గిట్టుబాటుకాక రైతుల విముఖత
ఏటా తగ్గుతున్న సాగు నాలుగేళ్లుగా పడిపోతున్న చక్కెర ఉత్పత్తి
సుగర్ ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకం
సుగర్ ఫ్యాక్టరీలు, చెరకు రైతులు ఒకరిపై ఒకరు ఆధారపడి మనుగడ సాగించడం పరిపాటి. కావలసినంత చెరకు రైతులు పండిస్తేనే ఫ్యాక్టరీలు సక్రమంగా నడుస్తాయి. అలాగే ఫ్యాక్టరీలు గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో బకాయిలు చెల్లిస్తేనే రైతుల జీవనం సాఫీగా సాగుతుంది. అయితే జిల్లాలో ఇప్పుడు ఈ పరిస్థితి దారి తప్పింది. పెరిగిన పెట్టుడులకు అనుగుణంగా సుగర్ ఫ్యాక్టరీలు ధర చెల్లించలేకపోతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహం కూడా కరువైంది. దీంతో గిట్టుబాటు కాక రైతులు చెరకు సాగుపై విముఖత చూపుతున్నారు. ఏటా చెరకు సాగు తగ్గుతూ ఉండటంతో చెరకు ఫ్యాక్టరీల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
పాయకరావుపేట: జిల్లాలో సహకార రంగంలో నడుస్తున్న నాలుగు సుగర్ ఫ్యాక్టరీల్లో ఇప్పటికే తుమ్మపాల కర్మాగారం ఈ ఏడాది మూతపడింది. మిగతా ఫ్యాక్టరీల పరిస్థితి కూడా అంతంతమాత్రమే. తాండవ సుగర్ ఫ్యాక్టరీని పరిశీలిస్తే ఇది తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల పరిధిలోని రైతుల భాగస్వామ్యంతో నడుస్తోంది. నాలుగేళ్లుగా చెరకు సాగు విసీర్ణం తగ్గుతూ వస్తుండటంతో ఈ ఫ్యాక్టరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చెరకు సాగు గిట్టుబాటు కాక ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృషి ్టసారించడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో నిర్దేశించిన లక్ష్యం మేరకు క్రషింగ్ జరగడం లేదు. దీంతో నిర్వహణ భారం పెరిగి ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. రైతులకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోతున్నారు.
తగ్గిన సాగు విస్తీర్ణం
తాండవ ఫ్యాక్టరీ పరిధిలో 5389 మంది రైతులు షేర్ హోల్డర్లుగా ఉన్నారు. 2015-16 సీజన్‌లో రెండు లక్షల టన్నుల చెరకు క్రషింగ్ లక్ష్యం కాగా 1,57,787 టన్నులు మాత్రమే చేశారు. సుమారు 42 వేల టన్నులు తగ్గింది. 10, 500 ఎకరాల్లో ఉండే చెరకు సాగు విస్తీర్ణం 9482 కు తగ్గిపోయింది. దీంతో పూర్తిస్థాయిలో క్రషింగ్ జరగలేదు. ఉత్పత్తయిన పంచదార నిల్వలను బ్యాంకులో తాకట్టుపెట్టి రైతులకు రూ. 25 కోట్లు చెల్లించారు. 2014-15కు సంబంధించి రైతులటు రూ. 6.4 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది.
పెరిగిన పెట్టుబడులు
దుక్కు నుంచి విత్తనం, ఎరువులు, నీటి తడులు, కలుపు నివారణ, జడలు కట్టడం, పురుగు మందులు, నరకడం, ఫ్యాక్టరీకి సరఫరా చేసేందుకు ఎకరాకు రూ.65 వేల వరకు పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరాకు దిగుబడి సాధారణ రకం 25, ఒంటి కన్ను మొక్క వేస్తే 30 టన్నులు వచ్చింది. ఫ్యాక్టరీ టన్నుకు రూ.2391 మద్దతు ధర ప్రకటించింది. 25 టన్నుల దిగబడి వచ్చిన వారికి రూ. 59,775, 30 టన్నులు వచ్చిన వారికి రూ.71,730 వచ్చింది. అంటే ఏడాదంతా కష్టపడినా పెట్టుబడిరాని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కనీస మద్దతు ధర టన్నుకు రూ. 2500 ఇవ్వాలని డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
రికవరీలో ప్రథమం
తాండవ ఫ్యాక్టరీ వరసగా రెండేళ్లలో రికవరీలో ప్రథమ స్థానంలో నిలిచింది. సహకార రంగంలో తాండవ సుగర్స్ 2014-15, 2015-16లో 9.61, 9.63 శాతం రికవరీ సాధించింది.