టమాట రైతులకు గడ్డుకాలం
గణనీయంగా తగ్గిన ధరలు
కష్టాల్లో అన్నదాతలు
పెట్టుబడులు కూడా దక్కని వైనం
టమాట రైతులకు గడ్డుకాలం వచ్చిపడింది. గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు గణనీయంగా తగ్గడంతో అన్నదాత కుదేలవుతున్నాడు. ఓ వైపు పట్టుగూళ్ల ధరలు తగ్గి పట్టు పరిశ్రమ రైతును దెబ్బతీస్తుంటే మరో వైపు ప్రత్యామ్నాయంగా సాగు చేసిన టమాటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
కోలారు : పట్టు సాగు తర్వాత కోలారు జిల్లాలో రైతులు అత్యధికంగా టమాట సాగుపైనే ఆధారపడి ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, పొరుగు రాష్ట్రాల్లో టమాట దిగుబడి ఎక్కువగా ఉండడంతో ఈ ఏడాది కోలారు జిల్లాలో టమాట సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో 15 కిలోల టమాట బాక్స్ ధర రూ. 700 నుంచి రూ. 1,500 వరకు పలికింది. అప్పట్లో టమాట సాగు చేసిన రైతుల ఇంటిలో కాసుల వర్షమే కురిసింది. ఈ నేపథ్యంలోనే కోలారు జిల్లా వ్యాప్తంగా 9,695 హెక్టార్ల(23,956 ఎకరాలు)లో ఈ ఏడాది రైతులు టమాట సాగు చేశారు. పంట దిగుబడి కూడా భారీగానే వచ్చింది. కోలారు జిల్లాలోని అన్ని మార్కెట్ యార్డుల్లో టమాట వ్యాపారం పుంజుకుంది. ఒక ఎకరా విస్తీర్ణంలో టమాట పండించేందుకు రైతులు రూ. 70 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు పెట్టారు. ఈ లెక్కన మార్కెట్‌లో ఒక బాక్స్ టమాట రూ. 275 నుంచి రూ. 300 వరకు అమ్ముడు పోతే రైతులకు గిట్టుబాటుగా ఉంటుంది.
గిట్టుబాటు కాని ధర
రెండు వారాలుగా కోలారు మార్కెట్‌లో ఒక బాక్స్ టమాట ధరలు రూ. 30 నుంచి రూ. 150 వరకు పలుకుతున్నాయి. ఈ ధర రైతులు పంట దిగుబడిని మార్కెట్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చులకు సైతం సరిపోవడం లేదు. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా టమాట దిగుబడి గణనీయంగా ఉండడంతో ఇక్కడి నుంచి మరో ప్రాంతానికి పంట ఎగుమతి కావడం లేదు. ఫలితంగా కోలారు జిల్లాలోని పలు మార్కెట్ యార్డులో టమాట నిల్వలు పెద్ద ఎత్తున పేరుకుపోతున్నాయి. ఇదే సందర్భంలో కీటకాల వల్ల టమాటలో నాణ్యత తగ్గి ధర పడిపోవడానికి కారణమవుతోంది. కీటకాల వల్ల నష్టపోయిన టమాటను ఏపీఎంసీ యార్డ్ వద్ద కుప్పలుగా పడేస్తున్నారు.
మరి కొందరు రైతులు పంట పీకేందుకు అయ్యే కూలీల ఖర్చు కూడా గిట్టుబాటు కావడం లేదంటూ పొలంలోనే పంటను వదిలేస్తున్నారు. ఆసియాలోనే రెండవ స్థానంలో ఉన్న కోలారు ఎపీఎంసీ యార్డుకు నిత్యం 200 లోడ్‌ల టమాట వస్తోంది. ధరలు తగ్గిన సమయంలో టమోటా నిలువ చేయడానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని టమోటా సంస్కరణా ఘటకాన్ని నరసాపురం పారిశ్రామిక వాడలో ప్రారంభించాలని రైతుల డిమాండు, తద్వారా ధరలు తగ్గిన సమయంలో సంస్కరణా కేంద్రాలకు టమాట తరలించి రైతులకు గిట్టుధర అందించడానికి సాధ్యమవుతుందని పలువురు సూచిస్తున్నారు.