
పల్లి.. లొల్లి
- గిట్టుబాటు ధర కోసం ఆందోళన బాట
- కేసముద్రం మార్కెట్‌లో వ్యాపారుల సిండికేట్
- ధర అమాంతంగా తగ్గించి కొనుగోళ్లు
- అధికారులను నిలదీసిన రైతులు
- మార్కెట్ కార్యాలయం ఎదుట మహిళల బైఠాయింపు
- నిలిచిపోయిన వేలం పాటలు
కేసముద్రం, న్యూస్‌లైన్ : కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ రైతులు ఆందోళన బాటపట్టారు. పల్లి సీజన్ మొదలైనప్పటి నుంచి వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరను అమాంతం తగ్గించి వేలం పాటలు నిర్వహిస్తున్నారని, అరుునా ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆరుగాలం శ్రమించి పండించిన పల్లికాయతో పలువురు రైతులు రెండు రోజుల క్రితం కేసముద్రం మార్కెట్‌కు వచ్చారు. ‘వ్యాపారులందరూ ఒక్కతీరుగా రేటు పెడతాండ్రని, ఆ రేటు తమకు గిట్టుబాటు కావడం లేదని... తమకు న్యాయం చేయాలి.’ అంటూ గురువారం మార్కెట్‌ను సందర్శించిన చైర్మన్ శశివర్ధన్‌రెడ్డి, ఏడీఎం సంతోష్‌కుమార్‌ను వారు వేడుకున్న విషయం తెలిసిందే.
వ్యాపారులతో మాట్లాడి ధర పెట్టేలా చూస్తామని వారు చెప్పిన ప్పటికీ... శుక్రవారం కూడా అదేరీతిలో గరిష్ట ధర రూ.2600కు మించలేదు. దీంతో ఆగ్రహించిన రైతులు ఇంత తక్కువ ధర పెడతారా అంటూ వ్యాపారులను నిలదీశారు. మీ ఇష్టముంటే అమ్ముకోండి, లేకపోతే లేదని వారు నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో రైతుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ విషయూన్ని మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాది రూ. ఐదు వేల వరకు కొని, ఇప్పుడు సగం ధరే పెడుతున్నారని గుర్తు చేశారు. మార్కెట్‌లో మీరందరూ ఉండి ఏం చేస్తున్నారని నిలదీశారు.
కొందరు మహిళా రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట కూర్చుని ఆందోళన చేశారు. దీంతో సుమారు మూడు గంటలపాటు వేలం పాటలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైతు సంఘం నాయకులు గుజ్జునూరి బాబురావు, వీరభద్రయ్య, మదార్ అక్కడికి చేరుకుని మద్దతు ధర పెట్టాలని మార్కెట్ కార్యదర్శిని డిమాండ్ చేశారు. అనంతరం వారు వ్యాపారులతో సమావేశమై మళ్లీ వేలంపాటలు నిర్వహించాలని వారికి సూచించారు.
వ్యాపారులు అంగీకరించడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. ఎట్టకేలకు సాయంత్రం వ్యాపారులు వేలం పాటలు ప్రారంభించారు. 14 వేల బస్తాల పల్లి అమ్మకానికి రాగా... కేవలం 9 వేల బస్తాలకు వేలం పాడారు. క్వింటాల్‌కు గరిష్ట ధర రూ.3,355, కనిష్ట ధర రూ.2,800 పలికినట్లు అధికారులు తెలిపారు.