భారంగా మారిన బెల్లం తయారీ
ఈసారీ చెరుకు రైతులకు గిట్టుబాటు ధర లభించే పరిస్థితి కనిపించడం లేదు. బెల్లం తయూరు చేయూలన్నా నిర్వహణ పెనుభారంగా మారింది. ఈ ఏడాది పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్‌లో ఎనిమిది వేల ఎకరాల్లో చెరుకు సాగు చేశారు. పెట్టుబడి, కోత ఖర్చులు పోను టన్నుకు రూ.వెరుు్య కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఫ్యాక్టరీకి తరలించాలా? వద్దా? అన్న సందిగ్ధంలో రైతులు తలలు పట్టుకుంటున్నారు.
పలమనేరు, న్యూస్‌లైన్:
ఏడాదిపాటు ఎండనక, వాననక కష్టపడి చెరుకు పంటను సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర లభించడం లేదు. డివిజన్ పరిధిలో ఎనిమిది వేల ఎకరాల్లో చెరుకు సాగులో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని ప్రైవేటు చెక్కర ఫ్యాక్టరీలో టన్ను చెరుకుకు రవాణా చార్జీలతో కలిపి రూ.2,300 చెలించనున్నారు.(ఈ ధర ఇంకా అధికారికంగా నిర్ణయించలేదు). టన్ను చెరుకును కొట్టి లారీలో లోడ్ చేసేందుకు కూలీలకు రూ.1,200 ఇవ్వాలి. లారీ డ్రైవర్లకు రూ.300 దాకా బత్తా సమర్పించాలి. పెట్టుబడి కింద చెరుకు విత్తనం, భూసారం, తోట చుట్టకం, ఏడాది పాటు సస్యరక్షణ తదితర ఖర్చులు పోను రూ.1000 కూడా గిట్టుబాటయ్యే పరిస్థితి కనిపిం చడం లేదు. చెరుకు సాగుకు అయ్యే ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే రైతులకు మిగిలేది అంతంతే.
బెల్లం తయారీ...
ఫ్యాక్టరీలకు చెరుకు తోలకుండా బెల్లం తయారీ చేసుకుందామన్నా నిర్వహణ పెనుభారంగా మారుతోం ది. సమయానికి కూలీలు దొరక్క, విద్యుత్‌కోతలు, వర్షాల కారణ ంగా గానుగలు చేపట్టేందుకు వీలు కావడం లేదు. కొందరు మాత్రం ముందుగానే గానుగల్లో బెల్లం తయారీకి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బండి బెల్లం (760 కేజీలు) ధర రూ.22వేల దాకా పలుకుతోంది. బండి బెల్లం తయారు చేసేందుకు రూ.7 వేలు ఖర్చు అవుతోంది. దీంతో టన్నుకు రూ.1,500 మిగులుతుంది. ఆ లెక్కన ఫ్యాక్టరీలకు తరలించే బదులు బెల్లం తయారు చేస్తే టన్నుకు రూ.500 ఆదాయం వస్తుందని రైతులు భావిస్తున్నారు. గానుగలు ఆడలేని పరిస్థితిల్లో గత్యంతరం లేక ఫ్యాక్టరీలకు చెరుకును తరలించేందుకు సిద్ధమవుతున్నారు.
పట్టించుకోని ప్రభుత్వం
ఐదేళ్లుగా కనీస మద్దతు ధరను కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. మద్దతు ధర టన్నుకు రూ.3వేలైనా ఉండాలని రైతు సంఘాలు కోరుతున్నారుు. కానీ ప్రభుత్వం మాత్రం దీనిపై ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాకు చెందిన వ్యక్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఫలితంగా ఈ ప్రాంతంలో ఏటా చెరుకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. రైతులు ప్రత్యామ్నాయ పనులవైపు మొగ్గు చూపుతున్నారు.
7 నుంచి క్రషింగ్.....
పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు సంబంధించి పుంగనూరు సమీపంలోని ఓ ప్రైవేటు చెరుకు ఫ్యాక్టరీ మాత్రమే ఉంది. ఈనెల 7వ తేదీ నుంచి చెరుకు క్రషింగ్ ప్రారంభం కానున్నట్లు ఫ్యాక్టరీ సిబ్బంది వెల్లడించారు.