దాచిన పత్తే..ఉసురు తీసింది | Cotton has a spirit of hidden .. | Sakshi
Sakshi News home page

దాచిన పత్తే..ఉసురు తీసింది

Published Tue, Mar 4 2014 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:19 AM

దాచిన పత్తే..ఉసురు తీసింది

దాచిన పత్తే..ఉసురు తీసింది

గిట్టుబాటు ధర రాకపోవడంతో పత్తిని అమ్ముకోలేక ఇంట్లో దాచుకుంటే.. అది ముగ్గురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. ఇంట్లో ఉన్న పెద్దవాళ్లంతా బయటకు వెళ్లగా.. ఆ చిన్నారులు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ముగ్గురు కలిసి ఎంతో సంతోషంగా ఆడుకున్నారు. అయితే వారు ఆడుకుంటూ పత్తి కూటు పరదాను తాకారో.. లేక బరువుతోనే అది కూలిందో గానీ.. ఆ పత్తి కూటు ఆ చిన్నారులపై పడింది. వారు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతిచెందారు. పెద్దలు ఇళ్లు చేరేసరికి ఆ చిన్నారులు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
 
కేసముద్రం, న్యూస్‌లైన్ :  ఆ ఇంట్లో బోసినవ్వులు మాయమయ్యూయి. అప్పటిదాక తాతయ్యా అంటూ ఆటలాడిన ఆ ముగ్గురి పిల్లలు అనంతలోకాలను చేరారు. ధర రాకపోవడంతో దాచిపెట్టిన పత్తే వారి ప్రాణం తీసింది. ఇంట్లో ఉన్న పత్తి కూటు అమాంతం మీదపడగా ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతిచెందిన సంఘటన మండలంలోని కోరుకొండపల్లి గ్రామంలో సోమవారం జరిగింది.
 
బాధితుల కథనం ప్రకారం.. కోరుకొండపల్లి గ్రామాని కి చెందిన బేతు వెంకటయ్య, యాదమ్మ దంపతులకు కుమారులు వీరన్న, శ్రీను, కుమార్తె సుజాత ఉన్నారు. వారిలో వీరన్నకు కురవి మండలం కాంపెల్లికి చెందిన భవానితో వివాహం కాగా వారికి కుమారుడు విక్కీ(3) ఉన్నాడు. పది రోజుల క్రితమే మళ్లీ కుమారుడు జన్మించాడు.
 
సుజాతకు కూడా కురవి మండలం కాంపెల్లి గ్రామానికి చెందిన మేనమామ చిట్టాల వీరన్నతో వివాహమైంది. వారికి కుమారుడు వేణు(12), కుమార్తె భద్రకాళి(6) ఉన్నారు.  కాగా సుజాత, చిట్టాల వీరన్న దంపతులు బతుకు దెరువు కోసం సూరత్ వెళ్లారు. అయితే శివరాత్రి పర్వదినంతోపాటు తన అన్న వీరన్నకు కుమారుడు పుట్టాడని తెలియడంతో సుజాత సూరత్ నుంచి కాంపల్లికి వచ్చింది. శివరాత్రి రోజు కురవిలో జాగారం ఉండి, ఆ తర్వాత ఆస్పత్రిలో ఉన్న అన్న కుమారుడిని చూసింది. అనంతరం ఆదివారం కోరుకొండపల్లిలోని తల్లిగారింటికి  వచ్చింది. కాగా బేతు వెంకటయ్య అన్న కొమురయ్య కోడలు ఉమ పురుగుల మందు తాగి మానుకోట ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా ఆమెను చూసేందు కు సోమవారం వెంకటయ్య భార్య యాదమ్మ, కుమారుడు వీరన్న, కూతురు సుజాత వెళ్లారు.

ఇంటి దగ్గర పిల్లలు జాగ్రత్త అని వెంకటయ్యకు చెప్పి వెళ్లారు. మనవళ్లను, మనవరాలిని దగ్గరకు తీసుకుని అప్పటిదాక ఆడించిన వెంకటయ్య వారికి అన్నం తినిపించాడు. విక్కీ నిద్రకు రావడంతో పడుకోబెట్టాడు. మేము టీవీ చూస్తాం తాతయ్య.. బయటకు పోములే అని తలుపు పెట్టుకున్నారు. వారు టీవీ చూస్తున్నారులే అనుకుని వెంకటయ్య బయటకు వెళ్లి వచ్చాడు. పిల్లలను ఎంత పిలిచినా తలుపులు తీయకపోవడంతో కిటికీకి ఉన్న జాలిని కోసి చూడడంతో పత్తి కూటు కుప్పకూలి కనిపించింది. దీంతో లబోదిబోమంటూ గట్టిగా కేకలు పెడుతూ తలుపులను ఎంత నెట్టినా రాలేదు.

ఇంతలో అక్కడికి చేరుకున్న స్థానికులు తలుపులు బద్దలు కొట్టి తెరిచారు. పత్తి మొత్తం ఆ ముగ్గురు పిల్లలను కప్పేసి ఉంది. పత్తిని   తోడి తీయడంతో ముగ్గురు విగత జీవులుగా కనిపించారు. వారిని చూసిన వెంకటయ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు కన్నీరుమున్నీరవుతూ వారిని బయటకు తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వీరన్న, సుజాత కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వచ్చి పిల్లల శవాలపై పడి బోరునవిలపిస్తూ సొమ్మసిల్లారు.
 
కొడుకు పుట్టిన సంబురంలోనే...
 
వీరన్న, భవాని దంపతులకు రెండో కుమారుడు పది రోజుల క్రితమే పుట్టాడు. దీంతో విక్కీ తల్లితోనే కాంపల్లిలోని అమ్మమ్మ ఇంట్లో ఉన్నాడు. అయితే సూరత్ నుంచి తన చెల్లెలి పిల్లలు రావడంతో వీరన్న విక్కీని కోరుకొండపల్లికి తీసుకొచ్చాడు. రెండో సారి కుమారుడు పుట్టాడనే సంబురా న్ని కుటుంబ సభ్యులతో పూర్తిగా పంచుకోకముందే మూడేళ్ల విక్కీ మాయమయ్యూడు. నీ తమ్మున్ని చూద్దువు లేరా కొడుకా అంటూ వీరన్న తన కొడుకు శవంపైపడి బోరున విలపించడాన్ని చూసి గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement