సాక్షిప్రతినిధి, కరీంనగర్: అన్నదాతలకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. మంచి వర్షాలతో ఈ ఏడాది పంట ఉత్పత్తి పెరిగినా ఈ మేరకు ధాన్యం కొనుగోలును పెంచడంలేదు. ఇలా ధాన్యం రైతుల విషయంలో సర్కారు నిర్లక్ష్యం వ్యాపారులకు, రైస్ మిల్లర్లకు బాగా ఉపయోగపడుతోంది. వరి కోతలు ముమ్మరమైనప్పటికీ సరిపడా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేయకపోవడంతో రైతులు రైస్ మిల్లర్లకే ధాన్యం విక్రయించాల్సిన పరిస్థితి వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని రైస్ మిల్లర్ల తేమ పేరిట రైతులను నిండా ముంచుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో కేంద్ర ప్రభుత్వం ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ.1345, సాధారణ రకానికి రూ.1310 మద్దతు ధర ప్రకటించింది. జిల్లాలో రైస్ మిల్లర్లు తేమ సాకుతో క్వింటాల్‌కు రూ.40 నుంచి రూ.50 వరకు మద్దతు ధరలో కోత పెడుతున్నారు. తేమ సాకు చెబుతుండడంతో రైతులు ఎదురు మాట్లాడలేకపోతున్నారు.
ప్రభుత్వ పరంగా కొనుగోలు కేంద్రాలు అంతటా అందుబాటులో లేకపోవడం, కేంద్రాలు ఉన్న చోట చలిలో రెండుమూడు రోజులు పడిగాపులు పడాల్సి ఉండడంతో రైతులు రైస్ మిల్లర్లకే అయినకాడికి అమ్ముకుంటున్నారు. దీంతో ప్రభుత్వం కంటే రైస్ మిల్లర్లే ఎక్కువగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు నవంబరు 18 వరకు జిల్లాలో 54 వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశాయి. ప్రైవేటు వ్యాపారులు, రైస్ మిల్లర్లు ఇప్పటికే లక్ష టన్నులు కొనుగోలు చేశారు. ప్రభుత్వ సంస్థల కంటే రైస్ మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం రెట్టింపుగా ఉంది. జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై రైస్ మిల్లర్ల పెత్తనాన్ని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. సర్కారు సేకరించిన ధాన్యం కంటే రైస్ మిల్లర్లు కొనుగోలు చేసింది ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏమిటనే విషయంపై అధికారులు వివరణ ఇవ్వడంలేదు.
ధాన్యం కొనుగోలుకు సంబంధించి సాధారణంగా ప్రతిరోజు ప్రభుత్వ సంస్థలు, రైస్ మిల్లర్లు కొనుగోలు చేసిన ధాన్యం లెక్కలను వెల్లడించే పౌరసరఫరాల శాఖ ప్రస్తుత సీజనులో పూర్తి నివేదికలు వెల్లడించడంలేదు. కేవలం ప్రభుత్వ కొనుగోలు లెక్కలను మాత్రమే బహిర్గతం చేస్తోంది. రైస్ మిల్లర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తుండడం వల్లే అధికారులు ఇలా చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రైస్ మిల్లర్ల దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు వీలైనన్ని ఎక్కువ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. వరి సాగు విస్తీర్ణం పెరగడంతో ఈ ఏడాది ధాన్యం ఉత్పత్తి పెరిగింది. 12 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి.
గత ఏడాది కంటే ఇది మూడు లక్షల టన్నులు అధికం. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా ఇందిరా క్రాంతిపథం(ఐకేపీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)లు, గిరిజన సహకార మండలి(జీసీసీ) ద్వారా మొత్తం 609 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి ఆరు లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీజను మొదలై నెలన్నర దాటుతున్నా మూడు సంస్థలు 313 కేంద్రాలనే ఏర్పాటు చేసి, ఇప్పటికి 54 వేల టన్నుల ధాన్యాన్ని మాత్రమే రైతుల నుంచి సేకరించాయి. అక్టోబరు ఆరంభం నుంచి 2013-14 ఖరీఫ్ మార్కెట్ సీజను మొదలైంది. మరో రెండు వారాల్లో వరికోతలు పూర్తికానున్నాయి. ఇప్పటికైనా ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం దృష్టిసారించకుంటే రైస్ మిల్లర్లు అన్నదాతలను మరింత దోచుకునే అవకావముంది.
మిల్లర్ల జోరు.. రైతు బేజారు
Published Tue, Nov 19 2013 6:31 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement