రోడ్డెక్కిన పొగాకు రైతులు
టంగుటూరు: గిట్టుబాటు ధర కోసం పొగాకు రైతులు రోడ్డెక్కారు. గిట్టుబాటు ధరలు ఎలాగూ లేవు. కనీసం నిన్నమొన్నటి ధరలు కూడా అమాంతం రూ.20 తగ్గించడంతో ఆగ్రహించిన స్థానిక రెండో పొగాకు వేలం కేంద్రం రైతులు కొనుగోళ్లు నిలిపేశారు. వేలం కేంద్రం ఎదురుగా స్థానిక ఆర్‌అండ్‌బీ రోడ్డుపై బైఠాయించి ట్రాఫిక్ నిలిపి తమ నిరసన తెలిపారు. రెండో పొగాకు వేలం కేంద్రంలో గురువారం ఎం.నిడమలూరు రైతులు 339 పొగాకు బేళ్లు కొనుగోళ్లకు ఉంచారు. వరుసగా 65 బేళ్ల వరకు వేలం జరగ్గానే గిట్టుబాటు ధర లేదంటూ రైతులు కొనుగోళ్లను అడ్డుకున్నారు.
వెంటనే వేలం కేంద్ర సూపరింటెండెంట్ మనోహర్ చొరవ తీసుకొని వ్యాపారులు, రైతులతో చర్చించారు. కనీసం నిన్న మొన్నటి ధరలకు కూడా రూ.20 వరకూ తగ్గించి వేశారంటూ రైతులు తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరువర్గాలతో చర్చించి వారి అంగీకారం మేరకు తిరిగి వేలం ప్రారంభించారు. వరుసగా 20 బేళ్లకు వేలం ముగిసినా ధరల్లో మార్పులేమీ లేకపోవడంతో రైతులు కొనుగోళ్లు మరొకసారి అడ్డుకున్నారు. మరింత పతనమైన ధరలతో ఆగ్రహంగా ఉన్న రైతులు వేలం కేంద్రం ఎదురుగా ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్డుపై బైఠాయించారు. ఆ మార్గంలో రాకపోకలు నిలపేశారు.
వ్యాపారులు తాము ఇచ్చిన ఇండెంట్ ప్రకారం పొగాకు కొనుగోలు చేయాలని, టుబాకో బోర్డు రైతుల పక్షం వహించి న్యాయం చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఎస్‌టీసీని రంగంలోకి దించి గిట్టుబాటు ధర చెల్లించి పొగాకు కొనుగోలు చేయాలని రైతులు నినదించారు. పోలీసుల సూచనలతో సూపరింటెండెంట్ రైతుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు. వేలం కేంద్రం సూపరింటెండెంట్ మాట్లాడుతూ పరిస్థితిని టుబాకో బోర్డుకు పరిస్థితి తెలియజేస్తానని హామీ ఇచ్చారు.