కొత్త రైతుబజార్ల కలేనా... | New farmers' market, kalena ... | Sakshi
Sakshi News home page

కొత్త రైతుబజార్ల కలేనా...

Published Mon, Nov 11 2013 3:20 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

New farmers' market, kalena ...

 

=    స్థలాలు, నిధులు ఉన్నా.. తీరికే లేని అధికారులు!
 =    అటకెక్కిన ప్రతిపాదనలు
 =    పర్యవేక్షించే నాథుడే లేడు     
 
 
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉందన్న సామెతను కొత్త రైతుబజార్ల ఏర్పాటు ప్రక్రియ గుర్తుచేస్తోంది. జిల్లాలో కొత్త రైతుబజార్ల ఏర్పాటు కోసం స్థలాలు, నిధులు సిద్ధంగా ఉన్నా రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులకు మాత్రం తీరిక దొరకటం లేదు. ఆదాయం దండిగా వచ్చే ఇసుక రీచ్‌లు, క్వారీల అనుమతులు చకచకా చేసే అధికారులు లక్షలాది మంది ప్రజలకు అతి ముఖ్యమైన రైతుబజార్ల ఏర్పాటు, వాటి మౌలిక  వసతుల కల్పనపై తీవ్ర అలక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూరలు పండించే సన్న, చిన్నకారు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తూ దళారీ వ్యవస్థను నిర్మూలించి, వినియోగదారులకు సరసమైన ధరల్లో నాణ్యమైన కూరలను అందించే లక్ష్యంతో ఏర్పాటైన రైతుబజార్ల ఆలనాపాలనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
 
పెండింగ్‌లోనే 9 రైతుబజార్ల ఏర్పాటు...

జిల్లాలో మొత్తం 15 రైతుబజార్లు ఉండగా.. వాటిలో విజయవాడలో 4, జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో 11 ఉన్నాయి. విజయవాడలో కొత్తగా భవానీపురం, రాణిగారితోట, సత్యనారాయణపురం, జిల్లాలో గన్నవరం, కైకలూరు, పామర్రు, పెడన, తిరువూరు, అవనిగడ్డలలో రైతుబజార్లు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు, కూరలు పండించే రైతులు కోరుతున్నారు. ఈ క్రమంలో పోరాడగా పోరాడగా భవానీపురంలో మాత్రం ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

తిరువూరులో స్థలం సిద్ధంగా ఉంది. నాలుగేళ్ల క్రితమే రూ.10 లక్షల నిధులు కూడా మంజూరయ్యాయి. కొందరు వ్యాపారులు రైతుబజారు వద్దని గొడవ చేసినా చివరకు కోర్టు సైతం అక్కడ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. అవనిగడ్డలో కూడా స్థలం సిద్ధంగా ఉంది. రైతులు, ప్రజలు ఎన్నాళ్ల నుంచో కోరుతున్నా కొందరు వ్యాపారులు మాత్రం రాజకీయంగా మోకాలడ్డారు. ఇక కైకలూరు, గన్నవరంలలో రైతుబజార్ ఏర్పాటు చేయమని ఎన్నో ఏళ్లనుంచి ప్రజలు కోరుతున్నారు.

కేవలం మార్కెటింగ్, రెవెన్యూ అధికారుల అలక్ష్యం వల్లే అక్కడ ఈ ప్రక్రియ ముందుకు సాగటం లేదని విమర్శలు వస్తున్నాయి. పెడన, విజయవాడలోని రాణిగారితోట, సత్యనారాయణపురంలలో రైతుబజార్ల ఏర్పాటు ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. తాజాగా పామర్రులో రైతుబజార్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం జీఓ జారీ చేసింది. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ స్థలం ఉన్నా అధికార యంత్రాంగానికే సమయం చిక్కటం లేదని విమర్శలు వస్తున్నాయి.
 
పట్టించుకోని అధికారులు...

జిల్లాలో 9 చోట్ల కొత్త రైతుబజార్లు ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన దశాబ్దకాలం నుంచి ఉన్నా అధికారులు పట్టించుకోవటం లేదు. మార్కెటింగ్ శాఖలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతుబజార్ల పర్యవేక్షణకు ప్రత్యేక సిబ్బంది లేకపోవటంతో ఈ ప్రక్రియ ముందుకు సాగటంలేదని తప్పించుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు గట్టిగా అడిగిన చోట ప్రతిపాదనలు పంపి మార్కెటింగ్ అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. స్థలాల సేకరణకు రెవెన్యూ, మార్కెటింగ్, మున్సిపల్ అధికారులను సమన్వయపరిచే నాథుడే కనపడటంలేదు. కొన్నిచోట్ల స్థలాలు ఇవ్వటానికి మున్సిపల్, పంచాయతీ అధికారులు సిద్ధంగా ఉన్నా, రెవెన్యూ మార్కెటింగ్ అధికారులకు వాటిని స్వాధీనం చేసుకునేందుకు కనీసం నాలుగేళ్ల నుంచి తీరిక దొరకలేదు. ఈ నేపథ్యంలో కొత్త రైతుబజార్ల ఏర్పాటు ప్రక్రియ ఎడారిలో ఎండమావిలా కనపడుతోంది.
 
ఉన్నవాటిలోనూ సమస్యలు కోకొల్లలు...

 ఇప్పటికే కొనసాగుతున్న రైతుబజార్లలోనూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. రాష్ట్రంలో రెండో అతిపెద్దదైన విజయవాడ స్వరాజ్యమైదానం రైతుబజారు వర్షం వస్తే జలమయమవుతుంది. నగరంలోని పటమట, కేదారేశ్వరపేట, సింగ్‌నగర్, ఉయ్యూరు, జగ్గయ్యపేట, గుడివాడ రైతుబజార్లు కూడా వర్షం వస్తే తటాకాలను తలపిస్తాయి. వీటి అభివృద్ధికి ఎప్పటికప్పుడు నిధులు మంజూరవుతున్నా వాటి పర్యవేక్షణపై అధికారులు దృష్టిసారించడం లేదని విమర్శలు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎం.రఘునందనరావు అయినా రైతుబజార్ల ఏర్పాటు, మౌలిక వసతులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement