవి అని రైతులు అభిప్రాయపడుతున్నారు. పత్తికి కేంద్రం క్వింటాలుకు రూ.4,050 ప్రకటించగా వ్యాపారులు రూ.3,000 నుంచి రూ.3,500 మాత్రమే ధర చెల్లించారు. చివరికి సీసీఐని రంగంలోకి దించినా ఉపయోగం లేకుండా పోయింది. సీసీఐ కేంద్రాల్లోనూ వ్యాపారుల హవానే కొనసాగింది. మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో మక్కల కొనుగోలు విషయంలోనూ ఇదే చోటు చేసుకుంది. మొక్కజొన్నలకు ప్రభుత్వం రూ.1,310 ధర నిర్ణయించగా వ్యాపారులు కేవలం రూ.800 నుంచి రూ.900 మాత్రమే కొనుగోలు చేశారు. వరి, మిర్చిది కూడా ఇదే పరిస్థితి. నవంబర్ నెల చివరి వరకు క్వింటాలు రూ.10వేలున్న మిర్చి ధర పంట చేతికి వస్తున్న ప్రస్తుత తరుణంలో రూ.6,000కు పడిపోయింది. పంట రుణాలు పావలొంతే.. తొలిసారి ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వందశాతం వ్యవసాయ రుణాల మాఫీ అని ప్రకటించింది. కేవలం 25 శాతం రుణాలను మాత్రమే మాఫీ చేసింది. అది కూడా సకాలంలో జరగకపోవడం, సరైన కాలంలో ఖరీఫ్ రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేట్‌గా అధిక వడ్డీలకు అప్పులు తీసుకున్నారు. రుణమాఫీలో భాగంగా రైతులకు అందాల్సిన రుణాల్లో ఇప్పటి వరకు చాలామంది రైతుల ఖాతాల్లో జమకాలేదు. రూ.1,700 కోట్ల పంట రుణాలను రుణమాఫీ కింద గుర్తించగా వాటిలో రూ.427 కోట్లను మొదటి విడతగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఆగని ఆత్మహత్యలు.. అటు పంటలు పండక, ఇటు అప్పులు తీర్చే మార్గం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డా రు. పాల్వంచ, కారేపల్లి, ఇల్లెందు, బయ్యారం, గార్ల, టేకులపల్లి, కొత్తగూడెం, మధిర , తిరుమలాయపాలెం, బోనకల్లు తదితర మండలాల్లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. పంటల రుణాలు పూర్తిగా మాఫీగాక, కొత్త రుణాలు అందక రైతులు ప్రవేటుగా అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చలేక పలువురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. -
పత్తి కొనుగోలులో జాప్యంపై రైతుల ఆగ్రహం
మార్కాపురం : స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి కొనకుండా జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేమ సాకు చూపి పత్తిని ఇష్టమొచ్చిన ధరకు అడగడాన్ని రైతులు తప్పుబట్టారు. మార్కాపురం డివిజన్లోని 12 మండలాలకు చెందిన రైతులు తాము పండించిన పత్తిని మార్కెట్ యార్డులోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తెస్తున్నారు. మూడు రోజులుగా వ్యాపారులకు, రైతులకు మధ్య గిట్టుబాటు ధర, పత్తిలో నాణ్యత తేల్చే విషయంపై అవగాహన కుదరకపోవడంతో కొనుగోళ్లు మంద కొడిగా సాగుతున్నాయి. మార్కెట్ యార్డులో సుమారు 10 లారీల పత్తి నిల్వ ఉంది. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తండా, రాచర్ల, కొమరోలు, పుల్లలచెరువు మండలాలకు చెందిన పలువురు రైతులు తెచ్చిన పత్తిని వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో మూడు రోజులుగా మార్కెట్ యార్డులోనే ఉంటున్నారు. వ్యాపారులు కావాలనే.. పత్తి నాణ్యత తగ్గిందని, తాము తెచ్చిన బొరెలపై ఇంటు(ఁ) మార్కు వేస్తున్నారని, దీనిని కొనుగోలు చేయాలంటే బొరేనికి(బోరెలో 90 నుంచి 100 కిలోల పత్తి ఉంటుంది) 5 నుంచి 7 కిలోలు తరుగు తీసేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పత్తి సాగు చేసేందుకు ఎకరాకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టాం. కూలీలతోపాటు రవాణా ఖర్చులు అదనంగా ఉన్నాయి. వ్యాపారులేమో నాణ్యత తక్కువ అంటూ ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని గొట్టిపడియ గ్రామానికి చెందిన రైతు మారెళ్ల వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రస్తుతం వ్యాపారులు క్వింటా పత్తిని రూ.3,800-రూ.3,900 మధ్య కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం రూ.4,050 మద్ధతు ధర ప్రకటించింది. -
అనగనగా శనగ..
ఒంగోలు టూటౌన్ : శనగ సాగును రైతులు దాదాపు పక్కన పెట్టేశారు. పంట వేసేందుకు ఏ రైతూ ధైర్యం చేయడం లేదు. వ్యవసాయ శాఖ విత్తనాలు సరఫరా చేస్తున్నా.. రైతులు అంతగా ఆసక్తి చూపడం లేదు. కారణం.. మూడేళ్లుగా గిట్టుబాటు ధర దక్కక.. పండించిన శనగలన్నీ గోడౌన్లలో పేరుకుపోవడమే. దాదాపు 17.50 లక్షల క్వింటాళ్ల నిల్వలు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉన్నాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పి.. 4 నెలలు కావస్తోంది. ఇంత వరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో శనగ పంట అంటేనే రైతులు బెంబేలెత్తుతున్నారు. గతంలో రబీ సీజన్లో శనగ పంటను ఇబ్బడిముబ్బడిగా సాగు చేశారు. 2013-14 రబీలో కూడా 69,465 హెక్టార్లలో శనగ సాగయింది. ప్రస్తుత రబీ సీజన్లో 88,817 హెక్టార్లలో సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం 2,349 హెక్టార్లకే పరిమితమైంది. అంటే మూడు శాతం మాత్రమే పంట సాగయింది. 62 వేల క్వింటాళ్ల శనగ విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టగా.. 25 వేల క్వింటాళ్లు మాత్రమే పొజిషన్లో ఉంచారు. వీటిలో ఇప్పటి వరకు కేవలం 2,500 క్వింటాళ్ల శనగ విత్తనాలనే రైతులు రాయితీపై కొన్నారు. జిల్లాలోని 56 మండలాల్లో వ్యవసాయశాఖ ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్నా శనగలు తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదని వ్యవసాయ శాఖ జేడీ జే మురళీకృష్ణ తెలిపారు. రైతులంతా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గుచూపుతున్నారని జేడీఏ పేర్కొన్నారు. ఎక్కువగా యూకలిప్టస్, మిర్చి, మినుము, అలసంద, మొక్కజొన్న, జొన్న లాంటి పంటల సాగుపై ఆసక్తి చూపుతున్నారని ఆయన వివరించారు. జిల్లాలో పంటల సాగు 32 శాతం ‘జిల్లాలో ఇప్పటి వరకు మిరప 7,914 హెక్టార్లు, అలసంద 5,356 హెక్టార్లు, జొన్న 5,865 హెక్టార్లు, మొక్కజొన్న 2,145 హెక్టార్లలో సాగు చేశారు. వీటితో పాటు వరి 28,080 హెక్టార్లు, రాగి 42 హెక్టార్లు, వేరుశనగ 74 హెక్టార్లు, నువ్వులు 2,853 హెక్టార్లలో వేశారు. పత్తి రబీలో 1352 హెక్టార్లకు గాను 50 హెక్టార్లు, పొగాకు 36,983 హెక్టార్లలో సాగయింది. ఇంకా ఉల్లి, పసుపు, చెరకు, పెసర, చిరుధాన్యపు పంటలతో కలిపి మొత్తం ఇప్పటి వరకు 1,10,004 హెక్టార్లలో పంటలు వేశారు. రబీ సాగు సాధారణ విస్తీర్ణం 3,44,321 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 32 శాతం పంటలు వేశారని’ జేడీఏ వెల్లడించారు. ప్రస్తుత సీజన్లో పొద్దుతిరుగుడు విత్తనాలు 870 క్వింటాళ్లు, మొక్కజొన్న 1,648 క్వింటాళ్లు, జొన్న 500 క్వింటాళ్లు, ఆముదం 200 క్వింటాళ్లు, నువ్వుల విత్తనాలు 95 క్వింటాళ్లను రైతులకు అందుబాటులో ఉంచామని, ఇంకా రైతులకు రాయితీపై విత్తనాలు అందజేస్తామని స్పష్టం చేశారు. విత్తనాల ధరను బట్టి కిలోకు రూ.25 రాయితీ ఇస్తామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో భూములు పదునెక్కాయని, సాగు విస్తీర్ణం ఇంకా పెరుగుతుందని జేడీఏ తెలిపారు. -
ఆపసోపాలు..!
పాలు..ప్రతీ ఒక్కరి అవసరం. అయితే మార్కెట్లో డిమాండ్ తగ్గట్టు ఉత్పత్తి కావడం లేదు. ఫలితంగా ధరలు చుక్కలను చూపుతున్నాయి. అయితే రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. ఒకవైపు కరువు.. మరో వైపు గిట్టుబాటు కాని ధరలతో పాడి పరిశ్రమ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో మార్కెటింగ్ స్థితిగతులపై ఈ వారం ప్రత్యేక కథనం. కర్నూలు(అగ్రికల్చర్): కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో చాలా మంది రైతులు పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన వారు సైతం దీనినే ఆధారంగా చేసుకొంటున్నారు. జిల్లాలో 3.5 లక్షల పాడి పశువులు ఉన్నాయి. వీటి నుంచి 7.50 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతోంది. పశువుల్లో కొన్ని ఎండిపోయినవి, మరికొన్ని చూడితో ఉన్నవి ఉన్నందున ఉత్పత్తి ఇంతే ఉంటోంది. ఈ ఏడాది జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు సరిగా పండలేదు. పశుగ్రాసం ఆశించిన స్థాయిలో రాలేదు. సాధారణంగా శీతాకాలంలో పచ్చిమేత బాగా లభించి పాల ఉత్పత్తి పెరగాల్సి ఉంది. ఈ ఏడాది నీటి వసతి కూడా అంతంత మాత్రంగానే ఉండడం, కరువు పరిస్థితులు నెలకొనడంతో పాల ఉత్పత్తి తగ్గింది. విజయ డెయిరి.. గతేడాది ఇదే సమయంలో దాదాపు 80 వేల లీటర్ల పాలు సేకరించేది. ఇప్పుడు 70 వేల లీటర్లు కూడా సేకరించలేకపోతోంది. పాల సేకరణ తగ్గిపోగా డిమాండు మాత్రం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో 95 వేల లీటర్ల పాలు అమ్మకం అవుతుండగా ఈ సారి 1.10 లక్షల లీటర్లకు పెరిగింది. సేకరణ ధరలు అంతంత మాత్రమే... రోజు రోజుకు పాలకు మార్కెట్ డిమాండు పెరుగుతున్నా.. సేకరణ ధర అంతంత మాత్రంగానే ఉంది. విజయ డెయిరీతో పాటు ప్రైవేటు డెయిరీలు వెన్న శాతాన్ని బట్టి గరిష్టంగా లీటరుకు రూ.52 చెల్లిస్తున్నారు. ఈ ధర రావాలంటే పాలల్లో వెన్న 10 శాతం ఉండాలి. కనిష్టంగా రూ.26 చెల్లిస్తున్నారు. ఇందులో వెన్న 5 శాతం ఉంటుంది. సేకరించే పాలల్లో సగటున 6.5 శాతం వెన్న ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి లీటరు పాలకు రూ.33.80 చెల్లిస్తున్నారు. మార్కెట్లో పాలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో పాల సేకరణకు చెల్లిస్తున్న ధర అంతంత మాత్రమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాల ఉత్పత్తి కూడా నేడు ఖర్చుతో కూడుకున్నదిగా మారిపోయింది. కేవలం పాడి గేదె విలువనే నేడు రూ.70 వేల వరకు ఉంటోంది. పశుగ్రాసం ఖర్చులు, దాణా, ఇతర పోషణ ఖర్చులు పెరిగిపోయాయి. పాడి గేదెలు సగటున 5 లీటర్లకు మించి పాలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం పాల సేకరణ ధర రూ.33.80 మాత్రమే ఉండటంతో గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాల సేకరణ ధర గరిష్టంగా 60, కనిష్టంగా రూ.32, సగటు ధర రూ.40 ఉంటే గిట్టుబాటు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అమ్మకం ధర ఎక్కువే.. పాల సేకరణ సగటు ధర రూ.33.80 ఉండే అమ్మకం ధర భారీగానే ఉండటం గమనార్హం. గోల్క్ మిల్క్ లీటరు ధర రూ.48 ఉంది. విజయ డెయిరీతో పాటు ప్రైవేటు డెయిరీలు ఇదే ధరతో పాలను విక్రయిస్తున్నాయి. టోల్డ్ మిల్క్ లీటరు రూ.40 ప్రకారం అమ్మకాలు సాగిస్తున్నారు. పాల సేకరణకు ఇచ్చే ధరలతో పోలిస్తే అమ్మకం ధరలు ఎక్కువేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాల ధర ఎక్కువ ఉన్నా.. అందుకు అనుగుణంగా సేకరణ ధరలను కూడా పెంచితే రైతులకు ఉపయోగమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ డెయిరీలు ఎక్కువే.. సహకార రంగంలో నెలకొల్పిన విజయ డెయిరీ కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో పాల మార్కెటింగ్ చేస్తోంది. ఇదిగాక జిల్లాలో ప్రైవేటు డెయిరీలు ఎక్కువగా ఉన్నాయి. జగత్, తిరుమల, హెరిటేజ్, దొడ్ల, శ్రీనివాస, నంది, విస్కస్ తదితర డెయిరీలు ఉన్నాయి. పాల మార్కెటింగ్‌తో చాలా వరకు నిరుద్యోగ సమస్య తీరుతోంది. డెయిరీలన్నీ పాల మార్కెటింగ్‌కు ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేసుకున్నాయి. ఏజెంట్లను నియమించుకొని మార్కెటింగ్ నిర్వహిస్తున్నాయి. కర్నూలులో ఒక్క విజయ డెయిరీతోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు వెయ్యి మంది ఉపాధి పొందుతున్నారు. ప్రైవేటు డెయిరీలను పరిశీలిస్తే పాల మార్కెటింగ్‌పై ఆధారపడి బతికే వారి సంఖ్య భారీగానే ఉంది. పాలను విక్రయించే ఏజెంట్లకు ప్యాకెట్టుకు రూపాయి ప్రకారం కమిషన్ ఇస్తున్నారు. -
పొలాల్లోకి వెళ్లి బాధలు వింటూ..
గొట్టిపాటి రవి : నమస్తే.. నాపేరు గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఎమ్మెల్యేని. సాగర్ జోన్-2 పరిధిలో మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాను. నీకు ఎంత పొలం ఉంది? నీ ఇబ్బందులు ఏంటి? దిండు రాఘవయ్య : నాకు రెండు ఎకరాల పొలం ఉంది. నీరు విడుదల రెండు నెలలు ఆలస్యం కావడంతో నాట్లు ఆలస్యమయ్యాయి. నాచు పెరిగిపోయిందని దమ్ము చేయడానికి కాల్వలు ఆపడం వల్ల కలుపు పెరిగిపోయి ఖర్చు ఎక్కువయింది. గొట్టిపాటి రవి : వ్యవసాయం ఎలా ఉంది? నీరు సరిగ్గా అందుతోందా? (కలుపు తీస్తున్న పొలంలోకి నడుచుకుంటూ వెళ్లి రైతును పలకరించారు. కోటేశ్వరరావు : నాకు రెండెకరాల పొలం ఉంది. నీరు అందడం ఆలస్యమయింది. మధ్యలో కాల్వలు కట్టివేయడంతో పొలంలో కలుపు పెరిగిపోయింది. దీన్ని తీయడం కోసం రోజుకు 10 నుంచి 20 మంది కూలీలను పెట్టుకోవాల్సి రావడంతో ఆరేడు వేల రూపాయలు అదనంగా ఖర్చయింది. గొట్టిపాటి రవి : ఎరువులు దొరుకుతున్నాయా? కోటేశ్వరరావు : యూరియా ధరలు బాగా పెంచేశారు. బస్తా రూ.325 నుంచి రూ. 400 వరకూ అమ్ముతున్నారు. అది కూడా స్టాక్ లేదంటున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. (అక్కడి నుంచి ముందుకు వస్తూ పత్తి పొలం వద్ద ఆగారు. పత్తి పొలంలో ఉన్న రైతులను పలకరించారు. ) గొట్టిపాటి రవి : పత్తి దిగుబడి ఎలా వస్తోంది? ఎన్ని ఎకరాలు వేశారు? అడ్డగడ్డ సాంబయ్య : మొత్తం నాలుగు ఎకరాల్లో పత్తి వేశాము. ఇప్పటి వరకూ మొక్కలు ఏపుగా ఎదిగాయి. పత్తి వస్తున్న సమయంలో వర్షాలు పడ్డాయి. దీంతో ఒక్కో ఎకరానికి మూడు క్వింటాళ్ల వరకూ పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంది. గొట్టిపాటి రవి : ఇప్పటి వరకూ ఎంత ఖర్చయింది. సాంబయ్య : ఎకరానికి 15 వేల రూపాయలకు పైగా ఖర్చయింది. అయితే గిట్టుబాటు ధరలు లేవు. గొట్టిపాటి రవి : ఇప్పుడు ఎంత ధర పలుకుతోంది? సాంబయ్య : ఇప్పుడు క్వింటాలుకు మూడు వేల రూపాయలుంది. ప్రస్తుతం ఖర్చులు పెరిగిపోవడంతో ఐదు వేల రూపాయల వరకూ కావాల్సి ఉంటుంది. గొట్టిపాటి రవి : బ్యాంకు రుణం వచ్చిందా? సాంబయ్య : బ్యాంకులు రుణమాఫీని అడ్డం పెట్టుకుని రుణాలు ఇవ్వలేదు. దీంతో ఐదు రూపాయల వడ్డీకి బయట నుంచి రుణాలు తేవాల్సి వచ్చింది. గిట్టుబాటు ధర రాకపోతే పొలం అమ్ముకుని అప్పులు తీర్చాల్సి వస్తుంది. గొట్టిపాటి రవి : వర్షం వల్ల ఇబ్బంది ఉందా? కామాను కోటేశ్వరరావు : వర్షం కారణంగా పత్తి తడిసిపోయింది. దీంతో కొంత పత్తి పనికి రాకుండా పోయే అవకాశం ఉంది. పైగా లద్దె పురుగు వచ్చింది. బీటీ విత్తనాలకు లద్దె పురుగు రాదని చెప్పారు. కాని ఇప్పుడు లద్దె పురుగు వచ్చిందంటే ఇవి నకిలీ విత్తనాలు. గొట్టిపాటి రవి : వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువచ్చారా కోటేశ్వరరావు : ఎప్పుడు ఫోన్ చేసినా జన్మభూమిలో ఉన్నామని చెబుతున్నారు. గొట్టిపాటి రవి : ఇప్పుడు జన్మభూమి ముగిసింది. సంప్రదించండి. నేను కూడా సైంటిస్టులతో మాట్లాడతాను. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడినప్పుడు జిల్లాలో నకిలీ విత్తనాలు లేవని చెప్పారు. ఇక్కడి పరిస్థితిని వారి దృష్టికి తీసుకువస్తాను. (అక్కడి నుంచి బయలుదేరి కొమ్మాలపాడు వెళ్లారు. అక్కడ పొలాల్లోకి వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో బురదలోనే మోటార్‌బైక్‌పై ముందుకు వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడారు.) గొట్టిపాటి రవి : ఏంటి నీరు సక్రమంగా వస్తోందా? వెంకటరావు (సొసైటీ అధ్యక్షుడు) : శివారు భూములకు నీరు అందడం లేదు. నీటి సరఫరా సక్రమంగా ఉండటం లేదు. దీంతో ఇబ్బందిగా ఉంది. మద్యలో నీరు ఆపడం వల్ల తడిచిన పొలాలే మళ్లీ తడుపుకోవాల్సి వచ్చింది. కింది రైతులకు నీరు అందడం లేదు. గొట్టిపాటి రవి : పంటలు ఎలా ఉన్నాయి రజియా : వర్షం వల్ల నష్టపోయాము. ఈసారి ఖర్చులు కూడా ఎక్కువయ్యాయి. కూలీ రేట్లు విపరీతంగా పెరిగాయి. దీంతో ఖర్చు పెరిగిపోయింది. గిట్టుబాటు ధర లేకపోతే కష్టమే. (అక్కడి నుంచి బయలుదేరి మిర్చి పంటలోకి వెళ్లారు. అక్కడ రైతులను, కూలీలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.) గొట్టిపాటి రవి : వర్షం వల్ల నష్టం వచ్చిందా? మిర్చి రైతులు : వర్షం వల్ల నష్టం లేదు. కొంత ఉపయోగపడుతుంది. అయితే ఇంతకు ముందు సంవత్సరాలతో పోలిస్తే పంట దిగుబడి తగ్గిపోయింది. దీంతో పెట్టుబడి తిరిగి వస్తుందా అన్నది అనుమానమే. గొట్టిపాటి రవి : ఇంకేమైనా సమస్యలున్నాయా? హుస్సేన్ : ఈ ప్రాంతంలో పొలాలన్నీ అగ్రహారం కింద ఉన్నాయి. తరతరాలుగా మేమే సాగు చేసుకుంటున్నాం. అయితే పొలాలు మా పేరుతో లేవు కాబట్టి రుణమాఫీ రాదని చెబుతున్నారు. గొట్టిపాటి రవి : నేను ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మీకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తా. -
మద్దతు ధరకు మార్గాలివి..
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : ఆరుగాలం శ్రమించి, వ్యయప్రయాసలకోర్చి పంట పండించిన రైతుకు మార్కెట్లో మద్దతు ధర లభించకుండాపోతోంది. సేటు చెప్పిందే వేదమవుతోంది. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. అలా కాకుండా కొన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తే పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మోహన్‌దాస్ వివరించారు. ఆ జాగ్రత్తలివి.. జిల్లాలో ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల ఆలస్యంగా వేసిన వరి పంట చేతికస్తోంది. వారం రోజుల్లో ధాన్యం కొనుగో ళ్లు ప్రారంభించనున్నట్లు మార్కెట్ అధికారులు ప్రకటించారు. ఈ సారి ఆశించిన మేర వర్షాలు లేక 60 వేల హెక్టార్లలో సాగు కావాల్సిన వరి కేవలం 20 వేల హెక్టార్లలోనే సాగైంది. నీటి సదుపాయం ఉన్న రైతులు మాత్రమే వరి సాగుకు సహసించారు. చివరికి పంటకు నీటి తడులు అందక దిగుబడులు సగానికి తగ్గాయి. మార్కెట్ అధికారుల లెక్కల ప్రకారం 92 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. దీనికోసం ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎమ్మెస్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ధాన్యం విక్రయించే రైతులు ఈ సూచనలు పాటిస్తే మద్దతు ధర వస్తుంది. వరి గింజలన్నీ బంగారు రంగులోకి వచ్చిన తర్వాతే కోతలు ప్రారంభించాలి వరి కోతకు ముందు పొలంలో ఉన్న కల్తీ మొక్కలను తీసి వేయాలి కోతకు 15 రోజుల ముందే నీటి తడులు ఆపివేయాలి 1010 వంటి రకం వరి బంగారం వర్ణంలోకి వచ్చే వరకు అగితే గింజలన్నీ రాలిపోతాయి. ఈ ఒక్క రకాన్ని మాత్రం గోధుమ రంగులోకి రాగానే కోయాలి కోసిన వరి మెదలను నాలుగు రోజుల పాటు ఎండనివ్వాలి అనంతరం ఒక్కో రకం వరికి వేర్వేరు కల్లా లు ఏర్పాటు చేసి, టార్పాలిన్లలో వరి మెద లు వేసి ట్రాక్టర్ల ద్వారా నూర్పిడి చేయాలి. ఒక రకానికి చెందిన వరి ధాన్యాన్ని మరో రకం వరి ధాన్యంతో కల్టుపరాదు. పొలం వద్దే సరైన గ్రేడింగ్ చేయాలి గడ్డిని తీసివేసి గింజలన్నీ కుప్పగా పోసి గాలి పంకాల సహాయంతో (తాలు గింజలు) నాణ్యత లేని గింజలు లేకుండా శుభ్రంగా తూర్పార పట్టాలి ఎగరబోసిన ధాన్యాన్ని 12 శాతం తేమ ఉండే వరకు ఆరబెట్టి మార్కెట్ తీసుకువెళ్తే గిట్టుబాటు ధర వస్తుంది హార్వెస్టర్‌తో కోస్తే మొదటి సారి పోసే డ బ్బాను వేరుగా పోయాలి. ఆ తర్వాత కోసినవన్నీ ఒక చోట పోయాలి. ఇలా చేయడం ద్వారా కల్తీ ప్రమాదం తప్పుతుంది పంటను సిమెంట్ కల్లాలపై లేదా టార్పాలిన్ల షీట్లపై ఆరబెట్టాలి. రెండుమూడు రోజులు బాగా ఎండేలా కాళ్లతో కలియ దొబ్బాలి పంట కోశాక సరిగా ఆరబెట్టికపోతే గింజలు రంగుమారి, పంట నాణ్యత తగ్గే అవకాశం ఉంది పంటను అరబెట్టే సమయంలో రాళ్లు, మట్టి పెళ్లలు, చె త్తాచెదారం వంటి వ్యర్థ పదార్థాలు చేరకుండా జాగ్రత్త వహించాలి నిల్వ చేసే పక్షంలో గోనే సంచులను కింద వేయకుండా బల్లలు పరిచి వాటిపై బస్తాలు నెట్టుగా వేయాలి పురుగులు ఆశించకుండా లీటరు నీటికి 5 ఎంఎల్ మలాథియన్ మందు కలిపి బస్తాలపై పిచికారి చేయాలి ఎలుకల నుంచి రక్షించుకోవడానికి బస్తాల నెట్టుల మధ్య జింక్ పాస్ఫెట్ ట్యాబ్లెట్లు ఉంచాలి. ఒక రోజు తలుపులు పూర్తిగా మూసివేసి గాలి చొరబడకుండా జాగ్రత్తలు వహించాలి. ఇలా చేయడంతో ఎలుకలు లేకుండాపోతాయి. మరుసటి రోజు నుంచి తలుపుల తీయవచ్చు. గ్రేడును బట్టి ధర వరి ధాన్యం ఏ గ్రేడ్ రకానికి ప్రభుత్వం రూ.1400, సాధారణ రకానికి రూ.1360 మద్దతు ధర ప్రకటించింది. కనీస మద్దతు ధర దక్కాలంటే రైతులు ధాన్యంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి మట్టి పెళ ్లలు, రాళ్లు, చెత్త, ఇతర ధాన్యపు గింజలు తదితరావి లేకుండా చూసుకొని క్వింటాల్ కంటే ఎక్కువగా ఉండకుండా చూడాలి పాడైన, రంగు మారిన, మొలకెత్తిన, పురుగులు తిన్న ధాన్యం 5 శాతం కంటే ఎక్కువగా ఉండాకుండా చూడాలి. ఈ పద్ధతులు పాటిస్తే పంటకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. -
చర్చలు విఫలం!
సంగారెడ్డి అర్బన్: జేసీ డాక్టర్ శరత్ సమక్షంలో గురువారం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు, చెరకు రైతుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. యాజమాన్యాలు టన్నుకు రూ.3500లు చెల్లించినా ఎలాంటి నష్టం రాదని రైతు సంఘాల నేతలు పేర్కొంటున్నారు. షుగర్ ఫ్యాక్టరీ ప్రతినిధులు మాత్రం రూ.3500లు చెల్లించడం కుదరదని తేల్చి చెప్పారు. సాగు కోసం పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో టన్నుకు రూ.2,600లు చెల్లిస్తే ఏ మాత్రం గిట్టుబాటు కాదని రైతులు పేర్కొన్నారు. గిట్టుబాటు ధర చెల్లించేందుకు యాజమాన్యాలు ముందుకు రాకపోతే జిల్లా యంత్రాంగం తదుపరి చర్యలు చేపడుతుందని జేసీ హెచ్చరించారు. రైతు ప్రతినిధులు మాట్లాడుతూ ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లోనే మద్దతు ధరపై నిర్ణయం తీసుకుందామని పలుమార్లు కోరినా యజమాన్యాలు ముందుకు రాలేదని జేసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం టన్నుకు ప్రోత్సాహం కింద చెల్లిస్తున్న రూ.60 ఫ్యాక్టరీ యాజమాన్యాలకు కాకుండా మద్దతు ధరతో పాటు సీటీపీసీల ద్వారా నేరుగా రైతులకే ఇప్పించాలన్నారు. టన్నుకు కనీస మద్దతు ధర రూ.2,800 చెల్లించాలని ఫ్యాక్టరీ ప్రతినిధులను జేసీ కోరారు. ఈ విషయం యాజమాన్యాలతో మట్లాడుతామని ఫ్యాక్టరీల ప్రతినిధులు తెలిపారు. -
మిర్చి రైతుపై దళారీ ఉచ్చు
గుంటూరు వ్యవసాయ మార్కెట్లోరాజ్యమేలుతున్న సిండికేట్ వ్యవస్థ కనీస మద్దతు ధర దక్కని దయనీయ స్థితి వచ్చిందే దక్కుదలగా అమ్ముకోవాల్సిన దుస్థితి గుంటూరు సిటీ: గుంటూరు వ్యవసాయ మార్కెట్లో దళారి వ్యవస్థ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. పాలకుల పట్టనితనం, అధికారుల అలసత్వం కారణంగా ఇక్కడ సిండికేట్‌స్వామ్యం రాజ్యమేలుతోంది. ఫలితంగా రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. చివరకు రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. జిల్లాలో లక్షా 80వేల ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ. లక్షన్నరకు పైగా పెట్టుబడితో 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగు బడి సాధిస్తున్నారు. ఇక్కడి నుంచి అసలు కథ, రైతు వ్యధ మొదలవుతుంది. పంటను వ్యయ ప్రయాసలకోర్చి గుంటూరు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చినా వారికి కనీస ఆదరణ కూడా లభించదు సరికదా దళారులంతా సిండికేట్ అయి ధర పెరగకుండా కట్టడి చేస్తారు. కనీసం గిట్టుబాటు ధర కూడా దక్కని దయనీయ స్థితి కల్పిస్తారు. పెట్టుబడుల రీత్యా క్వింటా ధర ఏడు నుంచి ఎనిమిది వేల రూపాయలు పలికితే గానీ రైతుకు గిట్టుబాటు కాదు. కానీ ఈ ఏడు సీజన్ ఆరంభంలో మిర్చి రైతుకు దక్కిన ధర రూ. ఆరు వేలు. అది కూడా మేలు జాతికి చెందిన తేజ రకం మిరపకు మాత్రమే. ఇక నాటు కాయలకు దక్కింది మరీ తక్కువ. అయినా ధర పెరిగే వరకు శీతల గిడ్డంగుల్లో దాచుకోలేని అసహాయత, తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని అశక్తత ఈ ఏడు మిరప రైతులను నిలువునా ముంచింది. అయిన కాడికి అమ్ముకునేలా చేసింది. తాజాగా మంగళవారం రూ.10,200 వరకు ధర పలికి రికార్డు సృష్టించింది. పంట ఉత్పత్తి ఎక్కువగా ఉండే మధ్యప్రదేశ్, చైనా ల్లో ఈ ఏడు ఆశించిన దిగుబడులు లేకపోవడంతో మిర్చి ధర మరింత పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని మార్కెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పలు రైతు సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మిర్చి క్వింటాకు గత ఏడాది రూ. మూడు వేలు ధర పలికితే ఈ ఏడు రూ. ఆరు వేలు లభించడం మంచి పరిణామమే కదా అంటున్న అధికారుల వ్యాఖ్యలపై వారు మండిపడుతున్నారు. వారు చెప్పింది వాస్తవమేననీ, అయితే అదే సమయంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు పెరిగిన పెట్టుబడులు కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా మార్కెట్ శక్తుల ఆట కట్టించి రైతుకు మద్దతు ధర దక్కేలా తగు చర్యలు చేపట్టాలని పలు రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. పులి మీద పుట్రలా రుణమాఫీ అసలే అంతంత మాత్రంగా ఉన్న మిర్చి రైతుకు రుణమాఫీ అంశం పులి మీద పుట్రలా మారింది. రుణమాఫీ అమలు కాక మరోవైపు పాత రుణం చెల్లించాలని బ్యాంకర్లు చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక పంటను దాచుకోకుండా అయిన కాడికి అమ్ముకుంటున్నట్టు సమాచారం. -
చెరకు చేదే
నారాయణఖేడ్ రూరల్: చెరకు రైతులకు ప్రతీఏడు చేదు పరిస్థితులే మిగులుతున్నాయి. తాము పండించిన పంటకు సరైన గిట్టుబాటుకు విక్రయించుకొనే పరిస్థితి చెరుకు రైతుకు లేకుండా పోతుంది. యాజమాన్యాలు నిర్ణయించిన ధరకే రైతులు పంటను అమ్మాల్సిన పరిస్థితి. ప్రతీ ఏడు పంటసాగుకు తీవ్ర ఇబ్బందులు, పెట్టుబడులు పెరిగిపోవడం పరిపాటిగా మారుతున్నా పంట విక్రయించే సరికి మద్దతు ధర లభించడంలేదు. రెండు మూడేళ్ళుగా ఒకే ధర ఉండడం రైతులకు ఆశనీపాతంగా మారుతోంది. ఈ ఏడు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు తోడు విపరీతమైన కరెంటు కోతలు. ఫలితం సాగుచేసిన చెరకు పంటకు సరిపడా నీరందడం లేదు. దీంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపింది. కానీ చెరకుకు మాత్రం గత ఏడాది ఇచ్చిన ధరనే ఇస్తామని కర్మాగార యాజమాన్యం ప్రకటించింది. అందుకు అనుగుణంగానే ఈనెల 9న క్రషింగ్‌ను ప్రారంభించింది. రైతులు టన్నుకు రూ.3,500ల చొప్పున ధర చెల్లించాలని కోరుతున్నా యాజమాన్యం మాత్రం రూ.2,600లు చెల్లిస్తామని ప్రకటించింది. నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలు నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగి వద్ద ఉన్న గాయత్రి షుగర్స్ పరిధిలోకి వస్తారు. కష్టానికి దక్కని ఫలితం మాగి గాయత్రి షుగర్స్ కర్మాగారం పరిధిలో మెదక్ జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు, కల్హేర్, నారాయణఖేడ్, పెద్దశంకరంపేట, కంగ్టి మండలాలు ఉండగా, నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, మద్నూర్, బిచ్కుందు మండలాల నుంచి చెరకు అగ్రిమెంట్ అయింది. ఈ కర్మాగారంలో కేవలం నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోనే 12వేల ఎకరాల విస్తీర్ణంలో చెరకు కర్మాగారానికి వెళ్తుంది. అంటే సాగైన చెరకులో 90 శాతం ఈ కర్మాగారానికే అగ్రిమెంట్ అయింది. నిజామాబాద్ జిల్లాలో కేవలం 3,500ల ఎకరాలలోపే చెరకు కర్మాగారానికి తరలుతుంది. కర్మాగారం నిర్ణయించిన ధర ప్రకారం ఏమాత్రం గిట్టుబాటు కాదని రైతులు పేర్కొంటున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో దిగుబడులు గణనీయంగా తగ్గినట్లు రైతులు పేర్కొంటున్నారు. అందునా పె ట్టుబడులు కూడా అధికమయ్యాయని అంటున్నారు. ఎకరం విస్తీర్ణంలో చెరకు సాగుకు రూ.60 వేల నుంచి రూ.80వేల వరకు ఖర్చవుతున్నట్లు తెలిపారు. దిగుబడులు మాత్రం 20 నుంచి 30 టన్నుల లోపే వస్తుందని తెలిపారు. ఈ లెక్కన కర్మాగారం ద్వారా టన్నుకు రూ.2,600ల చొప్పున చెల్లిస్తే కనీస పెట్టుబడే దక్కుతుందని రైతులు అంటున్నారు. రూ.3,500లు చెల్లించిన పక్షంలో తమకు గిట్టుబాటు అవుతుందన్నారు. ఇది ఏడాది పంట కావడంతో యాజమాన్యం చెల్లించే ధర ఏ మాత్రం గిట్టుబాటు కాదని, తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఈ పెట్టుబడులను కూడా అప్పులు చేసి సాగు చేసినట్లు పలువురు రైతులు పేర్కొంటున్నారు. గతానికి.. నేటికీ భిన్నత్వం చెరకు సాగులో గతంలో లాభసాటిగా ఉండగా రాను రాను చెరకు సాగు రైతులకు గుదిబండలా మారుతుంది. కర్మాగారాలు ప్రైవేట్ పరం కావడం ఈ దుస్థితికి కారణమని రైతులు పేర్కొంటున్నారు. గతంలో ప్రభుత్వం రంగంలో చెరకు కర్మాగారాలు ఉన్నపుడు కేంద్ర ప్రభుత్వం ఎస్ఎంపీ ధర ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రోత్సాహకాలను అందించేదని రైతులు పేర్కొం టున్నారు. దీంతో ప్రైవేట్ కంపెనీలూ ఇదే ధరను చెల్లించేవి. ఫలితంగా రైతులకు గిట్టుబాటయ్యేది. కర్మాగారాలు ప్రైవేట్ పరం కావడం రైతులకు ఇబ్బందికరంగా తయారయింది. ఫలితంగా రైతులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలవైపు దృష్టిసారిస్తున్నారు. ప్రతీఏటా చెరకు రైతులకు ధర విషయంలో ఇబ్బందులే ఏర్పడుతున్నాయి. క్రషింగ్ ప్రారంభ సమయం దగ్గర పడుతుండడం, రైతులు గిట్టుబాటు ధర చెల్లించాలని విన్నవించడం పరిపాటిగా మారుతోంది. పెట్టుబడుల్ని దృష్టిలో పెట్టుకోవాలి మెదక్ రూరల్: నిజాం దక్కన్ షుగర్(ఎన్డీఎస్ఎల్) ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెరకు టన్ను ధర రూ. 3,500 చెల్లించాలి. రైతులు వరిని వదిలేసి చెరకు తోటలను కాపాడుకున్నారు. ప్రతి ఏడాది రసాయన ఎరువుల ధరలు పెరగడంతో పాటు కూలీల రేట్లు, రవాణా చార్జీలు విపరీతంగా పెరుగుతున్నాయి. సాగుకు పె రుగుతున్న ఖర్చుల ను దృష్టిలో పెట్టుకొ ని గిట్టుబాటు ధర చెల్లించాలి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి రైతుల్ని ఆదుకోవాలి. క్రషింగ్‌ను సైతం సకాలంలో ప్రారంభించి రైతులు నష్టపోకుండా చొరవ చూపాలి. -టీపీసీసీ అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి -
గోదాముల్లో ధాన్యం..రైతు బతుకు దైన్యం
ఈ రైతు పేరు మల్లికార్జునరెడ్డి. ఈయన గత రబీ సీజన్లో 150 బస్తాల ధాన్యాన్ని పండించాడు. ఈ ఏడాది జనవరిలో పుట్టి రూ.9,800లు ఉండటంతో గిట్టుబాటు కాదని మార్కెట్ యార్డులో నిల్వ ఉంచాడు. రైతు బంధు పథకం ద్వారా రుణం తీసుకున్నాడు. ఏడాదవుతున్నా ధర అంతంతగానే ఉంది. నిబంధనల ప్రకారం గడువు మీరడంతో ఇతనికి నోటీసులు జారీ చేశారు. చేసేదిలేక తీసుకున్న రుణానికి 12 శాతం ప్రకారం వడ్డీ చెల్లించి నష్టానికే ధాన్యాన్ని అమ్ముకున్నాడు. ఈయన పేరు రామాంజనేయుల రెడ్డి.బుడ్డాయపల్లెకు చెందిన ఈయన తన ఆరెకరాల పొలంలో పండిన 210 బస్తాల జిలకర మసూర ధాన్యాన్ని ఈ ఏడాది జనవరిలో మార్కెట్ యార్డులో నిల్వ ఉంచాడు. పండినప్పుడు బస్తా రూ.1500 ఉండగా ఇప్పటికీ రూ.1700లకు మించి పెరగలేదు. ఓ వైపు నోటీసులతోపాటు మళ్లీ కొత్త పంట వస్తే ఈ ధర కూడా రాదన్న భయంతో ధాన్యాన్ని అమ్మేశాడు. బస్తా రూ.2వేలు పలికితే కానీ గిట్టుబాటు కాదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. 220 ధాన్యం నిల్వ చేసిన రైతులు బస్తాల సంఖ్య 30,000 1.60 రైతులు తీసుకున్న రుణం (రూ. కోట్లలో ) రైతులు చెల్లిస్తున్న వడ్డీ (శాతంలో) 12 ప్రొద్దుటూరు: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరల్లేక అన్నదాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏడాది కాలంగా ఎదురు చూసినా గిట్టుబాటు ధర రాక.. కొత్త పంట మార్కెట్లోకి వస్తే ఇంకా ధర ఎక్కడ పడిపోతుందోనన్న ఆందోళనతో ఉన్నకాడికే అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో జిలకర, జగిత్యాల ధాన్యం ధరలు రూ. 12వేలు పలుకుతున్నాయి. ప్రభుత్వ చర్యల కారణంగా ఇంకా ధరలు పడిపోయే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ పరిధిలోని రైతులు గత రబీ సీజన్లో జగిత్యాల, జిలకర మసూరా ధాన్యం పండించారు. అప్పట్లో గిట్టు బాటు ధరలేకపోవడంతో యార్డులోని గోదాముల్లో సుమారు 30వేల బస్తాల వరకు ధాన్యం నిల్వ ఉంచారు. వీటిపై చాలా మంది రైతులు వ్యవసాయ మార్కెట్ కమిటీ గత నిబంధనల ప్రకారం రుణబంధు పథకంపై రుణాలు తీసుకున్నారు. నిబంధనలు ఇవీ.. ఇందులో 90 రోజుల వరకు వడ్డీ లేకుండా, 91-180 రోజుల వరకు రుణంపై 3శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 180 రోజులు దాటితే 12 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. గిట్టుబాటు ధరల్లేక.. నిల్వ చేసిన ధాన్యాన్ని ఆరు నెలల్లో గోడౌన్‌నుంచి ఖాళీ చేయాల్సి ఉంటుంది. గిట్టుబాటు ధరల్లేక రైతులు ఏడాదిగా ధాన్యాన్ని అలాగే నిల్వ ఉంచారు. మరోవైపు గడువు మీరిందని మార్కెట్ యార్డు అధికారులు రైతులకు నోటీసులు జారీ చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పట్లో మార్కెట్ ధర పెరిగే అవకాశం లేదని, మరో వైపు డిసెంబర్‌నాటికి మళ్లీ పంట దిగుబడి చేతికి వస్తుందనే కారణాలతో రైతులు ఉన్న ధాన్యాన్ని నష్టాలకే అమ్ముకుంటున్నారు. నిబంధనల మేరకే.. నిబంధనల ప్రకారం రైతు లు ఆరు నెలల వరకు మాత్రమే ధాన్యాన్ని ని ల్వ ఉంచుకోవాలి. మళ్లీ సీజన్ వస్తుండటంతో రైతులకు నోటీసులు జారీ చేస్తున్నాం. -నారాయణ మూర్తి, ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ -
పశువులకు మేతగా టమాటా
ఇంద్రవెల్లి: టమాటా సాగు చేసిన రైతులకు నష్టాలే మిగిలాయి. చేతికొచ్చిన టమాటా పంటకు మార్కెట్లో కనీస గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. దిగుబడి ఆశాజనకంగా ఉండి పంట చేతికొచ్చినప్పటికీ గిట్టుబాటు ధర లేక పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో తీవ్రంగా నష్టపోతున్నారు. అమ్మగా మిగిలిన టమాటాలను పశువులకు మేత గా వేస్తున్నారు. పెట్టుబడి అధికం.. మండలకేంద్రంతో పాటు మండలంలోని ఈశ్వర్‌నగర్, అంజీ, ఏమైకుంట, కేస్లాగూడ, కేస్లాపూర్, ముట్నూర్, శంకర్‌గూడ, దన్నోర(బీ), గౌరపూర్, రాంపూర్ తదితర గ్రామాల్లో సుమారు 2వేల,611 ఎకరాలకుపైగా టమాటా సాగు చేశారు. ఈ ఖరీఫ్‌లో వర్షాలు లేక నాటిన టమాటా మొక్కలు చనిపోవడంతో రెండు నుంచి మూడు సార్లు అప్పులపాలయ్యారు. గతం కంటే ఈ ఖరీఫ్ సాగుకు రెండింతలు అధిక ఖర్చు చేశారు. ఎకరానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు పెట్టుబడి పెట్టి సాగు చేశారు. ప్రస్తుతం చేతికొచ్చిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేదు. కొనుగోలు చేసే వ్యాపారస్తులు నాణ్యతను చూసి కొనుగోలు చేస్తున్నారు. 25 కిలోల టమాటాకు రూ.100 నుంచి రూ.130 ఉండడం, అందులో ఏరివేయగా మిగిలిన టమాటా పంటను రైతులు పశువులకు మేతగా వేస్తున్నారు. దీంతో చేసిన అప్పులు ఎలా చెల్లించాలో అర్థం కాక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. నష్ట పోయిన టమాటా పంటలపై సర్వే నిర్వహించి పరిహారం మంజూరు చేసి ఆదుకోవాలని మండలంలోని టమాటా రైతులు కోరుతున్నారు. -
హామీలపై అసెంబ్లీలో చర్చించాలి
ఆదిలాబాద్ అర్బన్ : ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. హామీల అమలులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా గుండా మల్లేశ్ మాట్లాడుతూ ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఐదు నెలలు గడుస్తున్నా అమలు చేయడం లేదని విమర్శించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని, వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా చేయడం లేదని అన్నారు. ఆగస్టు 19న సర్వే చేసి ఇప్పుడు మరో సర్వే ఎందు చేపడుతున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం ముందుకు సాగుతుందో.. లేదోననే అనుమానం ఉందన్నారు. రాష్ట్రంలో ఐదు లక్షల మంది దళితులు ఉన్నారని, వీరికి సుమారు 15 లక్షల ఎకరాల భూమి అవసరమని తెలిపారు. పరిశ్రమలకు భూమి సిద్ధగా ఉందంటున్న ప్రభుత్వం దళితులకు మూడెకరాలు ఎందుకు పంపిణీ చేయలేకపోతుందో చెప్పాలని అన్నారు. రాష్ట్రంలో 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ రాాష్ట్ర నాయకులు వెంకటరామయ్య, సీపీఎం రాష్ట్ర నాయకుడు టి.సాగర్, సీపీఐ జిల్లా కార్యదర్శి శంకర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.విలాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి బండి దత్తాత్రి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకుడు నారాయణ, సీపీఐ నాయకులు ముడుపు ప్రభాకర్‌రెడ్డి, నళినిరెడ్డి, విద్యార్థి నాయకులు చంటి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. కాగా, అంతకుముందు వామపక్షాల నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌కు ర్యాలీగా తరలివచ్చారు. గేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. సమస్యలతో కూడిన వినతిపత్రం కలెక్టర్ జగన్మోహన్కు అందజేసేందుకు లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నాయకులను జీపుల్లో, డీసీఎంలో తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని సుమారు 250 మంది వరకు వన్‌టౌన్‌కు వెళ్లారు. నాయకులను విడుదల చేయాలని నినదించారు. -
మొక్కజొన్న రైతుకు ఊరట
మహబూబ్‌నగర్ వ్యవసాయం: మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లభించక ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. ఈ ఏడాది వర్షాభావా పరిస్థితుల కారణంగా దిగుబడి సరిగా రాకపోవడంతో రైతులు ఇప్పటికే డీలా పడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈకేంద్రాలు అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నారుు. దీంతో రైతులు నేరుగా ధాన్యాన్ని విక్రరుుంచి గిట్టుబాటు ధర పొందేందుకు అవకాశం ఏర్పడింది. జిల్లాలో 10 కౌంటర్లు ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఇందుకు సంబందించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికారులు పేరొకన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు బాదేపల్లి, వనపర్తిటౌన్,నాగర్‌కర్నూల్, అచ్చంపేట, షాద్‌నగర్, కల్వకుర్తి, నవాబ్‌పేట్, అలంపూర్, మహబూబ్‌నగర్ మార్కెట్‌యాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయూలని ప్రతిపాదనలు పంపారు. దీనికితోడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మార్క్‌ఫెడ్, పీఏసిఏస్, హాకా ఏజెన్సీలు మందుకు వచ్చాయి. కొనుగోలు సాఫీగా సాగేనా? గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో 1.61లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేయగా, ఈ ఏడాది 1.53లక్షల హెక్టార్లలో సాగరుు్యంది. దీనికితోడు అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాగా గత ఏడాది జిల్లాలో ప్రభుత్వం 7 కేంద్రాలను ఏర్పాటు చేస్తూ మార్క్‌ఫెడ్‌కు కొనుగోలు బాధ్యత అప్పగించింది. అరుుతే మార్క్‌ఫెడ్ వద్ద సిబ్బంది లేక పోవడంతో వారు పీఏసిఎస్‌లకు బాధ్యతలను అప్పగించారు. దీంతో నిర్వహణ లోపాల కారణంగా గోదాములు, గన్నీ బ్యాగులను సకాలంలో సిద్ధం చేసుకోలేకపోయూరు. ఈ కారణంగా ్రపైవేటు ఏజెన్సీలు 16.21లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా మార్క్‌ఫెడ్ 5.73లక్షల క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. వ్యాపారులు అత్యధికంగా రైతులకు క్వింటాకు రూ.1100 నుంచి 1250 వరకు మాత్రమే చెల్లించడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. కొన్ని చోట ప్రైవేటు ఏజెన్సీలు కొనుగోలు చేసిన పంటను ప్రభుత్వ కొనుగోలు సెంటర్ల అమ్మినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ సారైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని కొనుగోలు సాఫీగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. రైతులు నాణ్యమైన సరుకు తెవాలి - మార్కెటింగ్‌శాఖ ఏడీ బాలమణి జిల్లాలో 10 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అవసరం ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపాం. 10 కేంద్రాల్లో కొనుగోలు జరిగే అవకాశం ఉంది. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతుధర(రూ.1310/క్విటా)ను పొందాలి. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే మార్కెట్లకు తీసుకురావాలి. -
శనగ రైతుపై వేలం వేటు
సాక్షి, ఒంగోలు: జిల్లాలో శనగ రైతులు భగ్గుమంటున్నారు. రుణాల మాఫీ అమలులో సర్కారు దోబూచులాటపై విరుచుకుపడుతున్నారు. ఆర్భాటపు ప్రకటనలతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తోన్న అధికారపార్టీ నేతల మెడపై కత్తి పెట్టేందుకు సిద్ధమయ్యారు. తాజాగా, జిల్లాకు చెందిన శనగ పంట రైతులు ఆదివారం గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించడం చర్చనీయాంశమైంది. కొన్ని మాసాలుగా శనగ రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఈవిషయంపై అనేకమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు. అయితే, వారికి ఎక్కడా స్పష్టత లభించలేదు. పైగా, వారు కోల్డ్‌స్టోరేజీల్లో దాచుకున్న శనగల నిల్వలను బహిరంగ వేలం వేసి రుణాల రికవరీ చేస్తామని బ్యాంకర్లు నోటీసులిచ్చారు. ఈనెల 25వ తేదీ నుంచి 29 వరకు జిల్లాలో రుణాలు తీసుకుని బకాయి పడిన రైతులకు చెందిన 17 లక్షల క్వింటాళ్ల శనగలను బహిరంగ వేలం వేస్తామని బ్యాంకర్లు ప్రకటించడంతో వ్యవహారం రాజుకుంది. ఇదేవిషయంపై కిందటి నెల 27న వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, రవాణామంత్రి శిద్ధా రాఘవరావుతో పాటు తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు కరణం బలరాం నేతృత్వంలో రైతులు ముఖ్యమంత్రిని కలిశారు. వారంలో సమస్యను పరిష్కరిస్తామని అప్పట్లో చంద్రబాబు హామీనిచ్చినా ఫలితం దక్కలేదు. నోరువిప్పని అధికార పార్టీ నేతలు.. శనగ రైతులంతా టీడీపీకి ఓట్లేసి గెలిపించాలని.. గిట్టుబాటు ధరపై న్యాయం చేస్తామని అన్ని జిల్లాల్లో ఆపార్టీ నేతలు ఎన్నికల సమయాన విస్తృత ప్రచారం చేశారు. అప్పట్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారానికొచ్చినప్పుడు శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతు రుణమాఫీపై స్పష్టమైన హామీనిచ్చారు. ప్రస్తుతం అధికారం చేపట్టాక కూడా వారిని ఆదుకునే ప్రయత్నాల్లో ఆపార్టీ ప్రజాప్రతినిధులు వెనుకంజ వేస్తున్నారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, గుంటూరు జిల్లాలోని నరసరావుపేట డివిజన్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో శనగ పంటను రైతులు సాగుచేస్తున్నారు. సరైన గిట్టుబాటు ధర లేక ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో మొత్తం 30 లక్షల క్వింటాళ్ల శనగలు కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వలున్నాయి. అందులో ప్రకాశం జిల్లాలోనే 20 లక్షల క్వింటాళ్లు నిల్వలుండటం గమనార్హం. ఏటా సీజన్ ప్రారంభంలో క్వింటాలు రూ.5 వేలకు పైగానే ధరపలికే శనగలు... సరుకు చేతికొచ్చే నాటికి క్వింటాలు రూ.2600 దిగజారింది. గిట్టుబాటు కాని ధరకు అమ్ముకోలేక, నిల్వలను కోల్డ్స్టోరే జ్ల్లోనే ఉంచుకున్నారు. స్టోరేజీల్లో ఉన్న సరుకు నిల్వలకు బ్యాంకర్లు అప్పటి ధరపై 75 శాతం రుణాలిచ్చారు. ప్రస్తుతం తీసుకున్న రుణాలకన్నా ..నిల్వచేసుకున్న సరుకుకు విలువ తక్కువగా ఉండటంతో.. మిగిలిన సొమ్ము వెంటనే చెల్లించాలని బ్యాంకర్లు రైతులను ఒత్తిడి చేస్తున్నారు. రెండేళ్లుగా శనగల నిల్వలు పేరుకుపోవడంతో రుణాల రికవరీ చేయని రైతులపై బ్యాంకర్లు వేలం నోటీసులిచ్చారు. ఇప్పటికే జిల్లాలో 2 వేల మంది రైతుల శనగలను రుణాల రికవరీ పేరిట వేలం వేశారు. తాజాగా, ఈనెల 25 నుంచి అత్యధిక మంది రైతుల శనగలను వేలం వేసేందుకు బ్యాంకర్లు సంసిద్ధం కావడంతో.. భగ్గుమన్న రైతాంగం వ్యవసాయ మంత్రి ఇంటిని చుట్టుముట్టాల్సి వచ్చిందని ప్రకాశం జిల్లా శనగ రైతుసంఘం అధ్యక్షుడు నాగ బోయిన రంగారావు తెలిపారు. వేలం నిలిపివేతపై కలెక్టర్‌కు ఆదేశాలు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఇంటిని ముట్టడించిన క్రమంలో బాధిత రైతులు బ్యాంకర్ల వేలం నోటీసులను చూపించారు. వ్యవసాయ రుణాల మాఫీ అమలుపై జాప్యంతో పాటు తాము పండించిన శనగలకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. శనగల గిట్టుబాటు ధరపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని.. ఈవిషయంలో కేంద్రసహకారం కోరతామని చెప్పగా.. ఆయన సమాధానంపై రైతులు శాంతించలేదు. అనంతరం వారంతా కలిసి చిలకలూరిపేట - ఒంగోలు జాతీయ రహదారిపై బైఠాయించగా ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకాశం జిల్లా కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్‌తో ఫోన్లో మాట్లాడి తక్షణమే బ్యాంకర్లను పిలిపించి వేలం ప్రక్రియను నిలువరించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. -
న(అ)మ్మకాన్ని వంచించారు!
ఆదోని: వేల రూపాయలు పెట్టుబడి పెట్టి, ఇంటిల్లిపాది ఆరుగాలం చెమటోడ్చి వేరుశనగ పండించారు. పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో దిగుబడులను ఇళ్లలో దాచిపెట్టుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఫెడ్ గిట్టుబాటు ధరకు దిగుబడులు కొనుగోలు చేస్తోందని చెప్పడంతో రైతులు ఎంతో సంబర పడ్డారు. మార్కెట్ ధర క్వింటాల్ రూ.2200 నుంచి రూ.3300 వరకు ఉండగా..అయిల్ ఫెడ్ క్వింటాల్‌కు రూ.నాలుగు వేలు చెల్లిస్తామని చెప్పడంతో ఈ ఏడాది జనవరిలో విక్రయించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా రైతులకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా..ఇంతవరకు కొందరు రైతులకు డబ్బులు అందకపోవడంతో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం పంట పెట్టుబడులకు చేతిలో డబ్బు లేక..బ్యాంకులు రుణాలివ్వకపోవడంతో ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. పక్షం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామన్నారు.. అయిల్ ఫెడ్ అధికారులు జిల్లాలోని ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్, ఆలూరు, కర్నూలు మార్కెట్ యార్డులలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వ్యవ,ప్రయాసాలు కోర్చి రైతులు దిగుబడులను అమ్ముకున్నారు. పత్తికొండ యార్డులో ఏర్పడిన గందరగోళంతో కొనుగోళ్లు కొన్నాళ్లు నిలిచిపోయాయి. దీంతో రైతులు నాలుగైదు రోజుల పాటు రోడ్డెక్కి ఆందోళన నిర్వహించడంతో కొనుగోలులో నిర్లక్షం చేశారనే కారణంతో ఆయిల్ ఫెడ్ మేనేజరు ఎల్లారెడ్డి, పత్తికొండ కొనుగోలు కేంద్రం ఇన్చార్జ్ బ్రహ్మేశ్వరరెడ్డిపై అప్పట్లో ప్రభుత్వం సస్సెన్షన్ వేటు వేసింది. ఎట్టకేలకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ఆయిల్ ఫెడ్ సంస్థ లక్షా 45 వేల క్వింటాళ్లు కొనుగోలు చేశారు. అధికారులు పక్షం రోజుల్లో బిల్లులు చెల్లిస్తామని చెప్పి కొనుగోలు చేసిన వేరు శనగకు సంబందించి రైతులకు రశీదులు ఇచ్చారు. చేతికి డబ్బులు అందగానే పంట సాగు కోసం చేసిన అప్పులు చెల్లించి ఆ తరువాత తమ ఆర్థిక అవసరాలు తీర్చుకోవాలని అన్నదాతలు ఆశించారు. పలువురు ఖరీఫ్ పంట పెట్టుబడికి ఇక దిగులుండదని బావించారు. అయితే చెప్పిన సమయానికి బిల్లులు చెల్లించకపోవడంతో రైతులకు తెలిసొచ్చి తెల్లబోయారు. గత జనవరిలో కొనుగోలు చేయగా పక్షం రోజుల్లో రైతులందరికీ బిల్లులు చెల్లించాలి. అయితే దాదాపు రెండు నెలల తరువాత బిల్లుల చెల్లింపులు ప్రారంభించారు. అప్పటికే మార్కెట్ యార్డుల చుట్టు ఎన్నో సార్లు తిరిగి వేసారి పోయారు. ఇంకా బిల్లులు అందని రైతులు వందల్లో ఉన్నారు. ఆదోనిలోనే దాదాపు 596 మందికి రూ.4.23 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆదోని,కర్నూలు, పత్తికొండ, ఎమ్మిగనూరు, డోన్ మార్కెట్ యార్డులలో కూడా చాలా మందికి బిల్లులు అందాల్సి ఉంది. అయితే ఆదోనిలో తప్ప మిగిలిన మార్కెట్ యార్డుల పరిధిలో బకాయిలు రూ.లక్షల్లో మాత్రమే ఉందని ఆయిల్ ఫెడ్ జిల్లా కో-ఆర్డినేటర్ సుధాకర్ రావు పేర్కొన్నారు. వేరు శనగ అమ్మి ఇప్పటికే దాదాపు ఆరు నెలలు అవుతోంది. స్థానికంగా ఆయిల్ ఫెడ్ అధికారులు ఎవ్వరు లేక పోవడంతో తమ బకాయిల కోసం ఎవరిని సంప్రదించాలో రైతులకు దిక్కు తోచడం లేదు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయి దాదాపు పక్షం రోజులు అయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ ఇంకా ఎటు తేలలేదు. బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలిస్తామని బ్యాంకర్లు తెగేసి చెపుతున్నారు. ఇటు ఆయిల్ ఫెడ్ అధికారులు బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారో తెలీయక, అటు బ్యాంకుల్లో అప్పు పుట్టక అన్నదాత ఆందోళనకు గురవుతున్నాడు. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో తాము గుడ్డిగా నమ్మి చేతికి అందిన పంట దిగుబడులను అమ్ముకున్నామని, బిల్లులు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పేవారు కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో అమ్ముకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో మకాం పెట్టిన ఆయిల్ ఫెడ్ అధికారి ఆదోని ఆయిల్ ఫెడ్ కొనుగోలు కేంద్రం అధికారి నరేంద్రరెడ్డి తన మకాంను హైదరాబాదుకు మార్చారు. దీంతో బిల్లుల కోసం వచ్చిన రైతులకు సమాధానం చెప్పేందుకు స్థానికంగా ఎవ్వరు లేకుండా పోయారు. రైతుల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేకే ఆయన హైదరాబాదులో ఉన్నట్లు తెలుస్తోంది. నరేంద్ర రెడ్డిని ‘సాక్షి’ఫోన్లో సంప్రదించగా బకాయి బిల్లులకు సంబంధించిన నిధులు మంజూరు చేయించుకోడానికి తాను హైదరాబాదులో ఉన్నట్లు చెప్పారు. నిధులు మంజూరు కాగానే రైతులకు డబ్బులు చెల్లిస్తామని, ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లో వేరు శనగ అమ్మిన రైతులందరికీ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయిల్ ఫెడ్ జిల్లా కో-ఆర్డినేటర్ సుధాకర్ రావు వెల్లడించారు. -
అప్పు కడతారా.. వేలం వేయాలా!
కోవెలకుంట్ల: పప్పుశనగ రైతు కష్టాల్లో కూరుకుపోయాడు. రెండేళ్ల పాటు మురిపించిన ధర.. ఒక్కసారిగా నేలను తాకడం వారిని గందరగోళంలోకి నెట్టింది. వరుణుడు ఊరిస్తున్న తరుణంలో ఖరీఫ్ సాగుకు సమాయత్తమయ్యేందుకు పెట్టుబడి కోసం ఈ రైతులు దిక్కులు చూస్తున్నారు. ప్రభుత్వం రుణ మాఫీపై మీనమేషాలు లెక్కిస్తుండటంతో బ్యాంకర్లు కొత్త రుణాలిచ్చేందుకు ఆసక్తి చూపని పరిస్థితి వీరికి శాపంగా మారుతోంది. చివరకు బ్యాంకర్లు రుణాలు చెల్లించకపోతే తాకట్టు పెట్టిన శనత బస్తాలను వేలం వేస్తామని నోటీసులు జారీ చేయడం రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కర్నూలు జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో(సుమారు 1.50 లక్షల ఎకరాల్లో) కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్లో ఏటా పప్పుశనగ పంట సాగవుతోంది. రెండేళ్లుగా గిట్టుబాటు ధరలేకపోవడంతో రైతులు పండించిన శనగ బస్తాలు గోదాముల్లో మగ్గుతున్నాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కోవెలకుంట్ల డివిజన్లో అధిక సంఖ్యలో గోదాములు ఉన్నాయి. డివిజన్లో లక్ష నుంచి 5 లక్షల బస్తాల సామర్థ్యం కలిగిన 30 గోదాములు నిర్మించారు. రెండు సంవత్సరాలుగా వాతావరణం అనుకూలించడంతో శనగలో ఆశించిన స్థాయిలో దిగుబడి వచ్చింది. ఎకరాకు సగటున 6 నుంచి 8 బస్తాల దిగుబడి సాధించారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో గత ఏడాది ఆయా గ్రామాల్లోని గోదాముల్లో బస్తాలను నిల్వ చేశారు. వీటిపై బాండ్లను పొంది రైతులు వివిధ ప్రాంతాల్లోని స్టేట్‌బ్యాంకు, ఆంధ్రా బ్యాంకుల్లో రుణాలు పొందారు. ఒక్కో గోదాములో సుమారు 200 మంది రైతులు ఒక్కొక్కరు 100 నుంచి 120 బస్తాలపై బాండ్లను పొంది బస్తాపై రూ.1800 నుంచి రూ.2వేల వరకు రుణం తీసుకున్నారు. డివిజన్లో సుమారు 6 వేల మంది రైతులు రూ.100 కోట్ల వరకు రుణాలను తీసుకున్నట్లు తెలుస్తోంది. రుణం పొంది ఏడాది కావడంతో తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో శనగ బస్తా ధర రూ.2850 పలుకుతోంది. ఈ ధరకు విక్రయిస్తే రైతులు బ్యాంకులో తీసుకున్న రుణం, గోదాముల బాడుగకు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. శనగ బస్తాలపై తీసుకున్న రుణానికి గడువు దాటిపోవడంతో బ్యాంకర్లు ఒత్తిడి చేస్తుండటం రైతులను గందరగోళానికి గురిచేస్తోంది. రుణం చెల్లించాలని లాయర్ నోటీసులు కోవెలకుంట్ల ఆంధ్రా బ్యాంకులో ఏడాది క్రితం వంద శనగ బస్తాలకు సంబంధించి బాండ్లపై రూ.2 లక్షల రుణం తీసుకున్నా. ఇప్పటికి రూ.25 వేలు వడ్డీ అయింది. తీసుకున్న రుణం చెల్లించాలని బ్యాంకు నుంచి లాయర్ నోటీసు పంపినారు. వడ్డీ చెల్లిస్తానన్నా వినిపించుకోవడం లేదు. రుణం చెల్లించే రోజు అదనంగా రూ.250 నోటీసు ఇచ్చినందుకు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. మార్కెట్లో శనగకు గిట్టుబాటు ధర లేదు. ప్రస్తుత ఖరీఫ్ పెట్టుబడులకు రుణం దొరకడం లేదు. రుణం చెల్లించకుంటే శనగ బస్తాలను వేలం వేస్తామని బ్యాంకర్లు హెచ్చరిస్తున్నారు. - రామసుబ్బారెడ్డి, కిష్టిపాడు, దొర్నిపాడు మండలం -
పెరిగిన విత్తనాల ధరలు
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది రైతన్న పరిస్థితి. వరుస ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టాలను చవిచూసి సాగులో చతికిలపడ్డ అన్నదాతలు ప్రస్తుతం గిట్టుబాటు ధర లేక ఆర్థికంగా కుదేలవుతున్నారు. ఏటేటా సాగు భారం పెరగడం అన్నదాతను కలవర పరుస్తోంది. ప్రభుత్వం తాజాగా విత్తనాల సబ్సిడీలో భారీగా కోత పెట్టింది. దీంతో సాగుకు సిద్ధపడుతున్న రైతులకు పెరిగిన విత్తనాల ధర పెనుభారమైంది. ధర పెంచారు.. సబ్సిడీలో కోత పెట్టారు జిల్లాలో పత్తి తర్వాత అధికంగా పండించేది సోయాబీన్. సోయా విత్తనాల ధరను ప్రభుత్వం అమాంతంగా పెంచేసింది. పెంచిన ధర ప్రకారం రైతన్నపై క్వింటాల్‌కు రూ.2,010 అదనపు భారం పడనుంది. జిల్లాకు ఈ ఏడాది 90వేల క్వింటాళ్ల సోయా విత్తనాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ లెక్కన రైతులపై సుమారు రూ.18.09 కోట్ల అదనపు భారం పడనుంది. సబ్సిడీలోనూ 2.57శాతం కోత పెట్టారు. కంది విత్తనాల ధర పెంచడమే కాకుండా సబ్సిడీని సుమారు 17శాతం తగ్గించారు. క్వింటాల్ ధరపై రైతులకు రూ.1,050 అదనపు భారం పడనుంది. జిల్లాకు 400 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరం కాగా, ఈ లెక్కన రైతులపై రూ.4.20 లక్షల భారం పడనుంది. పెసర విత్తనాలపై రూ.9.90 లక్షలు, మినుములపై రూ.2.05లక్షల భారం అదనంగా పడనుంది. మొక్కజొన్న, జొన్న, పొద్దు తిరుగుడు విత్తనాలపై క్వింటాల్‌కు రూ.500 సబ్సిడీ ప్రకటించారు. వరి విత్తనాల ధరలు ఈ ఖరీఫ్‌కుగాను పెరిగాయి. ఎంటీయూ 1010, ఎంటీయూ 1001 రకాల ధరలు గతేడాది క్వింటాల్‌కు రూ.2,250 ఉండగా ఈసారి రూ.2,500 వరకు పెరిగాయి. ఎంటీయూ 7029, ఎంటీయూ 1061 ధరలు గతేడాది రూ.2,300 ఉండగా ఈసారి 2,550 వరకు పెరిగాయి. ఆర్జీఎల్ రూ.2,600 నుంచి రూ.2,650కి పెరగగా, బీపీటీ రూ.2,800 నుంచి రూ.2,750కి తగ్గింది. సబ్సిడీ డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకే. విత్తనాలు కొనాలంటే రైతులు మొదట పూర్తి ధర చెల్లించాలి. ఆ తర్వాత పట్టా పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతా పుస్తకం అధికారులకు అందజేయాల్సి ఉంటుంది. సబ్సిడీ డబ్బులు రైతు ఖాతాలో ఆ తర్వాత జమ అవుతాయి. ఉదాహరణకు.. సోయాబీన్ విత్తనాలు కొనాలంటే మొదట రైతు రూ.7,800 చెల్లించాలి. ఆ తర్వాత రైతు ఖాతాలో ఇందుకు సంబంధించిన సబ్సిడీ డబ్బులు రూ.2,574 జమ అవుతాయి. -
అటవీ ఉత్పత్తులతో ఉపాధి
కడెం, న్యూస్‌లైన్ : అడవి ఉత్పత్తులు గిరిజనులకు ఉపాధినిస్తున్నాయి. ఇప్పపువ్వు, తప్సి బంక, ఇప్ప పరక, తేనె తదితర ఫలాలను గిరిజనులు సేకరించి ఉపాధి పొందుతున్నారు. కాని వాటికి సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్‌లో ఇప్పపువ్వు విరబూస్తుంది. పల్లె ప్రజలు, కూలీలు ఇప్పపువ్వును పెద్ద ఎత్తున సేకరిస్తారు. ప్రస్తుతం గత కొద్దిరోజులుగా మండలంలోని బూత్కూరు, గొడిసెర్యాల, కుర్రగూడెం, దోస్తునగర్, ధర్మాజీపేట, సింగాపూరు, కల్లెడ, మద్దిపడగ, గోండుగూడెం, డ్యాంగూడెం గ్రామాల ప్రజలు తెల్లవారంగనే గంపలతో అడవులకు వెళ్లి ఇప్పపువ్వు సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన పువ్వును కడెంలోని జీసీసీ(గిరిజన సహకార సంస్థ)లో విక్రయిస్తారు. ఇక్కడ ప్రతీ ఆదివారం అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. ఇప్పపువ్వుకు కిలోధర రు.10 ఉంది. ఇలా ఒక్కొక్కరు 10 నుంచి 25 కిలోల దాకా పువ్వు తెచ్చి ఇక్కడ విక్రయిస్తారు. వెంటనే వారికి డబ్బులు చేతికందుతాయి. ఇలా గిరిజనులు ఇప్పపువ్వుతో ఉపాధి పొందుతున్నారు. గిట్టుబాటు ధర కరువు గిరిజనులు, గిరిజనేతరులు సేకరించిన అటవీ ఉత్పత్తులను ప్రభుత్వం నామమాత్రపు ధరకు మాత్రమే కొనుగోలు చేస్తోంది. తెలతెల్లవారంగా అడవికి వెళ్లి పువ్వు సేకరిస్తే సరైన ధర రావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో పువ్వుకు కేవలం రు.10 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రస్తుతం అన్నింటికీ ధరలు పెరిగాయి. ఇలాంటప్పుడు తామేలా బతికేదని గిరిజనులు వాపోతున్నారు. పెద్ద ఎత్తున కొనుగోళ్లు కడెంలోని జీసీసీ ద్వారా ఏటా ఏప్రిల్ మొదటి వారం నుంచి అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం జీసీసీకి ఎక్కువగా ఇప్పపువ్వు మాత్రమే వస్తుండటంతో దీన్నే కొంటున్నారు. ఇప్పటి వరకు 31 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గతే డాది 440 క్వింటాళ్లు కొనుగోలు చేయగా ఈ సారి 500 క్వింటాళ్లు కొనుగోలు లక్ష్యం ఉంది. ఆ దిశగా జీసీసీ సిబ్బంది కృషి చేస్తున్నారు. -
భగ్గుమన్న రైతులు
దళారీ వ్యవస్థతో వేరుశనగ రైతుల అవస్థలు హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై రాస్తారోకో పెట్రోల్ పోసి వేరుశనగకు నిప్పంటించిన వైనం కల్వకుర్తి, న్యూస్‌లైన్ : తాము పండించిన వేరుశెనగ పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కడుపుమండిన రైతులు వేరుశెనగ పంటను పోగుగా పోసి నిప్పంటించారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి మార్కెట్ యార్డు సమీపంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. గత కొద్ది రోజులుగా తమ ఉత్పత్తులను మార్కెట్‌కు తెస్తున్నా దళారులు తమకు ధర రాకుండా చేస్తున్నారని ఆందోళనకు దిగారు. కల్వకుర్తి, వెల్దెండ్ల, వంగునూరు, చింతపల్లి తదితర ప్రాంతాలకు చెందిన రైతులు 150 బస్తాల పంటను తెచ్చారు. ఇది 74 క్వింటాళ్లు ఉండగా దీని విలువ సుమారు రూ. రెండులక్షలకు పైబడి ఉంటుందని అంచనా. తమకు ఇతర మార్కెట్లతో పోలిస్తే ఇక్కడ దళారులు క్వింటాలు ధరను రూ.2,800 నుంచి 3,700కు మించి పెంచనివ్వడం లేదని వేరే ప్రాంతాల్లో రూ.4,200 వరకూ చెల్లిస్తున్నారని మండి పడ్డారు. ఆగ్రహంతో హైదరాబాద్ చౌరస్తాలోని శ్రీశైలం - హైదరాబాద్ రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. నిరసనగా పంటకు నిప్పు పెట్టారు. ఈ లోగా వర్షం రావడంతో దాన్ని రక్షించుకునేందుకు ఆందోళన విరమించి మార్కెట్‌కు తరలి వెళ్లారు. అక్కడా పంటపై కప్పేందుకు కవర్లు లేక అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మార్కెట్ కార్యాలయంపై దాడికి కూడా యత్నించారు. అయితే ఈ అంశంపై అధికారులు ఎవరూ స్పందించక పోవడం విశేషం. పోలీసులకు విషయం తెల్సి వచ్చేసరికి ఆందోళన సద్దుమణిగింది. -
టెండర్ల మాయాజాలం
గిట్టుబాటు ధర లభిస్తుందన్న ఆశతో కష్టనష్టాలకోడ్చి తాము పండించిన పత్తిని హాలియా మార్కెట్‌కు తీసుకువస్తున్న రైతన్నకు నిరాశే మిగులుతోంది. మద్దతు ధర లభించకపోగా.. తరుగు, హమాలీ తదితర కారణాలతో కోత పెడుతుండటం వారిని అయోమయానికి గురి చేస్తోంది. అధికారులు మామూళ్లు పుచ్చుకుంటూ కిమ్మనకపోవడం వల్లే ట్రేడర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌కు హాలియాతో పాటు వివిధ మండలాల నుంచి రైతులు తాము పండించిన పంటలను విక్రయానికి తెస్తుంటారు. రైతులు తీరా ఇక్కడి కి వచ్చిన తర్వాత ట్రేడర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడక తప్పడం లేదు. మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం కూడా వ్యాపారులకు వరంగా మారింది. దీంతో వారు ప్రభుత్వ ధర కాకుండా తమ ఇష్టం వచ్చిన రేట్ నిర్ణయిస్తూ రైతుల నెత్తిన శఠగో పం పెడుతున్నారు. అంతేకాకుండా మార్కెట్ కు వచ్చిన పత్తి క్వింటాల్‌కు 2కిలోల(ఇప్పటి ధరలో *80నుంచి *100) చొప్పున తరుగు తీస్తూ మోసానికి పాల్పడుతున్నారని తెలుస్తోం ది. అదే విదంగా క్వింటాల్‌కు రూ.60 చొప్పున హమాలీ పేరుతో కట్ చేస్తున్నారని రైతులు ఆ రోపిస్తున్నారు. రైతులకు అండగా నిలాల్సిన అధికారులు సైతం ట్రేడర్లకే వత్తాసు పలకడం గమనార్హం. ఇదీ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఏ వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లినా క్వింటాల్ పత్తి తొక్కినందుకు రూ. 10నుంచి రూ.20వరకు వసూలు చేస్తారు. కానీ హాలియా వ్యవసాయ మార్కెట్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పత్తిని బస్తాలో తొక్కడంతో పాటు తూకం వేసినందుకు, లారీకి ఎత్తినందుకు హమాలీ పేరుతో రూ.60 రైతు వద్ద కట్ చేస్తున్నారు. వాస్తవానికి రైతు మార్కెట్‌కు తెచ్చిన పత్తిని వేలం వేసిన అనంతరం తూకం వేసి, ఎత్తినందుకే హమాలీ కట్ చేయాలి. కానీ, ఇక్కడి వ్యాపారులు మాత్రం పత్తిని లారీలోకి ఎత్తినందుకు కూడా క్వింటాల్‌కు రూ.30 చొప్పున కోత పెడుతున్నారు. ట్రేడర్లు చెల్లించాల్సిన హమాలీని కూడా రైతు నుంచే వసూలు చేస్తుం డటం, సిండికేట్‌గా మారి గిట్టుబాటు ధర చెల్లించకుండా అన్యాయం చేస్తున్నారు. -
దాచిన పత్తే..ఉసురు తీసింది
గిట్టుబాటు ధర రాకపోవడంతో పత్తిని అమ్ముకోలేక ఇంట్లో దాచుకుంటే.. అది ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లంతా బయటకు వెళ్లగా.. ఆ చిన్నారులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ముగ్గురు కలిసి ఎంతో సంతోషంగా ఆడుకున్నారు. అయితే వారు ఆడుకుంటూ పత్తి కూటు పరదాను తాకారో.. లేక బరువుతోనే అది కూలిందో గానీ.. ఆ పత్తి కూటు ఆ చిన్నారులపై పడింది. వారు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందారు. పెద్దలు ఇళ్లు చేరేసరికి ఆ చిన్నారులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. కేసముద్రం, న్యూస్‌లైన్ : ఆ ఇంట్లో బోసినవ్వులు మాయమయ్యూయి. అప్పటిదాక తాతయ్యా అంటూ ఆటలాడిన ఆ ముగ్గురి పిల్లలు అనంతలోకాలను చేరారు. ధర రాకపోవడంతో దాచిపెట్టిన పత్తే వారి ప్రాణం తీసింది. ఇంట్లో ఉన్న పత్తి కూటు అమాంతం మీదపడగా ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతిచెందిన సంఘటన మండలంలోని కోరుకొండపల్లి గ్రామంలో సోమవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. కోరుకొండపల్లి గ్రామాని కి చెందిన బేతు వెంకటయ్య, యాదమ్మ దంపతులకు కుమారులు వీరన్న, శ్రీను, కుమార్తె సుజాత ఉన్నారు. వారిలో వీరన్నకు కురవి మండలం కాంపెల్లికి చెందిన భవానితో వివాహం కాగా వారికి కుమారుడు విక్కీ(3) ఉన్నాడు. పది రోజుల క్రితమే మళ్లీ కుమారుడు జన్మించాడు. సుజాతకు కూడా కురవి మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన మేనమామ చిట్టాల వీరన్నతో వివాహమైంది. వారికి కుమారుడు వేణు(12), కుమార్తె భద్రకాళి(6) ఉన్నారు. కాగా సుజాత, చిట్టాల వీరన్న దంపతులు బతుకు దెరువు కోసం సూరత్ వెళ్లారు. అయితే శివరాత్రి పర్వదినంతోపాటు తన అన్న వీరన్నకు కుమారుడు పుట్టాడని తెలియడంతో సుజాత సూరత్ నుంచి కాంపల్లికి వచ్చింది. శివరాత్రి రోజు కురవిలో జాగారం ఉండి, ఆ తర్వాత ఆస్పత్రిలో ఉన్న అన్న కుమారుడిని చూసింది. అనంతరం ఆదివారం కోరుకొండపల్లిలోని తల్లిగారింటికి వచ్చింది. కాగా బేతు వెంకటయ్య అన్న కొమురయ్య కోడలు ఉమ పురుగుల మందు తాగి మానుకోట ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా ఆమెను చూసేందు కు సోమవారం వెంకటయ్య భార్య యాదమ్మ, కుమారుడు వీరన్న, కూతురు సుజాత వెళ్లారు. ఇంటి దగ్గర పిల్లలు జాగ్రత్త అని వెంకటయ్యకు చెప్పి వెళ్లారు. మనవళ్లను, మనవరాలిని దగ్గరకు తీసుకుని అప్పటిదాక ఆడించిన వెంకటయ్య వారికి అన్నం తినిపించాడు. విక్కీ నిద్రకు రావడంతో పడుకోబెట్టాడు. మేము టీవీ చూస్తాం తాతయ్య.. బయటకు పోములే అని తలుపు పెట్టుకున్నారు. వారు టీవీ చూస్తున్నారులే అనుకుని వెంకటయ్య బయటకు వెళ్లి వచ్చాడు. పిల్లలను ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో కిటికీకి ఉన్న జాలిని కోసి చూడడంతో పత్తి కూటు కుప్పకూలి కనిపించింది. దీంతో లబోదిబోమంటూ గట్టిగా కేకలు పెడుతూ తలుపులను ఎంత నెట్టినా రాలేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న స్థానికులు తలుపులు బద్దలు కొట్టి తెరిచారు. పత్తి మొత్తం ఆ ముగ్గురు పిల్లలను కప్పేసి ఉంది. పత్తిని తోడి తీయడంతో ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. వారిని చూసిన వెంకటయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు కన్నీరుమున్నీరవుతూ వారిని బయటకు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వీరన్న, సుజాత కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వచ్చి పిల్లల శవాలపై పడి బోరునవిలపిస్తూ సొమ్మసిల్లారు. కొడుకు పుట్టిన సంబురంలోనే... వీరన్న, భవాని దంపతులకు రెండో కుమారుడు పది రోజుల క్రితమే పుట్టాడు. దీంతో విక్కీ తల్లితోనే కాంపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. అయితే సూరత్ నుంచి తన చెల్లెలి పిల్లలు రావడంతో వీరన్న విక్కీని కోరుకొండపల్లికి తీసుకొచ్చాడు. రెండో సారి కుమారుడు పుట్టాడనే సంబురా న్ని కుటుంబ సభ్యులతో పూర్తిగా పంచుకోకముందే మూడేళ్ల విక్కీ మాయమయ్యూడు. నీ తమ్మున్ని చూద్దువు లేరా కొడుకా అంటూ వీరన్న తన కొడుకు శవంపైపడి బోరున విలపించడాన్ని చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. -
పల్లి.. లొల్లి
గిట్టుబాటు ధర కోసం ఆందోళన బాట కేసముద్రం మార్కెట్లో వ్యాపారుల సిండికేట్ ధర అమాంతంగా తగ్గించి కొనుగోళ్లు అధికారులను నిలదీసిన రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట మహిళల బైఠాయింపు నిలిచిపోయిన వేలం పాటలు కేసముద్రం, న్యూస్‌లైన్ : కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ రైతులు ఆందోళన బాటపట్టారు. పల్లి సీజన్ మొదలైనప్పటి నుంచి వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరను అమాంతం తగ్గించి వేలం పాటలు నిర్వహిస్తున్నారని, అరుునా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆరుగాలం శ్రమించి పండించిన పల్లికాయతో పలువురు రైతులు రెండు రోజుల క్రితం కేసముద్రం మార్కెట్‌కు వచ్చారు. ‘వ్యాపారులందరూ ఒక్కతీరుగా రేటు పెడతాండ్రని, ఆ రేటు తమకు గిట్టుబాటు కావడం లేదని... తమకు న్యాయం చేయాలి.’ అంటూ గురువారం మార్కెట్‌ను సందర్శించిన చైర్మన్ శశివర్ధన్‌రెడ్డి, ఏడీఎం సంతోష్‌కుమార్‌ను వారు వేడుకున్న విషయం తెలిసిందే. వ్యాపారులతో మాట్లాడి ధర పెట్టేలా చూస్తామని వారు చెప్పిన ప్పటికీ... శుక్రవారం కూడా అదేరీతిలో గరిష్ట ధర రూ.2600కు మించలేదు. దీంతో ఆగ్రహించిన రైతులు ఇంత తక్కువ ధర పెడతారా అంటూ వ్యాపారులను నిలదీశారు. మీ ఇష్టముంటే అమ్ముకోండి, లేకపోతే లేదని వారు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ విషయూన్ని మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాది రూ. ఐదు వేల వరకు కొని, ఇప్పుడు సగం ధరే పెడుతున్నారని గుర్తు చేశారు. మార్కెట్లో మీరందరూ ఉండి ఏం చేస్తున్నారని నిలదీశారు. కొందరు మహిళా రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట కూర్చుని ఆందోళన చేశారు. దీంతో సుమారు మూడు గంటలపాటు వేలం పాటలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైతు సంఘం నాయకులు గుజ్జునూరి బాబురావు, వీరభద్రయ్య, మదార్ అక్కడికి చేరుకుని మద్దతు ధర పెట్టాలని మార్కెట్ కార్యదర్శిని డిమాండ్ చేశారు. అనంతరం వారు వ్యాపారులతో సమావేశమై మళ్లీ వేలంపాటలు నిర్వహించాలని వారికి సూచించారు. వ్యాపారులు అంగీకరించడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. ఎట్టకేలకు సాయంత్రం వ్యాపారులు వేలం పాటలు ప్రారంభించారు. 14 వేల బస్తాల పల్లి అమ్మకానికి రాగా... కేవలం 9 వేల బస్తాలకు వేలం పాడారు. క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.3,355, కనిష్ట ధర రూ.2,800 పలికినట్లు అధికారులు తెలిపారు. -
ధాన్యం..ధర దైన్యం
సాక్షి, ఏలూరు : వరుస విపత్తులతో అప్పుల పాల వుతున్న అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశలు పూర్తిగా సన్నగిల్లుతున్నాయి. పంటల్ని నష్టపోయిన రైతులను అన్నివిధాలా అదుకుంటామంటూ చేస్తున్న ప్రకటనలు బూటకంగా కనిపిస్తున్నాయి. ధాన్యానికి గిట్టుబాటు ధర క్విం టాల్‌కు కనీసం రూ.2 వేలకుపైగా ఇవ్వాలని ఎన్నో ఏళ్లుగా రైతులు మొత్తుకుం టుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా ఇప్పుడు ఇస్తున్నదే చాలా ఎక్కువని, వచ్చే మూడేళ్లలో ఇక పెంచాల్సిన అవసరం లేదని కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరల నిర్ణయాక కమిటీ చైర్మన్ అశోక్‌గులాటీ ఇటీవల ప్రకటించడం రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. రానున్న రోజుల్లో వ్యవసాయం చేయాలా వద్దా అనే అలోచనలో పడేసింది. పెరిగిన సాగు ఖర్చులు జిల్లాలో దాదాపు 6లక్షల ఎకరాల్లో ఏటా రెండు పం టలు పండిస్తున్నారు. ఇందులో నాలుగున్నర లక్షలకు పైగా ఎకరాల్లో వరిని మాత్రమే సాగు చేస్తున్నారు. అంటే జిల్లాలో 80 శాతం మంది ధాన్యం పండించే రైతులే ఉన్నారు. ఎకరాకు కనీసం రూ.15 వేల నుంచి రూ.20వేలు ఖర్చు చేయనిదే పంట చేతికి అందడంలేదు. తుపాన్లు వచ్చినా.. భారీ వర్షాలు కురిసినా పెట్టుబడి అంతా గంగపాలవుతోంది. గడచిన మూడు పంటల్లోనూ కలిపి 6 లక్షల ఎకరాల్లో పంటలను రైతులు కోల్పోయారు. ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న చేలల్లో కేవలం 7 నుంచి 15 బస్తాల దిగుబడే వస్తోంది. ధాన్యాన్ని అతి తక్కువ ధర చెల్లించి దళారులు దోచుకుంటున్నారు. మద్దతు ధరకే ధాన్యం కొంటామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో విఫలమవుతోంది. ఏటా ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయంగానే మిగులుతున్నాయి. దీంతో రైతులు అప్పులపాలై అత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రకటించిన ధరైనా రాదాయె ధాన్యంలో 17 శాతం తేమ ఉంటే ఏ గ్రేడ్‌గా పరిగణించి క్వింటాల్‌కు రూ.1,345, అంతకు మించి తేమ ఉంటే బీ గ్రేడ్‌గా భావించి క్వింటాల్‌కు రూ.1,310 చెల్లించాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఈ ధర రైతుకు ఎప్పుడూ దక్కడం లేదు. కొన్ని ప్రాంతాల్లో గ్రేడ్‌తో సంబంధం లేకుండా ఏ రకమైనా ఒకే ధర చెల్లిస్తున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో కనీస మద్దతు ధరకంటే తక్కువకు అడుగుతున్నారు. జిల్లా అధికారులు సమీక్షలు పెట్టి మిల్లర్లను హెచ్చరించినప్పుడల్లా కొద్దోగొప్పో రేటు పెంచుతున్నా అది తాత్కాలికంగానే ఉంటోంది. నిజానికి సాగు ఖర్చులను బేరీజు వేసుకుంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏమాత్రం సరిపోవడం లేదు. కనీసం క్వింటాల్‌కు ఏ గ్రేడ్ రకానికి రూ.2,500 చెల్లించాలని రైతులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఏటా రూ.50 లేదా రూ.60కి మించి పెంచడం లేదు. ఎప్పటికైనా గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో సాగు చేస్తున్న రైతులకు కేంద్ర ప్రతినిధిగా అశోక్‌గులాటీ చేసిన వ్యాఖ్యలు ఆవేదనకు గురిచేస్తున్నాయి. వచ్చే మూడేళ్లు పంటలు ఇలాగే ఉండి, నష్టాలు వస్తూ, గిట్టుబాటు ధర పెరగకపోతే వ్యవసాయం కష్టమంటున్నారు రైతులు. ధర లేకపోతే అప్పులెలా తీరతారుు ‘మొన్నొచ్చిన తుపానుకి చేనంతా పడిపోయింది. కొద్దోగొప్పో మిగి లిన పంటను ఎలాగో ఒబ్బిడి చేసుకున్నాం. పెట్టుబడులు బాగా పెరిగిపోయాయి. ఎరువులు, పురు గు మందుల ధరలను బాగా పెంచేశారు. మొన్నటికి మొన్న మాసూళ్లు చేయిస్తున్నప్పుడు ఒక మడి బారు పనలను మోయడానికి రూ.1,500 తీసుకున్నారు. కేవలం పంట నూర్పిడికే ఎకరాకు రూ.4,000 అయిపోతున్నాయి. వచ్చిన నాలుగు గింజలకైనా గిట్టుబాటు ధర లేకపోతే అప్పులెలా తీరతాయి. మేమెలా బతకాలి.’ - దాసరి అచ్యురాజు, రైతు, బాదంపూడి -
సౌధ సాక్షిగా అన్నదాత ఆత్మహత్య
చెరకు రైతుల ఆందోళనలో అపశ్రుతి.. = గిట్టుబాటు ధర కల్పించాలని విషం తాగిన రైతు = ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి = నివాళులర్పించిన సీఎం, మంత్రులు = అసెంబ్లీలో సీఎంపై యడ్డి వాగ్దాడి = తేరుకుని ఎదురు దాడికి దిగిన సిద్ధు = పరస్పర దూషణలతో దద్దరిల్లిన అసెంబ్లీ = స్పీకర్ జోక్యం.. సభ నేటికి వాయిదా సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెల్గాంలోని సువర్ణ సౌధలో జరుగుతున్న శాసన సభ శీతాకాల సమావేశాల సందర్భంగా గిట్టు బాటు ధర కోసం సౌధ ఎదుట చెరకు రైతులు చేపట్టిన ఆందోళనలో బుధవారం అపశ్రుతి చోటు చేసుకుంది. విఠల అరభావి (60) అనే రైతు మధ్యాహ్నం విషం తాగి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. హుటాహుటిన ఇతర రైతులు ఆయనను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయం తెలిసిన వెంటనే శాసన సభ వాయిదా పడింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇతర మంత్రులు ఆస్పత్రిలో విఠల భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా... సభ తిరిగి సాయంత్రం పునఃప్రారంభమైనప్పుడు ముఖ్యమంత్రి రైతు ఆత్మహత్యపై ప్రకటన చేస్తూ, ఆయన కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ఇప్పటికే ఆయన రూ.ఐదారు లక్షల అప్పుల్లో ఉన్నట్లు తమకు తెలిసిందని చెప్పారు. చక్కెర కర్మాగారాలు టన్ను చెరకు ధరను రూ.2,500 గా ప్రకటించగా, తమ ప్రభుత్వం మరో రూ.150 చొప్పున మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు. దీని కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. గత రెండు రోజులుగా సభలో చెరకు రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగిందని, దీనిపై తాను సమాధానం ఇవ్వాల్సిన తరుణంలో ఈ ఘోరం జరిగి పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ దశలో కేజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప లేచి నిల్చుని హరి కథలు చాలంటూ ఆగ్రహంతో పోడియం వద్దకు దూసుకు వచ్చారు. రైతులకు ఏం చేశారో చెప్పండంటూ ముఖ్యమంత్రిని నిలదీశారు. యడ్యూరప్పను ఇతర కేజేపీ, బీజేపీ సభ్యులు అనుసరించారు. ఆయన నేరుగా ముఖ్యమంత్రిపై వాగ్దాడికి దిగారు. కాసేపు బిత్తరపోయిన ముఖ్యమంత్రి అనంతరం తేరుకుని యడ్యూరప్పపై విమర్శలకు దిగారు. ముఖ్యమంత్రికి మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన చుట్టూ నిల్చున్నారు. మీకు సిగ్గు లేదంటే, మీకు సిగ్గు లేదంటూ ఒకరిపై మరొకరు దూషణలకు దిగారు. కేజేపీ, బీజేపీ సభ్యులు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. యడ్యూరప్ప వాగ్దాటిని ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి స్వరం పెంచి మాట్లాడారు. ‘శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు. మీకు మానం, మర్యాద లేదు’ అంటూ తూలనాడారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప, రైతు మృతికి సంతాప సూచకంగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. కాగా రైతు ఆత్మహత్య సంఘటనకు నిరసనగా బెల్గాం జిల్లాలో పలు చోట్ల రైతులు రాస్తారోకోను నిర్వహించారు. -
పత్తి కష్టాలు పుట్టెడు
గజ్వేల్, న్యూస్‌లైన్: పుట్టెడు కష్టాలతో పత్తి రైతులు అల్లాడుతున్నారు. ఇంకా సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగో ళ్లు ప్రారంభించకపోవడం.. దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో మద్దతు ధర కరువైంది. సీసీఐ తీరుపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ప్రతి ఏటా నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే ఈ సంస్థ ఈసారి ఇంకా చడీచప్పుడు లేకుండా ఉండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మద్దతు ధర’తో ప్రమేయం లేకుండా ప్రైవేట్ వ్యాపారులతో పోటీ పడుతూ ‘కమర్షియల్ పర్చేజ్’ చేపట్టడానికి ముందుకు రావాల్సిన సీసీఐలో ఇంకా కదలికపోవడం ఆందోళనకు దారితీస్తోంది. జిల్లాలో ఈసారి 1.20లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది. సుమారు 2.6లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడులు వచ్చే అవకాశముంది. పత్తి రైతుల అవసరాల దృష్ట్యా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్‌లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్లోకి వెల్లువలా ఉత్పత్తులు రావడం ఊపందుకున్నా ఈ కేంద్రాలను ఇంకా తెరవలేదు. ఈ పరిణామం వ్యాపారులకు కలిసి వస్తున్నది. పత్తికి ప్రభుత్వం రూ.4వేలు మద్దతు ధరను ప్రకటించినా గజ్వేల్‌లో వ్యాపారులు మాత్రం రూ.3,500కు మించి ధరను చెల్లించలేదు. తడిసిన పత్తిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన పత్తిని గుజరాత్, మహారాష్ట్రతోపాటు జమ్మికుంట, గుంటూరు మార్కెట్లకు తరలిస్తూ వ్యాపారులు మాత్రం రూ.4600వరకు ధరను పొందుతున్నారు. ఈ లెక్కన ఒక్క గజ్వేల్ ప్రాంతంలోనే రైతులు ఇప్పటికే లక్షల్లో నష్టపోయారు. గతేడాదితో పోలీస్తే ఈసారి వర్షాలు సకాలంలో కురవడం వల్ల ఉత్పత్తులు తొందరగా మార్కెట్లోకి వచ్చాయి. సీసీఐ ముందుచూపుతో ఆలోచించి కమర్షియల్ పర్చేజ్‌తో కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంటే రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేది. ‘ఏ’ గ్రేడ్ పత్తికి మాత్రమే రూ.4,300 చెల్లిస్తున్నారు. ఏ మాత్రం లోపాలు కనిపించినా రూ.3,900కి మించి ధర ఇవ్వడం లేదు. ఇందులోనూ క్వింటాలుకు 2 కిలోల చొప్పున కోత పెడుతున్నారు. ‘కమర్షియల్ పర్చేజ్’ లేనట్టేనా? 2011 నవంబర్ నెలలో పత్తి ధర పైపైకి ఎగబాకింది. రూ.4వేల నుంచి ప్రారంభమైన ధర డిసెంబర్, జనవరి నెలలో రూ.7వేల పైచిలుకు పలికింది. అంతర్జాతీయ పత్తి మార్కెట్లో ఏర్పడిన డిమాండ్ కారణంగా ధర అమాంతం పెరిగింది. నిజానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.3,000మాత్రమే. సీసీఐ కేంద్రం నిబంధనల ప్రకారం మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలి. కానీ నిబంధనలను సడలించుకొని ‘కమర్షియల్ పర్చేజ్’ పేరిట సీసీఐ కూడా పోటీ పడి కొనుగోళ్లు చేపట్టింది. గరిష్టంగా గజ్వేల్‌లో రూ.7వేల వరకు ధరను కూడా చెల్లించింది. కానీ రేండేళ్లుగా సీసీఐ సక్రమంగా కొనుగోళ్లను చేపట్టడం లేదు. గతేడాది వారంలో ఒకటి రెండురోజుల మాత్రమే కొనుగోళ్లను చేపట్టడం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా సీసీఐ ‘కమర్షియల్ పర్చేజ్’కు దిగుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో రైతుల ఆశలు సన్నగిల్లాయి. తెల్లబంగారానికి రెండోసారి తుఫాన్ దెబ్బ.... నెల రోజుల క్రితం ఎడతెరిపిలేకుండా కురిసిన తుపాన్ ధాటికి తీవ్ర పంట నష్టానికి గురైన పత్తి రైతులు తాజాగా శనివారం కురిసిన వానకు బెంబేలెత్తిపోతున్నారు. ముసురుతో గజ్వేల్ యార్డులో పత్తి లావాదేవీలు జరగలేదు. ఇలాగే వర్షం కురిస్తే నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
తాండూరు మార్కెట్లో...అన్నదాత దగా!
తాండూరు, న్యూస్‌లైన్: అన్నదాతల గురించి ఎవరికీ పట్టింపు లేకుండాపోయింది. ఎండకు ఎండి.. వానకు తడిసి ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వ మద్దతు ధర లభించక రైతున్న దగాపడుతున్నా ప్రజాప్రతినిదులు, మార్కెటింగ్ శాఖ అధికారులకు పట్టడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి అన్నదాతలు మౌనంగా రోదిస్తున్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్లో ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు ధాన్యం (సాధారణ రకం) కొనుగోలు చేసేందుకు కమీషన్ ఏజెంట్లు ససేమిరా అంటున్నారు. మద్దతు ధర చెల్లిస్తే తమకు గిట్టుబాటు కాదనే ధోరణితో కొందరు కమీషన్ ఏజెంట్లు తక్కువ ధర చెల్లిస్తూ అన్నదాతల శ్రమను దోచుకుంటున్నారు. మార్కెట్ యార్డులో ప్రభుత్వ మద్దతు ధరల బోర్డులు ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులు.. ధాన్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. దీంతో యార్డులోని సూచిక బోర్డులకే ‘మద్దతు’ ధరలు పరిమితమయ్యాయే తప్ప తమకు ప్రయోజనం కలగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4,200 క్వింటాళ్ల కొనుగోళ్లు తాండూరు మార్కెట్ యార్డులో గత నెల 10వ తేదీ నుంచి ఖరీఫ్ ధాన్యం క్రయవిక్రయాలు ఆరంభమయ్యాయి. ఈ నెల 19వ తేదీ వరకు యార్డులో వివిధ గ్రామాల నుంచి కమీషన్ ఏజెంట్లు 4,200 క్వింటాళ్ల ధాన్యాన్ని (సాధారణ రకం) కొనుగోలు చేశారు. క్వింటాలు ధాన్యానికి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర రూ.1310. కానీ ఇక్కడ ఇప్పటివరకూ రైతులకు మద్దతు ధర దక్కలేదు. సగటు ధర క్వింటాలుకు రూ.1,285! క్రయవిక్రయాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు క్వింటాలు ధాన్యానికి గరిష్టంగా రూ.1,341, కనిష్టంగా రూ.1,220, సగటు (మోడల్) ధర రూ.1,285 ధర మాత్రమే పలికింది. గరిష్ట ధరకు కొద్ది మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తూ, అధికంగా తక్కువ ధర చెల్లిస్తుండటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. సగటు ధర ప్రకారం క్వింటాలుకు సుమారు రూ.25 చొప్పున రైతులు నష్టపోయినట్టు స్పష్టమవుతోంది. అయినా స్థానిక ప్రజాప్రతినిధులు ఏనాడూ మద్దతు ధరలపై, రైతులకు జరుగుతున్న నష్టంపై అడిగిన దాఖలాలు లేవు. ఇక అధికారులైతే తమకు సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో నాణ్యతా ప్రమాణాల పేరుతో ఏజెంట్లు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవచూపి తమకు మద్దతు ధర లభించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. -
మిల్లర్ల జోరు.. రైతు బేజారు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మంచి వర్షాలతో ఈ ఏడాది పంట ఉత్పత్తి పెరిగినా ఈ మేరకు ధాన్యం కొనుగోలును పెంచడంలేదు. ఇలా ధాన్యం రైతుల విషయంలో సర్కారు నిర్లక్ష్యం వ్యాపారులకు, రైస్ మిల్లర్లకు బాగా ఉపయోగపడుతోంది. వరి కోతలు ముమ్మరమైనప్పటికీ సరిపడా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయకపోవడంతో రైతులు రైస్ మిల్లర్లకే ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని రైస్ మిల్లర్ల తేమ పేరిట రైతులను నిండా ముంచుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో కేంద్ర ప్రభుత్వం ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ.1345, సాధారణ రకానికి రూ.1310 మద్దతు ధర ప్రకటించింది. జిల్లాలో రైస్ మిల్లర్లు తేమ సాకుతో క్వింటాల్‌కు రూ.40 నుంచి రూ.50 వరకు మద్దతు ధరలో కోత పెడుతున్నారు. తేమ సాకు చెబుతుండడంతో రైతులు ఎదురు మాట్లాడలేకపోతున్నారు. ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు అంతటా అందుబాటులో లేకపోవడం, కేంద్రాలు ఉన్న చోట చలిలో రెండుమూడు రోజులు పడిగాపులు పడాల్సి ఉండడంతో రైతులు రైస్ మిల్లర్లకే అయినకాడికి అమ్ముకుంటున్నారు. దీంతో ప్రభుత్వం కంటే రైస్ మిల్లర్లే ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు నవంబరు 18 వరకు జిల్లాలో 54 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశాయి. ప్రైవేటు వ్యాపారులు, రైస్ మిల్లర్లు ఇప్పటికే లక్ష టన్నులు కొనుగోలు చేశారు. ప్రభుత్వ సంస్థల కంటే రైస్ మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం రెట్టింపుగా ఉంది. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైస్ మిల్లర్ల పెత్తనాన్ని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. సర్కారు సేకరించిన ధాన్యం కంటే రైస్ మిల్లర్లు కొనుగోలు చేసింది ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటనే విషయంపై అధికారులు వివరణ ఇవ్వడంలేదు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి సాధారణంగా ప్రతిరోజు ప్రభుత్వ సంస్థలు, రైస్ మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం లెక్కలను వెల్లడించే పౌరసరఫరాల శాఖ ప్రస్తుత సీజనులో పూర్తి నివేదికలు వెల్లడించడంలేదు. కేవలం ప్రభుత్వ కొనుగోలు లెక్కలను మాత్రమే బహిర్గతం చేస్తోంది. రైస్ మిల్లర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుండడం వల్లే అధికారులు ఇలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రైస్ మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. వరి సాగు విస్తీర్ణం పెరగడంతో ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరిగింది. 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. గత ఏడాది కంటే ఇది మూడు లక్షల టన్నులు అధికం. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లు, గిరిజన సహకార మండలి(జీసీసీ) ద్వారా మొత్తం 609 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి ఆరు లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీజను మొదలై నెలన్నర దాటుతున్నా మూడు సంస్థలు 313 కేంద్రాలనే ఏర్పాటు చేసి, ఇప్పటికి 54 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే రైతుల నుంచి సేకరించాయి. అక్టోబరు ఆరంభం నుంచి 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజను మొదలైంది. మరో రెండు వారాల్లో వరికోతలు పూర్తికానున్నాయి. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం దృష్టిసారించకుంటే రైస్ మిల్లర్లు అన్నదాతలను మరింత దోచుకునే అవకావముంది. -
కొత్త రైతుబజార్ల కలేనా...
= స్థలాలు, నిధులు ఉన్నా.. తీరికే లేని అధికారులు! = అటకెక్కిన ప్రతిపాదనలు = పర్యవేక్షించే నాథుడే లేడు విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న సామెతను కొత్త రైతుబజార్ల ఏర్పాటు ప్రక్రియ గుర్తుచేస్తోంది. జిల్లాలో కొత్త రైతుబజార్ల ఏర్పాటు కోసం స్థలాలు, నిధులు సిద్ధంగా ఉన్నా రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులకు మాత్రం తీరిక దొరకటం లేదు. ఆదాయం దండిగా వచ్చే ఇసుక రీచ్‌లు, క్వారీల అనుమతులు చకచకా చేసే అధికారులు లక్షలాది మంది ప్రజలకు అతి ముఖ్యమైన రైతుబజార్ల ఏర్పాటు, వాటి మౌలిక వసతుల కల్పనపై తీవ్ర అలక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూరలు పండించే సన్న, చిన్నకారు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ దళారీ వ్యవస్థను నిర్మూలించి, వినియోగదారులకు సరసమైన ధరల్లో నాణ్యమైన కూరలను అందించే లక్ష్యంతో ఏర్పాటైన రైతుబజార్ల ఆలనాపాలనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పెండింగ్‌లోనే 9 రైతుబజార్ల ఏర్పాటు... జిల్లాలో మొత్తం 15 రైతుబజార్లు ఉండగా.. వాటిలో విజయవాడలో 4, జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో 11 ఉన్నాయి. విజయవాడలో కొత్తగా భవానీపురం, రాణిగారితోట, సత్యనారాయణపురం, జిల్లాలో గన్నవరం, కైకలూరు, పామర్రు, పెడన, తిరువూరు, అవనిగడ్డలలో రైతుబజార్లు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు, కూరలు పండించే రైతులు కోరుతున్నారు. ఈ క్రమంలో పోరాడగా పోరాడగా భవానీపురంలో మాత్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తిరువూరులో స్థలం సిద్ధంగా ఉంది. నాలుగేళ్ల క్రితమే రూ.10 లక్షల నిధులు కూడా మంజూరయ్యాయి. కొందరు వ్యాపారులు రైతుబజారు వద్దని గొడవ చేసినా చివరకు కోర్టు సైతం అక్కడ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. అవనిగడ్డలో కూడా స్థలం సిద్ధంగా ఉంది. రైతులు, ప్రజలు ఎన్నాళ్ల నుంచో కోరుతున్నా కొందరు వ్యాపారులు మాత్రం రాజకీయంగా మోకాలడ్డారు. ఇక కైకలూరు, గన్నవరంలలో రైతుబజార్ ఏర్పాటు చేయమని ఎన్నో ఏళ్లనుంచి ప్రజలు కోరుతున్నారు. కేవలం మార్కెటింగ్, రెవెన్యూ అధికారుల అలక్ష్యం వల్లే అక్కడ ఈ ప్రక్రియ ముందుకు సాగటం లేదని విమర్శలు వస్తున్నాయి. పెడన, విజయవాడలోని రాణిగారితోట, సత్యనారాయణపురంలలో రైతుబజార్ల ఏర్పాటు ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. తాజాగా పామర్రులో రైతుబజార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ స్థలం ఉన్నా అధికార యంత్రాంగానికే సమయం చిక్కటం లేదని విమర్శలు వస్తున్నాయి. పట్టించుకోని అధికారులు... జిల్లాలో 9 చోట్ల కొత్త రైతుబజార్లు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన దశాబ్దకాలం నుంచి ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదు. మార్కెటింగ్ శాఖలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతుబజార్ల పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బంది లేకపోవటంతో ఈ ప్రక్రియ ముందుకు సాగటంలేదని తప్పించుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు గట్టిగా అడిగిన చోట ప్రతిపాదనలు పంపి మార్కెటింగ్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. స్థలాల సేకరణకు రెవెన్యూ, మార్కెటింగ్, మున్సిపల్ అధికారులను సమన్వయపరిచే నాథుడే కనపడటంలేదు. కొన్నిచోట్ల స్థలాలు ఇవ్వటానికి మున్సిపల్, పంచాయతీ అధికారులు సిద్ధంగా ఉన్నా, రెవెన్యూ మార్కెటింగ్ అధికారులకు వాటిని స్వాధీనం చేసుకునేందుకు కనీసం నాలుగేళ్ల నుంచి తీరిక దొరకలేదు. ఈ నేపథ్యంలో కొత్త రైతుబజార్ల ఏర్పాటు ప్రక్రియ ఎడారిలో ఎండమావిలా కనపడుతోంది. ఉన్నవాటిలోనూ సమస్యలు కోకొల్లలు... ఇప్పటికే కొనసాగుతున్న రైతుబజార్లలోనూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. రాష్ట్రంలో రెండో అతిపెద్దదైన విజయవాడ స్వరాజ్యమైదానం రైతుబజారు వర్షం వస్తే జలమయమవుతుంది. నగరంలోని పటమట, కేదారేశ్వరపేట, సింగ్‌నగర్, ఉయ్యూరు, జగ్గయ్యపేట, గుడివాడ రైతుబజార్లు కూడా వర్షం వస్తే తటాకాలను తలపిస్తాయి. వీటి అభివృద్ధికి ఎప్పటికప్పుడు నిధులు మంజూరవుతున్నా వాటి పర్యవేక్షణపై అధికారులు దృష్టిసారించడం లేదని విమర్శలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎం.రఘునందనరావు అయినా రైతుబజార్ల ఏర్పాటు, మౌలిక వసతులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.