అడుక్కునేవాళ్లమా!
ఆయిల్‌ఫెడ్ అధికారుల అలసత్వంపై వేరుశనగ రైతుల మండిపాటు
పెట్టుబడికి ఇబ్బందిగా ఉంది: 20 క్వింటాళ్ల వేరుశనగ దిగుబడిని ఆయిల్‌ఫెడ్‌కు విక్రయించినా. నాలుగు నెలల నుంచి తిప్పుకుంటున్నారు. ఆదోనికి వచ్చిపోనీకనే సానా ఖర్చయింది. ఖరీఫ్ పంటలు వేసుకోనీక డబ్బుల్లేక ఇబ్బందయితాంది. అధికారులేమో అర్థం చేసుకోరు. ఇట్లయితే మా బతుకు ఎట్లా గడిచేది.
- రామన్న, వలగొండ, ఆస్పరి మండలం
ఆదోని రూరల్, న్యూస్‌లైన్: రైతుల జీవితాలతో ఆయిల్‌ఫెడ్ చెలగాటమాడుతోంది. ఖరీఫ్‌కు సన్నద్ధమవ్వాల్సిన సమయంలో బిల్లుల కోసం ఆ సంస్థ ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది. తొలకరి వర్షాలు కురుస్తుండటంతో రైతులంతా పొలం పనుల్లో బిజీ కాగా.. తాము మాత్రం ఆయిల్‌ఫెడ్‌ను నమ్ముకుని చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధితులు వాపోతున్నారు. వేరుశనగ ధర ఒక్కసారిగా పడిపోవడంతో రబీలో ప్రభుత్వం ఆయిల్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లను చేపట్టింది.
ఆ మేరకు గత జనవరి 8న స్థానిక మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటైంది. నాణ్యమైన వేరుశనగ ధర మార్కెట్‌లో రూ.3,300 కాగా ఆయిల్‌ఫెడ్ రూ.700 అధిక ధరతో కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఇటువైపు మొగ్గుచూపారు. జనవరి 31వ తేదీ వరకు రూ.4 వేల ధరతో 45,272 క్వింటాళ్ల వేరుశనగను అధికారులు కొనుగోలు చేశారు. ఇందుకు రూ.18.45 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారు. మొత్తం 2,511 మంది రైతులు దిగుబడులు విక్రయించగా 2 వేల మందికి మాత్రమే చెల్లింపులు చేశారు.
రైతులు బిల్లుల కోసం నాలుగు నెలలుగా ఆయిల్‌ఫెడ్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పూర్తి స్థాయిలో చెల్లింపులు చేపట్టలేకపోతున్నారు. వచ్చిన డబ్బుతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుదామని భావిస్తున్న రైతులకు నిరాశే ఎదురవుతోంది. దిగుబడులు వారి చేతిలో పెట్టి ఇప్పుడు అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయిల్‌ఫెడ్ అధికారులు బస చేసిన పట్టణంలోని ఓ లాడ్జి వద్దకు డివిజన్ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు వంద మంది రైతులు చేరుకున్నారు. రూము ఎదుటే బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో కొందరి రైతులకు చెల్లింపులు చేసినా.. మరికొందరికి నిరాశే ఎదురైంది.