టమాఠా కిలో రూ.1.90 పైసలే..
జిన్నారం : రైతు కాయకష్టం పశువుల పాలైంది. చేతికొచ్చిన టమాటా పంట పొలానికే పరిమితమైంది. తెంపితే కూలీల ఖర్చులు మీదపడతాయని అలాగే వదిలేశారు.. మార్కెట్‌లో ధర లేకపోవడంతో ఎందుకూ పనికిరాకుండా కుళ్లిపోతోంది. ఈ దుస్థితిని చూసి రైతన్న కంటనీరు పెడుతున్నాడు. జిన్నారం మండలం గుమ్మడిదల, కానుకుంట, కొత్తపల్లి, నల్లవల్లి, అనంతారం, సోలక్‌పల్లి, జిన్నారం తదితర గ్రామాల్లో రైతులు సుమా రు 400 ఎకరాల్లో టమాటా సాగు చేశారు.
ఆరు నెలల క్రితం పంటకు ఎక్కువగా డిమాండ్ ఉండడంతో రైతులు టమాటా సాగుకు మొగ్గు చూపారు. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లేకుండా పోయింది. ఎకరా టమాటా సాగుకు రూ.20 నుంచి రూ.25 వేల వరకు వెచ్చించారు. ఖర్చులన్నీ పోనూ రైతుకు ఏటా రూ.10 నుంచి రూ.20 వేలు మిగిలేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. 26 కిలోల టమాటా బాక్సు ప్రస్తుతం మార్కెట్‌లో రూ.50 పలుకుతుంది. అంటే కిలో ధర రూ.1.90 పైసలన్నమాట.
రైతులు చేనులోంచి మార్కెట్‌కు 26 కిలోల టమాటా బాక్సును తరలించేందుకు రూ.100 ఖర్చవుతుంది. అంటే ఒక్క బాక్సుపై రూ.50 నష్టం వస్తుంది. పంటను సాగు చేస్తే దిగుబడులు రావాలి.. కాని అదనంగా ఖర్చవుతుందని భావించిన రైతులు టమాటాను తెంపేందుకు కూడా ఇష్టపడటం లేదు. దీంతో మండల వ్యాప్తంగా 400 ఎకరాల్లో రైతులు పంటను చేనులోనే వదిలేశారు. ఈ పంట లాభాల మాట అటుంచి కూలి ఖర్చులుకూడా గిట్టుబాటు కాక చేనులోనే వదిలేసి చేతులు దులుపుకొన్నారు. ప్రస్తు తం పంట పశువులకు మేతగా మారింది. రూ. 25 వేల వరకు ఖర్చు చేసిన పంట చేతికి రాకపోవటంతో రైతులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.