
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): అక్కచెల్లెమ్మల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌తో వారికి క్షణాల్లోనే రక్షణ అందుతోందని మరోసారి రుజువైంది. వేధింపులకు గురైన యువతి దిశ యాప్ ఎస్‌వోఎస్ బటన్ నొక్కగానే కేవలం 6 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువతిని రక్షించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దేవీనగర్‌కు చెందిన యువతి (19) ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
అదే కళాశాలలో చదువుతున్న ఆకాష్ ఆమెను ప్రేమ పేరుతో నిత్యం వేధిస్తున్నాడు. అతడిపై యువతి తన తండ్రికి, కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయడంతో వారు యువకుడిని పలుమార్లు హెచ్చరించారు. అయినా ఆకాష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. యువతి శుక్రవారం మధ్యాహ్నం కళాశాలలో పరీక్ష రాసి తండ్రితో కలసి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా ఆకాష్ ద్విచక్రవాహనంపై వెంటపడుతూ వేధింపులకు గురిచేశాడు. దీంతో యువతి దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ ప్రెస్ చేసింది. మధ్యాహ్నం 12.31కి దిశ కాల్ సెంటర్‌కు సమాచారం రాగానే వెంటనే స్పందించిన సత్యనారాయణపురం పోలీసులు 12.37కి ఘటనా స్థలానికి చేరుకుని యువతిని రక్షించారు. నిందితుడు ఆకాష్‌ను అదుపులోకి తీసుకుని 483, 354డి, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment