తాండూరు, న్యూస్‌లైన్: అన్నదాతల గురించి ఎవరికీ పట్టింపు లేకుండాపోయింది. ఎండకు ఎండి.. వానకు తడిసి ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ప్రభుత్వ మద్దతు ధర లభించక రైతున్న దగాపడుతున్నా ప్రజాప్రతినిదులు, మార్కెటింగ్ శాఖ అధికారులకు పట్టడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి అన్నదాతలు మౌనంగా రోదిస్తున్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు ధాన్యం (సాధారణ రకం) కొనుగోలు చేసేందుకు కమీషన్ ఏజెంట్లు ససేమిరా అంటున్నారు.
మద్దతు ధర చెల్లిస్తే తమకు గిట్టుబాటు కాదనే ధోరణితో కొందరు కమీషన్ ఏజెంట్లు తక్కువ ధర చెల్లిస్తూ అన్నదాతల శ్రమను దోచుకుంటున్నారు. మార్కెట్ యార్డులో ప్రభుత్వ మద్దతు ధరల బోర్డులు ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులు.. ధాన్యాన్ని తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. దీంతో యార్డులోని సూచిక బోర్డులకే ‘మద్దతు’ ధరలు పరిమితమయ్యాయే తప్ప తమకు ప్రయోజనం కలగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
4,200 క్వింటాళ్ల కొనుగోళ్లు
తాండూరు మార్కెట్ యార్డులో గత నెల 10వ తేదీ నుంచి ఖరీఫ్ ధాన్యం క్రయవిక్రయాలు ఆరంభమయ్యాయి. ఈ నెల 19వ తేదీ వరకు యార్డులో వివిధ గ్రామాల నుంచి కమీషన్ ఏజెంట్లు 4,200 క్వింటాళ్ల ధాన్యాన్ని (సాధారణ రకం) కొనుగోలు చేశారు. క్వింటాలు ధాన్యానికి ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధర రూ.1310. కానీ ఇక్కడ ఇప్పటివరకూ రైతులకు మద్దతు ధర దక్కలేదు.
సగటు ధర క్వింటాలుకు రూ.1,285!
క్రయవిక్రయాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు క్వింటాలు ధాన్యానికి గరిష్టంగా రూ.1,341, కనిష్టంగా రూ.1,220, సగటు (మోడల్) ధర రూ.1,285 ధర మాత్రమే పలికింది. గరిష్ట ధరకు కొద్ది మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తూ, అధికంగా తక్కువ ధర చెల్లిస్తుండటంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. సగటు ధర ప్రకారం క్వింటాలుకు సుమారు రూ.25 చొప్పున రైతులు నష్టపోయినట్టు స్పష్టమవుతోంది. అయినా స్థానిక ప్రజాప్రతినిధులు ఏనాడూ మద్దతు ధరలపై, రైతులకు జరుగుతున్న నష్టంపై అడిగిన దాఖలాలు లేవు. ఇక అధికారులైతే తమకు సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో నాణ్యతా ప్రమాణాల పేరుతో ఏజెంట్లు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తూ రైతులను దోచుకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవచూపి తమకు మద్దతు ధర లభించేలా చూడాలని రైతులు కోరుతున్నారు.