చెరకు రైతులపై కనికరం చూపని ప్రభుత్వం
గత ఏడాదిలాగే గిట్టుబాటు ధర రూ.2300లే
ఏటా పెట్టుబడులు పెరుగుతున్నందున గిట్టుబాటు కాదంటున్న రైతులు
పాత బకాయిలూ చెల్లించని సుగర్ ఫ్యాక్టరీలు
తీపిని పంచే చెరకు రైతుకు మాత్రం ఏటా నష్టాల చేదే మిగులుతోంది. పాలకుల అలసత్వం వల్ల అడుగడుగునా చెరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా గిట్టుబాటు ధర లేదని గగ్గోలు పెడుతున్న చెరకు రైతుపై ఈ ఏడాది కూడా ప్రభుత్వం కనికరం చూపలేదు. ఏటా పెట్టుబడులు పెరుగుతున్నప్పటికీ అందుకు తగ్గట్టు గిట్టుబాటు ధర పెంచకుండా ఈ సారీ అన్యాయమే చేసింది.
చోడవరం: వరి, చెరకు, నూనె గింజలు, అపరాలు ఇతర వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్ర ఆహార మండలి ఏటా ఆయా పంటల సాగు గడువుకు ముందే ఫెయిర్‌అండ్ రెమ్యునిరేటివ్ ప్రైస్ (ఎఫ్‌ఆర్‌పీ) గిట్టుబాటు ధర ప్రకటిస్తుంది. కేంద్రం ప్రకటించిన గిట్టుబాటు ధరకు రాష్ట్ర ప్రభుత్వం కొంత జోడించి రైతులకు ఇస్తుంది. ప్రభుత్వాలు ప్రకటించిన ధర రైతులకు గిట్టుబాటు కాకపోయినప్పటికీ కనీసం ఇంత ధర వస్తుందనే ఒక లెక్క ఉండి రైతులు ఆయా పంటల సాగు విస్తీర్ణంపై ఆసక్తి చూపేవారు. ఈ ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరకు రైతులను నిండా ముంచాయనే చెప్పాలి. ఒక పక్క ఏటా వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగిపోతున్నాయి. విత్తనం, ఎరువులు, పురుగుల మందులు, కూలీ ధరలు భారీగా పెరిగి పోయాయి. గతేడాదే టన్నుకు రూ.2300 ప్రకటిస్తేనే గిట్టుబాటు కాలేదని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేయగా ఈ ఏడాది కనీసం ఒక్క రూపాయి కూడా అద నంగా పెంచకుండా మళ్లీ టన్నుకు రూ.2300గా ఎఫ్‌ఆర్‌పీ ప్రభుత్వం ప్రకటించింది. దీనితో చెరకు సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది.
30 శాతం తగ్గిన చెరకు సాగు
జిల్లాలో ఏటా లక్షా 80వేల ఎకరాల్లో చెరకు సాధారణ విస్తీర్ణం కాగా గత రెండేళ్లలో విస్తీర్ణం 30 శాతం మేర తగ్గిపోయింది. పంచదార, బెల్లం ధరలు రోజుకో ధర ఉండటంతో చెరకు రైతులు అప్పుల పాలవుతున్నారు. గత ఏడాది టన్నుకు రూ.2300 ఎఫ్‌ఆర్‌పీకి రూ.60 ఫ్యాక్టరీలు కలిపి టన్నుకు రూ.2360 కనీస మద్దతు ధర ప్రకటించింది. ఈ ఏడాది కనీసం రూ.2500 ఎఫ్‌ఆర్‌పీ ధరను ప్రకటిస్తే మరికొంత ఫ్యాక్టరీలు కలిపి కనీసం టన్నుకు రూ.2700అయినా వస్తుందని రైతులు ఆశించారు. కాని వారి ఆశలు ఆడియాశలయ్యాయి. మరో పక్క గతేడాది బకాయిలు ఇంకా ఫ్యాక్టరీలు రైతులకు ఇవ్వలేదు. జిల్లాలో రూ. 30 కోట్లకు పైబడి బకాయిలు చెల్లించాల్సి ఉంది. రైతులు ప్రత్యామ్నాయంగా సరుగుడు సాగుకు మళ్లిపోతున్నారు. గోవాడ, తాండవ, ఏటికొప్పాక ఫ్యాక్టరీలు ఈ ఏడాది 8.3 లక్షల టన్నుల క్రషింగ్ లక్ష్యం పెట్టుకున్నాయి. ఆ దిశగా ప్లాంటేషన్ చేయాలని రైతులను చైతన్య పరిచినప్పటికీ గిట్టుబాటు ధర ప్రకటన ఆశాజనకంగా లేకపోవడం, పాత బకాయిలు నేటికీ ఫ్యాక్టరీలు చెలించకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలపైనే ఆసక్తి చూపుతున్నారు. దీంతో అటు రైతులు, ఇటు ఫ్యాక్టరీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.