The yard of the local market
-
పత్తి కొనుగోలులో జాప్యంపై రైతుల ఆగ్రహం
మార్కాపురం : స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంలో పత్తి కొనకుండా జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేమ సాకు చూపి పత్తిని ఇష్టమొచ్చిన ధరకు అడగడాన్ని రైతులు తప్పుబట్టారు. మార్కాపురం డివిజన్లోని 12 మండలాలకు చెందిన రైతులు తాము పండించిన పత్తిని మార్కెట్ యార్డులోని సీసీఐ కొనుగోలు కేంద్రానికి తెస్తున్నారు. మూడు రోజులుగా వ్యాపారులకు, రైతులకు మధ్య గిట్టుబాటు ధర, పత్తిలో నాణ్యత తేల్చే విషయంపై అవగాహన కుదరకపోవడంతో కొనుగోళ్లు మంద కొడిగా సాగుతున్నాయి. మార్కెట్ యార్డులో సుమారు 10 లారీల పత్తి నిల్వ ఉంది. మార్కాపురం మండలం గొట్టిపడియ, అక్కచెరువు తండా, రాచర్ల, కొమరోలు, పుల్లలచెరువు మండలాలకు చెందిన పలువురు రైతులు తెచ్చిన పత్తిని వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో మూడు రోజులుగా మార్కెట్ యార్డులోనే ఉంటున్నారు. వ్యాపారులు కావాలనే.. పత్తి నాణ్యత తగ్గిందని, తాము తెచ్చిన బొరెలపై ఇంటు(ఁ) మార్కు వేస్తున్నారని, దీనిని కొనుగోలు చేయాలంటే బొరేనికి(బోరెలో 90 నుంచి 100 కిలోల పత్తి ఉంటుంది) 5 నుంచి 7 కిలోలు తరుగు తీసేస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. పత్తి సాగు చేసేందుకు ఎకరాకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టాం. కూలీలతోపాటు రవాణా ఖర్చులు అదనంగా ఉన్నాయి. వ్యాపారులేమో నాణ్యత తక్కువ అంటూ ప్రభుత్వం నిర్ణయించిన ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని గొట్టిపడియ గ్రామానికి చెందిన రైతు మారెళ్ల వెంకటేశ్వర్లు చెప్పారు. ప్రస్తుతం వ్యాపారులు క్వింటా పత్తిని రూ.3,800-రూ.3,900 మధ్య కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం రూ.4,050 మద్ధతు ధర ప్రకటించింది. -
అడుక్కునేవాళ్లమా!
ఆయిల్‌ఫెడ్ అధికారుల అలసత్వంపై వేరుశనగ రైతుల మండిపాటు పెట్టుబడికి ఇబ్బందిగా ఉంది: 20 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడిని ఆయిల్‌ఫెడ్‌కు విక్రయించినా. నాలుగు నెలల నుంచి తిప్పుకుంటున్నారు. ఆదోనికి వచ్చిపోనీకనే సానా ఖర్చయింది. ఖరీఫ్ పంటలు వేసుకోనీక డబ్బుల్లేక ఇబ్బందయితాంది. అధికారులేమో అర్థం చేసుకోరు. ఇట్లయితే మా బతుకు ఎట్లా గడిచేది. - రామన్న, వలగొండ, ఆస్పరి మండలం ఆదోని రూరల్, న్యూస్‌లైన్: రైతుల జీవితాలతో ఆయిల్‌ఫెడ్ చెలగాటమాడుతోంది. ఖరీఫ్‌కు సన్నద్ధమవ్వాల్సిన సమయంలో బిల్లుల కోసం ఆ సంస్థ ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. తొలకరి వర్షాలు కురుస్తుండటంతో రైతులంతా పొలం పనుల్లో బిజీ కాగా.. తాము మాత్రం ఆయిల్‌ఫెడ్‌ను నమ్ముకుని చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోతున్నారు. వేరుశనగ ధర ఒక్కసారిగా పడిపోవడంతో రబీలో ప్రభుత్వం ఆయిల్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లను చేపట్టింది. ఆ మేరకు గత జనవరి 8న స్థానిక మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటైంది. నాణ్యమైన వేరుశనగ ధర మార్కెట్లో రూ.3,300 కాగా ఆయిల్‌ఫెడ్ రూ.700 అధిక ధరతో కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఇటువైపు మొగ్గుచూపారు. జనవరి 31వ తేదీ వరకు రూ.4 వేల ధరతో 45,272 క్వింటాళ్ల వేరుశనగను అధికారులు కొనుగోలు చేశారు. ఇందుకు రూ.18.45 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. మొత్తం 2,511 మంది రైతులు దిగుబడులు విక్రయించగా 2 వేల మందికి మాత్రమే చెల్లింపులు చేశారు. రైతులు బిల్లుల కోసం నాలుగు నెలలుగా ఆయిల్‌ఫెడ్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పూర్తి స్థాయిలో చెల్లింపులు చేపట్టలేకపోతున్నారు. వచ్చిన డబ్బుతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుదామని భావిస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. దిగుబడులు వారి చేతిలో పెట్టి ఇప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయిల్‌ఫెడ్ అధికారులు బస చేసిన పట్టణంలోని ఓ లాడ్జి వద్దకు డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు వంద మంది రైతులు చేరుకున్నారు. రూము ఎదుటే బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో కొందరి రైతులకు చెల్లింపులు చేసినా.. మరికొందరికి నిరాశే ఎదురైంది.