మార్కాపురం : స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి కొనకుండా జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేమ సాకు చూపి పత్తిని ఇష్టమొచ్చిన ధరకు అడగడాన్ని రైతులు తప్పుబట్టారు.
మార్కాపురం డివిజన్‌లోని 12 మండలాలకు చెందిన రైతులు తాము పండించిన పత్తిని మార్కెట్ యార్డులోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తెస్తున్నారు. మూడు రోజులుగా వ్యాపారులకు, రైతులకు మధ్య గిట్టుబాటు ధర, పత్తిలో నాణ్యత తేల్చే విషయంపై అవగాహన కుదరకపోవడంతో కొనుగోళ్లు మంద కొడిగా సాగుతున్నాయి. మార్కెట్ యార్డులో సుమారు 10 లారీల పత్తి నిల్వ ఉంది. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తండా, రాచర్ల, కొమరోలు, పుల్లలచెరువు మండలాలకు చెందిన పలువురు రైతులు తెచ్చిన పత్తిని వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో మూడు రోజులుగా మార్కెట్ యార్డులోనే ఉంటున్నారు.
వ్యాపారులు కావాలనే.. పత్తి నాణ్యత తగ్గిందని, తాము తెచ్చిన బొరెలపై ఇంటు(ఁ) మార్కు వేస్తున్నారని, దీనిని కొనుగోలు చేయాలంటే బొరేనికి(బోరెలో 90 నుంచి 100 కిలోల పత్తి ఉంటుంది) 5 నుంచి 7 కిలోలు తరుగు తీసేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పత్తి సాగు చేసేందుకు ఎకరాకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టాం. కూలీలతోపాటు రవాణా ఖర్చులు అదనంగా ఉన్నాయి.
వ్యాపారులేమో నాణ్యత తక్కువ అంటూ ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని గొట్టిపడియ గ్రామానికి చెందిన రైతు మారెళ్ల వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రస్తుతం వ్యాపారులు క్వింటా పత్తిని రూ.3,800-రూ.3,900 మధ్య కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం రూ.4,050 మద్ధతు ధర ప్రకటించింది.
పత్తి కొనుగోలులో జాప్యంపై రైతుల ఆగ్రహం
Published Sat, Nov 22 2014 2:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM
Advertisement
Advertisement