గజ్వేల్, న్యూస్‌లైన్: పుట్టెడు కష్టాలతో పత్తి రైతులు అల్లాడుతున్నారు. ఇంకా సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగో ళ్లు ప్రారంభించకపోవడం.. దళారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో మద్దతు ధర కరువైంది. సీసీఐ తీరుపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. ప్రతి ఏటా నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే ఈ సంస్థ ఈసారి ఇంకా చడీచప్పుడు లేకుండా ఉండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మద్దతు ధర’తో ప్రమేయం లేకుండా ప్రైవేట్ వ్యాపారులతో పోటీ పడుతూ ‘కమర్షియల్ పర్చేజ్’ చేపట్టడానికి ముందుకు రావాల్సిన సీసీఐలో ఇంకా కదలికపోవడం ఆందోళనకు దారితీస్తోంది. జిల్లాలో ఈసారి 1.20లక్షల హెక్టార్లలో పత్తి సాగైంది.
సుమారు 2.6లక్షల మెట్రిక్ టన్నులకు పైగా దిగుబడులు వచ్చే అవకాశముంది. పత్తి రైతుల అవసరాల దృష్ట్యా జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట, తొగుట, జోగిపేట, జహీరాబాద్‌లలో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్కెట్‌లోకి వెల్లువలా ఉత్పత్తులు రావడం ఊపందుకున్నా ఈ కేంద్రాలను ఇంకా తెరవలేదు. ఈ పరిణామం వ్యాపారులకు కలిసి వస్తున్నది. పత్తికి ప్రభుత్వం రూ.4వేలు మద్దతు ధరను ప్రకటించినా గజ్వేల్‌లో వ్యాపారులు మాత్రం రూ.3,500కు మించి ధరను చెల్లించలేదు. తడిసిన పత్తిని అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన పత్తిని గుజరాత్, మహారాష్ట్రతోపాటు జమ్మికుంట, గుంటూరు మార్కెట్‌లకు తరలిస్తూ వ్యాపారులు మాత్రం రూ.4600వరకు ధరను పొందుతున్నారు.
ఈ లెక్కన ఒక్క గజ్వేల్ ప్రాంతంలోనే రైతులు ఇప్పటికే లక్షల్లో నష్టపోయారు. గతేడాదితో పోలీస్తే ఈసారి వర్షాలు సకాలంలో కురవడం వల్ల ఉత్పత్తులు తొందరగా మార్కెట్‌లోకి వచ్చాయి. సీసీఐ ముందుచూపుతో ఆలోచించి కమర్షియల్ పర్చేజ్‌తో కొనుగోలు కేంద్రాలను తెరిచి ఉంటే రైతులకు నష్టం వాటిల్లకుండా ఉండేది. ‘ఏ’ గ్రేడ్ పత్తికి మాత్రమే రూ.4,300 చెల్లిస్తున్నారు. ఏ మాత్రం లోపాలు కనిపించినా రూ.3,900కి మించి ధర ఇవ్వడం లేదు. ఇందులోనూ క్వింటాలుకు 2 కిలోల చొప్పున కోత పెడుతున్నారు.
‘కమర్షియల్ పర్చేజ్’ లేనట్టేనా?
2011 నవంబర్ నెలలో పత్తి ధర పైపైకి ఎగబాకింది. రూ.4వేల నుంచి ప్రారంభమైన ధర డిసెంబర్, జనవరి నెలలో రూ.7వేల పైచిలుకు పలికింది. అంతర్జాతీయ పత్తి మార్కెట్‌లో ఏర్పడిన డిమాండ్ కారణంగా ధర అమాంతం పెరిగింది. నిజానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర రూ.3,000మాత్రమే. సీసీఐ కేంద్రం నిబంధనల ప్రకారం మద్దతు ధరకే పత్తిని కొనుగోలు చేయాలి. కానీ నిబంధనలను సడలించుకొని ‘కమర్షియల్ పర్చేజ్’ పేరిట సీసీఐ కూడా పోటీ పడి కొనుగోళ్లు చేపట్టింది.
గరిష్టంగా గజ్వేల్‌లో రూ.7వేల వరకు ధరను కూడా చెల్లించింది. కానీ రేండేళ్లుగా సీసీఐ సక్రమంగా కొనుగోళ్లను చేపట్టడం లేదు. గతేడాది వారంలో ఒకటి రెండురోజుల మాత్రమే కొనుగోళ్లను చేపట్టడం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా సీసీఐ ‘కమర్షియల్ పర్చేజ్’కు దిగుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. కానీ ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో రైతుల ఆశలు సన్నగిల్లాయి.
తెల్లబంగారానికి రెండోసారి తుఫాన్ దెబ్బ....
నెల రోజుల క్రితం ఎడతెరిపిలేకుండా కురిసిన తుపాన్ ధాటికి తీవ్ర పంట నష్టానికి గురైన పత్తి రైతులు తాజాగా శనివారం కురిసిన వానకు బెంబేలెత్తిపోతున్నారు. ముసురుతో గజ్వేల్ యార్డులో పత్తి లావాదేవీలు జరగలేదు. ఇలాగే వర్షం కురిస్తే నష్టం తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పత్తి కష్టాలు పుట్టెడు
Published Sun, Nov 24 2013 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement
Advertisement