టీడీపీ కూటమి అరాచకానికి బెంబేలెత్తిన సుబ్రమణ్యం రెడ్డి కుటుంబం
ఆయన్ని తీవ్రంగా హింసించిన టీడీపీ గూండాలు
ఇటుకల బట్టీ ధ్వంసం.. ఇటుకల తరలింపు
టమాటా పంట మార్కెట్‌కు తీసుకెళ్లకుండా అడ్డు
పోలీసులూ స్పందించకపోవడంతో ప్రాణ రక్షణ కోసం అడవిలోకి
రాత్రంతా క్రూరమృగాల మధ్య అడవిలోనే..
టీడీపీ కూటమి దాడులతో వణుకుతున్న చిత్తూరు జిల్లా
వైఎస్సార్‌సీపీ వారు శరణు కోరి తమ పార్టీలో చేరితే
వదిలేస్తామంటున్న టీడీపీ నేతలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకానికి భయపడి ఓ కుటుంబం రాత్రంతా అడవిలో తలదాచుకుంది. రాత్రివేళలో క్రూర మృగాలు, పాములు, ఇతర విష పురుగుల మధ్య అడవిలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ప్రజాస్వామ్య దేశ చరిత్రలో ఇంతటి అరాచకం ఎప్పుడైనా కన్నామా? విన్నామా?.. కానీ ఇది పచ్చి నిజం. సోమల మండలం కమ్మపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత సుబ్రమణ్యంరెడ్డి కుటుంబం దీనగాథ ఇది. శుక్రవారం టీడీపీ గూండాలు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటిపై దాడి చేశారు. సుబ్రమణ్యంరెడ్డిని బయటకు ఈడ్చుకు వచ్చి తీవ్రంగా కొట్టారు.
రకరకాలుగా హింసించారు. ఆయన ఇటుకల బట్టీలోని ఇటుకలన్నింటినీ తరలించుకుపోయారు. బట్టీ మొత్తాన్ని ధ్వంసం చేశారు. సుబ్రమణ్యంరెడ్డి పొలంలో పండించిన టమాటా కోతకొచ్చింది. ఈ పంటను మార్కెట్‌కు తరలించకుండా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయన పశువులకు గడ్డి కూడా వేయకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలీసులకు తెలిపినా స్పందన లేకపోవడంతో సుబ్రమణ్యం రెడ్డి కుటుంబం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని సమీపంలోని అడవిలోకి పారిపోయింది.
శుక్రవారం రాత్రంతా అడవిలోనే గడిపింది. శనివారం కొందరు వ్యక్తులు వారి వద్దకు వెళ్లి ఆ కుటుంబాన్ని బయటకు తీసుకువచ్చి వేరే ప్రాంతంలో ఉంచారు. ఆయన తమను శరణుకోరి.. టీడీపీలో చేరితే క్షమించి వదిలేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. లేదంటే విడిచిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. టీడీపీ నేతల తీరుపై పుంగనూరు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. గతంలో ఎవరికి నచ్చిన పార్టీలో వారు పనిచేసే వారని, ఇటువంటి అరాచకం ఎప్పుడూ చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిత్తూరు జిల్లావ్యాప్తంగా దాడులు
టీడీపీ నేతలు వారిపై కేసులు రాకుండా బెంగళూరు నుంచి గూండాలను తెచ్చి దాడులు చేయిస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గ పరిధిలో ఎవరెవరు వైఎస్సార్‌సీపీకి పనిచేశారో గుర్తించి మరీ దాడులు చేయిస్తున్నారు. కొద్ది రోజులుగా టీడీపీ నేతలు, వారి గూండాల దౌర్జన్యాలు, దాడులతో చిత్తూరు జిల్లా అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
పుంగనూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ అభిమానులు ఊర్లొదిలి వేరే ప్రాంతాల్లో తలదాచుకొంటున్నారు. ఇప్పటివరకు 55 కుటుంబాలు స్వగ్రామాలను వీడి వెళ్లాయి. శ్రీకాళహస్తి రూరల్ మండలం ఈశ్వరయ్యకాలనీ, వాగివేడు, నారాయణపురం గ్రామాల నుంచి 75 కుటుంబాలను టీడీపీ నేతలు వెళ్లగొట్టారు. వీరంతా తమను శరణు కోరి, టీడీపీలో చేరితేనే వారిని, వారి ఆస్తులను వదిలేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
రక్షణ కోరినా స్పందించని పోలీసులు
టీడీపీ కూటమి దాడులు, దౌర్జన్యాలపై అనేకమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు పోలీసులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన సమయంలో ఇరువురి మధ్య సంభాషణలను బాధితులు రికార్డు చేసుకున్నారు. ఆ రికార్డులను వింటే.. రక్షణ కల్పించాల్సిన పోలీసులేనా అలా మాట్లాడేది అనిపించకమానదు. ఇంత జరుగుతున్నా పోలీసులు స్పందించకపోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కూటమి నేతల దౌర్జన్యాలు, దాడులు ఆగకపోవడం, పోలీసులు స్పందించకపోవడంతో బాధితులు న్యాయస్థానాలను ఆశ్రయించటానికి సిద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment