పాలు..ప్రతీ ఒక్కరి అవసరం. అయితే మార్కెట్లో డిమాండ్ తగ్గట్టు ఉత్పత్తి కావడం లేదు. ఫలితంగా ధరలు చుక్కలను చూపుతున్నాయి. అయితే రైతులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. ఒకవైపు కరువు.. మరో వైపు గిట్టుబాటు కాని ధరలతో పాడి పరిశ్రమ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో మార్కెటింగ్ స్థితిగతులపై ఈ వారం ప్రత్యేక కథనం.
కర్నూలు(అగ్రికల్చర్): కరువు పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలో చాలా మంది రైతులు పాడి పరిశ్రమ వైపు మొగ్గు చూపుతున్నారు. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చిన వారు సైతం దీనినే ఆధారంగా చేసుకొంటున్నారు. జిల్లాలో 3.5 లక్షల పాడి పశువులు ఉన్నాయి. వీటి నుంచి 7.50 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతోంది. పశువుల్లో కొన్ని ఎండిపోయినవి, మరికొన్ని చూడితో ఉన్నవి ఉన్నందున ఉత్పత్తి ఇంతే ఉంటోంది. ఈ ఏడాది జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు సరిగా పండలేదు.
పశుగ్రాసం ఆశించిన స్థాయిలో రాలేదు. సాధారణంగా శీతాకాలంలో పచ్చిమేత బాగా లభించి పాల ఉత్పత్తి పెరగాల్సి ఉంది. ఈ ఏడాది నీటి వసతి కూడా అంతంత మాత్రంగానే ఉండడం, కరువు పరిస్థితులు నెలకొనడంతో పాల ఉత్పత్తి తగ్గింది. విజయ డెయిరి.. గతేడాది ఇదే సమయంలో దాదాపు 80 వేల లీటర్ల పాలు సేకరించేది. ఇప్పుడు 70 వేల లీటర్లు కూడా సేకరించలేకపోతోంది. పాల సేకరణ తగ్గిపోగా డిమాండు మాత్రం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో 95 వేల లీటర్ల పాలు అమ్మకం అవుతుండగా ఈ సారి 1.10 లక్షల లీటర్లకు పెరిగింది.
సేకరణ ధరలు అంతంత మాత్రమే...
రోజు రోజుకు పాలకు మార్కెట్ డిమాండు పెరుగుతున్నా.. సేకరణ ధర అంతంత మాత్రంగానే ఉంది. విజయ డెయిరీతో పాటు ప్రైవేటు డెయిరీలు వెన్న శాతాన్ని బట్టి గరిష్టంగా లీటరుకు రూ.52 చెల్లిస్తున్నారు. ఈ ధర రావాలంటే పాలల్లో వెన్న 10 శాతం ఉండాలి. కనిష్టంగా రూ.26 చెల్లిస్తున్నారు. ఇందులో వెన్న 5 శాతం ఉంటుంది. సేకరించే పాలల్లో సగటున 6.5 శాతం వెన్న ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి లీటరు పాలకు రూ.33.80 చెల్లిస్తున్నారు.
మార్కెట్‌లో పాలకు కొరత ఏర్పడిన నేపథ్యంలో పాల సేకరణకు చెల్లిస్తున్న ధర అంతంత మాత్రమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాల ఉత్పత్తి కూడా నేడు ఖర్చుతో కూడుకున్నదిగా మారిపోయింది. కేవలం పాడి గేదె విలువనే నేడు రూ.70 వేల వరకు ఉంటోంది. పశుగ్రాసం ఖర్చులు, దాణా, ఇతర పోషణ ఖర్చులు పెరిగిపోయాయి.
పాడి గేదెలు సగటున 5 లీటర్లకు మించి పాలు ఇవ్వడం లేదు. ప్రస్తుతం పాల సేకరణ ధర రూ.33.80 మాత్రమే ఉండటంతో గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాల సేకరణ ధర గరిష్టంగా 60, కనిష్టంగా రూ.32, సగటు ధర రూ.40 ఉంటే గిట్టుబాటు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అమ్మకం ధర ఎక్కువే..
పాల సేకరణ సగటు ధర రూ.33.80 ఉండే అమ్మకం ధర భారీగానే ఉండటం గమనార్హం. గోల్క్ మిల్క్ లీటరు ధర రూ.48 ఉంది.
విజయ డెయిరీతో పాటు ప్రైవేటు డెయిరీలు ఇదే ధరతో పాలను విక్రయిస్తున్నాయి. టోల్డ్ మిల్క్ లీటరు రూ.40 ప్రకారం అమ్మకాలు సాగిస్తున్నారు. పాల సేకరణకు ఇచ్చే ధరలతో పోలిస్తే అమ్మకం ధరలు ఎక్కువేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాల ధర ఎక్కువ ఉన్నా.. అందుకు అనుగుణంగా సేకరణ ధరలను కూడా పెంచితే రైతులకు ఉపయోగమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రైవేట్ డెయిరీలు ఎక్కువే..
సహకార రంగంలో నెలకొల్పిన విజయ డెయిరీ కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో పాల మార్కెటింగ్ చేస్తోంది. ఇదిగాక జిల్లాలో ప్రైవేటు డెయిరీలు ఎక్కువగా ఉన్నాయి. జగత్, తిరుమల, హెరిటేజ్, దొడ్ల, శ్రీనివాస, నంది, విస్‌కస్ తదితర డెయిరీలు ఉన్నాయి. పాల మార్కెటింగ్‌తో చాలా వరకు నిరుద్యోగ సమస్య తీరుతోంది. డెయిరీలన్నీ పాల మార్కెటింగ్‌కు ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేసుకున్నాయి.
ఏజెంట్లను నియమించుకొని మార్కెటింగ్ నిర్వహిస్తున్నాయి. కర్నూలులో ఒక్క విజయ డెయిరీతోనే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు వెయ్యి మంది ఉపాధి పొందుతున్నారు. ప్రైవేటు డెయిరీలను పరిశీలిస్తే పాల మార్కెటింగ్‌పై ఆధారపడి బతికే వారి సంఖ్య భారీగానే ఉంది. పాలను విక్రయించే ఏజెంట్లకు ప్యాకెట్టుకు రూపాయి ప్రకారం కమిషన్ ఇస్తున్నారు.
ఆపసోపాలు..!
Published Mon, Nov 17 2014 3:44 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement