కంబదూరు(చిత్తూరు జిల్లా): పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో టమాట రైతు గుండె ఆగిపోయింది. పంటచేలోనే ఆ రైతు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం జెక్కిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం ఈ విషాదం చోటుచేసుకుంది. గొల్ల నాగన్నకు 20 ఎకరాలు పొలం ఉంది. పెళ్లి సమయంలో కుమార్తెకు నాలుగెకరాలు పంచి ఇచ్చారు. 12 ఎకరాలు వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేస్తూ మూడేళ్లుగా చాలా నష్టపోయారు. నాలుగెకరాలలో ఐదు బోర్లు వేయించగా ఒక బోరులో మాత్రమే నీరు పడింది. బోర్ల కోసం రూ. 1.20 లక్షలు ఖర్చు చేశారు. నాలుగెకరాల తోటలో రెండెకరాలలో 448 రకం టమాటను ట్రెల్లీస్ (కర్రల ఏర్పాటు విధానం)తో సాగు చేశాడు.
ఇందు కోసం రూ. 2 లక్షలు పెట్టుబడి పెట్టాడు. గురువారం ఉదయం భార్య తో కలిసి పదిమంది కూలీలతో తోటకు వెళ్లారు. పంట తొలగించి 15 కిలోల సామర్థ్యం గల 150 బాక్సులు నింపుతున్నారు. 15 కిలోల టమాట బాక్సు రూ. 30ల ప్రకారం ఓ వ్యాపారితో ధర కుదుర్చుకున్నాడు. ఈ ప్రకారం 150 బాక్సులకు రూ. 4500 మాత్రమే వస్తుంది. ఇందులో 10 మంది కూలీలకు రూ. 2 వేల దాకా కూలీ చెల్లించారు. ఇక మిగిలేది రూ. 2500 అని నిర్ధారించుకున్న రైతు మనోవేదనకు గురై కుంగిపోయాడు. పంటచేలోనే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఆయనకు తిమ్మాపురం ఏపీజీపీలో రూ. 1.08 లక్ష పంట రుణం, రూ. 1977 రీషెడ్యుల్ రుణం ఉండగా రుణమాఫీ కింద రెండింటికి కలిపి రూ. 25,583 మాఫీ అయ్యింది.
ధర పతనంతో ఆగిన ఊపిరి
Published Fri, Jan 29 2016 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM
Advertisement
Advertisement