rayani dairy
-
సునీతా విలియమ్స్ రాయని డైరీ
మై హ్యాపీ ప్లేస్! అంతరిక్షం!!తొమ్మిది నెలలుగా ఇక్కడ రోజుకు పదహారు సూర్యోదయాలు, పదహారు సూర్యాస్తమయాలు! ‘‘ఇంకెంత... కొన్ని గంటలే... ’’ అని నవ్వారు బుచ్ విల్మోర్ (butch wilmore). ఆయన నవ్వు నక్షత్రంలా ప్రకాశిస్తోంది.‘‘గంటల్ని మీరు ఏ ఖగోళ కొలమానంతో లెక్కిస్తున్నారు మిస్టర్ విల్మోర్?’’ అన్నాను నేను నవ్వుతూ.‘‘ఖగోళం కాదు మిస్ విలియమ్స్, భూగోళంలో నా కూతుళ్ల ఎదురు చూపులతో కాలాన్ని కొలుస్తున్నాను... ’’ అన్నారు విల్మోర్!విల్మోర్ కూతుళ్లిద్దరూ కింద ఆయన కోసం నిరీక్షిస్తూ ఉన్నారు. పెద్ద కూతురు డ్యారిన్ సోషల్ మీడియాలో పెట్టిన ఎమోషనల్ పోస్టు అంతరిక్షం (Space) వరకు వచ్చేసింది. ‘‘నాన్నా! మీరిక్కడ చాలా మిస్ అయ్యారు. క్రిస్మస్ని మిస్ అయ్యారు. మీ థర్టీయత్ వెడ్డింగ్ యానివర్సరీని మిస్ అయ్యారు. చెల్లి స్కూల్ ఫైనల్ దాటేసింది. మీరది చూడలేదు. కాలేజ్ ప్లే లో నేను యాక్ట్ చేశాను. అదీ మీరు చూడలేదు. మీరు కిందికి రాగానే, మీ మెడ చుట్టూ చేతులు వేసి మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకోవాలని ఉంది నాన్నా...’’ అని డ్యారిన్ అంటోన్న ఆ వీడియోను మళ్లీ మళ్లీ చూసుకుంటూ... ‘‘మిస్ విలియమ్స్! భూమి పైన మీకు ప్రియమైన వారు ఎవరు?!’’ అని నన్ను అడిగారు విల్మోర్!‘‘ఇండియా’’ అని చెప్పాను. ‘‘ఇంకా?’’ అన్నారు. ‘‘భగవద్గీత’’ అని చెప్పాను. ‘‘ఇంకా?’’ అన్నారు. ‘‘ఉపనిషత్తులు’’ అన్నాను. ‘‘ఇంకా?’’ అన్నారు! ‘‘సబర్మతి ఆశ్రమం’’ అన్నాను.నేను నా హజ్బెండ్ పేరు చెప్పేవరకు ఆయన ఇంకా... ఇంకా... ఇంకా... అని అంటూనే ఉంటారని నాకర్థమైంది. కానీ నేను మైఖేల్ పేరు చెప్పలేదు. గోర్బీ, గన్నర్, బైలీ, రోటర్ల పేర్లు చెప్పాను. అవి మా పెట్స్. ‘‘ఐయామ్ సారీ...’’ అన్నారు విల్మోర్.పెట్స్ పేర్లు చెప్పగానే మాకు పిల్లలు లేరన్న సంగతి ఆయనకు గుర్తొచ్చి ఉండొచ్చు. ‘‘ఇట్స్ ఓకే...’’ అన్నాను నవ్వుతూ. విల్మోర్ నా పట్ల గమనింపుతో ఉంటారు.‘‘మనమేమీ ఇక్కడ ఒంటరిగా లేము...’’ అంటారు. ‘‘మనల్నెవరూ ఇక్కడ వదిలేసి వెళ్లలేదు’’ అంటారు. నేనెప్పుడైనా దీర్ఘాలోచనలో ఉంటే, ‘‘అంతరిక్షంలో నివసించటం గొప్ప అనుభూతి కదా...’’ అని నవ్వించే ప్రయత్నం చేస్తారు.‘‘మిస్టర్ విల్మోర్! మీరేమీ నాకు ధైర్యం చెప్పక్కర్లేదు. కావాలంటే నా ధైర్యంలోంచి మీక్కొంచెం ఇస్తాను...’’ అన్నానొకసారి. ఈదురుగాలొచ్చి ఒక్క తోపు తోసినట్లుగా నవ్వారాయన! ఆ నవ్వుకు మేమున్న అంతరిక్ష కేంద్రం గతి తప్పుతుందా అనిపించింది! ‘స్పేస్ఎక్స్ క్యాప్యూల్’ మా కోసం బయల్దేరి వస్తోందని తెలియగానే'.... ‘‘మిస్ విలియమ్స్! అంతరిక్షంలో మీతో పాటుగా నేనూ ఉన్నానన్న సంగతిని భూమ్మీద అందరూ మర్చిపోయినట్లు న్నారు...’’ అన్నారు విల్మోర్ నవ్వుతూ. ఆ మాటకు నవ్వాన్నేను.‘‘చిక్కి సగమైన సునీతా విలియమ్స్’, ‘సునీతా విలియమ్స్ (sunita williams) రాక మరింత ఆలస్యం’, ‘నేడో రేపో భూమి పైకి సునీతా విలియమ్స్’... భూగోళం మొత్తం మీ గురించే రాస్తోంది, మీ కోసమే ఎదురు చూస్తోంది మిస్ విలియమ్స్...’’ అన్నారు విల్మోర్.నన్ను ఆహ్లాదపరచటం అది. ‘‘ఆశ్చర్యం ఏముంది మిస్టర్ విల్మోర్! భూగోళం ఒక వైపుకు మొగ్గి ఉంటుందని తెలియకుండానే డ్యారిన్ వాళ్ల నాన్న గారు ఆస్ట్రోనాట్ అయ్యారా?’’ అని నవ్వాను. దూరాన్నుంచి, చుక్క ఒకటి మా వైపుకు మెల్లిగా కదిలి వస్తూ ఉండటం కనిపించింది!చదవండి: మణిశంకర్ అయ్యర్ (కాంగ్రెస్) రాయని డైరీఆ చుక్క... తన బిడ్డల్ని గుండెల్లోకి పొదువుకోవటానికి వస్తున్న తల్లిలా ఉంది. భుజాలపైకి ఎక్కించుకొని తిప్పటానికి వస్తున్న తండ్రిలానూ ఉంది. ‘‘స్పేస్ఎక్స్ క్యాప్య్సూల్ వస్తున్నట్లుంది...’’ అన్నారు విల్మోర్, ఆ చుక్క వైపు చూస్తూ!- మాధవ్ శింగరాజు -
మణిశంకర్ అయ్యర్ (కాంగ్రెస్) రాయని డైరీ
స్నేహంలో ఎదగాలి కానీ, స్నేహాలతో ఎదగకూడదు. ‘‘ఎదగటానికి కాకపోతే ఇంకెందుకు స్నేహాలు?!’’ అనే వాళ్లకు నేను ఒకటే చెబుతాను. స్నేహాన్ని నిచ్చెనగా చేసుకొని ఎదగటమంత పతనం వేరే ఇంకేదీ ఉండదు. రాజీవ్ నన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించినప్పుడు మొదట నేను అదే ఆలో చించాను. ఇద్దరం డూన్ స్కూల్లో స్నేహితులం.కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో స్నేహితులం. తను ఇంపీరియల్ కాలేజ్‌కి మారిపోయాక కూడా స్నేహితులమే. నేను ఇండియన్ ఫారిన్ సర్వీసులో చేరినప్పుడు; శ్రీమతి గాంధీ గవర్నమెంట్లో, ఆ తర్వాత రాజీవ్ ప్రభుత్వంలో జాయింట్ సెక్రెటరీగా ఉన్నప్పుడు కూడా రాజకీయాలు అంటని స్నేహం మాత్రమే మా మధ్య ఉంది. రాజీవ్ రమ్మంటున్నారు కదా అని వెళితే, స్నేహాన్ని నిచ్చెనగా వేసుకోవటమే అవుతుంది. ఆ మాటే రాజీవ్‌తో అన్నాను. ‘‘మీకు నిచ్చెన వేస్తానని అనటం లేదు మణీజీ. కేబినెట్‌కు మీరొక నిచ్చెన అయితే బాగుంటుందని మాత్రమే అడుగుతున్నాను’ అన్నారు రాజీవ్. రాజీవ్ అలా నాతో ఒక రాజనీతిజ్ఞుడిగా మాట్లాడటం అదే తొలిసారి!నాకనిపించిందీ, శ్రీమతి గాంధీ చనిపోయిన రోజు సాయంత్రం కాదు రాజీవ్ ఈ దేశానికి ప్రధాని అయింది, ఇదిగో ఇలా ఒడుపుగా మాట్లాడటం నేర్చుకున్నాకేనని!కేంబ్రిడ్జ్‌లో మార్క్సిస్ట్ సొసైటీ ఉండేది.అందులో నేను మెంబర్ని. నన్ను కలవటానికి రాజీవ్ అక్కడికి వస్తుండేవారు. తను నాకంటే రెండేళ్లు జూనియర్. స్టూడెంట్స్ యూనియన్‌కు నేను ప్రెసిడెంట్‌గా కంటెస్ట్ చేసినప్పుడు నాకు సపోర్ట్‌గా ఉన్నారు. ఆయన మాట... రాలు పూల తోటలా ఉండేది. కచ్చితంగా ఆయన వల్ల నాకు కొన్ని ఓట్లయితే పడి ఉంటాయి. బహుశా నేను స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్‌గా గెలిచి ఉంటే ఆ హుషారుతో రాజీవ్ రాజకీయాల్లోకి ల్యాండ్ అయ్యేవారా?! లేదు. తల్లి మరణం ఆ పైలట్ తలపై పెట్టి వెళ్లిన కిరీటం ఈ రాజకీయం. కిరీటాన్ని దించకూడదు. కిరీటానికి తలవంపులూ తేకూడదు. ఆ సాయంత్రం – శ్రీమతి గాంధీ హత్యకు గురైన రోజు సాయంత్రం... కొత్త ప్రధానమంత్రిగా జాతిని ఉద్దేశించి రాజీవ్ మాట్లాడవలసి వచ్చింది. కెమెరాలు ఆయన ముందు గుమికూడాయి. పది మాటలకు పన్నెండుసార్లు తడబడ్డారు రాజీవ్!కానీ, కొద్దిరోజులే ఆ తడబాటు! రాజీవ్‌కు మాటలు, చేతలు వచ్చేశాయి! పడుతూ లేస్తూనే వెళ్లి దేశ ప్రజలకు దగ్గరయ్యారు. ఆఖరికి – శ్రీమతి గాంధీని నిరంతరం విమర్శిస్తూ ఉండటమే పనిగా పెట్టుకున్న అరుణ్ శౌరి కూడా రాజీవ్ మీద నుంచి చూపు మరల్చుకోలేక పోయారు!రాజీవ్ వెళ్లిపోయి 34 ఏళ్లు. నేను కాంగ్రెస్‌లోనే ఉండి పోయి 36 ఏళ్లు. ఈ 83 ఏళ్ల వయసులో నా స్నేహితుడు రాజీవ్ గురించి నేను ఏం చెబుతాను? రాజకీయ ధురంధరుడు అనా? అలా చెబితే అది జ్ఞాపకం అవుతుందా? ‘‘కాలేజ్‌లో రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు’’ అని చెప్పక పోతేనే మా స్నేహం అపురూపం అవుతుందా?చదవండి: మల్లికార్జున్ ఖర్గే (ఏఐసీసీ ప్రెసిడెంట్) రాయని డైరీ‘‘కాలేజ్‌లో రాజీవ్ గాంధీ బాగా చదివేవారు కాదన్న సంగతిని ఇప్పుడెందుకు చెప్పటం! అయ్యర్ కి పిచ్చి పట్టింది’’అంటున్నారు అశోక్ గెహ్లోత్, బీజేపీ వాళ్లు వైరల్ చేసిన నా జ్ఞాపకాల క్లిప్‌ను చూసి. స్నేహంలో ఎదిగినవారు కాదు గెహ్లోత్. స్నేహాల నిచ్చెనలతో ఎదిగినవారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను తీసుకుంటే, సీఎం పదవిని వదులుకోవలసి వస్తుందని సోనియాజీ ఆదేశాన్నే కాదన్న సకుటుంబ, సపరివార స్నేహశీలి ఆయన!ఇలాంటి వాళ్లకు పదవులే జ్ఞాపకాలు. జ్ఞాపకాలనే పదవులుగా మిగిల్చుకున్న నాలాంటి వాళ్లు పిచ్చివాళ్లు!!-మాధవ్ శింగరాజు -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
‘‘తప్పై పోయింది మోదీజీ...’’ అన్నారు అమిత్‌షా, దించిన తల ఎత్తకుండానే. ‘‘మీరన్న మాటలో తప్పేమీ లేదు అమిత్జీ. కానీ, మీరసలు ‘ఆయన’ మాటే ఎత్తకుండా ఉండాల్సింది కదా...!’’ అన్నాను.‘‘నిజమే మోదీజీ. ‘ఆయన’ మాట ఎత్తినా తప్పే, ఎత్తకపోయినా తప్పేనన్న కాలమాన పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్నప్పుడు ‘ఆయన’ మాట ఎత్తి తప్పు చేయటం కంటే, ఎత్తకుండా తప్పు చేయటమే కొంతైనా నయంగా ఉండేది...’’ అన్నారు అమిత్‌షా. పక్కనే జేపీ నడ్డా, కిరణ్ రిజుజు, అశ్వినీ వైష్ణవ్, పీయుష్ గోయల్ ఉన్నారు. ‘‘అప్పటికీ ప్రెస్ మీట్ పెట్టి, ‘ఆయనంటే’ మనకెంత గౌరవమో చెప్పాం మోదీజీ...’’ అన్నారు జేపీ నడ్డా. ‘‘అవును మోదీజీ... ‘ఆయనకు’ రెస్పెక్ట్ ఇవ్వటంలో కాంగ్రెస్ కన్నా మన పార్టీనే ఎప్పుడూ ముందుంటుందని కూడా చెప్పాం...’’ అన్నారు కిరణ్ రిజుజు. ‘‘నిజానికి కాంగ్రెస్సే ‘ఆయన’కు యాంటీ అని; ‘ఆయన’కు మాత్రమే కాదు... రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు కూడా కాంగ్రెస్యాంటీనే అని కూడా చెప్పాం మోదీజీ...’’ అన్నారు అశ్వినీ వైష్ణవ్, పీయుష్ గోయల్.మంటల్ని ఆర్పేందుకు శతవిధాల ప్రయత్నించి వచ్చి, అలసట తీర్చుకుంటున్న ఫైర్ ఇంజన్లలా కనిపిస్తున్నారు మంత్రులు నలుగురూ. ‘‘మనం ‘ఆయన’ మాటెత్తటం వల్ల సడన్‌గా ఇప్పుడాయన మన పార్టీ ఇమేజ్‌కి సెంటర్ పాయింట్ అయ్యారు కనుక ఇకపై మనలో ఎవరు ఏం మాట్లాడినా ‘ఆయన్ని’ సెంటర్ పాయింట్‌గా చేసుకునే మాట్లాడాలి...’’ అన్నాను అమిత్‌షా వైపు చూస్తూ.వెంటనే రిజుజు స్పందించారు. ‘‘నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను మోదీజీ! ‘దేశంలో ‘ఆయన’ తర్వాత లా మినిస్టర్ అయిన తొలి బుద్ధిస్టును నేనే...’ అనే సంగతిని ఇప్పటికే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగాను...’’ అన్నారు రిజుజు. ‘‘నేనేతై, మోదీజీ పాలనలో ‘ఆయన్ని’ ఇన్సల్ట్ చేయడమన్నదే జరగదు...’’ అని గట్టిగానే జవాబిచ్చాను...’’ అన్నారు నడ్డా. ‘‘కాంగ్రెస్ ‘ఆయన’ విషయంలో అమిత్జీ మాటల్ని మెలిదిప్పి, బీజేపీపై దుష్ప్రచారం చేస్తోందని ప్రజలకు చాటి చెబుతున్నాం మోదీజీ...’’ అన్నారు వైష్ణవ్, పీయుష్ గోయల్. పార్టీలో ఒక నాయకుడిపై బయటి నుంచి విమర్శలు వచ్చినప్పుడు పార్టీలోని అందరూ ఆ విమర్శలు చేసిన వారిపై వరుసపెట్టి విరుచుకుపడటం బీజేపీలోని ఒక సత్సంప్రదాయం. ఆ సంప్రదాయం క్రమంగా బలహీనపడుతోందా? అందుకే...‘ఆయన’ మాటెత్తినందుకు అమిత్‌షాను మంత్రిగా తొలగించమని డిమాండ్ చేసేంతగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బలపడుతున్నాయా? అమిత్ షా వైపు చూశాను. ‘‘అమిత్జీ... కనీసం మీరు – ‘కాంగ్రెస్ పార్టీ పదే పదే ‘ఆయన’ జపం చేస్తోంది’ – అన్నంత వరకే ఆగి పోవలసింది. మధ్యలోకి దేవుడిని తెచ్చి... ‘ఆ జపమేదో దేవుడికి చేస్తే పుణ్యమైనా దక్కేది...’’ అని అనటం వల్లనే.. ‘ఆయన వేరు, దేవుడు వేరా!’ అని కాంగ్రెస్ రెచ్చగొడుతోంది...’’ అన్నాను. ‘‘నేనలా అనుకోవటం లేదు మోదీజీ...’’ అన్నారు అమిత్‌షా!‘‘మరి?!’’ అన్నాను. ‘‘ఆయన వేరు, దేవుడు వేరా – అని కాదు మోదీజీ... కాంగ్రెస్ రెచ్చకొడుతోంది, అసలు ‘ఆయన’కు వేరొకరితో పోలికేమిటని ‘ఊక’పొయ్యిని రాజేస్తోంది...’’ అన్నారు అమిత్‌షా!!నా నోట మాట లేదు! అవతారమూర్తి అయిన శ్రీకృష్ణుడు అశ్వత్థామకు పెట్టిన శాపం విని అప్రతిభుడై, శిలా ప్రతిమలా నిలుచుండి పోయిన వ్యాసమహర్షి నాకు – అదాటున – గుర్తొచ్చారు. మంటలు, కాల్చి బూడిద చేస్తాయి. మాటలు బూడిద నుంచి కూడా మంటల్ని రేపుతాయి! -
ఏక్నాథ్ శిందే (ఉప ముఖ్యమంత్రి) రాయనిడైరీ
మాధవ్ శింగరాజుఉదయ్ సామంత్, భరత్ గొగావాలే, రవి పాఠక్, సంజయ్ శిర్సాత్, నేను.. కూర్చొని ఉన్నాం. మాతో రాబిన్ శర్మ కూడా ఉన్నారు. రాబిన్ శర్మ పార్టీ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్. మిగతా నలుగురు... పార్టీలోని పొలిటికల్ స్ట్రాటజిస్టు లీడర్లు. ఉప ముఖ్యమంత్రి పదవిని నేను నిరాకరించాలా, లేక అంగీకరించాలా అనే పది రోజుల సుదీర్ఘ సంశయ స్థితి ముగియటానికి ముందు రోజు జరిగిన సమావేశంలో రాబిన్ శర్మ లేరు. నేను, ఆ నలుగురు లీడర్లు మాత్రమే ఉన్నాం. ఇప్పుడు – ఉప ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చాక జరుగుతున్న ఈ ఆంతరంగిక సమావేశానికి రాబిన్ శర్మ కూడా వచ్చి జాయిన్ అయ్యారు.‘‘ఏమైనా మీరు తొందరపడ్డారు శిందేజీ...’’ అన్నారు శర్మ – కొంత సంభాషణ తర్వాత!నేను ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరించటాన్నే ఆయన తొందరపాటు అంటున్నారని సమావేశంలో ఉన్న నలుగురికీ అర్థం అయింది. అసలు ఉప ముఖ్యమంత్రి పదవిని స్వీకరించేలా నన్ను మోటివేట్ చేసింది ఆ నలుగురే! ‘‘ముఖ్యమంత్రిగా తప్ప, ఉప ముఖ్యమంత్రిగా ఉండనని మీరు గట్టిగా చెప్పాల్సింది శిందేజీ. అప్పుడు ప్రధానిలో ఒక అస్థిమితం ఉండేది. ప్రధాని సహపాత్రధారి అమిత్ షాలో ఒక జాగ్రత్త ఉండేది. మొత్తంగా బీజేపీనే... శివసేన అంటే ఒక రెస్పెక్ట్ తో ఉండేది...’’ అన్నారు రాబిన్ శర్మ. ‘‘అలా అని మేము అనుకోవటం లేదు...’’ అన్నారు రవి పాఠక్, సంజయ్ శిర్సాత్. ‘‘అవును అనుకోవటం లేదు...’’ అన్నారు ఉదయ్ సామంత్, భరత్ గొగావాలే.‘‘ఉప ముఖ్యమంత్రి పదవిని నిరాకరించి ఉంటే కూటమిలో శిందేజీకి వచ్చే రెస్పెక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరిస్తే కేబినెట్లో శిందేజీ వర్గానికి వచ్చే పోర్టుఫోలియోల గురించి మీరు మాట్లాడుతున్నారు...’’ అన్నారు రాబిన్ శర్మ.‘‘అవకాశాన్ని కాలదన్నుకొని రెస్పెక్ట్‌ని రాబట్టుకోవటం ఏం పని శర్మాజీ?! వచ్చిన అవకాశాన్నే నిచ్చెనగా వేసుకుని రెస్పెక్ట్‌ని కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలి కానీ...’’ అన్నారు ఆ నలుగురూ ఒకే మాటగా! ‘‘ఇక నేను వెళతాను...’’ అంటూ లేచారు రాబిన్ శర్మ. ‘‘కూర్చోండి శర్మాజీ, ఎన్నికల్లో కూటమిని గెలిపించారు. మీ ప్రచార వ్యూహమే కదా కూటమిని నిలబెట్టింది...’’ అన్నాన్నేను.‘‘అదే అంటున్నాను శిందేజీ. ప్రజలు శివసేన పై అభిమానంతో బీజేపీని గెలిపిస్తే, బీజేపీ ఏం చేయాలి?! శివసేన నాయకుడిని కదా ముఖ్యమంత్రిని చేయాలి?’’ అన్నారు రాబిన్ శర్మ.‘‘శర్మాజీ మీకు తెలియట్లేదు. ఎన్నికల ప్రచార వ్యూహం వేరు, ఎన్నికయ్యాక అధికారం కోసం వేయవలసిన ఎత్తుగడలు వేరు...’’ అన్నారు రవి పాఠక్ నవ్వుతూ. ఆ నవ్వుకు దెబ్బతిన్నట్లు చూశారు రాబిన్ శర్మ. ‘‘ఎత్తుగడ అంటే ఫడ్నవిస్‌ది పాఠక్జీ. ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని ఆయన వెనుక ఉన్న ఒక్కరూ అనలేదు. శిందేజీ వెనుక ఉన్నవాళ్లు మాత్రం శిందేజీ ఉప ముఖ్యమంత్రి పదవిని నిరాకరించకూడదని పట్టుపట్టారు...’’ అన్నారు రాబిన్ శర్మ.ఆ మాట నిజమే అనిపిస్తోంది! ఈ నలుగురు పట్టిపట్టి ఉండకపోతే నా రెస్పెక్ట్ నాకుండేది. ఎప్పుడేం జరుగుతుందోనని మహారాష్ట్ర రాజకీయం అంతా నా చుట్టూ తిరుగుతుండేది. ఒకటి మాత్రం వాస్తవం. ఎవరైనా అయినవాళ్లు కానీ, కానివాళ్లు కానీ మన ఇష్టానికి వ్యతిరేకంగా మనల్ని ఏదైనా చెయ్యమని పట్టు పట్టినప్పుడు మనం వాళ్లకు తలొగ్గితే, ఆ తప్పు.. ‘పట్టుపట్టిన’ వాళ్లది అవదు. ‘పట్టుబడిన’ వాళ్లదే అవుతుంది. -
Rayani Dairy: అజిత్ పవార్ (డిప్యూటీ సీఎం)రాయని డైరీ
ఎవరి మీదనైనా మనకు పట్టనలవి కాని గౌరవం ఉన్నప్పుడు ఆ గౌరవాన్ని కాపాడు కోవలసిన బాధ్యత కూడా మనదే అవుతుంది తప్ప, అవతలి వాళ్లది కానే కాదని గట్టిగా నమ్ముతాన్నేను. శరద్‌జీ అంటే నాకు గౌరవం. సాధారణ గౌరవం కాదు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందే మీద, నా సహ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీద ఉన్న గౌరవంతో సమానమైన గౌరవం. ‘‘అదంతా నాటకం, గౌరవం కాదు’’ అని శరద్‌జీ అనుకుంటున్నా కూడా... నేనా యన్ని గౌరవించటం మానను. మనిషి ఎదుటా మానను, మనిషి చాటునా మానను.భుజాలపై ఎప్పటికీ అలా ఉంచేసుకుం టారని స్టేజీ పైకి వెళ్లి శాలువాను కప్పి వస్తామా ఎవరికైనా? గౌరవమూ అంతే! మనం ఇచ్చిన గౌరవాన్ని నిలుపుకుంటున్నారా, లేదా అని మనం వెళ్లి అస్తమానం తొంగి చూస్తుండ కూడదు. అసలు చూసేందుకు వెళ్లనే కూడదు. గౌరవించాలి, వెంటనే అక్కడి నుంచి వెనక్కు వచ్చేసి వేరే పనిలో పడిపోవాలి. అయితే గౌరవనీయులు కొన్నిసార్లు తిన్నగా ఉండరు. మనల్నీ తిన్నగా ఉండ నివ్వరు. శరద్‌జీ పై నాకున్న గౌరవాన్ని నేను కాపాడుకోవలసిన పరిస్థితులను శరద్‌జీ ఈమధ్య నాకు తరచుగా కల్పిస్తున్నారు!సంతోషమే. ఆయనేం చేసినా ఆయనపై నా గౌరవం ఎక్కడికీ పోదు. కానీ నన్నుపంపించేందుకే ఆయన తన ఎన్నికలప్రచారంలోని అమూల్యమైన సమయాన్నంతా వినియోగిస్తున్నారు. ‘బారామతి’లో నాకు పోటీగా నా తమ్ముడి కొడుకు యోగేంద్ర పవార్‌ను దింపారు. ‘‘బాహుబలీ! నీదే ఇకపైబారామతి’’ అని ఆశీర్వదించారు. యోగేంద్ర నా తమ్ముడి కొడుకైతే, నేను శరద్జీతమ్ముడి కొడుకుని. ఇద్దరు ‘తమ్ముడికొడుకుల’ మధ్య పోటీకి బారామతే దొరికిందా శరద్జీకి? ‘‘ఇక చాలు. ముప్పై ఏళ్లు నేను బారామతి ఎమ్మెల్యేగా ఉన్నాను. ముప్పై ఏళ్లు అజిత్ బారామతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడిక మూడో తరం రావాలి, యోగేంద్ర రాబోయే ముప్పై ఏళ్లు బారామతి ఎమ్మెల్యేగా ఉండాలి’’ అని సభల్లో హోరెత్తిస్తున్నారు శరద్‌జీ!ఇక చాలా!! ఎవరికి చాలు? వరుసలో కూర్చొని భోజనం చేస్తున్నవారు తాముతింటూ, ‘‘వాళ్లకు ఇక చాలు’’ అని పక్క వాళ్ల వైపు చెయ్యి చూపిస్తూ చెప్పినట్లుంది శరద్‌జీ నా మాటెత్తి ‘‘ఇక చాలు’’ అనటం!ఇలాంటప్పుడే, శరద్‌జీ పైన నాకున్న గౌరవాన్ని కాపాడుకుంటూ రావటం నాకు కష్టమైపోతుంటుంది. ‘‘పాత తరం ఎక్కడో ఒక చోట ఆగిపోవాలి, కొత్త తరం రావాలి...’’ అంటు న్నారు శరద్‌జీ! ఏదీ, పాత తరం ఎక్కడఆగింది? 83 ఏళ్లు వచ్చినా ఇంకా ర్యాలీలు తీస్తూనే ఉంది. మరో రెండేళ్లు రాజ్యసభఎంపీగా కూడా ఉంటుంది. పాత తరం ఎప్పటికీ ఆగిపోదని, పార్టీ అధ్యక్షుడిగాఈ భూమ్యాకాశాలు ఉన్నంతకాలంఉండిపోతుందని తేలిపోయాకే కదా నేనుకొత్త దారి వెతుక్కుంటూ వచ్చేసింది. వచ్చేశాక కూడా నేను శరద్జీని గౌరవించటం మానలేదు. నవంబర్ 20న పోలింగ్. ఎన్సీపీ నుంచి బయటికి వచ్చిన ఎన్సీపీ నాది. శివసేన నుంచి బయటికి వచ్చిన శివసేన ఏక్నాథ్ షిందేది. ఎన్సీపీ–శివసేన–బీజేపీ కలిసిన మా ‘మహాయుతి’కి; శరద్‌జీ ఎన్సీపీ–ఉద్ధవ్ ఠాక్రే శివసేన–కాంగ్రెస్‌ల ‘మహా వికాస్ ఆఘాడీ’ కి మధ్య 288 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల యుద్ధం ఇది. కానీ శరద్‌జీ అలా అనుకుంటున్నట్లు లేరు! ఇదంతా బారామతి కోసం జరగబోతున్న మహా సంగ్రామం అని, వాళ్లు మొత్తం అన్ని చోట్లా గెలిచినా, బారామతిలో నేను ఒక్కడినీ ఓడిపోకపోతే వాళ్లదసలు గెలుపే అవదని ఆయన భావిస్తున్నట్లుంది! ఆయన భావన ఎలాంటిదైనా ఆయనపై నా గౌరవ భావన మాత్రం చెక్కు చెదిరేది కాదు.-మాధవ్ శింగరాజు -
సల్మాన్ ఖాన్ (బాలీవుడ్ స్టార్)రాయని డైరీ
తప్పులు మానవ సహజం అయినప్పుడు శిక్షలు అమానుషంగా ఎందుకు ఉండాలి?! చట్టాల గురించి, బిష్ణోయ్ లారెన్స్ గ్యాంగ్ గురించీ కాదు నా ఆలోచన. శిక్షను విధిస్తు న్నట్లు తెలియపరచకుండానే మూతి బిగింపుల మౌనంతో యావజ్జీవ దూరాన్ని పాటిస్తుండే సొంత మనుషుల గురించి, ‘నా’ అనుకున్నా, నా వాళ్లు కాకుండా పోయిన వాళ్ల గురించి. చట్టం విధించే శిక్ష నిర్దాక్షిణ్యమైనదిగా కనిపించవచ్చు. కానీ, ఏ రూల్ బుక్కూ లేకుండా మనిషికి మనిషి విధించే శిక్ష అన్యాయమైనది. న్యాయం లేకపోవటం కన్నా దయ లేకపోవటం ఏమంత చెడ్డ విషయం?!శిక్షల విధింపులో చట్టానికి ఒక చక్కదనం ఉంటుంది. ఒక సక్రమం ఉంటుంది. చింపిరి జుట్టుకు దువ్వెన, దారిలో పెట్టే దండన... చట్టం.కారును ఢీకొట్టించు. జింకను వేటాడు. ఆయుధాలు కలిగి ఉండు. 26/11 పై కామెంట్లు చెయ్యి. యాకూబ్ మెమన్ మీద ట్వీట్లు పెట్టు. దరిద్రం నీ నెత్తి మీద ఉండి ఆఖరికి ఐశ్వర్యారాయ్ పైన కూడా చెయ్యి చేస్కో. నువ్వెన్ని చేసినా... చట్టం వెంటనే నిన్ను దూలానికి వేలాడదీయదు. శూలాలతో పొడిపించదు. మొదట విచారణ జరుపుతుంది. వాదనలు వింటుంది. వాయిదాలు వేస్తుంది. తీర్పును రిజర్వు చేస్తుంది. ఆ తర్వాతే నువ్వు దోషివో, నిర్దోషివో తేలుస్తుంది. దోషివైతే జైలుకు పంపుతుంది. కావాలంటే బెయిలిస్తుంది.మనుషులు విధించే శిక్షలో ఇవేవీ ఉండవు. దువ్వెనా, దండనా అసలే ఉండవు. దూరంగా జరిగిపోతారంతే. ‘‘ఎలా ఉన్నావ్?’’ అని అడిగేందుకైనా దగ్గరకు రారు. ‘‘భద్రంగా ఉండు..’’ అని చెప్పేందుకైనా దూరాన్ని తగ్గించుకోరు. ఎంత అమానుషం!!‘‘నువ్వు పెంచుకున్న దూరమే ఇది సల్మాన్..’’ ఎంత తేలిగ్గా అనేస్తారు!బంధాలను కదా నేను పెంచుకున్నాను. దూరాలనా?! స్నేహబంధం, ప్రేమబంధం, జీవితబంధం... అన్ని బంధాలనూ తెంచుకుని వెళ్లింది ఎవరు?!‘‘కానీ సల్మాన్, నువ్వొట్టి పొసెసివ్. గట్టిగా పట్టేసుకుంటావ్. ఎటూ కదలనివ్వవు. ఎటూ చూడనివ్వవు. ఏదీ మాట్లాడనివ్వవు. ఏమీ చెప్పనివ్వవు. దాన్నేమంటారు మరి? దూరం పెరగటమే కదా! నువ్వు పెంచుకున్న దూరం..’’ అంటారు!కేరింగ్‌ను పొసెసివ్ అని ఎందుకు అనుకుంటారు వీళ్లంతా?! కేరింగ్ అవసరం లేదని చెయ్యి విడిపించుకున్నప్పుడు దూరం పెరిగితే అది చెయ్యి వదిలిన వాళ్లు పెంచుకున్న దూరం అవుతుందా?!రోజుకొకరు ఫోన్ చేసి, ‘‘సల్మాన్ నిన్ను చంపేస్తాం’’ అని బెదిరిస్తున్నారు. వాళ్లు నయం కదా... ‘‘సల్మాన్ బాగున్నావా?’’ అని పరామర్శగా ఒక్క కాల్ అయినా చేయకుండా జూహూలో, బాంద్రాలో ఏళ్లకు ఏళ్లు నాకు ‘దగ్గరగా’ ఉంటున్న వారి కంటే!బయట క్రాకర్స్ పేలుతున్నాయి. గన్ పేలి నప్పుడు వచ్చే శబ్దం ప్రత్యేకంగా ఏమీ ఉండదు. సైలెన్సర్ బిగిస్తే అసలు శబ్దమే ఉండదు.నవ్వొచ్చింది నాకు. నా చుట్టూ ఉన్న వాళ్లంతా మౌనాన్ని బిగించుకున్న తుపాకుల్లా అయిపోయారా! సైలెన్సర్ ఉన్న బులెట్ మౌనంగా ఒకసారే దిగిపోతుంది. మౌనం అదేపనిగా బులెట్లను దింపుతూ ఉంటుంది.లేచి బాల్కనీ లోకి వచ్చాను. ఒక్కక్షణం నాకు గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉన్నానో, పాన్వెల్ ఫామ్‌హౌస్‌లో ఉన్నానో అర్థం కాలేదు. ఎక్కడుంటే ఏమిటి, పక్కన మనిషే లేనప్పుడు? పలకరింపు కూడా కరువైనప్పుడు!కళ్లెదురుగా ఆకాశం వెలిగి ఆరిపోతూ, వెలిగి ఆరిపోతూ ఉంది. ఎగసిన కాంతి పూలు ఫెటేల్మని విచ్చుకుని, చప్పున అంతెత్తు నుంచి చీకట్లోకి జారిపోతున్నాయి.ఏనాడో జీవితంలోంచి వెళ్లిపోయినవారు ఇప్పుడు ఒక్కొక్కరూ గుర్తుకు వస్తున్నారంటే.. కష్టంలో ఉన్నామనా? కష్టాన్ని తట్టుకుని ఉన్నామనా?-మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. విక్రమాదిత్య సింగ్ (కంగన ప్రత్యర్థి)
ఓటమే కాదు, కొన్నిసార్లు గెలుపు కూడా గుణపాఠాలు నేర్పుతుంది. జూన్ 1న జరిగే ‘మండీ’ లోక్ సభా స్థానం ఎన్నికల్లో ఒకవేళ నేను గెలిస్తే... ‘గెలుపు కోసం ప్రత్యర్థి గురించి తప్పుగా మాట్లాడటం ఓటమి కన్నా తక్కువేం కాదు’... అన్నదే బహుశా నేను నేర్చుకునే మొదటి గుణపాఠం అవుతుంది!రాజకీయంగా ఎన్నైనా ఉండొచ్చు. అవి రాజకీయంగానే ఉండాలి. వ్యక్తిగత స్థాయికి దిగకూడదు. దిగజార కూడదు. కంగనకు, నాకు మధ్య ఏం లేదు. ఆమె బీజేపీ, నేను కాంగ్రెస్. సినిమాల్లో ఆమె ‘క్వీన్’, సిమ్లా వాళ్లకు నేను ‘కింగ్. ఇద్దరం ఒకింట్లో పుట్టుంటే ఆమె అక్క, నేను తమ్ముడు. కానీ ప్రచారంలో ఆమెను ఎన్నిమాటలన్నాను! అన్నానా? అనవలసి వచ్చిందా? అనవలసి వచ్చినా అది అన్నట్లే!కంగనకు, నాకు మధ్య ఏం లేకుండానూ లేదు. మంచి నటిగా ఆమెను నేను అభిమానిస్తాను. కనుక నేను ఆమె అభిమానిని అన్నట్లే! మా మధ్య సినీతారకు–సినీ అభిమానికి మధ్య ఉండే అనుబంధం ఉన్నట్లే! ‘క్వీన్’ సినిమాలో చూడాలి కంగనను. ‘క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ సినిమా కాదు, ‘క్వీన్’ సినిమా. అమాయకురాలైన అమ్మాయి. ఆత్మాభిమానం కల అమ్మాయి. ప్రతికూల పరిస్థితుల్ని చేతుల్లోకి తీసుకుని రాణిలా ఏలిన అమ్మాయి. మధురం, సున్నితం, ఆహ్లాదకరం... ‘క్వీన్’ లో కంగన నటన. అందులో అనే ఏముందీ! ప్రతి చిత్రంలోనూ!రొమాంటిక్ థ్రిల్లర్ ‘గ్యాంగ్‌స్టర్’ తో మొదలు పెట్టి రాజకీయాల్లోకి వచ్చి పడ్డారు కంగన. ఇక్కడ ఆమె తొలి చిత్రం ‘మండీ’. దర్శకత్వం బీజేపీ. అందులో విలన్... ఇంకెవరు? నేనే. బీజేపీ నుంచి కంగన, కాంగ్రెస్ నుండి నేను మండీ నుంచి పోటీ పడుతున్నాం. మాటలూ పడుతున్నాం!ఎన్నెన్ని మాటలు! ఎంతెంత మాటలు! అర్థం లేనివి, అనవసరమైనవీ, అసహ్యకరమైనవి, రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేనివి! ఆమె బీఫ్ తిన్నారని అన్నాను. ఆమె దర్శించిన దేవాలయాలను శుద్ధి చేయాలని అన్నాను. తిరిగి ఆమె నన్ను ‘మహా చోర్’ అన్నారు. ‘ఛోటా పప్పు’ అన్నారు. కానీ స్త్రీ... పురుషుడిని అనడం వేరు. పురుషుడు స్త్రీని అనడం వేరు.అమ్మ స్టేట్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ‘మండీ’ సిటింగ్ ఎంపీ. అమ్మ కాంగ్రెస్‌లో ఉండి కూడా... రామాలయం నిర్మించినందుకు మోదీజీని ధైర్యంగా ప్రశంసించగలిగారు! అయోధ్యలో ప్రతిష్ఠాపన కార్యక్రమానికి వెళ్లకూడదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిన తర్వాత కూడా మోదీని అమ్మ బహిరంగంగా అభినందించారు.అందుకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ... ‘‘ప్రతిభాసింగ్జీ! మీరు పార్టీ నియమాలను ఉల్లంఘించారు...’’ అని అమ్మను బహిష్కరించి, ‘‘ప్రతిభాసింగ్ జీ! మీరు మా పార్టీలోకి వచ్చేయండి...’’ అని బీజేపీ అమ్మను ఆహ్వానించి, అమ్మ బీజేపీలో చేరి, ఇప్పుడు ఇదే ‘మండీ’ నుంచి నాకు పోటీగా నిలబడి ఉంటే అమ్మను కూడా కంగనను అన్నట్లే అన్నేసి మాటలు అనవలసి వచ్చేదా? మాటలు అనవలసి వస్తే అసలు అమ్మకు పోటీగా నిలబడేవాడినా?‘‘కంగనకు బుద్ధి ప్రసాదించమని ఆ శ్రీరాముడిని వేడుకుంటున్నాను’’ అని కూడా నేను కంగన గురించి అన్నాను. అందుకు కంగన – ‘‘వీరభద్రసింగ్జీ ఈరోజు జీవించి ఉంటే కనుక నా గురించి అగౌరవంగా మాట్లాడినందుకు తన కొడుకు విక్రమాదిత్యను మందలించి, ‘వెళ్లి ఆమెకు క్షమాపణ చెప్పు’ అని ఉండేవారు...’’ అన్నారు.ఆ మాట నిజమే కావచ్చు. కానీ, కొన్నిసార్లు క్షమాపణ కోరటం కూడా అభిమానాన్ని ప్రదర్శించుకోవటమే అవుతుంది. అభిమానం అన్నది గుండెల్లో ఉంటేనే మనల్ని సౌకర్యవంతంగా ఉంచుతుంది. అయినా అందరికీ అమ్మకు ఉన్నంత ధైర్యం ఉంటుందా?! రాజకీయ ప్రత్యర్థిని అభినందించేంత ధైర్యం! – మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. నవీన్ పట్నాయక్ (ఒడిశా సీఎం)
‘‘జూన్ 9న ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం నవీన్ జీ! ఫిక్స్ చేసేశాను’’ అన్నారు పాండియన్!నవ్వాన్నేను.ఇద్దరం ఎప్పటిలా మొక్కలకు నీళ్లు పెడుతూ, ఒడిశా ప్రజల ఆశలను నెరవేర్చే ఆలోచనలకు పాదులు తీసుకుంటూ గార్డెన్లో మెల్లగా నడుస్తూ ఉన్నాం. అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ, అక్కడున్న మొక్కలు నాకెప్పుడూ మొక్కల్లా అనిపించవు! అర్జీలను పట్టుకుని నేరుగా తమ ముఖ్యమంత్రి ఇంటికే వచ్చేసి, ఇక్కడి గార్డెన్లో నీడపట్టున వేచి ఉన్న నిరుపేదల విన్నపాలకు ప్రతిరూపాల్లా ఉంటాయి అవి.‘‘జూన్ 9న ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం నవీన్ జీ! ఫిక్స్ చేసేశాను’’ అని పాండియన్ అన్నప్పుడు నేను నవ్వడానికి కారణం. పాండియన్ ఆ మాటను నాతో అనడానికి ముందే ప్రతిపక్షాలకు ప్రకటించేశారు. అదీ తొలివిడత పోలింగ్ మొదలు కావటానికి వారం ముందే!ఒకే విడతలో ముగిసిపోయే ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ సీట్లకు, 21 లోక్ సభ సీట్లకు నాలుగు విడతల పోలింగ్ని నిర్ణయించేసింది ఎలక్షన్ కమిషన్! మే 13న తొలివిడత అయింది. రేపు మే 20న రెండో విడత పోలింగ్. మే 25, జూన్ 1 మూడు, నాలుగు విడతలు. జూన్ 4న ఫలితాలు.‘‘ఒడిశా ప్రజల ఆశీస్సులతో మా నాయకుడు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా వరుసగా ఆరోసారి జూన్ 9న మధ్యాహ్నం 11.30– 1.30 మధ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొదటి సంతకం చేస్తారు’’ అని పాండియన్ చెయ్యెత్తి జై కొట్టినట్లుగా ప్రకటించడానికి కారణం అసలు మోదీజీనే.‘‘ఒడిశాలో బీజేడీ ప్రభుత్వానికి జూన్ 4 ఎక్స్పైరీ డేట్’’ అని మోదీజీ అనకుండా ఉండి ఉంటే పాండియన్ జూన్ 9న ప్రమాణ స్వీకారం అనే మాట అనివుండే వారే కాదు. పాండియన్ నా ఆప్తుడు. నన్నెరిగిన వాడు. నా రెండో నేను!ఎన్నికల ప్రచారంలో ఇలాంటి పోటాపోటీ పైచేయి మాటలు ఒడిశాకు అలవాటు లేదు. మోదీజీ వచ్చాకే మొదలయ్యాయి. ఎన్నికల ముందు వరకు స్నేహితుల్లా ఉండి, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఎందుకు ఒకరికొకరం శత్రువులం అయిపోవాలి? గెలుపు కోసమే అయితే ఆ సంగతి ప్రజలు కదా చూసుకుంటారు!మోదీజీ ఢిల్లీ నుంచి వచ్చి, ‘‘నవీన్ పట్నాయక్ దేశంలోనే పాపులర్ సీఎం అని; వికసిత్ భారత్‌కి, ఆత్మనిర్భర్ భారత్‌కి శక్తినిచ్చే రాష్ట్రం ఒడిశా’’ అని ప్రశంసించారని బీజేడీకి ఓటు వేసి, ‘‘నవీన్ ప్రభుత్వానికి జూన్ 4 ఎక్స్పైరీ డేట్ అని; ఒడిశాలో బీజేపీ రాబోతున్నదనీ, బీజేడీ పోబోతున్నదనీ...’’ మోదీజీ జోస్యం చెప్పారని బీజేడీకి ఓటు వేయకుండా ఉంటారా ఒడిశా ప్రజలు?!‘‘ఒడిశా నవీన్ పట్నాయక్‌కి గుడ్ బై చెప్పబోతోంది’’ అని అమిత్ షా, ‘‘ఒడిశా ప్రజలు నవీన్ పట్నాయక్‌కి రెస్ట్ ఇవ్వబోతున్నారు’’ అని నడ్డా, ‘‘ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతోంది’’ అని రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం చేస్తున్నారు!మేము వారిని ఒక్క మాటా అనటం లేదు. పాండియన్ అనిన ఆ ఒక్క మాటా వారు అనిపించుకున్నదే!‘‘గాలికి ఎగిరొచ్చి పాదుల్లో పడి ఎరువుగా మారే పండుటాకులు, ఎండు పుల్లల లాంటివి వారి మాటలు పాండియన్! అవి మనకే మేలు చేస్తాయి’’ అన్నాను గార్డెన్లో మరోవైపునకు నడుస్తూ!అవును కదా అన్నట్లు పాండియన్ నవ్వారు. గెలుపోటములన్నవి నాయకులు ఒకర్నొకరు అనుకునే మాటల్ని బట్టి మారిపోవు. ‘నాయకుడు’ అని తాము అనుకున్న వ్యక్తినే ప్రజలు గెలిపిస్తారు. ఎన్నేళ్ల వరకైనా గెలిపిస్తూనే ఉంటారు. మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. అధీర్ రంజన్
‘‘ఆవిడ అహంకారం గమనించారా ఖర్గేజీ?! అందుకే ఆవిడకు నేను జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదు...’’ అన్నాను ఖర్గేజీతో. ఆ మాటకు ఖర్గేజీ నవ్వారు! ‘‘ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పలేదన్న స్పృహ మీలో ఇప్పటికీ ఉందంటే అందరికన్నా ముందు మీరే ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పినట్లు రంజన్‌జీ. ఆవిడ పుట్టిన రోజు వచ్చి పోయి కూడా ఇరవై నాలుగు గంటలు అవడం లేదా...’’ అన్నారు. ఆయన వైపు దిగాలుగా చూశాను. ‘‘రంజన్‌జీ... ఆవిడ ఆల్రెడీ ఎలక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయారు కనుక పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన మీరు గానీ, ఆలిండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన నేను గానీ, పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌కు ఉన్న ఇద్దరంటే ఇద్దరే లోక్‌సభ ఎంపీలలో ఒకరైన మన అబూ హసేమ్ ఖాన్ సాబ్ గానీ ఆవిడకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం, చెప్పకపోవడం అన్నవి ఆవిడ పట్టించుకునేంత ప్రాముఖ్యం ఉన్న విషయాలైతే కావు. మనకే ఆ పట్టింపు..’’ అన్నారు ఖర్గేజీ... అదే నవ్వుతో! ‘‘ఆవిడ అంటే మమతాజీనే కదా...’’ అన్నారు ఖాన్ సాబ్. ‘‘ఆ.. ఆవిడే..’’ అన్నాను. ఖాన్ సాబ్, నేను, ఖర్గేజీ... ముగ్గురం ఢిల్లీ ఆఫీస్‌లో ఉన్నాం. వచ్చే ఎన్నికల సీట్ షేరింగ్‌లో మాల్దా సౌత్, బెర్హంపూర్.. ఈ రెండూ కాంగ్రెస్‌కు ఇస్తాం అంటున్నారు మమత! మాల్దాకు ఖాన్ సాబ్, బెర్హంపూర్‌కి నేను సిట్టింగ్ ఎంపీలం. ‘‘మన సీట్లు మనకు ఇవ్వడం సీట్ షేరింగ్ ఎలా అవుతుంది ఖర్గేజీ... అహంకారం అవుతుంది కానీ..’’ అన్నాను, ఢిల్లీ పార్టీ ఆఫీస్ మెట్లెక్కి పైకి వెళ్లగానే. వెంటనే ఆయనేమీ మాట్లాడలేదు. ‘‘ముందు అలా ప్రశాంతంగా కూర్చోండి రంజన్‌జీ...’’అన్నారు! ‘‘అసలు కూటమి నుంచే బయటికి వచ్చేద్దాం ఖర్గేజీ. కాంగ్రెస్‌కి ఏం తక్కువైంది. తృణమూల్‌కి ఏం ఎక్కువైంది?’’ అన్నాను తీవ్రమైన ఆగ్రహంతో. ఖర్గేజీ నవ్వుతూ చూశారు. ‘‘ఈ రెండు సీట్ల షేరింగ్ నాకు చికాకు తెప్పిస్తోంది ఖర్గేజీ. పైగా ఆవిడ ఏమంటున్నారో విన్నారు కదా.. బెంగాల్లో బీజేపీ సంగతి తనొక్కరే చూసుకుంటారట, మిగతా స్టేట్లన్నిటిలో మనం చూసుకోవాలట! అంటే.. బెంగాల్లో మొత్తం 42 సీట్లూ తృణమూల్‌కి వదిలేయమనే కదా! ఎక్కడి నుంచి వస్తుంది అంత అహంకారం ఖర్గేజీ!! మనం తక్కువన్న ఫీలింగా? లేక, తను ఎక్కువన్న ఫీలింగా?!’’ అన్నాను. ‘‘తను ఎక్కువన్న ఫీలింగే కావచ్చు...’’ అన్నారు ఖాన్ సాబ్! ‘‘ఎలా చెప్పగలరు?!’’ అన్నాను. ‘‘అవతలి వాళ్లను తక్కువగా చూడగలినప్పుడు మనం ఎక్కువ అనే ఫీలింగ్ కలుగుతుంది. బహుశా మమతాజీ కూడా అలా మనల్ని తక్కువగా చూడగలగడం ద్వారా తను ఎక్కువ అనే భావనను కల్పించుకుంటున్నా రేమో...’’ అన్నారు ఖాన్ సాబ్. ‘‘లోక్‌సభలో 22 సీట్లు మాత్రమే ఉన్న తృణమూల్ పార్టీ, 48 సీట్లున్న కాంగ్రెస్ పార్టీని తక్కువగా చూడగలుగుతోందంటే... కూటమిలో భాగస్వామి కనుక మన 48 సీట్లు కూడా తనవే అని తృణమూల్ అనుకుంటూ ఉండాలి. లేదా, తనసలు కూటమిలోనే లేనని అనుకుంటూ ఉండాలి...’’ అన్నాను. ఆ మాటకు పెద్దగా నవ్వారు ఖాన్ సాబ్. ఖర్గేజీ నవ్వలేదు! ‘‘మనమూ కూటమిలో లేమనే అనుకోవాలి రంజన్‌జీ. ఇప్పుడున్నది కాదు కూటమి. ఎన్నికలు జరిగి, ఫలితాలు వచ్చాక కుదిరేదే అసలైన కూటమి...’’ అన్నారు! ‘‘మరిప్పుడేం చేద్దాం ఖర్గేజీ?’’ అన్నాను. ‘‘బిలేటెడ్గానైనా ముందు మీరు మమతాజీకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పండి రంజన్‌జీ... ఆవిడ పట్టించుకున్నా, పట్టించు కోకున్నా... ’’ అన్నారాయన!! -మాధవ్.. శింగరాజు -
బిల్ గేట్స్ (బిజినెస్ మాగ్నెట్) రాయని డైరీ
మిస్ పౌలా నవ్వారు. ఆమె నవ్వు సియాటిల్ నగరంలా అందంగా ఉంది. నన్ను అర్థం చేసుకున్న సిటీ సియాటిల్. అక్కడే నేను పుట్టాను. పర్వతాల అరణ్య జ్వాలలపై నాకు ప్రేమ కలిగిందీ అక్కడే. ‘‘ఏంటి నవ్వుతున్నారు మిస్ పౌలా?’’ అని అడిగాను. సియాటిల్‌లోని మొత్తం ఏడు లక్షల యాభై వేల మంది జనాభాకు కాస్త దూరంగా ఉండే కాఫీ షాప్‌లో ఇద్దరం పక్కపక్కన కూర్చొని ఉన్నాం. నేను ఆమె వైపు జరిగి కూర్చుంటే ఆమె నావైపు ఒరిగి కూర్చున్నారు. ‘‘మన గురించి ఏవో రాస్తున్నారు..’’ అన్నారు పౌలా.. నవ్వుతూనే. నేనూ నవ్వాను. ‘‘మీరెందుకు నవ్వుతున్నారు బిల్!’’ అన్నారామె. ‘‘ఏవో రాస్తున్నారు కానీ, ఏవేవో రాయడం లేదు. నయం కదా..’’ అన్నాను. ఇద్దరం కాసేపు మౌనంగా ఉండిపోయాం. మా భుజాలు వాటి కబుర్లలో అవి ఉండిపోయాయి. ‘‘మీ నవ్వు పొయెట్రీలా ఉంటుంది బిల్..’’ అన్నారు పౌలా హఠాత్తుగా! 67 ఏళ్ల వయసులో ఆమె కారణంగా సియాటిల్ నగరాన్ని నేను, 60 ఏళ్ల వయసులో నా కారణంగా పొయెట్రీని ఆమె ఇష్టపడుతున్నామా? అయినా నా నవ్వు పొయెట్రీలా ఉంటుందని ఆమె అన్నారే గానీ పొయెట్రీని తను ఇష్టపడతానని అన్లేదుగా!! ‘‘పొయెట్రీ అంటే మీకు ఇష్టమా?’’ అని అడిగాను. ఆమె నవ్వి, ‘‘ఎవరికుండదూ..!’’ అన్నారు. ‘‘బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్లక్కూడానా?’’ అన్నాను. ‘‘ఓయ్..’’ అంటూ తన భుజంతో నా భుజాన్ని నెట్టేశారు పౌలా. ఆమెలో ఏదో మాయ ఉంది. యాన్ విన్బ్లాడ్లో ఉన్నట్లు, జిల్ బెనెట్లో ఉన్నట్లు, మెలిందాలో ఉన్నట్లు! అసలు ఆడవాళ్లలోనే ఈ మాయ ఉంటుందా?! మెలిందా నాకు విడాకులు ఇవ్వడానికి విన్‌బ్లాడ్ కానీ, జిల్ బెనెట్ గానీ కారణం కాదు. పౌలాకు నేను దగ్గరవ్వడానికి మెలిందా కానీ మరొకరు కానీ కారణం కాదు. ప్రేమ, స్నేహం.. ఇవి మాత్రమే నడిపిస్తాయి జీవితాన్ని. జెఫ్రీ ఎప్స్టైన్ నా స్నేహితుడు. అతడితో మాట్లాడవద్దంటుంది మెలిందా. అతడి మీద కేసులు ఉన్నాయని, అతడు జైలుకు వెళ్లాడని, అతడితో స్నేహం వదిలేయమని అంటుంది. ‘‘ఎలా వదిలిపెట్టడం మెలిందా?’’ అంటే.. ‘‘పోనీ నన్నొదిలేయ్’’ అంటుంది!! జైల్లో జెఫ్రీ ఆత్మహత్య చేసుకుని చనిపోయాక కూడా మెలిందా మనసు కరగలేదు. ఎందుకుండాలి ఒక మనిషి పట్ల మరొక మనిషి అంత కఠి నంగా!! మెలిందాతో ఆ మాటే అన్నాను. కోపంతో నన్ను వదిలి వెళ్లింది. కానీ ప్రేమ, టెన్నిస్ ఎవర్నీ ఒంటరిగా ఉండనివ్వవు. నా జీవితంలోకి పౌలా ప్రవేశించారు. నాలానే పౌలా టెన్నిస్ అభిమాని. మొదటి సారి కలిసినప్పుడు.. ‘‘మీ..రూ..’’ అంటూ నన్నలా చూస్తూ ఉండిపోయారు పౌలా. రెండోసారి మేము కలుసుకున్నప్పుడు ‘‘మీ..రూ..’’ అంటూ తనను అలా చూస్తూ ఉండిపోయాన్నేను. మనసుకు నచ్చిన వాళ్లతో కలిసి కూర్చోడానికి టెన్నిస్ టోర్నమెంట్ల తర్వాత కాఫీ షాపులు బాగుంటాయి. అయితే ఒక్కటే నిరాశను కలిగిస్తుంది. కాఫీ షాపులలో ఎన్ని గంటలు కూర్చున్నా డ్యూటీకి వెళ్లడం కోసమైతే ల్యాప్‌టాప్‌ని తగిలించుకుని పైకి లేవవల సిందే. పౌలా ఈవెంట్ ఆర్గనైజర్. ‘‘ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు బిల్..’’ అన్నారు పౌలా తన భుజంతో మళ్లీ నా భుజాన్ని నెట్టేస్తూ. మా ముందున్న టేబుల్ మీద ఆవేళ్టి ట్యాబ్లాయిడ్స్ ఉన్నాయి. ‘బిల్ గేట్స్‌కి మళ్లీ ప్రేమ దొరికింది’.. అన్నిటిపైనా ముఖ్యాంశం ఒకటే! ‘అవునా! బిల్ గేట్స్‌కి ప్రేమ దొరికిందా?!’’ అంటూ నా కళ్లలోకి చూసి నవ్వారు పౌలా. మాధవ్ శింగరాజు -
ఎం.కె. స్టాలిన్ (తమిళనాడు సీఎం) రాయని డైరీ
మనిషిని చూస్తే శుభ్రంగా ఉన్నాడు. సంప్ర దాయంగా ఉన్నాడు. ధోతీ–చొక్కా ధరించి ఉన్నాడు. శ్రీమతితో కలిసి నడుస్తున్నాడు! ‘‘ఈయన రవి కదా, మన తమిళనాడు గవర్నర్!’’ అన్నాను... ఫొటోలో అలా శుభ్రంగా, సంప్రదాయంగా, ధోతీ–చొక్కా ధరించి, శ్రీమతితో కలిసి నడుస్తున్న వ్యక్తిని రఘుపతికి చూపిస్తూ. ‘‘ఆమా తలైవా. అలాగే అనిపిస్తోంది..’’ అన్నారు రఘుపతి. ఆయన ‘లా’ మినిస్టర్. ‘‘అనిపించడం కాదు, కనిపిస్తున్నది ఆయనే’’ అని నవ్వారు పెరియస్వామి. ఆయన రూర ల్ మినిస్టర్. ఆయన చేతిలో మరికొన్ని ఫొటోలు ఉన్నాయి. ఆ ఫొటోల్లో కూడా రవి శుభ్రంగా, సంప్రదాయంగా ఉన్నారు. రాజ్‌భవన్ పొంగల్ ఈవెంట్‌కు వచ్చిన వారందరినీ వారి దగ్గరకు వెళ్లి మరీ ఆత్మీయంగా పలకరిస్తున్నారు. పొంగల్ శుభాకాంక్షలు చెబుతున్నారు. నీలగిరి ట్రైబల్స్ కొందరు ఎంపికగా తెంపుకొచ్చి, గుత్తిగా ముడి వేసి తెచ్చిన కొండపూల బొకేను అపురూపంగా స్వీకరిస్తున్నారు. కేరళ నుంచి వచ్చిన బ్రాహ్మణులు పూజలు నిర్వహించి ఇచ్చిన ‘పరివట్టమ్’ను భక్తి ప్రపత్తులతో శ్రద్ధగా తన తలకు చుట్టుకుంటున్నారు. ఆ ఫొటోలను పెరియస్వామికి తిరిగి ఇచ్చేస్తూ... ‘‘ఇంత శుభ్రమైన, సంప్రదాయ బద్ధమైన మనిషి మొన్న అసెంబ్లీలో అలా ఎందుకు బిహేవ్ చేశారంటారూ!!’’ అన్నాను. రఘుపతి, పెరియస్వామి మాట్లాడలేదు. ఆ ప్రశ్న అందరిలోనూ ఉంది. సమాధానం గవర్నర్ రవి మాత్రమే చెప్పగలిగింది. రవికి, తమిళనాడుకు సంబంధమే లేదు. బిహార్ అతడి రాష్ట్రం. కేరళ అతడి క్యాడర్. ఢిల్లీ అతడి వర్క్‌ప్లేస్. మేఘాలయకు, నాగాలాండ్‌కు గవర్నర్‌గా ఉన్నారు. అలాగే ఇప్పుడు తమిళనాడుకు. మేఘాలయకు గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయన మేఘాలయను మేఘాలయ అనే అన్నారు. నాగాలాండ్‌కు గవర్నర్‌గా ఉన్నప్పుడు నాగాలాండ్‌ను నాగాలాండ్ అనే అన్నారు. తమిళనాడును మాత్రం తమిళనాడు అనడం లేదు. ‘తమిళగం’ అంటున్నారు. బయటా అదే మాట. అసెంబ్లీలోనూ అదే మాట! తమిళనాడు అంటే ‘తమిళభూమి’ అనే అర్థం వస్తుంది కనుక.. అప్పుడది భరత భూమికి సంబంధం లేని స్వతంత్ర దేశంగా అనిపించే ప్రమాదం ఉంది కనుక.. తమిళ నాడును ‘తమిళుల ప్రాంతం’ అనే అర్థం వచ్చేలా ‘తమిళగం’ అనడమే కరెక్ట్ అని తను గవర్నర్‌గా వచ్చినప్పటి నుంచీ రవి అంటూనే ఉన్నారు. కాన్స్టిట్యూషన్ని రవి కాస్త ఎక్కువగా చదివినట్లున్నారు. ఎక్కువ చదివితే ముఖ్యమైనవి కొన్ని తక్కువగా అనిపిస్తాయి. మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలలో గవర్నర్ తల దూర్చకూడదని, వేలు పెట్టకూడదని, కాలు దువ్వకూడదని ఆర్టికల్ 163 (1) లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చిన అసెంబ్లీ ప్రసంగంలోంచి మహనీయులు పెరియార్‌ని, అంబేద్కర్‌ని, కామరాజ్ని అన్నాదురైని తొలగించి, తమిళనాడుకు బదులు తమిళగంను చేర్చి, అలా ఎలా చేస్తారని ప్రశ్నించినందుకు వాకౌట్ చేసి.. గవర్నర్ రవి ఎవరి ఔన్నత్యాన్ని నిలబెట్టినట్లు! రాజ్యాంగానిదా, రాజ్భవన్దా? రాజ్యాంగ నియమాలను శిరసావహించని ఈ పెద్దమనిషేనా ఇప్పుడు పొంగల్ సంప్రదాయాలను గౌరవిస్తూ కనిపిస్తున్నది!! ‘‘ఫొటోలు మనకెందుకు పంపారట?’’ అని పెరియస్వామిని అడిగాను. ‘‘పొంగల్ ఈవెంట్‌కి పిలిచినా మనం వెళ్లలేదని పొంగల్ ఈవెంట్‌నే మనకు పంపారు’’ అన్నారు నవ్వుతూ పెరియస్వామి. ఆ నవ్వుకు ఆయన చేతిలోంచి ఒక ఫొటో జారి కింద పడింది. ‘హ్యాపీ పొంగల్ – ఇట్లు మీ ప్రియమైన రవి’.. అని ఆ ఫొటో వెనుక రాసి ఉంది! -మాధవ్ శింగరాజు -
‘షిందేజీ! ఉద్ధవ్ కోసమే సంజయ్ రౌత్ బెయిల్ సంపాదించినట్లు అనిపిస్తోంది’
‘‘సంజయ్ రౌత్ జైలు నుంచి బయటికి వచ్చాడట..’’ అన్నారు దీపక్ కేసర్కర్! ఆ మాటను ఆయన నాకు బాగా సమీపానికి వచ్చి, మెల్లిగా... నా రెండు చెవుల్లో ఒక చెవికి మాత్రమే వినిపించేలా చెప్పారు. అప్పుడా సమయంలో చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే నా పక్కన ఉన్నారు. ఒకప్పుడు బాల్ ఠాక్రేజీ పక్కన ముప్పై ఏళ్ల పాటు ఉన్నవాళ్లు.. ఇప్పుడు నెలన్నరగా నా పక్కన ఉంటున్నారు. ఠాక్రేజీ జీవించి ఉండగా ఆయనకు వచ్చే ఫోన్లను థాపా, రాజేలే లిఫ్ట్ చేసేవాళ్లు. ఠాక్రేజీ చెప్పదలచుకుంది కూడా వాళ్లే ఫోన్లో అవతలి వైపునకు బట్వాడా చేసేవాళ్లు. ‘‘షిందేజీ, అదేంటంటే.. ’’ అంటూ, వాళ్లిద్దరి వైపు చూస్తూ ఆగారు దీపక్. ‘‘పర్లేదు చెప్పండి దీపక్‌జీ. ఠాక్రేజీ దగ్గర నమ్మకంగా ఉన్న మనుషులు ఆయన కొడుకు ఉద్ధవ్ ఠాక్రే వైపు వెళ్లకుండా మనవైపు ఉండేందుకు వచ్చారంటే.. సంజయ్ గురించే కాదు, ఉద్ధవ్ గురించి కూడా మనం నిస్సంకోచంగా మాట్లాడుకోవచ్చు..’’ అన్నాను. ‘‘షిందేజీ! సంజయ్ రౌత్‌ని చూస్తుంటే ఉద్ధవ్ ఠాక్రే కోసం ఏం చేయడానికైనా సిద్ధమై అతడు బెయిల్ సంపాదించినట్లుగా నాకు అనిపిస్తోంది..’’ అన్నారు దీపక్. ‘‘అతడేమీ దేశభక్తుడు కాదు కదా దీపక్‌జీ.. ఏం చేయడానికైనా సిద్ధమవడానికి..’’ అని నవ్వాను. ‘‘కానీ షిందేజీ, అతడి మౌనం చూస్తుంటే దేశభక్తుడే నయం అనిపించేలా ఉన్నాడు..’’ అన్నారు దీపక్! దీపక్ మునుపెన్నడూ అంత హెచ్చరికగా మాట్లాడ్డం నేను వినలేదు! నా మంత్రివర్గంలో సీనియర్ మినిస్టర్ ఆయన. నాలుగు మినిస్ట్రీలను నడిపిస్తున్నారు. నా కన్నా పదేళ్లు పెద్దవారు. ‘‘దేశభక్తుడిని సైతం జైలు జీవితం మామూలు మనిషిగా మార్చేస్తుందని విన్నాను దీపక్‌జీ! కానీ మీరేం చెబుతున్నారంటే.. జైలుకు వెళ్లిన సంజయ్ రౌత్ అనే ఒక మామూలు మనిషి దేశభక్తుడిగా మారి, జైలు బయటికి వచ్చేశాడని!! అదెలా సాధ్యం?’’ అని అడిగాను. ‘‘జైలు నుంచి బయటికి రాగానే సంజయ్ రౌత్ నేరుగా సెంట్రల్ ముంబైలోని సిద్ధి వినాయక టెంపుల్‌కి వెళ్లాడు షిందేజీ! ఆ తర్వాత అతడు సౌత్ ముంబైలోని హనుమాన్ టెంపుల్‌కి వెళ్లాడు. తర్వాత శివాజీ పార్క్‌లోని బాల్ ఠాక్రే మెమోరియల్‌కి వెళ్లాడు. ఆ తర్వాతే ఇంటికి వెళ్లాడు! సాయంత్రం 6.50 కి ఆర్థర్ రోడ్ జైలు నుంచి అతడు విడుదలైతే.. నాహుర్లోని తన ఇంటికి వెళ్లేసరికి రాత్రి 10.20 అయింది. ఈ మూడున్నర గంటల వ్యవధిలో అతడు మాట్లాడిన సమయం తక్కువ. మౌనంగా ఉన్న సమయం ఎక్కువ. అదే నాకు ఆందోళన కలిగిస్తోంది షిందేజీ.. ’’ అన్నారు దీపక్. ‘‘ఆందోళన దేనికి దీపక్‌జీ?!’’ అన్నాను. ‘‘దేనికంటే.. అతడు మాట్లాడిన ఆ తక్కువ సమయంలోనే ఉద్ధవ్‌తో చాలా ఎక్కువ మాట్లాడాడు. మౌనంగా ఉన్న ఆ ఎక్కువ సమయంలోనే మన గురించి చాలా తక్కువగా మౌనం వహించాడు..’’ అన్నారు దీపక్. ‘‘అర్థం కాలేదు దీపక్‌జీ..’’ అన్నాను. ‘‘మూడు నెలలు జైల్లో ఉండి వచ్చాక కూడా ఉద్ధవ్‌దే రియల్ శివసేన అని అతడు అంటున్నాడు షిందేజీ! అంటే మనది రియల్ శివసేన కాదనీ, మీరూ రియల్ ముఖ్యమంత్రి కాదనే కదా అతడి ఉద్దేశం!’’ అన్నారు దీపక్! చంపాసింగ్ థాపా, మోరేశ్వర్ రాజే మాకు కాస్త దూరంగా నిలబడి ఉన్నారు. నవంబర్ 17న ఠాక్రేజీ 10వ వర్ధంతి. ఆ సంస్మరణ సభలో వాళ్లిద్దరి చేత మాట్లాడిస్తే?!వాళ్లే చెబుతారు.. రియల్ శివసేన ఎవరిది కాదో, రియల్ సీఎం ఎవరు కారో?! దీపక్ నా వైపే చూస్తూ ఉన్నారు. ‘‘దీపక్‌జీ! అసలైన దాన్ని ఎవరూ మార్చలేరు. సంజయ్ రౌత్ అనే ఒక దేశభక్త ఎంపీ మార్చగలడా?’’ అన్నాను నవ్వుతూ. -
అశోక్ గెహ్లోత్ (రాజస్థాన్ సీఎం) రాయని డైరీ
రాహుల్‌ని నిందిస్తూ సోనియాజీకి గులామ్ నబీ ఆజాద్ రాసిన ఐదు పేజీల రాజీనామా లేఖ నాకెంతో ఆవేదనను కలిగించింది. ఒక తల్లికి ఆయన ఏం చెప్పదలచుకున్నారు? ‘అమ్మా.. నీ కొడుకు సమర్థుడు కాదు’ అనేనా?! మరి యాభై ఏళ్లుగా సమర్థుడిగా ఉండి, ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి చేసిందేమిటి? నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇప్పించిన పద్మభూషణ్‌ని రెండు చేతులతో అపురూపంగా స్వీకరించడమేనా! అవార్డు కోసం ఆయన పట్టిన చేతులు ఎక్కడివి? కాంగ్రెస్‌లో పుట్టి పెరిగినవే కదా. కాంగ్రెస్ లేనిదే తను లేనన్న సంగతిని మరిచి, కాంగ్రెస్‌కు ఎవరూ లేకుండా పోతున్నప్పుడు ప్రధాన ద్వారం వద్ద తను కాపలా ఉండి, కాంగ్రెస్‌ని కాయాల్సింది పోయి, ‘నేనూ వెళ్లిపోతున్నాను – ఇట్లు ఆజాద్’ అని ఉత్తరం రాసి వెళ్లిపోతారా?! రాహుల్ పట్టించుకోనందువల్లే కాంగ్రెస్‌కు ఈ గతి పట్టిందని ఆరోపిస్తున్న ఆజాద్.. తనెందుకు కాంగ్రెస్‌ను పట్టించుకోకుండా రాహుల్‌లోని ‘అపరిపక్వత’ను పట్టించుకుంటున్నారు?! తన పరిపక్వతను ప్రదర్శించుకోడానికా? ‘‘మేడమ్‌జీ, నేనుంటాను కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా..’’ అని భరోసాగా పగ్గాలెందుకు అడిగి తీసుకోలేకపోయారు? ఇస్తే తీసుకుందాం అని చూస్తున్నవాళ్లా, ఇస్తున్నా తీసుకోడానికి ఆసక్తి చూపనివాళ్లా .. ఎవరు అసమర్థులు? తల్లి మెడికల్ చెకప్ కోసం ఆ కుటుంబం దేశం దాటి వెళ్లిన సమయం చూసి, తనిక్కడ గడప దాటి కాంగ్రెస్ కుటుంబ గౌరవాన్ని బయటపడేశారు ఆజాద్! ఆ గౌరవం తిరిగి నిలబడాలంటే రాహుల్ గాంధీ పార్టీ ప్రెసిడెంట్ అవడం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. వట్టి మార్గం మాత్రమే కాదు, కాంగ్రెస్‌ను వదిలి వెళ్లిన వాళ్లందరికీ గట్టి సమాధానం కూడా. వెళ్లినవాళ్లు హూందాగా ఒక్కరైనా వెళ్లారా! రాహుల్‌పై ఒక రాయి విసిరే వెళ్లారు. పార్టీని బతికించుకుందామని అనుకున్నవాళ్లు పార్టీలో ఉండి, పార్టీతో పోరాడతారు. పార్టీలో తమకు బతుకు లేదనుకున్నవాళ్లే ఇలా గులామ్ నబీ ఆజాద్‌లు, జైవీర్ షేర్గిల్లు, కపిల్ సిబాల్‌లు, ఆశ్వినీ కుమార్‌లు, ఆర్పీయన్ సింగ్‌లు, సునీల్ జాఖడ్‌లు, జ్యోతిరాదిత్య సింథియాలు అవుతారు. ఈ రాళ్లన్నిటికీ తిరుగులేని జవాబు.. రాహుల్ బాబు. రాహుల్‌కి ఫోన్ చేశాను. న్యూయార్క్‌లో స్టే చేసినట్లున్నారు. ‘‘మేడమ్ ఎలా ఉన్నారు రాహుల్?’’ అని అడిగాను. ‘‘ఇంకెలా ఉంటారు అశోక్‌జీ. పార్టీ ప్రెసిడెంట్‌గా ఉండేందుకు మీరు అంగీకరించి ఉండాల్సింది అని మమ్మీ ఇంతక్రితం కూడా అన్నారు. ఇప్పుడే చెకప్ కోసం లోపలికి వెళ్లారు’’ అన్నారు రాహుల్. ‘‘గాంధీలు కాకుండా వేరొకరు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షులుగా ఉండటం దేశానికి కలిసిరాలేదు రాహుల్‌బాబూ. ఇండియా తిరిగి రాగానే మీరు మీ సహజమైన కృతనిశ్చయం ప్రతిఫలించే చిరునవ్వుతో పార్టీ బాధ్యతలు స్వీకరించాలి’’ అని అభ్యర్థించాను. రాహుల్ పెద్దగా నవ్వారు. ‘‘ఏంటి రాహుల్ నవ్వుతున్నారు?’’ అన్నాను. ‘‘నా సహజమైన కృతనిశ్చయం దేనికి సంబంధించినదో తెలిసుండి కూడా అందుకు పూర్తి విరుద్ధమైన ప్రతిఫలనాన్ని మీరు నాలో ప్రేరేపించే ప్రయత్నం చేస్తుంటే నవ్వొచ్చింది అశోక్‌జీ..’’ అన్నారు! ఆ మాటకు ముగ్ధుడినైపోయాన్నేను. అంత క్లారిటీని ఇంతవరకు నేను ఏ కాంగ్రెస్ నాయకుడిలోనూ చూళ్లేదు! పార్టీ అయోమయంలో ఉండొచ్చు. రాహుల్ స్పష్టంగానే ఉన్నారు. తమకేం కావాలో పైకి చెప్పని గులామ్ నబీ ఆజాద్ వంటి వాళ్ల కన్నా, తనకేం వద్దో తెగేసి చెబుతూ వస్తున్న రాహుల్బాబే ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించగల నాయకుడని నాకనిపించింది. (క్లిక్: చదువుల్లో ‘వివక్ష’ తొలగింపు కోసమే!) -
శరద్ పవార్ (ఎన్సీపీ లీడర్) రాయని డైరీ
‘‘నన్ను ఆశీర్వదించండి పవార్జీ..’ అంటూ వచ్చాడు ఏక్నాథ్ శిందే. అప్పుడు నేను ఆశీర్వదించగలిగిన భౌతికస్థితిలో ఉన్నప్పటికీ, ఆశీర్వదించేందుకు తగిన అనుకూల స్థితిలో లేను. ఫోన్లో ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు. ఠాక్రే అంటున్నాడు.. ‘‘పవార్జీ! ఈ లోకం మీద నాకు విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేలా నన్ను ఆశీర్వదించండి..’’ అని. ఆ టైమ్‌లో వచ్చాడు ఏక్నాథ్ శిందే! వస్తున్నట్లు ముందుగా చెప్పలేదు. చెప్పకుండా నేరుగా సౌత్ ముంబైలో నేనుంటున్న సిల్వర్ ఓక్స్ బంగళాకే వచ్చేశాడు. ఈస్ట్ బాంద్రాలోని ఠాక్రేల ఇల్లు ‘మాతోశ్రీ’కి, మలబార్ హిల్స్‌లోని సీఎం అధికారిక భవంతి ‘వర్ష’కు, ఆ దగ్గర్లోనే ఉండే ప్రభుత్వ అతిథి గృహం ‘సహ్యాద్రి’కి కూడా అతడు ఇలా స్వేచ్ఛగా రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. వేటినీ తనవి కావు అనుకోడు. ‘‘నన్ను ఆశీర్వదించండి పవార్జీ..’’ అన్నాడు మళ్లీ శిందే నాకు మరింతగా దగ్గరకు వచ్చి.. నా ఎదురుగా మోకాలిపై కూర్చుంటూ! నేనప్పుడు కుర్చీలో కూర్చొని ఉన్నాను. ‘‘లేచి, పైన కూర్చో శిందే...’’ అన్నాను, సోఫా వైపు చూపిస్తూ. అతడు లేవలేదు! ‘‘ఎవరు పవార్జీ మీ దగ్గర.. శిందేనేనా?’’ అంటున్నాడు అటువైపు ఫోన్లో ఉద్ధవ్. ఎవరో వచ్చినట్లున్నారు.. ఫోన్ పెట్టేద్దాం.. అని అతడూ అనుకోవడం లేదు! ‘‘అవును ఉద్ధవ్... శిందేనే...’’ అన్నాను.. ఫోన్లో ఉద్ధవ్ ఉన్నాడని శిందేకు తెలిసేలా. ‘‘ఏంటట పవార్జీ..’’ అన్నాడు ఉద్ధవ్! ‘‘ఉద్ధవ్ నేను మళ్లీ చేస్తాను. మళ్లీ చేసేంత టైమ్ నాకు దొరకడం లేదని నీకనిపిస్తే కనుక నువ్వే నాకొకసారి చెయ్యి..’’ అని, ఉద్ధవ్ ఫోన్ పెట్టేసే వరకు ఆగాను. శిందే ఇంకా మోకాలి మీదే ఉన్నాడు. ‘‘తిరుగుబాటు చేసినందుకు నా మీద కోపంగా ఉన్నారా పవార్జీ..’’ అన్నాడు. అతడి చెయ్యి మీద చెయ్యి వేశాను. శిందే అప్పటికే అనేకమంది ఆశీర్వాదాలు పొంది, ఇక్కడికి వచ్చాడు. ప్రమాణ స్వీకారానికి ముందు.. తన దివంగత రాజకీయ గురువు బాల్ ఠాక్రేను, తన స్వర్గీయ ఆధ్యాత్మిక గురువు ఆనంద్ డిఘేను తలచుకుని, వారి ఆశీర్వాదాల కోసం ప్రార్థించాడు. మోదీ, షాల ఆశీర్వాదాలకు భక్తి శ్రద్ధలతో తలవొగ్గాడు. వారివే కాకుండా.. అంకెలకు సరిపడినన్ని ఆశీర్వాదాలు ఎప్పుడు విశ్వాస పరీక్ష జరిగితే అప్పుడు శిందే మీద కురవడానికి సిద్ధంగా ఉన్నాయి. లెక్కకు మిక్కిలిగా అన్ని ఆశీర్వాదాలు ఉండి కూడా, నా ఆశీర్వాదం కోసం వచ్చాడంటే.. అతడు కేవలం ఆశీర్వాదం కోసమే వచ్చాడని. ‘‘కోపమేం లేదు శిందే. తిరుగుబాటు చెయ్యడం ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను. అంతకంటే పెద్ద కష్టం ఏంటో తెలుసా? తిరుగుబాటు చెయ్యకుండా ఉండలేకపోవడం..’’ అన్నాను అతడి తలపై నా అరచేతిని ఆన్చి. అప్పుడు లేచాడు శిందే. ‘‘వెళ్లొస్తాను పవార్జీ’’ అని చేతులు జోడించాడు. అతడటు వెళ్లిపోయాక, నేనిటు నలభై నాలుగేళ్లు వెనక్కి వెళ్లిపోయాను. ఇప్పుడు ఉద్ధవ్‌పై శిందే తిరుగుబాటు చేసినట్లే అప్పట్లో వసంతదాదా పాటిల్‌పై నేను తిరుగుబాటు చేశాను. తప్పలేదు. తప్పనిపించలేదు. ఎవరైనా తిరుగుబాటు చేశారంటే వాళ్లు మనిషిగా బతికి ఉన్నట్లు! అవమానాలు భరిస్తూ కూడా ఎవరైనా తిరుగుబాటు చేయలేదంటే.. వాళ్లు ఒక మనిషి కోసం చూస్తున్నట్లు. అందుకే నేను తిరుగుబాటుదారుడిని గౌరవిస్తాను.. అతడు 1857 పాండే అయినా, 2022 శిందే అయినా. ఉద్ధవ్ మళ్లీ నాకు ఫోన్ చేస్తే చెప్పాలి.. లోకం మీద మనకు విశ్వాసం సన్నగిల్లితే లోకానికి పోయేదేమీ లేదని, అవిశ్వాస తీర్మానానికి ముందే మన మీద మనం విశ్వాసం కోల్పోతే లోకం వచ్చి చేసేదేమీ ఉండదని! -
హార్ధిక్ పటేల్(గుజరాత్ కాంగ్రెస్) రాయని డైరీ
కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్‌ని పక్కన పెట్టేసే విధానం ఒక దారుణమైన విలక్షణతను కలిగి ఉంటుంది. హఠాత్తుగా ఒకరోజు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్‌కి వర్క్ ఇవ్వడం మానేస్తారు! వర్క్‌ల ప్రారంభోత్సవాలు ఏవైనా ఉంటే అక్కడికి పిలవడం మానేస్తారు. వర్క్ ఎందుకు ఇవ్వందీ చెప్పరు. వర్క్‌ల ప్రారంభోత్సవాలకు ఎందుకు పిలవందీ చెప్పరు. రాహుల్‌కి చెప్పుకుందామని ఢిల్లీ వెళితే, అప్పటికే అక్కడ వేరే స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు తన సమస్యను చెప్పుకోడానికి ప్రయత్నిస్తూ కనిపిస్తారు! ‘‘మా దగ్గరికి వచ్చేయొచ్చు కదా.. కాంగ్రెస్‌లోనే ఉండి నీ టైమ్ వేస్ట్ చేసుకోవడం ఎందుకు.. డిసెంబర్లో ఎన్నికలు పెట్టుకుని..’’ అన్నారు గోపాల్ ఇతాలియా. ‘ఆప్’కి గుజరాత్ స్టేట్ చీఫ్ అతడు. ‘‘మీ పేరు గోపాల్ ఇతాలియానే అయినా నాకు మిమ్మల్ని నరేశ్ పతేలియా అని పిలవాలనిపిస్తోంది..’’ అన్నాను. ‘‘నరేశ్ పతేలియానా!! నరేశ్ పటేల్ కదా ఆయన?!’’ అన్నారు ఇతాలియా. ‘‘అవును నరేశ్ పటేలే! అతణ్ణి లోపలికి తీసుకోడానికి నన్ను బయటికి పంపాలనో, నన్ను బయటికి పంపడానికి అతణ్ణి లోపలికి తీసుకోవాలనో ప్లాన్ చేస్తున్నారు మా వాళ్లు. నేనిప్పుడు మీతో వచ్చేస్తే.. లోపలికి రావడానికి పటేల్‌కి, లోపలికి తీసుకోడానికి మా పార్టీకి మీరు హెల్ప్ చేసినవాళ్లవుతారు. అప్పుడు మీరు నాకెప్పటికీ పతేలియాలా గుర్తుండిపోతారు తప్ప ఇతాలియాలా కాదు..’’ అన్నాను. ‘‘మీ పార్టీకో, నరేశ్ పటేల్కో దారి క్లియర్ చేయడానికి నేనెందుకు నిన్ను రమ్మని అడుగుతాను హార్దిక్? కేజ్రీవాల్ నిన్ను అడుగుతున్నారు. ‘ఆప్’లోకి వచ్చేయ్. ఫీల్ ద లీడర్షిప్..’’ అన్నారు ఇతాలియా. ‘‘నేను రాలేను. మా నాన్నగారి పేరు భరత్. నా చిన్నప్పట్నుంచే ఆయన కాంగ్రెస్ కార్యకర్త’’ అన్నాను. ‘‘లైఫ్‌లో ఇలాంటివి ఉంటూనే ఉంటాయి హార్దిక్. మనకూ ఒక లైఫ్ ఉంటుంది కదా. రేపు నువ్వూ.. నీ కొడుకునో, కూతుర్నో ‘మా తాతగారు భరత్. మా నాన్నగారి చిన్నప్పట్నుంచే మా తాతగారు కాంగ్రెస్ కార్యకర్త’ అనే చెప్పుకోనిస్తావా? మన గురించి చెప్పుకోడానికి ఏమీ లేనప్పుడే మన పిల్లలు వాళ్ల తాతగారి గురించి, ముత్తాతగారి గురించి చెప్పుకుంటారు. ఇంకేం ఆలోచించకు వచ్చేయ్..’’ అన్నారు ఇతాలియా. ఇతాలియా వెళ్లాక చూసుకుంటే ఫోన్లో మెసేజ్! ‘ఒకసారి పార్టీ ఆఫీస్‌కి వచ్చి వెళ్లడం కుదురుతుందా హార్దిక్..’ అని జగదీశ్ థాకర్. గుజరాత్‌కి నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే జగదీశ్ థాకర్ ప్రెసిడెంట్. ‘‘పార్టీ గురించి బయట నువ్వేదో బ్యాడ్‌గా మాట్లాడుతున్నావట?!’’ అన్నారు థాకర్.. పార్టీ ఆఫీస్‌కి నేను వెళ్లీవెళ్లగానే. ‘‘బ్యాడ్‌గా ఏమీ మాట్లాడలేదు, బ్యాడ్‌గా ఫీల్ అవుతూ మాట్లాడి ఉంటాను’’ అన్నాను. థాకర్ పక్కనే రఘుశర్మ కూర్చొని ఉన్నారు. రఘుశర్మ పక్కన మనీష్ దోషి ఉన్నారు. శర్మ స్టేట్ ఇన్చార్జ్. మనీష్ స్టేట్ అధికార ప్రతినిధి. ‘‘హార్దిక్.. ఒకమాట. ఇంతప్పుడు నిన్ను పార్టీలోకి తెచ్చి, అంతలోనే కాంగ్రెస్ నిన్ను వర్కింగ్ ప్రెసిడెంట్‌ని చేసిందంటే.. అది నీకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కాదా? గుడ్ని వదిలేసి, బ్యాడ్‌ని పట్టుకుంటావేంటి?’’ అన్నారు శర్మ. ‘‘2017లో నన్ను తెచ్చారు. 2022లో నా మీదకు నరేశ్ పటేల్‌ను తెస్తున్నారు. 2027లో నరేశ్ పటేల్ మీదకు మరొక పటేల్‌ని తెస్తారు. ఇది నాకు గుడ్ అనిపించలేదు..’’ అన్నాను. ‘‘సరే, ‘ఆప్’లోకి ఎప్పుడు వెళ్తున్నావ్?’’ అన్నారు థాకర్ సడన్‌గా! ఆయన అలా అంటున్నప్పుడు పార్టీలోని విలక్షణత ఆయన ముఖంలో ప్రతిఫలించింది. ‘‘అవును.. ఎప్పుడు?’’ అన్నారు శర్మ, దోషి వెంటవెంటనే! నన్ను రప్పించుకోడానికి కేజ్రీవాల్ పడని తొందర కంటే, నన్ను పంపించడానికి కాంగ్రెస్ పడుతున్న తొందరే ఎక్కువగా కనిపిస్తోంది!! -
నిర్మలా సీతారామన్ (ఆర్థికమంత్రి) రాయని డైరీ
పంజాబ్‌లో ఇవాళ పోలింగ్. పంజాబ్‌తో పాటు యూపీలోనూ అతి ముఖ్యమైన మూడో విడత పోలింగ్ ఉన్నప్పటికీ.. పోలింగ్‌కి సరిగ్గా రెండు రోజుల ముందు భారత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తను హర్ట్ అయ్యానంటూ పంజాబ్ ప్రజలను ఉద్దేశించి, ఇంటి నుంచే హఠాత్తుగా ఒక వీడియో విడుదల చేయడంతో యూపీ అన్నది ఎన్నికల్లో ముఖ్యం, ప్రాముఖ్యం కాకుండా పోయింది! మన్మోహన్సింగ్ భారతదేశ తొలి సిక్కు ప్రధాని. పంజాబ్ ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఆ మాత్రం హర్ట్ అయ్యే అవసరం ఆయనకు ఉంటుంది. పంజాబ్‌ని, పంజాబ్ రైతుల్ని నరేంద్ర మోదీ అవమానించడం పంజాబీ అయిన తన హృదయాన్ని లోతుగా గాయపరిచిందని మన్మోహన్ ఆవేదన! లోతుగా మనసు గాయపడినవాళ్లు మౌనంగా ఉండిపోతారు. అసలు ఉండటమే ఎప్పుడూ లోతైన మౌనంతో ఉండే మన్మోహన్సింగ్ గాయపడటం వల్ల కొత్తగా మౌనం వహించడానికి లోపల చోటు లేకనో ఏమో బయటికి రెండు మాటలు అనేశారు! ‘ఫేక్ నేషనలిజం’ అన్నారు. ‘ఫెయిల్డ్ ఎకానమీ’ అన్నారు. నాలుగేళ్లు చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌గా, మూడేళ్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నరుగా, రెండేళ్లు ప్లానింగ్ కమిషన్ చైర్మన్‌గా, ఐదేళ్లు ఆర్థికమంత్రిగా, పదేళ్లు ప్రధానమంత్రిగా పని చేసిన ఎనభై తొమ్మిదేళ్ల నాయకుడు ‘ఫేక్’, అని, ‘ఫెయిల్’ అనీ ఎలా అంత తేలిగ్గా అనేయగలరు?! ‘మాకు ఓట్లు వెయ్యండి’ అని ఒక మాజీ ప్రధాని అడిగే విధానం ఇదే కనుకైతే.. ‘వాళ్లకు ఓట్లు వేయకండి’ అని ప్రస్తుత ప్రధాని చెప్పే విధానానికీ ఆయన సిద్ధపడేగా ఉండాలి. నెహ్రూజీని మోదీజీ విమర్శిస్తుంటే సహించలేకపోతున్న మన్మోహన్.. తను మోదీజీని విమర్శిస్తుంటే అంతా సహిస్తూ కూర్చోవాలని ఎలా ఆశిస్తారు?! దేశానికి నెహ్రూ తొలి ప్రధాని కావచ్చు. దేశాన్ని దేశంలా నడిపిస్తున్న తొలి ప్రధాని మాత్రం మోదీజీనే. మోదీజీ ఆలింగనాలు చేసుకుంటారు, ఉయ్యాలలూగుతారు, బిర్యానీలు తింటారు.. ఇవా మోదీజీపై ఆయన చేసే విమర్శలు!! దేశాధినేతల్ని మోదీజీ ఆలింగనం చేసుకుంటే, జిన్‌పింగ్‌తో కలిసి ఉయ్యాలలూగితే, నవాజ్ షరీఫ్‌తో కలిసి బిర్యానీ తింటే అది ఫేక్ నేషనలిజం ఎలా అవుతుంది? ఆర్థిక అభివృద్ధి సూచీలు ఆకాశం వైపు సాగుతుంటే అది ఫెయిల్డ్ ఎకానమీ ఎలా అవుతుంది? ఎకానమీ ఫెయిల్ అవడం అంటే నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ని నడపడం కోసం ఆ సంస్థ అధినేత చిత్రా రామకృష్ణ హిమాలయాల్లోని ఒక అజ్ఞాత యోగీశ్వరుడిని సంప్రదించడం. దేశంలో వరుసగా ఇరవై రెండు నెలల పాటు ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్‌లోనే ఉండిపోవడం. దేశం నుంచి పెట్టుబడులు పక్షుల్లా ఎగిరిపోవడం. బలహీనమైన ఐదు దేశాల ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ అపఖ్యాతి పాలవడం. ఇవన్నీ మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉండగా జరిగినవే. ఇక ఫేక్ నేషనలిజం అంటే.. పోలింగ్‌కి కొన్ని గంటల ముందు మాత్రమే మన్మోహన్‌సింగ్‌కు పంజాబ్ గుర్తుకురావడం. తను పంజాబీనని గుర్తు చేసుకోవడం! పెద్దరికాన్ని కూడా పక్కనపెట్టి కాంగ్రెస్ ఆశించినట్లు, కాంగ్రెస్ ఆదేశించినట్లు ఆయన చిన్న మాటలు మాట్లాడుతున్నారనిపిస్తోంది.మన్మోహన్జీ అంటే కాంగ్రెస్‌లో రెస్పెక్ట్ లేకపోవచ్చు. బీజేపీలో రెస్పెక్ట్ ఉంది. దేశానికి తొలి మహిళా ఆర్థికమంత్రిగా నా తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు బ్లెస్సింగ్స్ కోసం ఆయన ఇంటిని వెతుక్కుంటూ వెళ్లాను. అంతకుక్రితమే ఆయన రాజ్యసభ టర్మ్ అయిపోయింది కనుక బడ్జెట్ రోజు సభలో ఆయన ఉండరు. అందుకనే ఇంటికి వెళ్లి కలిశాను. రెండు నెలల తర్వాత కొత్త టర్మ్‌లో మళ్లీ ఆయన రాజ్యసభకు వచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో మన్మోహన్జీ ఉంటే సభకు వచ్చే నిండుదనమే వేరు. కాంగ్రెస్‌లో ఆ నిండుతనం ఆయనకు ఎక్కడిది? -
ఎం.కె.స్టాలిన్ (తమిళనాడు సీఎం)రాయని డైరీ
చదవాలన్న ఆశ బలంగా ఉన్నప్పుడు.. చదవలేక పోతామేమోనన్న భయమూ ఆ వెనకే ఆశను బలహీనపరుస్తూ ఉంటుంది. తమిళనాడు పిల్లలకు మెడిసిన్ పెద్ద ఆశ. కానీ భయం! ‘నీట్’లో పోటీ కి వచ్చే పెద్ద నగరాల పిల్లల్ని తట్టుకోగలమా? మేలురకపు ఇంగ్లిషును సులువుగా, మెలకువలతో మాట్లాడగలిగిన వాళ్లను నెగ్గుకువెళ్లగలమా? ఖరీదైన కోచింగ్ సెంటర్లలో తర్ఫీదై వచ్చినవాళ్లకు దీటుగా నిలవగలమా? ఇంట్లో ఏ గొడవా లేక ఏకధ్యానంతో స్థిమితంగా కూర్చొని టెస్ట్‌కి చక్కగా ప్రిపేర్ అయి వచ్చినవాళ్లతో తలపడగలమా? ఇన్ని భయాలు! నీట్.. ప్రభుత్వం పెట్టిన భయం. ఊహు.. భయం కాదు. ప్రభుత్వం సృష్టించిన భూతం! ఎవరి రాష్ట్రంలో వాళ్లు కష్టపడి చదివి వాళ్ల టెస్ట్‌లు వాళ్లు రాసుకుంటూ ఉన్నప్పుడు.. ‘అంతకష్టం ఎందుకు?! ఇక నుంచీ దేశం మొత్తానికి ఒకటే టెస్ట్’ అంటూ నీట్ పరీక్షను తెచ్చిపెట్టారు! దేశం మొత్తం ఒకేలా ఉందా.. దేశం మొత్తం పెన్ను, పేపరు పట్టుకుని కూర్చొని ఒకే టెస్టు రాయడానికి?! భయంతోనైనా, భూతంతోనైనా పోరాడేందుకు శక్తి కావాలి. సామాన్యమైన ఇళ్లల్లో, అసమానతల సమాజాల్లో, అనుకూలతలు లేని గ్రామాల్లో.. పోరాడేంత శక్తి పిల్లలకు ఎక్కడి నుంచి వస్తుంది?! గురువారం అసెంబ్లీకి వెళుతున్నప్పుడు టీటీకే రోడ్డులో ఒక యువకుడు ‘సిఎం సర్ ప్లీజ్ హెల్ప్ మీ’ అనే ప్లకార్డు పట్టుకుని కాన్వాయ్కి ఎదురొచ్చాడు! నీట్ ఎగ్జామ్‌ని అపోజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాడట. నీట్ వద్దన్న మిగతా స్టేట్లకు కూడా నీట్ లేకుండా చెయ్యమని అతడి అభ్యర్థన. అసెంబ్లీ ప్రాంగణంలోకి కారు మలుపు తిరుగుతుండగా, ఆ ముందురోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఇచ్చిన 45 నిముషాల ప్రసంగంలోని రెండు మాటలు మళ్లొకసారి నా హృదయాన్ని మృదువుగా తాకాయి. ఆయనెంత అర్థవంతంగా మాట్లాడారు! ‘ఉత్తరప్రదేశ్‌లోని నా సోదరునికి రాజ్యాంగం ఎలాంటి హక్కులనైతే కల్పించిందో అవే హక్కులను తమిళనాడులోని నా సోదరుడికీ ప్రసాదించింది. ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేకమైన సంస్కృతి ఉంటుంది. ప్రత్యేకమైన రాజకీయ ఆత్మాభిమానం ఉంటుంది. వాటిని గౌరవించకుండా ఏకఛత్రాధిపత్యంగా దేశాన్ని పరిపాలించడానికి మీరేమీ చక్రవర్తి కాదు’ అని మోదీకి ఎంత మర్యాదగా పాఠాలు చెప్పారు! కారు దిగి, అసెంబ్లీ వరండాలో నడుస్తున్నాను. స్పీకర్ ఎదురొచ్చి, నీట్ బిల్లును గవర్నర్ తిప్పి పంపించారని చెప్పారు! నీట్ పరీక్ష నుంచి తమిళనాడును మినహాయించమని కోరుతూ ఐదు నెలల క్రితం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన బిల్లు అది. ఏ కారణాలైతే చూపి తమిళనాడు నీట్‌ని వద్దందో.. అవే కారణాలు చూపి నీట్‌ని వద్దనడానికి వీల్లేదనేశారట గవర్నర్ గారు. నీట్‌ని ‘యాంటీ–పూర్’ అని మేము అంటే.. నీట్‌ని వద్దనడం ‘యాంటీ–పూర్’ అని గవర్నర్! మోదీకి ఏమాత్రం తీసిపోవడం లేదు గవర్నర్లు. మోదీ తనని తాను చక్రవర్తినని అనుకుంటుంటే, గవర్నర్లు తమని తాము మోదీలమని అనుకుంటున్నారు. ఆరోజు అన్నాదురై వర్ధంతి. సభలో నివాళులు అర్పించి కూర్చున్నాం. ‘ఆడుక్కు దాడియం, నాటుక్కు గవర్నురు తేవై ఇల్లయ్’ అని అన్నాదురై తరచూ అంటుండేవారని నాన్నగారు నా చిన్నప్పుడు చెబుతుండేవారు. ఆ మాట నాకు బాగా నవ్వు తెప్పించేది. మేకకు గడ్డం, రాష్ట్రానికి గవర్నర్ అక్కర్లేదని అన్నాదురై అలా బలంగా విశ్వసిస్తుండేవారట! గవర్నర్లపై ముఖ్యమంత్రులకు విశ్వాసాలు ఊరకే ఏర్పడతాయా?! విశ్వాసాలను ఏర్పరచడమే పనిగా కొంతమంది గవర్నర్లు రాష్ట్రాలకు బదలీ అయి వస్తారనుకుంటాను. శనివారం నీట్‌పై సెక్రటేరియట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే బీజేపీ, అన్నాడిఎంకె రాలేదు. నీట్ పరీక్ష రాసే పని మనకైతే లేదుగా అనుకున్నట్లున్నారు!! -
రాయని డైరీ.. జైరామ్ రమేశ్ (కాంగ్రెస్ ఎంపీ)
మేడమ్ సోనియాజీ స్క్రీన్ మీదకు వచ్చాక వీడియో కాన్ఫరెన్సింగ్ మొదలైంది. మేడమ్ రాగానే మాలో కొందరం లేచి, కూర్చున్నాం. మాలోనే మరికొందరు లేచే లోపే, కూర్చోమన్నట్లుగా మేడమ్ వారించడంతో వాళ్లెవరూ లేచి కూర్చోలేకపోయారు. ఆంటోనీ, వేణుగోపాల్, మల్లికార్జున్ ఖర్గే, అధీర్ రంజన్, ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, కె.సురేశ్, మాణిక్యం టాగోర్, మనీశ్ తివారీ, నేను.. మొత్తం పది మందితో మేడమ్ ఏర్పాటు చేసిన ప్రీ–బడ్జెట్ మీటింగ్ అది. మేడమ్ స్క్రీన్ మీదకు రావడంతోనే.. ‘‘జయ్! మీరేం చెప్పబోతున్నారు?’’ అన్నారు.. నా వైపు చూస్తూ! ఆ మాటకు ఆంటోనీ నవ్వారు. సాధారణంగా మా ప్రీ–బడ్జెట్ మీటింగ్‌ని.. ‘వెల్కమ్ టు స్ట్రాటెజీ గ్రూప్’ అనే మాటతో మొదలుపెడతారు మేడమ్. కానీ ఈసారి అలా జరగలేదు. మీటింగ్‌ని నాతో స్టార్ట్ చేశారు! ‘‘ఎంత ఎకానమిస్ట్ అయితే మాత్రం బడ్జెట్ గురించి జైరామ్‌జీ కొత్తగా ఏమైనా చెప్పబోవ డానికి నిర్మలా సీతారామన్ అవకాశం ఇవ్వబోతారంటారా!’’ అన్నారు ఆంటోనీ. లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎలాగైతే ఉండాల్సిన విధంగా లేదో, ఈ ఇయర్ కూడా అలానే ఉంటుందని నేను చెప్పగలను..’’ అన్నారు ఆనంద్ శర్మ. ‘‘మనం మాత్రం అలా ఉండకూడదు. లాస్ట్ ఇయర్ బడ్జెట్ సెషన్స్‌లో ఎంత గట్టిగా డిబేట్ చేయబోయామో అంతకన్నా గట్టిగానే చెయ్యాలి..’’ అన్నారు మల్లికార్జున్ ఖర్గే. ‘‘ఇష్యూస్ అవే కనుక.. సేమ్ రిలీఫ్ ప్యాకేజ్, సేమ్ డిజిన్వెస్ట్‌మెంట్, సేమ్ ఇన్ఫ్లేషన్, సేమ్ చైనా బోర్డర్, సేమ్ ఫార్మర్స్.. మనం కొత్తగా స్ట్రాటెజీ మార్చే పని కూడా లేదు’’ అన్నారు మనీశ్ తివారీ. ‘‘స్ట్రాటెజీలో ఒకటైతే యాడ్ చేయొచ్చు. ప్రతిపక్షంలోని వాళ్లకు ‘పద్మ’ అవార్డులిచ్చి అంతర్గత విభేదాలు సృష్టించాలని చూసే పాలకపక్ష కుట్రల్ని, కుయుక్తుల్ని బట్టబయలు చెయ్యొచ్చు’’ అన్నారు మాణిక్యం. అవునన్నట్లు మాణిక్యం వైపు చూసి, నా వైపు తిరిగారు మేడమ్. ‘‘జయ్! మీ ట్వీట్ చూశాను. సెవన్టీ త్రీలో ప్రభుత్వం పద్మవిభూషణ్‌ని ఆఫర్ చేస్తే అప్పటి పి.ఎం. ప్రిన్సిపల్ సెక్రెటరీ పి.ఎన్.హస్కర్ ఎంత మర్యాదపూర్వకంగా నిరాకరించిందీ మీరు ట్వీట్లో పోస్ట్ చేసిన పుస్తక భాగాన్ని చదివాను. అంతగా విలువల్ని పాటించే మనిషిని ఈకాలంలో అరుదుగా మాత్రమే చూస్తాం..’’ అన్నారు. ‘‘అవును మేడమ్‌జీ! అవార్డుల్ని నిరాకరించేందుకు ఆత్మబలం, ఆత్మనిగ్రహం కావాలి’’ అన్నాను. ‘‘కానీ జైరామ్‌జీ, మీరు పెట్టిన మరొక ట్వీట్లో మీ ఉద్దేశాన్ని మన సీనియర్ సహచరులు కరణ్‌సింగ్ సరిగా అర్థం చేసుకోలేకపోవడాన్ని నేనెంతో ఆవేదనతో గమనించాను. మోదీజీ ఇచ్చిన ‘పద్మభూషణ్’ని తిరస్కరించినందుకు మీరు బుద్ధదేవ్ భట్టాచార్యజీని ప్రశంసించారు. కానీ ఆ ప్రశంసను కరణ్‌సింగ్.. పద్మభూషణ్‌ని నిరాక రించని గులామ్ నబీ ఆజాద్‌పై ఎత్తిపొడుపుగా తీసుకున్నారు’’ అన్నారు అధీర్ రంజన్. ‘‘కరణ్‌సింగ్ అలా ఎప్పుడు ట్వీట్ చేశారు?!’’ అన్నారు గొగోయ్. ‘‘ట్వీట్ చేయలేదు. స్టేట్మెంట్ విడుదల చేశారు’’ అన్నారు సోనియాజీ! ఆజాద్ తన ‘పద్మ’ అవార్డును నిరాకరించని పర్యవసాన పరిణామాలను మేడమ్ ఆసక్తిగా గమనిస్తున్నట్లున్నారు! మేడమ్‌తో వీడియో కాన్ఫరెన్సింగ్ అయ్యాక మా పది మందిలో ఒకరితో నేను వేరుగా కనెక్ట్ అయ్యాను. ‘‘ఆత్మబలం కాదు, ఆత్మ నిగ్రహం కాదు. అవార్డును నిరాకరించడానికి ఆత్మప్రబోధానుసారం వెళ్లగలిగి ఉండాలి. దురదృష్టవశాత్తూ మన పార్టీలోని సీనియర్లు తమ ఆత్మ ఢిల్లీలో ఉంటుందన్న వాస్తవాన్ని విస్మరించేందుకు నిరంతరం పెనుగు లాడుతూనే ఉంటారు..’’ అన్నారాయన. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. హరీశ్ రావత్ (73), కాంగ్రెస్
వికలమైన మనసుతో బుధవారం నేను భగవాన్ కేదార్‌నాథ్‌కి ట్వీట్ పెడితే గురువారం ఆ భగవానుడే చెప్పి చేయించినట్లుగా ప్రియాంకా గాంధీ నాకు ఫోన్ చేశారు! ‘‘నమస్తే రావత్జీ! రేపు ఢిల్లీ వచ్చి రాహుల్జీని కలవండి’’ అని చెప్పి, ఫోన్ పెట్టేశారు ప్రియాంక!! రాహుల్‌ని ‘రాహుల్జీ’ని చెయ్యడానికి దేశవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ, రావత్‌జీని ‘రావత్’గా చేయడానికి డెహ్రాడూన్‌లో జరుగుతున్న ప్రయత్నాలను ఢిల్లీలో ఎవరూ గమనిస్తున్నట్లు లేరు. ‘‘దేవేంద్ర యాదవ్ నన్ను లెక్కచేయడం లేదు రాహుల్జీ. అందుకే ఆ కేదారేశ్వరుడికి మొర పెట్టుకున్నాను. కొత్త సంవత్సరంలో నాకో దారి చూపించమని, లేదంటే కాస్త విశ్రాంతిని ప్రసాదించమని ఆయన్ని వేడుకున్నాను..’’ అని శుక్రవారం ఢిల్లీ వెళ్లీ వెళ్లగానే రాహుల్‌తో చెప్పేశాను. ‘‘రావత్జీ! మీరలా వికలమైన మనసుతో మీ ఇష్టదైవానికి ట్వీట్ చేయడం నన్ను, మమ్మీని, ప్రియాంకను ఎంతో బాధించింది. మీ ట్వీట్‌ను కేదారేశ్వరుడొక్కడే చూడడు కదా! నరేంద్ర మోదీజీ చూస్తారు. మమతాజీ చూస్తారు. అమరీందర్‌సింగ్ కూడా చూస్తారు. ట్వీట్ చేసే ముందు ఒక్క క్షణం ఆలోచించలేకపోయారా?’’ అన్నాడు రాహుల్. ‘‘క్షణికావేదనలో అలా చేసేశాను రాహుల్జీ. కానీ దేవేంద్ర యాదవ్ అన్నీ తనే అని చెప్పుకుని తిరుగుతున్నాడు. తిరగనివ్వండి. ‘రావత్‌కి అంత శక్తి లేదు’ అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మీరు చెప్పండి రాహుల్జీ. రెండుసార్లు ఉత్తరాఖండ్‌కి సీఎంని అయిన నాకే అంత శక్తి లేకుంటే.. ఎక్కడి నుంచో ఉత్తరాఖండ్ ఇన్ఛార్జిగా వచ్చిన దేవేంద్ర యాదవ్‌కి ఉంటుందా?!’’ అని అడిగేశాను. ‘‘దేవేంద్ర యాదవ్ ఎక్కడి నుంచో రాలేదు రావత్జీ. ఢిల్లీ నుంచే వచ్చాడు’’ అన్నాడు రాహుల్. ‘‘సంతోషం రాహుల్జీ! ఢిల్లీ నుంచి ఎవరొచ్చినా సంతోషమే. అందుకే కదా.. డెహ్రాడూన్‌కి మొన్న మీరు వచ్చినప్పుడు కూడా నేనెంతో సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషంలో.. డయాస్ మీద మీతో పాటు ఎవరెవరు ఉండాలో నిర్ణయించవలసింది నేను కదా, దేవేంద్ర యాదవ్ నిర్ణయించేశాడేమిటి అనే ఆలోచన కూడా నాకు రాలేదు!’’ అన్నాను. రాహుల్ అలా వింటూ ఉండిపోయాడు. వినడం వరకేనని నిర్ణయించుకున్నాకే నన్ను ఢిల్లీ పిలిపించినట్లున్నాడు! ‘‘రాహుల్జీ, మీరు మా ఇద్దర్నీ కలిసి పని చెయ్యమన్నారు. దేవేంద్ర యాదవ్ తనొక్కడే చాలనుకుంటున్నాడు. ‘పేరుకే స్టేట్ ఇన్ఛార్జ్. స్టేట్‌లో ఛార్జ్ మొత్తం నాదే’ అని ప్రచారం చేసుకుంటున్నాడు. సీఎం క్యాండిడేట్ని ముందే ప్రకటిస్తే తప్ప అతడు, నేను కలిసి పనిచేసే పరిస్థితి లేదు రాహుల్జీ’’ అన్నాను. ‘‘పరిస్థితా? ప్రసక్తా రావత్జీ’’ అన్నాడు రాహుల్! అంత లోతుగా అతడు ఆలోచించగలడని నేను అనుకోలేదు. ‘‘రావత్జీ! 2017లో అమరీందర్ సింగ్‌ని తప్ప, ఆ తర్వాత ఎవర్నీ మనం సీఎం క్యాండిడేట్‌గా ఎన్నికలకు ముందే ప్రకటించలేదు. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్.. ఎన్నికలు అయ్యాకే సీఎంగా ఎంపికయ్యారు. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ పేరు కూడా ఎన్నికలు అయ్యాకే సీఎంగా బయటికొచ్చింది. వాళ్లిద్దరూ ఈరోజుకీ సీఎంలుగా ఉన్నారు. ముందే సీఎంగా ప్రకటించి, సీఎంని చేసిన అమరీందర్ సింగ్ ఏమయ్యారో మీకు తెలిసిందే కదా’’ అన్నాడు రాహుల్! ఒక నమస్కారం పెట్టి, వచ్చేశాను. డెహ్రాడూన్‌లో అడుగుపెట్టగానే.. పంజాబ్ నుంచి అమరీందర్‌సింగ్ ఫోన్! ‘‘రావత్జీ! పంజాబ్ స్టేట్ ఇన్‌ఛార్జ్‌గా మీరు నాకు తవ్వారు. ఉత్తరాఖండ్ స్టేట్ ఇన్ఛార్జిగా దేవేంద్ర యాదవ్ ఇప్పుడు మీకు తవ్వుతున్నాడు. కాంగ్రెస్సే కోరి తవ్వకాలు జరిపించుకుంటున్నప్పుడు మీరెంత, నేనెంత, ఆ కేదారేశ్వరుడెంత చెప్పండి’’ అన్నారాయన! -
రాయని డైరీ: అమిత్ షా (కేంద్ర మంత్రి)
‘‘ఇండియాలో ఏంటి విశేషాలు అమిత్జీ..’’ అని రాత్రి పన్నెండు గంటలప్పుడు రోమ్ నుంచి మోదీజీ ఫోన్ చేశారు. రోమ్ కన్నా ఢిల్లీ మూడున్నర గంటలు ముందుంటుంది కాబట్టి, ఆయన నాకు ఫోన్ చేసిన టైమ్‌లో అక్కడ రాత్రి ఎనిమిదిన్నర అయుండాలి. మోదీజీ అప్పుడే డిన్నర్ ముగించుకుని నాలుగడుగులు వేయడానికి బాల్కనీలోకి వచ్చి ఫోన్ చేసినట్లున్నారు. ‘‘పెద్దగా విశేషాలేం లేవు మోదీజీ’’ అన్నాను.. బలమైన ఆవలింత నొకదాన్ని బలంగా నొక్కిపట్టేస్తూ. ‘‘పెద్దగా లేవంటే.. కొద్దిగా ఉన్నాయనేగా..’’ అని మోదీజీ తన కవితాత్మక ధోరణిలో అన్నారు. మామూలుగానైతే అది నేను కవితల్ని ఆస్వాదించే టైమ్ కాదు. డిన్నర్ ముగించుకుని బాల్కనీలో నేనూ నాలుగు అడుగులు వేసి అప్పటికే మూడున్నర గంటలు దాటింది కాబట్టి ఇక్కడి విశేషాలు కూడా ఏవీ వెంటనే గుర్తుకు రాలేదు. నిద్ర మత్తును వదిలించుకునేందుకు కొంత టైమ్, విశేషాలను బలవంతంగా గుర్తుకు తెచ్చుకోవడానికి మరికొంత టైమ్ తీసుకున్నాను. మొత్తం మీద ఐదు సెకన్ల టైమ్ తీసుకుని ఉంటాను. ‘‘చెప్పండి అమిత్జీ..’’ అన్నారు ఉత్సాహంగా. అక్కడ మోదీజీకి నిద్ర తన్నుకొచ్చేవరకు ఇక్కడ నేను విశేషాలను గుర్తుకు తెచ్చుకోడానికి తన్నుకులాడటం తప్పేలా లేదని అర్థమైంది. ‘‘కొన్ని విశేషాలైతే ఉన్నాయి మోదీజీ! రాజ్‌నాథ్‌సింగ్ మిమ్మల్ని ఇక్కడ ఒక సభలో 24 క్యారెట్ల బంగారం అన్నారు. అంతే కాదు. గాంధీజీ తర్వాత గాంధీజీ అంతటి వారని కూడా అన్నారు. లక్నో వెళ్లినప్పుడు నేను కూడా అదే మాట అన్నాను. 2024 లోనూ మోదీజీనే మనకు కావాలంటే కనుక 2022లోనూ యోగినే మనం ఎన్నుకోవాలి అని అక్కడి వారికి చెప్పి వచ్చాను’’ అన్నాను. ‘‘మన విశేషాలు మనకెందుకు అమిత్జీ! మనవాళ్ల విశేషాలేమైనా ఉంటే చెప్పండి’’ అన్నారు మోదీజీ. మనవాళ్లు అంటే ఆయన అర్థం వేరే. ‘‘ఉన్నాయి మోదీజీ! రాహుల్ గుజరాత్ వెళ్లి సూరత్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. ‘రెండేళ్ల క్రితం.. మోదీ అనే పేరున్న వాళ్లంతా దొంగలే అని మీరు అన్నారా?’ అని రాహుల్‌ని జడ్జి అడిగితే.. నేనెప్పుడన్నాను, నేనెందుకంటాను అని అనకుండా.. ‘నాకు తెలియదు’ అని చెప్పి వచ్చేశాడు. రాహుల్ సూరత్ కోర్టులో అలా చెప్పి వచ్చేయడం ఇది మూడోసారి మోదీజీ’’ అని చెప్పాను. ‘‘ఇంకా..’’ అన్నారు. ‘‘మమతా బెనర్జీ పణాజి వెళ్లారు మోదీజీ’’ అని చెప్పాను. ‘‘వెళ్లి?’’ అన్నారు. ‘‘టీఎంసీ అంటే తృణమూల్ కాంగ్రెస్ కాదు.. టి అంటే టెంపుల్, ఎం అంటే మసీద్, సి అంటే చర్చి అని అంటున్నారు మోదీజీ..’’ అని చెప్పాను. ‘‘ఇంకా..’’ అన్నారు! ‘‘లాలూ ప్రసాద్ యాదవ్ గురించి కూడా ఒక విషయం ఉంది మోదీజీ. అయితే అది విషయమే కానీ విశేషం ఏమీ కాదు..’’ అన్నాను. ‘‘అయినా చెప్పండి’’ అన్నారు. ‘‘2024లో మీరు వచ్చే ప్రసక్తే లేదట. పార్టీలన్నీ ఏకమై, మిమ్మల్ని ఓడిస్తాయని లాలూ అంటున్నారు మోదీజీ’’ అని చెప్పాను. ‘‘అవునా’’ అన్నారు. ‘మరి అక్కడి విశేషాలేంటి మోదీజీ’ అని అడగబోయి ఆగాను. అప్పటికే ఒంటి గంట అవుతోంది. ‘‘ఇక్కడా విషయాలున్నాయి అమిత్ జీ. ఓ గంటలో మళ్లీ ఫోన్ చేస్తాను.. మీ డిన్నర్ అయింది కదా?’’.. అని ఫోన్ మాట్లాడుతూనే ఎవరితోనో మాటల్లోకి వెళ్లిపోయారు!! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: శశి థరూర్ (కాంగ్రెస్ ఎంపీ)
రాత్రి కలలోకి మన్మోహన్ సింగ్, చిదంబరం, అరుణ్ శౌరి వచ్చారు! ముగ్గురూ కలిసే కలలోకి వచ్చారా, కలలోకి వచ్చాకే ముగ్గురూ కలిశారా గుర్తుకు రావడం లేదు. ‘‘డెంగీ నుంచి ఎప్పుడు కోలుకున్నారు మన్మోహన్ జీ’’ అని అడిగినట్లున్నాను. అందుకు ఆయన.. ‘‘ఢిల్లీ నుంచి ఎప్పుడొచ్చారు మన్మోహన్జీ అని అడిగినట్లుగా అడుగుతున్నావేంటి థరూర్..’’ అని మృదువుగా నవ్వుతూ అన్నారు! ఎనభై తొమ్మిదేళ్ల వయసులోని ఒక మాజీ ప్రధానిని ఎంపిక చేసుకుని మరీ ఆ డెంగీ దోమ కుట్టడం వెనుక ఉండగల సంభావ్యతల గురించి కలలోనే నేను ఆలోచిస్తూ ఉన్నాను. ‘‘ఏమిటి ఆలోచిస్తున్నావు థరూర్?’’ అని అడిగారు మన్మోహన్! ఆ అడగడం కూడా ఆయన నా కలలోకి వచ్చి అడిగినట్లుగా కాకుండా, నేను ఆయన కలలోకి వెళితే అడిగినట్లుగా అడిగారు. ‘‘ఏం లేదు మన్మోహన్ జీ. కబురు పంపితే నేనే ఢిల్లీ వచ్చేవాడిని కదా.. మీరు తిరువనంతపురం వరకు రావడం ఎందుకు అని ఆలోచిస్తున్నాను’’ అని చెప్పాను. ‘‘నువ్వు అంత టైమ్ ఇస్తే కదా థరూర్’’ అన్నారు మన్మోహన్ భారంగా. ‘‘ఎంత టైమ్ మన్మోహన్ జీ’’ అన్నాను ‘‘కబురు పంపేంత టైమ్’’ అన్నారు మన్మోహన్. ‘‘అవునవును. కబురు పంపే టైమ్ కూడా ఇవ్వలేదు మీరు..’’ అని చిదంబరం గొంతు కలిపారు. అరుణ్ శౌరి కలపలేదు. గొంతూ కలపలేదు, మాటా కలపలేదు. మన్మోహన్ కాంగ్రెస్. చిదంబరం కాంగ్రెస్, నేను కాంగ్రెస్. అరుణ్ శౌరి ఒక్కరే బీజేపీ. ‘‘ఇప్పుడు నువ్వే పార్టీలో ఉన్నావని అనుకుంటున్నావు థరూర్?’’ అని అడిగారు మన్మోహన్!! ‘‘ఇప్పుడు మీరే పార్టీలో ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారు థరూర్’’ అని చిదంబరం అడిగారు!! ‘‘ఇప్పుడు మీరే పార్టీలో ఉన్నారో గుర్తు చేసే టైమ్‌ని కూడా మీరు మాకు ఇవ్వలేదు థరూర్’ అని అరుణ్ శౌరి అన్నారు!! ‘‘ఆ ట్వీట్ ఏంటి థరూర్! కాంగ్రెస్ పార్టీనే వంద కోట్ల వ్యాక్సిన్లు వేయించినంత గొప్పగా ట్వీట్ చేశావు! ‘ఇది భారతీయులకు గర్వకారణం’ అంటావు! ‘క్రెడిట్ అంతా గవర్నమెంటుదే’ అంటావు. దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందనుకుంటున్నావా ఏంటి?’’ అన్నారు మన్మోహన్. ‘‘అందుకే థరూర్.. మీరెంత అందంగా ఉన్నా, మీకెంత ఇంగ్లిష్ వచ్చినా, మీరెన్ని పుస్తకాలు రాసినా, ఆఖరికి న్యూయార్క్‌లో ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రెటరీ జనరల్‌గా పని చేసి వచ్చినా.. కాంగ్రెస్ పార్టీలో సహాయ మంత్రిగా తప్ప మీరు ఏ టెర్మ్లోనూ పూర్తి స్థాయి మంత్రిగా లేరు’’ అన్నారు అరుణ్ శౌరీ!! ‘‘మళ్లీ ఎప్పుడైనా మోదీని అభినందిస్తూ ట్వీట్ ఇచ్చే ముందు మాక్కొద్దిగా టైమ్ ఇవ్వు థరూర్. మోదీని విమర్శిస్తూ నువ్వొక పుస్తకం రాసిన సంగతిని నీకు గుర్తు చేస్తాం..’’ అన్నారు మన్మోహన్. ‘‘అవును గుర్తు చేస్తాం..’’ అన్నట్లు చూశారు చిదంబరం, అరుణ్‌శౌరి. కల ఎగిరిపోయింది. మోదీని అభినందించడం ఏంటని అడిగేందుకు.. వస్తే రాహుల్ రావాలి. లేదంటే సోనియాజీ రావాలి. వాళ్లు రాకుండా వీళ్లు కలలోకి రావడం ఏంటి? అసలు ఈ ముగ్గురి కాంబినేషన్ కలకు అర్థం ఏమై ఉంటుంది? ‘కలలు–అర్థాలు’ పుస్తకం కోసం షెల్ఫ్ వెతుకుతున్నాను. వరుసల్లోంచి ‘ది ప్యారడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్’ చేతిలోకి వాలింది. మోదీని విమర్శిస్తూ నేను రాసిన పుస్తకం అదే. కలకు అర్థం, కాంబినేషన్‌కు లింకూ రెండూ దొరికాయి! మూడేళ్ల క్రితం.. వేదికపై ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది మన్మోహన్, చిదంబరం, అరుణ్ శౌరీలే! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: అశోక్ గెహ్లోత్ (రాజస్తాన్ సీఎం)
‘‘గురూ.. నేను కూడా ఢిల్లీ వెళ్లి ఒకసారి మోదీజీని కలిసొస్తే బాగుంటుందా..!’’ అని భూపేష్ బఘేల్ ఉదయాన్నే ఫోన్ చేశాడు. బఘేల్ నన్నెప్పుడూ ‘గురూ’ అన్నది లేదు. ఇప్పుడు అంటున్నాడు! గురూ అనే అవసరం లేకున్నా ఎవరైనా ఇంకొకర్ని ‘గురూ’ అన్నారంటే ఆ ఇంకొకరితో తమని ఈక్వల్ చేసుకుంటున్నారని. లేదంటే, ఆ ఇంకొకరిని తమకు ఈక్వల్ చేస్తున్నారని. ‘‘నేను బాగానే ఉన్నాను బఘేల్’’ అన్నాను. బఘేల్ ఒక్క క్షణం మాట్లాడలేదు. ‘‘అశోక్‌జీ.. నేను మిమ్మల్ని ‘గురూ’ అన్నందుకు మీరు చిన్నబుచ్చుకున్నట్లున్నారు. నేను కూడా మీలా ఒక రాష్ట్రానికి సీఎంని కనుక మీతో సమస్థాయినో, సమస్థానాన్నో ఆశించి మిమ్మల్ని ‘గురూ’ అనలేదు. ఇద్దరం కాంగ్రెస్ సీఎంలమే కనుక మిమ్మల్ని ‘గురూ’ అని చొరవగా అనగలిగాను’’ అన్నాడు. ‘‘మనిద్దరం కాంగ్రెస్ సీఎంలమే అయినప్పటికీ నేను బాగానే ఉన్నాను బఘేల్’’ అన్నాను నవ్వుతూ. కొంచెం తేలిక పడినట్లున్నాడు. ‘‘అందుకే మిమ్మల్ని గురూ అన్నాను అశోక్‌జీ. నేను కూడా మీలా బాగున్న ఒక కాంగ్రెస్ సీఎంగా ఉండాలని ఆశ పడుతున్నాను..’’ అన్నాడు బఘేల్. ఆ మాటతో అతడిలో నాకు గురుస్వరూపం గోచరించింది! అలాగని అతడిని నేను గురూ అంటే అతడింకేదో స్వరూపాన్ని నాకు చూపించవచ్చు. కాంగ్రెస్‌లో స్వరూపాలను ఊహించలేం. సాక్షాత్కారం జరిగినప్పుడు చూసి ఆశ్చర్యపోవడమే. అందుకే, ‘‘చెప్పు బఘేల్’’ అని మాత్రం అన్నాను. ‘‘చెప్పడానికి కాదు అశోక్‌జీ, నేను కూడా ఢిల్లీ వెళ్లి ఒకసారి మోదీజీని కలిస్తే బాగుంటుందా అని అడగడానికి ఫోన్ చేశాను’’ అన్నాడు. కాంగ్రెస్‌కు ఉన్నదే ముగ్గురు సీఎంలు. రాజస్తాన్‌లో నేను, ఛత్తీస్‌గఢ్‌లో బఘేల్, పంజాబ్‌లో కొత్తగా వచ్చిన చరణ్‌జిత్ చన్నీ. కొత్తగా వచ్చాడు కాబట్టి చన్నీ కర్టెసీగా వెళ్లి మోదీజీని కలిసుంటాడు. చన్నీకైతే సాకుగా రైతు చట్టాల రద్దు డిమాండ్లు ఉన్నాయి. మరి బఘేల్‌కి ఏమున్నాయి? ‘‘ఇష్యూ ఏంటి బఘేల్..’’ అన్నాను. ‘‘ఇష్యూ కాకూడదనే అశోక్‌జీ’’ అన్నాడు! బఘేల్ మళ్లీ నాకు గురుస్వరూపాన్ని అనుగ్రహించాడు. ‘‘అశోక్‌జీ! కాంగ్రెస్‌లో సీఎం అనే ప్రతి రూపానికీ ఎప్పుడూ ఒక ప్రతిరూపం ఉంటుంది. పంజాబ్‌లో అమరీందర్ సింగ్‌కి నవజోత్ సింగ్ సిద్ధూ, రాజస్తాన్‌లో అశోక్ గెహ్లోత్ అనే మీకు సచిన్ పైలట్, ఛత్తీస్‌గఢ్‌లో భూపేశ్ బఘేల్ అనే నాకు టి.ఎస్. సింగ్ దేవ్ ఆ ప్రతిరూపాలు’’ అన్నాడు బఘేల్. బఘేల్ గురుస్వరూపం క్రమంగా ఎత్తుకు పెరుగుతోంది. ‘‘నేనైతే అమరీందర్ సింగ్‌ని కావాలనుకోవడం లేదు అశోక్‌జీ! అమరీందర్ కూడా ముందు నుంచే మోదీజీని కలుస్తూ ఉంటే ఇప్పుడు అమరీందర్ అయి ఉండేవారు కాదు. మొన్న చన్నీ కూడా అమరీందర్ కాకుండా ఉండేందుకే కదా మోదీజీని కలిశారు. మీకైతే మోదీజీని కలిసే అవసరమే రాలేదు. ఆయనే మిమ్మల్ని కలుపుకొన్నారు. ‘అడిగే సీఎంలు ఉంటే పెట్టే పీఎంలు ఉంటారు’ అని ఆయన మిమ్మల్ని పొగిడారు కాబట్టి మీరూ అమరీందర్ అయ్యే ప్రమాదం లేదు..’’ అంటున్నాడు బఘేల్! ‘‘మోదీజీకి టచ్‌లో ఉంటే కాంగ్రెస్ మనల్ని టచ్ చెయ్యదు అనుకోవడంలో లాజిక్ కనిపించడం లేదు బఘేల్..’’ అన్నాను. ‘‘నిజమే అశోక్‌జీ! లాజిక్ లేదు. లాజిక్‌తో అసలు మన పార్టీకి ఏం పనుంది కనుక?! రాహుల్ గాంధీ అధ్యక్షుడు కాకుండానే, అధ్యక్షుడిగా నిర్ణయాలన్నీ తీసుకోవడంలో మాత్రం లాజిక్ ఉందా?..’’ అన్నాడు అశోక్!! మళ్లొకసారి గురు సాక్షాత్కారం!! గురుబ్రహ్మ.. గురుర్విష్ణుః గురు బఘేల్!! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: నరేంద్ర మోదీ (ప్రధాని)
యు.ఎస్. నుంచి తిరుగు ప్రయాణం. సీటు బెల్టులింకా పెట్టుకోలేదు. నాతో పాటు జైశంకర్, శ్రింగ్లా, అజిత్ డోభాల్ ఉన్నారు. శ్రింగ్లా విదేశీ వ్యవహారాల కార్యదర్శి. అతడిని చూస్తుంటే ఎందుకో నాకు పన్నెండేళ్ల తర్వాత అతడు యోషిహిడేలా ఉంటాడేమో అనిపించి నవ్వొచ్చింది. యోషిహిడే జపాన్ ప్రధాని. శ్రింగ్లాకు అరవై. యోషిహిడేకు డెబ్బై రెండు. ‘‘ఏంట్సార్ నవ్వుతున్నారు?’’ అన్నాడు జైశంకర్. అతడు విదేశీ వ్యవహారాల మంత్రి. ‘‘నవ్వుతున్నానా, నవ్వుకుంటున్నానా జైశంకర్?’’ అన్నాను. ‘‘నవ్వుకుంటున్నా నవ్వినట్లే కదా సర్ కనిపిస్తుంది..’’ అని నవ్వాడు జైశంకర్. అతడి నవ్వు చూస్తుంటే ఐదేళ్ల క్రితం నా నవ్వు అతడి నవ్వులా ఉండేదేమో అనిపించింది. అతడికి అరవై ఆరు. నాకు డెబ్బై ఒకటి. ‘అవును సర్, మీరు నవ్వుకోవడం నేనూ చూశాను’ అని శ్రింగ్లా గానీ, అజిత్ డోభాల్ గానీ అంటారేమోనని చూశాను. అనలేదు! శ్రింగ్లా ఏవో ఫైల్స్ సర్దుకుంటున్నాడు. అజిత్ డోభాల్ తన విండో పైభాగాన్ని చేతి వేళ్లతో కొట్టి చూస్తున్నాడు. విమానంలో కాకుండా విధి నిర్వహణలో ఉన్నట్లున్నారు వాళ్లిద్దరూ!! ‘‘ఏమైంది అజిత్‌జీ? విమానాన్ని అలా వేళ్లతో ఎందుకు కొట్టి చూస్తున్నారు అని అడిగాను. ‘‘కొట్టలేదు మోదీజీ, కొట్టినట్లు ఉన్నాను..’’ అన్నారు అజిత్ తన వేళ్లను చూసుకుంటూ! అజిత్ జాతీయ భద్రత సలహాదారు. డెబ్బై ఆరేళ్ల మనిషి. ఇంకో రెండేళ్లు పోతే బైడెన్ వయసుకు వచ్చేస్తారు ఆయన. జైశంకర్ ఇంకా నావైపే చూస్తూ ఉన్నాడు. నేనెందుకు నవ్వుకున్నానో తెలుసుకోవడం కోసం కావచ్చు. శ్రింగ్లాలో నాకు యోషిహిడే కనిపిస్తున్నాడని, అందుకే నవ్వొచ్చిందనీ చెబితే బాగుంటుందా? ‘క్వాడ్’లోని మా నలుగురిలో బైడెన్ కన్నా, యోషిహిడే కన్నా, పద్దెనిమిదేళ్లు నా కన్నా కూడా యంగెస్ట్.. ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్. ఒకవేళ ఆ యంగ్ మ్యాన్‌తో కనుక శ్రింగ్లా తనని తను పోల్చుకుని ఉంటే.. శ్రింగ్లాలో నాకు యోషిహిడే కనిపిస్తున్నాడని జైశంకర్‌తో నేను అనడం శ్రింగ్లాను హర్ట్ చేయడమేగా!! అందుకే.. ‘‘ఏం లేదు జైశంకర్’’ అన్నాను. జైశంకర్, శ్రింగ్లా, అజిత్ సీటు బెల్టులు పెట్టుకుంటూ కనిపించారు. ‘‘అజిత్‌జీ ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా ఇంకా ఈ సీటు బెల్టులు పెట్టుకోవడం ఏంటి?!’’ అన్నాను నేనూ సీటు బెల్టు పెట్టుకుంటూ. అజిత్ సగం ఆశ్చర్యంతో చూశారు. మిగతా సగం అది ఏ భావమో అర్థం కాలేదు. బహుశా.. ఇండియాలో సీటు బెల్టు పెట్టుకుంటున్నప్పుడు రాని సందేహం అమెరికాలో సీటు బెల్టు పెట్టుకుంటున్నప్పుడు రావడం ఏంటీ అని అలా చూసి ఉండొచ్చు. ఇండియా నుంచి వచ్చేటప్పుడు నా చేతి నిండా ఫైల్సే ఉన్నాయి. విమానం ఎప్పుడు ఎక్కానో, సీటు బెల్టు ఎప్పుడు పెట్టుకున్నానో గుర్తే లేదు! ‘‘మోదీజీ.. సీటు బెల్టు అన్నది టెక్నాలజీకి ఏమాత్రం సంబంధం లేని ఒక భద్రతా ఏర్పాటు. అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో కూడా సీటు బెల్టులు ఉంటాయి. మన బెల్టులు అంతకన్నా బలమైనవి..’’ అని నవ్వారు అజిత్. ఇండియాకు పదిహేను గంటల ప్రయాణం. విమానంలో చేయడానికి పనేమీ లేదు. యు.ఎస్. వచ్చేటప్పుడు ‘వర్క్ ఫ్రమ్ ఫ్లయిట్’ అంటూ నా ఫొటో ఒకటి ట్వీట్ చేసినందుకు ప్రతీకారంగా కాంగ్రెస్ వాళ్లు ఫ్లయిట్లో వర్క్ చేస్తున్న రాజీవ్ గాంధీ పాత ఫొటోను పోస్ట్ చేశారు! దేశం లోపలే కలిసిరాని వారుంటే దేశం బయట ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడూ ఎవరో ఒకరు కశ్మీర్ పేరు ఎత్తడంలో వింతేముంది?! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: మల్లికార్జున్ ఖర్గే
ల్యాండ్‌లైన్ మోగుతోంది!! సాధారణంగా అది మోగదు. వారం క్రితం మాత్రం వెంకయ్య నాయుడు చేశారు. ‘‘ఆ రోజు అలా జరిగి ఉండాల్సింది కాదు ఖర్గేజీ..’’ అన్నారు వెంకయ్య నాయుడు నిన్న శనివారం కాకుండా ఆ ముందరి శనివారం ఫోన్ చేసి! ఏ రోజు, ఏలా జరిగి ఉండాల్సింది కాదని ఆయన అంటున్నారో వెంటనే గ్రహించలేక పోయాను. ‘వెంకయ్యాజీ... మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?!’ అని నేను ఆయన్ని అడగొచ్చు. అయితే అలా అడగటం ఆయనకు ఆగ్రహాన్నో, ఆవేదననో ఏదో ఒకటి కలిగించే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి కూడా నేను సిద్ధపడి ఉండాలి. ఎవరైనా కరెంట్ ఈవెంట్స్ తెలియకుండా ఊరికే జీవించేస్తుంటే వారిపై వెంకయ్య నాయుడుకి ఆగ్రహం వస్తుంది. కరెంట్ ఈవెంట్స్‌ని ఫాలో అవుతున్నప్పటికీ సమయానికి వాటిని తిరిగి గుర్తుకు తెచ్చుకోలేని వారిని చూస్తే ఆయనకు ఆవేదన కలుగుతుంది. ‘ఎటువైపు వెళుతోంది సమాజం!’ అని ఆగ్రహం. ‘ఏమైపోతున్నాయి విలువలు!’ అని ఆవేదన. ఏ రోజు, ఏలా జరిగి ఉండాల్సింది కాదో గుర్తుకు తెచ్చుకునేందుకు అప్పటికప్పుడు ప్రయత్నించి, విఫలమై.. ఇక తప్పక.. ‘‘ఏ రోజు వెంకయ్యాజీ’’ అని అడిగేశాను. ‘‘ఏ రోజు అని అడుగుతున్నారా ఖర్గేజీ! రాజ్యసభలో మీరు ప్రధాన ప్రతిపక్షానికి నాయకుడై ఉండీ ‘ఏ రోజు?’ అని అడుగుతున్నారా? ఏ రోజో చెప్పడం నాకు ఇష్టం లేదు. కావాలంటే ఆ రోజు ఏం జరిగిందో చెబుతాను. గర్భగుడి లాంటి సభలో మీవాళ్లు టేబుళ్ల పైకి ఎక్కారు. ఫైళ్లు విసిరేశారు. పెద్ద పెద్దగా అరిచేశారు. కాగితాలు చింపేశారు. వాటన్నిటిపై దర్యాప్తు కోసం ఒక క్రమశిక్షణ కమిటీ వేస్తున్నాను. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఆ కమిటీలో ఉండాలి..’’ అన్నారు వెంకయ్య నాయుడు. గుర్తొచ్చింది నాకు! సభలో వెంకయ్య నాయుడు ఆవేదనతో కంటతడి పెట్టిన రోజు అది. ఆగస్టు 11. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాయిదా పడి, రెండు రోజుల ముందే ముగిసిన రోజు. పాత సంగతిని ఇప్పుడెందుకు గుర్తుచేసుకుని ఆయన కమిటీ వేస్తున్నట్లు! ‘‘వెంకయ్యా జీ... మా మీద కమిటీ వేస్తూ మమ్మల్నే కమిటీలో చేరమంటే ఎలా చెప్పండి? ఆ రోజు మీరు చర్చకు పెట్టకుండా బీమా బిల్లును పాస్ చేయించడం కూడా జరిగి ఉండాల్సింది కానీ వాటిలో ఒకటి కదా..’’ అని.. అప్పటికేమీ చెప్పకుండా.. ఆ తర్వాత లెటర్ రాసి పంపాను. ఇప్పుడు మళ్లీ ల్యాండ్‌లైన్ మోగుతోంది!! మళ్లీ వెంకయ్య నాయుడేనా! అయినా ఈరోజు, రేపు ఆయన పుదుచ్చేరిలో బిజీగా ఉంటారు. పక్కనే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తమిళిసై ఉంటారు. ‘జిప్మెర్’లో సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించాక అక్కడి నుంచి ఇద్దరూ అరవింద ఆశ్రమానికి వెళ్తారు. మధ్య మధ్య తెలుగు భాష గొప్పదనం గురించి వెంకయ్యనాయుడు, తమిళ భాష ప్రాచీన ప్రాశస్త్యం గురించి తమిళిసై ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉంటారు. కనుక ఆయన నాకు ఫోన్ చేసే అవకాశం లేదు. ఒకవేళ ఫోన్ చేస్తున్నది ఆయనే కనుకైతే.. ఈసారి ‘ఆ రోజు’ జరిగి ఉండాల్సినవి కాని వాటిని టాపిక్‌లోకి రానివ్వకుండా.. చరిత్రలో ఆ రోజు జరిగిన ఒక ‘అపురూప’ ఘటనను ఆయనకు గుర్తు చేయాలి. నాలుగేళ్ల క్రితం సరిగ్గా ఆగస్టు 11నే వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యారు. ఆనాటి కరెంట్ ఈవెంట్‌ను నేనింకా మర్చిపోలేదంటే... ‘సమాజంలో విలువలు ఎక్కడికీ పోలేదు, భద్రంగానే ఉన్నాయని’ ఆయన సంతోషించవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన అధికార పక్షంలోని ఒక వ్యక్తిని సంతోష పెట్టకూడదనేముంది? -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ యడియూరప్ప (కర్ణాటక సీఎం)
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. ఎనిమిది రోజులు ఒకసారి, మూడు రోజులు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రాణానికి సుఖంగా ఉంది! ఈ డెబ్బై ఎనిమిదేళ్ల వయసులోనూ వదులుకోవడానికి నేను ఏమాత్రం ఇష్టపడని నా తలనొప్పిని ఎలా ఇంకో రెండేళ్లయినా భద్రంగా కాపాడుకోవడం?! ‘‘లాక్డౌన్లో మీ అబ్బాయి ఏదో చేశాడట కదా, మీరింకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారేమిటీ?!’’ .. అంటారు! అబ్బాయిలు లేకుండా ఉంటారా, ఏదో ఒకటి చేయకుండా ఉంటారా?! ‘‘ఏం చేశావ్ విజయేంద్రా ఈ లాక్డౌన్లో చెయ్యకూడని పని!’’ అని పిలిచి అడిగాను. ‘‘మీ కోసమే నాన్నగారూ, నంజనగూడు శ్రీకంఠేశ్వర దేవస్థానానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయించాను. ఎక్కువసేపు కూడా ఉండలేదు. ఐదే నిమిషాల్లో తిరిగొచ్చేశా..’’ అన్నాడు. ‘‘నా కోసం దేవస్థానానికి వెళ్లాలా విజయేంద్రా.. ఇంట్లో దండం పెట్టుకుంటే సరిపోయేదిగా. ఇప్పుడు చూడు. పాలనలో వైఫల్యం అంటున్నారు. పాలన అంటే ఎవరు? నేనే కదా. తండ్రులు కొడుకుల్ని అర్థం చేసుకోగలరు కానీ, కోర్టులు ప్రభుత్వాలను అర్థం చేసుకోలేవు విజయేంద్రా. నీపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్జి అన్నారట’’ అన్నాను. ‘‘సారీ నాన్నగారూ, ఇక ముందు ఇంట్లోనే దండం పెట్టుకుంటాను’’ అన్నాడు. ‘సరే వెళ్లు’ అన్నట్లు చూసి, ప్రభులింగకు ఫోన్ చేశాను. లైన్లోకి వచ్చాడు. ‘‘ఏం చేద్దాం?’’ అని అడిగాను. ‘‘ఎవరు మాట్లాడుతున్నది..’’ అన్నాడు!! ‘‘నేను ఫోన్ చేసింది అడ్వకేట్ జనరల్ ప్రభులింగకు అని నాకు తెలిసినప్పుడు.. మీకు ఫోన్ చేసింది కర్ణాటక సీఎం యడియూరప్ప అని మీకెందుకు తెలియడం లేదు!’’ అన్నాను. ‘‘సర్.. మీరా! నమస్తే. మీ గొంతు ఎవరిదో గొంతులా ఉంది సర్. వెంటనే పోల్చుకోలేక అలా అడిగేశాను’’ అన్నాడు. ‘‘నా గొంతు గుర్తుపట్టకుండా ఉండటానికి మీకింకా రెండేళ్ల టైమ్ ఉంది ప్రభులింగా. పాలనలో వైఫల్యం అని మావాళ్లు అంటున్నా మా పైవాళ్లేమీ నన్ను తీసేయరు. ఇంకో రెండేళ్లు సీఎంగానే ఉంటాను. విజయేంద్రది అంత సీరియస్ కేసు కాదనకుంటున్నాను. మీరేమంటారు?’’ అని అడిగాను. ‘‘నేనూ అదే అన్నాను సర్. టెంపుల్లో విజయేంద్ర దండం పెట్టుకుంది ఐదే నిమిషాలు అని వాదించాను. చీఫ్ జస్టిస్ నా మీద సీరియస్ అయ్యారు. నెక్ట్స్ వాయిదా ఉంది. అప్పుడు మళ్లీ వాదిస్తాను’’ అన్నాడు. ‘‘వాదించండి’’ అని ఫోన్ పెట్టేశాను. పెట్టిన వెంటనే ఎవరిదో కాల్. శివరాజ్‌సింగ్ చౌహాన్!! ‘‘యడియూరప్పాజీ.. విప్లవ్‌దేవ్ మీకేమైనా ఫోన్ చేశాడా?’’ అన్నాడు. విప్లవ్‌దేవ్ త్రిపుర ముఖ్యమంత్రి. చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. నేను కర్ణాటక ముఖ్యమంత్రి. ఒక బీజేపీ ముఖ్యమంత్రి ఇంకో బీజేపీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి మరొక బీజేపీ ముఖ్యమంత్రి గురించి అడగడం గత ఏడేళ్లలో ఇదే మొదటిసారి కావచ్చు. ‘‘విప్లవ్‌దేవ్ నాకేమీ ఫోన్ చేయలేదు చౌహాన్‌జీ. ఎందుకు అలా అడుగుతున్నారు?’’ అని అడిగాను. ‘‘ఏం లేదు. ఇంతక్రితం నాతో మాట్లాడుతూ సలహా కోసం మీకు ఫోన్ చేయాలని అన్నాడు. అందుకే.. చేశాడా అని అడుగుతున్నాను’’ అన్నాడు. ‘‘దేనికి సలహా?’’ అని అడిగాను. ‘‘రాష్ట్రంలో పాలన వైఫల్యం అని మనవాళ్లు అతడిని దిగిపొమ్మంటున్నారట. మీ రాష్ట్రంలోనూ పాలన వైఫల్యం అని మీవాళ్లు మిమ్మల్ని దిగిపొమ్మంటున్నారు కనుక మీరేదైనా సలహా ఇస్తారని మీకు ఫోన్ చేస్తానన్నాడు. మా రాష్ట్రంలోనూ పాలన వైఫల్యం అని నన్ను మావాళ్లు దిగిపొమ్మంటున్నారు కనక అతడికి మీరిచ్చే సలహా నాకూ పనికొస్తుందని మీకు ఫోన్ చేశాను’’ అన్నాడు! - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: వీరప్ప మొయిలీ (కాంగ్రెస్)
‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని న్యూస్ పేపర్ మీద ఖాళీగా ఉన్న చోట బాల్ పెన్‌తో గీస్తుండగా చిన్న డౌట్ వచ్చి ఆగిపోయాను. ‘అను’ నేనా, ‘అనే’ నేనా? అప్పుడే ముప్పై ఏళ్లు కావస్తోంది నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి! ఇంకు పెన్ను గానీ, బాల్ పెన్ను గానీ సరిగా పడకపోతుంటే గట్టిగా విదిల్చి, ‘మార్పాడి వీరప్ప మొయిలీ అను నేను..’ అని రాసి చూసుకోవడం సీఎం కాకముందు నుంచీ నాకున్న అలవాటే. కొన్ని అలవాట్లు సరదాగా ఉంటాయి. జీవితాన్ని ఎనభై దాటిన వయసులోనైనా ఉత్తేజభరితం చేస్తుంటాయి. మళ్లొకసారి బాల్ పెన్‌తో న్యూస్ పేపర్‌పై ప్రమాణ స్వీకారం చేయబోతుంటే ధడేల్మని తలుపు తెరుచుకున్న చప్పుడైంది. స్క్రీన్ మీద జూమ్‌లో రాహుల్ బాబు!! అతడి చేతిలో పింగాణీ ప్లేట్ కనిపిస్తోంది. ఆ పింగాణీ ప్లేట్లో ఏమున్నదీ కనిపించడం లేదు. మార్నింగ్ టైమ్ కాబట్టి బహుశా అది ఉప్మా అయి ఉండాలి. ‘‘గుడ్ మార్నింగ్ మోదీజీ.. దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు?’’ అని అడిగాడు వచ్చీ రావడంతోనే! ‘‘గుడ్ మార్నింగ్ రాహుల్ బాబు.. దేశ రాజకీయాల్లోకి నేను రావడం ఏమిటి! దేశ రాజకీయాల్లోనే కదా నేను ఉంటున్నాను. దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా ఈ విషయం తెలిసే ఉంటుంది’’ అన్నాను. స్పూన్ నోట్లో పెట్టుకుని తీయడానికి కొంత టైమ్ తీసుకున్నాడు రాహుల్. ఆ టైమ్‌లో మళ్లీ నేనే అన్నాను. ‘‘రాహుల్ బాబూ.. కాంగ్రెస్‌కు సర్జరీ అవసరం అని నేను అన్నందుకే కదా, దేశ రాజకీయాల్లోకి మీరెప్పుడొచ్చారు అని మీరు నన్ను అడిగారు’’ అని అన్నాను. ‘‘కానీ, ఇప్పుడది నాకు పెద్ద విషయంగా అనిపించడం లేదు మోదీజీ. మీరు దేశ రాజకీయాల్లోనే ఉన్నట్లు దేశ రాజకీయాల్లో ఉన్నవారెవరికైనా తెలుస్తుంది అన్నారు! అంటే నేను దేశ రాజకీయాల్లో లేననా! కాంగ్రెస్‌కు సర్జరీ అవసరం అని మీరు మొన్న అన్నమాట కన్నా, ఇప్పుడు మీరు నన్నన్న ఈ మాట చాలా పెద్దది..’’ అన్నాడు రాహుల్. రాహుల్ పెద్దవాడైనట్లున్నాడు! అంతరార్థాలను గ్రహించి, విశ్లేషించగలుగు తున్నాడు. కానీ ‘మొయిలీజీ’ అనడానికి బదులుగా ‘మోదీజీ’ అంటున్నాడు. ‘‘నా ఉద్దేశం అది కాదు రాహుల్ బాబూ..’’ అన్నాను. ‘‘మీ ఉద్దేశం ఏదైనా మోదీజీ.. ప్రధానోద్దేశం మాత్రం అదే కదా. నేను దేశ రాజకీయాల్లో లేనని! చెప్పమంటారా? దేశ రాజకీయాల్లో ఏం జరుగుతున్నదీ చెప్పమంటారా? గురువారం మోదీ, యోగీ మీట్ అయ్యారు. శుక్రవారం మోదీ, అమిత్‌షా, నడ్డా మీట్ అయ్యారు. అదే రోజు శరత్ పవార్, ప్రశాంత్ కిశోర్ మీట్ అయ్యారు. వచ్చే ఏడాది మళ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటికోసమే మోదీ అందర్నీ మీట్ అవుతున్నారు. వాటి కోసమే మోదీకి వ్యతిరేకంగా అంతా మీట్ అవుతున్నారు. చాలా ఈ ఇన్ఫర్మేషన్? నేను రాజకీయాల్లో ఉన్నట్లేనా?’’ అన్నాడు రాహుల్. రాహుల్‌లో అంత ఆవేశాన్ని, ఆవేదనను నేనెప్పుడూ చూడలేదు. ‘‘సర్జరీ అయినా, సర్జికల్ స్ట్రయిక్స్ అయినా కొంత టైమ్ పడుతుంది మోదీజీ! అప్పుడిక మీరు మీ ప్రమాణ స్వీకారాన్ని న్యూస్ పేపర్ మీద ఖాళీగా ఉన్నచోట చేయనవసరం లేదు. ఇందాకట్నుంచీ నేను మిమ్మల్ని మోదీజీ అని ఎందుకు అంటున్నానో తెలుసా? కాంగ్రెస్‌లో ఉండి కూడా మీరు మొయిలీలా మాట్లాడ్డం లేదు. కాంగ్రెస్‌లో లేని మోదీలా మాట్లాడుతున్నారు’’ అన్నాడు. రాహుల్‌లో ఇంత పరిశీలనను నేనెప్పుడూ పరిశీలనగా గమనించలేదు! ‘‘రాహుల్ బాబూ.. నా ముందు టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ మీకు కనిపిస్తోందా?’’ అని అడుగుతున్నానూ.. జూమ్ కట్ అయింది. -మాధవ్ శింగరాజు -
గౌతమ్ గంభీర్ (ఢిల్లీ ఎం.పి.).. రాయని డైరీ
పదేళ్ల క్రితం అందరం పదేళ్లు చిన్నవాళ్లం. వరల్డ్ కప్ గెలిచాం! మా కెప్టెన్ ధోనీ. ధోనీలో నాకెప్పుడూ ఒక గొప్పతనం కనిపిస్తుంది. ప్రతి గెలుపులోనూ అతడొక్కడే మనందరికీ కనిపిస్తున్నా.. ‘ఇదిగో నేనిక్కడ ఉన్నాను’ అంటూ అతడెక్కడా మనకు కనిపించడు! ఆ రోజు వరల్డ్ కప్ గ్రూప్ ఫొటోలో కూడా ధోనీ ఎత్తిపట్టిన కప్పు కనిపించింది తప్ప, ధోనీ కనిపించలేదు. మరి మనం ఎందుకు కప్పు గెలిచి పదేళ్లు అయిన సందర్భంగా కప్పుని కాకుండా అతడిని ఎత్తిపట్టి చూపిస్తున్నాం?! అతడికి నచ్చే విషయమేనా? చేతులు కట్టుకుని దూరంగా చిరు దరహాసంతో తన టీమ్ సంబరాలను పదేళ్లుగా చూస్తూ నిలబడి ఉన్న కెప్టెన్ దగ్గరకు వెళ్లి, ‘నేటికి పదేళ్లు’ అని గుర్తు చేసి, అతడి చేతిని బలవంతంగా పైకెత్తించి, ఆ చేతిలోని రెండు వేళ్లను ‘వి’ షేప్‌లో బలవంతంగా తెరిపించి.. ఏమిటిదంతా! నాయకుడి ఆత్మ టీమ్‌లో ఉంటుంది. టీమ్ ఆ ఆత్మకు తిరిగి నాయకుడి రూపం ఇవ్వడం అంటే అతడి పెద్దరికాన్ని అతడికి కాకుండా లాగేయడమే. వరల్డ్ కప్ విజయంలో ప్లేయర్స్‌కి మాత్రమే కాదు.. ప్రతి రన్‌కి, ప్రతి బంతికి భాగస్వామ్యం ఉంది. రన్ అవుట్‌కి, మిస్ అయిన క్యాచ్‌కి కూడా గెలుపులో షేర్ ఉంది. పదేళ్ల క్రితం ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత భారత జట్టు వరల్డ్ కప్ గెలిచింది. అదీ ఆ రోజు ఫైనల్స్‌లో ఇండియా సాధించిన అసలు విజయం. దాని గురించి చెప్పుకోవాలి. లేదంటే, పదేళ్ల తర్వాత ఇప్పుడు ఆ టీమ్‌లోని వాళ్లంతా ఏం చేస్తున్నారో చెప్పుకోవడం కూడా ఆ రోజు సాధించిన విజయం గురించి చెప్పుకోవడమే అవుతుంది. అది మంచి సంగతి కదా! ధోనీ ఇప్పుడు చికెన్ ఫామింగ్ చేస్తున్నాడు. క్రి కెట్ మానేశాడని కాదు. ఆడుతున్నాడు. ఆటెప్పుడూ ఆటగాడిని వదిలేసిపోదు. సచిన్ రిటైర్ అయ్యాడని ఆట అతడిని ఏ రోజైనా ‘ఏయ్ రిటైర్డ్ మ్యాన్’ అనిందా? లేదు. ఈమధ్యే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడొచ్చాడు. ఈ పదేళ్లలో సెహ్వాగ్ కామెంటేటర్ అయ్యాడు. ట్విట్టర్లోనే ఎప్పుడూ అతడు కనిపించడం! కోహ్లీ వరల్డ్‌కప్‌లో బేబీ బాయ్. ఇప్పుడొక బేబీ గర్ల్‌కి ఫాదర్. యువరాజ్ పదేళ్ల క్రితం మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్. తర్వాత క్యాన్సర్‌తో ఫైట్. ధైర్యంగా ఆడాడు. గట్టిగా నిలబడ్డాడు. గ్రేట్. రైనా ఆనాటి స్క్వాడ్‌లో యంగ్‌మ్యాన్. స్టార్లు ఆడుతుంటే తను ఆడే చాన్స్ కోసం చూశాడు. కప్పొచ్చిన టీమ్‌లో ఉన్నాడు కానీ, కప్పు విజయాన్ని ఒక చెయ్యేసి పట్టుకునే చాన్సే రాలేదు. ఇప్పుడతడు చెన్నై సూపర్ కింగ్. పఠాన్ ఆల్ రౌండర్. వరల్డ్ కప్పులో పెద్దగా బ్యాటింగ్ చేయలేదు. సచిన్‌లా అతడూ ఇప్పుడు కరోనాపై ఆడుతున్నాడు. హర్బజన్ కెరీర్ చివరికొచ్చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్ అతడిప్పుడు. జహీర్ ముంబై ఇండియన్స్‌కి క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్. పటేల్ కనిపించడం లేదు. వినిపించడం లేదు. నెహ్రా కామెంటరీలు చెబుతున్నాడు. ఈ మధ్యే ఢిల్లీ నుంచి గోవా షిఫ్ట్ అయ్యాడు.. నేనిప్పుడు ఢిల్లీ నుంచి బెంగాల్ షిఫ్ట్ అయినట్లు! కొన్ని రోజులుగా ఇక్కడే నా మకాం. బెంగాల్లో ఎలాగైనా మమతా బెనర్జీని ఓడించాలని అమిత్‌షా! ‘‘అమిత్జీ అలా వద్దు. బీజేపీని గెలిపించుకుందాం’’ అని చెప్పి క్యాంపెయిన్ కోసం బెంగాల్ వచ్చాను. ‘‘ఆ రోజు ప్రపంచ కప్ ఫైనల్స్‌లో ఓపెనర్‌గా నువ్వు తొంభై ఏడు రన్స్ తీసి శ్రీలంక మీద ఇండియా గెలవడానికి కారణం అయినట్లే.. తృణమూల్ మీద బీజేపీ జట్టును గెలిపించి మంచి ఓపెనింగ్ ఇవ్వాలి గౌతమ్’’ అంటున్నారు అమిత్‌షా! అశ్విన్, పీయుష్, శ్రీశాంత్.. వరల్డ్ కప్పులో ఆడిన మిగతా ప్లేయర్స్. అశ్విన్ ప్రస్తుతం ఫామ్‌లోనే ఉన్నాడు. పీయుష్ గుజరాత్ వెళ్లిపోయాడు. శ్రీశాంత్ బ్యాన్ నుంచి బయట పడ్డాడు. జీవితంలోనైనా, ఆటలోనైనా కలిసి ఆడిన ఆటలోని గెలుపు ఓటములకు ఏ ఒక్కరో కారణం అయి ఉండరు. వరల్డ్ కప్పు విజయంలోనూ అంతే. -
నీరవ్ మోదీ (వజ్రాల వ్యాపారి).. రాయని డైరీ
వెళ్లడం తప్పేలా లేదు. తప్పించుకుని వెళ్లే వీలూ లేదు. నన్ను బ్రిటన్ జైల్లోనే ఉంచి, ఇండియాలో విచారణ జరిపిస్తే బ్రిటన్‌కి గానీ, ఇండియాకు గానీ పోయేదేమీ లేదు. కొంచెం డబ్బు ఖర్చవచ్చు. ఖర్చెందుకు దండగ అనుకున్నట్లున్నాయి ఇండియా, బ్రిటన్! మరీ ఇంత మనీ మైండెడ్ అయితే మనీ ఎలా çసంపాదిస్తారు? డబ్బు కావాలనుకుంటే డబ్బును వెదజల్లాలి. వ్యాపారంలో ఇది మొదటి సూత్రం. సూత్రాలు కొన్నిసార్లు పని చేయకపోవచ్చు. ఆలోచిస్తే ఇంకో సూత్రమేదైనా దొరుకుతుంది. ఆర్థికమంత్రులు, దేశాధినేతలు ఆ ఇంకో సూత్రం గురించి ఆలోచించరులా ఉంది! ఆలోచించే బదులు నీరవ్నో, మాల్యానో దేశం రప్పిస్తే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందని నిర్మలా సీతారామన్, నరేంద్ర మోదీ అనుకుంటూ ఉండొచ్చు. నిర్మల, నరేంద్ర, నీరవ్.. ముగ్గురి పేర్లూ ‘ఎన్’ తో భలేగా మొదలయ్యాయే అనే ఆలోచన వచ్చింది నాకు! వాళ్లకూ ఈ అర్థంలేని ఆలోచన వచ్చి ఉంటుందా? మాల్యా పేరు కూడా ‘ఎన్’ తో స్టార్ట్ అయుంటే నాకు నిస్సందేహంగా నవ్వొచ్చి ఉండేది. ముంబై వెళ్లి జైల్లో కూర్చున్నాక కూడా పగలబడి నవ్వుతూ ఉండేవాడిని. మాల్యా కూడా బ్రిటన్‌లోనే ఉన్నా, బ్రిటన్‌లో నేనున్నంత ధైర్యంగా మాల్యా లేడు! ఫోన్ చేస్తే ‘ష్.. ఇప్పుడు కాదు’ అనేవాడు. ‘ఎక్కడున్నావో అదైనా చెప్పు’ అని అడిగేవాడిని. ‘ఇద్దరం ఇండియాలోనైతే లేము కదా. ఇండియాలో లేనప్పుడు ఎక్కడున్నా మనం ఒకే చోట ఉన్నట్లు. ఒకేచోట ఉన్నప్పుడు ఫోన్లెందుకు? ఇండియాలో ఉన్నవాళ్లకు ఫోన్ చేసి మరీ మన ఫోన్ నెంబర్లు ఇవ్వడం కాకపోతే..’ అనేవాడు! ఓసారెప్పుడో తనే చేశాడు.. ‘ఎక్కడున్నావ్?!’ అని. ‘నీ అంత పిరికివాణ్ని కాదు. నువ్వెక్కడున్నావో చెప్పు నేనే నీ దగ్గరకు వస్తాను’ అన్నాను. ‘నా దగ్గరికి రావడానికీ నీకు ధైర్యం అక్కర్లేదు నిజమే కానీ, నీ దగ్గరకు రావాలంటే మాత్రం నేను ధైర్యంగానో, పిరికిగానో ఉండాలి. నువ్వెక్కడున్నావో చెబితే అక్కడికి రావడానికి నాకు ధైర్యం అవసరమా, పిరికితనం అవసరమా నిర్ణయించుకుంటాను. కొన్నిసార్లు పిరికితనం కూడా ధైర్యం చేసినంత మేలు చేస్తుంది. కొన్నిసార్లు ధైర్యం కూడా పిరికితనమంత కీడు చేస్తుంది’’ అన్నాడు. తర్వాత ఫోన్ కట్ అయింది. మళ్లీ మాల్యా నాకు గానీ, నేను మాల్యాకు గానీ ఫోన్ చెయ్యలేదు. ఆ ఫోన్ మాల్యా కట్ చేశాడా, నేను కట్ చేశానా అన్నదీ గుర్తు లేదు. ఆ రోజు.. ‘ఎక్కడున్నావ్?’ అని ఎందుకు అడిగి ఉంటాడా అని మాత్రం అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంటుంది. ౖటñ మ్ చూసుకున్నాను. చూసుకున్నాను కానీ టైమ్ ఎంతైందో చూసుకోలేదు. ఈ క్షణమో, మరు క్షణమో ఇండియా ఫ్లయిట్ ఎక్కవలసి రావచ్చు. చివరిసారి బ్రిటన్‌లో ఎవరైనా ఆప్తులతో మాట్లాడాలనిపించింది. ఆప్తులు అనుకోగానే మాల్యానే గుర్తొచ్చాడు. ఫోన్ చేశాను. లిఫ్ట్ చేశాడు! ‘‘ఎలా ఉన్నావ్ మాల్యా? వెళ్లిపోతున్నాను..’’ అన్నాను. ‘‘నన్ను ఒంటరిని చేసి..’’ అన్నాడు. అతడి గొంతులో ధ్వనించిన దిగులును వింటే.. నాతో పాటే నేనెక్కిన ఫ్లయిట్లోనే నా పక్క సీట్లో కూర్చొని ఇండియా వచ్చేసేట్లున్నాడు. ‘‘ఫోన్ చేస్తుంటాన్లే..’’ అన్నాను. ఏంటో ఈ ఆర్థిక వ్యవస్థలు, వ్యవహారాలు! మాల్యా డబ్బు మొత్తం చెల్లించేస్తానంటే తీసుకోనంటున్నారు. నేను ఒక్క రూపాయి కూడా చెల్లించలేనంటే నన్ను తీసుకుపోతున్నారు! -
అమిత్ షా (హోమ్ మినిస్టర్).. రాయని డైరీ
రేపు ఉదయం కోల్‌కతాలో ఉండాలి. అక్కడొక స్పెషల్ కోర్టు జడ్జి ఉంటారు. సోమవారం ఉదయం పది గంటలకు కోర్టుకు రాగలిగితే బాగుంటుందని ఆయన నాకు సమన్లు ఇష్యూ చేశారని నా లాయర్ చెప్పాడు. నా మీద కేసు పెట్టిన వ్యక్తి ప్రముఖుడేం కాదు. అలాగని అతడికి సామాన్యుడి హోదాను కూడా ఇవ్వలేం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ. మమతా బెనర్జీకి దగ్గరి బంధువు. తనని నేనేదో అన్నానని అతడి కంప్లయింట్. అన్నది నిజమా కాదా అని కోర్టు అడుగుతుంది. నిజమో కాదో నా ప్లీడర్ వెళ్లి చెప్పగలడు. బొత్తిగా ఇది ప్లీడర్‌కు ప్లీడర్‌కు మధ్య వ్యవహారం. అయినప్పటికీ నేనే స్వయంగా కోర్టుకు వస్తే తన తడాఖా ఏమిటో పశ్చిమ బెంగాల్ ప్రజలకు తెలుస్తుందని మమత ఆశిస్తుండవచ్చు. ఎన్నికలకు ముందు ఆశలు ఎవరికైనా సహజమే. అయితే కేసులతో ఆశలు నెరవేరతాయా! ఈ సందేహం మమతకు రాకపోవడమే అసహజం. గురు, శుక్రవారాల్లో బెంగాల్లోనే ఉన్నాను. గురువారం మమత వాళ్లవాళ్లతో మీటింగేదో పెట్టుకున్నారు. సరాసరి ఆ మీటింగు నుంచే వస్తున్నానని అంటూ.. ఒక వ్యక్తి బెరుకు బెరుగ్గా నా దగ్గరికి వచ్చాడు. ‘మీరే కదా అమిత్ షా’ అన్నాడు. ‘అవును నన్నే అమిత్ షా అంటారు. మోదీజీ నన్ను అలాగే అంటారు. మీ మేడమ్ మమత కూడా అలాగే అంటారు’ అన్నాను. ‘వాళ్లు అంటారు నిజమే. వాళ్లు అంటున్న అమిత్ షా యేనా మీరు అని నా సందేహం. ఆ సందేహం తీరితే నేను అడగవలసింది అడగగలను..’ అన్నాడు రొప్పుతూ. ‘మీ సందేహం తప్పక తీరుతుంది. అయితే ముందు నా సందేహం తీరనివ్వండి. దేశంలో అంతా నన్ను ఇట్టే పోల్చుకుంటారు నేను అమిత్ షా నని. నా పక్కన మోదీజీ లేకున్నా కూడా నేను అమిత్ షానేనని గుర్తుపట్టేందుకు కూడా ఎవరూ ఏమీ ఇబ్బంది పడరు. అలాంటప్పుడు దేశ ప్రజల్లో ఒకరైన మీకెందుకు సందేహం కలుగుతోంది?’ అని ప్రశ్నించాను. ‘లేదు. అలా ఏం లేదు. అయితే నేను వేరేలా ఆలోచించాను. రెండుసార్లు కరోనా వచ్చిన అమిత్‌షా.. అమిత్‌షాలా ఎలా ఉండగలరు అని నేను అనుకున్నాను. అందుకే మీరు అమిత్ షా అయి ఉంటారని మిమ్మల్ని చూసిన వెంటనే అనుకోలేకపోయాను’ అన్నాడు! అతడి మాటల్లో నిజాయితీ కనిపించింది. మమత మాటల్లో ఒక్కనాడైనా కనిపించని నిజాయితీ అది! ‘నేనే అమిత్‌షాని. ఇందుకు నేను మీకేమీ రుజువులు చూపించలేను. కరోనా వచ్చిపోయినా, రేపు ఎన్నికల్లో మమత ఓడిపోయినా నేను ఒకేలా ఉంటాను. నేనే అమిత్‌షా అనడానికి అదొక్కటే రుజువు. ఇప్పుడు చెప్పండి. నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారు మీరు?’ అని అడిగాను. ‘మిమ్మల్ని వెతుక్కుంటూ వెళితే మేము వెతుకుతున్నవాళ్లు మీ దగ్గర కనిపిస్తారని మమతా దీదీ పంపారు’ అని చెప్పాడు. ‘మిమీ చక్రవర్తి, ప్రతిమా మండల్, జీవన్ ముఖర్జీ, దేవశ్రీ రాయ్, మన్తూరామ్ పఖీరా.. వీళ్లనేనా మీరు వెతుకుతున్నది?’ అని అడిగాను. ‘అవును వాళ్లనే! మీకెలా తెలుసు దీదీ మీటింగ్‌కి వాళ్లు మిస్ అయ్యారని’ అని ఆశ్చర్యపోయాడు. ‘మీ దీదీ మీటింగ్‌కి వాళ్లు మిస్ అయ్యారని నాకు తెలీదు’ అన్నాను. ‘మరి వాళ్ల పేర్లు ఎలా చెప్పగలిగారు’ అన్నాడు మళ్లీ ఆశ్చర్యపోతూ. నన్ను మీట్ అవ్వాలనుకుంటున్న వాళ్ల పేర్లే నేను అతడికి చెప్పాను. ఆ సంగతి అతడికి చెప్పలేదు. ‘మీరు అమిత్‌షానే. రుజువులక్కర్లేదు’ అన్నాడు వెళ్లిపోతూ. సోమవారం కోర్టు పని మీద కోల్‌కతా వెళితే మళ్లొకసారి నేనే అమిత్‌షాని అని పనిలో పనిగా రుజువు అవుతుంది కానీ, రుజువు చేసుకునేంత అవసరం ఇప్పుడేముందని?! -
రాయని డైరీ.. నరేంద్ర మోదీ (ప్రధాని)
ప్రేమ గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. ఎక్కడో చదవనైతే చదివాను. ప్రేమ మనకు తెలియకుండా హృదయాన్ని పట్టేసుకుంటుందని! హృదయాన్ని పట్టేసుకున్నా ఏం కాదు. హృదయం పట్టనంత అయితేనే ఆ ప్రేమను ఎంతోకాలం లోపలే పట్టి ఉంచలేం. ఎవరితోనైనా పంచుకోవాలి. చెన్నైలో ఫ్లయిట్ దిగ్గానే.. ‘ఐ లవ్ చెన్నై’ అనేయాలన్నంతగా హృదయోద్వేగం ఒకటి నన్ను కమ్మేసింది. బలంగా నిలదొక్కుకున్నాను. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం పరుగున వచ్చారు. ‘‘మోదీజీ మీరు గానీ ఇప్పుడు తూలిపడబోయారా?’’ అని ఇద్దరూ ఒకేసారి అడిగారు. వాళ్ల ఆందోళన అర్థమైంది. నేనొస్తున్నానని చెన్నైలో నాలుగు అంచెల భద్రతా ఏర్పాట్లు చేయించారు. ఆరు వేల మంది సెక్యూరిటీ సిబ్బందిని సిటీ అంతా వరుసగా నిలబెట్టారు. ఒకవేళ నేను తూలిపడినప్పటికీ ఆ ఆరువేల మంది సిబ్బందీ చేయగలిగింది, చేయవలసిందీ ఏమీ లేదని తెలిసినా నేను తూలిపడటం కూడా తమ భద్రతా ఏర్పాట్ల వైఫల్యం కిందకే వస్తుందేమోనన్న కంగారు వారిలో కనిపించింది. ‘‘నన్ను నేను నియంత్రించుకున్నాను. అది మీకు తూలిపడబోయినట్లు అనిపించి ఉండొచ్చు’’ అని నవ్వాను. స్వామి, సెల్వం నవ్వలేదు. వెనక్కు తిరిగి చూసుకుంటున్నారు. ‘‘ఏమైంది? అన్నాను. మాట్లాడలేదు. ‘‘ఏమైంది.. మీరూ మిమ్మల్ని మీరు నియంత్రించుకోబోయారా?’’ అని అడిగాను. నియంత్రణ అనగానే అప్పుడు తేరుకుని అడిగారు.. ‘‘మోదీజీ.. మీరెందుకు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవలసి వచ్చింది.. అదీ ఎయిర్ పోర్ట్‌లో..!’’ అని పళనిస్వామి అడిగారు. పన్నీర్‌సెల్వం అడగలేదు. ఇద్దరిదీ ఒకే ప్రశ్న అయినప్పుడు ఇద్దరూ ఒకే ప్రశ్న వేయడం ఎందుకన్నట్లు ఆగి, నా వైపు చూస్తున్నారు పన్నీర్‌సెల్వం. ‘‘నిజంగా అది నియంత్రించుకోవలసిన పరిస్థితే పళనిజీ. ఫ్లయిట్ దిగీ దిగగానే మొదట నాలో రెండు భావాలు చెలరేగాయి. ‘ఐ లవ్ చెన్నై’ అనే మాట నా ప్రమేయం లేకుండానే నా నోటి నుంచి రాబోయింది. ఆపుకున్నాను. ఫ్లయిట్ దిగీ దిగగానే వంగి ఈ తమిళభూమిని ముద్దాడాలన్న ఉద్వేగం నన్ను గాఢంగా కమ్ముకుంది. మళ్లీ ఆపుకున్నాను. ఐ లవ్ చెన్నై అనకుండా, తమిళభూమిని ముద్దాడకుండా ఉండేందుకే నన్ను నేను నియంత్రించుకోవలసి వచ్చింది’’ అని చెప్పాను. స్వామి, సెల్వం మాట్లాడలేదు! మళ్లీ వెనక్కు తిరిగి చూసుకుంటున్నారు. ‘‘ఏమైంది!’’ అన్నాను. ‘‘ఏం లేదు మోదీజీ! మీరు చెబుతున్నది వింటున్నాం. వింటూ వెనక్కు తిరిగి ఆలోచిస్తున్నాం. ‘ఐ లవ్ చెన్నై’ అని అనకుండా, తమిళభూమిని ముద్దాడకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోడానికి కారణం మాకు అర్థమైంది’’ అన్నారు పన్నీర్ సెల్వం. ‘‘అవును... అర్థమైంది మోదీజీ. వాలెంటైన్స్ డే పై మీకూ, ఆరెస్సెస్‌కు మంచి ఇంప్రెషన్ లేదు కనుక మీరు ‘ఐ లవ్’ అనే మాట అనకూడదు. తమిళభూమిని ముద్దాడకుండా ఉండేందుకు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడమూ సహజమే. రేపు రాహుల్ అనొచ్చు.. ఎన్నికలొస్తున్నాయి కనుక మీకు తమిళభూమి ముద్దొస్తోందని. అందుకే ముద్దాడకుండా మీరు ముద్దాపుకున్నారు’’ అన్నారు పళనిస్వామి! ‘‘సరిగ్గా అర్థం చేసుకున్నారు’’ అన్నాను. చప్పుడు లేదు! మళ్లీ వెనక్కు తిరిగి చూసుకుంటున్నారు. వాళ్ల వెనకెవరూ లేరు. నీడలు మాత్రం ఉన్నాయి. వాటిని చూసుకుంటున్నారు. ఎవరి నీడలు వాళ్లు చూసుకోవడం ఏంటి! మళ్లీ వాళ్లు వెనక్కు తిరిగినప్పుడు చూశాను. పళనిస్వామి నీడను పన్నీర్‌సెల్వం, పన్నీర్‌సెల్వం నీడను పళనిస్వామి చూసుకుంటున్నట్లు నాకు అర్థమైంది. -
రాయని డైరీ.. నిర్మలా సీతారామన్ (ఆర్థిక మంత్రి)
‘‘ఊరెళ్లాలి మేడమ్ సెలవు కావాలి’’ అన్నాడు అనురాగ్ ఠాకూర్ సడన్‌గా వచ్చి! ‘‘ఏమైంది అనురాగ్?!’’ అన్నాను. ‘‘ఏం కాలేదు మేడమ్’’ అన్నాడు. ‘‘ఏం కానప్పుడు నువ్వు ఫిబ్రవరి 15 తర్వాత గానీ, మార్చి 8 లోపు గానీ, ఏప్రిల్ 8 తర్వాత గానీ ఊరెళ్లొచ్చు కదా అనురాగ్’’ అన్నాను. అవి సెషన్స్ ఉండని రోజులు. అయినా ఊరెళ్లడానికి సెలవు తీసుకునే వయసు కాదు అనురాగ్ది. నాకన్నా పదిహేనేళ్లు చిన్నవాడు కదా అని మాత్రమే అతడికి ఇస్తే సెలవు ఇవ్వాలి. ‘‘నువ్వేమీ బడి పిల్లాడివి కాదు అనురాగ్. బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థికమంత్రికి సహాయ మంత్రివి. ప్రతిపక్షాలు ప్రశ్నలు అడిగే సమయానికి ఊరెళతానంటే ఎలా! బడ్జెట్ సెషన్స్ కానివ్వు..’’ అన్నాను. ‘‘బడ్జెట్ సెషన్స్ బోర్ కొడుతున్నాయి మేడమ్’’ అన్నాడు!! ‘‘బడ్జెట్ సెషన్స్ బడ్జెట్ హల్వాలా ఎలా ఉంటాయి అనురాగ్!’’ అన్నాను. ‘‘ఓ.. హల్వా! రెండు వారాలైంది కదా మేడమ్. మాలో ఎవరికైనా హల్వా చేయడం వచ్చా అని కూడా అడిగారు మీరు..’’ అన్నాడు. నిజమే! నిన్న మొన్న హల్వా చేసినట్లుంది. సినిమాల్లో డాక్టర్ ఆపరేషన్ చేస్తుంటే చుట్టూ చిన్న డాక్టర్లు చేరి మాస్కుల్లోంచి కళ్లు అప్పగించి చూస్తున్నట్లు నా ఫైనాన్స్ స్టాఫ్ అంతా నా చుట్టూ చేరి హల్వా తయారవుతున్న బాణలిలోకి తొంగి చూస్తున్నారు తప్పితే చూడ్డం వచ్చని గానీ, రాదని గానీ చెప్పలేదు! నా వెనుక భుజం మీద నుంచి ఎవరో చెక్క గరిట అందించారు. హల్వాను మెల్లిగా గరిటెతో పైకీ కిందికీ తిప్పుతున్నాను. పిల్ల డాక్టర్లు హల్వా మీదకు వంగి చూస్తున్నారు. ‘హల్వాని ఎలా తిప్పుతాం అబ్బాయిలూ.. పైకీ కిందికా, పక్కలకా..’ అని మా హల్వా డాక్టర్లని అడిగితే, ‘అసలు తిప్పుతామా మేడమ్’ అని తిరిగి నన్నే అడిగాడు ఒక డాక్టర్. ఆ అడిగిన డాక్టర్ ఎవరా అని తలతిప్పి చూశాను. అనురాగ్ ఠాకూరే! ‘కొంచెం చూస్తుంటావా అనురాగ్, బ్రేక్ తీసుకుంటాను..’ అన్నాను. ‘అలాగే మేడమ్’ అని కదా నా సహాయకుడిగా అతడు అనవలసింది.. ‘అందరం బ్రేక్ తీసుకుందాం మేడమ్..’ అన్నాడు! ‘అవును మేడమ్ అందరం బ్రేక్ తీసు కుందాం.. హల్వా కింద స్టౌ మంటను ఆపేసి..’ అనే మాట వినిపించింది! ఆ మాట అన్నది అనురాగ్ డాక్టర్ కాదు. ఇంకో హల్వా డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణియన్. ఫైనాన్స్ సెక్రెటరీ. ‘అరె సుబ్రహ్మణియన్.. నువ్వెప్పుడొచ్చావ్?’ అన్నాను. ‘మీ చేతికి గరిటె ఇచ్చింది నేనే మేడమ్’ అన్నాడు. ‘బ్రేకులు మనం తీసుకోవచ్చు సుబ్రహ్మణియన్. స్టౌ మీద ఉన్న హల్వాకు బ్రేక్‌లు ఇవ్వకూడదు’ అని చెప్పాను. ఆ రోజంతా హల్వాతోనే గడిచిపోయింది. నా టీమ్‌లో స్టౌ వెలిగించడం వచ్చిన వాళ్లు కూడా లేనట్లున్నారు. ‘హల్వా సూపర్‌గా ఉంది మేడమ్’ అనైతే అన్నారు. ‘మీరు కూడా నేర్చుకుని చేసి చూడండయ్యా.. ఇంకా సూపర్‌గా వస్తుంది’ అన్నాను. మోటివేట్ అయినట్లు లేదు. ఈ మగపిల్లలు మాటలు ఎన్నైనా చెబుతారు. వంట మాత్రం నేర్చుకోరు. సండే కావడంతో రిలాక్సింగ్‌గా ఉంది. మొన్న మాన్సూన్ సెషన్స్కైతే శని, ఆది వారాల్లో కూడా పని చేశాం. ‘‘నమస్తే ఆంటీ..’’ అంటూ వచ్చింది పక్కింట్లో పేయింగ్ గెస్ట్‌గా ఉంటున్న అమ్మాయి. సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నట్లుంది. ‘‘రామ్మా.. కూర్చో..’’ అన్నాను. ‘‘ఆంటీ, వృద్ధి రేటు 11 శాతం వరకు ఉంటుంది అన్నారు కదా మీరు. అంత ఎలా పెరుగుతుంది ఆంటీ!’’ అంది. ‘‘అబ్బాయిలు వంట నేర్చుకుంటే పెరుగుతుందమ్మా..’’ అన్నాను. పెద్దగా నవ్వింది. ‘‘అవునాంటీ.. వృద్ధి రేటు పెరగడానికైనా ఈ బాయ్స్ వంట నేర్చుకోవాల్సిందే..’’ అంది. -
జో బైడెన్ (అమెరికా అధ్యక్షుడు).. రాయని డైరీ
ఫస్ట్ డే! వైట్ హౌస్ వెస్ట్ వింగ్‌లో ఉన్న ఓవల్ ఆఫీస్‌లోకి వెళ్లి కూర్చున్నాను. ప్రెసిడెంట్ చెయిర్! బాగా తొక్కి, పాడు చేసినట్లున్నాడు ట్రంప్. కూర్చోగానే కుర్చీ కిందకీ వెళ్లలేదు. పైకీ రాలేదు. చుట్టూ తిరగలేదు. కొన్ని స్క్రూలు, కొన్ని నట్లు ఏమైనా ఊడదీసి గానీ వెళ్లాడా ఏంటి ట్రంప్ అనే డౌట్ వచ్చింది. అలా చేస్తాడని నేను అనుకోను కానీ, కమలకు చెబితే మాత్రం తను అనుకుంటుంది.. ‘ఆ మనిషి అలాంటివాడే మిస్టర్ ప్రెసిడెంట్’ అని పెద్దగా నవ్వుతుంది. కమల నవ్వు బాగుంటుంది. ఆ నవ్వు ట్రంప్‌కి నచ్చదు. ‘ఎందుకు పిచ్చిదానిలా ప్రతిదానికీ పగలబడి నవ్వుతుంది!’ అని కమల ఎలా నవ్వుతుందో ఎన్నికల ర్యాలీలో నవ్వి చూపించాడు ట్రంప్! ఏమైంది? అమెరికన్ ప్రజలు కమల నవ్వును ఇష్టపడ్డారు. ‘కమల ఇలా నవ్వుతుంది’ అని నవ్వి చూపించిన ట్రంప్‌ని ఇష్టపడలేదు. వెస్ట్ వింగ్లోనే నా ఆఫీస్‌కి ఓ పక్కగా కమల ఆఫీస్. అందులోనే వైస్ ప్రెసిడెంట్ చెయిర్. రెండొందల తొంభై ఏళ్ల ఆ చెయిర్ జీవితంలో తొలి మహిళ కమల. చెయిర్‌కి మాటలు వచ్చుంటే కమలతో ఇప్పటికే ఇష్టంగా కబుర్లు చెప్పడం మొదలుపెట్టి ఉంటుంది. కబుర్లు చెప్పడం, కబుర్లు వినడం ఆడవాళ్ల రైట్ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడీ సీట్లో నేను కాకుండా ట్రంప్ ఉండి, పక్క సీట్లో కమల ఉండి ఉంటే.. ‘ఏంటా కబుర్లు!’ అని ఇక్కడి నుంచే గట్టిగా కుర్చీని తిట్టేసేవాడు.. కుర్చీ అని కూడా చూడకుండా. అప్పుడు కమల.. ‘మిస్టర్ ట్రంప్.. మీకెందుకంత కోపం వస్తోంది. కుర్చీ అయితే మాత్రం?! కబుర్లు చెప్పాలని ఉండదా తనకు?!’ అని కుర్చీకి సపోర్ట్‌గా వెళ్లి ఉండేవారు. అప్పుడు ట్రంప్‌కు ఇంకా కోపం వచ్చి ఉండేది. ‘కుర్చీకి బుద్ధి లేకపోతే నీకు బుద్ధుండక్కర్లా? కుర్చీ.. కబుర్లు చెబుతోందని వింటూ కూర్చుంటావా?’ అని కుర్చీ ముందే కమలని తిట్టేసేవాడు. స్త్రీ ద్వేషి! అయినా ఫస్ట్ డే ఫస్ట్ టైమ్ ప్రెసిడెంట్ చెయిర్లో కూర్చొని, వెళ్లిపోయిన ప్రెసిడెంట్ గురించి ఆలోచిస్తున్నానేమిటి! కాళ్లు లాగుతున్నాయి! కుర్చీలో వెనక్కి వాలి, రెండు కాళ్లూ లేపి లేబుల్‌పై పెట్టే ప్రయత్నం చేశాను. కుర్చీ వెనక్కి వెళ్లడం లేదు! అమెరికా ప్రెసిడెంట్లకు కాళ్లు టేబుల్ పైన ఎత్తి పెట్టి కూర్చునే అలవాటు ఉంటుంది. ఒబామా అయితే కాళ్లు టేబుల్ మీద ఎత్తి పెట్టుకోడానికే వచ్చి కుర్చీలో కూర్చున్నట్లుగా ఉండేవారు! నేను మాత్రం పూర్వపు ప్రెసిడెంట్లు కూర్చున్నంత స్వేచ్ఛగా కాళ్లెత్తి పెట్టుకోడానికి లేదు. కమల ఎప్పుడొచ్చి.. ‘హాయ్.. మిస్టర్ ప్రెసిడెంట్’ అంటారో తెలీదు. అదీగాక ఎన్నికల ఫలితాలు వచ్చీరావడంతోనే ఆమెకు చెప్పేశాను.. ‘మన మధ్య ఎక్స్క్యూజ్మీలు, మే ఐ కమిన్లు ఉండకూడదు’ అని. ఆ మాటకు కమల పెద్దగా నవ్వారు. ‘మిస్టర్ ప్రెసిడెంట్.. నేను మిమ్మల్ని ‘మే ఐ కమిన్’ అని అడగక్కర్లేదు. కానీ మీరు నన్ను ‘మే ఐ కమిన్’ అని అడగడం నాకు సౌకర్యంగా ఉంటుంది’’ అన్నారు. నిజమే కదా! ఓవల్ ఆఫీస్ ఇక తనకు అలవాటు లేని కొత్త మర్యాదల్ని నేర్చుకోవడం మొదలుపెట్టాలి. కొంచెం శుభ్రం, కొంచెం శుచీ కూడా.. మాటల్లో, చేతల్లో, చూపుల్లో. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్, మే ఐ కమిన్’’ అంటూ వచ్చారు కమల! ‘‘ప్లీజ్ కమ్.. మీ గురించే ఆలోచిస్తున్నాను’’ అన్నాను. ‘‘నా గురించా!’’ అని పెద్దగా నవ్వారు కమల. ఆమె నవ్వు బాగుంది. ‘‘అవును మీ గురించే’’ అన్నాను. ‘‘ఏంటి నా గురించి!’’ అన్నారు. ‘‘ఓవల్ ఆఫీస్ మీకు డే వన్ నుంచే అలవాటవుతుంది. ఓవల్ ఆఫీస్‌కి మీరు ఎప్పటికి అలవాటవుతారా అని ఆలోచిస్తున్నాను’’ అన్నాను. క్షణం ఆగగలిగి, నవ్వునిక ఆపుకోలేక పోయారు కమల. -
ఈటల రాజేందర్ (హెల్త్ మినిస్టర్) రాయని డైరీ
వ్యాక్సినేషన్లో పార్టిసిపేట్ చేసి గాంధీ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాను. వ్యాక్సిన్ వేయించుకున్నట్లు గుర్తుగా ఎడమ చేతి బొటనవేలికి ఇంకు చుక్క పెడుతున్నారు. రెండు వారాల తర్వాత రెండో డోస్ అంటున్నారు. అప్పుడు అదే వేలి మీద రెండో చుక్క పెడతారో, ఇంకో వేలేదైనా పట్టమంటారో! ఆ మాటే అడిగాను సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీని. బయట నాకోసం ఎదురుచూస్తూ ఉన్నాడతను. తెలంగాణ హెల్త్ సెక్రెటరీ. మనిషి చువ్వలా ఉంటాడు. యాంటీ బయాటì క్స్‌తో ల్యాబ్‌లో తయారైనట్లుగా ఉంటుంది బాడీ. ‘‘మీరు గ్రేట్ సర్’’ అన్నాడు. ‘‘దేనికి గ్రేట్ రిజ్వీ భయ్యా’’ అని అడిగాను. ‘‘నిన్న ప్రెస్ మీట్లో ‘మొదటి వ్యాక్సిన్ నేనే తీసుకుంటాను’ అంటున్నప్పుడు మీ కళ్లల్లో భయం కనిపించలేదు. ఈరోజు గాంధీ హాస్పిటల్ నుంచి బయటికి వస్తున్నప్పుడూ మీ కళ్లల్లో భయం కనిపించడం లేదు!’’ అన్నాడు. ‘‘అందులో గ్రేట్ ఏముంది రిజ్వీ భయ్యా! ఆరోగ్యశాఖ మంత్రికి ప్రజలొచ్చి ధైర్యం చెబుతారా? ఆరోగ్యశాఖ మంత్రే కదా వెళ్లి ప్రజలకు ధైర్యం చెప్పాలి’’ అన్నాను. ‘‘అయినా గానీ మీరు గ్రేట్ సర్. రెండోసారి వ్యాక్సినప్పుడు రెండో చుక్కను మళ్లీ అదే చేతికి, మళ్లీ అదే వేలికీ వేస్తారా అని అడిగారు తప్పితే, వ్యాక్సిన్‌ని మళ్లీ అదే చేతికి, అదే జబ్బకు వేస్తారా అని మీరు అడగలేదు. అది కూడా ధైర్యమే కదా సార్’’ అన్నాడు రిజ్వీ. నవ్వాను. చెయ్యి చురుక్ మంది! నవ్వితే చురుక్మందా? వ్యాక్సినేషన్లో పార్టిసిపేట్ చేసి వచ్చినందుకు చురుక్కుమనడం మొదలైందా?! రమేశ్‌రెడ్డి, శ్రీనివాస్ నా వెనకే వస్తున్నారు. రిజ్వీని వెళ్లనిచ్చి రమేశ్‌రెడ్డిని, శ్రీనివాస్‌ని దగ్గరకు పిలిచాను. రాలేదు! దూరం నుంచే.. ‘చెప్పండి సర్’ అన్నారు! ‘‘వ్యాక్సినేషన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ల నుంచి ఏమీ అంటవులేవయ్యా.. రండి దగ్గరకు..’’ అని పిలిచాను. ధైర్యం చేసి వచ్చారు. రమేశ్‌రెడ్డి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. శ్రీనివాస్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్. ‘‘వాళ్లు వేస్తున్నది కోవాగ్జినా, కోవిషీల్డా’’ అని అడిగాను. ‘‘గమనించలేదు సార్’’ అన్నారు! ‘‘హెల్త్ మినిస్టర్ పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామ్ని కూడా మీరు గమనించరా! వ్యాక్సిన్‌కి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో కనీసం అదైనా తెలుసా?’’ అన్నాను. చెయ్యి మళ్లీ చురుక్కుమంది. ‘‘సూది గుచ్చిన చోట ‘చురుక్’ మంటుంది సర్..’ అన్నాడు రమేశ్‌రెడ్డి. ‘‘అది సైడ్ ఎఫెక్ట్ ఎందుకౌతుంది రమేశ్రెడ్డీ.. ఎఫెక్ట్ అవుతుంది కానీ! నువ్వు చెప్పలేవా శ్రీనివాస్.. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో?’’ అన్నాను. ‘‘సర్.. ఒకట్రెండు ఉంటాయి. తలనొప్పి, అలసట, కండరాల నొప్పి, జ్వరం, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు. ఇంకా.. కడుపులో వికారం, వాంతులు, చెమటలు పట్టడం, జలుబు, దగ్గు, వణుకు, చికాకు..’’ చెప్పుకుంటూ పోతున్నాడు! ఆగమన్నాను. ఒకట్రెండు అని చెప్పి బాడీలో ఏ పార్ట్‌నీ వదలడం లేదు! ‘‘శ్రీనివాస్.. నేనడిగింది సైడ్ ఎఫెక్ట్స్ గురించి. నువ్వు చెబుతున్నది కరోనా సింప్టమ్స్ గురించి..’’ అన్నాను. ‘‘రెండూ ఒకేలా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు సార్. వ్యాక్సిన్ వేసుకోకుండానే ఈ లక్షణాలు కనిపిస్తే కరోనా అన్నట్టు. వ్యాక్సిన్ వేసుకోగానే కనిపిస్తుంటే వ్యాక్సిన్ పని చేస్తున్నట్టు..’’ అన్నాడు రమేశ్‌రెడ్డి. తలనొప్పి మొదౖలైంది! ‘వ్యాక్సిన్ వేయించుకోకున్నా ఊరికే వ్యాక్సినేషన్లో పార్టిసిపేట్ చేసి వచ్చినందుకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా శ్రీనివాస్..’ అని అడగబోయీ అడగలేదు. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: నరేంద్ర మోదీ (ప్రధాని).
‘‘మెస్మరైజ్ చేశారు మోదీజీ మీ సన్‌రైజ్ కవిత్వంతో..’’ అని ఉదయాన్నే ఫోన్ చేశాడు హర్షవర్ధన్! ‘‘హర్షవర్ధన్.. నిన్న కదా నా కవిత్వానికి నువ్వు మెస్మరైజ్ అవాల్సింది’’ అన్నాను. ‘‘నేను మళ్లీ ఈరోజు విన్నాను మోదీజీ. నిన్న వ్యాక్సిన్ ఏర్పాట్లలో ఉండి.. విన్నానని, బాగుందనీ చెప్పలేకపోయాను. ‘అభీ తో సూరజ్ ఉగా హై..’ అని మీ గొంతులోంచి దిగుతున్న కవిత్వం, సూర్యుణ్ణి పైకి లేపుతోంది’ అన్నాడు. ‘నా కవిత్వం బాగుందన్న విషయాన్ని నువ్వు నీ కవిత్వంతో చెప్పక్కర్లేదు హర్షవర్ధన్. చెప్పు.. ఏంటి? ’’ అన్నాను. ‘‘జనవరి ఫస్ట్ ఉదయం ఆలస్యంగా లేవకూడదనుకుని డిసెంబర్ థర్టీ ఫస్ట్‌న త్వరగా పడుకున్నాను మోదీజీ. త్వరగా పడుకున్నందువల్ల త్వరగా నిద్ర పట్టింది కానీ, త్వరగా నిద్ర లేవలేకపోయాను! మధ్యాహ్నం అయింది. ‘సూర్యుడిప్పుడే మేల్కొన్నాడు’ అని మోదీజీ గొప్ప కవిత్వం రాసి చదివారు విన్నారా?’ అని అమిత్జీ ఫోన్ చేసి అడిగారు. ‘వినబోతుంటేనే మీరు ఫోన్ చేశారు’ అని ఆయనకు చెప్పి, విన్నాక మీకు ఫోన్ చేశాను మోదీజీ’’ అన్నాడు. ‘‘ఏం చెబుతామని ఫోన్ చేశావో అది చెప్పు హర్షవర్ధన్. జనవరి ఫస్ట్ కోసం చదివిన కవిత్వం అది. ఫస్ట్ వెళ్లిపోయింది కదా.. నెక్స్›్ట ఏమిటో చెప్పు..’’ అన్నాను. ‘‘నెక్స్›్ట మళ్లీ రెండువేల ఇరవై రెండులోనే కదా మోదీజీ ఇంకో జనవరి ఫస్ట్ సన్‌రైజ్ ఉంటుంది’’ అన్నాడు!! దేశంలోకి కరోనా ఎంటరైనప్పటి నుంచి హర్షవర్ధన్ నెలల్నీ, రోజుల్నీ వదిలేసి, సంవత్సరాల్లోనే మాట్లాడుతున్నాడు! కరోనా ఎప్పటికి పోతుంది? కనీసం ఏడాది. కరోనాకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది? ఏడాది తర్వాతే. వ్యాక్సిన్ పని చేస్తుందా? ఏడాదికి గానీ తెలి యదు. మళ్లీ రాకుండా ఉంటుందా? ఏడాది చూసి గానీ చెప్పలేం. ఏడాదిగా ఇంతే! ఇప్ప టికీ హర్షవర్ధన్ తన స్టాండ్‌పై తను ఉన్నాడు. ‘అలా ఎలా చెబుతావ్ హర్షవర్ధన్?’ అని ఓ రోజు ఫోన్ చేసి అడిగాను. తన స్టాండు మార్చుకోలేదు! ‘ఆరోగ్యశాఖ ధైర్యం చెప్ప కూడదు మోదీజీ. ప్రజల్లో భయం పోతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భయం చెప్పిందే కానీ..వ్యాక్సినొస్తుందని గానీ, వచ్చిన వ్యాక్సిన్ బాగా పని చేస్తుందని గానీ ఏనాడూ ధైర్యం చెప్పలేదు’ అన్నాడు. ఇప్పుడైనా స్టాండు దిగాడో లేదో?! ‘‘ వ్యాక్సిన్ డ్రై రన్ బాగానే జరుగుతోందా హర్షవర్ధన్? మనవి కోవిషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు కదా. ఫారిన్ వాళ్ల ఫైజర్ వ్యాక్సిన్ ఎలా పని చేస్తోందట? రష్యా వాళ్ల స్పుత్నిక్ వ్యాక్సిన్ గురించి ఏమైనా తెలిసిందా?’’ అని అడిగాను. ‘‘ఇప్పుడే అడిగితే బాగా పని చేస్తుందని చెబుతారు మోదీజీ. ఏడాది తర్వాత అడుగుదాం’’ అన్నాడు! ‘‘బాగా పనిచేస్తుంటే మనమూ ఫైజర్ వ్యాక్సిన్ తెప్పించుకుందాం హర్షవర్థన్. కోవి షీల్డ్, కోవాగ్జిన్ కోసం ఆగడం ఎందుకు? డ్రై రన్ కూడా మొదలుపెట్టేశాం కదా..’’ అన్నాను. ‘‘మోదీజీ.. ఫైజర్ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో తెలీదు. స్పుత్నిక్ వ్యాక్సిన్ ఎలా పని చేస్తుందో తెలీదు. మన కోవిషీల్డ్, కోవాగ్జిన్లు ఎలా పని చేస్తాయో తెలీదు. ఒకటి మాత్రం నమ్మకంగా చెప్పగలను’’ అన్నాడు! ‘చెప్పగలను’ అన్నాడు కాబట్టి చెప్పడం కోసం ఆగాను. ‘‘మోదీజీ.. డిసెంబర్ థర్టీఫస్టంతా నాకు గొంతునొప్పిగా ఉంది. కాస్త జ్వరంగా కూడా ఉంది. రెండు మూడు పొడి దగ్గులూ దగ్గాను. జనవరి ఫస్ట్ మధ్యాహ్నం నుంచీ అవేమీ లేవు. అందుకే అన్నాను.. మెస్మరైజ్ చేశారు మీ సన్‌రైజ్ కవిత్వంతో.. అని. అది చెప్పడానికే ఫోన్ చేశాను’’ అన్నాడు!! -
రేవంత్‌రెడ్డిని మాత్రం కానివ్వను..
రేవంత్‌రెడ్డిని ప్రెసిడెంట్‌ని చేస్తారని మళ్లీ ఓ బ్రేకింగ్. రెండు రోజులుగా టీవీల్లో ఆ బ్రేకింగ్ వినిపిస్తూనే ఉంది. బ్రేకే రావడం లేదు. మీరుండగా, కోమటిరెడ్డి ఉండగా, భట్టి విక్రమార్క ఉండగా, శ్రీధర్‌బాబు ఉండగా, జీవన్‌రెడ్డి ఉండగా, పొన్నం ప్రభాకర్ ఉండగా, మధు యాష్కీ ఉండగా.. టీడీపీని ముంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్‌ని చెయ్యడం ఏమిటని టీవీ చానెళ్ల వాళ్లు మైకులు, వ్యాన్లు వేసుకొచ్చి బాధగా మా ఇంటి బయట అరుగు మీద కూర్చున్నారు. నేనూ బయటికే కనిపించేలా ఇంటి లోపల కూర్చొని ఉన్నాను. కొద్దిసేపు అలా కూర్చున్నాక.. దారిన పోయేవాళ్లు నన్ను, మీడియాను కలిపి చూసుకుంటూ వెళ్తున్నట్లు అనిపించి పడక్కుర్చీలోంచి కుర్చీలోకి మారాను. ‘‘హనుమంతరావు గారూ.. మీకేం వయసైపోయిందని.. మీరుండగా, కోమటి రెడ్డి ఉండగా, భట్టి విక్రమార్క ఉండగా..’’ అని మళ్లీ మొదలు పెట్టారు! ‘‘ఇదిగో బాబూ.. నేనేమీ అనుకోను గానీ, ‘మీరుండగా..’ అని అనడానికి మీరేమీ కష్టపడకండి. నేను కాకుండా మిగతావాళ్లలో ఎవరు ప్రెసిడెంట్ అయినా నేనేమీ అనుకోను. రేవంత్‌రెడ్డిని మాత్రం కానివ్వను’’ అన్నాను. ‘‘ఒకవేళ అయితే?’’ అని గుంపులోంచి ఎవరో అన్నారు. అతడి వైపు చూశాను. ‘కానివ్వను’ అని నేను అంటుంటే, ‘ఒకవేళ అయితే’ అని అంటున్నాడు! ‘‘నువ్వుగానీ సోనియాజీతో మాట్లాడి రేవంత్‌రెడ్డిని ప్రెసిడెంట్‌ని చేయబోతున్నావా?’’ అని అడిగాను. అతడు మళ్లీ మాట్లాడలేదు. సమర్థుడు కాని వారెవరినీ కాంగ్రెస్ చేరనివ్వదు. సమర్థులైనవారిని చేరదీసేందుకు తొందరపడదు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తొందరపడి వెళ్లిపోయాడు కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం అని ఉత్తమ్‌ని గానీ, నన్ను గానీ, తక్కిన సీనియర్లను గానీ కాంగ్రెస్ అడిగిందా?! రాహుల్ అడిగాడా, సోనియా అడిగారా, గులామ్ నబీ ఆజాద్ అడిగారా? నిజానికి వీళ్లంతా అడగవలసిన బాధ్యత ఉన్నవాళ్లు. మోదీని అడుగుతారు. మోదీని అడగమని రాష్ట్రపతిని అడుగుతారు. సొంత పార్టీలోని వాళ్లను మాత్రం ఒక్క మాటా అడగరు. కాంగ్రెస్‌లో ఉండే పద్ధతీ పెద్దరికమే ఇది. నిలబడి నీళ్లు తాగడం మేలనుకుంటుంది. అప్పటికీ తాగదు. పరుగెత్తడం లేదు కదా, తాగడం ఎందుకు అనుకుంటుంది! నాకైతే నమ్మకం. టీపీసీసీ పోస్టును ఇప్పట్లో కాంగ్రెస్ ఎవరికీ ఇవ్వదు. ప్రధాని కొన్ని కేబినెట్ పోస్టుల్ని దగ్గర పెట్టుకున్నట్లుగా కాంగ్రెస్ అధిష్టానం పార్టీ ప్రెసిడెంట్ పోస్టులను బూజు పట్టేవరకు తన దగ్గరే ఉంచుకుంటుంది. పార్టీ ఓడిపోడానికి, పార్టీ ప్రెసిడెంటుకు సంబంధం లేదని కాంగ్రెస్ నమ్ముతుంది కనుక పార్టీని గెలిపించడం కోసమైతే మాత్రం పార్టీ ప్రెసిడెంటును నియమించదు. పార్టీ ఓడిపోయిందని పార్టీ అధ్యక్షుల్ని తొలగించదు. రాహుల్ అయినా, ఉత్తమ్ అయినా ఓటమి బాధ్యతను వాళ్ల భుజాన వాళ్లు వేసుకుని వెళ్లిపోవడమే. కాంగ్రెస్ ఏం చేస్తుందో ఏం చెయ్యదో ఊహించడం కూడా కష్టమే. పార్టీని గెలిపించలేకపోయిన వాళ్లను ఎంపిక చేసుకుని మరీ అధ్యక్షుడిని చేసినా చేస్తుంది! జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి నలభై ఎనిమిది డివిజన్లకు ఇన్చార్జిగా ఉన్నాడు. బీజేపీకీ సరిగ్గా నలభై ఎనిమిది సీట్లొచ్చాయి. కాంగ్రెస్‌కు రెండంటే రెండే. పెరగలేదు. తగ్గలేదు. అందుకు రేవంత్‌రెడ్డి కారణం కాదనుకుంటే కనుక రేవంత్‌ని ప్రెసిడెంట్‌ని చెయ్యడానికి కాంగ్రెస్‌కి కారణం ఉండదు. మీడియా వాళ్లకు బ్రేకింగ్ ఏదో వచ్చినట్లుంది! సరంజామా సర్దుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి దగ్గరకే కావచ్చు. వర్క్ లేకున్నా ప్రెసిడెంట్లు అయ్యే వర్కింగ్ ప్రెసిడెంట్లు కాంగ్రెస్‌లోనే ఉంటారు. మాధవ్ శింగరాజు -
బండి సంజయ్ (బీజేపీ).. రాయని డైరీ
ప్రెస్‌వాళ్లు వచ్చి కూర్చున్నారు. తెలంగాణలో బీజేపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక తొలిసారి ఆ సీఎం పెట్టిన ప్రెస్ మీట్‌కు వచ్చినట్లుగా వచ్చింది మీడియా మొత్తం! హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం ముందు పార్టీ ఆఫీసు బాగా చిన్నదైపోయినట్లుగా కనిపిస్తోంది. ఒకరిద్దరు మీడియా మిత్రులు ఒకే కుర్చీపై సర్దుకుని కూర్చోవడం గమనించాను. ‘‘ఈ విజయాన్ని మీరెలా ఆస్వాదిస్తున్నారు?’’ అని వారిలోంచి ఒకరు అడగడంతో నా ప్రమేయం లేకుండానే ప్రెస్ మీట్ మొదలైంది. అసలైతే ప్రెస్ మీట్‌ను నేను ఇంకోలా ప్రారంభించాలని తలచాను. ‘‘మీరెలా ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు?’’ అని నేనే ప్రెస్‌ను అడగదలచుకున్నాను. మోదీజీ అయితే ఇలానే అడుగుతారు ప్రెస్‌ని. అయినా, ఆయనెప్పుడు విజయాన్ని ఆస్వాదించారని! ఆరేళ్లుగా ప్రతిపక్షాల అపజయాలను ఆస్వాదించడంతోనే సరిపోతోంది మోదీజీకి. ‘‘చెప్పండి, ఈ విజయాన్ని మీరెలా ఆస్వాదిస్తున్నారు?’’ అని గద్దించినట్లుగా తన ప్రశ్నను రిపీట్ చేశాడు ఆ పత్రికా ప్రతినిధి. ‘‘విజయం ఆసనం లాంటిది. ఆసనంపై ఆసీనమవడమే కానీ, ఆస్వాదించడం ఉండదు’’ అన్నాను. ఆ మాటకు ఎవరైనా నవ్వుతారని ఆశించాను. నవ్వలేదు! ప్రెస్ మీట్లో కేసీఆర్ ఏదైనా అంటే నవ్వుతారు. కేటీఆర్ ఏదైనా అంటే నవ్వుతారు. కేసీఆర్ లేదా కేటీఆర్ మాటలకే నవ్వడానికి వీళ్లు అలవాటు పడ్డారా?! అలా అలవాటు చేయబడ్డారా?! ‘మిత్రులారా, బీజేపీ విజయం గురించి అడగడానికి మీ దగ్గర ప్రశ్నలేమీ ఉండవని నాకు తెలుసు. టీఆర్ఎస్ అపజయం గురించి మీరు కొన్ని ప్రశ్నలు వేయవచ్చు..’’ అన్నాను. ‘‘టీఆర్ఎస్ది అపజయం అని మీరెలా అంటారు బండి గారు’’ అన్నాడు ఓ ప్రతినిధి. ఆశ్చర్యపోయాను. ‘‘కొన్ని గంటల ముందే కదా.. ప్రెస్‌కి మా విజయాన్ని గుర్తించవలసిన పరిస్థితి ఏర్పడి మీరంతా నన్ను కలుసుకున్నది. ఆ కొత్తదనమైనా లేకుండా అప్పుడే మీరు నన్ను బండి గారు అంటున్నారేమిటి! నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నదేమిటంటే.. బీజేపీ విజయాన్ని మీరు టీఆర్ఎస్ అపజయంగా భావించో లేదా, టీఆర్ఎస్ అపజయాన్ని బీజేపీ విజయంగా భావించో బీజేపీని ఏ విధంగానూ అంగీకరించేందుకు మనసొప్పక, ఆ అనంగీకారతతో నన్ను ‘బండి’ అని సంబోధిస్తున్నారని! ఇక నా అభ్యర్థన ఏమిటంటే.. నేను మీ చేత బండి అని పిలిపించుకోడానికి నాక్కొంత శక్తిని, తగినంత సమయాన్ని ఇమ్మని. ఇప్పటికైతే సంజయ్ అనొచ్చు’’ అన్నాను. ఈలోపు మరొక ప్రతినిధి చెయ్యి లేపాడు. ‘‘సంజయ్ గారూ.. టీఆర్ఎస్ సీట్లు తగ్గి, బీజేపీ సీట్లు ఎక్కువ రావడానికి మీకు కనిపి స్తున్న కారణాలు ఏమిటి? మీకు అనిపిస్తున్న కారణాలు ఏమిటి?’’ అని అడిగాడు. ‘‘మిత్రమా.. నాకు కనిపిస్తున్న కారణాలు, నాకు అనిపిస్తున్న కారణాలు ఏమిటని మీరు అడిగారు. నిజానికి మీకు కదా కారణాలు కనిపించవలసినదీ, కారణాలుగా ఏవైనా అనిపించవలసినదీ. కనుక మీరే చెప్పండి’’ అని అడిగాను. తర్వాత కొన్ని ప్రశ్నలు. వాటికి జవాబులుగా నా ప్రశ్నలు. చివరి ప్రశ్న ఒక మహిళా ప్రతినిధి నుంచి వచ్చింది. ‘‘సంజయ్ గారూ.. మీరేమైనా చెప్పదలచుకున్నారా?’’ అని! గుడ్ క్వొశ్చన్ అన్నాను. ‘‘అయితే గుడ్ ఆన్సర్ ఇవ్వండి’’ అన్నారు నవ్వుతూ ఆ ప్రతినిధి. ‘‘నేను చెప్పదలచినది, గ్రేటర్ ఫలితాలు చెప్పేశాయి’’ అన్నాను. -
ఉత్తమ్‌కుమార్ మాటెత్తడానికే వణుకు..
ప్రత్యర్థి కళ్లలోని భయాన్ని బాగా దగ్గరగా చూస్తున్నప్పుడు కలిగే గెలుపు భావన ముందు, నిజమైన గెలుపు కూడా ఒక గెలుపులా అనిపించదు. మోదీ, కేసీఆర్, ఒవైసీ కళ్లలో అలాంటి భయాన్ని కొన్నాళ్లుగా నేను చూస్తున్నాను. ఘన విజయం సాధించబోతున్న కాంగ్రెస్‌ను తలచుకుని కావచ్చు ఆ భయం. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలకు ఒక కొత్త కాంగ్రెస్‌ను, శక్తిమంతమైన కాంగ్రెస్‌ను, తిరుగులేని కాంగ్రెస్‌ను, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు సుడిగాలిలా తిరుక్కుంటూ వెళ్లగలిగిన కాంగ్రెస్‌ను చూపించబోతున్నాయి. ఫలితాలు అలా చూపిస్తున్నప్పుడు, ఫలితాలను వారు అలా చూస్తున్నప్పుడు, వారి కళ్లలోకి రాహుల్ గాంధీ చూస్తున్నప్పుడు.. నేను రాహుల్ గాంధీ కళ్లలోకి చూస్తూ ఉంటాను డిసెంబర్ నాలుగున! రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక కానీ, అధ్యక్షుడిగా ఉండలేనని వెళ్లాక గానీ, ఉంటే బాగుంటుందని మళ్లీ ఆయన్ని అందరం బతిమాలినప్పుడు గానీ, బతిమాలినా ఆయన ఉండనప్పుడు గానీ ఇంత పెద్ద గిఫ్టును ఎవరూ గానీ ఆయనకు ఇచ్చి ఉండరు. దేశంలోని ఒక టీపీసీసీ అధ్యక్షుడిగా తొలిసారి ఒక గెలుపును రాహుల్ చేతికి నేను గిఫ్టులా ఇవ్వబోతున్నాను. బహుశా అది కూడా ఊహించి ఉండాలి మోదీ, కేసీఆర్, ఒవైసీ. కాంగ్రెస్ అంటే ఎంత భయం లేకుంటే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం మోదీ ఆదిత్యనాథ్‌ని హైదరాబాద్ పంపిస్తాడు! ఇక్కడ ఉత్తమ్‌కుమార్ ఉన్నాడనే కదా ఉత్తరప్రదేశ్ నుంచి ఒకరు రావడం. కాంగ్రెస్ అంటే ఎంత భయం లేకుంటే మోదీ బీజేపీ చీఫ్ నడ్డాను ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపిస్తాడు. ఇక్కడ ఉత్తమ్‌కుమార్ అనే ఒక చీఫ్ ఉన్నాడనే కదా. కాంగ్రెస్ అంటే ఎంత భయం లేకుంటే హోమ్‌మంత్రి అమిత్‌షాను, సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని హైదరాబాద్ పంపిస్తాడు! ఇక్కడ ఉత్తమ్‌కుమార్ అనే ఎంపీ ఉన్నాడనే కదా. కాంగ్రెస్ అంటే, ఉత్తమ్‌కుమార్ అంటే ఎంత భయం లేకుంటే వీళ్లందర్నీ పంపించమని మోదీని బండి సంజయ్ అడిగి ఉంటాడు! కేసీఆర్‌ని చూసో, కేసీఆర్ కొడుకు కేటీఆర్‌ను చూసో భయం కాదు బీజేపీకి. కాంగ్రెస్‌ను చూసి. కాంగ్రెస్‌లో ప్రజాకర్షణ కలిగిన రాహుల్‌గాంధీని చూసి. రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాకపోయినా అతడి నాయకత్వంలో పని చేస్తున్న నా వంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని చూసి. కేసీఆర్ అండ్ సన్ కూడా బీజేపీని చూసి భయపడటం లేదు. ఎం.ఐ.ఎం.ను చూసి భయపడటం లేదు. మిగ్ 21, మిగ్ 23 యుద్ధ విమానాలు నడిపిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ పైలట్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వారికి కలలోకి వస్తున్నాడు. కాంగ్రెస్ పైలట్‌గా ఆ కలలో విజయ విన్యాసాలు చేస్తున్నాడు. అది చూసి భయపడుతున్నారు! అందరి భయాలను గమనిస్తూనే ఉన్నాను. బండి సంజయ్‌కి, కిషన్‌రెడ్డికి, ఒవైసీకి తొడగొడుతున్న కేసీఆర్, కేటీఆర్.. ఉత్తమ్‌కుమార్ ముందు తోక ముడుస్తున్నారు. కేసీఆర్‌ని, కేటీఆర్‌ని ‘బస్తీమే సవాల్’ అంటున్న బండి సంజయ్, కిషన్‌రెడ్డి, ఒవైసీ.. ఉత్తమ్‌కుమార్ మాటెత్తడానికే వణికిపోతున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వీప్ చేస్తుందనీ, కాంగ్రెస్‌ది ల్యాండ్‌స్లైడ్ విక్టరీ కాబోతోందని మోదీకి కూడా తెలిసిపోయినట్లుంది. హైదరాబాద్ వచ్చి కూడా వాక్సిన్ కోసమని అట్నుంచటే పుణె వెళ్లిపోయారు. ఒక్క కాంగ్రెస్‌ను ఓడించడానికి ఇంతమంది ఒక్కటై కాంగ్రెస్‌కు భయపడటం చూస్తుంటే పోలింగ్‌కు ముందే, కౌంటింగ్‌కు ముందే, ఫలితాల వెల్లడికి ముందే పార్టీలన్నీ ఓడిపోయాయని! భయపడుతూ గెలిచినా అది ఓటమే. ధైర్యంగా ఓడినా అది గెలుపే. ఎలా చూసినా కాంగ్రెస్సే అంతిమ విజేత. -
రాయని డైరీ : కపిల్ సిబల్ (కాంగ్రెస్)
‘‘ఉన్నారా?’’ అని ఫోన్ చేశారు చిదంబరం! ‘‘ఉన్నాను చెప్పండి చిదంబరం జీ’’ అన్నాను. ‘‘మీరూ నేను ఎక్కడికి పోతాం చెప్పండి సిబల్ జీ. ‘ఉన్నారా’ అని నేను అడిగింది ‘మీరు ఉన్నారా’ అని కాదు. ‘మీ పక్కన ఎవరైనా ఉన్నారా’ అని’’ అన్నారు చిదంబరం. నాకూ ఆ సందేహం వచ్చింది. నాకు ఫోన్ చేసి నన్నే ‘ఉన్నారా’ అని చిదంబరం ఎందుకు అడుగుతారు.. ఎంత నాకన్నా మూడేళ్లు పెద్దవారైతే మాత్రం! ఆ మాటే చిదంబరంతో అన్నాను. పెద్దగా నవ్వారు. కాంగ్రెస్‌లో వయసుడిగేవారు, వయసడిగేవారు ఉండరు. ‘‘సో, ఎవరూ లేరు మీ పక్కన. ఉంటే మీరు మీ వయసు గురించి కానీ, నా వయసు గురించీ కానీ ఆలోచించేవారు కాదు కదా..’’ అని మళ్లీ నవ్వారు. నవ్వి, ‘‘ఎక్కడున్నారు?’’ అని అడిగారు. ఒక్క క్షణం ఆగాను. నేనున్నది ఢిల్లీలో. ఢిల్లీలో ఉన్నాను అని చెబితే.. ఢిల్లీలో కాంగ్రెస్ లేదని తెలిసీ ‘విషయాలేంటి?’ అని అడుగుతారు. కొన్నిసార్లు నేను జలంధర్‌లో కూడా ఉంటాను. జలంధర్‌లో ఉన్నానని చెబితే పంజాబ్‌లో ఉన్నది కాంగ్రెస్సే కనుక ‘విషయాలేంటి?’ అని అడగరు. ఓసారి ఇలాగే జలంధర్‌లో ఉన్నానని చెబితే టప్మని ఫోన్ పెట్టేశారు. ‘ ఫోన్ పెట్టేశారేమిటి?’ అని వెంటనే ఫోన్ చేసి అడిగాను. ‘ఢిల్లీలో ఉన్నారేమో విషయాలేంటి అని అడుగుదామనుకున్నాను. జలంధర్‌లో ఉన్నానన్నారు కనుక విషయాలేముంటాయ్ లెమ్మని పెట్టేశాను’ అన్నారు. అది గుర్తొచ్చి, జలంధర్‌లో ఉన్నాను అని అబద్ధం చెప్పాను. విషయాలు అడగరని. ‘‘జలంధర్‌లో ఉన్నారా.. ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు?’’ అన్నారు. ‘‘ఎందుకు చిదంబరం జీ?’’ అని అడిగాను. ‘‘ఏం లేదు, మీరు ఢిల్లీ వెళ్లాక ‘విషయాలేంటి?’ అని అడుగుదామనీ..’’ అన్నారు! ఒక గంటలో ఢిల్లీలో ఉంటాను. నేనే మీకు ఫోన్ చేస్తాను’’ అన్నాను. గంట తర్వాత ఆయనే చేశారు! ‘‘ఉన్నారా?’’ అని అడిగారు! ‘చేరుకున్నారా?’ అని అడగాలి. ‘ఉన్నారా?’ అని అడిగారు! తెలిసిపోయిందా నేను ఢిల్లీలోనే ఉన్నట్లు?! ‘‘చిదంబరం జీ, ‘ఢిల్లీ చేరుకున్నారా?’ అని కదా మీరు నన్ను అడగవలసింది, ‘ఉన్నారా?’ అని అడిగారేమిటి?’’ అని అడిగాను, ‘‘చేరుకుని ఉంటారని ఊహించి.. ‘ఉన్నారా?’ అని అడిగాను’’ అన్నారు! ‘ఉన్నాను..’ అని మళ్లీ నన్ను చెప్పనివ్వకుండా.. ‘‘మీ పక్కన ఎవరైనా ఉన్నారా?’’ అని అడిగారు. ‘‘లేరు చిదంబరం జీ, నా పక్కనెవరూ లేరు చెప్పండి’’ అన్నాను. ‘‘ఎక్కడున్నారు?’’ అని అడిగారు!! ‘‘ఢిల్లీలోనే చిదంబరం జీ.. మీకెందుకు డౌటొచ్చిందీ’’ అన్నాను. ‘‘ఎక్కడున్నారు అని అడిగింది మిమ్మల్ని కాదు సిబల్ జీ, మీ పక్కన లేనివారు ఇప్పుడెక్కడున్నారూ అని..’’ అన్నారు! చిదంబరం అడుగుతున్నది సోనియాజీ గురించని నాకు అర్థమైంది. ‘‘మీరెక్కడున్నారు చిదంబరం జీ’’ అని అడిగాను. నా పక్కన లేని వారు ఆయన పక్కన ఉండి, వారిపై నా మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారేమోనని సందేహం వచ్చి అలా అడిగాను. చిదంబరం పెద్దగా నవ్వారు. ‘‘సిబల్ జీ, మీ ధైర్యాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ఇంకో నూటా ముప్పై నాలుగేళ్లు అక్బర్ రోడ్డులోనే పటిష్టంగా ఉంటుందనిపిస్తోంది. గోవాలో రెస్ట్ తీసుకుంటున్న సోనియాజీ కనుక చెన్నైలో కూడా కొన్నాళ్లు ఉండేందుకు వస్తారేమో ముందే తెలిస్తే, నేను ఢిల్లీ వద్దామని మీకు ఫోన్ చేశాను. అంతే.’’ అన్నారు. ధైర్యంలో ఆయన నాకంటే ఏం తక్కువో నాకు అర్థం కాలేదు!! - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: డొనాల్డ్ ట్రంప్ (అధ్యక్ష అభ్యర్థి)
‘‘అమెరికా అధ్యక్షుడా.. అమెరికా అధ్యక్షుడా..’’ అని జో బైడెన్‌ను డెమోక్రాట్లు కీర్తిస్తున్నారు. నృత్యాలు చేస్తున్నారు. అమెరికన్ల జాతీయవాద భావనను గౌరవించని ఉదారవాద సెక్యులర్ సన్నాసులతో కలసి మద్యం సేవిస్తున్నారు. ఓట్లు దొంగిలించి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అవగలడు. డొనాల్డ్ ట్రంప్‌లా నికార్సయిన ఒక మంచి అమెరికన్ కాగలడా! అమెరికా కర్మ ఫ్లోరిడా అడవుల్లా కాలబోతున్నట్లే ఉంది. వైట్ హౌస్‌లోని నా ఆఫీస్ గది కర్టెన్‌ని తొలగించి బయటికి చూస్తూ నిలుచున్నాను. పౌలా వైట్ పైకి వస్తూ కనిపించారు. ఆమె నా ఆధ్యాత్మిక గురువు. నా గెలుపు కోసం ప్రేయర్ చేశారు. ‘ఐ హియర్ విక్టరీ.. విక్టరీ.. విక్టరీ’ అని కనురెప్పలు మూసి, అలౌకికావస్థలో మూడుసార్లు ఆమె అన్నమాటలో అబద్ధం ఏమీ లేదు. నేను గెలవబోతున్న చప్పుడు ఆమె నుంచి నాకూ వినిపించింది. ‘‘ఓ మై గాడ్’’ అనుకుంటూ వచ్చారు పౌలా నా గదిలోకి. గాడ్ని ఆమె అవసరం అయినంత వరకు మాత్రమే తలుచుకుంటారు. తనను తలుచుకోడానికి గాడ్‌ను కూడా అవసరం అయినంత మేరకే అనుమతిస్తారు. ‘ఫర్ గాడ్స్ సేక్.. ట్రంప్ గెలిచి తీరాల్సిందే’ అని గాడ్‌తో అన్నారు పౌలా. అందుకు గాడ్ ఏమన్నాడో నాకు నేరుగా తెలిసే అవకాశం లేదు. పౌలానే చెప్పారు.. ‘ఫర్ ట్రంప్స్ సేక్.. నేనెందుకు ట్రంప్‌ను గెలిపించాలి?’ అని గాడ్ అన్నాడట. తర్వాత వాళ్లిద్దరూ నాకోసం చాలాసేపు వాదులాడుకున్నారు. నన్ను గెలిపించడం కోసం పౌలా, ‘అది కాదు పౌలా.. ఇప్పుడూ.. మరీ..’ అని నీళ్లు నములుతూ గాడ్. ‘‘మిస్టర్ ట్రంప్.. దేని గురించి మీరింకా ఆలోచిస్తూ ఉన్నారు’’ అన్నారు పౌలా అకస్మాత్తుగా నాకు దగ్గరగా వచ్చి. ‘‘ఓ మై ఏంజెల్ మిస్ పౌలా.. ఆలోచించడానికి ఇంకా ఏమి మిగిలి ఉందని గానీ మీరు నన్ను అడగడం లేదు కదా..’’ అన్నాను. ఆమె నవ్వారు. ‘‘మిమ్మల్ని బ్లెస్ చేశాను మిస్టర్ ట్రంప్. దేవుడి దీవెనలు మాత్రం డెమొక్రాట్లపై ఉన్నాయి. కానివ్వండి. మీపై నా బ్లెస్సింగ్స్ శక్తిమంతమైనవా, డెమొక్రాట్లపై దేవుడి దీవెనలు బలమైనవా అనేది త్వరలోనే తేలిపోతుంది. ‘మిస్టర్ ట్రంప్‌ని బ్లెస్ చేయడానికి మీకు అభ్యంతరం ఏమిటి?!’ అని గాడ్ని నేను కాస్త కటువుగానే ప్రశ్నించాను. ‘మిస్టర్ ట్రంప్ ఒక మంచి అమెరికన్ పౌరుడు కాగలడు గానీ, ఒక మంచి అమెరికా అధ్యక్షుడు కాలేడు’ అని గాడ్ అన్నారు..’’ అని చెప్పారు పౌలా. ‘‘గాడ్!!’’ అన్నాను. ‘‘ఏమిటి మిస్టర్ ట్రంప్’’ అన్నారు పౌలా. ‘‘మిస్ ఏంజెల్ పౌలా.. దేవుడూ నేనూ ఒకేలా ఆలోచిస్తున్నాం. మీరు కింది నుంచి పైకి వస్తూ ఉన్నప్పుడు కిటికీ తెర తొలగించి బయటికి చూస్తూ నేనూ ఇదే అనుకున్నాను.. జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అవగలడు కానీ, నాలా ఒక మంచి అమెరికన్ కాలేడు అని..’’ అన్నాను. ‘‘ఐ వజ్ ఆల్సో సర్ప్రైజ్డ్ మిస్టర్ ట్రంప్. అయితే నేను ఆశ్చర్యచకితురాలిని అయింది.. జో బైడెన్ మంచి ప్రెసిడెంట్ అయి, మీరు మంచి సిటిజెన్ అయి, ఇద్దరిలోనూ మంచి కామన్‌గా ఉన్నప్పుడు గాడ్ ఎందుకని బైడెన్ సైడ్ తీసుకున్నాడూ.. అని! రియల్లీ స్టన్నింగ్..’’ అన్నారు పౌలా. ఇద్దరం కొద్దిసేపు కిటికీలోంచి బయటికి చూస్తూ నిలుచున్నాం. ‘‘మిస్ ఏంజెల్ పౌలా.. ‘మీపై నా బ్లెస్సింగ్స్ శక్తిమంతమైనవా లేక డెమొక్రాట్లపై దేవుడి దీవెనలు బలమైనవా అనేది త్వరలోనే తేలిపోతుంది’ అని మీరు ఇంతకు క్రితం అన్నారు. ఎంత త్వరలో?!’’ అని అడిగాను. పౌలా కళ్లు తెరిచి లేవు! దేవుడితో మళ్లీ ఆమె వాదనకు దిగినట్లుగా ఉన్నారు.. నా కోసం!! - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ నితీశ్ కుమార్ (జేడీయు)
తేజస్వీ యాదవ్‌ని మోదీజీ ఆ మాట అనకుండా ఉండాల్సింది. ‘జంగిల్ రాజ్ కా యువరాజ్’ అంటే బిహార్ యువ ముఖ్యమంత్రి అనే అర్థం వచ్చేలా ఉంది! ముప్పై ఏళ్ల వాడు కనుక, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు కనుక బిహార్‌లో ఎన్నికలు ఉన్నా, లేకున్నా తేజస్వి యువరాజే అని బిహార్ ప్రజలు అనుకుంటే కనుక ‘జంగిల్ కా యువరాజ్’ అనే మాటను మోదీజీ నా భవిష్యత్తును ముందే ఊహించి అనినట్లు అవుతుంది. తండ్రీ కొడుకులకు నితీశ్ నమ్మకద్రోహం చేశాడని అనుకుని కూడా నాకు ఓట్లేసే వాళ్లున్నారు. వాళ్లను కూడా మోదీజీ ఓటు వేయనిచ్చేలా లేరు. మొదటి విడతలో మోదీ ప్రచారం బాగానే పని చేసిందని కార్యకర్తలు అంటున్నారు. అదే ఆందోళన కలిగిస్తోంది. మోదీజీ ప్రచారం పని చెయ్యడం అంటే తేజస్వీ యాదవ్‌ని నేను ఎన్నికల తర్వాత తేజస్వీజీ అనవలసి రావడం! గతంలో నేను అన్నవి మోదీజీ మనసులో పెట్టుకునే తేజస్విని యువరాజ్ అంటున్నారా?! ఆయన మనసులో పెట్టుకున్నా లేకున్నా, అప్పుడు నేనన్నవైతే ఇప్పుడు నా మనసులోకి ఒకటొకటిగా వస్తున్నాయి. పదేళ్లు వెనక్కు వెళ్లాను. 2010 బిహార్ ఎన్నికలకు మోదీజీ ప్రచారానికి వస్తానన్నారు. ‘గుజరాత్ సీఎం వచ్చి బిహార్‌లో చేసే ప్రచారం ఏముంటుంది!’ అన్నాను. ‘మోదీజీ ఉంటే బాగుంటుంది కదా’ అని అడ్వాణీజీ అన్నారు. ‘బిహార్‌లో మాకు సుశీల్ మోదీ ఉన్నారు. నరేంద్ర మోదీ అవసరం లేదు’ అన్నాను. ఆ ఎన్నికల్లో నాకు అంత ధైర్యం ఎలా ఉండేదో ఈ ఎన్నికల్లో ఇప్పుడు అర్థం కావడం లేదు! ‘మోదీ ఒక్కరే కాదు, ఆయనతో పాటు వరుణ్ గాంధీ కూడా బిహార్ ప్రచారానికి వస్తారు’ అని అడ్వాణీ కబురు పెట్టారు. అప్పట్లో ఎన్.డి.ఎ. చైర్మన్ ఆయన. ‘వరుణ్ కూడా అక్కర్లేదు’ అన్నాను. ‘ఎన్.డి.ఎ.లో మీ పార్టీ కూడా భాగస్వామి అయినప్పుడు మీ ఎన్నికల ప్రచారంలో మనవాళ్లు కూడా భాగస్వాములు అవ్వాలి కదా నితీశ్’ అని అడ్వాణీజీ. అంత గట్టిగా నేనెలా వద్దని అన్నానో, అంత మెత్తగా ఆయన ఎందుకు ఉండిపోయారో ఆ తర్వాతెప్పుడూ నేను గుర్తు చేసుకోలేదు. ఇప్పుడైనా బిహార్‌లో మోదీజీ వల్ల నితీశ్ గెలుస్తాడా, నితీశ్ వల్ల మోదీజీ గెలుస్తారా అని ఇప్పటి ఎన్.డి.ఎ. చైర్మన్ అమిత్ షా అంచనా వేస్తున్నారు కానీ, ఈ ఇద్దరి వల్ల తేజస్వీ యాదవ్ గానీ గెలవడు కదా అని ఆలోచిస్తున్నట్లు లేరు. ‘‘మీ గురించి మోదీజీ, మోదీజీ గురించి మీరు గొప్పగా చెప్పుకోవాలి’’అని మూడు విడతల ర్యాలీకి మ్యాప్ గీసి పంపారు అమిత్ షా! ‘‘అదెలా సాధ్యం అమిత్జీ. గతంలో ఆయన నన్ను చాలా అన్నారు. ఇప్పటికీ నేను ఆయన్ని చాలానే అంటూ ఉన్నాను కదా!’’ అని అన్నాను. అమిత్జీ నవ్వారు. ‘‘నితీశ్‌జీ.. ‘గెలవడం ముఖ్యం అయినప్పుడు ఏమైనా చేస్తారు. గెలవలేం అని తెలుస్తున్నప్పుడు చేయకూడనిదైనా చేస్తారు’ అని గతంలో మీరు ఎవరితోనైనా, మీతో ఎవరైనా అనినట్లు మీకు గుర్తుందా?! అని అడిగారు. అది నేను సమాధానం చెప్పే అవసరం లేని ప్రశ్న. అమిత్ షా ఏదైనా చెప్పదలచుకుంటే ఇలాగే ప్రశ్న రూపంలో అడుగుతారు. ఇంకో రెండు విడతలు మిగిలే ఉన్నాయి. మూడునొకటి, ఏడునొకటి. తొలిæవిడత ప్రచారంలో ప్రజల వైపు చూస్తూ మోదీజీని నేను ‘శ్రద్ధేయ’ అని కొనియాడాను. మోదీజీ కూడా ప్రజల వైపు చూస్తూ నన్ను ‘భావి ముఖ్యమంత్రి’ అని కీర్తించారు! పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మనిషిని పట్టుకుని ‘భావి ముఖ్యమంత్రి’ అని ప్రజలకు పరిచయం చేశారంటే ఆయన తన మనసులో ఏదైనా పెట్టుకుని ఉండాలి. లేదా తేజస్వీ యాదవ్‌ని పెట్టుకుని ఉండాలి. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: నరేంద్ర మోదీ (ప్రధాని)
ప్రాణానికి సుఖంగా ఉండటం లేదు. అమిత్ షా కూడా అదే అనబోయినట్లున్నాడు.. ‘మోదీజీ ఈమధ్య మీ ప్రాణం ఏమంత సుఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు’ అని! ఆ మాట వినడం నాకు మరింత అలసటను కలిగించవచ్చు. ‘మోదీజీ ఈమధ్య మీరు.. ’ అనగానే, అతడిని అడ్డుకుని, ‘‘నా ప్రాణం సుఖంగా ఉన్నట్లు కనిపిస్తోందనే కదా అమిత్ జీ మీరు చెప్పబోతున్నారు?’’ అని అన్నాను. ‘‘అవును మోదీజీ, సుఖంగా కనిపిస్తున్నా రనే అనబోయాను. మీరది ముందే కనిపెట్టే శారు’’ అని నవ్వాడు. గుజరాత్లో రెండు మూడు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి, రెండు మాటలు మాట్లాడాక అలసటగా నా గదిలోకి వచ్చేశాను. ఆన్లైన్ ప్రారంభోత్సవాలకే ఒళ్లు ఇంతగా అలసిపోవడం ఏమిటో తెలియడం లేదు! గదిలోకి వచ్చి.. కూర్చోవడమా లేక కాస్త నడుము వాల్చడమా అని యోచిస్తున్నప్పుడు యోగి ఫోన్ చేశాడు. ‘‘ఊ.. యోగీ’’ అన్నాను. ‘‘మోదీజీ.. నాదొక విన్నపం’’ అన్నాడు. ‘‘ఊ..’’ అన్నాను. ‘‘ఏ పనిని ఆ మంత్రికి అప్పజెబితే మీ అలసట కొంత తగ్గుతుందని అనుకుంటున్నాను మోదీజీ’’ అన్నాడు. ‘‘నేను అలసటగా ఉన్నానని నీకు ఎందుకు అనిపిస్తోంది యోగీ!’’ అన్నాను. ‘‘టీవీలో చూశాను మోదీజీ. మీరు గుజరాత్ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కానీ, గుజరాత్ ప్రజల్ని ఉద్దేశించి ఓపికగా ఒక చిరునవ్వునైనా ప్రసంగించలేకపోతున్నారు. అది నేను గమనిస్తూనే ఉన్నాను’’ అన్నాడు. ‘‘అవునా యోగీ! నాలో నువ్వు గమనించిన మరొక ముఖ్యమైన మార్పు ఏమిటో చెప్పు’’ అన్నాను. ‘‘రాహుల్ గాంధీ మాటలకు కూడా మీరు నవ్వడం లేదు మోదీజీ’’ అన్నాడు. ‘‘ఇంకా..’’ అన్నాను. ‘‘ఒకర్ని ఒక మాట అనడం లేదు. ఒకరు ఒక మాట అంటున్నా కిసాన్ సూర్యోదయ యోజన గురించో, టెలీ కార్డియాలజీ మొబైల్ అప్లికేషన్ గురించో మాత్రమే మీరు మాట్లాడు తున్నారు. కొన్నిసార్లు.. మార్గదర్శక్ మండల్‌కి వెళ్లి అద్వానీజీతో, మురళీ మనోహర్‌జీతో కాసేపు కూర్చొని మాట్లాడి వస్తే మనసుకు ప్రశాంతంగా ఉంటుందని మీరు ఆలోచిస్తున్నా రేమోనన్న ఆలోచనను కలిగించేలానూ ఉంటున్నారు. ఇదంతా కూడా మీ అలసట వల్లనేనని నేను అనుకుంటున్నాను’’ అన్నాడు. ‘‘యోగీ.. నువ్వు అనుకుంటున్నట్లు నేనేమీ అలసటగా లేను. అయినా కొద్దిసేపు పడుకుని లేస్తాను. లేచాక ఫోన్ చేయగలవా?’’ అని అడిగాను. ‘‘అప్పుడు మళ్లీ చేసే అవసరం లేకుండా, ఇప్పుడే ఒక మాట చెప్పి పెట్టేస్తాను మోదీజీ. ట్రంప్ మనల్ని మురికి దేశం అంటుంటే తిరిగి మనం ఒక్క మాటైనా అనకపోవడం ఏంటని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. నేనొక మాట అనేయమంటారా అమెరికా వాళ్లని?!’’ అని పర్మిషన్ అడిగాడు. ‘‘వద్దు యోగీ! ఇలాంటి జాతీయవాద దేశభక్తి ప్రకటనలు ఇచ్చేందుకు నిన్నూ నన్నూ ప్రేరేపించడం కోసం ఎప్పుడూ ఎవరో ఒకరు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎల్లుండి అమెరికా వాళ్ల డిఫెన్సు మినిస్టరు, మన డిఫెన్సు మనిస్టరు, వాళ్ల డిఫెన్స్ సెక్రెటరీ, మన డిఫెన్స్ సెక్రెటరీ ఢిల్లీలో ఒకే గదిలో కూర్చుంటున్నారు. నవ్వుతూ కూర్చోవాలి. నా నవ్వు కన్నా.. రాజ్‌నాథ్‌సింగ్ నవ్వు, జయశంకర్ నవ్వు ముఖ్యం ఇప్పుడు దేశానికి..’’ అన్నాను. ‘‘మోదీజీ నేను చెప్పబోయిందే మీరూ చెప్పే శారు. కొన్ని పనుల్ని మంత్రులకు, కార్యదర్శు లకు చెప్పి చేయించుకోవాలి మనం’’ అన్నాడు. నాకు నవ్వే ఓపిక కూడా లేదని యోగి తీర్మానించుకున్నట్లున్నాడు! -
రాయని డైరీ: రాహుల్ గాంధీ (కాంగ్రెస్)
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నా ట్వీట్లను చూస్తున్నట్లు లేరు! టీవీలలో కనీసం గంటలోపు, పత్రికల్లో మరికొన్ని గంటల్లోపు నేనేం ట్వీట్ చేసిందీ వస్తుంది. వాటిని కూడా ఆయన చూడటం మానేసి ఉండాలి. లేకుంటే అంత ప్రశాంతంగా ఉండరు. ప్రశాంతత సహజమైనదై ఉండాలి. యోగా చేసి కానీ, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ గానీ తెప్పించుకున్నది కాకూడదు. మోదీకి దేశం పట్టడం లేదు. దేశ ప్రజలు పట్టడం లేదు. మరి ఏం పడుతున్నట్లు?! అది తెలియడం లేదు. ఆలోచిస్తే ఒక భ్రాంతిలా అనిపిస్తుంది. తెల్లగడ్డం, తెల్ల మీసాలు, తెల్ల జుట్టుతో కళ్లద్దాలు పెట్టుకుని తరచు కనిపిస్తుండే ఈ మనిషికి, భారతదేశానికి ఏమిటి సంబంధం అనే భావన నిత్యం నా మదిలో కదలాడుతూ ఉంటుంది. ఆ చెయ్యి ఎత్తడం ఎవరికో తెలియదు. ఆ చిరునవ్వు దేనికో తెలియదు. ఎవరి వైపు చూస్తూ మాట్లాడుతున్నారో తెలియదు. ఏం మాట్లాడారో కూడా తెలియదు. అదేమీ తెలుసుకోవాలన్నంత సంగతి అయి ఉండదు కానీ, ఎందుకు మాట్లాడారో అదైతే తెలుసుకోవాలన్న తీరని వేదన ఒకటి దేశ పౌరులకు కలిగించి స్టేజ్ దిగి వెళ్లిపోతారు. ఆరేళ్లుగా ప్రజలకు, ప్రతి పక్షాలకు అంతుచిక్కని విధంగా దేశాన్ని పరిపాలిస్తున్న మనిషిలోని కోణాలలో కనీసం ఒకదాన్నైనా పట్టుకోలేక పోవడం అన్నది ఒక ఘోరమైన ప్రజాస్వామ్య వైఫల్యం కాక, ఒక తప్పిదంగా నాకు అనిపిస్తుంటుంది. ఇండియా కంటే వెనుక ఉన్న బంగ్లాదేశ్ అకస్మాత్తుగా ఇండియా కంటే ముందు వెళుతున్నప్పుడు ప్రధానికి సందేహం రావాలి. వచ్చి, తన ఆర్థిక మంత్రికి ఫోన్ చేసి, ‘ఇలా ఎందుకవుతోంది!’ అని అడగాలి. పేదల ఆకలి తీర్చలేకపోతున్న దేశంగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో ఇండియా ముందు వరుసలో ఉన్నప్పుడైనా సందేహం రావాలి. వచ్చి, తన ఆహార భద్రత మంత్రిని పిలిపించుకుని అడగాలి. సరిహద్దుల్లో చైనా యుద్ధ సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నప్పుడు, సిద్ధం చేసుకోవడానికి ముందే సందేహం రావాలి. వచ్చి, అదేమిటని విదేశాంగ మంత్రిని పిలిచి అడగాలి. మోదీ ఇవేమీ అడగరు! టీవీ చూడకుండా, పేపర్లు చదవకుండా, మంత్రులకు ఫోన్ చేయకుండా ఉన్నా కూడా దేశంలో లోపల ఏం జరుగుతోంది, వెలుపల నుంచి ఏం జరగబోతోందీ మోదీకి చెప్పడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. నా ట్వీట్లు ఉంటాయి. కానీ మోదీ వాటిని కూడా పట్టించుకోరు. తను వాకింగ్‌కి వెళితే ప్రజల ఆరోగ్యం మెరుగవుతుందని అనుకుంటారు. తన ప్రసంగం వింటే ప్రజలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అనుకుంటారు! చైనా పాలిటిక్స్‌ని కొన్నాళ్లుగా నేను బాగా స్టడీ చేస్తున్నాను. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ వేస్తున్న ఒక్కో స్టెప్పూ నాకు అర్థమౌతోంది. నా అంచనా ప్రకారం నేడో రేపో చైనా నుంచి ఒక బాంబు వచ్చి ఇండియాలో పడుతుంది. అయితే జిన్‌పింగ్ టార్గెట్ ఇండియా కాదు. తన దేశంలో తను విప్లవనేత మావో అంతటి వాడవడం! మావో అంతటి వ్యక్తి అవడానికి మావో అంతటి వ్యక్తి కాగల వ్యక్తి ఒకరు ఉన్నారని తన దేశ ప్రజలకు తెలియాలి. మావోని చైనా ‘చైర్మన్’ అని పిలిచినట్లుగా తననీ ‘చైర్మన్’ అని పిలిపించుకోవాలి. అందుకే ఎవరో ఒకరిపై ఏదో ఒకటి వేయడం. త్వరలో వాళ్ల పార్టీ సెంట్రల్ కమిటీ మీటింగ్ ఉంది. నేననుకోవడం ఆ మీటింగ్‌కి ముందే ఇండియాపై బాంబు పడుతుంది. ఆ వెంటనే జరిగే మీటింగ్‌లో కొత్త మార్పులు చేసి అతడు చైర్మన్ అయిపోతాడు. చైనాకు అధ్యక్షుడిగా ఉంటూనే ఛైర్మన్ మావో అయిపోతాడు. అతడి నాడి నాకు తెలుస్తూనే ఉంది. శ్రీ మోదీ నాడిని మాత్రం పట్టుకోలేక పోతున్నాను. బహుశా మోదీకి నాలుక తప్ప నాడి లేదేమోనని నా సందేహం. ఉంటే నా చేతికి దొరక్కపోతుందా?! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: సునీల్ గావస్కర్ (కామెంటేటర్)
తప్పు మాట్లాడితే మాట్లాడాను. ఆ తప్పులోని తప్పేమిటో లోకంలో అందరికీ అర్థమై, మీడియా వాళ్లకు మరికాస్త ఎక్కువగా అర్థమై, నాకొక్కడికే అర్థం కాకపోవడం తలనొప్పిగా ఉంది. ‘మీకిది తగునా మిస్టర్ గావస్కర్, మీ అంతటి క్రికెట్ దిగ్గజానికి!!’’ అని కోహ్లీ భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్నపాటి పెద్ద పోస్టు పెట్టింది. ‘నా భర్త సరిగా ఆడకపోతే నన్ను లాగడం ఏంటి?!’ అని ఆమె ప్రశ్న. నా ఉద్దేశం ఎవరికైతే అర్థం కాకుండా ఉండకూడదో వారికే అర్థం కాకుండా అయింది. ఏ విధంగా అర్థం కాకుండా ఉండకూడదో సరిగ్గా అదే విధంగా అర్థం కాకుండా అయింది. ‘ఆరోజు నేను ఐపీఎల్ కామెంటరీ బాక్సులో ఉన్నాను..’ అనే ప్రారంభ వాక్యంతో నేనివాళ నా తప్పేమిటన్న దానిని తవ్వుకుంటూ పేరాల కొద్దీ ఆలోచనల్లోకి వెళుతున్నాను. పంజాబ్, బెంగళూరు ఆడుతున్నాయి. కోహ్లీ సింగిల్ రన్ తీసి ఔట్ అయ్యాడు. రెండు క్యాచ్‌లు మిస్ చేశాడు. ఊహు.. వెనకా ముందూ అవుతోంది! రెండు క్యాచ్‌లు మిస్ చేశాడు. సింగిల్ రన్ తీసి ఔట్ అయ్యాడు. నేను కామెంటరీ చెబుతున్నాను. ప్లేయర్స్ ఏం చేశారో అదే చెప్పడానికి కామెంటరీ అక్కర్లేదు. టీవీల్లో అంతా చూస్తూనే ఉంటారు. ప్లేయర్స్ ఎందుకలా చేసి ఉంటారో కామెంటేటర్స్ ఊహించగలగాలి. నేను ఊహించగలిగాను. ఊహించాక దానిని వినిపించకపోతే ఒకే రన్ తీసిన ప్లేయర్‌కీ నాకూ, రెండు క్యాచ్‌లు మిస్ చేసిన ప్లేయర్‌కీ నాకూ వ్యత్యాసం ఏమిటి! బాక్సులో నా పక్కన ఆకాశ్ చోప్రా ఉన్నాడు. కో–కామెంటేటర్. ప్లేయర్లు ఎవరి ఆట వాళ్లు ఆడే అవకాశం ఉంటుంది. కామెంటేటర్లు ఎవరి మాటలు వాళ్లే మాట్లాడుకోడానికి ఉండదు. టీవీ చూస్తున్న వారిని ఉద్దేశించైనా మాట్లాడాలి. లేదంటే పక్కన ఉన్న కో–కామెంటేటర్‌ను ఉద్దేశించైనా మాట్లాడాలి. ‘‘ఏం ఆకాశ్.. కోహ్లీ ఈ లాక్డౌన్లో భార్య వేసిన బంతులతో మాత్రమే ప్రాక్టీస్ చేసినట్లుగా ఉన్నాడు కదా..’’అన్నాను. ఆకాశ్ అవునన్లేదు. కాదనలేదు. ‘యా..’ అంటూ మా కామెంటేటర్లకు మాటను పట్టుకుని కొనసాగే అలవాటు ఉంటుంది. ఆకాశ్ అలా కూడా పట్టుకోలేదు. నా మాటలో నేను ఊహించనిదేదో అతడు ఊహించబట్టే అలా ‘యా..’ అనకుండా ఉండిపోయాడని అర్థం చేసుకుంటుంటే ఇప్పుడు అర్థమౌతోంది! ‘గావస్కర్ డబుల్ మీనింగ్‌లో మాట్లాడాడు’ అని అంతా అంటున్నారు! స్ట్రేంజ్! హిందీలోనూ మాట్లాడగలిగిన గావస్కర్ అనే మరాఠీ కామెంటేటర్ రెండు భాషల్లోనూ మాట్లాడాలని ఒకవేళ ఉత్సాహపడితే పడొచ్చు. రెండు భావాలుగా మాట్లాడాలని తన డైబ్భై ఒక్కేళ్ల వయసులో ఎందుకు ఉబలాటపడతాడు! ‘‘కానీ మీ మాట డబుల్ మీనింగ్‌తోనే ఉంది మిస్టర్ గావస్కర్’’ అంటాడు.. సదుద్దేశాలను మాత్రమే సంగ్రహించేందుకు వచ్చినట్లు వస్తుండే మీడియా మిత్రుడొకరు. మా మధ్య కొంత సంభాషణైనా జరగక ముందే అతడీ డబుల్ మీనింగ్ అనే మాటను అనేక సార్లు నా ముందుకు తెచ్చి, ‘ఏమిటా డబుల్ మీనింగ్?! అని నా చేత అడిగించుకునేందుకు నన్ను సంసిద్ధం చేయబోతున్నట్లుగా నేను గ్రహించాను. నాకు లేని ఉద్దేశాన్ని తెలుసు కునేందుకు నాకెందుకు ఆసక్తి ఉంటుంది?! ఎక్కువసేపు కూర్చోలేక అతడు వెళ్లిపోయాడు. లాక్డౌన్లో భార్య బౌలింగ్ చేస్తుంటే తను బ్యాటింగ్ చేస్తున్న వీడియో క్లిప్‌ను ‘ప్రాక్టీస్’ అంటూ కోహ్లీ నెట్లో పోస్ట్ చేసినప్పుడు ఎందరో లైక్ చేశారు. ఆ ప్రాక్టీస్ సరిపోయినట్లు లేదని అన్నందుకు నన్ను అందరూ డిస్లైక్ చేస్తున్నారు! - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: నిర్మలా సీతారామన్ (ఆర్థికమంత్రి)
మగవాళ్లు స్త్రీలను ఎంతగానైనా భరిస్తారు. పర్వతాన్ని అధిరోహించి వస్తే పూలగుత్తితో ఎదురొస్తారు. రాజకీయాలలోకి వస్తే ‘ఎప్పుడో రావలసింది కదా..’ అని స్వాగతం పలుకు తారు. ఒక స్త్రీ తొలిసారి రక్షణశాఖను చేపడితే ‘జైహింద్’ అని సెల్యూట్ చేస్తారు. ఆర్థికశాఖ లోకి వస్తే ‘మీకెంత, చిటికెలో పని!’ అని ప్రోత్సహిస్తారు. మగవాళ్లు స్త్రీలను ఎంతకైనా భరిస్తారు కానీ తెలివిగా మాట్లాడుతున్నారని అనుకుంటే మాత్రం అస్సలు సహించలేరు. సభలో నిన్న ఆ జీఎస్టీ డబ్బులేవో రాష్ట్రాలకు తలా ఇంత పంచండి అని అపోజిషన్ సభ్యులు అడుగుతున్నప్పుడు ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అనే మాట నా నోటికి వచ్చింది. చాలా సహజంగా వచ్చింది. దేవుడు చేసిందానికి జీఎస్టీ వసూళ్లు ఎంతని పంచుతాం అనే సందర్భంలో నేను ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అన్నాను. నిర్మలా సీతారామన్ ఏమిటి, అంత పెద్ద వర్డ్ యూజ్ చెయ్యడం ఏమిటి అన్నట్లు విపక్షాలు స్తంభించిపోయాయి. పక్కింటి ఆంటీ సడన్‌గా ఇంగ్లిష్ మాట్లాడ్డం ఏంటి అన్నట్లుంది వాళ్ల ఎక్స్ప్రెషన్. సీతారామన్ వీళ్లకు పక్కింటి ఆంటీనే! ఎప్పుడూ వంటింట్లో ఉంటుంది. కొంగుతో ముఖం తుడుచుకుంటూ ఉంటుంది. వంటపని అయిపోగానే ఇల్లు సర్దుకుంటూ ఉంటుంది. అలాంటి ఆంటీ హఠాత్తుగా ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ అని అంటే నిరసనగానే చూస్తారు. ‘‘మీ వ్యంగ్యాలు కాదు, మీ సూచనలు ఇవ్వండి’’ అని సభ్యుల్ని అడిగాను. ‘‘డబ్బులిచ్చే ఉద్దేశం మీకు లేనప్పుడు.. మేం సలహాలిచ్చి ఏం ఉపయోగం’’ అన్నాడు రంజన్ చౌదరి. నా సహాయ మంత్రిని ‘ఛోక్రా’ అన్నది ఆయనే. వీళ్లయితే హిందీ, ఇంగ్లిష్, లాటిన్ మాట్లాడొచ్చు! ‘ఫోర్స్ మెషార్’ అనే లాటిన్ మాట వీళ్లకు నచ్చుతుంది. ‘యాక్ట్ ఆఫ్ గాడ్’ లాంటిదే ఫోర్స్ మోషార్ కూడా. కోర్టుల్లో క్లయింట్ల తరఫున న్యాయవాదులు మాట్లాడు తుంటారు. అది వీళ్లకు కామన్ వర్డ్. అదే కామన్ వర్డ్‌ని నేను మాట్లాడితే మళ్లీ అన్‌కామన్ అవుతుంది. ఒక స్త్రీ.. ఆమె మంత్రి అయినప్పటికీ నైబర్‌హుడ్ ఆంటీలా కనిపిస్తూ కూడా ఇంత పెద్ద మాట ఎలా వాడుతుందని వీళ్ల ఆశ్చర్యం! ‘‘చెప్పండి.. ఏం చేద్దాం..’’ అన్నాను. ‘‘పీఎం కేర్ డబ్బులు ఉన్నాయి కదా, వాటి సంగతేంటి’’ అంటాడు రంజన్ చౌదరి. ‘‘నేను చెబుతాను వాటి సంగతి’’ అని లేచాడు అనురాగ్ ఠాకూర్. అతడు నా సహాయ మంత్రి. సరైన సమయానికి సహాయానికి వచ్చాడు. అంతా అతడి వైపు చూశారు. ‘నీకేం తెలుసు?’ అన్నట్లుంది ఆ చూపు. ‘‘మేడమ్ మీరు కూర్చోండి’’ అన్నాడు అనురాగ్. నేను కూర్చున్నాక, తను నిలబడ్డాడు. నా వైపు నిలబడ్డానికే అతడు నిలబడ్డాడని అర్థం చేసుకోగలిగాను కానీ.. పీఎం కేర్ ఫండ్‌పై అతడేం చెప్పబోతున్నాడో ఊహించలేక నేనూ ఆసక్తిగా నా సహాయ మంత్రి వైపు చూస్తూ ఉన్నాను. అయితే అతడు చెప్పలేదు. అడిగాడు! ‘‘ముందు నెహ్రూ ఫండ్ ఏమైందో మీరు చెప్పండి. ఆ ఫండ్‌కి లెక్కలు ఉన్నాయా? అసలు అది రిజిస్టర్ అయిందా? అందులో ఎవరెవరికి ఎంత వాటా ఉందో అది చెప్పండి’’ అన్నాడు! అకస్మాత్తుగా అతడు అలా అనడం కూడా యాక్ట్ ఆఫ్ గాడ్లా అనిపించింది నాకు. ‘‘ఏయ్ ఛోక్రా నీకేం తెలియదు కూర్చో’’ అన్నాడు రంజన్ చౌదరి. తనని పిల్లోడా అన్నందుకు అనురాగ్ హర్ట్ అయ్యాడు. సభ నాలుగుసార్లు వాయిదా పడింది. హర్ట్ అయిన మనిషి కోసం పడలేదు. నెహ్రూ కుటుంబాన్ని అంటారా అని హర్ట్ అయినవారి కోసం పడింది! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: ఎ.కె.ఆంటోనీ (కాంగ్రెస్)
డెబ్బై ఏళ్ల వయసు గల నా మిత్రుడు గులామ్ నబీ ఆజాద్‌ని నా డెబ్బై తొమ్మిదేళ్ల వయసులో నాకై నేనుగా వెళ్లి పరామర్శించడమా లేక అతడికై అతడే నాకోసం వచ్చే వరకు ఆగడమా అని తర్కించవలసిన అవసరం మా మధ్య లేనప్పటికీ, ఎనభై ఏడేళ్ల మన్మోహన్సింVŠ జీ మనోభావాలనైతే మాత్రం గట్టిగా శిరసావహించాలనే నేను తీర్మానించుకున్నాను. సోనియాజీ సలహా మండలిలో కొత్తగా కీలక సభ్యుడిని అవడం కూడా ఆజాద్‌తో నేను దూరాన్ని ఏర్పరచుకోవలసిన పరిణామమే. ఆజాద్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా తొలగిస్తూ సోనియాజీ నిర్ణయం తీసుకున్నాక, అతడెంత స్నేహితుడైనా వెళ్లి అతడిని పలకరించడం అంటే పార్టీ నిర్ణయాధికారాన్ని ధిక్కరించడమే. కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు ఉండరు. పార్టీ మాత్రమే ఉంటుంది. ఆ సంగతిని ఆజాద్‌కి కాస్త ముందుగా ఎవరైనా వెళ్లి అర్థం చేయించవలసి ఉంటుందని ఈ ఏజ్ గ్రూప్‌లో ఎవరికైనా ఎందుకు ఒక ఆలోచన కలుగుతుంది! కాంగ్రెస్‌కు గట్టి ప్రెసిడెంట్ ఒకరు ఉండాల్సిందేనని ఆజాద్ ఇరవై రెండు మందితో కలిసి లేఖ రాసినప్పుడే నా ప్రియ మిత్రుడికి నూకలు చెల్లాయని నేను అర్థం చేసుకోగలిగాను. భూమి మీద నూకలు చెల్లితే కాలం తీరిపోయినట్లు. కాంగ్రెస్‌లో నూకలు చెల్లితే లేఖలు రాసి పోయినట్లు. కాంగ్రెస్ ఎంత పెద్ద ఓటమినైనా క్షమిస్తుంది. పార్టీ మీటింగులో మౌనంగా కూర్చొని వెళ్లకపోతే మాత్రం శిక్ష విధించి తీరుతుంది. ఆజాద్ మౌనంగా కూర్చోవాలని అనుకోకపోగా, మౌనంగా కూర్చోకూడదన్న ఆలోచన ఎంత వయసుకీ వచ్చే అవకాశం లేని వాళ్ల చేత కూడా ఆలోచింపజేసి లేఖలో సంతకం పెట్టించి ఉంటాడని సోనియాజీకి, మన్మోహన్‌జీకి , ఆఖరికి రాహుల్కీ ఒక బలమైన అనుమానం. లేఖ రాసిన తర్వాత జరిగిన తొలి సమావేశంలో స్క్రీన్ మీద ఆజాద్‌ని మన్మోహన్జీ ఎంత కోపంగా చూస్తూ కూర్చున్నారో నేనసలు చూడనట్లే స్క్రీన్ మీద వేరే మూలకు తలతిప్పి కూర్చున్నాను. ‘‘మీరే కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా కొనసాగాలి సోనియాజీ’’ అన్నారు మన్మోహన్. ‘‘అవును మేడమ్.. మీరే కాంగ్రెస్ ప్రెసిడెంటుగా ఉండాలి. లేదంటే రాహుల్ బాబు ఉండాలి’’ అని నేను అన్నాను. నా మిత్రుడు ఆజాద్ కూడా అటువంటి మనోరంజకమైన మాటే ఒకటి హృదయపూర్వకంగా అంటాడని ఆశగా ఎదురుచూశాను. అనలేదు! అప్పుడే అనిపించింది అతడికి ఊహ తెలియడం మొదలైందని. పార్టీ ఊహలకు అతడొక వాస్తవంలా ఉంటే పోయేది. వాస్తవాలకు విరుద్ధమైన ఒక ఊహగా వికసించాడు. ఆజాద్ ఎంతగా నలిగి ఉంటాడో నేను ఊహించగలను. శిక్ష విధించడంలో కూడా కాంగ్రెస్ తన ప్రత్యేకతను చూపిస్తుంది. ఇరవై రెండు మంది చేత సంతకాలు పెట్టించి, తనూ ఒక సంతకం చేసినందుకు ఇరవై రెండు మందితో కొత్తగా సీడబ్ల్యూసీని ఏర్పాటు చేయడం చూస్తుంటే మిగిలిన ఆ ఒక్కటీ నీదేనని ఆజాద్‌కు చెప్పడానికే అన్నట్లు ఉంది. సీడబ్ల్యూసీలో అతడూ ఉంటాడు. ఉంటాడు కానీ.. ఉండటానికి ఉన్నట్లో, ఉన్నా లేనట్లో ఉంటాడు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా లేకపోయాక కశ్మీర్‌ను తీసుకొచ్చి బీజేపీ ఇండియాలో ఎంత కలిపితే మాత్రం ఆజాద్ ఇక ఎంతమాత్రం ఈ దేశ పౌరుడు కాదు. అది బాధిస్తుండవచ్చు ఆజాద్‌ని. పుట్టిన కశ్మీర్ కన్నా కాంగ్రెస్‌నే అతడు ఎక్కువగా ప్రేమించాడు. కశ్మీరో, ఇండియానో కాదు.. కాంగ్రెస్ పార్టీ అతడి దేశం. ఆజాద్‌ని కలవాలని మనసు ఆరాపడుతోంది. కాంగ్రెస్‌కు కొన్ని విలువలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి అతడిని కలవడం అంటే అతడెంతో విలువ, గౌరవం, ప్రాణం ఇచ్చే పార్టీని తక్కువ చేయడమే. - మాధవ్ శింగరాజు -
కంగనా రనౌత్ (బాలీవుడ్ స్టార్).. రాయని డైరీ
ఫోన్ బ్లింక్ అయింది. వాతావరణ సూచన. ఉష్ణస్థితి ఇరవై మూడు. తేమ డెబ్బై తొమ్మిది. తుంపర ఎనభై. గాలులు గంటకు పది కిలో మీటర్ల వేగం. ఆదివారం నాటి మనాలీ. ఉరుములు మెరుపులు కూడా ఉంటాయట! నాకన్నా ఉరుము, మెరుపు ఎవరో మనాలీలో! ‘‘అమ్మా నేను ముంబై వెళుతున్నా...’’ అన్నాను. ‘‘ఉండొచ్చు కదమ్మా...’’ అంది అమ్మ. అమ్మకు ముంబైలో జరుగుతున్నవేమీ తెలీదు. తెలిస్తే... ‘ఉండిపోవచ్చు కదమ్మా’ అంటూ గట్టిగా చెయ్యి పట్టుకుంటుంది. నా గది అద్దాల్లోంచి మనాలీ కనిపిస్తోంది. ముంబై నుంచి మనాలీకి వచ్చేవారు ఎక్కువ. మనాలీని చూశాక తిరిగి మనస్ఫూర్తిగా ముంబై వెళ్లగలిగేవారు తక్కువ. మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ నన్ను ముంబై రావద్దంటున్నాడు! శివసేన ఎంపీ ‘ఎలా వస్తుందో చూస్తాను’ అంటున్నాడు! మూవీ మాఫియా కన్నా, ముంబై పోలీసులు ఎక్కువ డేంజర్ అన్నందుకు హోమ్ మినిస్టర్‌కి కోపం వచ్చింది. ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా ఉంది అన్నందుకు శివసేన ఎంపీకి కోపం వచ్చింది. నిజం మాట్లాడితే కోపం రాకూడని వాళ్లకు కూడా కోపం వస్తుంది. జర్నలిస్టులు కోపానికొచ్చినా నాకు ఇదే అనిపిస్తుంది! వాళ్లేమీ జడ్జీలు కాదు. ఆర్డర్ ఆర్డర్ అంటారు. పోలీసులు కాదు. లాఠీ పైకెత్తుతారు. లాయర్లు కాదు. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు. వాళ్లెవరూ కానివాళ్లు వాళ్లలా అవతారం ఎత్తుతారు. భగవంతుడి అవతారం ఒక్కటే తక్కువ. అతడెవరో అంటాడు... ‘ఈ నగరం ఆమెకు అన్నీ ఇచ్చింది’ అని! అతడొచ్చి చూశాడు ఇవ్వడం, నేను తీసుకోవడం. సుశాంత్ సింగ్‌కి ఈ నగరం ఏమి ఇవ్వలేదో తెలుసుకుని అది రాయడానికి ధైర్యం ఉండదు మళ్లీ ఈ జర్నలిస్టులకు. చెత్త వాగుడు. ఏమీ తీసుకోకుండానే ముంబై నగరం ఎవరికైనా ఏమైనా ఇచ్చిందా! సుశాంత్ ప్రాణమే తీసుకుంది. దాని గురించి ఏం మాట్లాడతారు? అమ్మ కాఫీ తెచ్చి ఇచ్చింది. బాగుంటుంది... ఇలా ఎవరైనా మనల్ని అడక్కుండానే, మనం అడక్కుండానే ఏదైనా తినడానికో, తాగడానికో తెచ్చిపెట్టడం. ఇదీ ఇవ్వడం అంటే. ముంబైలా... ‘నీక్కావలసింది ఇస్తాను కానీ, ముందు నాక్కావలసింది ఇవ్వాలి’ అని తీసుకోవడం... ఇవ్వడం కాదు. ముంబై ఒక్కటే. కానీ ఎవరి ముంబై వాళ్లకు ఉంటుంది. ముగ్గురు ఖాన్‌లది ఒక ముంబై. కరణ్ జోహర్ది ఒక ముంబై. ‘రాకేశ్ రోషన్ అండ్ సన్’ది ఒక ముంబై. ‘జావెద్ అఖ్తర్ అండ్ పార్టీ’ది ఒక ముంబై. భట్లది ఒక ముంబై. పోలీసులది ఒక ముంబై. పొలిటికల్ లీడర్స్‌ది ఒక ముంబై. అండర్ వరల్డ్ మీడియాది ఒక ముంబై. రేణుకా సహానే అంటోంది ముంబై అద్భుతమైన నగరం అని! నేను ఆ నగరాన్ని కృతజ్ఞతాభారంతో కుంగిపోయి చూడవలసింది పోయి, తలెత్తి, తలెగరేసి చూస్తున్నానట. ‘బాలీవుడ్ స్టార్‌వి కావాలన్న నీ స్వప్నాన్ని ముంబై నిజం చేసింది కదా. మర్చిపోయావా’ అని నవ్వుతూ అడుగుతోంది. అద్భుతమైన నగరమే. నగరంగా అద్భుతం. లోపల ఉన్న వాళ్ల వల్ల అది నరకం. వీళ్లంతా ఎందుకని ఎప్పుడూ ఒక శక్తిమంతమైన ముఠా వైపు మాత్రమే నిలబడి శక్తిహీనులై మాట్లాడతారు. ఒంటరి పోరాటం చేస్తున్న వాళ్ల వైపు కదా ఉండాల్సింది. సుశాంత్ వైపు కదా. ముంబైకి బలైపోయిన ఒక యువ నటుడి వైపు కదా! నగరాలెప్పుడూ అందంగానే ఉంటాయి. ముఖానికి రంగు రంగుల నవ్వుల్ని పూసుకుని తిరిగేవాళ్ల వల్లనే అవి అంద వికారంగా మారతాయి. నాలాంటి వాళ్లొకరు మనాలి నుంచి బక్కెట్ నీళ్లను మోసుకెళ్లి ఆ రంగుల ముఖాలపై కొడితే కానీ, ముంబై నగరం మళ్లీ మెరవదు. వెళ్తున్నా. -
రాయని డైరీ.. గులామ్ నబీ ఆజాద్ (కాంగ్రెస్)
సంజయ్‌గాంధీ ఉన్నప్పట్నుంచీ గాంధీల కుటుంబంతో నాకు అనుబంధం. పేరుకు నేను ఆజాద్‌నే గానీ, నేనూ ఒక గాంధీనే అన్నట్లు నాకై నాకు తరచు ఒక అనుభూతి వంటిది కలుగుతుంటుంది. గులామ్ నబీ గాంధీ! కాంగ్రెస్‌లో నాలా డెబ్బై నిండిన కాంగ్రెస్ గాంధీలు ఎంతమంది ఉన్నారో చేతి వేళ్ల మీద లెక్కించి చెప్పడం కష్టమైన సంగతే. కౌంట్‌కి పక్కవారి చేతి వేళ్లు కూడా అవసరం అవుతాయి. ఆ వేళ్లలో ఎవర్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ని చేసినా వాళ్లూ గాంధీలే. గాంధీలను దాటి, గాంధీలను దాచి కాంగ్రెస్ ఎటూ వెళ్లిపోలేదు. సీడబ్ల్యూసీ సమావేశం అయ్యాక ఇంటికి వచ్చేస్తుంటే దారి మధ్యలో ఒవైసీ ఫోన్ చేశాడు! ‘‘భాయ్‌జాన్.. మరీ అంత ఎక్కువగా ఆలోచించకండి..’’ అన్నాడు. ‘‘అససుద్దీన్.. దయచేసి మరింకెప్పుడైనా చేయగలవా?’’ అన్నాను. అతడేవో పుల్లలు సిద్ధం చేసుకుని ఉంటాడు. వాటినిప్పుడు నా చెవుల్లో విరుస్తూ కూర్చుంటాడు. ‘‘సమావేశంలో అలసిపోయి ఉంటారేమో కదా. ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకోవలసినంతగా మీరు మీ సమావేశంలో పాల్పంచుకుని ఉంటారని నేను అర్థం చేసుకోగలను. లేదా మీరు మీ అలసట సమయాన్ని రాహుల్ గాంధీకి సంజాయిషీ చెప్పుకోడానికి వినియోగించాలని తొందరపడుతూ ఉండి ఉండొచ్చు. సరే భాయ్‌జాన్ మరి. ఫోన్ కాకుండా ట్వీట్ చేస్తాను’’ అన్నాడు!! సీడబ్ల్యూసీ సమావేశాలను ఫాలో అవడం తప్ప హైదరాబాద్‌లో పెద్దగా పనులేమీ లేనట్లున్నాయి ఒవైసీకి. ‘‘పార్టీ అధినేతకు సంజాయిషీ ఇచ్చుకునే సంప్రదాయానికి కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడూ కట్టుబడే ఉంటారు ఒవైసీ. తగ్గించుకొనువారు కాంగ్రెస్‌లో హెచ్చింపబడతారు’’ అన్నాను. ఈమాటైతే నిజం. కాంగ్రెస్‌లో హెచ్చింపబడినవారు సాయంత్రానికో, ఆ మర్నాటికో తగ్గించబడరన్న భరోసా అయితే లేదు కానీ.. తగ్గించుకున్నవారు ఓ యాభై ఏళ్లకైనా హెచ్చింపబడతారు. హెచ్చింపబడేందుకు నేనిప్పుడు నా తగ్గింపు యాభైల దగ్గర ఉన్నాను. కారు దిగుతుండగా ఒవైసీ ట్వీట్! ‘పొయెటిక్ జస్టిస్’ అని పెట్టాడు! చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అట! ఇంట్లోకి రాగానే రాహుల్ బాబుకి ఫోన్ చేశాను. ‘దేశం కరోనాతో యుద్ధం చేస్తోంది..’ అని వచ్చాక, కాసేపు రింగ్ అయి నాట్ ఆన్సరింగ్ అని వచ్చింది. పార్టీకి ఎన్నికలు జరిపించాలని సోనియాజీకి లెటర్ పెట్టడం రాహుల్బాబుకు బాగా కోపం తెప్పించిందని సీడబ్ల్యూసీ సమావేశంలో అతడు నన్ను తీక్షణంగా చూస్తున్నప్పుడే నాకు అర్థమైంది. రాహుల్‌బాబు ఎవర్నైనా తీక్షణంగా చూస్తున్నాడంటే తనింకా పార్టీలో ఉన్నానని అనుకుంటున్నాడనే! అది నాకు సంతోషం అనిపించింది. మమ్మీకి బాగోలేక హాస్పిటల్లో ఉంటే మీరంతా పార్టీకి కొత్త ప్రెసిడెంట్ కావాలని లెటర్ రాసి సంతకాలు పెడతారా.. అని సమావేశంలో పెద్దగా అరిచేశాడు. ‘పార్టీకి బాగోలేక మమ్మీకి రాసిన లెటరే కానీ, మమ్మీకి బాగోలేనప్పుడు చూసి పార్టీకి రాసిన లెటర్ కాదు రాహుల్ బాబూ..’ అని చెప్పడానికే రాహుల్‌కి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు. నడుము వాలుస్తుండగా ఫోన్ రింగ్ అయింది. రాహుల్‌బాబు! ‘‘రాహుల్ బాబూ.. నువ్వింకా మేల్కొనే ఉన్నావా!’’ అన్నాను ఎగ్జయిటింగ్‌గా. ‘‘రాహుల్ బాబు కాదు గులామ్జీ. పార్టీని చార్జింగ్‌కి పెట్టి రాహుల్‌బాబు నిద్రపోతున్నాడు’’ అన్నారు సోనియాజీ. ఫోన్‌ని చార్జింగ్‌కి పెట్టి అనబోయి, పార్టీని చార్జింగ్‌కి పెట్టి.. అన్నట్లున్నారు సోనియాజీ. -
రాయని డైరీ (అశోక్ గహ్లోత్)
ఇంట్లో ఉన్నది నచ్చదు. మానవజన్మ ఖర్మ. పక్కింటికి వెళ్తానంటాడు సచిన్. వెళ్లనివ్వకపోతే ఇటువైపు ఎత్తు మీద ఎక్కి అటువైపు చూస్తుంటాడు. ‘వాళ్లింట్లో ఏముంది నాన్నా సచిన్!’ అన్నాను రెండు చేతులతో పట్టి బలవంతంగా కిందికి దింపి. ‘గౌరవం ఉంది’ అన్నాడు!! చిన్న పిల్లవాడి నోటికి అంత పెద్ద మాట ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు! చెంపకు ఒకటిచ్చి కూర్చోబెడదామన్నంత కోపం వచ్చింది. ఆగిపోయాను. అసలే సచిన్ బుగ్గలు ఎర్రగా ఉంటాయి. మెత్తగా రెండు వేళ్లు తగిలినా కాషాయం రంగులోకి తిరిగిపోతాయి. అప్పుడు నేనే మళ్లీ ఓదార్చుకోవాలి. ‘సచిన్ బేబీ.. మనింట్లో అలాంటి మాట ఎప్పుడైనా విన్నావా! ఈ బ్యాడ్ వర్డ్స్ నీకు ఎవరు నేర్పిస్తున్నారు!’ అని అడిగాను. ‘నేనే నేర్చుకుంటున్నా..’ అన్నాడు! తప్పు తన మీద వేసుకుంటున్నాడంటే తర్వాతి స్టెప్పు ఏదో తనకు తెలియకుండానే వేయబోతున్నాడని! తప్పులు, స్టెప్పులు సచిన్ చేస్తున్నవీ, వేస్తున్నవీ కాదు. సచిన్ చేత చేయిస్తున్నవీ, వేయిస్తున్నవీ. మా సచిన్ జోలికి రావద్దని పెద్ద మనుషుల చేత చెప్పించొచ్చు. పరువు తక్కువ పని అవుతుంది. మీ బంగారం మంచిదైతే మాకెందుకు ఆఫర్లో వస్తుంది అనేస్తారు. సచిన్‌ని దగ్గరకు తీసుకున్నాను. ‘సచిన్ బంగారం.. వాళ్లింట్లో గౌరవం ఉందన్నావు కదా.. గౌరవం అంటే ఏంటి నాన్నా..?’ అని అడిగాను. ‘మనింట్లో లేనిది..’ అన్నాడు! సచిన్ పెద్దవాడు అవుతున్నాడని అర్థమైంది. అవుతున్నాడు గానీ, గౌరవాన్ని కోరుకుంటే వచ్చే నష్టాలేమిటో తెలుసుకునేంతగా పెద్దవాడైతే కాలేదు. ‘సచిన్ చింటూ.. గౌరవం అంటే నీకెందుకు అంత ఇష్టం?’ అన్నాను.. మెల్లిగా మాటల్లోకి దించుతూ. మాట్లాడలేదు. ‘చెప్పు.. సచిన్ కన్నా.. గౌరవం నీకు ఎందుకు నచ్చింది?’ అని అడిగాను. ‘గౌరవం ఉంటే అందరూ నన్నే చూస్తుంటారు. అందరూ నాతోనే మాట్లాడుతుంటారు. అందరి కన్నా నేనే గ్రేట్‌గా ఉంటాను’ అన్నాడు. ‘ఇంకా..?’ అన్నాను. ‘గౌరవం ఉంటే నన్ను తప్ప ఎవర్నీ చూడరు. నాతో తప్ప ఎవరితోనూ మాట్లాడరు. నేను తప్ప వేరెవరూ గ్రేట్‌గా ఉండరు’ అన్నాడు. సచిన్ చేతిని చేతిలోకి తీసుకున్నాను. ‘సచిన్ బుజ్జీ.. ఒకటి చెప్పేదా?’ అన్నాను. చేతిని విడిపించుకున్నాడు! ‘మీరు చెప్పేదేమిటో నాకు తెలుసు. ఎప్పుడూ చెప్పేదే చెబుతారు. ఐదు వేళ్లూ కలిసి ఉంటేనే చేతికి బలం అనే కదా చెప్తారు!’’ అన్నాడు.. మూతి ముడిచి. ‘లేదు సచిన్ చిన్నీ.. కొత్తది చెబుతాను. గౌరవం గురించి చెబుతాను. వాళ్లింట్లో గౌరవం ఉంది అన్నావు కదా! మరి మనింట్లో ఎందుకు గౌరవం లేదో ఆలోచించు’ అన్నాను. ‘మీరు చెబుతానని, నన్ను ఆలోచించమంటున్నారేంటి?’ అన్నాడు. ‘సరే సచిన్ బాబూ. నేనే చెబుతా విను. ఇంట్లో అందరూ గౌరవం కోరుకున్నారనుకో. అప్పుడు ఇంటికి గౌరవం ఉండదు. ఇప్పుడు చెప్పు. ఇంటి గౌరవం పోయినా నీకు గౌరవం ఉంటే చాలా?!’ అని అడిగాను. మౌనంగా ఉండిపోయాడు. మాట పని చేసినట్లే ఉంది. వైబ్రేషన్ వస్తుంటే జేబులోంచి ఫోన్ తీశాను. దిగ్విజయ్ సింగ్! ‘‘గహ్లోత్ జీ.. ఏమంటున్నాడు సచిన్’’ అని అడుగుతున్నాడు. ‘‘పిల్లవాడు కదా. గౌరవం కావాలి అంటున్నాడు’’ అని చెప్పాను. భళ్లున ఏదో బద్ధలైనట్లుగా నవ్వాడు దిగ్విజయ్. - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: ముకేశ్ అంబానీ (రిలయన్స్)
నేను చూసుకోలేదు. నీతా వచ్చి చూపించింది. ‘‘టాప్ టెన్ రిచ్లో మీరు ఎనిమిది లోకి వచ్చారు’’ అంది నవ్వుతూ. కళగా ఉంటుంది నీతా ముఖం. రేపు నేను మళ్లీ తొమ్మిదిలోకి పడిపోయి, తొమ్మిది నుంచి పదిలోకి చేరిపోయినా ఆ ముఖం కళ తప్పదు. ‘‘అసలు ఎవరైనా టాప్ హండ్రెడ్‌లో ఉన్నారంటేనే గ్రేట్ కదా..’’ అంటుంది. నీతా చేతిలో పూలసజ్జ ఉంది. ‘‘గుడికా నీతా.. ’’ అన్నాను. ‘‘అవును. శుక్రవారం కదా, అమ్మవారి గుడికి..’’ అంది. సంతోషం అనిపించింది. ‘మీరు ఎయిత్ లోకి వచ్చారు కదా, అర్చన చేయించడానికి..’ అని చెప్పలేదు. ‘‘సరే నీతా.. జాగ్రత్త. మాస్క్ పెట్టుకో. నాలుగు నిమిషాల కంటే ఎక్కువసేపు ఎవరి ఎదురుగా నిలుచోకు. ఎక్కడో చదివాను. మాస్క్ పవర్ నాలుగు నిమిషాలేనట’’ అని చెప్పాను. నీతా నవ్వింది. ‘‘మీరు జాగ్రత్త. మీరు ఎయిత్లోకి వచ్చారని మనవాళ్లెవరైనా పూలబొకేతో వచ్చి, బొకే ఇచ్చేటప్పుడు వేళ్లు తగిలిస్తారేమో. బొకేని ఆ టీపాయ్ మీద పెట్టమనండి’’ అంది. నీతా వెళ్లాక, పేపర్ తీశాను. మాస్క్ పవర్ నాలుగు నిమిషాలైతే.. బ్లూమ్స్‌బర్గ్ బిలియ నీర్ల ఇండెక్స్ పవర్ ఇరవై నాలుగు గంటలు. ఇరవై నాలుగు గంటల తర్వాత ఇదే పేపర్లో ‘అంబానీని నెట్టేసిన బఫెట్’ అనే గ్రాఫు కనిపించవచ్చు. నవ్వొచ్చింది నాకు. ఎవరో వస్తున్న చప్పుడైంది. పూలబొకే పట్టుకుని ఎవరైనా రావచ్చని నీతా చెప్పింది నిజమే! ‘‘గుడ్ మాణింగ్ అన్నయ్యా..’’ అన్నాడు అనిల్.. లోపలికి వస్తూ. అనిల్ చేతిలో బొకే లేదు. లేకపోవడం మంచిదైంది. ఉంటే, ‘ఇప్పుడు మన ఆస్తుల విలువ ఎంత అన్నయ్యా’ అని అడగడానికి ఆ బొకే అతడికి తగిన సందర్భాన్ని కల్పించి ఉండేది. ‘‘బఫెట్‌ని మించిపోయావ్ కదన్నయ్యా! అవునూ అన్నయ్యా.. అరవై మూడూ పాయింట్ ఎనిమిది బిలియన్ డాలర్లు అంటే ఐదు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలే కదా..’’ అన్నాడు. ‘‘కాదు’’ అన్నాను. ‘‘అదేంటన్నయ్యా!!’’ అన్నాడు. ‘‘రూపాయల లెక్క కరెక్టే. డాలర్లు మాత్రం అరవై మూడూ పాయింట్ ఎనిమిది బిలియన్లు కాదు. అరవై ఎనిమిదీ పాయింట్ మూడు బిలియన్లు’’ అన్నాను. ‘‘అందుకే అన్నయ్యా.. నువ్వు నువ్వే. నేను నేనే’’ అన్నాడు. అన్నాక.. ‘‘అన్నయ్యా.. వైఫ్ హండ్రెడ్ రుపీస్ కావాలి’’ అన్నాడు! ‘‘ఐదొందలా!! లాస్ట్ ఇయర్ మార్చి నెలలోనే కదా ఇచ్చాను. మళ్లీ ఏమిటి!’’ అన్నాను. ‘‘నేనూ అదే అన్నాను అన్నయ్యా.. పాన్ షాపువాడు ఎప్పటి మార్చి, ఎక్కడి జూలై అంటున్నాడు’’ అన్నాడు. కోపం వచ్చింది నాకు. ‘‘పాన్ ఎప్పటి నుంచి వేసుకుంటున్నావ్?’’ అన్నాను. ‘‘అబ్బే.. నేను కాదన్నయ్యా. నా పేరు చెప్పి నా ఫ్రెండ్ కట్టించుకున్నాడట పాన్లు..’’ అన్నాడు. మౌనంగా ఉన్నాను. ‘‘ఇంకో ఐదొందలు కూడా ఇవ్వన్నయ్యా. సాయంత్రం పూలబొకే తెస్తాను’’ అన్నాడు. ఐదొందలు ఇచ్చి, ‘మనలో మనకు బొకేలు ఎందుకులే అనిల్’ అన్నాను. తీసుకుని వెళ్లిపోయాడు. అనిల్ ఎప్పటికి మారతాడో తెలియడం లేదు. బఫెట్ దానాలిచ్చి నా కన్నా డౌన్లోకి వెళ్లిపోయాడు. అనిల్‌కి అడిగినప్పుడల్లా డబ్బులిస్తుంటే టాప్ టెన్ నుంచి టాప్ ఫైవ్ హండ్రెడ్‌లోకి వెళ్లడానికి ఎంతసేపు! అప్పుడు కూడా నీతా.. ‘ఎవరైనా అసలు టాప్ ఫైవ్ హండ్రెడ్‌లో ఉన్నారంటేనే గ్రేట్ కదా..’ అంటుందేమో.. అదే చిరునవ్వుతో. - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: జిన్‌పింగ్ (చైనా అధ్యక్షుడు)
సియాన్షా మోదీ వాస్తవాధీన రేఖ దగ్గరికి వచ్చి కూడా చైనా లోపలికి రాలేదు! ఇంటి వరకు వచ్చి, ఇంట్లోకి రాకుండా వెళ్లిపోయాడంటే చైనా సంప్రదాయాలేవో దారి మధ్యలో వారిని బాధించి ఉండాలి. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్కి ఫోన్ చేసి, ‘‘నేనిప్పుడు సియాన్షా మోదీతో మాట్లాడేందుకు వీలవుతుందా?’’ అని అడిగాను. ‘‘మాట్లాడేందుకు వీలవుతుంది మిస్టర్ ప్రెసిడెంట్. అయితే మోదీని మాట్లాడించడం వీలుకాకపోవచ్చు’’ అన్నాడు లిజియన్. ‘సియాన్షా మోదీ మనతో మాట్లాడగలిగే లోపు, మనం ఇంకెవరితోనైనా మాట్లాడగలమేమో చూడు’’ అన్నాను. ‘‘మాట్లాడలేమేమో మిస్టర్ ప్రెసిడెంట్. అమెరికాతో మనకు ట్రేడ్‌వార్ నడుస్తోంది. తైవాన్‌తో మెయిన్‌ల్యాండ్ వార్ నడుస్తోంది. హాంకాంగ్‌తో కల్చరల్ వార్ నడుస్తోంది. బ్రిటన్‌తో హాంకాంగ్ వార్ నడుస్తోంది. జపాన్‌తో డిప్లమసీ వార్ నడుస్తోంది. ఇండోనేసియా, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం.. ఆ బెల్టు మొత్తంతో సౌత్ సీ వార్ నడుస్తోంది’’ అన్నాడు లిజియన్. నేను అన్నది అతడికి అర్థమైనట్లు లేదు. ‘‘మనతో మాట్లాడేందుకు ఇంకెవరైనా ఉంటే చూడమని అన్నది వేరే దేశాల్లో కాదు లిజియన్, ఇండియాలోనే ఎవరైనా ఉన్నారా అని..’’ అన్నాను. ‘‘ఇండియాతో మనకు బోర్డర్ వార్ నడుస్తోంది కదా మిస్టర్ ప్రెసిడెంట్’’ అన్నాడు! అతడి వైపు చూశాను. ఇతణ్ని మార్చేస్తే బెటరా అనిపించింది. ‘‘దేశాల మధ్య వార్ నడుస్తున్నప్పుడు దేశంలోని వారి మధ్య ఇంకో వార్ నడుస్తుంటుంది. సియాన్షా మోదీతో అలా యుద్ధం చేస్తున్న వారెవరైనా ఉంటారు. వారిని నాకు కలుపు’’ అని ఫోన్ పెట్టేశాను. వెంటనే ఫోన్ రింగ్ అయింది. ‘‘దొరికారు’’ అన్నాడు లిజియన్. ‘‘ఎవరు? సియాన్షా మోదీనేనా?’’ అన్నాను. ‘‘ఆయన కాదు. ఆయన కోసం ఇంకోసారి ట్రయ్ చెయ్యడం ఎందుకని, ట్రయ్ చేస్తే ఒకసారికే దొరికే మనిషిని పట్టుకున్నాను’’ అన్నాడు! ‘‘కష్టమైన పనులు చెయ్యడం నేర్చుకో లిజియన్. ఎన్నాళ్లిలా విదేశాంగ శాఖ ప్రతినిధిగా ఉండిపోతావ్? చైనా చాలా పెద్దది. ముందు ముందు ఇంకా పెద్దది అవుతుంది’’ అన్నాను. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్.. ఈయన ఒకసారికే దొరికాడు కానీ, మాట్లాడ్డానికైతే ఒకసారికే ఒప్పుకోలేదు. ఒప్పించడానికి అనేకసార్లు కష్టపడవలసి వచ్చింది. లైన్లో ఉన్నారు కనెక్ట్ చెయ్యమంటారా?’’ అని అడిగాడు. ‘‘ఊ..’’ అన్నాను. కనెక్ట్ చేశాడు. ‘‘నమస్తే జిన్పింగ్జీ.. ఏదో మాట్లాడాలని అన్నారట’’ అన్నారెవరో అట్నుంచి! ‘ఎవరూ.. మాట్లాడుతోందీ’ అని అడగబోయి ఆగాను. మాట్లాడ్డానికి దొరికింది ఎవరని లిజియన్ని నేనూ అడగలేదు, మాట్లాడ్డానికి దొరికిందెవరో లిజియనూ నాకూ చెప్పలేదు. ‘‘నమస్తేజీ నమస్తే.. సియాన్షా మోదీ మీకు తెలుసా?’’ అన్నాను. ‘‘మోదీ తెలుసు. సియాన్షా ఎవరు?’’ అన్నాడు! ‘‘సియాన్షా అనేది రెస్పెక్ట్. సియాన్షా మోదీ అంటే మోదీకి రెస్పెక్ట్ ఇవ్వడం’’ అని చెప్పాను. ‘‘అలాగైతే నాకు సియాన్షా మోదీ ఎవరో తెలీదు’’ అన్నాడు. ‘‘మీరెవరో మరొకసారి నేను తెలుసుకోవచ్చా..’’ అన్నాను. ‘‘ఎన్నిసార్లయినా తెలుసుకోవచ్చు. నేను సియాన్షా రాహుల్’’ అన్నాడు! మనుషులకే ఇంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే దేశాలకు లేకుండా ఉంటుందా?! - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : జో బైడెన్ (ట్రంప్ ప్రత్యర్థి)
అమెరికా ఈసారి తనక్కావలసిన అధ్యక్షుడినే ఎన్నుకుంటుంది. అందుకు నేను ఒకట్రెండు సూట్లు, రెండు మూడు డిజైనర్ ‘టై’లను ఇప్పటినుంచే ఎంపిక చేసుకుని పెట్టుకోవడంపై శ్రద్ధ వహించవలసిన సమయం దగ్గరికి వచ్చేసింది. నవంబరు మూడున ఎన్నికలు. ఈలోపు ట్రంప్‌తో మూడు డిబేట్లు. ట్రంప్‌కి డిబేట్ పెద్ద విషయం కాదు కాబట్టి ట్రంప్‌తో డిబేట్ పెద్ద విషయం కాదు. ఏదో మాట్లాడేస్తాడు. ఆ మాట్లాడిన దాని మీద మాట్లాడితే చాలు. తెలియకుండానే తొంభై నిముషాలు గడిచిపోతాయి. పెద్దగా టెన్షన్ తీసుకోడు, తనూ టెన్షన్ ఇవ్వడు. తగిన మనిషేనా కాదా అన్న సందేహంతోనే నాలుగేళ్ల క్రితం అమెరికా డోనాల్డ్ ట్రంప్‌ని ఎన్నుకుంది. ఈ చివరి ఏడాదైనా చైనా నుంచి ప్రపంచ రాయబారిలా కరోనా రాకపోయుంటే ట్రంప్ ఎంత సమర్థుడైన అధ్యక్షుడో అమెరికన్ ప్రజలకు తెలియకపోయేది. నన్నొక్కటే నిరుత్సాహపరుస్తోంది. అమెరికా అధ్యక్షుడిని అయ్యాక పని కట్టుకుని నేను అమెరికా కోసం ఏదైనా పని చేయాల్సిన అవసరం ఉండదేమోనని! ట్రంప్ ‘టిక్కు’లు కొట్టుకుంటూ వెళ్లిన వాటన్నిటికీ ‘ఇంటూ’లు కొట్టడానికి రెండేళ్లు, ట్రంప్ ‘ఇంటూ’లు కొట్టుకుంటూ వెళ్లిన వాటన్నిటికీ ‘టిక్కు’లు కొట్టడానికి మరో రెండేళ్లు పడుతుంది. మళ్లీ ఇంకోసారి అధ్యక్షుడినైతేనే నాకు పని! నాలుగేళ్లు ఇప్పుడు పదవి కోసం చూసినట్లు నాలుగేళ్లు అప్పుడు పని కోసం చూడాలి. ‘ఓడిపోతే నేనెలాగైనా బతుకుతాను. నువ్వెలా బతుకుతావు?’ అని ట్రంప్ నన్ను చాలెంజ్ చేస్తున్నాడు. ట్రంప్‌కి, నాకు మధ్యే పోటీ అయినప్పుడు.. ట్రంప్ ఓడిపోతే నేనే కదా గెలిచేది. తనతో పాటు నేనూ ఓడిపోతానని ట్రంప్ ఎందుకు అనుకుంటున్నట్లు?! ఓడిపోతానన్న భయం ఉన్నవాళ్లే ‘ఎలాగైనా బతగ్గలను’ అంటారు. తను బతకడం కోసం అమెరికా అధ్యక్షుడు ఆలోచిస్తున్నాడంటే అమెరికా అధ్యక్షుడిగా అతడు గెలవలేదనే. ట్రంప్‌కి ఫోన్ చేసి ఈ సంగతి చెబుదామనిపించింది. పదవిలో ఉన్న రిపబ్లికన్ అధ్యక్షుడికి, అధ్యక్షుడి పదవిలోకి వస్తున్న డెమోక్రాటిక్ అభ్యర్థి ఫోన్ చేయడం బాగుంటుందా?! గ్రెగ్ షాల్జ్ని పిలిపించి అడిగాను. నా క్యాంపెయిన్ మేనేజర్ గ్రెగ్. ‘‘గ్రెగ్.. నేనిప్పుడు ట్రంప్‌తో మాట్లాడాలన్న మూడ్‌లో ఉన్నాను. ఈ టైమ్‌లో కరెక్టేనా?’’ అని అడిగాను. ‘‘అది మీడియా మూడ్‌ని బట్టి ఉంటుంది మిస్టర్ ప్రెసిడెంట్’’ అన్నాడు గ్రెగ్ నవ్వుతూ. ‘‘మీడియాకు ఎలా తెలుస్తుంది గ్రెగ్?’’ అన్నాను. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్.. మీడియా ఎప్పుడూ తెలియని విషయాలను రాసే మూడ్‌లోనే ఉంటుంది’’ అన్నాడు. ఏడాది క్రితమే అతడు నా క్యాంపెయిన్ మేనేజర్‌గా వచ్చాడు. అప్పట్నుంచీ నన్ను ‘మిస్టర్ ప్రెసిడెంట్’ అనే పిలుస్తున్నాడు. ‘ప్రెసిడెంట్ కాకముందే మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలుస్తున్నావు! ప్రెసిడెంట్ అయ్యాక మిస్టర్ ప్రెసిడెంట్ అనడంలో నీకు కొత్తదనం ఏముంటుంది?’ అని ఓసారెప్పుడో అడిగాను. ‘ప్రెసిడెంట్ అవకముందు మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలిస్తే మీకు కలిగే మానసికోల్లాసం, ప్రెసిడెంట్ అయ్యాక మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలిస్తే కలగదు కదా మిస్టర్ ప్రెసిడెంట్. ఇక నేనెందుకు మిమ్మల్ని అలా పిలుస్తున్నానంటే.. ఎన్నికలయ్యాక ముప్పై మూడు కోట్ల మందికీ మీరు మిస్టర్ ప్రెసిడెంటే. ఇప్పుడైతే ముప్పై మూడు కోట్ల మందిలో నాకొక్కడికే మీరు మిస్టర్ ప్రెసిడెంట్..’’ అన్నాడు. గ్రెగ్ అలా మాట్లాడ్డం మనసుకు ఆహ్లాదకరంగా ఉంది. ఈ సమయంలో ట్రంప్‌కి ఫోన్ చేసి అతడి ముఖాన్ని వినడం అవసరమా అనిపించింది. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : రజనీకాంత్ (సూపర్ స్టార్)
అపార్థాలు చేసుకునేవారే లేకుంటే జీవిత సత్యాలంటూ కొన్ని ఈ లోకంలో ఏర్పడి ఉండేవే కావని ప్రతి ఉదయం నేనుండే పోయెస్ గార్డెన్‌లోని బాల్కనీలోంచి బయటికి చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అయితే సత్యం అనేది స్థిరపడి ఉండాలి తప్ప, ఏర్పడి ఉండకూడదు. ఏర్పడిన సత్యం ఏర్పరచిన సత్యమే కానీ సత్యం కాదని కూడా అనుకుంటూ ఉంటాను. కొందరనొచ్చు, రామస్వామి పెరియార్ సిద్ధాంతాలను అనుసరించేవారు.. ముందంటూ ఏర్పడితేనే కదా ఒక జీవితసత్యం స్థిరపడుతుందీ అని! దానిని నేను అంగీకరించను. సత్యం అన్నప్పుడు అది మనిషికన్నా ముందే పుట్టినదై ఉండాలి. మనిషికన్నా ముందు నడుస్తున్నదై ఉండాలి. అపార్థాలు చేసుకునేవాళ్లు సత్యాన్ని అప్డేట్ చేసి చూపిస్తారు. అదొక మంచి వీళ్ల వల్ల. అయితే సత్యం ఎప్పటికీ అప్డేట్ అవదు. çసత్యాన్ని మనం చూడటం అప్డేట్ అవుతుంది. అందుకే సత్యం హిమాలయాలలో ఉన్నా, సత్యాన్ని శోధించి లోకానికి చూపించే ఈ అపార్థం చేసుకునేవారు లోకమంతా ఉండాలి. వాళ్లెలాగూ హిమాలయాలలో ఉండలేరు కనుక అక్కడున్న సత్యం కరిగి నీరయ్యే ప్రమాదం ఏమీ ఉండదు. బాల్కనీలోంచి లేచి మెల్లగా హాల్లోకి వెళుతున్నాను. ‘‘రజనీ సార్.. మీ కోసం ఎవరో లైన్లో ఉన్నారు’’ అన్నాడు మేనేజర్. ‘‘ఎవరో లైన్లో ఉన్నప్పుడు ఆ ఎవరికో నన్ను పట్టించాలని నీకు ఎందుకు అనిపించింది నటరాజన్’’ అన్నాను. ‘‘రజనీ సార్, నాకు అతను తెలుసు. మీకు తెలికపోవచ్చని ఎవరో అన్నాను. అతను రోహిత్ రాయ్. మీ మీద కరోనా జోక్ వేసి సోషల్ మీడియాలో అదుపులేని విధంగా తిట్లు తింటూ ఉన్నాడు’’ అని చెప్పాడు. ‘‘చెప్పు నాన్నా.. రోహిత్ రాయ్’’ అన్నాను ఫోన్ అందుకుని పెద్దగా నవ్వుతూ. అతడు నా మీద వేసిన జోక్‌ని ఆల్రెడీ నేను సోషల్ మీడియాలో చూశాను. ‘రజనీకాంత్‌కి కరోనా వచ్చింది. కరోనానే క్వారంటైన్‌కి వెళ్లింది’ అని పేల్చాడు. పాపం అది అతడి ముఖం మీదే పేలింది. ‘‘ర జనీ సార్.. మీ ఫ్యాన్స్ నన్ను అపార్థం చేసుకున్నారు. మీరెంత శక్తిమంతులో చెప్పడానికి నేనలా అన్నాను. వాళ్లు అపార్థం చేసుకుంటే చేసుకున్నారు. మీరు అపార్థం చేసుకోకూడదని మీకు ఫోన్ చేశాను’’ అన్నాడు. ‘‘హహ్హాహ..హా.. రోహిత్. ఒక జీవితసత్యాన్ని నువ్వు అర్థం కాకుండా చెప్పినప్పుడు ఎవరికి ఎంతవరకు అర్థమైందో, అంతవరకే అది జీవితసత్యం అవుతుంది. అది మనకు అపార్థం అని తెలుస్తూనే ఉన్నా అపార్థం చేసుకునే హక్కును ప్రశ్నించలేం. రామస్వామి పెరియార్ అనే పేరే ఒక జీవితసత్యం అయినప్పుడు ఆ పేరును ఎత్తడం కూడా ఆ సత్యానికి విఘాతం కలిగించడమే అవుతుంది ఆయన అభిమానులకు..’’ అన్నాను. రోహిత్ మాట్లాడలేదు. ‘‘ఏంటి.. వింటున్నావా?’’ అన్నాను. ‘‘వింటున్నాను రజనీ సార్. రజనీకాంత్ అనే పేరే ఒక జీవితసత్యం అయినప్పుడు ఆ పేరును ఎత్తడం కూడా..’ అని ఏదో చెప్పబోతున్నాడు. మళ్లొకసారి పెద్దగా నవ్వి, ఫోన్‌ని నా మేనేజర్‌కి ఇచ్చేశాను. హాల్లోకి వెళ్లాలనిపించలేదు. తిరిగి బాల్కనీలోకి వచ్చాను. ఐదు నెలల క్రితం ఏదో సభలో పెరియార్ పేరెత్తాను. కరోనా ముంచుకు రాకుంటే ఈ ఆరో నెలలోనూ ఆ ద్రవిడ ఉద్యమ పితామహుడి అభిమానులు పెరియార్ అనే ఒక జీవితసత్యానికి కొన్ని ఉపసత్యాలను స్థిరపరచడం కోసం ఈ బాల్కనీ కింద పోయెస్ గార్డెన్లో ఆ ఉపసత్యాలను ఏర్పరుస్తూ ఉండేవారు.. పైకి తలెత్తి నన్ను చూస్తూ.. పిడికిళ్లు బిగించి! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : ట్రంప్ (అమెరికా అధ్యక్షుడు)
చెడ్డవాళ్లు ఏకమైతే ఈ లోకంలోని మంచివాళ్లకు ఏమౌతుందోనన్న భయాలు అక్కర్లేదు. ఎందుకంటే చెడ్డవాళ్లు ఈ లోకంలో కానీ, ఏ లోకంలో కానీ ఏనాటికీ ఏకం కారు. మంచివాళ్లే.. తమ మంచి గుణం చేత చెడ్డవాళ్ల మీదకు ఏకమౌతారు. లోకం మొత్తం మీద ఉన్నది ఒకే ఒక చెడ్డవాడే అయినా, అతడిని మంచివాడిని చేసేందుకు లోకం మొత్తం మీది మంచివాళ్లంతా ఏకం అవుతారు. అదే నాకు అర్థం కాకుండా ఉంటుంది! చెడ్డవాడెప్పుడూ వాడి కత్తి వాడు ఎత్తిపట్టుకుని ‘రండ్రా చూసుకుందాం..’ అంటాడు. ఈ మంచివాళ్లంతా ఒకే కత్తిని కలిపి పట్టుకుని, ‘కత్తిని పట్టుకున్నాం కానీ, ఎత్తి పట్టుకోలేదు. అదే మా మంచితనం’ అని లోకానికి చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. జెనీవాలో ఒక మంచివాడు ఉన్నాడు. చైనా నుంచి కరోనా వ్యాప్తిస్తూ వచ్చినప్పటి నుంచీ అతడు రోజురోజుకూ మరింత మంచివాడిగా మారుతూ వస్తున్నాడు. అతడి పేరు టెడ్రోస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి. ఎంత మంచివాడంటే.. చైనాను గానీ, చైనా వైరస్‌ను గానీ, చైనా ల్యాబ్‌ను గానీ ఒక మాటంటే ఒప్పుకోడు. ఈ మధ్య అతడికి ఫోన్ చేశాను. ‘‘ఎవరు మీరు?’’ అన్నాడు. ‘‘అమెరికా నుంచి చేస్తున్నాను. నన్ను ట్రంప్ అంటారు. నేనొక చెడ్డవాడిని’’ అన్నాను. ‘‘మరి చైనాలో ఉండే చెడ్డవాడైన ట్రంప్ ఎవరు?’’ అని అడిగాడు!! అతడి మంచితనానికి నివ్వెరపోయాను! ‘‘నేను చెడ్డవాడిని అయినప్పటికీ మంచివాళ్ల మంచి ఉద్దేశాన్ని చక్కగా అర్థం చేసుకోగలను మిస్టర్ టెడ్రోస్. మీరు నన్ను అడగాలని అనుకున్నది.. ‘చైనాలో ఉండే చెడ్డవాడైన ట్రంప్ ఎవరు? అని కాదు, ‘చైనా మీద అస్తమానం కంప్లయింట్లు చేస్తూ ఉండే చెడ్డవాడైన ట్రంప్ ఎవరూ?’ అనే కదా. అయితే నాకు తెలిసి కానీ, మీకు తెలిసి కానీ, చైనాకు తెలిసి కానీ లోకంలో ఉన్న ట్రంప్ అనే చెడ్డవాడు ఒకడే. ఆ ఒక్కడూ చైనాలో లేడు. అమెరికాలో ఉన్నాడు..’’ అన్నాను. మంచివాడు ఒక్కక్షణం ఆగాడు. ‘‘ఓ! నేనీ క్షణంలో లోకంలోని ఒకే ఒక చెడ్డవాడైన వ్యక్తితో మాట్లాడుతున్నానన్నమాట! ఎలా ఉన్నారు మిస్టర్ ట్రంప్? మీరు నాకు ఫోన్ చేస్తున్న సమయానికి నేనసలు మీ గురించే ఆలోచిస్తున్నానని చెబితే మీరు నమ్మలేరంటే నమ్మండి. మిమ్మల్ని మంచివాడిగా మార్చడానికి లోకంలోని మంచివాళ్లను కలుపుకునే పనిలో ఉన్నాను’’ అన్నాడు. ‘‘పెద్దగా నవ్వాను’’ ‘‘ఏమిటి నవ్వుతున్నారు’’ అన్నాడు. ‘‘ఒక చెడ్డవాడిని మార్చేందుకు మంచివాళ్లను కలుపుకునే పనిలో ఉన్నాను అని అన్నారు! అందుకే నవ్వొచ్చింది. అదేమంత తేలికైన పని కాదు మిస్టర్ టెడ్రోస్. అందరూ మంచివాళ్లే ఉన్న లోకంలో మంచివాళ్లను ఎంపిక చేసుకోవడానికి కొంత చెడ్డతనం ఉండాలి. మీరు జిన్పింగ్నైనా వదిలేసుకోవాలి, బిల్గేట్స్నైనా వదిలేసుకోవాలి. వాళ్లిద్దరే ముఖ్యం అనుకుంటే మిగతా మంచివాళ్లను వదిలేసుకోవాలి. చూశారా ఒక చెడ్డవాణ్ణి మార్చడం ఎంత కష్టమో’’ అన్నాను. ‘‘మంచివాళ్ల కష్టం గురించి ఆలోచిస్తున్నారంటే.. మిస్టర్ ట్రంప్.. నాకనిపిస్తోంది, మీలో పరివర్తన జన్యువులు ఉన్నాయని. ఒక్క డాలర్ కూడా మాకు రాల్చనని అన్నారు కదా. చూస్తూ ఉండండి.. మీకు తెలియకుండానే మీరు కొన్ని డాలర్లనైనా మాకు విదిల్చడానికి త్వరలోనే ఒక మంచిరోజును ఎంచుకుంటారు’’ అన్నాడు!! ‘‘నేనూ ఈ సంగతి చెప్పడానికే మీకు ఫోన్ చేశాను మిస్టర్ టెడ్రోస్. చైనాలోని చెడ్డతనాన్ని మీరు చూడగలిగితేనే మీకు నాలోని మంచితనం కనిపిస్తుంది..’’ అన్నాను. - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : నరేంద్ర మోదీ (ప్రధాని)
కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో దిగాను. మమతాబెనర్జీ ఎదురు రాలేదు. వచ్చారంతే. ‘నమస్తే మమతాజీ’ అన్నాను. ఆమె నా ముఖం వైపే చూడలేదు. ‘‘మమతాజీ ఉంఫన్ తుపాన్ని మీరు చక్కగా హ్యాండిల్ చేసినట్లున్నారు. మీరు అలా చేయకపోయి ఉంటే, నేనిక్కడ దిగటానికి విమానాశ్రయమే ఉండేది కాదు. అందుకు మీకు ధన్యవాదాలు’’ అన్నాను. అప్పుడూ ఆమె ఏమీ మాట్లాడలేదు. నేను, జగదీప్ ధన్కడ్, మమతాజీ కలిసి హెలికాప్టర్ విండోల్లోంచి దెబ్బతిన్న ప్రాంతాలను చూస్తున్నాం. ‘నిజంగానే మీరు చక్కగా హ్యాండిల్ చేశారు మమతాజీ’ అన్నాను మళ్లీ. విననట్లే ఉన్నారు. ఏరియల్ వ్యూ అయ్యాక హెలికాప్టర్ నుంచి దిగగానే మమత మమ్మల్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. మమతాజీ ఎక్కడికి అలా వెళ్లిపోతున్నారు అని అడగబోయాను. ‘సోనియాజీతో మీటింగ్ ఉందట మోదీజీ..’ అన్నాడు జగదీప్! నేను ఢిల్లీ వచ్చేశాను. జగదీప్ రాజ్‌భవన్‌కి వెళ్లిపోయాడు. ఢిల్లీ వచ్చాక.. అప్పుడు నాకు కాల్ చేశారు మమతాజీ! ‘‘మమతాజీ చెప్పండి. అక్కడ ఉన్నప్పుడు ఒక్క మాటా మాట్లాడలేదూ!!’’ అన్నాను. ‘‘చెప్పడానికి, మాట్లాడ్డానికీ ఏముంటుంది మోదీజీ. అడగడానికి ఫోన్ చేశాను. పశ్చిమ బెంగాల్లోనే మిమ్మల్ని పట్టుకుని అడగడం బాగోదని, ఢిల్లీ చేరే వరకు ఆగి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను. ఉంఫన్ తుపాను వల్ల రాష్ట్రానికి లక్ష కోట్ల నష్టం సంభవించింది’’ అన్నారు. ‘‘మీరు చక్కగా హ్యాండిల్ చేసినా కూడా అంత నష్టం సంభవించిందా మమతాజీ’’ అన్నాను. ‘‘చక్కగా హ్యాండిల్ చేసినందుకే లక్ష కోట్లు. చక్కగా హ్యాండిల్ చెయ్యకపోయుంటే రెండు లక్షల కోట్లు అయి ఉండేది’’ అన్నారు! ‘‘మమతాజీ మీరు మీ తుపాను లెక్కలే కదా చెబుతున్నారు? కోవిడ్ లెక్కల్ని కూడా కలిపేసి చెబుతున్నారా! కోవిడ్‌కైతే ఆల్రెడీ అన్ని రాష్ట్రాలకు కలిపి ఇరవై లక్షల కోట్లు ఇచ్చేశాం. అందులో మీకొచ్చేవీ ఉంటాయి. తుపాను లెక్కయితే మాత్రం అంత ఉండదు. ఒకసారి చెక్ చేసుకుని మళ్లీ కాల్ చేయండి’’ అన్నాను. ‘‘చెక్ చేసుకోవడానికి నోట్‌బుక్‌లో రాసుకున్న లెక్కలు కాదు మోదీజీ. వేళ్ల మీద ఉన్న లెక్కలు’’ అన్నారు మమత! ‘‘మమతాజీ! ముందొక వెయ్యి కోట్లు పంపిస్తున్నాను. చేతిలో ఉంచుకోండి. లాక్డౌన్లు మొత్తం పూర్తయ్యాక మళ్లొకసారి లెక్క చూసుకుని తగ్గితే నేనిస్తాను. మిగిలితే మీరు వెనక్కి ఇచ్చేద్దురు.. సరేనా?’’ అన్నాను. మమతాజీ మాట్లాడలేదు. దయతలచి ఇచ్చేవారి కన్నా, దబాయించి తీసుకునేవాళ్లు శక్తిమంతులైతే.. మాటల్ని మధ్యలోనే కట్ చేసే ధైర్యం వస్తుంది. ‘‘మమతాజీ, లైన్లోనే ఉన్నారా?’’ అన్నాను. చప్పుడు లేదు. ఎప్పుడొచ్చాడో జగదీప్ లైన్లోకి వచ్చాడు. ‘‘మోదీజీ.. మమత థ్యాంక్స్ చెబుతున్నారు’’ అన్నాడు! ‘‘నాకు చెప్పలేదే! నీకు చెప్పారా?’’ అని అడిగాను. ‘‘మనకు కాదు మోదీ.. కేజ్రీవాల్‌కి చెబుతున్నారు’’ అన్నాడు. ‘‘అవునా.. ఎందుకటా థ్యాంక్స్! లక్ష కోట్లు తను ఇస్తున్నాడా?’’ అన్నాను. ‘‘ఇవ్వడం కాదు మోదీజీ. ‘ఢిల్లీ ప్రజల తరఫున నేనేమైనా మీకు సహాయపడగలనా?’ అని కేజ్రీవాల్ ట్వీట్ పెట్టారట. ఆ ట్వీట్‌కు ఆవిడ సంబరపడి పోతున్నారు!’’ అన్నాడు జగదీప్. వెయ్యికోట్లు ఇస్తామంటే ‘నో.. థ్యాంక్స్’ అని చెప్పి, ‘మీకు ఏవిధంగానైనా సహాయపడగలమా’ అని కేజ్రీవాల్ అడిగితే ‘థ్యాంక్స్’ చెప్పడం ఏమిటో!! - మాధవ్ శింగరాజు -
కిమ్ జోంగ్ (ఉ.కొరియా అధ్యక్షుడు).. రాయని డైరీ
సౌత్ పాయాంగన్ ప్రావిన్సులో కాలి నడకన ఉన్నాం నేను, నా సొదరి కిమ్ యో జోంగ్. అంతకు క్రితమే ఎరువుల ప్లాంట్‌కి నేను రిబ్బన్ కట్ చేశాను. అయితే అది రిబ్బన్ని కట్ చేసినట్లుగా లేదు. పొడవైన వెడల్పాటి పల్చటి తివాచీని అడ్డంగా కట్టి, చేతికి చిన్న కత్తెర ఇచ్చారు. చేతికది ఆరో వేలులా ఉంది తప్ప కత్తెరలా లేదు. ‘‘నా సోదరి కిమ్ యో జోంగ్కి ఇవ్వండి. తనైతే తన సున్నితమైన వేళ్లతో ఒడుపుగా కత్తిరించగలదనే అనుకుంటున్నాను’’ అన్నాను ఆ ప్లాంటు వాళ్లతో.. రిబ్బన్ కటింగ్‌కి ముందు. ‘‘మీరైతే బాగుంటుంది’’ అన్నారు వాళ్లు! నా సోదరి ఉత్తర కొరియా అధ్యక్షురాలిగా ఉండి, నేను తన పక్కన ఒక సోదరుడిగా మాత్రమే ఉండి ఉంటే అప్పుడు రిబ్బన్ కట్ చేయమని నా సోదరికి కత్తెర ఇచ్చి ఉండేవాళ్లు కావచ్చు. వాళ్లకు కావలసింది అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు. అంతే తప్ప అన్నా చెల్లెళ్లు కాదు. కిమ్ జోంగ్ ఉన్ గానీ, కిమ్ యో జోంగ్ గానీ కాదు. అదే మాట నా సోదరితో అన్నాను. నవ్వింది. ‘‘కిమ్, ఈ ఎరువుల ప్లాంటువాళ్లకే కాదు, ఉత్తర కొరియా ప్రజలకు కూడా నువ్వో, నేనో కాదు కావలసింది. ఒక అధ్యక్షుడు. లేదా అధ్యక్షురాలు. మూడు వారాలు అయింది నువ్వు ఉత్తర కొరియా ప్రజలకు కనిపించక. వాళ్లేమీ కంగారు పడలేదు. నీ తర్వాత నేనే అంటున్నారు తప్ప, నువ్వు కనిపించడం లేదేమిటని నన్ను కూడా అడగడం లేదు’’ అని ఆశ్చర్యపడింది నా సోదరి. ఉత్తర కొరియా ప్రజలు కిమ్‌ని పట్టించుకోవడం లేదంటే ఉత్తర కొరియాను ఇంకెవరో పట్టించుకుంటున్నట్లు! ఎవరై ఉంటారు? దక్షిణ కొరియా? అమెరికా? అమెరికా అయితే అయి ఉండదు. నేను కనిపించనప్పటి నుంచీ నన్ను పట్టించుకుంటూనే ఉన్నాడు ట్రంప్. ‘కిమ్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు కానీ నేను చెప్పను’ అని, కిమ్ ఎలా ఉన్నాడో నాకు తెలుసు కానీ నేను చెప్పను’ అని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు. ఉత్తర కొరియా ప్రజలే.. ఏంటట? ఎవరట? అని అస్సలు పట్టనట్లే ఉండిపోయారు. మనిషి పోవడం అంటే డెడ్ అయ్యాడనో, బ్రెయిన్ డెడ్ అయిందనో కాదు. మనుషులకు పట్టకపోవడం. ‘‘ఏంటి కిమ్ ఆలోచిస్తున్నావు?’’ అంది నా సోదరి. ‘‘ఏం లేదు. ట్రంప్ మీద నాకు గౌరవ భావన కలుగుతోంది. నేననుకోవడం.. ఇన్నాళ్లూ నేను ఉండే ఉంటానని అనుకుని నాతో మాట్లాడేందుకు అనేకసార్లు ప్రయత్నించి ఉంటాడనీ, ఇప్పుడు ఉన్నానని తెలిసింది కాబట్టి నేను తనతో మాట్లాడ్డం కోసం ఎదురుచూస్తూ ఉండి ఉంటాడనీ..’’ అన్నాను. ‘‘నిజమే’’ అంది నా సోదరి. ‘‘ట్రంప్‌కి ఫోన్ చేసి మాట్లాడు కిమ్.. బాగుంటుంది’’ అని కూడా అంది. మరికొంత దూరం నడిచాం. నాతోపాటు మూడు వారాలుగా నా సోదరీ వాకింగ్ చేస్తూనే ఉంది. వెయిట్ తగ్గాలన్న విల్ పవర్‌ని నాలో తగ్గకుండా చూసేందుకు! ఎంతైనా నా సోదరి. ఒకరి కోసం ఒకరు ఎవరు నడుస్తున్నారిప్పుడు! ట్రంప్‌కు ఫోన్ చేయబోయాను. ట్రంప్ నుంచే కాల్! ట్రంప్ పెద్దగా ఇంగ్లిష్‌లో నవ్వుతున్నాడు. ‘‘కిమ్.. కిమ్‌లా ఉండాలి కిమ్ బ్రో..’’ అంటున్నాడు. ‘‘అవును. కొంచెం లాగేశాను కదా. డబుల్ చిన్ పోయింది. పొట్ట లోపలికి పోయింది. చూసే వుంటావ్ రిబ్బన్ కటింగ్ ఫొటోలో..’’ అన్నాను. ‘‘చూశాను బ్రో. అందుకే అంటున్నా.. కిమ్ కిమ్‌లా ఉండాలని. న్యూక్లియర్ ప్లాంట్‌కి రిబ్బన్ కట్ చేయవలసినవాడు, ఫెర్టిలైజర్ ఫ్లాంట్కి కట్ చేయడం ఏంటి!!’’ అన్నాడు.. మళ్లీ పెద్దగా నవ్వుతూ. -
ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర సి.ఎం.).. రాయని డైరీ
అజిత్ పవార్ నుంచి ఫోన్! టైమ్ చూసుకుని ఫోన్ చేయలేదా ఏంటీ మనిషి అని నేనే టైమ్ చూసుకున్నాను. ఉదయానికీ, మధ్యాహ్నానికి మధ్యలో ఎక్కడో ఉంది టైమ్. అతడెప్పుడూ ‘మధ్యల్లో’ ఫోన్ చేయడు. చేస్తే ఉదయం. చేస్తే మధ్యాహ్నం. చేస్తే సాయంత్రం. చేస్తే రాత్రి. ఏ రెండు సమయాలకూ మధ్య సమయంలో అతడి ఫోన్ రాదు. వచ్చిందంటే ముఖ్యమైన సంగతో, ముఖ్యం కాని సంగతో తేల్చుకోలేని సంగతి అయి ఉంటుంది! ‘‘చెప్పు అజిత్’’ అన్నాను. ‘‘చెప్పాను కదా..’’ అంటున్నట్లున్నాడు. సరిగా వినిపించడం లేదు. ‘‘అజిత్.. ఒకవేళ నీ ముఖానికి మాస్క్ ఉన్నట్లయితే దానిని తీసి మాట్లాడటానికి వీలవుతుందా?’’ అన్నాను. ‘‘మనం కూడా కొంతమంది పెద్ద మనుషులకు ఫోన్ చేస్తే బాగుంటుంది ఉద్ధవ్..’’ అన్నాడు. వాయిస్ క్లియర్ అయింది. మాస్క్ తొలగించినట్లున్నాడు. అజిత్ ఏం చెప్పదలచుకున్నాడో నాకు అర్థమైంది. మోదీజీ రోజుకు ఇంతమందని.. దేశంలోని సీనియర్ లీడర్లకు ఫోన్లు చేసి ‘బాగున్నారా? ఆరోగ్యం జాగ్రత్త’ అని పరామర్శిస్తున్నారు. ‘‘మోదీజీలా మరీ ఎనభై నిండిన వాళ్లకు కాకున్నా.. కనీసం డెబ్భై నిండిన వాళ్లకైనామనం ఫోన్ చేస్తే బాగుంటుందని నీకు ఫోన్ చేశాను’’ అన్నాడు. అజిత్ నన్ను ‘నువ్వు’ అంటాడు. నేనూ అతడిని ‘నువ్వు’ అంటాను. అజిత్ నాకంటే ఏడాది పెద్ద. ‘పర్లేదు. ఏడాది పెద్ద అయినా నువ్వు నన్ను ‘నువ్వు’ అనొచ్చు’ అన్నాడీమధ్య! ‘ఎందుకు అలా ‘నువ్వు’ అనడం? ఏడాది గ్యాప్‌ని గ్యాప్‌లాగే ఉంచేస్తే మంచిది కదా’ అన్నాను. ‘గ్యాప్‌ని గ్యాప్‌లా ఉంచాలంటే నువ్వు డిప్యూటీ సీఎంగా ఉండి, నన్ను సీఎంగా ఉంచాలి. ఉంచుతావా?’ అన్నాడు పెద్దగా నవ్వుతూ. అజిత్‌ని సీఎంని చెయ్యడం కన్నా, ‘నువ్వు’ అనడమే తేలిక. ‘‘చెప్పు ఉద్ధవ్.. అలా చేద్దామా.. సీనియర్లు అందరికీ ఫోన్లు చేసి..’’ అంటున్నాడు అజిత్. ‘‘అజిత్.. మోదీజీ ఫోన్ చేస్తే కరోనా సెవన్ పాయింట్ ప్రోగ్రామ్‌లో భాగంగా చేశాడని అంటారు. మనం ఫోన్ చేస్తే దేశం మొత్తం మీద మహారాష్ట్రలోనే కరోనా ఎక్కువగా ఉంది కాబట్టి.. ఉన్నారో లేరో కనుక్కోడానికి ఫోన్ చేస్తున్నామని అంటారు’’ అన్నాను. ‘‘అవును కదా.. పోనీ శాంపిల్‌గా ఎవరికైనా చేసి చూద్దామా? వాళ్లేం అనుకుంటారో తెలుస్తుంది..’’ అన్నాడు. ‘‘చాలా పనులున్నాయ్ అజిత్.. లాక్‌డౌన్‌ని జూన్ వరకు ఎలా పొడిగించాలో ఆలోచించాలి. అంతకన్నా ముఖ్యం.. మే ఇరవై ఎనిమిది లోపు నేను ఎమ్మెల్యేనో, ఎమ్మెల్సీనో అవ్వాలి. ఎమ్మెల్యే సీట్లు ఖాళీల్లేవు. ఎమ్మెల్సీని అవ్వాలి. ఎమ్మెల్సీని అవలేకపోతే అప్పుడు నా చేత ‘నువ్వు’ అని కాకుండా, ‘సీఎం గారూ..’ అనిపించుకోవడం బాగుంటుందా నీకు? ఫోన్‌లొద్దు, పరామర్శలొద్దు మనకు’’ అన్నాను. ‘‘అంతేనా’’ అన్నాడు నిరుత్సాహంగా. ‘‘కావాలంటే నువ్వన్నట్లు శాంపిల్‌గా ఓ కాల్ చేసి చూడు’’ అని ఫోన్ పెట్టేశాను. గంట తర్వాత మళ్లీ ఫోన్.. అజిత్ నుంచి. ‘‘గంట నుంచి చేస్తున్నా. తియ్యట్లేదు’’ అన్నాడు. ‘‘నాకెప్పుడు చేశావ్!’’ అన్నాను. ‘‘నీక్కాదు. గవర్నర్‌కి. డెబ్బై ఏడేళ్లు ఉన్నాయి కదా అని ఫోన్ చేశాను. తియ్యలేదు. చేస్తూనే ఉన్నాను తియ్యట్లేదు. ఏమైనా అయి ఉంటుందా!’’ అన్నాడు కంగారుగా. ‘‘అయుండదు. అవుతుందని తీసుండడు’’ అన్నాను. రెండు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. ఒకదానికి నన్ను నామినేట్ చెయ్యమని లెటర్ పెట్టి రెండు వారాలైంది. అందుకోసమే ఫోన్ చేస్తున్నారని అనుకుని ఉంటాడు. -మాధవ్ శింగరాజు -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
‘‘భలే చేస్తున్నాడు కదా’’ అన్నాడు అమిత్‌షా డిలైట్‌ఫుల్‌గా! అంత శక్తి, అంత కాంతి.. అతడి ముఖంలో కనిపించగానే నాకు అర్థమైంది.. శక్తికాంత దాస్ గురించే ఆ మాట అన్నాడని. ‘‘అవును భలే చేస్తున్నాడు. ముందే రఘురామ్ రాజన్ ఇలా చేసి ఉంటే ఈ లాక్డౌన్లో శక్తికాంత్ని మిస్ అయ్యేవాళ్లం’’ అన్నాడు రాజ్‌నాథ్‌సింగ్. ‘‘అప్పుడు మిస్ అవడానికి ఏముంటుంది! రాజనే ఉండేవాడు. రాజనే లాక్డౌన్లో భలే చేస్తుండేవాడు’’ అన్నాడు అమిత్ షా. ‘‘నేనూ అదే అంటున్నా అమిత్జీ.. రాజన్ ఉండి ఉంటే శక్తికాంత్ కూడా భలే చేయగలడని మనకు ఈ రోజు తెలిసి ఉండేది కాదు కదా..’’ అన్నాడు రాజ్‌నాథ్. ‘‘అసలు శక్తికాంత్ భలే చేయగలడని మనకు తెలియాల్సిన అవసరం ఎందుకుండేది.. రాజన్ ఉండి ఉంటే’’ అన్నాడు అమిత్ షా. ఎవరూ ఆగడం లేదు. ‘‘మీతో నేను ఏకీభవించే విషయం మీరిద్దరూ ఏకాభిప్రాయం కలిగి ఉన్న విషయం అయి ఉండాలని నేను కోరుకుంటాను’’ అన్నాను ఇద్దరి వైపు చూస్తూ. ‘‘లేదు మోదీజీ ఇద్దరం అంటున్నది ఒకటే.. శక్తికాంత్ భలే చేస్తున్నాడని! మధ్యలో రాజన్ పేరు రావడం వల్ల రెండు వేర్వేరు అభిప్రాయాలను మేము వ్యక్తం చేయబోతు న్నామన్న భావన మీలో కలగడంలో తప్పేమీ లేదు’’ అన్నాడు అమిత్‌షా. ‘‘అవును.. మోదీజీ! మా ఇద్దరి అభిప్రాయం ఒక్కటే. శక్తికాంత్ భలే చేస్తున్నాడని. మధ్యలోకి రాజన్ పేరును నేను తేవడం కూడా శక్తికాంత్ భలేగా చేస్తున్నాడని మరింత బాగా చెప్పడం కోసమే’’ అన్నాడు రాజ్‌నాథ్. ‘‘అది బాగా చెప్పడం అవదు రాజ్‌నాథ్‌జీ. చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం అవుతుంది. రాజన్ కంటే బాగా చేస్తున్నాడని గానీ, రాజన్ బాగా చేసి ఉంటే శక్తికాంత్ బాగా చేస్తాడని తెలియకపోయేది అనడం గానీ.. శక్తికాంత్ భలే చేస్తున్నాడని చెప్పడం అవదు. భలే చేస్తున్నాడు అంటున్నప్పుడు.. భలేగా ఏం చేస్తున్నాడో చెప్పుకోవాలి తప్ప, ఎవరికంటే భలేగా చేస్తున్నాడో చెప్పడం వల్ల భలేగా వాళ్లు చేసింది పోయి, భలేగా ఎవరో చేయనిది ముందుకొస్తుంది. అప్పుడు శక్తికాంత్ గురించి భలేగా చేస్తున్నాడని నువ్వేం అనుకున్నట్లు?!’’ అన్నాను. అమిత్‌షా ముఖం వెలిగిపోయింది. ‘భలేగయింది’ అన్నట్లు చూశాడు రాజ్‌నాథ్ వైపు. అమిత్‌షా ఫోన్ వెలుగుతోంది. తన ముఖం వెలుగులో తన ఫోన్ వెలుగును అతడు గ్రహించినట్లు లేడు. అమిత్‌షా ఫోన్ వెలుగుతోందని రాజ్‌నాథ్ గ్రహించాడు కానీ.. అమిత్‌షా వెలుగుతో, అతడి ఫోన్ వెలుగుతో తనకు సంబంధం ఏమిటన్నట్లు కూర్చున్నాడు. వెలిగి వెలిగి అమిత్‌షా ఫోన్ ఆగిపోయింది. అప్పుడు చెప్పాడు రాజ్‌నాథ్.. ‘‘అమిత్జీ మీ ఫోన్ వెలుగుతోంది’’ అని! ఫోన్ చూసుకుని, ఫోన్లో వెలిగి ఆరిపోయిన నంబర్ చూసుకుని ఆ నంబర్‌కి ఫోన్ చేశాడు అమిత్‌షా. నేను, అమిత్‌షా, రాజ్‌నాథ్.. ముగ్గురమే ఉన్నాం హాల్లో. పక్కపక్కన ఉన్న ముగ్గురిలో ఇద్దరికి వినిపించకుండా మూడో వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్నాడంటే.. ఏదో పెద్ద విషయం వినిపించబోతున్నాడనే. ‘‘శక్తి చాలడం లేదట’’ అన్నాడు అమిత్‌షా, ఫోన్ పెట్టేసి. ‘‘ఎవరు?’’ అన్నాను. ‘‘శక్తికాంత దాస్’’ ‘‘దేనికి శక్తి చాలడం లేదట’’ అన్నాడు రాజ్‌నాథ్. ‘‘రాజన్ పెడుతున్న టార్చర్ తట్టుకోడానికి. గంటకోసారి ఫోన్ చేసి.. ‘ఇలా కాదు ఎకానమీని ఎత్తడం. హెల్ప్ కావాలంటే చెప్పు’ అంటున్నాడట’’ అన్నాడు అమిత్‌షా. మాధవ్ శింగరాజు -
రాయని డైరీ... అరుణ్ గోవిల్ (రామాయణ్)
ఏ కాలంలోనైనా ఆ కాలపు జనరేషన్‌ని కుదురుగా ఒకచోట కూర్చోబెట్టడం ఎవరి వల్లా కాని పని. ఇక వాళ్లను పూర్వపు జనరేషన్లతో కలిపి ఇంట్లో కూర్చోబెట్టడం అన్నది ఊహకైనా అందని సంగతి. బహుశా నా జనరేషన్లో నేనూ అలాగే ఉండి ఉంటాను.. ఎవరి వల్లా కాని పనిగా, ఎవరి ఊహకూ అందని సంగతిగా! అసలు కూర్చోబెట్టడం అన్న ఆలోచనే తప్పు కావచ్చు. ఎవరికి వారికి అనిపించాలి కూర్చోవాలని. కాసేపు నాన్నతోనో, అమ్మతోనో, నానమ్మతోనో, తాతయ్యతోనో కూర్చోవాలని అనిపించనప్పుడు లాక్డౌన్ పీరియడ్లోనైనా ఫోన్‌తో గదిలోకి వెళ్లిపోయి తలుపు వేసుకోవడాన్ని ఎలా తప్పు పట్టగలం.. మన చేతిలోనూ ఓ ఫోన్ ఉంచుకుని?! స్మార్ట్ ఫోన్లతో కూడా మనిషి విసుగెత్తిపోయే దశ ఒకటి రావాలేమో. ఆర్థికమాంద్యంలా ఆసక్తిమాంద్యం. ఫేస్బుక్ ముఖం మొత్తేయాలి. ఇన్‌స్టాగ్రామ్‌లు, ట్విట్టర్లు, యూట్యూబ్‌లు, వాట్సాప్‌లు అంటేనే ఒళ్లంతా దద్దర్లు వచ్చేయాలి. అలాంటి దశ! వస్తే ఏం అవుతుంది? స్టోర్‌రూమ్‌కి వేసి ఉన్న తాళంకప్పల బూజు దులిపి, వాటి రంధ్రాల్లో ఓపిగ్గా కొన్ని చుక్కల నూనె పోసి, తాళం తీసి, కిర్రున తలుపు చెక్కల్ని నెట్టుకుంటూ లోపలికి వెళ్లి, ట్రంకుపెట్టెల్లో ఉండి ఉంటాయనుకున్న పూరిళ్ల, పురిటిళ్ల ఫొటో ఆల్బమ్‌ల కోసం వెతుకుతామేమో! మనం అమ్మానాన్న అయినా కూడా.. మనం తాతయ్య, నానమ్మ అయినా కూడా.. అమ్మ చిన్నప్పుడు, నాన్న టెన్త్‌క్లాస్‌లో ఉన్నప్పుడు.. అమ్మానాన్న ఫొటోలను వేళ్లతో నిమురుకుంటామేమో.. వాళ్లను మనకు మాత్రమే షేర్ చేసుకుంటూ. నిన్నట్నుంచీ డీడీలో ‘రామాయణ్’ రీరన్ అవుతోంది. ముప్పైమూడేళ్ల తర్వాత మళ్లీ ఇంటింటా రాముడు, సీత! ‘‘సీతమ్మవారు పడిన కష్టాల కంటే సీతమ్మవారి కోసం ‘సీతా.. సీతా’ అంటూ శ్రీరాముడు అలమటించడమే అప్పటి వ్యూయర్స్‌కి ఇప్పటికీ గుర్తుండి ఉంటుంది’’ అంటోంది శ్రీలేఖ. ‘‘తాతయ్యా.. ఆ రాముడు మీరే కదా’’ అంటూ ఎగిరొచ్చి మీద కూర్చున్నాడు ఆర్యవీర్. నవ్వాను. ‘‘మరి తాతయ్యా.. మీరు శ్రీరాముడు అయినప్పుడు, నానమ్మ కదా సీతమ్మ అవ్వాలి. వేరే ఎవరో ఆంటీ సీతగా ఉన్నారేమిటి?’’ అన్నాడు. ఆ మాటకు శ్రీలేఖ నవ్వింది. ఆర్యవీర్ని నా చేతుల్లోంచి లాక్కుంది. వాడి ప్రశ్నలు కూడా నా చేతుల్లోంచి వెళ్లిపోయాయి. ‘‘తాతయ్య పక్కన ఉన్న ఆ సీతమ్మ పేరేంటి నానమ్మా?’’ అని అడుగుతున్నాడు. ‘‘మొదలు పెట్టావా.. నీ ప్రశ్నల రామాయణం’’ అంటోంది దివ్య.. హాల్లోకి వచ్చి కూర్చుంటూ. ‘‘ఆ.. మొదలైంది మమ్మీ’’ అంటున్నాడు వాడు కిలకిలా.. టీవీ వైపు వేలు చూపిస్తూ. వాడిని నానమ్మ ఒడిలోంచి తన చేతుల్లోకి తీసుకుంది దివ్య. రెండు చేతుల్తో బయట్నుంచి సరుకులు మోసుకొచ్చాడు అమల్. ‘‘ఒక్క పురుగు లేదు రోడ్డు మీద’’ అంటున్నాడు. ‘‘అయితే నువ్వొక్కడివేనా పురుగువి.. డాడీ..’’ అన్నాడు ఆర్య. పెద్దగా నవ్వాడు అమల్. ‘‘అవున్రా.. నిన్ను కూడా తీసుకుని వెళ్లొంటే.. రెండే రెండు పురుగులు ఉండేవి రోడ్డు మీద’’ అంటూ దివ్య దగ్గర్నుంచి తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆర్యని. ‘‘మనమిక మాటలు ఆపేస్తే, ఆ రాముడి మాటల్ని వినొచ్చు. అంతేకదా నానమ్మా..’’ అని నానమ్మను ఇమిటేట్ చేశాడు ఆర్య.. నాన్నను విడిపించుకుని.. నానమ్మ దగ్గరకు గెంతుతూ. మెల్లిగా .. మా మూడు జనరేషన్లు ‘రామాయణ్’ కాలంలోకి వెళ్లిపోయి, ఒకచోట కలిసి కూర్చున్నాయి. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ... రంజన్ గొగోయ్ (మాజీ సీజేఐ)
నిందితుడు దోషిగా నిర్ధారణ కాకుండానే దోషిలా కోర్టు బోనులో నిలుచోవడం ఎలా ఉంటుందో నా నలభై రెండేళ్ల ‘లా’ కెరీర్లో నేనెప్పుడూ ఆలోచించలేదు. చట్టమే న్యాయం తరఫున ఆలోచనలు చేసి, ఆ ఆలోచనల్ని ఒక పుస్తకంగా కుట్టి, ఆ పుస్తకాన్ని న్యాయమూర్తి చేతిలో పెట్టినప్పుడు పుస్తకంలోని పేజీలు తిప్పుతూ పోవడం తప్ప, పుస్తకంలో లేని ఆలోచనలతో కోర్టు హాల్లో తలెత్తిగానీ, తలతిప్పిగానీ చూడవలసిన అవసరం న్యాయమూర్తికి ఏముంటుంది కనుక?! గురువారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేస్తున్నప్పుడు గతంలో నా ఎదుట కోర్టు బోనులో నిలబడి ‘అంతా నిజమే చెబుతాను’ అని ఎందరో నిందితులు ప్రమాణం చేసిన దృశ్యం నా కళ్ల ముందుకొచ్చింది! రాజ్యసభలో నేను ప్రమాణ స్వీకారం చేస్తుండగా ‘షేమ్ షేమ్’ అని అరిచిన అపోజిషన్ సభ్యులు.. కోర్టు హాలులో నిందితుడి వైపు వేలెత్తి చూపుతూ ‘దోషి, దోషి’ అని కేకలు వేస్తున్నవారిలా, వారిని వారిస్తూ ‘ఆర్డర్ ఆర్డర్’ అంటున్న రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రత్యేక ధర్మాసనానికి వచ్చి కూర్చున్న న్యాయమూర్తిలా నాకు కనిపించారు. ప్రమాణ స్వీకారానికి ముందు వెంకయ్యనాయుడికి నమస్కారం చేశాను. ‘ఇదిగో ఇలా నమస్కారాలు పెట్టే, రాజ్యసభ సీటు సంపాదించాడు. షేమ్ షేమ్’ అని సభలో అరుపులు! రాజ్యసభ కన్నా కోర్టు హాలే నయం అనిపించింది. అక్కడ నిందితుడైన వ్యక్తి ప్రమాణం చేస్తాడు. ఇక్కడ నేను ప్రమాణం చేస్తున్నందుకు నిందితుడినయ్యాను. ‘షేమ్ షేమ్ అంటున్న గౌరవ సభ్యులారా వినండి’ అన్నాను. ‘వినేందుకు ఏముంటుంది రంజన్ గొగోయ్! మోదీకి మీరు రామ జన్మభూమిని ఇచ్చారు. మోదీ మీకు రాజ్యసభను ఇచ్చారు. ఇచ్చిపుచ్చుకోవడం అయిపోయింది కదా..’ అంటున్నారు. అంటూ వాకౌట్ చేస్తున్నారు. ‘దిస్ ఈజ్ అన్‌ఫెయిర్’ అంటున్నారు వెంకయ్యనాయుడు. ఆ మాటను కూడా వాళ్లు వినడం లేదు. సుప్రీంకోర్టులో ఉండగా నేనొక్కడినే చీఫ్ జస్టిస్‌ని. రాజ్యసభలో పార్టీకొక రాజ్యసభ ఛైర్మన్ ఉన్నట్లున్నారు! కాంగ్రెస్, సీపీఎం, ఎండీఎంకే, ముస్లిం లీగ్, బీఎస్పీల ఎంపీలు నేను రాజ్యసభ సభ్యత్వానికి చెయ్యి చాచడంలో నీతి లేదని, రీతి లేదని తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇదంతా గ్యాలరీలోంచి నా భార్య, నా కూతురు, నా అల్లుడు చూస్తున్నారు. ‘గౌరవ సభ్యులారా.. నన్నూ చెప్పనివ్వండి’’ అన్నాను. ‘ఏముంటుంది చెప్పడానికి!’’ అని అరిచారు. ‘ఎవరేమనుకున్నా నేను భయపడే రకం కాదు. గతంలో భయపడలేదు. వర్తమానంలో భయపడటం లేదు. భవిష్యత్తులోనూ భయపడను. భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల్లో ఒక్క నా భార్య అభిప్రాయానికి తప్ప నేనెవరికీ విలువ ఇవ్వలేదు, ఇవ్వడం లేదు, ఇవ్వను’ అన్నాను. సభ ఒక్కసారిగా స్తంభించిపోయింది. వెంకయ్యనాయుడు నా వైపు అభినందనగా చూశారు. సభ ముగిసింది. ‘‘సభలో అలా అనేశారేంటీ.. నా మాటకు తప్ప ఎవరికీ విలువ ఇవ్వనని’’ అంది రూప.. ఇంటికి రాగానే. ‘‘అవును నాన్నగారూ అలా అనేశారేంటి’’ అంది నా కూతురు. ‘అవును మామగారూ అలా అనేశారేంటి’’ అన్నాడు నా అల్లుడు. ‘‘ఆరేళ్లు మాట పడుతూ పదవీ కాలం పూర్తి చేయడమా, పదవీకాలం ప్రారంభమైన రోజే మాటకు మాట చెప్పి దీటుగా నిలబడటమా అని ఆలోచించాను. దీటుగా నిలబడటమే నాకు, నన్ను నామినేట్ చేసిన రాష్ట్రపతికీ గౌరవం అనిపించింది. అందుకే నేను ఏమిటో చెప్పాను’’ అన్నాను. - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. ఇమ్రాన్ ఖాన్ (పాక్ ప్రధాని)
సీరియస్‌గా ఒక పనిలో ఉన్నప్పుడు, మనకు బాగా దగ్గరి వాళ్లెవరో నాన్–సీరియస్ పనొకటి చేసి మన మూడ్‌ని చెడగొట్టేస్తారు. మిడతల బెడదపై ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్నప్పుడు నా మూడ్ పాడైంది. ‘‘చూశారా మసూద్ అజార్ ఏం చేశాడో!’’ అన్నాను తలపట్టుకుని. ‘‘ఇమ్రాన్‌జీ.. స్క్రీన్ మీద మీరు తలపట్టుకోవడం కనిపిస్తోంది కానీ, మీరెందుకు తలపట్టుకున్నదీ వినిపించడం లేదు’’ అన్నారు మఖ్దూమ్ ఖుస్రో భక్తియార్. ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్ ఆయన. ‘‘అవును ఇమ్రాన్‌జీ.. నాకైతే మీరు తలపట్టుకోవడం కూడా సరిగా కనిపించడం లేదు. మా స్క్రీన్ మీద మీ పిక్చర్ బ్రేక్ అవుతోంది’’ అన్నారు డాక్టర్ అబ్దుల్ హఫీస్ షేక్. ఫైనాన్స్ అడ్వైజర్ ఆయన. నా పక్కనే ఉన్న డాక్టర్ ఫిర్దోజ్ ఆషిక్ అవాన్ వైపు చూశాను. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్‌లో నా ప్రత్యేక సలహాదారు ఆమె. ‘‘మేడమ్ ఫిర్దోజ్.. అవతలి వైపు స్క్రీన్ల మీద మీకు మన ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్, మన ఫైనాన్స్ అడ్వైజర్ కనిపిస్తున్నారా?’’ అని అడిగాను. ‘‘హా.. కనిపిస్తూనే ఉన్నారు కదా ఇమ్రాన్ జీ’’ అన్నారు ఆమె. ‘‘మరి ఇక్కడున్న ప్రైమ్ మినిస్టర్ వాళ్లకెందుకు కనిపించడం లేదు’’ అని అడిగాను ఆశ్చర్యపడుతూ. ‘‘కాదు కాదు ఇమ్రాన్‌జీ. మీరు కనిపిస్తూనే ఉన్నారు. కానీ సరిగా కనిపించడం లేదని మాత్రమే మేం అంటున్నాం. మీ పక్కన ఉన్న మీ ఇన్ఫర్మేషన్ అడ్వైజర్ మేడమ్ ఫిర్దోజ్ని కూడా మేము చూడగలుగుతున్నాం’’ అన్నారు అటువైపు నుంచి ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్, ఫైనాన్స్ అడ్వైజర్. వాళ్ల వైపు చూశాను. ‘‘నేననుకోవడం నా కన్నా కూడా మేడమ్ ఫిర్దోజ్నే మీరు స్పష్టంగా చూడగలుగుతు న్నారని. నేను ఇంకొకటి కూడా అనుకుంటు న్నాను మిస్టర్ మినిస్టర్ అండ్ మిస్టర్ ఫైనాన్స్ అడ్వైజర్. మేడమ్ ఫిర్దోజ్ నా పక్కన ఉన్నందు వల్లనే మీరు ఆ మాత్రమైనా నన్ను చూడగలుగుతున్నారని..’’ అన్నాను. ఫిర్దోజ్ ఇబ్బందిగా కదిలారు. ‘‘ఉండండి.. రెండు నిమిషాల్లో స్క్రీన్లన్నీ సెట్ చేస్తాను’’ అని పైకి లేచారు. ‘‘మీరు కూర్చోండి మేడమ్ ఫిర్దోజ్. ఈ ప్రపంచంలో రెండు నిమిషాల్లో ఏదీ సెట్ కాదు. సెట్ అయిందీ అంటే, తనంతటదే సెట్ అయిందనే కానీ, మనమేదో సెట్ చేసినందు వల్ల అయిందని కాదు. కరెంటు పోతుంది. మనం సెట్ చేస్తామా! దానంతటదే కదా వచ్చేస్తుంది’’ అన్నాను. ‘‘వావ్!!’’ అన్నారు ఫిర్దోజ్. ‘‘దేనికి వావ్ అన్నారు మేడమ్ ఫిర్దోజ్’’ అన్నాను. ‘‘స్క్రీన్లన్నీ సెట్ అయ్యాయి’’ అన్నారు. అటువైపు స్క్రీన్ల మీద బొటనవేలెత్తి చూపిస్తున్నారు.. సెట్ అయింది అన్నట్లు. ‘‘చూశారా మసూద్ అజార్ ఏం చేశాడో! అజార్ మిస్సింగ్ అని నేను ప్రపంచాన్ని నమ్మిస్తే, ప్రపంచానికి అతడు ఆడియో మెసేజ్ రిలీజ్ చేశాడు! వెల్డన్ తాలిబన్ అంటాడు. తాలిబన్ల నుంచి తప్పించుకోడానికే అమెరికా ఒప్పందం చేసుకుంది అంటాడు. అవసరమా మనకిప్పుడీ వెల్డన్లు, తాలిబన్లు’’ అన్నాను. ‘‘నిజమే ఇమ్రాన్‌జీ. దేశం మిడతల సమస్యలో ఉన్నప్పుడు మసూద్ అజార్ కూడా ఒక మిడతలా సమస్య అవడం కరెక్టు కాదు’’ అన్నారు ఫుడ్ సెక్యూరిటీ మినిస్టర్. ‘‘చైనా నుంచి లక్ష బాతుల్ని తెప్పిస్తున్నాం ఇమ్రాన్‌జీ. ఒక్కో బాతు రోజుకు రెండొందల మిడతల్ని తినేస్తుంది. అది పెద్ద ఇష్యూ కాదు’’ అన్నారు ఫైనాన్స్ అడ్వైజర్. బాతులు మిడతల్ని తినేస్తే పర్వాలేదు. మిడతలే బాతుల్ని తరిమికొట్టి, మసూద్ అజార్లా ఏదైనా మెసేజ్ ఇస్తే?!! - మాధవ్ శింగరాజు -
నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ
నేనొక కలగంటున్నాను. ప్రపంచంలో భారతదేశం అనేదే లేదు. సరిహద్దులు ఉంటాయి. కానీ అది దేశం కాదు. నరేంద్ర మోదీ ఉంటాడు. కానీ అతడు ప్రధాని కాదు. అమిత్ షా ఉంటాడు. కానీ అతడు హోమ్ మినిస్టర్ కాదు. ప్రజలు ఉంటారు. కానీ దేశ ప్రజలు కారు. నేనొక కలగంటున్నాను. ఉండీలేనట్లున్న ఈ దేశంలో నరేంద్ర మోదీ, అమిత్ షా కూడా ఉండీ లేనట్లే ఉంటారు. దేశ ప్రజలంతా ఒక దేశం లేనివాళ్లుగా ఉంటారు. అడుగు తీసి అడుగు వేసిన ప్రతిసారీ ఇక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు పరిఢవిల్లుతుంటాయి. ఐఎస్ఐ వాళ్లు, ఐసిస్ వాళ్లు భార్యాబిడ్డల్తో టూర్‌కి వచ్చిపోతుంటారు. ఏటా దావోస్ ఎకనమిక్ ఫోరమ్‌లో ప్రసంగించడానికి వచ్చే బిలియనీర్లు ప్రసంగాలు అయ్యాక.. వాళ్ల వాళ్ల దేశాలకు వెళ్లిపోకుండా.. ఇక్కడెలా ఉందో ఒకసారి చూసి పోదామని ఇటువైపు వస్తారు. ప్రభుత్వం ఉండీ లేకపోవడం వారికి సంతోషాన్నీ, సంతృప్తినీ ఇస్తుంది. పౌరులు పౌరుల్లా కాకుండా.. ఆధార్ కార్డులు లేకుండా, పుట్టిన తేదీలు, పుట్టిన స్థలాల పట్టింపు లేకుండా అంతా కలివిడిగా ఆలింగనాలు చేసుకుంటూ జీవిస్తుండటం ఆ దావోస్ ప్రసంగీకుల్ని పరమానందభరితుల్ని చేస్తుంది... ఏదో చప్పుడైంది! నా కల పూర్తి కాకుండానే చెదిరిపోయింది. ‘‘.. మీ అందమైన కలకు నేను గానీ అంతరాయం కలిగించ లేదు కదా మోదీజీ’’ అంటున్నారు అమిత్ షా!! ఆశ్చర్యంగా చూశాను. ‘‘పరేడ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి మోదీజీ. చీఫ్ గెస్ట్ జైర్ బొల్సొనారో కూడా బ్రెజిల్ నుంచి వచ్చి కూర్చున్నారు. మీరొస్తే పరేడ్ మొదలౌతుంది’’ అన్నారు అమిత్ షా. ‘‘అమిత్జీ.. ముందు నాకిది చెప్పండి. నేనొక అందమైన కలను కంటున్నట్లు మీరెలా గ్రహించగలిగారు’’ అని అడిగాను. ‘‘మీ ముఖంపై చిరునవ్వును గమనించాను మోదీజీ. ఆ చిరునవ్వు.. పౌరసత్వ చట్టం అమలుకు ఈ దేశంలోని ప్రగతిశీల వాదులంతా ఒకేసారి ఓకే అంటేనో, ఎన్నార్సీని ప్రారంభించడానికి రాష్ట్రాలన్నీ కలిసికట్టుగా ముందుకు వస్తేనో విరిసేది కాదు. అంతకు మించిన కారణం ఏదైనా ఉండాలి. నేననుకోవడం.. మీరొక హద్దులు, పద్దులు లేని భారతదేశాన్ని కలగంటున్నారు. నిజమేనా మోదీజీ’’ అన్నారు అమిత్ షా!! అతడి ముఖంలో ఏదో వెలుగు కనిపిస్తోంది. విస్మయ చకితుణ్ణి అయ్యాను. ‘‘ఎలా చెప్పగలిగారు అమిత్జీ’’ అన్నాను. ‘‘మీ కలనే ఇప్పటి వరకు నేనూ మా ఇంట్లో కని వస్తున్నాను మోదీజీ. ఎవరైనా వాళ్ల కలను కాకుండా, ఇంకొకరి కలను కంటూ ఉంటే వారి ముఖంలోకి వచ్చే ఆ వెలుగే వేరు’’ అన్నారు అమిత్ షా. లేచి అద్దంలో ముఖం చూసుకున్నాను. నా ముఖంలోనూ వెలుగు! అప్పటి వరకు నేను కంటున్న జార్జి షోరోస్ అనే ఒక విదేశీయుడి కల అప్పుడే నా ముఖంపై పనిచేయడం మొదలైనట్లుంది! దావోస్‌లో ప్రసంగించి వెళ్లిన బిలియనీరే ఆ జార్జి షోరోస్. నరేంద్ర మోదీ డేంజరస్ అంటాడు! పౌరుల్ని తరిమికొట్టడానికే పౌరసత్వ చట్టం అంటాడు! కశ్మీర్‌తో మోదీకేం పని అంటాడు! ఇండియాను ఇల్లూ వాకిలి లేని ఓపెన్ సొసైటీగా మార్చడానికి ఒక యూనివర్సిటీని కట్టాలని అంటాడు. కట్టేపనైతే బిలియన్ డాలర్ల చెక్కు ఇస్తానని అంటాడు! ‘‘ఏం చేద్దాం అమిత్జీ’’ అన్నాను. ‘‘ఏంటి చేయడం మోదీజీ’’ అన్నారు. ‘‘యూనివర్సిటీ కట్టడానికి బిలియన్ డాలర్లు ఇస్తాడట జార్జి షోరోస్. కడదామా?’’ అన్నాను. ‘‘కట్టడం ఎందుకు మోదీజీ! ఆల్రెడీ మనకు జేఎన్‌యూ ఉంది కదా’’ అన్నారు అమిత్ షా. - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: బోరిస్ జాన్సన్ (బ్రిటన్ ప్రధాని)
ట్రంప్ ట్వీట్ పెట్టాడు. ‘యు ఆర్ లుకింగ్ సో గుడ్’ అన్నట్లుంది ఆ ట్వీట్. అన్నట్లుందే కానీ, అతడు అన్నదైతే అది కాదు. ‘సెలబ్రేట్ బోరిస్’ అంటాడు. గెలిచిన వాళ్లెవరిలోనైనా అందాన్నే చూస్తాడు ట్రంప్. గెలుపంటేనే అందం ట్రంప్‌కి. దగ్గర్లేను. ఉంటే ఒక్కటిచ్చేవాడు. మగాడు మగాడికి ఇవ్వకూడనిది ఏదైతే ఉంటుందో సరిగ్గా దాన్నే ఇచ్చి ఉండేవాడు. ఇచ్చి నవ్వేవాడు. ‘యు ఆర్ లుకింగ్ సో గుడ్’ అనేవాడు మళ్లీ. లోపల ఇంకో ట్రంపేం ఉండడు పాపం నాన్–మేల్ రూపంలో. అదొక ధోరణి అంతే. దాన్ని అర్థం చేసుకున్నవాళ్లు మూడేళ్ల క్రితం ట్రంప్‌కి ఓటేశారు. మూడేళ్లు ట్రంప్‌ని చూశాక కూడా అర్థం చేసుకోనివాళ్లు అతడి ఇంపీచ్‌మెంట్‌కి నిన్న ఓటేశారు. నవ్వుకుని ఉంటాడు. ట్వీట్లో ‘సెలబ్రేట్ బోరిస్’ అనడానికి ముందు.. నువ్వూ నేను కలిస్తే ఇక నీకెవరి డీల్సూ అక్కర్లేదని కూడా అన్నాడు ట్రంప్! ‘జనవరిలో యూరోపియన్ యూనియన్ నుంచి బయటికి వచ్చేటప్పుడు యూనియన్‌తో నువ్వు కుదుర్చుకునే డీల్స్ అన్నిటికన్నా, అందులోంచి బయట పడినందుకు జనవరి తర్వాత నేనిచ్చే డీల్ నీ ముఖాన్ని వెలిగించేంత మనోహరంగా ఉంటుంది’ అంటాడు! ప్రధానిగా గెలిచినందుకు కాకుండా, ప్రధానిగా గెలిచినందుకు ట్రంప్ నాకేదో ఇస్తానని అన్నందుకూ కాకుండా.. నన్ను నేను సెలబ్రేట్ చేసుకోవలసిన గెలుపు ఇది. నేనేమిటో బ్రిటన్‌కి తెలుసు. తెలిసీ బ్రిటన్ ప్రజలు నాకు ఓటు వేశారంటే.. బ్రిటన్‌కి ఒక ప్రధానిగా వాళ్లు నన్నెన్నుకోలేదు. బ్రిటన్‌కి అవసరమైన ఒక ప్రధానిగా నన్ను ఎన్నుకున్నారు! అదీ నేను చేసుకోవలసిన సెలబ్రేషన్. ఎన్నికల ప్రచారంలో లేబర్‌పార్టీ నా మీద చేసిన పెద్ద దుష్ప్రచారం.. నేను ట్రంప్‌లా ఉంటానని. ఇద్దరి ఫేస్‌లు ఒకేలా ఉంటాయని. ఇద్దరి జోక్‌లు ఒకేలా ఉంటాయని. ఇద్దరికీ ‘గే’ లంటే పరిహాసం అని. ఇద్దరికీ ముస్లింలంటే పడదని! స్కాటిష్ నేషనల్ పార్టీ ఆ దుష్ప్రచారాన్ని ఫొటోషాప్‌లో ఇంకొంచెం పై లెవల్‌కి తీసుకెళ్లింది. యాభై ఐదేళ్ల వయసులో ట్రంప్ ఎలా ఉన్నాడో ఆ ఫొటోను సంపాదించి, ‘చూడండి ప్రజలారా.. అచ్చు బోరిస్లా ఉన్నాడు కదా’ అంది. డెబ్భై మూడేళ్ల వయసులో బోరిస్ ఎలా ఉంటాడో ఫేస్యాప్లోంచి తీసి, ‘చూశారా ప్రజలారా.. అచ్చు ట్రంప్‌లా ఉన్నాడు కదా’ అంది. ప్రజలు చప్పట్లు కొట్టారు. బోరిస్, ట్రంప్ ఒకలా ఉంటారు అన్నందుకు చప్పట్లు కొట్టారో.. బోరిస్, ట్రంప్ ఒకలా ఉన్నందుకు చప్పట్లు కొట్టారో ఇప్పుడా రెండు పార్టీలకు అర్థమయ్యే ఉంటుంది. యూరోపియన్ యూనియన్ నుంచి మనస్ఫూర్తిగా ఒక్క శుభాభినందనా అందలేదు. ఇంట్లోంచి ఒకరు వెళ్లిపోయి స్వతంత్రంగా ఉండాలనుకోవడం ఆ వెళ్లేవాళ్లకు సంతోషాన్నిస్తుంది కానీ, వాళ్లు ఉంటే బాగుంటుందని కోరుకునే ఇంటికి సంతోషాన్నివ్వదు. జనవరి లోపు ఇల్లు వెకేట్ చేస్తామని చెప్పిన వాళ్లనే బ్రిటన్ గెలిపించింది. బోరిస్ ముఖం, ట్రంప్ ముఖం సేమ్ టు సేమ్ అన్నవాళ్లను పట్టించుకోలేదు. ఎవరి ముఖం ఎలా ఉంటే ఏమిటీ, ఒక ముఖమైతే ఉండటం ముఖ్యం కానీ అనుకుని ఉండాలి. స్కాట్లాండ్ ఎప్పట్నుంచో బ్రిటన్నుంచి వెళ్లిపోతానని అంటోంది. ఈయూ నుంచి బ్రిటన్ బయటికి వచ్చాక.. బ్రిటన్ నుంచి బయటికి వెళ్లిపోతానని స్కాట్లాండ్ ఈసారి పట్టుపట్టొచ్చు. ‘నువ్వు బయటికి రావచ్చు కానీ నేను బయటికి వెళ్లిపోకూడదా..’ అని కూడా అంటుంది. ట్రంప్ ఇస్తానన్న మనోరంజకమైన డీల్‌కి ముడిపెట్టి ఎలాగైనా స్కాట్లాండ్ను బయటికి వెళ్లకుండా ఆపాలి. మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: అజిత్ పవార్ (ఎన్సీపీ)
‘‘సీఎం గారు లోపల బిజీగా ఉన్నారు. కాసేపు వెయిట్ చెయ్యండి’’ అన్నాడు అతడెవరో లోపల్నించి వచ్చి! ‘‘సీఎంలు ఎప్పుడూ బిజీగానే ఉంటారు. కొత్త సీఎంలు ఇంకా బిజీగా ఉంటారు. ఉద్ధవ్ ఠాక్రే లాంటి సీఎంలు ప్రధాని కన్నా బిజీగా ఉంటారు. అది నువ్వు చెప్పే పని లేదు. నా పేరు అజిత్ పవార్. లోపలికెళ్లి చెప్పు. వెయిట్ చేసేంత టైమ్ లేదు నాకు’’ అన్నాను. ‘‘సీరియస్ మేటర్ సార్, డిప్యూటీ సీఎంగా ఎవర్ని తీసుకోవాలో డిస్కస్ చేస్తున్నారు’’ అన్నాడు! అతడెవరికో సీఎం దేని గురించి డిస్కస్ చేస్తున్నాడో తెలిసిందంటే అదంత సీరియస్ డిస్కషన్ కాదని సీఎం అనుకుంటున్నాడని నాకు అర్థమైంది. ‘‘లోపల ఎవరు ఉన్నారు?’’... నన్ను లోపలికి పోనివ్వకుండా ఆపిన మనిషిని అడిగాను. ‘‘ఎవరూ లేర్సార్. సీఎం సార్ ఒక్కరే ఉన్నారు’’ అన్నాడు. ‘‘మరి డిస్కషన్స్ అన్నావు?’’ అన్నాను. అతను నవ్వాడు. డిస్కషన్స్‌కి మనుషులే ఉండాలా సార్! ఫోన్లు ఉంటే సరిపోదా?’’ అన్నాడు. సీఎం దేని గురించి డిస్కస్ చేస్తున్నాడో తెలిసిన మనిషికి సీఎం ఎవరితో డిస్కస్ చేస్తున్నాడో కూడా తెలిసే ఉంటుంది. ‘‘ఫోన్లో ఎవరు?’’ అని అడిగాను. ‘‘సారీ సర్, అవన్నీ చెప్పకూడదు. కానీ మీ పేరు అజిత్ పవార్ అంటున్నారు కాబట్టి చెబుతున్నాను. పృథ్వీరాజ్ చవాన్‌తో మాట్లాడుతున్నారు. బాలాసాహెబ్ థోరత్తో మాట్లాడుతున్నారు. శరద్ పవార్‌తో మాట్లాడుతున్నారు’’ అన్నాడు. ‘‘నా పేరు అజిత్ పవార్ కాబట్టి చెబుతున్నాను అన్నావు!! అదేంటి?!’’ అన్నాను. ‘‘సీఎం గారు చవాన్‌తో మాట్లాడుతున్నప్పుడు.. ‘అజిత్‌కి ఇవ్వకుండా మీకు ఇవ్వగలనా!’ అన్నారు. బాలాసాహెబ్‌తో మాట్లాడుతున్నప్పుడూ.. అదే మాట అన్నారు.. ‘అజిత్‌కి ఇవ్వకుండా మీకు ఇస్తే బాగుంటుందా..’ అని. రెండుసార్లు సీఎం నోటి నుంచి మీ మాట విన్నాను. ఇప్పుడు మిమ్మల్ని నేరుగా చూస్తున్నాను. లోపల మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు లోపల ఎవరెవరు మాట్లాడుకుంటున్నదీ మీకు చెప్పకపోవడం ధర్మం కాదనిపించింది. అందుకే చెప్పాను’’ అన్నాడు అతను. ‘‘మరి మీ సీఎం గారు శరద్ పవార్‌తో మాట్లాడుతున్నప్పుడు నా పేరు వినిపించలేదా?’’ అని అడిగాను. ‘‘తెలీదు సార్. ‘చెప్పండి శరద్‌జీ’ అని సీఎం గారు అంటున్నప్పుడు లోపల ఉన్నాను. ఆ తర్వాత బయటికి వచ్చేశాను.. మీరొచ్చారంటే’’ అన్నాడు. ‘‘సరే, నేను వచ్చి వెళ్లానని మీ సీఎం గారికి చెప్పు’’ అని.. నా పేరు, నా ఫోన్ నెంబరు ఉన్న కార్డు అతడికి ఇచ్చాను. ‘‘మీ గురించే మాట్లాడుకుంటున్నప్పుడు మీ పేరు, మీ ఫోన్ నెంబర్ సీఎం గారికి తెలియకుండా ఉంటాయా సార్’’ అని నవ్వాడతను. ‘‘సీఎంగా ప్రమాణ స్వీకారం చేయకముందు వరకు తెలిసే ఉంటుంది. తర్వాత బిజీ అయి ఉంటారు కదా. తెలియకపోవచ్చు. మర్చిపోకుండా ఈ కార్డివ్వు’’ అని చెప్పి వచ్చేశాను. గేటు దాటుతుంటే ఉద్ధవ్ నుంచి ఫోను! ‘‘సారీ అజిత్ జీ. మీ పని మీదే బిజీగా ఉన్నాను. పోర్ట్‌ఫోలియోలు తెగట్లేదు. అన్ని పార్టీలకీ హోమ్ కావాలి. అర్బన్ డెవలప్మెంట్ కావాలి. రెవిన్యూ కావాలి, హౌసింగ్ కావాలి. ఎవరూ అంతకు తగ్గట్లేదు’’ అంటున్నాడు!! డిప్యూటీ సీఎం పోస్ట్ గురించి కాకుండా క్యాబినెట్ పోస్ట్‌ల గొప్పదనం గురించి మాట్లాడుతున్నాడంటే నాకు ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో శరద్ జీ నుంచి ఉద్ధవ్కేవో సూచనలు, సలహాలు అందినట్లే ఉంది! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: నిత్యానంద (స్వామీజీ)
నిత్యం ఈ మనుషులు పెట్టే పరుగులు చూస్తుంటే, పరుగులు పెట్టేందుకే వీరు జన్మించి, జీవిస్తున్నారా అనే సందేహం నాకు ఏమాత్రం కలగకూడనిది. కానీ ఈవేళ కలుగుతోంది! ఐన్‌స్టీన్ కనిపెట్టిన ఈ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములాను వట్టి ఫేక్ అని తేల్చేసిన నిత్యానందకు, ‘నా పని పూర్తయ్యే వరకు బయటికి రాకు’ అని సూర్య భగవానుడినే ఆజ్ఞాపించి నలభై నాలుగు నిమిషాల పాటు ఆయన్ని ఆకాశం వెనకే ఉంచేసిన నిత్యానందకు, ఆవులను.. ఎద్దులను.. సింహాలను.. పులులను, వానరాలను సంస్కృతంలో, తమిళంలో మాట్లాడించిన నిత్యానందకు.. కలగకూడని సందేహాలు కలుగుతున్నాయంటే భూగోళానికివి తిమిరాంధకార యుగారంభ ఘడియలనే!! అర్థం, పరమార్థం, అంతరార్థం లేని పరుగులతో మనుషులు అద్వైత భావనకు విఘాతం కలిగిస్తున్నారు. ‘నేను’ అనే భావన వీడితేనే పరుగు ఆగుతుంది. ఆశ్రమానికి వచ్చిన కొత్తలో ఒక యువతిని అడిగాను.. నిత్యానంద మీద నీ అమూల్యమైన అభిప్రాయం ఏమిటని. ‘ఆయన ఎక్కడ ఉంటారు?’ అని తన అమాయకమైన కనురెప్పల్ని టపటపలాడిస్తూ అడిగింది ఆ యువతి. ‘నేనే కదా నిత్యానందను. తెలియకనే అడిగావా?’ అన్నాను. ‘అలాంటప్పుడు మీరు నిత్యానంద మీద నీ అభిప్రాయం ఏంటని కాకుండా.. నా మీద నీ అభిప్రాయం ఏంటని అడిగి ఉండాల్సింది కదా!’ అంది. ఆ సాయంత్రం అద్వైతం గురించి చెప్పాక.. జ్ఞానం కోసం ఆశ్రమానికి వచ్చిన ఆ యువతికి ఇక పరుగులు తీసే అవసరమే లేకపోయింది. నేను దేశం దాటి వచ్చే సమయానికి నా కోసం రెండు రాష్ట్రాల పోలీసులు పరుగులు తీస్తూ ఉన్నారు. అవి వారిని చట్టం తీయిస్తున్న పరుగులే తప్ప వారి చేత నిత్యానంద తీయిస్తున్నవి కావని గ్రహించగలిగి ఉంటే వారికింత ప్రయాసే ఉండేది కాదు. ‘‘గురూజీ.. భోజనం వేళయింది’’ అనే మాట వినిపించింది! ఆ మాటలో నాకు ఏ రుచీ పచీ కనిపించడం లేదు. ఏ ఘుమఘుమలూ నన్ను నిండైన ఆ విస్తరి వైపు ఆకర్షించడం లేదు. ఈ రాత్రి మరో సందేహ వైపరీత్యం కూడా నన్ను ఎటూ కదలనివ్వకుండా చేస్తోంది. ‘‘జగమెరిగిన నిత్యానందుడు అంటే జగాన్ని ఎరిగిన నిత్యానందుడా? నిత్యానందను ఎరిగిన జగమా? ఎలా అర్థమౌతోంది నీకు?’’ అని భోజనం సిద్ధం చేసి వచ్చిన పరిచారకుడిని అడిగాను. ‘‘నాకంత నాలెడ్జి లేదు గురూజీ’’ అన్నాడు! ‘‘నిత్యానందుడి సేవలో ఎన్నాళ్లుగా తరిస్తున్నావ్?’’ అని అడిగాను. ‘‘ఇవాళే కొత్తగా వచ్చాను గురూజీ. మీరూ ఇవాళే కొత్తగా వచ్చారు. మీకిది పరాయి దేశం. మాకు మీరు పరాయి జ్ఞానం’’ అన్నాడు! నిత్యానంద ఒక పామరుడికి వ్యక్తిగా కాక ఒక జ్ఞానరూపంగా సాక్షాత్కరిస్తున్నాడంటే నిత్యానందుడు జగం ఎరిగినవాడే కాదు, జగం ఎరిగిన నిత్యానందుడు కూడా! ‘‘ఇంత జ్ఞానం నీకెలా వచ్చింది’’ అని అడిగాను. ‘‘ఎంత జ్ఞానం?’’ అన్నాడు. ‘‘నిత్యానందను జ్ఞానరూపంగా చూసే జ్ఞానం!’’ అన్నాను. ‘‘నేనే కాదు, మరికొందరు జ్ఞానులు కూడా బయట మీ కోసం వేచి ఉన్నారు. మిమ్మల్ని వెదుక్కుంటూ మీ దేశం నుంచి వచ్చారు. స్వామివారికిది భోజనం వేళ అని వారిని ఆపి ఉంచాను’’ అన్నాడు. జీవికి పరుగు తప్పదా అనే సందేహం మళ్లీ మొదలైంది నాలో. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: శరద్ పవార్ (ఎన్సీపీ చీఫ్)
నేను వెళ్లేటప్పటికే సోనియాజీ నా కోసం ఎదురు చూస్తూ కనిపించారు! ‘‘సారీ సోనియాజీ మిమ్మల్ని మీ ఇంట్లోనే ఎంతోసేపటిగా నా కోసం వేచి ఉండేలా చేశాను’’ అన్నాను నొచ్చుకుంటూ. సోనియా నవ్వారు. ‘‘నేనెక్కడ మిమ్మల్ని నాకోసం ఎంతోసేపటిగా వేచి ఉండేలా చేస్తానోనన్న జాగ్రత్తతో ముందుగానే నేను మీకోసం వేచి ఉన్నాను పవార్జీ. టైమ్ చూడండి. వస్తానన్న సమయానికంటే కాస్త ముందుగానే వచ్చారు మీరు’’ అన్నారు. ‘‘హాహ్హాహా.. అవునా సోనియాజీ’’ అని సోఫాలో ఒక వైపు కూర్చున్నాను. ‘‘కూర్చోండి పవార్జీ’’ అన్నారు సోనియాజీ! వస్తానన్న సమయానికంటే ముందే వచ్చినట్లు.. కూర్చోవలసిన సమయమింకా రాకముందే కూర్చున్నట్లున్నాను!! ‘‘సారీ సోనియాజీ మీరు కూర్చోమనక ముందే కూర్చున్నట్లున్నాను’’ అన్నాను. ‘‘సారీ నేను చెప్పాలి పవార్జీ. మీరు కూర్చోడానికి ముందే ‘కూర్చోండి’ అని నేను మీతో అని ఉండవలసింది’’ అన్నారు సోనియా. సోనియాజీలో ఎంతో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు సొంత పార్టీ ముఖ్యమంత్రులు కూడా ఆమె కోసం సందర్శకుల గదిలో గంటల తరబడి వేచి ఉండవలసి వచ్చేది! ‘‘వీళ్ల కాన్ఫిడెన్స్ చూశారా పవార్జీ! గవర్నర్ పిలిచి మరీ కూర్చోమంటే కూర్చోవడం చేతకానివాళ్లు.. ‘వీళ్లెలా కూర్చుంటారో, ఎన్నాళ్లు కూర్చుంటారో మేమూ చూస్తాం’ అని మనల్ని అంటున్నారు!’’ అన్నారు సోనియాజీ. ‘‘విన్నాను సోనియాజీ. నేను ఢిల్లీ వచ్చే ముందు కూడా బీజేపీ వాళ్లెవరో నాకు వినబడేలా గట్టిగా ఎవరితోనో అంటున్నారు.. ఎవరు ఎవరితో కలిసినా చివరికి మహారాష్ట్రలో గవర్నమెంట్‌ని ఫామ్ చేయబోయేది వాళ్లేనట’’ అన్నాను. ‘‘చూపిద్దాం పవార్జీ. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కలిస్తే ఎలా ఉంటుందో బీజేపీకి చూపిద్దాం’’ అన్నారు సోనియాజీ. ‘‘ఏం చేద్దాం సోనియాజీ? ఆదిత్యా ఠాక్రేని కూర్చోబెడదామా సీఎం సీట్లో..’’ అన్నాను. ‘‘ఏం ఆలోచిస్తున్నారు పవార్జీ! మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్యను కూర్చోబెట్టామా.. మహారాష్ట్రలో ఆదిత్యా ఠాక్రేని కూర్చోబెట్టడానికి! రాజస్తాన్‌లో సచిన్ పైలట్‌ని కూర్చోబెట్టామా మహారాష్ట్రలో ఆదిత్యా ఠాక్రేని కూర్చోబెట్టడానికి! నలభైలలో ఉన్న చిన్నారులనే సీఎం సీటుకు వద్దనుకున్నప్పుడు ఇరవైలలో ఉన్న పసికందును సీఎం సీట్లో కాంగ్రెస్ ఎలా కూర్చోబెడుతుంది?’’ అన్నారు సోనియా. సోనియాజీలోకి మళ్లీ పాత సోనియాజీ ప్రవేశించినట్లున్నారు. కాంగ్రెస్ కన్నా ఎన్సీపీకి పది సీట్లు ఎక్కువ వచ్చిన సంగతి పక్కనపెట్టి, సీఎం పోస్టు కాంగ్రెస్ చేతిలో ఉన్నట్లు మాట్లాడుతున్నారు! ‘‘సోనియాజీ.. కాంగ్రెస్వీ, ఎన్సీపీవి కలిపి శివసేన కన్నా ఎన్ని ఎక్కువ సీట్లు ఉన్నాయో మీరు లెక్కేస్తున్నారు. కాంగ్రెస్ కన్నా, ఎన్సీపీకన్నా ఎన్ని ఎక్కువ సీట్లున్నాయో శివసేన లెక్క వేసుకుని కూర్చుంది’’ అన్నాను. ‘‘లాజిక్ ఆలోచించండి పవార్జీ’’ అన్నారు సోనియా! నాకేం లాజిక్ అందలేదు. అంకెల్ని మించిన లాజిక్ ఏముంటుంది?! ‘‘పవార్జీ.. ఫడ్నవిస్‌ని కూర్చోమన్నారు. కూర్చోలేకపోయాడు. ఠాక్రేని కూర్చోమన్నారు. కూర్చోలేకపోయారు. కూర్చోమన్నప్పుడు కూర్చోలేకపోయిన వారు సీఎం సీటుకు సూట్ అవుతారా, కూర్చోమనకుండానే కూర్చున్నవారు సీఎం సీటుకు సూట్ అవుతారా ఆలోచించండి..?’’ అన్నారు సోనియాజీ. సోనియా చెప్పదలచుకోనిదేమిటో అర్థం చేసుకోడానికి నేను పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదని నాకు అర్థమైంది. - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: నితిన్ గడ్కారి (కేంద్ర మంత్రి)
ముంబైలో ఉన్నాను కానీ, ముంబైలో నేనెక్కడున్నానో నాకు తెలియడం లేదు. గూగుల్ మ్యాప్స్‌లో కొట్టి చూడొచ్చు. కానీ చుట్టూ క్యాడర్ ఉంది. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రి తనెక్కడున్నదీ తెలుసుకోడానికి ఫోన్లో గూగుల్ మ్యాప్స్ సెర్చ్ చేస్తున్నాడని వాళ్లకు తెలియడం బాగుండదు. దారుల మంత్రికి దారి తెలియలేదంటే బీజేపీ క్యాడర్ పెద్దగా పట్టించుకోదు కానీ.. నా ముందున్న ఆర్ఎస్ఎస్ క్యాడర్, విహెచ్పీ క్యాడర్, శివసేన క్యాడర్.. ఈ మూడూ పట్ట నట్లు ఉండలేవు. తటాలున మాట అనేస్తాయి.. బీజేపీ దారి తప్పుతోందని! దారి తెలియకపోతే దారి తప్పేదేమీ ఉండదు. కొత్త దారి వేసుకుంటుంది బీజేపీ. ‘‘ఇప్పుడు మీరున్న చోటు లోకేషన్‌ను మీకు వాట్సాప్ పెట్టమంటారా నితిన్ జీ’’ అని అడిగాడు కిశోర్ తివారీ!! ఆశ్చర్యపోబోయాను కానీ, ఆశ్చర్యపడిపోకుండా గట్టిగా నిలదొక్కు కున్నాను. ‘‘నేను దారి వెతుక్కుంటున్నానని మీరెందుకు అనుకున్నారు కిశోర్ జీ’’ అన్నాను. ‘‘దారిలో పెట్టడానికి వచ్చినవాళ్లు.. ముందు దారెక్కడుందో వెతుక్కోవాలి కదా.. అందుకని అలా అనుకున్నాను’’ అన్నాడు. కిశోర్ రైతు కార్యకర్త. సరిగ్గా ఎన్నికలకు ముందు దారి తప్పి శివసేనలోకి వచ్చాడు. నాకు ఆప్తుడు. నాకు ఆప్తుడైనవాడు బీజేపీలోకి రాకుండా శివసేనలోకి వెళ్లాడంటే.. నన్నూ శివసేనకు ఆప్తుడిని చెయ్యాలని అనుకుంటు న్నాడని! శివసేనకు నేను ఆప్తుడిని అవడం అంటే.. ఆదిత్య ఠాక్రేని దగ్గరుండి మరీ ముఖ్య మంత్రి సీట్లో కూర్చోబెట్టి ఢిల్లీ వెళ్లిపోవడం. ఆ సంగతి చెప్పకుండా.. ‘‘ప్రయాణం ఎలా సాగింది నితిన్ జీ’’ అని అడిగాడు కిశోర్!! ‘‘ఢిల్లీ నుంచి నేను ముంబై వచ్చి రెండు రోజులైంది’’ అన్నాను. ‘‘ఢిల్లీ నుంచి ముంబైకి మీ ప్రయాణం ఎలా సాగింది అని కిశోర్ అడగటం లేదు నితిజ్ జీ. ముంబై వచ్చాక ఆదిత్య ఠాక్రేని సీఎంని చేసి వెళ్లే మీ ప్రయాణం ఎలా సాగింది అని అడుగుతున్నాడు’’ అన్నారు మోహన్ భాగవత్. ఆర్.ఎస్.ఎస్. చీఫ్ ఆయన. ఆయన చెబితే.. మోదీజీ అయినా, అమిత్జీ అయినా, ఇంకెవరైనా వినాల్సిందేనని కిశోర్ నమ్మకం. ‘గడ్కారికి మీరొక మాట చెప్పండి భాగవత్‌జీ, మహారాష్ట్ర రెండే రెండు నిముషాల్లో సెటిలైపోతుంది’ అని భాగవత్‌కి కిశోర్ ఉత్తరం రాశాడని ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో ముంబై వస్తున్నప్పుడు నా పక్క సీట్లో కూర్చున్న ప్రయాణికుడెవరో నేనెవరో గుర్తుపట్టకుండానే నాతో అన్నాడు! పైగా తనకు బొత్తిగా పాలిటిక్స్ తెలియవు అని కూడా అన్నాడు. నన్ను కన్విన్స్ చెయ్యమని భాగవత్‌కి కిషోర్ ఉత్తరం రాసిన సంగతి నా కన్నా ముందు ఫ్లయిట్లో నా పక్క సీట్లో పాలిటిక్స్ అంటే ఏమిటో కూడా తెలియకుండా కూర్చొని ఉన్న ఒక వ్యక్తికి తెలిసిందంటే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీటునే తప్ప, ముఖ్యమంత్రి పక్క సీటును, ముఖ్యమంత్రి వెనుక సీటును శివసేన కోరుకోవడం లేదనే. ‘‘మహారాష్ట్రను సెట్ చెయ్యడానికో, సెటిల్ చెయ్యడానికో నేను ముంబై రాలేదు కిశోర్ జీ. తెలిసిన వాళ్ల ఫంక్షన్‌కి వచ్చాను’’ అన్నాను. కిశోర్ నిరుత్సాహంగా చూశాడు. ఉద్ధవ్ అసహనంగా చూశాడు. భాగవత్ పెద్దమనిషిలా చూశాడు. ఆదిత్య ఎలానూ చూడకుండా.. తండ్రి వైపే చూస్తున్నాడు. ‘‘చూద్దాం. దారే లేదనుకున్నప్పుడు బీజేపీ ఎన్ని దారులు వేయలేదూ?! కశ్మీర్‌కు దారి వేసింది. కర్తార్‌పూర్ కారిడార్‌కు దారి వేసింది. ఇప్పుడు అయోధ్యకు దారి వేసింది’’ అన్నాను. ‘అయితే?!’ అన్నట్లు చూశారు తండ్రీకొడుకులు ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే. ‘‘బీజేపీ.. కశ్మీర్‌కు దారి వేసినప్పుడు, కర్తార్‌పూర్‌కు దారి వేసినప్పుడు, అయోధ్యకు దారి వేసినప్పుడు.. మహారాష్ట్రకు దారి వేయలేకపోతుందా! పార్టీలో నేనొక్కడినే మీకు పైకి కనిపించే దారుల మినిస్టర్‌ని’’ అన్నాను. -మాధవ్ శింగరాజు -
ఉద్ధవ్ ఠాక్రే (శివసేన)-రాయని డైరీ
అమిత్‌షా ఫోన్ ఎత్తడం లేదు! ఎందుకు ఫోన్ ఎత్తడం లేదో చెప్పడానికైనా ఒకసారి ఫోన్ ఎత్తమని అడగడానికి మళ్లీ ఫోన్ చేశాను. ఎత్తాడు!! ‘‘అమిత్జీ నేను ఉద్ధవ్ ఠాక్రే . ఫాదర్ ఆఫ్ ఆదిత్యా ఠాక్రే . వయసు ఇరవై తొమ్మిది. వర్లీ నుంచి భారీ మెజారిటీతో గెలిచాడు’’ అని చెప్పాను. ‘‘ఇదంతా నాకెందుకు చెబుతున్నారు ఉద్ధవ్! దీపావళి పనుల్లో ఉన్నాను. వేరే ఇంకే సమయంలోనైనా మీరు నాకు ఫోన్ చేయగలరా?’’ అన్నాడు విసుగ్గా! ఉలిక్కి పడ్డాను. పిల్లలెవరో బాంబు పేల్చినట్లున్నారు! ఫోన్‌ని అలా చెవికి ఆన్చుకునే వెళ్లి బాల్కనీలోంచి కిందికి చూశాను. ఆదిత్యను ముఖ్యమంత్రిని చెయ్యాలని ఆ ఈడు కుర్రాళ్లంతా ఇంటి ముందు ఔట్లు పేలుస్తున్నారు. సంతోషంగా అనిపించింది. ‘‘ఏమైంది ఉద్ధవ్! వేరే ఇంకే సమయంలోనైనా మీరు నాకు ఫోన్ చేయగలరా అని మిమ్మల్ని అడిగాను కదా! సమాధానం చెప్పరేమిటి?’’ అంటున్నాడు అమిత్‌షా. ‘‘అమిత్జీ.. ఆ బాంబుల చప్పుడేమిటని మీరు అడుగుతారని ఆశించాను. కానీ మీరు అడగలేదు. నిజానికి ఆ చప్పుళ్లు మీకు వినిపించడం కోసమే నేను మీకు సమాధానం చెప్పకుండా ఆగాను. ఆదిత్యను సీఎంను చేయాలని డిమాండ్ చేస్తూ కిందంతా ఔట్లు పేలుస్తున్నారు’’ అని చెప్పాను. ‘‘విన్నాను ఉద్ధవ్. మీ అబ్బాయిని సీఎంను చెయ్యాలన్న డిమాండ్‌తో పేలుస్తున్న ఔట్ల చప్పుడులా లేదది. మీ అబ్బాయి సీఎం అయ్యాక పేలుతున్న ఔట్ల చప్పుడులా ఉంది’’ అన్నాడు. మండిపోయింది నాకు! ‘‘ఏంటి ఉద్ధవ్.. మండిపడుతున్నారు!?’’ అన్నాడు!! ‘‘నేను మండిపడటం కాదు అమిత్జీ. ఇక్కడ టెన్ థౌంజండ్వాలా అంటించారు. పిల్లలు కదా. పెద్దా చిన్నా చూస్కోరు. మంట పెట్టేస్తారు. అవొచ్చి మనకు తగులుతాయ్’’ అన్నాను. ‘‘ముందా పిల్లాటలు మానేయమనండి ఆదిత్యని. రాజకీయాల్లోకి రావలసినవాడు’’ అన్నాడు! రాజకీయాల్లో ఉన్నవాడిని పట్టుకుని రాజకీయాల్లోకి రావలసినవాడు అంటున్నాడంటే.. ఆదిత్యను సీఎంని చెయ్యకూడదని అమిత్‌షా గట్టిగానే డిసైడ్ అయినట్లున్నాడు. ‘‘మావాడు ఇప్పుడు రాజకీయాల్లోకి రావడమేంటి అమిత్జీ! పదేళ్లుగా రాజకీయాల్లోనే కదా ఉన్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఎన్నికల ముందు మీరు మా ఇంటికి వచ్చి.. ‘మనం పవర్లోకి వస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ’ అన్లేదా?! ఎన్నికలయ్యాక ఇప్పుడు.. దీపావళి పనులున్నాయి అంటున్నారేమిటి!’’ అని అడిగాను. పెద్దగా నవ్వాడు అమిత్‌షా. ‘‘దీపావళి పనులంటే మీకు, మీ వాడికి ఔట్లు పేల్చడం. నాకు మాత్రం మహారాష్ట్రకు ఒక కొత్త సీఎంని వెదకి తేవడం’’ అన్నాడు! ‘‘అర్థం కాలేదు అమిత్జీ’’ అన్నాను. ‘‘ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే మీకు యాభై ఆరు సీట్లు, మాకు నూట ఐదు సీట్లు కాదు ఉద్ధవ్. మాకొచ్చిన సీట్లలో సగం మాత్రమే మీకు వచ్చినప్పుడు మనం సగం సగం అవుతామని మీరు ఎలా అనుకున్నారు?’’ అన్నాడు! నేనిక మొహమాట పడదలచుకోలేదు. ‘‘అమిత్జీ.. ఎన్ని సీట్లు వచ్చాయని కాదు, ఎన్ని సీట్లు తగ్గాయో చూడండి. మాకు తగ్గిన సీట్లు ఏడైతే, మీకు తగ్గిన సీట్లు పదిహేడు. మాకు తగ్గిన వాటి కన్నా రెట్టింపుగా మీకు తగ్గినప్పుడు మనం సగం సగం కాబోమని మీరెలా అనుకుంటారు?’’ అన్నాను. ‘‘దీపావళి పనుల్లో ఉన్నాను. మళ్లీ చెయ్యండి ఉద్ధవ్’’ అన్నాడు! ‘‘మీ దీపావళి పనుల్లో మీరు ఉండండి. మా దీపావళి పనుల్లో మేము ఉంటాము’’ అని చెప్పి ఫోన్ పెట్టేశాను. -
మణిరత్నం-రాయని డైరీ
బెడ్రూమ్ తలుపులు తీసి బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను. బాల్కనీలోంచి మళ్లీ బెడ్రూమ్లోకి వెళుతున్నప్పుడు తలుపుపై ఏదో కాగితం అంటించి ఉంది! ఆ కాగితం మీద ‘రాజద్రోహం’ అని రాసి ఉంది!! రోజూ నిద్ర లేవగానే బాల్కనీలోకి వచ్చి నిలబడి, వీధికి అవతలివైపు ఉన్న పచ్చని చెట్లను చూస్తూ గుండె నిండా గాలి పీల్చుకోవడం అలవాటు. అలా గుండెల్నిండా గాలి పీల్చుకుంటున్నప్పుడు నా వెన గ్గుండా ఎవరో వచ్చి తలుపుపై కాగితం అంటించి వెళ్లి ఉండాలి. లేదా నేను నిద్ర లేవకముందే వచ్చి అంటించి వెళితే, నేను తలుపును చూసుకోకుండా బాల్కనీలోకి వచ్చి గుండెల్నిండా గాలి పీల్చుకుని తిరిగి బెడ్రూమ్లోకి వస్తున్నప్పుడు ఆ కాగితాన్ని చూసి ఉండాలి. సుహాసిని కాఫీ కప్పు అందించి వెళ్లడానికి వచ్చింది. ఆమె ఎప్పుడూ అందించి వెళ్లిపోతుంది. లేదంటే వెళ్లిపోవడం కోసం అందించడానికి వచ్చినట్లుగా ఉంటుంది. ‘‘కూర్చో’’ అన్నాను. (చదవండి : మణిరత్నంపై రాజద్రోహం కేసు) వచ్చి కూర్చుంది. ‘‘మీరెప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. మోదీకి వ్యతిరేకంగా ఆ సంతకం పెట్టేటప్పుడు కూడా ఏదైనా ఆలోచిస్తూ ఉండాల్సింది. లేదా ఆలోచించి సంతకం పెట్టాల్సింది. ఇప్పుడు చూడండి. రాజద్రోహం కేసు పెట్టారు’’ అంది సుహాసిని. ‘‘నేనూ ఊహించలేదు సుహా. పరమత సహనంపై చక్కటి సినిమాలు తీశారు కదా. ఓ సంతకం పెట్టేయండి అని కేరళ నుంచి అదూర్ గోపాలకృష్ణన్ ఫోన్ చేసి చెబితే పెట్టేశాను. ఎప్పుడు పెట్టానో గుర్తులేదు. ఎక్కడ పెట్టానో గుర్తులేదు. అసలు పెట్టినట్లే గుర్తులేదు’’ అన్నాను. ‘‘పెద్ద పెద్ద సినిమాలు తీస్తేనే ఏం కాలేదు. చిన్న సంతకం పెడితే ఏమైందో చూడండి’’ అంది సుహాసిని పైకి లేస్తూ! ‘‘సుహా.. వెళ్లిపోతున్నావా? వెళ్లబోతున్నావా?’’ అన్నాను. ‘‘వెళ్లడం లేదు. వెళ్లబోవడం లేదు. నిలుచున్నానంతే. చెప్పండి’’ అంది. ‘‘పొన్నియిన్ సెల్వన్’ని ఆపేద్దామనుకుంటున్నాను సుహా’’ అన్నాను. సుహాసిని షాక్ తింది! ‘‘అయ్యో ఆపేస్తారా! రెండేళ్లుగా కష్టపడి ప్లాన్ చేస్తున్నారు. థాయ్‌లాండ్‌లో సెట్స్ కూడా వేశారు. వాళ్లెవరో ఇంత మైదా పిండితో రాజద్రోహం అని తలుపుపై కాగితం అంటించి వెళ్లారని మీరు మీ ప్రేక్షకులకు ద్రోహం చేస్తారా!’’ అంది సుహాసిని. ‘‘లేదు సుహా. పొన్నియన్ సెల్వన్‌ని ఆపేసి, గీతాంజలి 2 తీద్దామనుకుంటున్నాను. గుర్తుంది కదా.. గీతాంజలి ఎంత హిట్టయిందో. కళ్ల ముందే ముప్పై ఏళ్లు గడిచిపోయాయి. గీతాంజలిని మళ్లీ తెరపైకి తెస్తాను’’ అన్నాను. ‘‘తెరపైకి తెస్తారు సరే. గీతాంజలిని ఎక్కడ నుంచి తెస్తారు’’ అంది. నవ్వాను. ‘‘గీతాంజలి దొరికింది సుహా. కథను అల్లుకోవాలి అంతే’’ అన్నాను. ‘‘ఎక్కడా?!!’ అంది. పేపర్లో షెహ్లా రషీద్ ఫొటో చూపించాను. ‘‘సుహా.. ఈ అమ్మాయే నా గీతాంజలి 2. యాక్టివిస్టు. ఎలా ఉంది? డేర్ డెవిల్. ‘ప్రైమ్ మినిస్టర్‌ని గౌరవించాలని రాజ్యాంగంలో ఉందా? ఐపీసీలో ఉందా? పార్లమెంట్ చేసిన చట్టాల్లో ఉందా?’ అని అడుగుతోంది. మాకు సపోర్ట్‌గా అడుగుతోంది సుహా. లెటర్‌పై సంతకం పెట్టిన మా నలభై తొమ్మిది మందికి సపోర్ట్‌గా అడుగుతోంది. ఈ అమ్మాయే నా కొత్త గీతాంజలి’’ అన్నాను ఎగ్జయిటింగ్‌గా. తనూ ఎగ్జయిట్ అయింది. ‘‘అయితే ఈ సినిమాకు నలభై తొమ్మిది అనే పేరు బాగుంటుంది. కావాలంటే ట్యాగ్‌లైన్‌గా ‘గీతాంజలి 2’ అని పెట్టుకోవచ్చు’’ అంది! -
రాయని డైరీ.. డాక్టర్ కె. శివన్ (ఇస్రో చైర్మన్)
అంతా వెళ్లిపోయారు. ప్రధాని వెళ్లిపోయారు. మూడొందల మంది జర్నలిస్టులు వెళ్లిపోయారు. అరవై మంది స్కూలు పిల్లలు వెళ్లిపోయారు. నూటా ముప్ఫై కోట్ల మంది భారతీయులూ టీవీల ముందు నుంచి వెళ్లిపోయే ఉంటారు. ఇస్రో స్టాఫ్ కూడా వెళ్లలేక వెళ్లలేక వెళ్లిపోయారు. ఆపరేషన్స్ కాంప్లెక్స్‌లో ఒక్కడినే కూర్చొని ఉన్నాను. రైల్వే స్టేషన్లో ఒంటరి ప్రయాణికుడిలా ఏ నంబరూ లేని ప్లాట్‌ఫాం మీద నిలబడి ఉన్నట్లుగా అనిపించింది. ‘దయచేసి వినండి. చంద్రుడిపైకి మీరు పంపిన ఉపగ్రహం మరికొద్ది నిమిషములలో చంద్రునిపై దిగబోవుచున్నది’ అనే ఒక అనౌన్స్‌మెంట్‌ను నా మనసు పిచ్చిగా కల్పించుకుంటోంది. కట్ అయిన సిగ్నల్స్ మళ్లీ కనెక్ట్ కావనేముంది?! ట్రాకింగ్ రూమ్‌లో గోడలపై వరుసగా కంప్యూటర్ స్క్రీన్లు. అంతరిక్షంలో ఏం జరగలేదో ఆ జరగని దానిని మాత్రమే అవి చూపగలవు. ఏం జరిగితే బాగుండేదని నా అంతరంగంలో ఉందో, ఆ బాగుండే దానిని చూపిస్తే అవి కంప్యూటర్లు ఎందుకవుతాయి? ఓదార్చి, భుజం తట్టి, ‘నెక్స్›్ట టైమ్ బెటర్ లక్’ అని చెప్పే మనుషులు అవుతాయి. వెళ్లే ముందు భుజం తట్టి వెళ్లారు ప్రధానమంత్రి. ఇంతవరకు సాధించిన దానికి, ఇక ముందు సాధించబోయే దానికీ! వెళ్లే ముందు బొటనవేళ్లు ఎత్తి చూపి వెళ్లారు జర్నలిస్టులు.. ‘మిస్టర్ శివన్, మీ అంతరిక్షంలో జరిగేది, జరగనిదీ ఏదైనా మాకు బిగ్ ఈవెంటే..’ అని అంటూ! వెళ్లే ముందు స్కూల్ పిల్లలు ‘ఫీల్ అవకండి అంకుల్’ అన్నట్లు చూసి వెళ్లిపోయారు. రాత్రి కలలోకి చందమామ వస్తే కనుక క్లాస్ పీకాలన్న కృతనిశ్చయం ఆ పిల్లల కళ్లలో కనిపించింది! ‘ఇంత కష్టపడ్డాం కదా, నువ్వెందుకు అందలేదు చందమామా?’ అని గొడవపడతారేమో వీళ్లంతా. ‘అయినా అందనంత దూరంలో ఉండటం ఏంటి నువ్వు! ఎక్కడానికి ఎవరెస్టులా, ఈదడానికి హిందూ మహాసముద్రంలా అందుబాటులో ఉండొచ్చుగా అంటారేమో వీళ్లలోనే కాస్త పెద్దపిల్లలు. మరీ చిన్నవాళ్లయితే.. ‘మాకు అందొద్దులే చందమామా.. మా అమ్మ మా తమ్ముడిని ఎత్తుకుంటే వాడి చేతికి అందేలా నువ్వుంటే చాలు’ అని బంపర్ ఆఫర్ ఇస్తారేమో చంద్రుడికి. ఆలోచనలు తెగట్లేదు. ఎక్కడ తెగి ఉంటుంది కమ్యూనికేషన్! ఎటువైపు తిరిగి ఉంటుంది ల్యాండర్ డైరెక్షన్! చంద్రుడికి రెండు కిలో మీటర్ల దగ్గరి వరకూ వెళ్లి మిస్ అయిందని కాదు, కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని కాదు, ల్యాండ్ అయి ఉంటే ఇండియాకు గొప్పగా ఉంటుందని కాదు. స్కూలు పిల్లల కేరింతల కోసమైనా చంద్రయాన్ సక్సెస్ అయి ఉండవలసింది. ‘‘సర్’’ అని పిలుపు! తల తిప్పి చూశాను. టీమ్‌లోని కుర్ర సైంటిస్ట్. ‘‘నువ్వింకా వెళ్లలేదా?’’ అన్నాను. ‘‘రండి సర్ వెళ్దాం’’ అన్నాడు. ‘‘కూర్చో. బయటికెళ్తే చంద్రుడికి ముఖమెలా చూపిస్తాం’’ అన్నాను నవ్వుతూ. అతడూ నవ్వాడు. జర్నలిస్టు అవుదామని ఇంటి నుంచి బయల్దేరి, సైంటిస్టు అయి ఇస్రోకి వచ్చిన కుర్రాడు అతడు. ‘‘సర్, మనం సక్సెస్ అయి ఉంటే మీడియా ఏం రాసేదో చెప్పమంటారా?’’ అన్నాడు నవ్వుతూ. చెప్పమన్నట్లు చూశాను. ‘‘చంద్రుడి దక్షిణ ధ్రువంపై భారత్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఇక బీజేపీ ప్రభుత్వం దక్షిణాదిన ల్యాండ్ అవడమే మిగిలింది అని రాసేవి సర్’’ అని నవ్వాడు. అది నన్ను నా మూడ్‌లోంచి బయటికి లాగే ప్రయత్నమని అర్థమైంది. వాత్సల్యంగా అతడి భుజం తట్టాను. -
రాయని డైరీ.. నీరవ్ మోదీ (ఆర్థిక నేరస్తుడు)
‘‘ఎక్కడున్నావ్?’’ అన్నాడు విజయ్‌మాల్యా ఫోన్ చేసి, ముందూ వెనుకా ఏమీ లేకుండా. ‘‘ఎవర్నువ్వు?’’ అన్నాను. ‘‘ఆ.. ఎవర్నా! నిర్మలా సీతారామన్‌ని. విజయ్‌మాల్యా గొంతుతో మాట్లాడుతున్నా ఇండియా నుంచి’’ అన్నాడు! ‘‘మాల్యా.. మందులో ఉన్నట్లున్నావ్. తాగినవాడు మాట్లాడుతూ కూర్చుంటే తాగనివాడు వింటూ కూర్చోవడం బ్యాంకులకు ఎగ్గొట్టిన అప్పుల్ని తీర్చడం కన్నా కష్టమైన విషయం. నాకు వినే మూడ్, మాట్లాడే మూడ్.. రెండూ లేవు. ఫోన్ పెట్టేయ్’’ అన్నాను. ‘‘ఎక్కడున్నావ్?’’ అన్నాడు మళ్లీ, ఫోన్ పెట్టేయకుండా. వినేలా లేడు. ఇండియాలో ఉన్నప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీలు, సీఈవోలు ఇలాగే సమయం సందర్భం లేకుండా ఫోన్లు చేసేవాళ్లు.. ‘ఎప్పుడు కడతావ్?’ అని. ‘భోజనం చేస్తున్నా’ అనేవాడిని. అయినా వినకుండా ‘ఎప్పుడు కడతావ్?’ అనేవాళ్లు. ‘బాత్రూమ్లో ఉన్నా’ అనేవాడిని. అయినా వినకుండా ‘ఎప్పుడు కడతావ్?’ అనేవాళ్లు. ‘ఏంటి కట్టడం?’ అన్నాను ఓ రోజు. ‘భోజనం చేస్తున్నారా?’ అని అడిగారు! ‘ఏంటి కట్టడం?’ అన్నాను మళ్లీ ఇంకో రోజు. ‘బాత్రూమ్లో ఉన్నారా?’ అని అడిగారు! కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చి, కొత్త వ్యక్తి ఫోన్ చేశాడు. ‘‘మిస్టర్ నీరవ్ మోదీ.. మీరు భోజనం చేస్తూ గానీ, బాత్రూమ్లో స్నానమాచరిస్తూ గానీ లేకపోతే నేను చెప్పబోయేది వినడం కోసం రెండు నిముషాలు వెచ్చించగలరా? మీరిక్కడ అర్థం చేసుకోవలసింది ఏమిటంటే.. నేను మిమ్మల్ని ఏమీ అడగబోవడం లేదు. చెప్పబోవాలని మాత్రమే ప్రయత్నిస్తున్నాను. నేనిప్పుడు మీకెంతో ప్రియమైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌గా మీకు పరిచయం అవుతున్నాను. నన్ను కొనసాగించమంటారా?’’ అని అభ్యర్థించాడు! బ్యాంకుల సంస్కరణ అంతగా ఎప్పుడు జరిగిందో నేను గుర్తించనే లేదు! ‘కొనసాగించండి’ అన్నాను. అతడు మొదలుపెట్టాడు. ‘మిస్టర్ నీరవ్ మోదీ.. బ్యాంకులో మీరు డబ్బు వేసుకుంటే మీకు వడ్డీ వస్తుంది కదా. అలాగే బ్యాంకు మీ దగ్గర డబ్బు వేసుకుంటే బ్యాంకుకూ వడ్డీ రావాలి కదా. గాట్ మై పాయింట్..’ అన్నాడు. ‘గాట్ యువర్ పాయింట్ .. ‘ఎప్పుడు కడతావ్’ అనే కదా మీరు అడుగుతున్నారు’ అన్నాను. ‘వాట్ ఐ మీన్..’ అంటూ ఏదో చెప్పబోయాడు. ఫోన్ పెట్టేశాను. తర్వాత లండన్ వచ్చేశాను. ‘‘మాట్లాడవేంటి.. ఎక్కడున్నావ్..’’ అన్నాడు మాల్యా మళ్లీ. ‘‘నీలాగా బెయిల్ మీద ఉంటే ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లోనో, బ్రిక్ లేన్లోనో, ఆబే రోడ్లోనో ఉన్నానని చెప్పేవాడిని’’ అన్నాను. ఆ మాటకు బాగా హర్ట్ అయినట్లున్నాడు మాల్యా. ‘‘మందులో ఉన్నవాడికీ కొన్ని ఎథిక్స్ ఉంటాయి నీరవ్. జైల్లో ఉన్నవాడిని బెయిల్లో ఉన్నవాడు ‘ఎక్కడున్నావ్ ?’ అని అడక్కూడదని నాకూ తెలుసు. నా ఉద్దేశం ఏమిటంటే నిన్ను ఏవిధంగానూ సంతోషపెట్టని వాళ్ల మధ్య నువ్వీ క్షణంలో లేవు కదా అని..’’ అన్నాడు. ‘‘లేను చెప్పు’’ అన్నాను. ‘‘నీ బ్యాంకులో నీవి ఏడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి కదా’’ అన్నాడు. ‘‘నావేమిటి? నేను కట్టాల్సినవి’’ అన్నాను. మాల్యా నవ్వాడు. ‘‘ఇకనుంచీ నువ్వు ‘డబ్బు కట్టలేకపోయానే’ అనే చింతతో అనుక్షణం కుమిలిపోనక్కర్లేదు అని చెప్పడానికే ఫోన్ చేశాను నీరవ్. లాభాల కోసమట.. ఇండియాలో బ్యాంకుల్ని కలిపేస్తున్నారు. నీకు సంతోషం కలిగించే విషయం చెప్పనా.. నీ బ్యాంకులో కూడా రెండు పెద్ద బ్యాంకులు కలుస్తున్నాయి’’ అన్నాడు! -
రాయని డైరీ : ఇమ్రాన్ ఖాన్ (పాక్ ప్రధాని)
తలనొప్పిగా ఉంది! అరవై ఆరేళ్ల వయసులో తలనొప్పి రావడం సహజమా అసహజమా కనుక్కొని రమ్మని డాక్టర్ దగ్గరికి మనిషిని పంపాను. ఆ మనిషి ఇంతవరకు రాలేదు. ‘‘ఎవరి కోసం చూస్తున్నారు ఇమ్రాన్‌జీ’’ అంటూ వచ్చారు షా మెహమూద్ ఖురేషీ. ‘‘మీరు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ కదా షాజీ.. ఇంటర్నల్ ఇష్యూస్ చెప్పుకోవడం బాగుంటుందా మరి?’’ అన్నాను. ‘‘నేను చూసేది ఫారిన్ అఫైర్సే అయినా, అవన్నీ ఇంటర్నల్ అఫైర్స్ కోసమే ఇమ్రాన్‌జీ.. పర్వాలేదు చెప్పండి’’ అన్నారు. ‘‘అరవై ఆరేళ్ల వయసులో తలనొప్పి రావడం సహజమా అసహజమా కనుక్కొని రమ్మని డాక్టర్ దగ్గరికి మనిషిని పంపాను షాజీ. ఇంతవరకు ఆ మనిషి రాలేదు. రాని మనిషి గురించి ఆలోచిస్తూ, వచ్చిన తలనొప్పిని మర్చిపోగలుగుతున్నాను కానీ.. మనిషి రాలేదేమిటన్న ఆలోచనతో తిరిగి నా తలనొప్పి నాకు గుర్తుకువచ్చేస్తోంది’’ అన్నాను. నాకంటే మూడేళ్లు చిన్నవాడు ఖురేషీ. కానీ నాకన్నా పదేళ్లు చిన్నవాడిలా ఉంటాడు. అది కాదు ఆశ్చర్యం, ఫారిన్ మంత్రిగా అతడు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా ఉన్నాడో, పన్నెండు నెలల తర్వాత ఇప్పుడూ అలానే ఉన్నాడు! ఆరోజే అడిగాను.. ‘షాజీ.. మీరింత ఫిట్‌గా ఎలా ఉండగలుగుతున్నారు?’ అని. పెద్దగా నవ్వాడు. ‘ఇమ్రాన్‌జీ, ఒకటి చెప్పమంటారా.. క్రికెట్ ఆడేవాళ్ల కన్నా క్రికెట్ చూసేవాళ్లే ఎప్పుడూ ఫిట్‌గా ఉంటారు. ఇప్పటికీ నేను ఇండియా మీద మీరు ఆడిన పాత మ్యాచ్‌లన్నిటినీ రీప్లే చేసుకుని మరీ చూస్తుంటాను’ అన్నాడు! మనసుని రంజింపజేయడంలో ఖురేషీ గొప్ప ఆటగాడు. ‘‘తలనొప్పి కశ్మీర్ వంటిది ఇమ్రాన్‌జీ. ఉందని గుర్తు చేసుకుంటే వస్తుంది. లేదని గుర్తు పెట్టుకుంటే గాయబ్ అవుతుంది’’ అన్నారు ఖురేషీ. ‘‘ఈ గుర్తుపెట్టుకోవడమే పెద్ద తలనొప్పిగా ఉంది షాజీ. అయినా లేని దానిని ఉందని గుర్తుపెట్టుకోగలం కానీ, ఉన్నదానిని లేదని ఎలా గుర్తుపెట్టుకోగలం చెప్పండి?’’ అన్నాను. ‘‘తలనొప్పి కశ్మీర్ వంటిది అంటే, కశ్మీర్ తలనొప్పి వంటిదని కాదు ఇమ్రాన్‌జీ. ఉన్నదానిని లేదని గుర్తుపెట్టుకునే అవసరం లేకున్నా, లేనిదానిని ఉందని గుర్తుపెట్టుకోవడం మర్చిపోలేదన్న సంగతిని గుర్తు చేస్తుండడం అవసరం. కశ్మీర్‌ను మన తల అనుకున్నప్పుడు ఆమాత్రం తలనొప్పి సహజమే. నా ఉద్దేశం మీ తలనొప్పి మీ అరవై ఆరేళ్ల వయసు వల్ల వస్తున్నది కాదు. డెబ్బయ్ రెండేళ్ల కశ్మీర్ వల్ల వస్తున్నది’’ అన్నారు ఖురేషీ! ‘హాహ్హాహా’ అని పెద్దగా నవ్వాను. ‘‘అంటే నేను వయసుకు మించిన భారాన్ని మోస్తున్నాననే కదా షాజీ’’ అన్నాను. ‘‘మీరు గుండెల నిండా నవ్వడం చాలా రోజుల తర్వాత చూస్తున్నాను ఇమ్రాన్‌జీ! మీకు గుర్తుందా.. ఏడాది క్రితం సరిగ్గా ఇదే నెలలో మీరు ప్రధాని అయ్యారు. ఆరోజు చూడ్డమే చిన్న చిరునవ్వునైనా మీలో! మళ్లీ లేదు’’ అన్నారు ఖురేషీ. ‘‘ధన్యవాదాలు షాజీ’’ అన్నాను. ఎప్పుడూ కశ్మీర్ గురించే కాకుండా, పాక్ ప్రధాని సంతోషం గురించి కూడా కాస్త ఆలోచించే ఒక పౌరుడిని నా దేశంలో నేను మొదటిసారిగా చూస్తున్నాను! డాక్టర్ దగ్గరికి వెళ్లిన మనిషి ఇంకా రాలేదు! ఖురేషీతో మాట్లాడుతుంటే తలనొప్పి తగ్గినట్లే ఉంది కానీ, ఖురేషీ వెళ్లిపోయాక మళ్లీ తలనొప్పి వస్తే?! ‘‘మీరే డాక్టర్ దగ్గరికి వెళ్లవలసింది ఇమ్రాన్‌జీ. లేదా, డాక్టర్నే మీ దగ్గరికి రప్పించుకోవలసింది. మీరు పంపిన మనిషికి మీ తలనొప్పి సంగతి గుర్తుంటుందని ఎలా చెప్పగలం? అతడికేం తలనొప్పులున్నాయో..’’ అన్నారు ఖురేషీ. కశ్మీర్ విషయం ఐక్యరాజ్య సమితితో మాట్లాడమని నేను చైనాను పంపడం గురించి కాదు కదా ఖురేషీ మాట్లాడుతున్నది!! -
రాయని డైరీ.. ఎం.ఎస్.కె. ప్రసాద్ (సెలక్టర్)
లండన్ నుంచి ఇండియా బయల్దేరాం. ఫ్లయిట్ ఎక్కేముందు ఇండియా నుంచి వినోద్ రాయ్ ఫోన్ చేశారు. వెంటనే లిఫ్ట్ చేసి, ‘‘గుడ్ మాణింగ్ సర్’’ అన్నాను. రాయ్ పెద్దగా నవ్వారు. ‘‘క్యాచ్ పట్టినట్టుగా పట్టావ్ కదయ్యా’’ అన్నారు. ‘‘ఏంట్సార్ పట్టేది!! అన్నాను. ‘‘అదేనయ్యా.. దినేష్ కార్తీక్ కొట్టిన బంతిని నీషమ్ అద్భుతంగా క్యాచ్ పట్టేశాడు కదా. అలా నువ్వు నా కాల్ని పట్టేశావు. నేను కదా ముందుగా నీకు గుడ్ మాణింగ్ చెప్పాల్సింది. నేను నీకు ఫోన్ చేశాను. నువ్వు నాకు ఫోన్ చెయ్యలేదు.. హాహాహా..’’ అన్నారు! ముందు పంపాల్సిన ప్లేయర్‌ని ముందు పంపి, వెనుక పంపాల్సిన ప్లేయర్‌ని వెనుక పంపి వుంటే ఇప్పుడు మేమంతా ఇండియా ఫ్లయిట్ ఎక్కేందుకు ముందూవెనుకా ఆలోచించే పని ఉండేది కాదని రాయ్ నాకు చెప్పదలచుకున్నారని అర్థమైంది. ఆయన నాకు చెప్పదలచుకున్నారని నేను అర్థం చేసుకున్న ఇంకో విషయం.. సెమీస్‌లో మ్యాచ్ పోయాక ఈ రెండు మూడు రోజుల్లో ఒక్కసారి కూడా నేను ఆయనకు ఫోన్ చెయ్యలేదని నాకు గుర్తు చేయడం. ‘‘సారీ సర్. చెయ్యాల్సింది’’ అన్నాను. ‘‘చెయ్యలేకపోయావ్ సరే, ‘చెయ్యలేకపోయాను’ అనైనా చెయ్యాల్సింది’’ అన్నారు! ఆయన ఇగో బాగా హర్ట్ అయినట్లుంది. ఇండియా హర్ట్ అయినా పర్వాలేదు. ఇగోలు హర్ట్ కాకూడదు. వినోద్ రాయ్ ఇగోను అసలే హర్ట్ కానీయకూడదు. క్రికెట్ బాగోగుల కమిటీ చైర్మన్ ఆయన. ‘‘చేద్దామనుకున్నాను సర్. ఓడిపోయాక చేసి చెప్పేది, చెప్పి చేసేదీ ఏముంటుందని చెయ్యలేదు’’ అన్నాను. ‘‘గెలిస్తే ‘కంగ్రాట్స్’ అని నేనే ముందుగా ఫోన్ చెయ్యడం కామన్. ఓడిపోతే ‘సారీ’ అని నీకై నువ్వే ముందుగా ఫోన్ చెయ్యకపోవడం అన్‌కామన్. పిటీ ఏంటంటే.. ఓడిపోయినా నేనే నీకు ఫోన్ చేసి నీ చేత సారీ చెప్పించుకోవడం’’ అని మళ్లీ ‘ హాహాహా..’ అన్నారు. ఇండియా న్యూజిలాండ్‌పై ఓడిపోడానికి కారణం నేనేనని ఆయన అనుకుంటున్నట్లు న్నారు! అలాగైతే ఇండియా దక్షిణాఫ్రికా మీద, ఆస్ట్రేలియా మీద, పాకిస్తాన్ మీద, ఆప్గానిస్తాన్ మీద, వెస్టిండీస్ మీద, బంగ్లాదేశ్ మీద గెలవడానికి కూడా నేనే కారణం అని ఆయన అనుకోవాలి. కెప్టెన్ ఉండగా, కోచ్ ఉండగా, మ్యాచ్ మట్టిపాలవడానికి కారణం సెలక్టర్స్ కమిటీ ఛైర్మన్ మాత్రమే అయితే.. అంతమందీ ఉండగా గెలిచిన మ్యాచ్లన్నిటిలోనూ గెలుపుకు సెలక్టర్స్ కమిటీ ఛైర్మనే కారణం అవ్వాలి కదా! ‘‘గెలుపు ఓటములకు కారణం నేనేనని మీరు అనుకుంటున్నట్లయితే కనుక నేను నా తప్పుల్ని సరిదిద్దుకుంటాను సర్’’ అన్నాను. ‘‘ఓటమికి మాత్రమే కారణాలు ఉంటాయి మిస్టర్ ఎమెస్కే. గెలుపుకు కారణమేంటని ఎవరూ చూడరు. తప్పుల్ని దిద్దుకుంటానని అంటున్నావ్. దిద్దుకోలేని తప్పేదైనా చేసి ఉంటే మాత్రం నిన్ను ఇంకొకరు దిద్దవలసి వస్తుంది. నిన్ను నువ్వు దిద్దుకోడానికి ఉండదు’’ అన్నారు! అంబటి రాయుడిని టీమ్‌లోకి తీసుకోనందుకు ఈయన ఇలా అనడం లేదు కదా అని ఒక్కక్షణం అనిపించింది. ‘‘మీరంతా ఇండియా రాగానే చిన్న మీటింగ్ ఉంటుంది ఎమెస్కే. కెప్టెన్ కోహ్లీకి, కోచ్ రవిశాస్త్రికి కలిపి ఒక మీటింగ్. నీకొక్కడికే సపరేట్గా ఒక మీటింగ్. ఆ సంగతి చెప్పడానికే ఫోన్ చేశాను’’ అన్నారు వినోద్ రాయ్! నాకొక్కడికే సపరేట్గా ఒక మీటింగా! నాకేదో అర్థమవుతోంది. ‘‘సర్.. మా నేటివ్ ప్లేస్ గుంటూరుకు వెళ్లి కొన్ని యుగాలు అవుతోంది. ముంబైలో ఫ్లయిట్ దిగ్గానే ఒకసారి గుంటూరు వెళ్లొస్తాను సర్’’ అన్నాను. ‘‘గుంటూరా! అంబటి రాయుడిది కూడా గుంటూరే కదా’’ అన్నారు సడన్‌గా ఆయన. -
రాయని డైరీ.. మమతాబెనర్జీ (సీఎం)
ఏ పార్టీ అయినా తను అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని మాత్రమే పరిపాలిస్తుంది. బీజేపీ అలాక్కాదు. తను అధికారంలో లేని రాష్ట్రాలను కూడా పాలిస్తుంటుంది. ఆ రాష్ట్రాలకూ ఒక చీఫ్ మినిస్టర్ ఉంటారని మొహమాటానికి కూడా అనుకోదు. కోల్‌కతాలో వారం రోజులుగా డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. రేపట్నుంచి దేశంలోని మిగతా రాష్ట్రాల డాక్టర్లు కూడా వీళ్లకు సపోర్ట్‌గా మెడలో స్టెతస్కోప్ వేసుకుని వీధుల్లోకి రాబోతున్నారని చంద్రిమా భట్టాచార్య వచ్చి చెప్పారు. ‘‘మెడలో స్టెత్ ఉన్నవాళ్లు ఆసుపత్రుల్లో ఉండాలి కానీ, ఆసుపత్రుల బయట వాళ్లకేం పని చంద్రిమా! సమ్మెను సపోర్ట్ చెయ్యడానికి వస్తున్న బీజేపీ లీడర్ల కోసం ఆరుబయట వైద్య శిబిరాలను గానీ ఏర్పాటు చేస్తున్నారా? బీపీ మిషన్లను కూడా తీసుకెళ్లమని చెప్పవలసింది’’ అన్నాను. ‘‘వినేలా లేరు దీదీ. అప్పటికీ నేను అడిగాను. ‘చనిపోయిన రోగి బంధువులెవరో డాక్టర్ల మీద దాడి చేశారని ఆ కోపంతో వైద్యం కోసం వస్తున్న రోగుల్ని చంపేస్తామా?’ అని. ‘అలా చేస్తే ఇక రోగి బంధువుల కోపానికీ, రోగికి బంధువులుగా ఉండాల్సిన డాక్టర్ల కోపానికీ తేడా ఏముంటుంది?’ అని అన్నాను’’ అన్నారు చంద్రిమ. ‘‘ఏమంటారు ఆ మాటకు?’’ అన్నాను. ‘‘వాళ్లకు గానీ, నాకు గానీ ఏమాత్రం సంబంధంలేని ఒక మాట అన్నారు దీదీ. అది వాళ్లు అనవలసిన మాట గానీ, అది నేను నా మనసులోనైనా అనుకోవలసిన మాట గానీ కాదు’’ అన్నారు చంద్రిమ! ‘‘చెప్పండి, పర్వాలేదు’’ అన్నాను. ‘‘ఆరోగ్యశాఖకు సహాయ మంత్రిగా కాదు, సంపూర్ణ మంత్రిగా ఉన్నప్పుడు వచ్చి చెప్పండి. అంతవరకు మీరు మాకేం చెప్పినా, అది మీకు మమతా బెనర్జీ చెప్పి పంపినట్లుగానే మేము భావిస్తాం’ అన్నారు దీదీ’’ అన్నారు చంద్రిమ. బీజేపీ పాలన చంద్రిమ వరకు వచ్చిందని నాకు అర్థమైంది. ముఖ్యమంత్రికి ఆల్రెడీ ముఖ్యమంత్రి పోస్ట్ ఉన్నప్పుడు హెల్త్ మినిస్టర్ పోస్టు కూడా ఎందుకన్న ఆలోచన చంద్రిమలో కలిగిస్తున్నారంటే బీజేపీవాళ్లు కోల్‌కతా వరకు వచ్చేసినట్లే. హౌరా స్టేషన్లో దిగితే అక్కడి నుంచి సెక్రటేరియట్‌కి మూడే నిమిషాలు! ఇప్పటికే నా మేనల్లుడు వెళ్లి డాక్టర్ల మధ్య కూర్చొని ప్లకార్ట్ పట్టుకున్నాడు. ‘యు సే వియ్ ఆర్ గాడ్స్. వై ట్రీట్ అజ్ లైక్ డాగ్స్’ అని అడుగుతున్నాడు! మోదీకి ఐడియా వచ్చినట్లు లేదు. లేకుంటే ఇవే మాటల్ని నా మేనల్లుడి చేత నాన్ బెంగాలీ భాషలో అడిగించేవారు. మతమార్పిడిలా బెంగాలీలను నాన్ బెంగాలీలుగా మార్చే టీమ్ ఒకటి ఢిల్లీ నుంచి వచ్చి పశ్చిమ బెంగాల్లో తిరుగుతోంది. సమ్మె చేస్తున్నవాళ్లలో బెంగాలీలు ఎంత మంది ఉన్నారని చంద్రిమను అడిగాను. ‘ఒకరిద్దరు ఉన్నట్లున్నారు దీదీ’ అన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి అడిషనల్ చీఫ్ సెక్రటరీని అడిగాను. ‘ఒకరా ఇద్దరా అన్నది లెక్క తేలడం లేదు మేడమ్’ అన్నారు. పోలీస్ కమిషనర్‌కి ఫోన్ చేశాను. ‘ఒకరా ఇద్దరా అన్నది లెక్క తేలుస్తున్నాం మేడమ్’ అన్నారు. ‘‘తేల్చేయండి త్వరగా’’ అన్నాను. వెంటనే కేసరినాథ్ త్రిపాఠి నుంచి ఫోను! ‘‘నా రాష్ట్రంలో ఏం జరుగుతోందో ఒక గవర్నరుగా నేను తెలుసుకోవచ్చా మమతాజీ’’ అంటున్నారు! ఆ వెంటనే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి! ‘‘మమతాజీ నేను హర్షవర్థన్. డాక్టర్ల సమ్మెను మేము జోక్యం చేసుకుని ఆపించే అవసరాన్ని మీరు మాకు కలగనివ్వరనే ఆశిస్తున్నాను’’ అన్నారు! ఫోన్ పెట్టేయగానే, హైకోర్టు నుంచి ఆదేశం.. డాక్టర్లకు నచ్చజెప్పి, తిరిగి విధుల్లోకి పంపమని! బీజేపీని ఇలాగే వదిలేస్తే బెంగాల్లో ఒక్క బెంగాలీ మిగలరు. మిగిలినా ఆ ఒక్క బెంగాలీ కూడా బెంగాలీ భాష మాట్లాడరు. -మాధవ్ శింగరాజు -
నితీశ్ కుమార్ (బిహార్ సీఎం)
ఢిల్లీ నుంచి శుక్రవారమే పట్నా వచ్చేశాను. ఇంకో రోజు ఢిల్లీలోనే ఉండి ఉన్నా అక్కడ నేను మాట్లాడవలసిన వాళ్లెవరూ లేరు. వాళ్లూ అంతే. ఎక్కడ నాతో మాట్లాడవలసి వస్తుందోనని నేను అక్కడ ఉండగానే ఎవరి శాఖల్లో వాళ్లు బిజీ అయిపోడానికి తొందరపడుతున్నారు. ‘‘వెళ్లొస్తాను’’ అన్నాను.. ప్రమాణ స్వీకారాలు, పోర్ట్‌ఫోలియోలు అవగానే. ‘‘ఏమీ తీసుకోకుండానే వెళ్తున్నారు’’ అన్నారు అమిత్ షా, ఆయన పక్కన ఉన్నాయన.. బాగా బాధపడిపోతూ! ‘‘ఒకటే ఇస్తామని మీరు అన్నందుకు నేను బాధపడాలి కానీ, ఇస్తానన్న ఆ ఒక్కటì కూడా వద్దన్నందుకు మీరెందుకు బాధపడాలి అమిత్జీ?’’ అని అడిగాను. ‘‘ఇస్తుంటే వద్దని వెళ్లిపోవడం బాధ కలిగించే సంగతే కదా నితీశ్‌జీ. అయినా బిహార్‌కి ఐదు ఇచ్చాం కదా’’ అన్నారు షా! ‘‘బిహార్‌కి ఐదు ఇచ్చారు కానీ, జేడీయూకి ఐదు ఇచ్చారా అమిత్జీ. ఐదు కూడా వద్దు. మూడే కదా మేము అడిగింది. ఒక కేబినెట్, ఒక ఇండిపెండెంట్, ఒక సహాయ మంత్రి’’ అన్నాను. ‘‘ముందైతే ఒకటి తీసుకోండి నితీశ్‌జీ’’ అన్నారు. వద్దంటే వద్దన్నాను. వచ్చింది కదా అని తీసేసుకుంటే, తీసుకున్నాక ఇక వచ్చేదేమీ ఉండదు. ఎవరికైనా ఇచ్చిందే గుర్తుంటుంది. ‘ఇస్తానన్నారు కదా’ అని గుర్తు చేస్తే ‘ఇచ్చేశాం కదా గుర్తులేదా’ అని మనకే గుర్తు చేస్తారు! ‘‘అమిత్జీ.. ఏ సభలోనూ సభ్యులు కాని పాశ్వాన్‌ని, జైశంకర్‌ని కూడా కేబినెట్లోకి తీసుకున్నారు. మాకివ్వడానికి మాత్రం మీకు చేతులు రావడం లేదు. ఎంత బాధగా ఉంటుందో తెలుసా?!’’ అన్నాను. ‘‘మీ బాధకు అర్థం లేదు నితీశ్‌జీ’’ అన్నాడు హఠాత్తుగా.. అమిత్ షా పక్కన ఉన్నాయన! ఆయన్ని ఎక్కడో చూసినట్లుంది కానీ ఎక్కడ చూసిందీ గుర్తుకు రావడం లేదు. ‘‘మీరెవరో గుర్తు చేసుకోడానికి మీ ముందే నేను ప్రయత్నిస్తూ కనిపించడం మీకు ఇబ్బందిగా ఏమీ అనిపించదు కదా’’ అన్నాను ఆయనతో. ఆ మాట ఆయన్నేమీ కదలించలేదు. అమిత్ షా మాత్రం బాగా కదిలిపోయారు. ‘‘నా పక్కన ఉన్న మనిషిని గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పడం ద్వారా మీరేమి సంకేత పరచదలచుకున్నారో రెండు విధాలుగా నేను అర్థం చేసుకోగలను నితీశ్‌జీ. అమిత్‌షా పక్కన కూర్చొని ఉన్నా కూడా, మీరు ఆ మనిషికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ఏమాత్రం ఇష్టపడటం లేదనేదొకటి. బిహార్‌లోని మొత్తం నలభై సీట్లలో బీజేపీకి పదిహేడు సీట్లు సంపాదించి పెట్టిన వ్యక్తిని ఒక ప్రముఖుడిగా గుర్తించడానికి మీరు సిద్ధంగా లేరనేది మరొకటి. వినండి నితీశ్‌జీ.. ఈయన పేరు భూపేందర్ యాదవ్. బిహార్ బీజేపీ ఇన్చార్జి’’ అన్నారు అమిత్‌షా. ‘ఓ! మీరేనా!’ అన్నట్లు భూపేందర్ వైపు చూశాను. ‘అవును.. నేనే’ అన్నట్లు చూశాడు భూపేందర్. ‘‘కానీ అమిత్ జీ.. బిహార్‌లో పదిహేడు సీట్లు గెలవడానికి కారణమైన భూపేందర్ని గుర్తించలేదని మీరు కదలిపోయారు. పదహారు సీట్లు గెలిచిన జేడీయూని గుర్తించకుండా ఒకే మంత్రి పదవి ఇస్తామన్నందుకు నేనెంత కదలిపోవాలి’’ అన్నాను. అమిత్ షా, భూపేందర్ అక్కడి నుంచి కదిలి వెళ్లిపోయారు! పట్నా వచ్చి ఇరవై నాలుగు గంటలు దాటింది. ఢిల్లీ నుంచి ఎవరూ ఫోన్ చెయ్యలేదు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర టైముంది. ఆలోపైనా చెయ్యాలి. చెయ్యలేదంటే.. బిహార్‌లో ఈసారి తనెవరికీ, తనకెవరూ సపోర్ట్ చేసే అవసరం ఉండదన్న గట్టి నమ్మకంతో బీజేపీ ఉందని. - మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. నరేంద్ర మోదీ (ప్రధాని)
కేదార్‌నాథ్‌కి బయలుదేరి వెళ్లే ముందు రెండు చేతులూ జోడించి గాంధీజీకి నమస్కరిస్తుండగా అమిత్‌షా లోపలికి వచ్చారు. ‘‘కూర్చోండి అమిత్జీ’’ అన్నాను.. వెనక్కు తలతిప్పకుండానే. దిగ్భ్రాంతిపూర్వకమైన ఒక మహోద్వేగంతో.. ఉన్నచోట ఉన్నట్లే శిలలా నిలబడిపోయారు అమిత్‌షా! మహాత్మునికి నమస్కరించాక మహాత్ముని పక్కనే ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి, బీఆర్ అంబేడ్కర్‌కి, సుభాష్ చంద్రబోస్‌కి నమస్కరించి అమిత్ షా దగ్గరికి వచ్చాను. ‘‘నిలబడే ఉన్నారు?!’’ అన్నాను. ‘‘వందన సమర్పణ జరుగుతున్నప్పుడు నిలబడే కదా ఉండాలి మోదీజీ’’ అన్నారు! పద్ధతుల్లో అమిత్‌ని మించినవారు బీజేపీలోనే లేరు. వాజ్‌పేయిని పద్ధతులకు పితామహుడని అంటుంటారు కానీ, నాకెందుకో పద్ధతుల్లో ఫస్ట్ ప్లేస్ అమిత్‌షా దే అనిపిస్తుంది. ‘‘కూర్చోండి అమిత్జీ. మీ ప్రయాణం కూడా ఇవాళే కదా సోమ్‌నాథ్‌కి’’ అన్నాను. అవునన్నట్లు తల ఊపి, ‘‘వాళ్లొచ్చారు. బయట కూర్చొని ఉన్నారు. మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు’’ అన్నారు. ‘‘నాకెందుకట సారీ! గాంధీజీకి చెప్పమనండి’’ అన్నాను. ‘‘అన్నాను మోదీజీ. మీకు చెబితే గాంధీజీకి చెప్పినట్లేనని వాళ్లు భావిస్తున్నారు. సాధ్వి ప్రజ్ఞ కళ్లు ఏడ్చి ఏడ్చి ఉబ్బి ఉన్నాయి. గాడ్సేని దేశభక్తుడు అని తను కీర్తిస్తున్నప్పుడు.. గాంధీజీని ఎంతగానో ప్రేమించే మిమ్మల్ని ఆ మాట గాయపరుస్తుందని తను ఊహించనే లేదట’’ అన్నాడు. లేచి నిలుచుని గాంధీజీ వైపు తిరిగి మళ్లొకసారి నమస్కరించి కూర్చున్నాను. ‘‘అనంత్ కుమార్ హెగ్డే, నళిన్ కుమార్ కతీల్ కూడా బాగా ఫీల్ అవుతున్నారు’’ అన్నారు అమిత్‌షా. ‘‘ఎందుకట? షోకాజ్ నోటీస్‌లు ఇచ్చినందుకా?’’ అన్నాను. ‘‘అందుక్కాదు మోదీజీ. గాడ్సే తరఫున మాట్లాడి, గాంధీజీని ఎంతగానో ఆరాధించే మీ మనసును నొప్పించామే అని చింతిస్తున్నారు. ‘డెబ్బై ఏళ్ల తర్వాతనైనా తన దేశభక్తిపై డిబేట్ జరుగుతున్నందుకు గాడ్సే ఆత్మ సంతృప్తి చెందుతుంది’ అని అంటున్నప్పుడు ఆ మాటకు మీ ఆత్మ క్షోభిస్తుందని అనంత్ కుమార్ కూడా అస్సలు ఊహించలేదట’’ అన్నారు అమిత్‌షా. ‘అవునా!’ అన్నట్లు చూశాను. ‘‘అవును మోదీజీ. కతీల్ కూడా వాడిపోయిన ముఖంతో ఉన్నాడు. మీరెంతగానో పూజించే బాపూజీని చంపిన ఒక వ్యక్తి గురించి అతడసలు మాట్లాడకూడదనే అనుకున్నాడట కానీ.. డెబ్బై రెండు మందిని చంపిన కసబ్ కంటే, పదిహేడు వేల మందిని చంపిన రాజీవ్‌గాంధీ కంటే, ఒకరిని మాత్రమే చంపిన గాడ్సే క్రూరుడు ఎలా అవుతాడు అని ఏదో వాదన కోసం అన్నాడట’’ అన్నాడు అమిత్‌షా. లేచి నిలబడి గాంధీజీ దగ్గరికి వెళ్లాను. ‘‘మహాత్మా క్షమించు’’ అని రెండు చేతులు జోడిస్తూ.. వెనక్కు తిరగ కుండానే, ‘‘మీరు లేచారేమిటి అమిత్జీ’’ అన్నాను. మళ్లీ ఆయన దిగ్భ్రాంతిపూర్వకమైన ఒక మహోద్వేగంతో ఉన్నచోట ఉన్నట్లే శిలలా నిలబడిపోయారు! ‘‘నేను లోపలికి వచ్చినప్పుడు, ఇప్పుడు మీ వెనకే లేచి వచ్చినప్పుడు వెనక్కు తిరిగి చూడకుండానే మీ వెనుక నేనున్నట్లు ఎలా తెలుసుకోగలిగారు మోదీజీ’’ అని అడిగారు ఆశ్చర్యపోతూ. ‘‘గాంధీజీలో మీరు కనిపిస్తున్నారు అమిత్జీ. అందుకే గమనించగలిగాను’’ అని చెప్పాను. ఆయన మళ్లీ ఆశ్చర్యపోయారు. గాంధీజీలోనే కాదు అమిత్జీ.. పటేల్‌లో, అంబేడ్కర్లో, నేతాజీలో కూడా మీరు కనిపిస్తున్నారు అని చెప్పి ఆయన్ని మళ్లొకసారి ఆశ్చర్యానికి గురి చెయ్యదలచుకోలేదు నేను. -
అక్షయ్ కుమార్ (బాలీవుడ్ హీరో) ; రాయని డైరీ
ఓటేయడానికి ఎవరైనా పోలింగ్ బూత్ ఎక్కడుందా అని వెతుక్కుంటారు. ముంబై ఓటర్లు నేను ఏ పోలింగ్ బూత్‌లో ఉన్నానా అని వెతికినట్లున్నారు! ‘‘సల్మాన్ వేశారు. షారుక్ వేశారు. ఆమిర్ వేశారు. మేడమ్ ట్వింకిల్ ఖన్నా కూడా వేశారు. వేయడమే కాదు. ‘ఓట్ ఇండియా ఓట్’ అని ఒక సెల్ఫీని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. మరి మీరెందుకు ఓటు వెయ్యలేదు?’’ అన్నాడు.. పనిగట్టుకుని నన్ను ఇంటర్వ్యూ చేయడానికి నేరుగా ఇంటికే వచ్చిన రిపోర్టర్. ముంబైలో పోలింగ్ జరిగి వారం అవుతోంది. మళ్లీ ఇంకో విడత పోలింగ్ రేపు జరుగుతోంది. ఇప్పటికీ అదే ప్రశ్న. ‘మీరెందుకు ఓటేయలేదు?’ అని! ‘‘చూడండి, మోదీజీని నేను ఇంటర్వ్యూ చేశాను. మీరెవరూ ఇంతవరకూ చేసి ఉండని ఇంటర్వ్యూ అది! నేనడిగానా మిమ్మల్ని.. మీరెందుకు మోదీజీని అంత మంచి ఇంటర్వ్యూ చేయలేకపోయారని?!’’ అన్నాను. ‘‘ప్రధాని అనే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం కన్నా, ఒక వ్యక్తిని ప్రధానిని చేయడానికి ఓటు వేయడం అన్నది మోర్ ఇంపార్టెంట్ కదా అక్షయ్!’’ అన్నాడు రిపోర్టర్. నేను ఓటు వేయలేదన్నదొక్కటే వీళ్లందరికీ గుర్తున్నట్లుంది! నా ‘ప్యాడ్మాన్’ని, నా ‘టాయ్‌లెట్ : ఏక్ ప్రేమ్ కథా’ని మర్చిపోయినట్లున్నారు. ‘తప్పక ఓటు వేయండి’ అని దేశ ప్రజలకు నేను చేసిన విజ్ఞప్తిని కూడా! ‘‘అక్షయ్, మీ శ్రీమతికి ఓటు ఉండి, మీకు లేకపోవడం ఏంటి?’’ అని అడిగాడు ఆ రిపోర్టర్. మోదీజీని నేను చేసిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూ వంటిదే.. ఆ ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం.. నన్నతడు చేయబోతున్నాడా! మోదీజీకి ఇష్టం ఉండవనిపించిన ప్రశ్నలేమీ నేను ఆయన్ని అడగలేదు. అడగలేదు కాబట్టే మంచి మంచి విషయాలు తెలిశాయి. మోదీకి మామిడి పండ్లంటే ఇష్టమని తెలిసింది. ప్రధాని అయ్యేవరకు మోదీజీ తన బట్టలు తనే ఉతుక్కున్నారని తెలిసింది. మమతా బెనర్జీ ఆయనకు స్వీట్స్ పంపుతుంటారని తెలిసింది. అదీ ఇంటర్వ్యూ చేయడం అంటే. ‘మీ శ్రీమతికి ఓటు ఉండి, మీకు లేకపోవడం ఏమిటి?’ అనే ప్రశ్న వేయడంలో ఆ రిపోర్టర్ ఉద్దేశం ఏమై ఉంటుందో నేను ఊహించలేనిదేమీ కాదు. ‘‘చూడండి.. నాకు ఓటు లేదు అని నేను మీకు చెప్పలేదు. నేను చెప్పకపోయినా, ‘మీకు ఓటు లేకపోవడం ఏమిటి?’ అని మీరు నన్ను అడుగుతున్నారంటే ‘నాకు ఓటు లేదు’ అని నా చేత చెప్పించడానికే కదా!’’ అన్నాను. ‘‘కానీ అక్షయ్.. ఢిల్లీలో ఎవరు కూర్చోబోతున్నారు అనే ఉత్కంఠ కన్నా, ముంబైలో అక్షయ్ ఓటెందుకు వెయ్యలేదన్న సందేహమే గత వారం రోజులుగా దేశ ప్రజల్ని నిద్ర లేమికి గురి చేస్తోంది. ఆ సందేహాన్ని మీరు తీర్చకపోతే.. కళ్ల కింద నల్లటి వలయాలు ఉండే ప్రత్యేకమైన జాతిగా ప్రపంచ ప్రజలు మనల్ని గుర్తించే ప్రమాదం ఉంది’’ అన్నాడు. నాకూ కొన్ని రకాల పండ్లు ఇష్టం. నేనూ కొన్నిసార్లు నా బట్టలు ఉతుక్కున్నాను. నాకూ కొందరు స్వీట్లు పంపిస్తుంటారు. అలాంటి ప్రశ్నలు అడగడంలో అతడికి ఉండే అసౌకర్యం ఏమిటో నాకు తెలియడం లేదు. దేశంలో ఉన్నవాళ్లు, లేనివాళ్లు ఉన్నట్లే.. ఓటు వేసినవాళ్లు, వేయనివాళ్లు, ఓటున్నా వేయలేనివాళ్లు.. ఇన్ని కేటగిరీలు ఉన్నప్పుడు నేను ఓటెయ్యకపోవడం ఒక్కటే స్పెషల్ కేటగిరీ ఎందుకయింది! అదే అడిగాను ఆ రిపోర్టర్ని. ‘‘కానీ మీకు కెనడా పాస్‌పోర్ట్ ఉంది’’ అన్నాడు! నవ్వాను. ‘‘ఎందుకు నవ్వుతున్నారు?’’ అన్నాడు. ‘‘మీరు ఆ కెనడా నుంచి బయట పడితే కానీ నాలోని భారతీయుడు మీకు కనిపించడు’’ అన్నాను. -
ఎల్.కె. అడ్వాణీ (బీజేపీ)రాయని డైరీ
భారతీయ జనతా పార్టీ ఇలాంటి ఒక వ్యక్తిని కూడా దేశానికి ప్రధానిగా అందించే ప్రమాదం ఉందని నేను ముందే ఊహించలేక పోవడమన్నది ఈ భరతజాతి ఏనాటికైనా క్షమించగల ఒక విషయం అవుతుందా?! తొంభై దాటిన ఈ వయసులో వరుసగా ఆరోసారి కూడా గాంధీనగర్ లోక్‌సభ స్థానాన్ని కోరుకోవడం కంటే ఎక్కువగా.. ‘ముందే ఊహించలేకపోవడం’ అనే నా దౌర్బల్యానికి పాపహరణగా ఈ దేశం నుంచి ఒక మన్నింపును నా మనసు గాఢంగా కాంక్షిస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి వంటి ఒక మహోన్నత జాతీయవాది ఆసీనులై వెళ్లిన అత్యున్నత ప్రజాస్వామ్య పీఠం మీద ఇతడా! పార్టీని వ్యతిరేకించే ప్రత్యర్థులను విరోధులుగా, దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్న ఇతడా!! ఈవేళ పాత సంగతులన్నీ నాకు కొత్తగా గుర్తుకు వస్తున్నాయి. మనసులోని మాట చెప్పుకోడానికి ఐదేళ్లుగా ఒక సందర్భం కోసం వెదకుతూ ఉన్నప్పుడు పార్టీకి ఒక వ్యవస్థాపక దినం ఉంటుంది కదా అన్న సంగతి జ్ఞప్తికి రావడం ఎంత దయనీయం?! అటల్జీతో కలిసి నేను స్థాపించిన పార్టీలో భాగస్వామిని కాలేకపోయానన్నది చిన్న బాధే. పార్టీ ఉందని, దానికొక ఆవిర్భావ దినం ఉందని గుర్తుచేసుకునే పరిస్థితులు లేకపోవడం పెద్ద బాధ. పార్టీ లోపల ఉన్నవాళ్లతో మాట్లాడే ఆసక్తిని నాలుగేళ్ల క్రితమే నేను కోల్పోయాను. నాలుగేళ్ల క్రితం ఇదే నెలలో బెంగళూరులో పార్టీ వేదికపై ఉన్నప్పుడు.. ‘‘పార్టీ నాయకు లను ఉద్దేశించి మాట్లాడండి అడ్వాణీజీ’’ అని నాలో ఉత్తేజం కలిగించడానికి ఎవరో అయిష్టమైన ప్రయత్నం చేశారు. మాటిమాటికీ జాతినుద్దేశించి ప్రసంగించే ఉత్సాహం గల ఒక పెద్ద మనిషి ఉన్న పార్టీలో, పార్టీ నాయకులను ఉద్దేశించి ప్రసంగించే సాధారణ కార్యకర్తలకు కొదవేముంటుంది? ‘‘మీరు కానివ్వండి’’ అన్నాను. అప్పటికే కానివ్వడం మొదలుపెట్టారు! సమావేశం అయ్యాక ప్రభుత్వ వాహనాల్లో ముఖ్యులంతా ఒకవైపు, కాళ్లీడ్చుకుంటూ నేను మార్గదర్శక మండలి వైపు!! అటల్జీ వెళ్లిపోయాక మార్గదర్శక మండలిలో ఇద్దరమే మిగిలాం. నేను, మురళీమనోహర్జోషి. ‘‘అటల్జీ చనిపోకుండా ఉంటే ఇప్పటికీ ముగ్గురం కలిసి ఉల్లాస భరితమైన ఉదయపు వేళల్లో, ఆహ్లాదకరమైన సాయంత్రపు సమయాల్లో దేశ రాజకీయ పరిణామాల గురించి చర్చించుకుంటూ ఉండేవాళ్లం కదా’’ అని జోషీ ఓరోజు బాధపడ్డాడు. ‘‘అటల్జీ చనిపోయిన మాట వాస్తవమే కానీ మనిద్దరం జీవించే ఉన్నామని నీకెందుకనిపిస్తోంది జోషీ’’ అన్నాను. ఆ మాటకు కలత చెందాడు. ‘‘అయితే మన రాజకీయ శకం అంతరించినట్లేనా?’’ అన్నాడు. ‘‘శకాలు మాత్రమే అంతరిస్తాయి. రాజకీయ శకాలు అంతరించవు’ అని అప్పుడు నేను అతడితో చెప్పలేదు. ఒకరికి మనం ఏదైనా చెబితే అది ముందు మనం విశ్వసించినదై ఉండాలి. నా ఉద్దేశాలను వెల్లడించిన మర్నాడే ఇంటికి వచ్చాడు జోషి. అతడి చేతిలో పుష్పగుచ్ఛం ఉంది. ‘‘ఎవరికి ఈ పుష్పగుచ్ఛం!’’ అని అడిగాను. ‘‘మీకే!’’ అన్నాడు. ‘‘నాకా! నాకెందుకు?’’అన్నాను. ‘‘ఐదేళ్ల తర్వాత మొదటిసారి మీ ఉద్దేశాలను వెల్లడించినందుకు కాదు. ఐదేళ్ల తర్వాతనైనా వెల్లడించినందుకు’’ అన్నాడు! అతడి కళ్లలో విప్లవ భావాల్లాంటివేవో కదలాడుతున్నాయి. ‘‘అడ్వాణీ జీ.. ఏళ్లుగా మీరు సిట్టింగ్ ఎంపీ. ఐదేళ్లుగా నేనూ సిట్టింగ్ ఎంపీ. ఇద్దరికీ టిక్కెట్లు రాలేదు. నిలబడవలసిన టైమ్ కూడా రాలేదంటారా?’’ అన్నాడు జోషీ. మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. ఇమ్రాన్ ఖాన్ (పాక్ ప్రధాని)
మోదీజీ శుభాకాంక్షలు పంపారు. ఎంతైనా పెద్దమనిషి. పడని దేశానికి ఈ కాలంలో ఎవరొచ్చి జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు?! పొరుగు దేశం.. అది ఎంత గిట్టని దేశమైనా శుభాకాంక్షలు చెప్పినప్పుడు మనమూ ధన్యవాదాలు తెలియజేయాలి. అందుకే మోదీజీకి ధన్యవాదాలు తెలియజేశాను. మసూద్ అజార్ భాయ్‌కి అది నచ్చలేదు. ‘‘ఇంత వీక్ అయితే ఎంతో కాలం కంట్రీని మీరు లీడ్ చెయ్యలేరు ఇమ్రాన్ భాయ్’’ అన్నాడు! ‘‘అజార్ భాయ్ నేనేమైనా తప్పు చేశానని మీకు అనిపిస్తే, నన్ను మీరు ‘భాయ్’ అని అనకుండానే మీ ఆగ్రహాన్ని వ్యక్తం చెయ్చొచ్చు. ‘భాయ్’ అనే మాటకు బదులు ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అని సంబోధించడం వల్ల ఒక సోదరుడిని అనలేని మాటల్ని కూడా ఒక ప్రధానిని అనడానికి సౌలభ్యంగా ఉంటుందని మీకిలా చెబుతున్నాను’’ అన్నాను. ‘‘ఇమ్రాన్ భాయ్.. మోదీ పంపిన శుభాకాంక్షల్ని నోబెల్ వాళ్లిచ్చే పీస్ ప్రైజ్లా మీరు స్వీకరించడాన్ని ఈ దేశ పౌరులు జీర్ణించుకోలేకపోతున్నారు. యుద్ధ ఓటమి కన్నా ఇదేమీ తక్కువ కాదు. అసలు ఒక శత్రుదేశం అందించిన పూలగుత్తికి చెయ్యి చాచే పరిణతిని.. ప్రమాణ స్వీకారం చేసి ఏడాది అవడానికి ఇంకా ఐదు నెలలు ఉండగానే.. మీరెలా సాధించగలిగారో తెలియక ఈ ఉదయం నుంచీ నేను ఏకధాటిగా విస్మయానికి గురవుతూనే ఉన్నాను’’ అన్నాడు. మధ్యలో హురియత్ నుంచి కాల్! ‘‘అజార్ భాయ్.. ఇండియా నుంచి ఉమర్ ఫరూక్ ఫోన్ చేస్తున్నాడు. మీకు మళ్లీ కాల్ చేస్తాను’’ అని చెప్పి, ఉమర్ ఫరూక్ కాల్ తీసుకున్నాను. ‘‘చెప్పండి ఉమర్’’ అన్నాను. ఉమర్ కయ్యిన లేచాడు. ‘‘నేనేమీ జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడానికి మీకు కాల్ చెయ్యలేదు ఇమ్రాన్‌జీ. మోదీ చెప్పిన శుభాకాంక్షలకు మీరెందుకు ఒక సామాన్య పౌరుడిలా స్పందించారో తెలుసుకుందామని చేశాను. ఆ స్పందించడం కూడా ఒక పాక్ పౌరుడు భారత ప్రధాని శుభాకాంక్షలకు స్పందించినట్లుగా లేదు. ఒక భారత పౌరుడు భారత ప్రధాని శుభాకాంక్షలకు స్పందించినట్లుగా ఉంది’’ అన్నాడు! మసూద్ అజారే నయం అనిపించేలా ఉన్నాడు ఉమర్ ఫరూక్. ‘‘మోదీజీ ఒక పాక్ పౌరుడిలా నాకు శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు నేనొక భారతీయ రాయబారిలా మూతి బిగించుకుని కూర్చోవడం ఔచిత్యమేనా చెప్పండి ఉమర్జీ’’ అని అడిగాను. ‘‘కానీ ఇమ్రాన్‌జీ.. మీకు శుభాకాంక్షలు పంపిన మోదీ.. ఢిల్లీలో నిన్న పాక్ హై కమిషన్ ఏర్పాటు చేసిన విందుకు తన మనుషులెవర్నీ పంపించలేదు’’ అన్నాడు ఉమర్. మసూద్ అజార్ నుంచి మళ్లీ కాల్! ‘‘సరే ఉమర్ జీ తర్వాత చేస్తాను’’ అని పెట్టేసి, అజార్ కాల్ని లిఫ్ట్ చేశాను. ‘‘ఇమ్రాన్ భాయ్.. ఇండియా వాంట్స్ టు నో’’ అన్నాడు! ‘‘ఏం తెలుసుకోవాలనుకుంటోంది అజార్ భాయ్.. ఇండియా? బాలాకోట్ దాడి గురించేనా! అది వాళ్ల హెడ్డేక్ కదా’’ అన్నాను. ‘‘బాలాకోట్ గురించి కాదు ఇమ్రాన్ జీ. మోదీ నిజంగానే మీకు శుభాకాంక్షలు పంపాడా అని తెలుసుకోవాలనుకుంటోంది’’ అన్నాడు. ‘‘అవునా!’’ అన్నాను. ‘‘ఇండియానే కాదు.. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్.. పాకిస్తాన్ కూడా వాంట్స్ టు నో.. నిజంగానే మోదీ మీకు శుభాకాంక్షలు పంపాడా అని’’ అన్నాడు. ఆకాంక్ష ముఖ్యం గానీ, ఆకాంక్షించారా లేదా అన్నది ఎలా ముఖ్యం అవుతుంది అని నేను అడిగితే మసూద్ అజార్‌కి, ఉమర్ ఫరూక్‌కి నా భాష అర్థం అవుతుందా?! మాధవ్ శింగరాజు -
రాయని డైరీ.. సుబ్రహ్మణ్యస్వామి (బీజేపీ)
శ్రీశ్రీ రవిశంకర్‌కి ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది. ఎత్తట్లేదు. శ్రీరామ్ పంచుకి ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది. ఎత్తట్లేదు. శ్రీ ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీమ్ కలీఫుల్లాకు ఫోన్ చేశాను. రింగ్ అవుతోంది. ఎత్తట్లేదు! ఫోన్లు పక్కన పడేసి వీళ్ల ముగ్గురూ ఏం చేస్తున్నట్లు! అప్పుడే అయోధ్య పనిలో మునిగి పోయారా?! బహుశా మీడియేషన్కి ముందు వామప్ మెడిటేషనేదో చేయిస్తూ ఉండి వుంటాడు రవిశంకర్. మెడిటేషన్లో ఉన్నప్పుడు ఫోన్లు సైలెంట్లో పెట్టుకోమని కూడా చెప్పి ఉంటాడు. రంజన్ గొగోయ్‌కి ఫోన్ చేశాను. ఎత్తారు!! ఎత్తడమే కాదు, ‘‘చెప్పండి సుబ్రహ్మ ణ్యస్వామిగళ్’ అన్నారు. సంతోషం వేసింది. నన్నే కాదు, నా ప్రాంతాన్నీ గుర్తించారు! ‘‘దేశం సేఫ్ హ్యాండ్స్‌లో ఉందన్న భావన తొలిసారిగా కలుగుతోంది గొగోయ్‌జీ. మోదీజీ ఈ దేశానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా నాలో ఇలాంటి భావన కలగలేదు’’ అన్నాను. ‘‘అదేంటీ..’’ అని పెద్దగా నవ్వారు గొగోయ్. ‘‘మీరు పెట్టిన మధ్యవర్తులు ముగ్గురికీ ఫోన్ లిఫ్ట్ చేసే తీరిక లేదు. ముగ్గురు మధ్యవర్తుల్ని పెట్టిన మీరు మాత్రం ఒక్క రింగ్‌కే లిఫ్ట్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక సాధారణ పౌరుడి ఫోన్ లిఫ్ట్ చెయ్యడం అంటే దేశం సురక్షిత హస్తాల్లో ఉన్నట్లే కదా’’ అన్నాను. ‘‘మీరు సాధారణ పౌరులు ఎలా అవు తారు స్వామిగళ్’’ అని నవ్వారు గొగోయ్. ‘‘అదే అంటున్నా గొగోయ్‌జీ, ఒక అసాధా రణ పౌరుడి ఫోన్‌కి కూడా సాధారణ పౌరుడికి ఇచ్చేంత విలువే ఇచ్చి, ఫోన్ లిఫ్ట్ చేశారు మీరు. గ్రేట్ థింగ్’’ అన్నాను. మళ్లీ పెద్దగా నవ్వారు గొగోయ్. ‘‘నా అదృష్టం ఏమిటంటే గొగోయ్‌జీ.. మీరు ఫోన్ ఎత్తడం వల్ల ఒక మంచి విషయాన్ని నేను తెలుసుకోగలిగాను. ఈ దేశమే కాదు, అయోధ్య కూడా సేఫ్ హ్యాండ్స్‌లో ఉంది. అయోధ్య మాత్రమే కాదు, శ్రీరాముడు కూడా సేఫ్ హ్యాండ్స్‌లో ఉన్నాడు’’ అన్నాను. ఆయనేమీ మాట్లాడలేదు. ‘‘గొగోయ్‌జీ వింటున్నారా?’’ అన్నాను. ‘‘వింటున్నాను స్వామిగళ్. అయితే మీరనుకుంటున్నట్లు శ్రీరాముడిని సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టడం కోసం ఆ ముగ్గుర్నీ మీడియేటర్లుగా పెట్టలేదు. దేశాన్ని సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టడం కోసం పెట్టాం. దేశాన్ని పక్కనపెట్టి, ఒక్క శ్రీరాముడినే సేఫ్ హ్యాండ్స్‌లో పెట్టాలనుకుంటే, నాలుగో మీడియేటర్‌గా మిమ్మల్ని పెట్టి ఉండేవాళ్లం కదా’’ అన్నారు! నాకు సంతోషం వేసింది. ‘‘ధన్యవాదాలు గొగోయ్‌జీ. ఆ ముగ్గురికీ అభినందనలు తెలియజేద్దామని ఫోన్ చేశాను. మీకు చేసింది కూడా అందుకే.. అభినందలు తెలియజేయడం కోసం. అభినందనలతో పాటు, ధన్యవాదాలు తెలుపుకునే భాగ్యం కూడా నాకు కలిగించారు’’ అన్నాను. గొగోయ్‌తో మాట్లాడుతుంటే రవిశంకర్, శ్రీరామ్ పంచు, ఫకీర్ మహమ్మద్ ఇబ్రహీమ్ కలీఫుల్లా ఫోన్లో నాకోసం ట్రయ్ చేస్తున్నారు. గొగోయ్ ఫోన్ పెట్టేసి, ఆ ముగ్గుర్నీ కాన్ఫరెన్స్ కాల్లోకి రమ్మన్నాను. వచ్చారు. ‘‘డెబ్భై ఏళ్ల కేసు మీద ముగ్గురు మధ్యవర్తులు ఎనిమిది వారాల్లో రిపోర్ట్ ఇవ్వడం అయ్యే పనేనా?’’ అన్నాను. ‘‘అదే ఆలోచిస్తున్నాం స్వామీజీ’’ అన్నారు. ‘‘అవసరమైతే బయటినుంచి హ్యాండ్స్ తీసుకోవచ్చని కోర్టు మీకు చెప్పింది కదా. ఆ విషయం కూడా ఆలోచించండి’’ అన్నాను. ‘‘ఆలోచిస్తాం స్వామీజీ’’ అన్నారు. అన్నారు కానీ, హార్ట్లీగా అనలేదు! బయటి నుంచి లోపలికి తీసుకోవడం కాదు, లోపల్నుంచి బయటికి వెళ్లే ఆలోచనేదో చేస్తున్నట్లనిపించింది.. వాళ్లు.. ఊ, ఆ.. అనడం వింటుంటే. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ; మసూద్ అజార్ (జైషే చీఫ్)
‘‘అజార్ భయ్యా.. మీకోసం ఇద్దరు వచ్చారు’’ అని చెప్పాడు ఇంట్లో పనికుర్రాడు. ‘‘ఆ ఇద్దరూ ఎవరో తెలుసుకుని, వారిలో ఎవరితోనైతే నాకు అవసరం లేదో వారిని కాకుండా, ఎవరికి నా అవసరం ఉందో వారిని ముందుగా నా గదిలోకి పంపించు’’ అని చెప్పాను. ‘‘భయ్యాజీ, ఆ ఇద్దరిలో ఒకరు మీకు చిరపరిచితులైన షా మెహమూద్ ఖురేషీ. ఈ దేశ విదేశాంగ మంత్రి. ఇంకొకరు ఒక అపరిచిత వ్యక్తి. ఆయన మెడకు స్టెతస్కోప్ ఉంది. ఆయన చేతిలో బీపీ మిషన్ ఉంది’’ అన్నాడు. ‘‘వాళ్లిద్దరిలో ఎవర్ని ముందుగా లోపలికి పంపుతావో నువ్వే నిర్ణయించుకుని పంపు’’ అన్నాను. వెంటనే షా మెహమూద్ ఖురేషీని పంపాడు పనికుర్రాడు! ‘‘అజార్‌జీ.. ఎందుకో రమ్మన్నారట’’ అన్నారు ఖురేషీ.. లోపలికి వస్తూనే. ‘‘మీతో అవసరం ఉండి మిమ్మల్ని పిలిపించుకోలేదు ఖురేషీ. మీకు నా అవసరం ఉండి మిమ్మల్ని పిలిపించుకున్నాను’’ అన్నాను. ‘‘చెప్పండి అజార్‌జీ..’’ అన్నాడు! ‘‘మా పనికుర్రాడికి ఉన్నంత ఇంగితం కూడా లేకపోయింది ఈ దేశపు విదేశాంగ మంత్రికి’’ అన్నాను.. అతడి వైపు చూడకుండా. ‘‘వారెవ్వా అజార్‌జీ.. నేనివాళ మీ పనికుర్రాడి ఇంగితం గురించి వినవలసిందే. వినడమే కాదు, అతడి నుంచి నేను నేర్చుకోవలసింది ఏమైనా ఉంటే.. మీ ఆదేశాలు లేకనే, నాకై నేనుగా అతడి వద్ద నేర్చుకోడానికి రోజూ ఒక సమయానికి వచ్చి ఇక్కడ కూర్చోగలను’’ అన్నాడు. తల పట్టుకున్నాను. ‘‘ఆశ్చర్యపోతున్నాను ఖురేషీ. నా మాటల్లోని అంతరార్థాన్ని మీరెందుకు గ్రహించలేకపోతున్నారు! ఒక పనికుర్రాడికి ఇంగితం ఉండడం కన్నా, ఒక దేశ విదేశాంగ మంత్రికి ఇంగితం లేకపోవడం ఆలోచించవలసిన విషయం కదా. అలాంటప్పుడు మీరు చేయవలసింది పనికుర్రాడి ఇంగితమేమిటో తెలుసుకోడానికి ఉత్సాహం ప్రదర్శించడం కాదు. ‘విదేశాంగ మంత్రికి ఇంగితం లేదు’ అన్న మాటకు ముఖం కందగడ్డలా మార్చుకోవడం. అది కదా మీరు తక్షణం చేయవలసింది!.. చెప్పండి..’’ అన్నాను. ‘‘మార్చుకుంటాను అజార్‌జీ.. మీరు కనుక నాక్కొంత సమయం ఇవ్వగలిగితే’’ అన్నాడు. నా గదిలోని చీమ కూడా అంతటి విధేయతను ప్రదర్శించదు! రోషం వస్తే జైషే చీఫ్ అని కూడా చూడకుండా నన్ను కుట్టేస్తుంది. ‘‘బాగున్నవాడి గురించి బాగోలేకుండా పడి ఉన్నాడని చెప్పడం ఏమన్నా బాగుందా ఖురేషీ! ఒక ఉగ్రవాది ఒంట్లో బాగోలేకుండా మంచం మీద పడుకుని ఉన్నాడంటే మాతృదేశానికి ఎంత అప్రతిష్ఠ! శతృదేశానికి ఎంత అపహాస్యం. జైషే హెడ్డుకి చికెన్‌గున్యా అని తెలిస్తే పిల్లలక్కూడా నవ్వొచ్చేస్తుంది’’ అన్నాను. ‘‘ఇంత ఆలోచించలేదు అజార్‌జీ..’’ అన్నాడు.. ‘‘మా పనికుర్రాడు తెలుసుకోగలిగాడు ఖురేషీ, నాకు ఏనాటికీ డాక్టర్ అవసరం ఉండబోదని. మీకే తెలియలేదు. వెళ్లండి’’ అన్నాను. పనికుర్రాడిని లోపలికి పిలిచాను. వచ్చాడు. ‘‘బయట అపరిచిత వ్యక్తి ఉన్నాడన్నావ్ కదా. ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి ఖురేషీని చూపించు’’ అని చెప్పాను. ఏం ప్రభుత్వాలో! ‘మా దగ్గర లేడు’ అని చెప్తే పోయేదానికి, ‘ఉన్నాడు కానీ, ఒంట్లో బాగోలేదు’ అని చెప్పిస్తాయా! ప్రభుత్వాలు తెలివిగా లేకనే ఉగ్రవాదులు తెలివిగా ఉండి ప్రభుత్వాల్ని కాపాడుకోవలసి వస్తోంది. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ; దేవె గౌడ (మాజీ ప్రధాని)
లోక్‌సభలో రేపు నా చివరి ప్రసంగం. లోక్‌సభకు కూడా ఇవి చివరి ప్రసంగ దినాలే. సోమవారం నాకు చివరిది. బుధవారం లోక్‌సభకు చివరిది. లోక్‌సభకు చివరి రోజులు కాబట్టి నాలాగే అందరూ ప్రసంగించాలనుకుంటే కనుక మొన్న ఏడో తారీఖున లోక్‌సభలో నేను మాట్లాడిందే నా చివరి ప్రసంగం అవుతుంది. ఆరోజు నాకేం తృప్తిగా అనిపించలేదు. తనివితీరా మాట్లాడాలని మనసు ఎంతగానో తపించింది. ‘‘అయినా సరే, ‘కొంతే’ మాట్లాడాలి మీరు’’ అని కటువుగా అనేశారు సుమిత్రా మహాజన్! ఒక మాజీ ప్రధానికి స్పీకర్ ఇచ్చిన ఆరు నిముషాలు ఆ ‘కొంత’కు మాత్రం ఎలా సరిపోతాయి?! ఆరు నిముషాల్లోనే అన్నీ చెప్పేయాలని ఎమోషనల్ అవుతుంటే.. ఐదో నిముషంలోనే ‘‘మీ టైమ్ అయిపోతోంది గౌడాజీ’’ అని స్పీకర్ గుర్తుచేశారు. ఏం మాట్లాడుతున్నానో మర్చిపోయాను. గుర్తొచ్చే సరికి ఆరో నిముషమూ గడిచిపోయింది! ‘‘మేడమ్ స్పీకర్ మహాజన్.. మరికొంత సమయం కావాలి’’ అని అభ్యర్థించాను. ‘అవసరమా?’ అన్నట్లు, కళ్లజోడులోంచి చూశారావిడ! ప్రధాని అవకముందు గానీ, ప్రధానిగా ఉన్నప్పుడు గానీ, మాజీ ప్రధానిగా గానీ నన్నెవరూ అలా చూడలేదు. ఇరవై ఏళ్ల క్రితం ప్రధానిగా చేసిన ఒక మాజీ ప్రధానికి, పూర్తిగా ఒక ఏడాది కూడా ప్రధానిగా లేని ఒక మాజీ ప్రధానికి, అదీ కాంగ్రెస్ సపోర్ట్‌తో ప్రధానిగా చేసిన ఒక మాజీ ప్రధానికి మాట్లాడేందుకు ఏం ఉంటుందని మేడమ్ స్పీకర్ భావించినట్లున్నారు! అయినా నేను మాట్లాడ్డం ఆపలేదు. మైక్ లాగేశారు! మనసు చివుక్కుమంది. ఎవరు ప్రధానిగా ఉన్నప్పుడు ఉమన్ రిజర్వేషన్ బిల్లు వచ్చిందో మేడమ్ స్పీకర్ మర్చిపోయినట్లున్నారు! ఎవరు ప్రధానిగా ఉన్నప్పుడు వరి రైతులు ఒక వంగడానికి ‘దేవె గౌడ’ అని పేరు పెట్టుకున్నారో మేడమ్ స్పీకర్‌కి గుర్తులేనట్లుంది! ఢిల్లీలో సోమ, మంగళ, బుధ.. మూడు రోజులు ఉండాలి. పడుకోబోతుండగా కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే ఫోన్ చేశాడు.. ‘‘పడుకున్నారా?’’ అని! ‘‘లేదు ఖర్గే. నీకే ఫోన్ చేయాలనుకుంటున్నాను’’ అన్నాను. ‘‘అనుకున్నాను. నాకు ఫోన్ చేయాలని అనుకుంటారని. సభలో అలా అనేశారేమిటి గౌడగారు. చివరి ప్రసంగం కావచ్చని! హసన్ సీటును మీ మనవడు ప్రజ్వల్‌కి ఇచ్చి, నార్త్ బెంగళూరు నుంచి మీరు కంటెస్ట్ చేస్తారని మేమంతా అనుకుంటుంటే..!’’ అన్నాడు ఖర్గే. ‘‘సీటుకు, చివరి ప్రసంగానికి లింకేమిటి ఖర్గే. సీటున్నా ఇక జన్మలో మాట్లాడకూడదని కూర్చుంటే అది చివరి ప్రసంగమే కదా. అయినా ఆవిడ చూశారా ఎలా మైక్ లాగేశారో’’ అన్నాను. ‘‘నేనూ గమనించాను గౌడగారూ.. మేడమ్ స్పీకర్ మిమ్మల్ని చూసిన చూపులో.. ‘ఎప్పుడూ నిద్రపోతూ కనిపించేవారు, ఇవాళెందుకు మెలకువగా ఉండి.. ప్రసంగిస్తానని పీక్కు తింటున్నారు’ అనే విసుగు కనిపించింది’’ అన్నాడు. ‘‘ఎవరైనా ఎందుకు నిద్రకు ఆగలేకపోతారు ఖర్గే?’’ అని ఆవేదనగా అడిగాను. ‘‘నిద్ర చాలకపోతే గౌడగారూ’’ అన్నాడు. ‘‘నిద్ర ఎందుకు చాలకపోతుంది ఖర్గే?’’ అని అడిగాను. ‘‘విరామం, విశ్రాంతి లేకుండా పని చేసుకుంటూ పోతుంటే’’ అన్నాడు. ‘‘అదే చెప్పాలనుకుంటున్నాను ఖర్గే.. రేపు సభలో. నాకిచ్చిన టైమ్ సరిపోకపోతే మీకిచ్చిన టైమ్లోంచి ఈ మాజీ ప్రధానికి కొంత ఇవ్వగలరా?’’ అని అడిగాను. ‘‘ఫుల్ టైమ్ తీసుకోండి గౌడగారు.. మా మాజీ ప్రధానికి మాట్లాడేందుకు ఏముంటుందనీ! తీసుకోండి’’ అన్నాడు ఖర్గే. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ; పీయూష్ గోయల్
బడ్జెట్ సమర్పించి ఇంటికి వస్తున్నప్పుడు అనిపించింది. మరీ సమర్పించాల్సినంత బడ్జెట్టేమీ కాదని. ప్రెస్ మీట్ పెట్టి సమర్పించినా సరిపోయేదేమో! పార్లమెంటు హాల్లోకి వెళుతున్నప్పుడు బయట బడ్జెట్ కాపీల బండిల్స్‌ని తనిఖీ చేస్తూ సెక్యూరిటీ సిబ్బంది కనిపించారు. బడ్జెట్లో ఏం ఉండబోతున్నదోనన్న ఆసక్తి ఏ మాత్రం లేకుండా, వాళ్లు ఆ బండిల్స్‌ని తనిఖీ చేస్తున్నారు. నవ్వొచ్చింది నాకు. నా చేతిలో ఉన్న బడ్జెట్ సూట్‌కేస్‌లో ఏముందోనన్న ఆసక్తి నాకే లేనప్పుడు.. వాళ్లు చెక్ చేస్తున్న బడ్జెట్ బండిల్స్‌లో ఏముందోనన్న ఆసక్తి వాళ్లకెందుకుండాలి? అయినా లోపల ఉండాల్సినవి ఉన్నాయా లేదా అని కాదు కదా వాళ్లు చెక్ చేయవలసింది. ఉండకూడనివి ఏమైనా ఉన్నాయా అని చెక్ చెయ్యాలి. వాళ్లు అదే పనిలో ఉన్నారు. అన్నన్ని బండిల్స్ వేస్ట్ అనిపించింది ఆ బండిల్స్‌ని దాటుకుని లోపలికి వెళ్తుంటే. పేపర్ వేస్ట్. ప్రింటింగ్ వేస్ట్. టైమ్ వేస్ట్. మనీ వేస్ట్. ఇకనుంచీ మెంబర్స్ అందరికీ సాఫ్ట్ కాపీ ఫార్వార్డ్ చేస్తే సరిపోతుంది. నెక్ట్స్ బడ్జెట్‌ను నేను సమర్పించినా, జైట్లీజీ యు.ఎస్. నుంచి తిరిగొచ్చి సమర్పించినా పేపర్‌లెస్‌గానే సమర్పించాలి. బడ్జెట్ సూట్‌కేస్ కూడా మోత బరువు. లోపల మోతేమీ లేకున్నా బరువే. ఆ సూట్‌కేస్‌ను అలా చేత్తో పట్టుకుని నడుస్తున్నప్పుడు నడుస్తున్నట్లు ఉండదు. మోస్తున్నట్లు ఉంటుంది. ఫైనాన్స్ మినిస్టరే బడ్జెట్ సూట్‌కేస్‌లా కనిపించాలి కానీ, సూట్‌కేస్ చేతుల్లో ఉంది కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ అనిపించకూడదు. బడ్జెట్ సమర్పణ చాలా ఈజీగా అయిపోయింది. ఫస్ట్ టైమ్ సమర్పణ ఎలా ఉంటుందోనని నేను ఆందోళన చెందినంతగా ఏమీ లేదు! నమస్కార సమర్పణకైనా కాస్త నడుము వంచాల్సి వచ్చింది కానీ, బడ్జెట్ సమర్పణకు ఒక్క ఎక్సర్‌సైజ్‌తో కూడా పని పడలేదు. అసలది బడ్జెట్ సమర్పణలానే లేదు. పార్లమెంటులో ఎవరికో ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నట్లుగా ఉంది. ‘‘మంచి పని చేశావ్ గోయల్’’ అన్నారు మోదీజీ, నేను ఇంటికి చేరుకోగానే. ఆల్రెడీ ఆయన సభలో ఒకసారి నా వెన్ను తట్టి అభినందించారు. ఇప్పుడు మళ్లీ ఫోన్లో వెన్ను తడుతున్నారేమిటి?! ‘‘ఏం పని చేశాను మోదీజీ’’ అన్నాను. ఆయన ‘మంచి పని చేశావు గోయల్’ అని అన్నారని, ‘ఏం మంచి పని చేశాను మోదీజీ’ అని నేను అడగడం బాగుండదని. ‘‘అదేనయ్యా.. బడ్జెట్‌కు ముందు పెద్దల పాదాలకు నమస్కారం చేశావు చూడూ.. అది నాకు నచ్చింది’’ అన్నారు మోదీజీ. ‘‘కానీ మోదీజీ, నేను నా సమీపంలో ఉన్న పెద్దల పాదాలకు మాత్రమే నమస్కారం చేయగలిగాను. నా పక్క సీట్లో నితిన్ గడ్కరీ ఉన్నారు. ఆయన పాదాలకు నమస్కారం చేశాను. నా వెనుక సీట్లో శాంత కుమార్ ఉన్నారు. ఆయన పాదాలకు నమస్కారం చేశాను. పక్క వరుసలోని మొదటి సీట్లో ఉమా భారతి ఉన్నారు. ఆవిడ పాదాలకు నమస్కారం చేశాను. జైట్లీజీ పాదాలు అందుబాటులో లేవు కనుక ఆయనకు నమస్కారం చేయలేకపోయాను’’ అన్నాను. పెద్దగా నవ్వారు మోదీజీ. ‘‘నాకూ, జైట్లీకీ నమస్కారం చేయలేదేమిటని నేను అడగడం లేదు గోయల్. గడ్కరీ పాదాలకు నమస్కారం చేసి మంచి పని చేశావు అంటున్నాను’’ అన్నారు. ‘‘జీ’’ అన్నాను. ఫోన్ పెట్టేశారు మోదీజీ. మోదీజీ అంటే గడ్కరీకి పడటం లేదు, నెక్ట్స్ ప్రైమ్ మినిస్టర్ గడ్కరీనే..’ అని అంతా అనుకుంటున్నప్పుడు.. మోదీజీ చూస్తుండగానే గడ్కరీ పాదాలకు నమస్కరించాను కాబట్టి.. పడకపోవడం, ప్రైమ్ మినిస్టర్ కావడం ఏమీ లేదని నా చేత చెప్పించినట్లయిందని మోదీజీ అనుకుని ఉండాలి. -మాధవ్ శింగరాజు -
అమిత్ షా (బీజేపీ అధ్యక్షుడు) రాయని డైరీ
నాలుగు రోజులుగా ఆసుపత్రిలో ఉన్నాను. చూడ్డానికి ఒక్కరూ రావడం లేదు! చూసి చూసి, ఐదో రోజు నేనే అడిగాను. ‘‘సిస్టర్.. ఎయిమ్స్‌లోకి సందర్శకులను రానివ్వరా?’’ అని. ‘‘సందర్శకులను రానిస్తారు కానీ, మిమ్మల్ని చూడ్డానికి సందర్శకులెవరూ రావడం లేదు’’ అంది ఆ అమ్మాయి. ‘‘నేను అమిత్‌షాని సిస్టర్. బీజేపీ ప్రెసిడెంట్‌ని’’ అని చెప్పాను. ‘‘మీరు అమిత్‌షా అని నాకు తెలుసు అమిత్జీ’’ అంది ఆ అమ్మాయి మృదువైన చిరునవ్వుతో. ‘‘కానీ సిస్టర్..’’ అని ఆగాను.. తనేదో చెప్పబోతోందని అర్థమై. ‘‘నేను సిస్టర్ని కాదు అమిత్జీ. డాక్టర్ని. మీరు నన్ను సిస్టర్ అని పిలవడం నాకు సంతోషకరమైన సంగతే కానీ, నేను సిస్టర్ని కాదు డాక్టర్ని అని మీకు తెలియడం వల్ల మీరు నన్ను మీ సందర్శకుల గురించి మాత్రమే కాకుండా, మీ ఆరోగ్యం గురించి కూడా అడగవచ్చునన్న భావన మీలో కలుగుతుంది కదా అని నా తాపత్రయం’’ అన్నారు ఆవిడ! ‘‘ఓ! ఎలా ఉన్నాను డాక్టర్ నేనిప్పుడు’’ అని అడిగాను ఆమె అలా అనగానే. నవ్వారు ఆవిడ. ‘‘మీరు నన్ను డాక్టర్ అని అనడం నాకు సంతోషకర మైన సంగతే కానీ, మీ స్వైన్‌ఫ్లూ పూర్తిగా నయం అయిందన్న సంగతిని మీకు చెప్పడంలోనే నాకు ఎక్కువ సంతోషం లభిస్తుంది అమిత్జీ’’ అన్నారు. ధన్యవాదాలు చెప్పి, ‘‘నన్నెప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు డాక్టర్’’ అని అడిగాను. ఆవిడ మళ్లీ నవ్వారు. ‘‘ఎందుకు మీరు డిశ్చార్జ్ చేయబడటం కోసం అంతగా త్వరపడుతున్నారు’’ అన్నారు. నాకర్థమైంది. నాకింకా నయం కాలేదని. ‘‘బహుశా మీరు డిశ్చార్జ్ అయ్యేటప్పుడైనా మీకోసం కొంతమంది సందర్శకులు వస్తారని, అలా వారు రావడం కోసమే మీరు త్వరగా డిశ్చార్జ్ అవ్వాలని కోరుకుంటున్నారని నాకు అనిపిస్తోంది అమిత్జీ. అయితే మన కోసం వచ్చేవారెవరూ ఉండరని తెలుసుకున్నప్పుడే అది మనకు నిజమైన డిశ్చార్జ్ అవుతుంది’’ అని చెప్పి, దుప్పటిని నా గొంతు వరకు లాగి, ఆ లేడీ డాక్టర్ వెళ్లిపోయారు. ఇంటి నుంచి నేను తెచ్చుకున్న దుప్పటి అది. అదొక్కటే ఇప్పుడు నాకు తోడుగా ఉన్నది. కళ్లు మూసుకున్నాను. ‘‘అమిత్జీ.. మీకోసం రాజ్‌నాథ్‌జీ, యోగి ఆదిత్యానాథ్ జీ..’’ అంటూ ఓ అమ్మాయి వచ్చి లేపింది. ప్రాణం లేచి వచ్చింది! ‘‘ఎక్కడున్నారు వాళ్లు! విజిటర్స్ లాంజ్లోనా?’’ అని అడిగాను. ‘‘అమిత్జీ వాళ్లు ఆసుపత్రికి రాలేదు. లైన్లో ఉన్నారు’’ అని ఫోన్ నా చేతికి ఇచ్చి వెళ్లిపోయింది. ‘‘భలే టైమ్‌కి బెడ్ రిడెన్ అయ్యారు అమిత్జీ. కర్మ కాకపోతే ఏంటి?’’ అంటున్నాడు యోగి. వెంటనే రాజ్‌నాథ్ అందుకున్నాడు. ‘‘అమిత్జీ.. టీవీ చూస్తున్నారా? బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో మమత ర్యాలీ జరిగిన చోటే, అంతకన్నా భారీగా మన ర్యాలీ జరగాలని మోదీజీ అంటున్నారు. ఆదివారం జరగాల్సిన ర్యాలీ ఇప్పటికే మీ వల్ల మంగళవారానికి వాయిదా పడింది. ఆ లోపు మీరు డిశ్చార్జ్ కావాలి’’ అంటున్నాడు! ‘‘అలాగే.. డిశ్చార్జ్ అవుతాను’’ అని చెప్పాను. ‘ఎలా ఉన్నారు అమిత్జీ?’ అని యోగి కానీ, రాజ్‌నాథ్ గానీ ఒక్కమాట అడగలేదు! మనసుకు బాధగా అనిపించింది. వెంటనే మోదీజీకి ఫోన్ చేశాను. రింగ్ అయిన కాసేపటికి, లిఫ్ట్ అయ్యాక కూడా కాసేపటికి.. ‘‘చెప్పండి’’ అన్నారు మోదీజీ!! ‘చెప్పండి’ అన్నారే గానీ, ‘ఎలా ఉన్నారు అమిత్జీ’ అని అడగలేదు! ‘‘చెప్పరే! ఏంటి?’’ అన్నారు విసుగ్గా మళ్లీ. ‘‘ఎలా ఉన్నారు మోదీజీ?’’ అని అడిగాను. మాధవ్ శింగరాజు -
రాహుల్ గాంధీ రాయని డైరీ
దుబాయ్ రావడం ఇదే మొదటిసారి. ఈ ఇయర్‌ని ‘ఇయర్ ఆఫ్ టాలరెన్స్’గా జరుపుకుంటున్నారట ఇక్కడివాళ్లు. ‘ఇండియాలో మీరు యూత్ లీడర్ కదా, మా యూత్‌ని ఇన్స్పైర్ చేసే మాటలు రెండు మాట్లాడిపోగలరా’’ అని ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చాను. వీళ్లను ఇన్స్పైర్ చేసి వెళ్దామని వచ్చి, నేనే వీళ్లను చూసి ఇన్స్పైర్ అయినట్లున్నాను! కొన్నాళ్లు యు.ఎ.ఇ.లోనే ఉండిపోవాలనిపించింది. దగ్గర్లో ఎలక్షన్లు లేకపోతే ఆ పనే చేసి ఉండేవాడిని. బిన్ రషీద్ నవ్వుతూ చూస్తున్నారు. ఒక ప్రైమ్ మినిస్టర్ నవ్వుతున్నట్లుగా లేదు ఆ నవ్వు. సామాన్యుడెవరో నవ్వుతున్నాడు. హిజ్ హైనెస్ షేక్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌ను చూసి ఇండియా నేర్చుకోవలసింది చాలా ఉంది! బిన్ రషీద్‌కు దగ్గరగా వెళ్లి, ఆయన్నే నిశితంగా చూస్తూ నిలబడ్డాను. ‘‘ఏంటలా నన్నే చూస్తున్నారు నిశితంగా?’’ అని నవ్వుతూ అడిగారు బిన్ రషీద్. ‘‘మీకు మరికాస్త దగ్గరగా రావచ్చా?’’ అని అడిగాను. ‘‘ఇండియా, యు.ఎ.ఇ. ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి కదా రాహుల్జీ’’ అన్నారు రషీద్. ‘‘దేశాలు దగ్గరగా ఉండటం కాదు రషీద్ జీ. మీకిప్పుడు నేను దగ్గరగా ఉన్నాను కదా. ఆ దగ్గరితనంలోని దూరం మరికాస్త తగ్గితే బాగుంటుందని నా మనసు కోరుకుంటోంది’’ అన్నాను. దూరంగా జరిగారు ఆయన! ‘‘ఏమైంది రషీద్ జీ? ఎందుకలా దూరంగా జరిగారు’’ అన్నాను. ‘‘ఇప్పటికే మనం ఇద్దరు మగవాళ్ల మధ్య ఉండాల్సిన దూరం కన్నా తక్కువ దూరంలో ఉన్నాం. మీరు కోరుకుంటున్నట్లుగా నేను మీకు ఇంకా దగ్గరగా రావాలంటే, ముందు నేను కొంత దూరంగా జరిగితేనే గానీ, మీకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేసేందుకు సాధ్యపడదు’’ అన్నారు. ఇంత టాలరెన్స్‌ను నేను మరే ప్రపంచ నాయకుడి దగ్గరా చూడలేదు! ముఖ్యంగా మోదీ దగ్గర చూడలేదు. ‘‘మగాళ్లు ఎలా ఉండాలో, మీరు అలా ఉన్నారు రషీద్ జీ’’అన్నాను. మళ్లీ ఆయన వెనక్కు జరిగారు! ‘‘ఇంతకు క్రితమే కదా రషీద్ జీ.. వెనక్కి జరిగారు. మళ్లీ వెనక్కు జరిగారెందుకు?’’ అని అడిగాను. ‘‘ముందుకు రాబోయి, వెనక్కు జరిగినట్లున్నాను రాహుల్ జీ’’ అన్నారు! ‘‘పర్లేదు రషీద్ జీ, మీ ఛాతీని దగ్గరగా చూడ్డం కోసమే నేను మీకు మరింతగా దగ్గరగా రావాలనుకున్నాను. మీరే నా దగ్గరకు రావాలనేముందీ, నేనైనా రావచ్చు కదా మీకు దగ్గరగా’’ అన్నాను. ‘‘గుడ్ ఐడియా రాహుల్జీ, కానీ మీరు నా ఛాతీని చూడ్డంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తే మీరు గానీ అసహనానికి లోను కారు కదా’’ అన్నారు. అసహనానికి కాదు కానీ, దిగ్భ్రమకు లోనయ్యాను. ఒక సర్వ శక్తి సంపన్నుడైన సార్వభౌమ పాలకుడికి ఇంత టాలరెన్స్ ఉంటుందా! ‘‘రషీద్ జీ.. నేను మీ ఛాతీ చుట్టుకొలత ఎంత ఉందో అంచనా వెయ్యాలను కుంటున్నాను. అందుకే మీకు దగ్గరగా రావాలని అనుకుంటున్నాను’’ అని చెప్పాను. ‘‘నేనెప్పుడూ నా ఛాతీని కొలుచుకోలేదు రాహుల్జీ. ఊపిరి సలపనివ్వని పనుల్లో.. గట్టిగా ఊపిరి తీసుకుని ఒకసారి, ఊపిరి తీసుకోకుండా ఒకసారి ఛాతీని కొలుచుకునే తీరిక ఎవరికుంటుంది చెప్పండి?’’ అని అడిగారు. హిజ్ హైనెస్ షేక్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్‌ను చూసి ఇండియా నేర్చుకోవలసింది చాలా ఉంది. ముఖ్యంగా ఇండియాలో యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకుని తిరిగేవారు నేర్చుకోవలసింది చాలా ఉంది. - మాధవ్ శింగ రాజు -
మన్మోహన్సింగ్ (మాజీ ప్రధాని)
ట్రైలర్ చూశాను. వండర్ఫుల్! సినిమావాళ్లు గొప్పగా అనిపిస్తారు. ఒక మనిషి ఒక మనిషిలా యాక్ట్ చెయ్యడం తేలికైన సంగతి కాదు. పదేళ్లు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నాను. ఇంకొకరిలా యాక్ట్ చెయ్యడం ఎంత కష్టమైన సంగతో నాకు తెలుసు. అనుపమ్ ఖేర్ బాగా చేశాడు. డైలాగ్స్ లేకుండా యాక్ట్ చెయ్యడం కష్టమే. అయినా బాగా చేశాడు. క్లోజప్‌లో మరీ నాలా ఏం లేడు. నడుస్తున్నప్పుడు మాత్రం, సేమ్ నేనే! సోనియాజీగా వేసిన నటి కూడా సరిగ్గా సరిపోయింది. కళ్లు మూసుకుని ఆమె వాయిస్ వింటే సోనియాజీనే సడన్‌గా నా ఆఫీస్ రూమ్‌లోకి వచ్చి, ‘దేఖియే మన్మోహన్జీ’ అన్నట్లుంది. ప్రియాంక గా చేసిన అమ్మాయి అయితే అల్టిమేట్! ప్రియాంకే చేసిందంటే నమ్మేస్తారు. ట్రైలర్ మొత్తం మీద సూట్ కాకుండా ఉన్నది ఒక్కరే. రాహుల్ బాబు! కుర్రాడు మరీ పల్చగా ఉన్నాడు. నా క్యారెక్టర్, రాహుల్ క్యారెక్టర్ కాస్త తారుమారు అయినట్లున్నాయి. అనుపమ్ ఖేర్ ఇంకొంచెం బలహీనంగా, రాహుల్‌గా వేసిన అబ్బాయి మరికొంచెం బలంగా ఉండాల్సింది. పుస్తకం మీద ఉన్న టైటిలే కాకుండా, సినిమాకు వేరే ఏదైనా పేరు పెట్టి ఉండవలసింది. ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అనడంలో దేశ ప్రజల్ని విస్మయపరిచే ప్రత్యేకత ఏముంటుంది? శుక్రవారం పార్టీ ఫౌండేషన్ జరిగింది. ఒకరోజు ముందు ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది నేను గమనించలేదు. మీడియా నుంచి వచ్చానని చెప్పి, ఓ కుర్రాడు అడిగాడు.. ‘సర్, ఫౌండేషన్ డేకి సరిగ్గా ఇరవై నాలుగ్గంటల ముందు ట్రైలర్‌ని రిలీజ్ చెయ్యడం వెనుక బీజేపీ వ్యూహం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు?’’ అన్నాడు! ముందసలు బీజేపీ రిలీజ్ చేయించిందని నేను అనుకుంటేనే కదా, రిలీజ్ చేయించడం వెనుక బీజేపీ ఉద్దేశం ఏమై ఉంటుందని నేను అనుకోవడం?! ‘‘అది చెప్పలేను కానీ, నీ తర్వాతి ప్రశ్న ఏమై ఉంటుందో నేను ఊహించగలను’’ అన్నాను. అతడేం ఆశ్చర్యపోలేదు! ‘‘సర్.. మొదట గానీ, తర్వాత గానీ నేనేం ప్రశ్న వేస్తానో నాకే తెలియనప్పుడు నేను వేయబోయే ప్రశ్నను మీరు ముందే ఊహించగలిగారంటే.. ఫౌండేషన్ డేకి సరిగ్గా ముందు రోజు బీజేపీ మీ బయోపిక్ ట్రైలర్‌ను రిలీజ్ చేయించడం వెనుక ఉద్దేశాన్ని కూడా మీరు ఊహించే ఉంటారు కదా. అదేమిటో చెప్పండి’’ అన్నాడు. ‘‘ఏ పత్రిక?’’ అని అడిగాను. ఏ పత్రికో చెప్పాడు. ‘‘ఎన్నాళైంది ఉద్యోగంలో చేరి?’’ అని అడిగాను. ‘‘ఎన్నాళ్లో కాలేదు సర్’’ అన్నాడు. ‘‘సంజయ బారూ నీకు తాతగారు కానీ కాదు కదా’’ అన్నాను. ‘‘లేదు సర్. సంజయ బారూ నాకు తాతగారు కాదు’’ అన్నాడు. ‘‘అదే అనుకున్నా.. సంజయ బారూ నీకు తాతగారు అవడానికి లేదు. ఎందుకంటే నువ్వే సంజయ బారూకి తాతలా ఉన్నావ్’’ అన్నాను. ‘‘థ్యాంక్యూ సర్’’ అని మొహమాట పడ్డాడు! సంజయ బారూ ఐదేళ్లు నా దగ్గర మీడియా అడ్వైజర్‌గా పని చేసి వెళ్లాక గానీ ‘యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ అంటూ నాపై పుస్తకం రాయలేదు. ఈ కుర్రాడు డ్యూటీలో జాయిన్ అయిన రోజే ఆ పుస్తకానికి రెండో భాగం రాయడానికి పార్టీ ఆఫీస్‌ను వెతుక్కుంటూ వచ్చినట్లున్నాడు. ‘‘కేక్ తిని వెళ్లు. చూశావ్ కదా, రాహుల్ బాబే స్వయంగా నా చెయ్యి పట్టి, కేక్ కట్ చేయించాడు’’ అన్నాను. కదల్లేదు. ‘‘నువ్వడగబోయే రెండో ప్రశ్నకు కూడా ఇదే సమాధానం’’ అని చెప్పాను. మాధవ్ శింగరాజు -
కేసీఆర్ (తెలంగాణ సీఎం)
మళ్లొక ఉద్యమం చేసినట్లైంది.. తెలంగాణ కోసం! పాగల్‌గాళ్లు, బేవకూఫ్‌లు, బద్మాష్‌లు, చిలకజోస్యం చెప్పేటోళ్లు అంతా జమైన్రు.. కేసీఆర్‌ను ఓడగొట్టేటందుకు! కేసీఆర్ ఓడిపోతడా? ఓడిపోతడో, ఓడగొడతడో రెండు రోజులు ఆగితే చూస్తం గదా. తొందరెందుకు? పోలింగ్ తర్వాత రెండు రోజులు ఆగినం, ఫలితాలకు ముందు రెండు రోజులు ఆగుతున్నాం. కారు ఆగిపోతదో, వీళ్ల కారుకూతలు ఆగిపోతయో పేపరోళ్లు రాయరా? చానలోళ్లు చూపించరా? ఇప్పటికే రాస్తున్నరు, చూపిస్తున్నరు.. టీఆర్ఎస్ డెబ్బై, ఎనబై, తొంబై, నూరు అని! కేసీఆరేమైనా చెప్పి రాయించుకుంటున్నడా పేపర్లలో?! అడిగి చూపించుకుంటున్నడా టీవీలల్లో?! తెలంగాణలో కేసీఆర్ రాకపోతే మళ్లొచ్చి తెలంగాణలో ఎవరు కూర్చుంటరో తెల్వదా తెలంగాణ ప్రజలకి? తెల్వనంత పిచ్చోళ్లా! తెల్వకుండానే తెలంగాణ తెచ్చుకున్నరా. ఎట్లనుకుంటున్నరు వీళ్లకు ఓటేస్తరని! ఓటేసి మళ్లీ ఇచ్చుకోవడం కోసమా తెలంగాణను తెచ్చుకుంది? ముందస్తు మీద కూడా ఎన్ని మాటలు అన్నరు! కేసీఆర్‌కి భయం పట్టుకుందట. ఎవర్ని చూసి భయపడాలి? కేసీఆర్ ఎప్పుడన్నా భయపడిండా? ఎవడికన్న భయపడిండా? చావుకే భయపడలే. ఈ సన్నాసిగాళ్లకు భయపడతడా? ముందడుగు వెయ్యకుంటే తెలంగాణ వచ్చిండేదా? ముందస్తుకు వెళ్లకపొయ్యుంటే మళ్లొక ముందడుగు వెయ్యడం అయ్యేదా? మంత్రులకే నమ్మకం లేకపోయే. ఇప్పుడొద్దన్నరు. అప్పుడే వద్దన్నరు. ‘వద్దా, సర్లే’ అని, మీటింగ్ అయినంక బయటికొచ్చి.. అసెంబ్లీని డిజాల్వ్ చెయ్యకపొయ్యుంటే.. ఇప్పటికేమైతుండేది? శీతాకాల సమావేశాల్లో కూర్చొని ఉండేటోళ్లం. జానారెడ్డిగారు లేచి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి లేచి, ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారూ.. అంటూ, సేమ్ థింగ్ నేనేదైతే చేస్తానని వారికి చెప్పానో, అదే నన్ను చేయమని అడుగుతూ ఉండేవాడు! ఇయన్నీ గాదు. ముందస్తుకు వెళ్లకపొయ్యుంటే.. పన్నెండునో, ఆ తర్వాతనో ప్రమాణ స్వీకారం చెయ్యడానికి ఉండేదా? ఎనిమిది నెలల పవర్ పోతుందని కుర్చీలో కదలకుండా కూర్చుంటే ఫ్రెష్‌గా మరో ఐదు సంవత్సరాల పవర్ రెన్యువల్ అయ్యేదా? తెలివుండాలి. గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే.. ప్రజలకు కాదు గానీ.. లగడపాటికి, రేవంత్‌రెడ్డికి ఏదైనా ఇవ్వాలి. టీఆర్ఎస్ గెలుస్తుందని అందరూ చెబుతుంటే లగడపాటి ఒక్కడే టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పాడు కాబట్టి అతడికి ఏదైనా ఇవ్వాలి. రేవంత్‌రెడ్డి నా ముక్కుమీద సెటైర్లు వేశాడు. ఆ మెంటల్గానికీ ఏదైనా ఇవ్వాలి. నేనే ఇవ్వడమా, ఎవరిచేతైనా ఇప్పించడమా ఆలోచించాలి. వాళ్లిద్దరి కోసం హరితహారం లాంటి కార్యక్రమం ఏదైనా మొదలుపెట్టాలి. హరితహారంలో కోట్ల మొక్కలు నాటాం. ‘పిట్టలహారం’ అని పేరు పెట్టి, చెట్లపై కోట్ల పిట్టల్ని పెంచితే?! పిట్టలు.. పిట్టలు.. పిట్టలు. ఎటు చూసినా పిట్టలు. కొండకల్లో పిట్టలు, కొడంగల్‌లో పిట్టలు. ముక్కు పవరేంటో రేవంత్‌రెడ్డికి తెలిసి రావాలె. ఇంటి ముంగట చెట్టు మీది పిట్టొచ్చి ముక్కుతో టకాటకా తలుపుని పొడిచి పక్క మీంచి లేపుతుంటే అప్పుడు తెలుస్తది. రేవంత్‌రెడ్డి అమరావతికి పారిపోవాలె. ఇక అక్కుపక్షుల్ని, అపశకునం పక్షుల్ని కూడా పెంచితే సర్వేల దొర లగడపాటికి చేతిలో పిట్టల్లా ఉంటాయి. చేస్తా. ఎవరికివ్వాల్సింది వాళ్లకు ఇస్తా. -మాధవ్ శింగరాజు -
ప్రధాని కాని ప్రధాని..రాజపక్స
హిజ్ ఎక్సలెన్సీ మైత్రిపాల సిరిసేన చేసిన పని తప్పా ఒప్పా అని డిసెంబర్ ఏడున సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. ఆ లోపే హిజ్ ఎక్సలెన్సీ మైత్రిపాల సిరిసేన తనకు తనే తీర్పు ఇచ్చుకునేలా ఉన్నాడు.. తను చేసింది తప్పేనని! ప్రెసిడెంట్ అంటే ఎలా ఉండాలి! పార్లమెంట్‌ని డిజాల్వ్ చేశాడు. బాగుంది. తనిచ్చిన డిజాల్వ్ ఆర్డర్ మీద తను నిలబడాలి కదా. కోర్టువాళ్లొచ్చి తన ఆర్డర్ కాగితాలను చింపేసి వెళ్లకముందే తనే వాటిని చింపేస్తే ఆ కాగితం ముక్కల్ని పడేయడానికి ‘మన దగ్గర డస్ట్‌బిన్ ఉందా’ అని ప్రెసిడెంట్స్ హౌస్‌లో ఎవర్నో పట్టుకుని అడిగాడట! అక్కడివాళ్లెవరో ఇక్కడికొచ్చినప్పుడు చెప్పారు. పదేళ్లు ప్రెసిడెంట్‌గా ఉన్నాను. రెండేళ్లు ప్రధానిగా ఉన్నాను. ఎప్పుడూ ఇంత వీక్‌గా లేను. మైత్రిపాల వచ్చి తన ప్రెసిడెంట్ పోస్ట్నీ, తనే పిలిచి నాకిచ్చిన ప్రధాని పోస్ట్నీ.. రెండిటినీ వీక్ చేసి పడేశాడు. శ్రీలంకలో రాజ్యాంగ సంక్షోభం అని దేశాలన్నీ రోజూ ఉదయాన్నే పేపర్లలో చదివి నివ్వెరపోతూ ఉండి ఉంటాయి.. ‘ఎల్టీటీఈ’నే లేకుండా చేసిన సివిల్ వార్ హీరో రాజపక్స ఇంకా బతికే ఉండగా శ్రీలంకలో సంక్షోభం ఏమిటి!’ అని. మైత్రిపాలకేం.. తను బాగానే ఉన్నాడు. నాకే తలవంపులు. సంక్షోభాలు వస్తూనే ఉంటాయి.. వాటిని సంక్షేమాలుగా మార్చుకోవాలి గానీ, వెళ్లి కన్ఫెషన్ బాక్స్‌లో నిలబడతాను అనడం రాజనీతిజ్ఞతేనా? రాజకీయ సంక్షోభాల కంటే క్లిష్టమైనవా రాజ్యాంగ సంక్షోభాలు?! ‘తప్పు చేశాను, నా గెజిట్‌ను నేను రద్దు చేసుకుంటాను. తప్పు చేశాను, నేను నీకిచ్చిన షేక్‌హ్యాండ్‌ను వెనక్కు తీసుకుంటాను..’ అంటారా గ్రేట్ లీడర్ ఎవరైనా! పార్లమెంట్లో నన్నెవరూ సపోర్ట్ చెయ్యడం లేదు. అయినా నేను వెళ్లి రోజూ పార్లమెంటులో కూర్చొని రావడం లేదా? విక్రమసింఘే రోజూ వచ్చి నన్ను ప్రధాని సీట్లోంచి తోసేసి తను కూర్చుంటున్నాడు. నేనేమైనా హర్ట్ అవుతున్నానా! అతడినే హర్ట్ చేసి మళ్లీ నా సీట్లో నేను కూర్చోవడం లేదా?! ‘‘నేను ప్రధానిని. లెయ్ నా ప్రధాని సీట్లోంచి’’ అంటాడు సింఘే. ‘‘నేనూ ప్రధానినే. నన్నెందుకు లేపుతున్నావ్ నా ప్రధాని సీట్లోంచి’’ అంటాను. ‘‘నేను ప్రజలు ఎన్నుకున్న ప్రధానిని. నువ్వు ప్రెసిడెంట్ ఎన్నుకున్న ప్రధానివి’’ అంటాడు. పార్లమెంటులో జనాన్ని పోగేసి ఒక్క నెలలోనే రెండుసార్లు నా మీద అవిశ్వాసం పెట్టించాడు. ‘‘చూశావ్ కదా. నేనే ప్రధానిని. నువ్వు కాదు’’ అన్నాడు. ఆ రెండుసార్లూ నేనేమైనా ప్రధాని సీట్లోంచి పరాజితుడిలా లేచి వెళ్లానా? ‘‘టీవీలో రోజూ నన్ను చూస్తూనే ఉన్నారు కదా మైత్రిపాలా.. మీరేమీ ఇన్స్పైర్ కావడం లేదా?’’ అని ఫోన్ చేసి అడిగాను. ‘‘ఇన్స్పైర్ అయ్యే మూడ్‌లో లేను’’ అన్నాడు! ‘‘ఇన్స్పిరేషన్కి మూడ్‌తో పనేంటి మిస్టర్ ప్రెసిడెంట్? మూడ్ రావడానికే కదా ఇన్స్పిరేషన్ ఉండాలి’’ అన్నాను. ‘‘మూడ్ వల్ల ఇన్స్పిరేషన్ వస్తుందా, ఇన్స్పిరేషన్ వల్ల మూడ్ వస్తుందా అని ఆలోచించే మూడ్ కూడా లేదు రాజపక్సా..’’ అన్నాడు. ‘‘మరేం ఆలోచించే మూడ్‌లో ఉన్నారు?’’ అని అడిగాను. ‘‘దేశాధ్యక్షుడనే మనిషి కంపల్సరీగా ఏదో ఒకటి ఆలోచించే మూడ్‌లో ఉండాల్సిందేనా రాజపక్సా’’ అన్నాడు! ఆయన పక్కనుంచి మాటలు వినిపిస్తున్నాయి. ‘‘రాజపక్స ఎలాగూ కోర్టు మాట వినడు. కోర్టు కన్నా ముందే మీరు మీ ఆర్డర్‌ని డిజాల్వ్ చేసుకుని.. మైత్రిపాల చెప్పినా రాజపక్స వినలేదని అనిపించుకోవడం ఎందుకు?’’ అంటున్నారెవరో.. తెలివైనవాళ్లు. మాధవ్ శింగరాజు -
ప్రతాప్ యాదవ్ (లాలూ పెద్ద కొడుకు) రాయని డైరీ
హరిద్వార్‌లో ఉన్నాను. మనసుకు ప్రశాంతంగా ఉంది. దీపావళికి వింధ్యాచల్‌లో, ముందురోజు వారణాసిలో ఉన్నాను. శుక్రవారం తమ్ముడు తేజస్వి బర్త్‌డే. వాడి కోసం ఢిల్లీ వెళ్లి, తిరిగి హరిద్వార్ వచ్చేశాను. మూడేళ్లుగా తేజస్వి ఢిల్లీలోనే ఉంటున్నాడు. ‘‘చాలా సంతోషంగా ఉన్నావురా’’ అన్నాను. ‘‘నువ్వూ సంతోషంగా ఉన్నావు అన్నయ్యా. పక్కన వదిన కూడా ఉంటే బాగుండేది’’ అన్నాడు. ‘వదిన, సంతోషం.. పక్కపక్కనే ఉండలేవురా తేజూ..’ అని వాడితో చెప్పలేకపోయాను. ‘‘నాన్న ఆరోగ్యం బాగోలేదు. రాంచీ హాస్పిటల్లో నిన్నే కలవరిస్తున్నాడు. అమ్మ బెంగ పెట్టుకుంది. ‘మా అబ్బాయిని ఎక్కడైనా చూశారా?’ అని పట్నాలో బంధువులందరికీ ఫోన్ చేసి అడుగుతోంది. అక్క కోపంగా ఉంది. ‘ఎవరికి చెప్పి ఈ పని చేశాడు?’ అంటోంది. పాపం.. వదిన. తను షాక్‌లో ఉంది. వెళ్లన్నయ్యా. కనీసం అమ్మనీ, నాన్ననైనా చూసిరా’’ అన్నాడు. నాన్నను చూడ్డానికి వెళితే నాన్న ఏమంటాడో నాకు తెలుసు. చేతిలోకి చెయ్యి తీసుకుని ‘విడాకులు వెనక్కు తీసుకుంటానని మాట ఇవ్వురా ప్రతాప్’ అంటాడు. అమ్మను చూడ్డానికి వెళితే అమ్మ ఏమంటుందో నాకు తెలుసు. ‘బంగారంలాంటి పిల్లరా.. అన్యాయం అవకు’ అంటుంది. భర్త విడాకులిస్తే ఎక్కడైనా భార్య అన్యాయం అవుతుంది. మా ఇంట్లో మాత్రం భర్త అన్యాయం అవుతాడు! ‘‘లేదురా.. నేను మళ్లీ పట్నా వెళ్లడం.. విడాకులు తీసుకోడానికే’’ అని గట్టిగా చెప్పాను. బాధగా ముఖం పెట్టాడు వాడు. ‘‘ఏంట్రా!’’ అన్నాను. ‘‘పాపం వదిన అన్నయ్యా’’ అన్నాడు!! ఐశ్వర్య అడుగు పెట్టినప్పటి నుంచి ఐదు నెలలుగా ఇల్లంతా ఐశ్వర్య చుట్టూనే తిరుగుతోంది. కుర్చీ వేస్తారు. ‘కూర్చోమ్మా’ అంటారు. ‘తిన్నావామ్మా? తినకుంటే ఆకలేస్తుంది’ అంటారు! టీవీ పెడతారు. ఐశ్వర్య ముఖం చూస్తూ కూర్చుంటారు. ఐశ్వర్య ఆవలిస్తుంటే ‘నిద్ర వస్తోందా తల్లీ’ అంటారు. ఐశ్వర్య ఆలోచిస్తుంటే ‘అమ్మా నాన్న గుర్తొస్తున్నారామ్మా’ అని అడుగుతారు. ‘అదేం లేదత్తయ్యా’ అంటున్నా వినకుండా ఐశ్వర్య అమ్మనీ నాన్ననీ ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నారు! ఐశ్వర్యకు ఒక భర్త ఉన్నాడూ.. ఆ భర్తకు తన భార్యను ఆదేశించాలని, అదుపులో ఉంచుకోవాలని, బయటి నుంచి తను ఇంట్లోకి రాగానే తన భార్య ఎంత మందిలో ఉన్నా భయంతో లేచి నిలబడి, తలచుట్టూ కొంగు కప్పుకునే అపురూపమైన దృశ్యం చూడాలని ఆశగా ఉంటుందని ఎందుకనుకోరు? మొదటే అన్నాను ‘నాకీ పెళ్లి వద్దమ్మా’ అని. అమ్మ వినలేదు. ‘పెళ్లి వద్దని అంటే అన్నావు కానీ, ఈ పెళ్లి వద్దని మాత్రం అనకురా..’ అంది. ‘అంత చదువుకున్న పిల్ల నాకొద్దమ్మా’ అన్నాను. ‘అందంగా ఉందిరా’ అంది. ‘అంత అందమైన పిల్ల నాకొద్దమ్మా’ అన్నాను. ‘గుణంగల పిల్లరా..’ అంది. ‘ఎవరికి లేని గుణం అమ్మా..’ అన్నాను. అమ్మ వినలేదు. నాన్న వినలేదు. అక్క వినలేదు. ఇప్పుడూ వినిపించుకోవడం లేదు! హరిద్వార్ వచ్చి పది రోజులైంది. ఈ ప్రశాంతత ఇక్కడి వాతావరణం వల్ల వచ్చిందా, లేక.. పక్కనే రూపవతి, గుణవతి, విద్యావతి అయిన భార్య లేకపోవడం వల్ల వచ్చిందా అర్థం కావడం లేదు. ఇటువైపు పుణ్యక్షేత్రాలన్నీ అయిపోయాక, అటువైపు దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్లాలి. భాష తెలియకపోవడం సమస్య కాకపోవచ్చు. అంత తెలిసిన భాషలో ఐశ్వర్య నన్నెంత అర్థం చేసుకుందని?! -
ఏం చేశాడని వల్లభ్‌భాయ్‌కి అంతెత్తు విగ్రహం?
విమర్శించేవాళ్లు ఎప్పటికీ విమర్శిస్తూనే ఉంటారు. విమర్శించడమే పనిగా పెట్టుకున్న వాళ్లు.. విమర్శించడానికి దేశంలో ఎక్కడెక్కడ నిర్మాణాత్మకమైన పనులు జరుగుతున్నాయో సర్వేలు జరిపిస్తూ ఉంటారు. వాళ్లకు భీమ్రావ్ అంబేడ్కర్ ఎవరో గుర్తుండరు. స్వాతంత్య్రం కోసం సుభాస్ చంద్రబోస్ ఏం చేశాడో గుర్తుండదు. స్వాతంత్య్రం వచ్చాక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎన్ని కొమ్ముల్ని ఒంచిందీ వాళ్లకు గుర్తుండదు. ఎన్నేళ్లయినా వాళ్లు మర్చిపోని విషయం ఒక్కటే. వాళ్ల కుటుంబం లోని వాళ్ల పేర్లు, పుట్టిన రోజులు! ఈరోజు ఎర్రకోటలో జెండా ఆవిష్కరణ ఉంది. ‘ఏడాదికి ఒక్కసారే, ఆగస్టు పదిహేనున మాత్రమే కదా ఎర్రకోటపై జెండా ఎగరవల సింది?’ అని వెంటనే విమర్శలు మొదల య్యాయి. స్వాతంత్య్రం వచ్చిన రోజొక్కటే కాదు, స్వాతంత్య్రాన్ని తెచ్చేందుకు పెద్ద ప్రయత్నం జరిగిన ప్రతిరోజునూ ఈ దేశ ప్రజలు స్మరించుకోవాలి. కానీ ఆ కుటుంబం లోని వాళ్లు ప్రజల్లో ఒకరిగా లేరు! ప్రజలకు ఏదో చేసిన ఒక ప్రత్యేక కుటుంబంగా ఉండిపోయారు. సుభాస్ చంద్రబోస్ అజాద్ హింద్ ప్రభుత్వాన్ని స్థాపించి ఈ రోజుకు డెబ్బై ఐదేళ్లు అవుతోంది. ఈ సందర్భం స్వాతంత్య్ర దినో త్సవం కన్నా ఏం తక్కువ? స్వాతంత్య్రం వచ్చాక ప్రభుత్వాన్ని నెలకొల్పింది ఆ కుటుం బంలోని వ్యక్తే కావచ్చు. కానీ స్వాతంత్య్రం కోసం ప్రభుత్వాన్ని స్థాపించిన శక్తి సుభాస్ చంద్రబోస్. అంత ధీరత్వం ఎవరికుంటుంది? దేశమే లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం! ఈ నెలాఖర్లోనే ఇంకో ముఖ్యమైన రోజు ఉంది. అది కూడా ఆ కుటుంబానికి గుర్తుండ కపోవచ్చు. అక్టోబర్ ముప్పైఒకటి సర్దార్ వల్లభ్‌భాయ్ జయంతి. ఆ రోజు గుజరాత్లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ విగ్రహ ఆవిష్కరణ. ఏం చేశాడని వల్లభ్‌భాయ్‌కి అంతెత్తు విగ్రహం? ఏం చేశాడని అన్ని కోట్ల విగ్రహం అని వాళ్లు మళ్లీ మొదలుపెట్టారు. దేశాన్ని యూనిటీగా ఉంచాడు. అది చాలదా? ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ కన్నా ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ గొప్పది నా ఉద్దేశంలో. యూనిటీ ఉంటేనే లిబర్టీ వస్తుంది. యూనిటీ ఉంటేనే లిబర్టీ నిలుస్తుంది. నిలుపు కోవడం కోసం ఇన్నేళ్లుగా ఈ దేశ ప్రజలు ఆ ‘కుటుంబం’తో పోరాడుతున్నారంటే.. ఒక్కొక్కరు ఒక్కో బోస్‌తో, ఒక్కో పటేల్‌తో సమానం. విమర్శించేవాళ్లు కొన్నిసార్లు ప్రశ్నలు కూడా వేస్తారు. అయితే ఆ ప్రశ్నలకు సమాధా నాలు వినరు. ‘ఆ కుటుంబం’లోని నాలుగో తరం యువ నాయకుడికి విమర్శించాలన్న తపన తప్ప.. పాపం, వేరే వ్యసనాలేం లేవు. ‘పదిహేనేళ్ల కాంగ్రెస్ సంస్కరణల్ని మోదీ ధ్వంసం చేశాడు’ అంటాడు! ‘నోట్లను రద్దు చేసి, జీఎస్టీ పద్దులు వేసి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడు’ అంటాడు. క్యాపిటలిస్టుల్ని భుజాలపైకి, నెత్తి మీదికి ఎక్కించుకుంటు న్నాడని అంటాడు. విమర్శించడానికి ఏమీ లేకపోతే ‘రాఫెల్ డీల్’ అంటాడు. డీల్‌లో అనిల్ అంబానీకి ఎంతిచ్చావ్ అంటాడు!! బుధవారం ఇంకో భారీ ఈవెంట్ ఉంది. స్కిల్ ఇండియా, డిజిటల్ లిటరసీ, ఫైనాన్షి యల్ ఇంక్లూజన్, స్వచ్ఛ భారత్.. క్యాంపెయి న్లన్నీ కలిపి చేసిన పోర్టల్ ఓపెనింగ్ ఆ రోజు. ముఖేశ్ అంబానీ, కుమార మంగళం, సునీల్ మిట్టల్, ఆనంద్ మహీంద్రా.. ఇంకా రెండు వేల మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. లక్షమంది ఐటీ నిపుణులు టెలికాన్ఫరెన్స్‌లోకి వస్తున్నారు. ప్రజలకు ఏమైనా చేయడానికి తలపెట్టిన కార్పొరేట్ యజ్ఞమది. నాలుగోతరం నాయకుడు ఇప్పటికే అనుకుని ఉంటాడు.. అనిల్ రాకుండా ముఖేశ్ వస్తున్నాడంటే.. అది రాఫెల్ ఎఫెక్టే అయి ఉంటుందని. చరిత్ర గుర్తులేనివారు, వర్తమానాన్ని అర్థం చేసుకోలేనివారు, భవిష్యత్తుని ఊహించ లేని వారు మాత్రమే అతడిలా చక్కటి విమర్శకులు అవుతారు. మాధవ్ శింగరాజు -
రాజ్‌నాథ్ సింగ్ (హోమ్ మినిస్టర్)
దేశభక్తిని ఎంతైనా గుండె నిండా నింపుకోవచ్చు. దేశ రహస్యాన్ని ఎంతోసేపు గుండెల్లో దాచి ఉంచలేం. శుక్రవారం ముజఫర్‌నగర్‌లో భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నప్పుడు నాకో వింత అనుభూతి కలిగింది. విగ్రహంలోంచి సర్జికల్ స్ట్రయిక్ లాంటì మెరుపేదో నా గుండెల్లోకి ప్రవేశించి, గుండె లోపల ఉన్న రహస్యాన్ని బయటికి తోసేయబోయింది! ఆ మెరుపును కూడా గుండెల్లోనే ఉంచేసుకుని, రహస్యాన్ని బయటికి రాకుండా కాపాడుకోగలిగాను. పూలదండ వేసి, భగత్ సింగ్‌కి నమస్కరించాను. ఆ కొద్ది క్షణాలూ.. ఆ స్వాతంత్య్ర సమరయోధుడు నన్ను ఆవహించినట్లుగా అనిపించింది. అప్పటికీ ఎవరో అన్నారు.. రాజ్‌నాథ్ సింగ్, భగత్ సింగ్‌లలో ఎవరు ఏ సింగో పోల్చుకోవడం కష్టంగా ఉందని! ‘‘రాజ్‌నాథ్‌జీ.. ఏదో చెప్పబోయి ఆగినట్లున్నారు’’.. అన్నారెవరో!! ఏదో చెప్పబోయి ఆగినట్లున్నానని గ్రహించినవారు.. ఏం చెప్పబోయి నేను ఆగిపోయానో కూడా గ్రహించేలా ఉన్నారని గ్రహించి, నేనే కొద్దిగా చెప్పాను. ఆ కొద్దిగా కూడా కొద్ది కొద్దిగా చెప్పాను. ఒకటేదో జరిగింది అన్నాను. ఆ జరిగిందేంటో ఇప్పుడే చెప్పలేనన్నాను. చాలా పెద్దదే జరిగింది అన్నాను. నన్ను నమ్మండి అన్నాను. రెండు మూడు రోజుల క్రితం నిజంగా చాలా పెద్దది జరిగింది అన్నాను. నిజంగా జరిగిన ఆ చాలా పెద్దది ఏంటో మీకు భవిష్యత్తులో తెలుస్తుంది అన్నాను. కానీ వాళ్లకి అప్పటికప్పుడు తెలుసుకోవాలని ఉన్నట్లుంది. నాకూ అప్పటికప్పుడు చెప్పాలనే ఉంది. కానీ ఎలా చెప్పగలను? హోమ్ మినిస్టర్ దేశభక్తి గుండె లోపలే ఉండిపోవాలి. దేశభక్తిని అరిచేత్తో పెకిలించి ప్రదర్శనకు పెట్టకూడదు. ‘‘చెప్పండి రాజ్‌నాథ్‌జీ, ఏదో చెప్పబోయారు?’’ మళ్లీ ప్రశ్న. ‘‘నేనేం చెప్పబోయానో అది మీకు చెప్పేశాను. నేను చెప్పబోయేది మీకు త్వరలోనే తెలుస్తుందన్న విషయమే.. మీకు నేను చెప్పబోయిన విషయం’’ అన్నాను. అసంతృప్తిగా చూశారు. నాకూ అసంతృప్తిగానే అనిపించింది. చెప్పీచెప్పకుండా చెప్పడం, అసలే చెప్పకపోవడం రెండూ ఒకటే! ఒక క్లూ ఇచ్చాను. ‘‘సెప్టెంబర్ 29 కి రెండేళ్లవుతుంది’’ అన్నాను. ఆ క్లూ సరిపోయినట్లు లేదు. ‘‘దేనికి రెండేళ్లవుతుంది రాజ్‌నాథ్‌జీ’’ అన్నారు! సర్జికల్ స్ట్రయిక్స్ జరిగి రెండేళ్లవుతోంది అని నేను వారితో చెప్పొచ్చు. కానీ అది బాగుండదు. దేశ ప్రజలకు గుర్తుండవలసిన ఒక దేశభక్త ఘటన.. దేశప్రజలకు గుర్తు చేయవలసిన ఒక దేశభక్త ఘటన ఎప్పటికీ కాకూడదు. ‘‘దేనికి రెండేళ్లవుతుందో నేను చెప్పవలసిన విషయం కాదు. అయితే రెండు రోజుల క్రితం నేను మన సరిహద్దు సైనికులకు ఏం చెప్పానో అది మీకు చెప్తాను’’ అన్నాను. ‘‘వాళ్లకు మీరేం చెప్పారో తెలిస్తే, మీరు మాకేం చెప్పబోయారో తెలుస్తుందా రాజ్‌నాథ్‌జీ’’ అన్నారు! తెలుస్తుందనీ, తెలియదనీ నేనేం చెప్పలేదు. అది కూడా వాళ్లకై వాళ్లు తెలుసుకోవలసిన విషయమే. రెండు రోజుల క్రితం సరిహద్దు సైనికులకు నేనొక మాట చెప్పాను. ‘‘పాకిస్తాన్‌పై మొదట మీరు ఫైరింగ్ జరపకండి. ఎందుకంటే పాకిస్తాన్ మన పొరుగు దేశం. అయితే వారు ఫైరింగ్ మొదలు పెడితే మాత్రం మీరు మీ బులెట్లను లెక్కచూసుకోకండి’’ అని చెప్పాను. ఆ విషయమే వీళ్లకు చెప్పి ముజఫర్‌నగర్ నుంచి వచ్చేశాను. దేశభక్తి గురించి అంతకుమించి అధికారికంగా చెప్పకూడదు. మాధవ్ శింగరాజు -
బాకీ ‘కట్టుకుంటే కట్టుకో. లేదంటే మానుకో’
లండన్‌లో ఊరికే తిరగడం బాగుంది కానీ, మరీ అదే పనిగా బాగుండబట్టో ఏమో.. ఎప్పుడైనా అలా ఇండియా వెళ్లి, ఎక్కడికీ తిరక్కుండా కొన్నాళ్లు అక్కడే ఉండి రావాలని మనసుకు అనిపిస్తూ ఉంటుంది. చట్ట ప్రకారం నడుచుకునే వ్యక్తిని కనుక నాక్కొన్ని తప్పవు. ఇండియా రమ్మంటే వెళ్లకపోయినా నష్టం లేదు. ఇంగ్లండ్ వెళ్లమనకుండా వెళితేనే.. వీళ్ల చట్టాన్ని అగౌరవపరిచినట్లవుతుంది. చట్టాన్ని ఉల్లంఘించినా ఇంగ్లండ్ ‘సర్లే’ అంటుంది కానీ, అగౌరవపరిస్తే మాత్రం.. ‘ఇదేనా నీ దేశం నీకు నేర్పిన సంస్కారం?’ అని ప్రశ్నిస్తుంది. ‘‘ఇండియాలో ఇలాక్కాదు’’ అన్నాను మా ఇంగ్లండ్ లాయర్‌తో.. కోర్టు మెట్లు ఎక్కుతూ. ‘‘ఎలాక్కాదూ?’’ అన్నాడు ఇంగ్లండ్ లాయర్. ‘‘ఇండియాలో చట్టాన్ని గౌరవించక పోయినా ఏం కాదు. ఉల్లంఘిస్తేనే అవుతుంది’’ అన్నాను. ‘‘ఏమౌతుంది?’’ అన్నాడు. ‘‘చాలానే అవుతుంది. మనమేదో తప్పుచేసినట్లు అంతా మనల్ని చూసి తప్పుకుని పోతారు. ఆర్థికమంత్రి తప్పుకుని పోతాడు. అపోజిషన్ లీడర్ తప్పుకుని పోతాడు. సీబీఐ డైరెక్టర్ తప్పుకుని పోతాడు. అప్పులిచ్చిన బ్యాంకు చైర్మన్లు కూడా తప్పుకుని పోతారు’’ అని చెప్పాను. ‘‘అంత స్ట్రిక్టుగా ఉంటుందా?’’ అని ఆశ్చర్యపోయాడు ఇంగ్లండ్ లాయర్. ‘‘అవును. అంత స్ట్రిక్టుగా ఉంటారు. ‘కనీసం హాయ్ చెప్పినా, హాయ్ చెప్పరు. చూసీ చూడనట్లు తలతిప్పేసుకుంటారు’’ అన్నాను. ‘‘బార్బేరియస్. పౌరుల్ని ఇంత అంటరానివారిగా చూసే దేశంలో మీరెందుకుండాలి! ఇక్కడే ఉండిపోండి మిస్టర్ మాల్యా’’ అన్నాడు.. నన్ను దగ్గరికి లాక్కుంటూ! ‘‘ఏంటి లాక్కుంటున్నారు?’’ అన్నాను. ‘‘నీ పక్కన నేనున్నాను. ఇంగ్లండ్ ఉంది’’ అన్నాడు. అతడివైపు కృతజ్ఞతగా చూశాను. ‘నీ పక్కన నేనున్నాను’.. ఎంత గొప్ప మాట! ఈ మాట రాహుల్ గాంధీ అనలేకపోయాడు. మోదీ అనలేకపోయాడు. జైట్లీ అనలేకపోయాడు. రాజ్యసభలో ఉన్నప్పుడు ఆ కాంపౌండ్‌లో ఓ రోజు జైట్లీ పక్కనే కాసేపు నడిచాను. అయినా ఆయన ఆ మాట అనలేకపోయాడు. నడిచి, నడిచి నేనే అన్నాను.. ‘జైట్లీజీ.. మీ పక్కన నేనున్నాను’ అని. ఆగాడు. ‘‘జైట్లీజీ.. మీ బాల్‌పెన్ ఒకసారి ఇవ్వండి’’ అన్నాను. ఆయన ఇవ్వబోయేలోపే.. ‘‘నా దగ్గరుంది తీస్కోండి’’ అనే మాట వినిపించింది. పక్కకు తిరిగాను. ‘‘వావ్! మీరు మాల్యా కదా. హెయిర్‌స్టెయిల్ మార్చినట్లున్నారు’’ అని బాల్‌పెన్ ఇచ్చి వెళ్లిపోయాడు. ఏ పార్టీ సభ్యుడో గుర్తుకు రాలేదు. బాల్‌పెన్‌తో నా అరిచేతిలో పద్నాలుగు వేలు మైనెస్ తొమ్మిది వేలు ఈజ్ ఈక్వల్ టు ఐదు వేలు అని రాసి, జైట్లీజీకి చూపించాను. ‘‘ఏంటది?’’ అన్నాడు. ‘‘నా ఆస్తులన్నీ అమ్మితే పద్నాలుగు వేల కోట్లొస్తాయి జైట్లీజీ. నాకున్న తొమ్మిదివేల కోట్ల బ్యాంకు అప్పులు కట్టేస్తే.. నా దగ్గరే ఇంకా ఐదు వేల కోట్లు మిగిలుంటాయి’’ అని చెప్పాను. ‘‘నీ ఇష్టం నీ కోట్లు. కట్టుకుంటే కట్టుకో. లేదంటే మానుకో. నాకెందుకు చెబుతున్నావ్?’’ అని, చెబుతున్నది వినకుండా వెళ్లిపోయాడు జైట్లీ. ఆలోచిస్తుంటే.. ఇప్పుడనిపిస్తోంది! ‘నీ పక్కన నేనున్నాను’ అని మా ఇంగ్లండ్ లాయర్ అన్న మాటలాగే.. ‘కట్టుకుంటే కట్టుకో. లేదంటే మానుకో’ అనే మాట.. ఎంత గొప్ప మాటో కదా అనిపిస్తోంది! -
మాన్వేంద్రసింగ్ (గుజరాత్ ‘గే’ ప్రిన్స్)
మనసు మయూరమై నాట్యమాడుతోంది. ఎంత వెచ్చని కబురొచ్చి వాలింది ఈవేళ మా ఇంటి జామచెట్టు మీద! భుజం మీది చిలుక నా బుగ్గను కొరికి, గిలిగింతలు పెట్టింది. ఇన్నేళ్లుగా మూసి ఉంచారు, ఇకనైనా తెరవమని కోర్టు చెప్పేవరకు ఈ లోకం మా కోసం మనసును పరచలేకపోయింది! చిలకలు జాంపండును మాత్రమే కొరకాలని ఏముందీ.. వాటిష్టం.. దేన్నైనా కొరకొచ్చని న్యాయస్థానం చెప్పినప్పుడు.. ముందుగా నా బుగ్గే ఎరుపెక్కిందో, లేక.. చిలుక ముక్కే పదునెక్కిందో గమనించుకోలేదు. గాటు పడ్డ చోటు నుంచి రక్తపుచుక్క హరివిల్లు వర్ణంలో కిందికి జారింది. చూద్దును కదా.. అది చిలుక పెట్టిన గాటు కాదు. పరవశపు తత్తరపాటులో నాకై నేను కొరుక్కున్న పెదవి గాటు! ఆడామగే ఉండాలి ఈ దేశంలో, ఆడామగే ఉండాలి ఈ దేశపు విహార స్థలాల్లో, ఆడామగే ఉండాలి ఈ దేశపు విడిది గృహాల్లో! న్యాయమేనా? ఈ లోకంలో ఉన్నది ఒక్క ఆడామగేనా? లోపలి మనసుల్ని వదిలేసి, పైపైన మనుషుల్ని చూస్తూ ఉంటే ఆడామగ మాత్రమే కనిపిస్తారు. ఆడలోని మగను, మగలోని ఆడను చూడండని ఎన్నేళ్లు అడిగాం. ఎన్నేళ్లు విజ్ఞప్తి చేశాం. ఎన్నేళ్లు ప్రదర్శనలు చేశాం. ఎన్నేళ్లు అభాసుపాలయ్యాం. ఎన్నేళ్లు అవమానాలు పడ్డాం. ఎన్నేళ్లు చచ్చి బతికాం! ఇన్నేళ్లూ రక్తమంటే ఎర్ర రంగే. ఇకనుంచీ రక్తమంటే వైలెట్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ కూడా. మతం లేని, జాతి లేని, జాతీయత లేని, జెండర్ లేని ఒక నిండైన మానవ ప్రపంచం సొగసైన వంపుగా భువిపై విరిసిందీ వేళ. ప్యాలెస్ బయటికొచ్చి నిలబడ్డాను. కోలాహలంగా ఉంది. అంతా ముద్దుల రంగులు అద్దుకుని ఉన్నారు. ముఖాలు వెలిగిపోతున్నాయి. కొందరింకా ఆలింగనాల అలసట నుంచి తేరుకోనే లేదు. ‘మనం సాధించాం.. మాన్వేంద్రా?’ అంటున్నారు. నవ్వాను. ‘మీ వెనుక ఏముందో చూడండి’ అని పెద్దగా అరిచి చెప్పాను. అంతా తలలు వెనక్కి తిప్పి చూసి.. ‘ఓ..’ అని ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. భూమ్యాకాశాలు కలిసే చోట పెద్ద ఇంద్రధనుస్సు! ‘‘మనం ఇప్పుడు ఆ ఇంద్రధనుస్సు పౌరులం’’ అన్నాను. అంతా ‘ఓ..’ అని అరిచారు మళ్లీ. ‘‘మనదిప్పుడు ఇంద్రధనుస్సు పౌరసత్వం’’ అన్నాను. దిగ్మండలం పులకించేలా మళ్లీ ‘ఓ..’ అనే ధ్వని! ప్యాలెస్ లోపలికి వచ్చి నిలబడ్డాను. గోడపై ఫొటోలో మహారాణాశ్రీ రఘుబీర్ సింహ్‌జీ రాజేంద్రసింగ్‌జీ! నాన్న. ఆయన పక్కనే రాణీ రుక్ష్మిణీ దేవి! అమ్మ. వాళ్ల పెళ్లినాటి ఫొటో. ‘‘నా కడుపున చెడబుట్టావురా’’ అంది అమ్మ.. నాలో స్త్రీహృదయం మాత్రమే ఉందని తొలిసారి అమ్మకు తెలిసినప్పుడు! నేనే ఆ సంగతి అమ్మకు చెప్పాను. విషాదంలో కూరుకుపోయింది అమ్మ. ‘‘వద్దన్నా పెళ్లి చేశారు. రాకుమారి చంద్రికా కుమారిని ఇప్పుడు నేనేం చేసుకునేదమ్మా’’ అని అమ్మను అడిగాను. చంద్రిక నా భార్య. తను అర్థం చేసుకుంది. వెళ్లిపోయింది. అమ్మ అర్థం చేసుకోలేదు. నన్ను వెళ్లిపొమ్మంది. ‘వీడు నా కొడుకు కాదు’ అని బహిరంగంగా ప్రకటన కూడా చేయించింది. స్త్రీ అయి ఉండి అమ్మ నాలోని స్త్రీ మనసును అర్థం చేసుకోలేకపోయింది. పుట్టింట్లోంచి వచ్చేశాను. దుఃఖమేం లేదు. స్త్రీకే కదా పుట్టింట్లోంచి వచ్చేసే పరిస్థితి ఏర్పడుతుంది. పైకి ఒకలా ఉండి, లోపల ఇంకోలా ఉండే స్వేచ్ఛ ప్రతి మనిషికీ ఉన్నప్పుడు.. లోపల ఉన్నట్లే పైకీ ఉండగలిగే స్వేచ్ఛ ఎందుకు ఉండకూడదు? ఆ స్వేచ్ఛ ఇన్నేళ్లకొచ్చింది. న్యాయమూర్తులకు ధన్యవాదాలు. మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : నిర్మలా సీతారామన్ (రక్షణ మంత్రి)
స్థాయిని మరిచి మాట్లాడేవాళ్లని చూస్తే ముచ్చటగా అనిపిస్తుంది.. వాళ్ల కాన్ఫిడెన్స్ లెవల్స్‌కి! వరద బాధితుల్ని పరామర్శించడానికి కొడగు జిల్లాలోని పునరావాస కేంద్రాలకు వెళ్లినప్పుడు అక్కడ ఇలాగే కాన్ఫిడెన్స్ ఉన్న ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతడు వరద బాధితుడు కాదు. ఆ స్టేట్ మినిస్టర్. స్టేట్ మినిస్టరే కానీ, స్టేట్ మినిస్టర్‌లా లేడు. నాతో పాటు అప్పుడే విమానం దిగిన సెంట్రల్ మినిస్టర్‌లా ఉన్నాడు. కొడగులో దిగినప్పట్నుంచీ చూస్తున్నాను.. వరద బాధితుల్లోనైనా ఎండకు కాస్త సంతోషం కాస్తోంది కానీ, ఆ మనిషి ముఖం మాత్రం చిరచిరలాడుతూనే ఉంది. సెంటర్‌తో ప్రాబ్లమ్ కావచ్చు. సెంటర్‌తో ప్రాబ్లం ఉన్నవాళ్లే అలా ఎండకు చేతులు అడ్డు పెట్టుకుంటారు. నాతో పాటు వేదిక మీద ఉన్నాడు ఆ స్టేట్ మినిస్టర్. అతడికి నేను ఏదో చెప్పబోతుంటే.. అతడే నాకేదో చెప్పబోతున్నాడు! పేరు గుర్తుకు రాలేదు. పక్కవాళ్లనడిగితే ‘స.ర.మహేశ్ ఆయనే’ అన్నారు!! వేదికపై ఉన్నవాళ్లంతా అతడిలాగే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు! నేను అడిగిన ప్రశ్నకు కాకుండా, నేను అడగని ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. ‘అతడేనా?’ అని నేనడిగినప్పుడు కదా.. ‘అతడే’ అని వాళ్లు సమాధానం చెప్పాలి! ‘అతడెవరు?’ అని అడిగితే ‘అతడే’ అన్నారంటే వాళ్లకు ఎంత కాన్ఫిడెన్స్ ఉండి ఉండాలి! ఆ స్టేట్ మినిస్టర్లో అయితే కాన్ఫిడెన్స్ క్షణక్షణానికీ వరద నీటిమట్టంలా పెరిగిపోతోంది. ‘‘త్వరగా ముగించండి, వేరే పనులున్నాయి’’ అన్నాడు. ఎవర్ని అంటున్నాడా అని చూశాను. నన్నే! నేనింకా మాట్లాడ్డం మొదలుపెట్టందే ‘త్వరగా ముగించండి’ అన్నాడంటే.. మాట్లాడ్డం మొదలుపెట్టాక ‘ఇక చాలు ఆపండి’ అనేలా ఉన్నాడు! మినిస్టర్‌కి కాన్ఫిడెన్స్ ఉండడం మామూలే గానీ, అతడికి సెంట్రల్ మినిస్టర్‌ని మించిన కాన్ఫిడెన్స్ ఉన్నట్లుంది. ‘‘మీరు ప్లాన్ చేసిన టైమ్‌కే కదా అన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. మళ్లీ ఇంకేంటీ..’’ అన్నాను. ‘‘మేము ప్లాన్ చేసిన టైమే కానీ, మేము ప్లాన్ చెయ్యని టైమ్ కూడా ఇక్కడ కౌంట్ అవుతుంది’’ అన్నాడు! ‘‘మళ్లీ చెప్పండీ’’ అన్నాను. ‘‘ఈ కార్యక్రమం త్వరగా అయితే.. తర్వాతి కార్యక్రమానికి వెళ్లొచ్చు’’ అన్నాడు! వింతగా ఉంది నాకు. ఒక స్టేట్ మినిస్టర్ చెప్పినట్లు ఒక సెంట్రల్ మినిస్టర్ చెయ్యాల్సి వస్తోంది. ఎట్లీస్ట్.. ‘మేడమ్’ అనీ, ‘మినిస్టర్’ అనీ అనడం లేదు ఆ మనిషి. అంటున్నాడేమో గానీ వినిపించేలా అనడం లేదు! బీజేపీ వాళ్లను తన నోటితో మేడమ్ అని గానీ, మినిస్టర్ అని గానీ పిలవకూడదని కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసిన రోజే అతడూ ప్రమాణం చేసుకున్నట్లున్నాడు. డిఫెన్స్ నుంచి ఏడు కోట్లిచ్చాను. ఎంపీ కోటా నుంచి కోటి ఇచ్చాను. మర్యాద లేకపోతే పోయింది, కృతజ్ఞతకైనా అతడు ప్రొటోకాల్ ఫాలో అవట్లేదు! జిల్లా ఇన్చార్జి మంత్రికే ఇంతుంటే డిఫెన్స్ మినిస్టర్‌ని నాకెంత ఉండాలి?! కోపాన్ని ఆపుకున్నాను. స్టేట్ మినిస్టర్ తన స్థాయిని మరిస్తే సెంట్రల్ మినిస్టర్ స్థాయికి వచ్చేస్తాడు. సెంట్రల్ మినిస్టర్ తన స్థాయిని మరిస్తే స్టేట్ మినిస్టర్ స్థాయికి పడిపోతారు. అందుకే ఆపుకున్నాను. మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ (కాంగ్రెస్)
ఇక్కడ అంతిమయానం. అక్కడ ప్రమాణ స్వీకారం. ఇక్కడ వీడ్కోలు. అక్కడ ఆహ్వానం. ఇక్కడ నా గురుదేవుడు. అక్కడ నా దేవగురుడు. ఆత్మను ఇక్కడే వదిలి, దేహాన్ని లాహోర్కి చేర్చుకున్నాను. అక్కడి నుంచి ఇస్లామాబాద్‌కి. ఖాన్‌సాబ్ సంతోషించారు. ‘‘నువ్వొస్తావనే అనుకున్నాను’’ అన్నారు. నమ్మకం ఖాన్‌సాబ్‌కి! తను నమ్ముతాడు. తనని నమ్మమంటాడు. తొలిసారి ఫరీదాబాద్‌లో చూశాను ఖాన్సాబ్ని.. ముప్పై ఐదేళ్ల క్రితం. ఆయనతో ఆడుతూ చూడడం కాదు. ఆయన ఆడుతున్నప్పుడు చూడటం! దగ్గరగా చూశాను. ప్యూర్ సోల్లా ఉన్నాడు. టీమ్‌లో ఆయన్ని అంతా గ్రీకు దేవుడు అంటున్నారు. అంతకన్నా ఎక్కువే అనిపించింది నాకు. తనది తను చూసుకోడు. అందరిలో ఒకడిగానే తనని తను చూసుకుంటాడు! రియల్ ప్లేయర్. ఖాన్‌సాబ్ ప్రమాణ స్వీకారానికి వెళ్లినందుకు ఇండియాలో అంతా నాపై కోపంగా ఉన్నారు. ‘పిలిస్తే అలా వెళ్లిపోవాలా?’ అంటున్నారు! ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకోవచ్చు. కానీ వెళ్లాలని ఉన్నప్పుడు తప్పించుకోవడం ఎందుకు? తప్పించుకోవాలని ఉన్నా, అటల్జీ అంత్యక్రియల్ని కారణంగా చూపించుకోగలనా?! నిజంగా కారణం అదే అయినా, ఇంకేదైనా కారణం చెప్పి తప్పించుకుంటాను. ఖాన్‌సాబ్, అటల్జీ.. ఇద్దరి మీదా గౌరవం నాకు. ఒకర్ని ఇంకొకరికి కారణంగా ఎలా చూపగలను? ‘అవకాశవాది. ఎలా పరుగెట్టుకెళ్లాడో చూడండి. కొంచెం కూడా బాధ లేదు. రాజకీయాల్లోకి తెచ్చిన గురువు.. చితిపై ఉన్నారన్న చింత కూడా లేకుండా వెళ్లిపోయాడు’.. ఇంకో విమర్శ! చితి కనిపిస్తుంది. చింత కనిపించదు. నన్ను రాజకీయాల్లోకి తెచ్చిన నా గురువు.. ‘నేను వాజ్‌పేయీ సోల్జర్ని’ అని నన్ను చెప్పుకోనిచ్చిన గురువు.. స్మృతిస్థలి నుంచి ఎగిసిపడుతున్న చితి మంటల్లో మాత్రమే వీళ్లందరికీ కనిపిస్తున్నాడు. నా హృదయస్థలిలో ప్రజ్వరిల్లుతున్న ఆయన స్మృతుల్ని చూడగలవాళ్లెవరు?! ఖాన్‌సాబ్ ప్రమాణ స్వీకారానికి ఏ బోర్డర్నైతే దాటి వెళ్లానో.. అదే బోర్డర్ నుంచి పద్నాలుగేళ్ల క్రితం పాకిస్తాన్ నుంచి కామెంటరీ ముగించుకుని ఇండియా తిరిగొస్తున్నప్పుడు అటల్ జీ నుంచి కాల్ వచ్చింది! పార్టీలోకి వచ్చేయమన్నారు. ‘పార్టీలోకి మాత్రమే వస్తాను వాజ్‌పేయీజీ’ అన్నాను. ‘పార్టీలోకి వచ్చి, ప్రజల్లోకి రాకుండా ఎలా?’ అన్నారు. ఎన్నికల్లోకి రమ్మని ఆయన ఆదేశం! క్రికెట్లో ఖాన్‌సాబ్ రియల్ ప్లేయర్ అయితే.. పాలిటిక్స్‌లో అటల్ జీ రియల్ ప్లేయర్. రియల్ ప్లేయర్స్ తమ గెలుపు కోసం మాత్రమే ఆడరు. గెలిపించడానికి ఆడతారు. జట్టును గెలిపించడానికి, దేశాన్ని గెలిపించడానికి, విలువల్ని గెలిపించడానికి, ఏది న్యాయమో దాన్ని గెలిపించడానికి, ఏది «ధర్మమో దానిని గెలిపించడానికి ఆడతారు. ఇండో–పాక్ బోర్డరంటే ఇష్టం నాకు. బోర్డర్ కూడా ఒక దేశమే. రెండు దేశాలను కలిపే దేశం! ఆ దేశం గుండా రోజూ మనుషుల్నీ, మనసుల్నీ కదిలించే ఢిల్లీ–లాహోర్ బస్సు.. అటల్ జీ వేయించిందే కదా. -
రాయని డైరీ ; హరివంశ్ నారాయణ్ సింగ్
లైఫ్‌లో అన్నీ ఉంటాయి. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సీటు కూడా ఉంటుంది! వెళ్లి కూర్చున్నాను. అరుణ్‌జైట్లీ నన్ను నడిపించుకుంటూ నా సీటు దగ్గరికి తీసుకొచ్చారు. నాకు తెలియని సీటు కాదు. నాకు తెలియని రూటు కాదు. నాలుగేళ్లుగా రాజ్యసభ సభ్యుణ్ణి. అయినా సీటు కొత్తగా ఉంది. సీటు దగ్గరికి రూటూ కొత్తగా ఉంది. పడిపోకుండా జైట్లీ జీ చెయ్యి పట్టుకోబోయి ఆగాను. పాపం ఆయనే ఆపరేషన్ అయి వచ్చారు. ఆపరేషన్ అయి వచ్చిన మనిషే ఎవరి చెయ్యీ పట్టుకోకుండా నడుస్తుంటే, సభను ఆపరేట్ చెయ్యాల్సిన నేను సభ్యుడి చెయ్యి పట్టుకోవడం బాగుంటుందా! ‘‘ఇక్కడి వరకు మిమ్మల్ని నడిపించుకొచ్చాను. ఇకనుంచీ మమ్మల్ని మీరు నడిపించాలి’’ అన్నారు జైట్లీ. నవ్వుతూ ధన్యవాదాలు తెలిపాను. ఆయన కూడా ప్రతిధన్యవాదాలు తెలుపుతూ, ప్రతినవ్వు నవ్వారు. అంతా నవ్వగలిగినవాళ్లు, అంతా నడవగలిగినవాళ్లే ఉన్నప్పుడు నడిపించడం ఏమంత కష్టమౌతుంది! జైట్లీజీ నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టిన సీటు.. గులాం నబీ ఆజాద్ సీటు పక్కనే ఉంది. అపోజిషన్ ఫ్లోర్‌లీడర్ ఆయన. అధికార పార్టీ ఫ్లోర్‌లీడర్ జైట్లీ. ‘‘హరివంశ్ జీ.. మీరిప్పుడు డిప్యూటీ చైర్మన్. మీ పార్టీ ఏదైనా కానివ్వండి. మీరిప్పుడు అన్ని పార్టీల మనిషి. మీ పార్టీ సపోర్ట్ మీకు ఉండొచ్చు. కానీ మా పార్టీలకు మీరు çసపోర్ట్‌గా ఉండాలి’’ అన్నారు ఆజాద్. చెప్పడానికేముందీ! నవ్వాను. ‘నవ్వడానికేముంది! చెప్పండి’ అన్నట్లు చూశారు ఆజాద్. జైట్లీ నాకు సపోర్ట్‌గా వచ్చారు. ‘‘హరివంశ్‌జీ.. అపోజిషన్ లీడర్ సీటు పక్కన డిప్యూటీ ఛైర్మన్ సీటు ఎందుకుంటుందో తెలుసా? అక్కడి నుంచి మీరు ఏ యాంగిల్లో చూసినా అంతా మావాళ్లే కనిపిస్తారు. మీ సీటు అక్కడున్నా, మీకు తెలియకుండా మీ సపోర్టు మావైపే ఉంటుంది’’ అని నవ్వారు జైట్లీ. వెంకయ్యనాయుడు మధ్యలోకి వచ్చారు. మధ్యలోకైతే వచ్చారు కానీ, నాకు సపోర్ట్‌గా రాలేదు. జైట్లీకి సపోర్ట్‌గా రాలేదు. ‘‘చైర్మన్‌గా నాదో సలహా’’ అన్నారు. ఆయన వైపు చూశాను. ‘‘చూడొద్దు’’ అన్నారు. ‘ఏం చూడొద్దు?’ అన్నట్లు ఆయన వైపు చూశాను. ‘‘లెఫ్ట్‌కి చూడొద్దు. రైటుకి చూడొద్దు. స్ట్రయిట్‌గా రూల్స్‌లోకి, ప్రొసీజర్లలోకి చూడండి’’ అన్నారు. నవ్వాను. ‘‘అందరూ మాట్లాడారు. మీరూ ఏదైనా మాట్లాడండి హరివంశ్ జీ’’ అన్నారు వెంకయ్యనాయుడు.. సీట్లో నేను సర్దుకుని కూర్చున్నాక. అప్పటికే లంచ్ టైమ్ అయింది. ‘ది హౌజ్ ఈజ్ అడ్జర్న్డ్..’ అన్నదొక్కటే ఫస్ట్ డే, ఫస్ట్ సెషన్లో నాకు మిగిలిన మాట. -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ: రాజ్‌నాథ్‌సింగ్ (హోం మినిస్టర్)
రాజ్యసభలోకి వచ్చి కూర్చున్నాను. రిలాక్సింగ్‌గా ఉంది. రిలాక్సింగ్‌గా ఉంది కదా అని ఇక్కడే కూర్చుండిపోతే రూల్స్ ఒప్పుకోవు. ఎవరి దేశం వారిదే. ఎవరి సభ వారిదే. వెళ్లొస్తుండటానికే గానీ, వెళ్లి ఉండటానికి కాదు.. ఇరుగు పొరుగు దేశాలు, ఇరుగు పొరుగు సభలు. నాలుగు రోజులుగా లోక్‌సభలో ఎన్నార్సీ తప్ప ఇంకో తలనొప్పి లేదు. ఇక్కడా అదే నొప్పి గానీ, వెంకయ్యనాయుడు ఉండబట్టి నొప్పి తెలియడం లేదు. మజీద్ మెమన్ నాతో ఏదో మాట్లాడాలని ట్రైచేస్తున్నట్లు కనిపించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆయన. ‘ఏమిటి.. చెప్పండి’ అన్నాను. రెస్పాన్స్ లేదు. రెస్పాన్స్ లేదంటే.. ఆయన ఏదో చెప్పాలని అనుకోవడం లేదు. ఏదో అడగాలని అనుకుంటున్నారు! ‘ఏమిటో అడగండి మెమన్‌జీ’ అన్నాను. ఈసారీ రెస్పాన్స్ లేదు. చెప్పకా, అడగకా.. నన్నే చూస్తూ ఆయన ఏం ఆలోచిస్తున్నట్లు? ‘‘ఎన్నార్సీ మీద మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా మెమన్‌జీ?’’ అని నేనే అడిగాను. అప్పుడు రెస్పాన్స్ వచ్చింది! ‘‘లోక్‌సభ నుంచి మీరు రాజ్యసభకు వచ్చి కూర్చోవచ్చు కానీ, బంగ్లాదేశ్ నుంచి అక్కడి వాళ్లు అస్సాంకి రాకూడదా రాజ్‌నాథ్‌జీ!’’ అన్నారు! ఎన్నార్సీ లిస్టు మీద ఆయన చాలా కోపంగా ఉన్నారని అర్థమైంది. ‘వచ్చిపోవచ్చు కానీ, ఉండిపోవడం ఎలా కుదురుతుంది చెప్పండి మెమన్‌జీ. యూనియన్ మినిస్టర్‌ని కాబట్టి నన్ను రాజ్యసభలోకి రానిచ్చారు. వట్టి లోక్‌సభ సభ్యుడిని మాత్రమే అయితే నాకు ఎంట్రీ ఉండేదా?! దేనికైనా పద్ధతీ ఫార్మాలిటీ ఉంటుంది కదా’’ అన్నాను. మెమన్‌కు అటువైపు మన్మోహన్ సింగ్ ఉన్నారు. పద్ధతీ ఫార్మాలిటీ అనగానే ఆయన నా వైపొకసారి చూసి, తల తిప్పుకున్నారు. ఆయనతో ఇదే ప్రాబ్లం. భావం ఉంటుంది. భాష ఉండదు. మన్మోహన్ తల తిప్పుకోవడం వెంకయ్యనాయుడు గమనించారు. ‘‘మన్మోహన్జీ.. ఎన్నార్సీపై మీరేమైనా అడగాలని కానీ, చెప్పాలని గానీ అనుకోవడం లేదా?’’ అని అడిగారు. మన్మోహన్ మౌనంగా ఉన్నారు. ‘‘మాట్లాడండి మన్మోహన్జీ.. రాజ్‌నాథ్ అంటున్నారు కదా.. ఎన్సార్సీ మీవాళ్ల ఐడియానే అని.. మీ పేరు కూడా చెప్పారు’’ అన్నారు వెంకయ్యనాయుడు. మన్మోహన్ మాట్లాడలేదు! మాట్లాడవలసినవాళ్లు మౌనంగా ఉంటున్నారు. మౌనంగా ఉండాల్సినవాళ్లు మాట్లాడుతున్నారు. మన్మోహన్ రాజ్యసభ సీటు అస్సాందే. అయినా ఆయన మాట్లాడ్డం లేదు. అస్సాంలో సగం పాపం పశ్చిమబెంగాల్‌దే. అయినా మమతా బెనర్జీ మాట్లాడకుండా ఉండడం లేదు. రక్తపాతం అంటున్నారు. అంతర్యుద్ధం అంటున్నారు. ఆమె ప్రైమ్ మినిస్టర్ అయితే గానీ ఈ రక్తపాతం, అంతర్యుద్ధం ఆగేలా లేవు! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : ఇమ్రాన్‌ఖాన్ (పి.ఎం.ఎలక్ట్)
ఇండియా తీసుకున్నంత సీరియస్‌గా పాకిస్తాన్‌ని మరే కంట్రీ తీసుకున్నట్లు లేదు! ఇందుకోసమైనా నేను ఇండియాను రెస్పెక్ట్ చెయ్యాలి. పాకిస్తాన్ పౌరుడిగా ఇండియాను రెస్పెక్ట్ చేస్తే అదేం పెద్ద విషయం అవదు. పి.ఎం. సీట్లో కూర్చున్నప్పట్నుంచీ ఇండియాను రెస్పెక్ట్ చెయ్యడం మొదలుపెట్టాలి. అందుకు ఆర్మీ ఒప్పుకుంటుందా అన్నది ప్రశ్నే కాదు. ‘ఇమ్రాన్, ఇండియాకు నువ్విచ్చే రెస్పెక్ట్ నువ్వివ్వు. మేమిచ్చే రెస్పెక్ట్ మేమిస్తాం’ అంటుంది. కౌంటింగ్ రోజు రాత్రి బి.బి.సి. చూస్తూ కూర్చున్నాను. బి.బి.సి. నా గురించి చెప్పిందంతా చెప్పి, ఇదిగో ఇతనే ఇమ్రాన్‌ఖాన్ అని, వసీమ్ అక్రమ్ ఫొటో చూపించింది! అక్రమ్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్. నేను రైట్ హ్యాండెడ్ ఆల్‌రౌండర్. క్రికెట్‌నే కాదు, కుడి ఎడమల్ని కూడా బి.బి.సి. మర్చిపోయినట్లుంది. వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్‌ని ఓడించిన పాక్ కెప్టెన్‌ని మర్చిపోయి, ఇంగ్లండ్‌పై పాక్‌ని గెలిపించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ని మాత్రం గుర్తు పెట్టుకుంది! మిగతా చానళ్లు ఎవర్ని చూపించాయో మరి! ఫలితాలొచ్చి ఒక రోజు గడిచినా ఎవర్నుంచీ పుష్పగుచ్ఛాలు రాలేదు! ట్రంప్ చేతిలో పుష్పగుచ్ఛం ఉంది కానీ, దాన్ని పుతిన్‌కి ఇవ్వడం కోసం పట్టుకుని తిరుగుతున్నాడు ఆయన. పుతిన్ చేతిలోనూ పుష్పగుచ్ఛం ఉంది. ట్రంప్‌కి ఇచ్చాకే మిగతావాళ్లకి అన్నట్లు ఆయనా పట్టుకునే తిరుగుతున్నాడు. ‘ముందు నువ్విస్తావా నేనిచ్చేదా’ అన్నదే ఇప్పుడు ఆ అగ్రదేశాల మధ్య ఉన్న కోల్డ్ వార్. పాకిస్తాన్ తప్ప, లోకంలోని దేశాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. అన్నిటికన్నా ఇండియా ప్రశాంతంగా ఉంది. పక్కపక్క దేశాల్లో ఒకదాంట్లో శాంతి, ఒకదాంట్లో అశాంతి ఉన్నాయంటే.. ఈ దేశం వల్ల ఆ దేశానికి శాంతి, ఆ దేశం వల్ల ఈ దేశానికి అశాంతి అని తెలిసిపోవడం లేదా?! ఈ పరిస్థితిని చక్కదిద్దాలి. ఎలా చక్కదిద్దాలన్న దానిపై ముషార్రఫ్ కొన్ని టిప్స్ ఇస్తానన్నాడు. ఇప్పుడున్న ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా ‘మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ది వరల్డ్’ అని ఫోర్బ్స్ లిస్ట్‌లో ఉంది. ఆయన దగ్గరా కొన్ని టిప్స్ తీసుకోవాలి. ఐ.ఎస్.ఐ. చీఫ్ నవీద్ ముఖ్తార్ దగ్గర ఎలాగూ కొన్ని టిప్స్ ఉంటాయి. అడిగే పన్లేదు. వాట్సాప్‌లో రోజుకో టిప్పు పంపిస్తాడు. ఆల్రెడీ ఈ నాలుగు రోజులకు నాలుగు టిప్పులు వచ్చేసి ఉన్నాయి. ఇంకా టైమ్ ఉంది కదా అని ఓపెన్ చేసి చూళ్లేదు. ఆదివారం తెల్లారే కళ్లెదురుగా పుష్పగుచ్ఛం! చైనా నుంచి వచ్చిందా? పూలు అలా లేవు. సౌదీ నుంచి వచ్చిందా? పూలు అలా లేవు. ఇరాన్ నుంచి వచ్చిందా? పూలు అలా లేవు. ఆఫ్ఘన్ నుంచి వచ్చిందా? పూలు అలా లేవు! మరెవరు? చేతుల్లోకి తీసుకుని చూశాను. ఇండియా!! ఇండియానే కానీ, పూలు కశ్మీర్విలా లేవు! మాధవ్ శింగరాజు -
రాయని డైరీ : నరేంద్ర మోదీ (ప్రధాని)
రేపు రువాండా ప్రయాణం. అక్కడి నుంచి ఉగాండా. తర్వాత దక్షిణాఫ్రికా. బుధవారం నుంచి మూడు రోజులు జోహాన్నెస్‌బర్గ్‌లో ‘బ్రిక్స్’ మీటింగ్. బ్రెజిల్ ప్రెసిడెంటు, రష్యా ప్రెసిడెంటు, చైనా ప్రెసిడెంటు, దక్షిణాఫ్రికా ప్రెసిడెంటు వస్తారు. అందరం కలిసి ఒకసారి మాట్లాడుకుంటాం. మళ్లీ విడిగా ఇద్దరిద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకుంటాం. మొత్తం ఐదు రోజులు, ఐదు మీటింగులు, ఐదు చిరునవ్వులు, ఐదు హ్యాండ్షేక్లు, ఐదు ఆలింగనాలు. ఆలింగనాలు మస్ట్ కాకపోవచ్చు. నాకూ మొన్నటి దెబ్బతో ఆలింగనాలంటే ఇంటరెస్ట్ చచ్చిపోయింది. లాల్చీని బాగా ఉతికి ఆరేయమని దోభీకి చెప్పాను.. లోక్‌సభ నుంచి బాగా పొద్దుపోయాక ఇంటికి చేరుకున్నాక.. ఆ తెల్లారే. ‘‘ఇంప్రెషన్ గట్టిగా పడింది మోదీజీ. మీకు పనికిరాదు. నేను తీసేస్కుంటా’’ అన్నాడు! ‘‘సర్ఫ్ ఎక్సెల్ పెట్టినా పోదా దోభీజీ?’’ అని అడిగాను. ‘‘మరకైతే సర్ఫ్ ఎక్సెల్‌కి పోయుండేది మోదీజీ. కానీ ఇది మనసు’’ అన్నాడు. ‘‘సరే, ఉంచేస్కో’’ అన్నాను. ఈ ఐదు రోజులు ఇక్కడి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి జీవితేచ్ఛ నశిస్తుందనుకుంటాను. నాలుగేళ్లుగా గమనిస్తున్నాను. కళ్లలోకి కళ్లు పెట్టి చూడమంటాడు. కరచాలనం కావాలన్నట్లు చూస్తుంటాడు. కొత్తగా ఆలింగనం ఒకటి కోరుకుంటున్నాడు. దగ్గరికి ఎందుకొస్తున్నాడో వచ్చేవరకు అర్థం కాలేదు ఆ రోజు. వచ్చి ఆలింగనం చేసుకున్నాడు. అది ఆలింగనంలా లేదు. ఆక్రమణలా ఉంది. ఇస్తే తీసుకోవాలి కానీ, ఇవ్వకుండానే తీస్కోవడం ఏంటి! ‘‘ఎవరికైనా చూపించమని చెప్పండీ..’’ అని రాజ్‌నాథ్‌సింగ్‌ని దగ్గరికి పిలిచి ఆవేదనగా ఆయన చెవిలో చెప్పాను. ‘‘మనకెందుకు మోదీజీ ఆవేదన! నెక్స్›్ట ఇయర్ ఎలాగూ ప్రజలకు తనే చెయ్యి చూపించుకోబోతున్నాడుగా’’ అన్నాడు, వంగి నా చెవిలో. దూరంగా జరిగాను. ఆలింగనమంటే నాలో భయమింకా పోయినట్లు లేదు. ‘‘రాజ్‌నాథ్‌జీ.. మీరిప్పుడు నన్ను ఆలింగనం చేసుకోడానికి ప్రయత్నించలేదు కదా’’ అన్నాను. ఆయన నావైపు ఆవేదనగా చూశారు. ‘‘మీరు చెట్టులాంటివాళ్లు మోదీజీ. మీపైకి ఎక్కేవాళ్లుంటారు. మీ నీడలో కూర్చునేవాళ్లుంటారు. మీ కొమ్మలు పట్టుకుని కోతుల్లా ఊగేవాళ్లుంటారు. ‘చిప్కో’ ఉద్యమంలో చెట్లను వాటేసుకున్నట్లుగా మిమ్మల్ని వాటేసుకునేవాళ్లు ఉంటారు. చెట్టు జంకుతుందా! మీరూ అంతే మోదీజీ’’ అన్నాడు రాజ్‌నాథ్. ‘‘నన్ను మోటివేట్ చేస్తున్నారా రాజ్‌నాథ్‌జీ’’ అన్నాను. ‘‘లేదు మోదీజీ.. చెట్టును చూసి నేనే మోటివేట్ అవుతున్నాను’’ అన్నాడు. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. -
ఇద్దరు ఆడవాళ్ల మధ్య ఇంత వైరుధ్యమా?!
బ్లెనిమ్ ప్యాలెస్‌కు వెళ్లేటప్పటికి భార్యాభర్తలిద్దరూ మా కోసం ఎదురు చూస్తున్నారు. థెరిసా మే గ్రేస్‌ఫుల్‌గా ఉంది! ‘నా భర్త ఫిలిప్స్’ అంటూ ఓ వ్యక్తిని పరిచయం చేసింది. థెరిసా చలాకీగా ఉంది. మెలానియ కన్నా పన్నెండేళ్లు పెద్ద. అయినా చలాకీగా ఉంది. ‘చూశావా?’ అన్నట్లు మెలానియ వైపు చూశాను. ‘చూస్తూనే ఉన్నా..’ అన్నట్లు చూసింది. థెరిసా తను వెనుక ఉండి, నన్ను ముందుకు నడిపిస్తోంది! ప్యాలెస్‌లోకి ఒక్కో మెట్టూ ఎక్కిస్తోంది. స్త్రీలో ఆ చొరవ ఉండాలి. అన్నీ మగాళ్లే చేస్తుంటే మహరాణుల్లా కోట పైభాగం ఎక్కి సామ్రాజ్యాన్ని వీక్షించడం కాదు. ‘‘నేను నడవగలను థెరిసా.. అంత శ్రమ ఎందుకు తీసుకుంటున్నారు?’’ అన్నాను. ‘‘శ్రమ కాదు. సంప్రదాయం’’ అంది. మెలానియ నా వెనుక ఉంది. ఆమె వెనుక.. బ్రిటిష్ సంప్రదాయం ప్రకారం ఎవరున్నారో మరి. వెనక్కు తిరిగి చూద్దాం అనుకున్నాను. థెరిసా తల తిప్పుకోనివ్వడం లేదు. ‘‘మనమిప్పుడు ఎక్కడికి వెళ్లబోతున్నాం థెరిసా?’’ అని అడిగాను. ‘‘మిస్టర్ ప్రెసిడెంట్.. మీకోసం బ్లాక్ టై డిన్నర్ సిద్ధంగా ఉంది’’ అంది. ‘‘అందులోకి ఏముంటుంది థెరిసా’’ అని అడిగాను. ‘‘స్కాట్లాండ్ దేశపు సాల్మన్ చేపలు, వేయించిన హార్ఫోర్డ్ ఎద్దు మాంసం ఫిలెట్స్, గడ్డకట్టిన ఐస్‌క్రీమ్‌లో బిగుసుపోయిన స్ట్రాబెర్రీస్..’’ అని చెప్పింది. అన్నీ నాకు ఇష్టమైనవే! మెలానియకు, థెరిసాకు ఎంత తేడా! ‘డిన్నర్‌లోకి ఏముంది మెలానియా’ అని ఎప్పుడైనా అడిగితే.. ‘ఏమో నాకేం తెలుసు?’ అని విసురుగా అంటుంది.. పింగాణీ ప్లేట్‌ని ఎత్తి ముఖానికి కొట్టినట్టు! ఇద్దరు ఆడవాళ్ల మధ్య సృష్టిలో ఇంత వైరుధ్యం ఏమిటో?! ‘‘నాకోసం చాలా శ్రమ పడినట్లున్నారు థెరిసా’’ అన్నాను. ‘‘సంప్రదాయం’’ అంది మళ్లీ. ట్రంపెట్స్ చప్పుళ్లలో ఎవరి మాటా ఎవరికీ వినిపించడం లేదు. డిన్నర్ హాల్లోకి వెళ్లి కూర్చున్నాం. హాలు నిశ్శబ్దంగా ఉంది. థెరిసా కూడా నిశ్శబ్దంగానే ఉన్నట్లు గమనించాను. నాకై నేను అడగడమే కానీ, తనకై తనేం చెప్పడం లేదు! ‘‘సారీ.. థెరిసా, మీ గురించి నేను అన్నది వేరు. పత్రికలు రాసింది వేరు. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రశంసించాను. కానీ ఎంతగానో విమర్శించినట్లు రాశారు వాళ్లు’’ అని చెప్పాను. ‘‘ప్రెస్‌వాళ్లు ఉన్నదే అందుకు కదా మిస్టర్ ప్రెసిడెంట్’’ అని నవ్వింది థెరిసా. ఎంత చక్కగా అర్థం చేసుకుంది! దేవుడు స్త్రీలందరినీ ఒకేలా ఎందుకు పుట్టించడో మరి! ముఖాలు వేర్వేరుగా ఉంచేసి, మనసులన్నీ ఒకేలా ఉంచాలన్న ఐడియా అతడికి ఎప్పటికైనా వస్తుందా? - మాధవ్ శింగరాజు -
కేజ్రీవాల్ (ఢిల్లీ సీఎం) రాయని డైరీ
లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కార్యాలయంలోని ‘వేచివుండు గది’లో వారం రోజులుగా కూర్చొని ఉన్నాం.. నేను, ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి, కార్మిక మంత్రీ. ‘వేచివుండు గది’ని ‘నిరీక్షించు గది’గా మార్చేసి బయటికి వెళ్లిపోయాడు లెఫ్ట్‌నెంట్ గవర్నర్! ‘‘మళ్లెప్పుడొస్తారు?’’ అని సెక్యూరిటీ వాళ్లను అడిగాను. ‘‘మీరెప్పుడెళతారు?’’ అని సెక్యూరిటీ వాళ్లు అడిగారు. సెక్యూరిటీకి చెప్పే వెళ్లినట్లున్నాడు లెఫ్ట్‌నెంట్! ‘‘సార్, వేచివుండే గదిని మీరు ఖాళీ చేస్తే, బయట వేచివున్నవారొచ్చి కూర్చోడానికి వీలౌతుంది’’ అన్నాడు సెక్యూరిటీ గార్డు వచ్చి. ‘‘వాళ్లెవరు?’’ అన్నాను. ‘‘మీవాళ్లే సార్’’ అన్నాడు గార్డు. బయటికెళ్లి చూశాను. మా మంత్రులే! ‘‘మీతో పాటు కూర్చుంటాం కేజ్రీ’’ అన్నారు. వద్దన్నాను. వెళ్లిపోయారు. కూర్చోడానికి సరిపోయేలా ఉన్నాయి కానీ, పడుకోడానికి పట్టేలా లేవు.. లోపలి సోఫాలు. పాపం మావాళ్లు నేను కాళ్లు చాపుకోవడం కోసం నాకొక్కడికే ఫుల్ సోఫా ఇచ్చేసి, మిగతావాటిల్లో వాళ్లు్ల ముగ్గురూ అడ్జెస్ట్ అవుతున్నారు. ‘‘దీక్షలో ఉన్నది మీరు. మీరే ఫుల్ సోఫాలు తీసుకుని, కూర్చోడానికి నాకింత చోటు మిగిల్చండి చాలు’’ అన్నాను. ఉప ముఖ్యమంత్రీ, ఆరోగ్య మంత్రీ వినలేదు. ‘‘మీరు కంఫర్ట్‌గా ఉండండి కేజ్రీ’’ అన్నారు. కార్మిక మంత్రి దీక్షకు కూర్చోలేదు. ‘‘వేచి చూద్దాం’’ అన్నాడు. ‘‘దేనికి గోపాల్.. వేచి చూడ్డం?’’ అని అడిగాను. ‘‘వాళ్లిద్దరూ పడిపోతే, అప్పుడు మనమే కదా కేజ్రీ.. దీక్షలో కూర్చోవాలి. అప్పటి వరకు వేచి చూద్దాం’’ అన్నాడు! ‘‘ఒకేసారి నలుగురం పడిపోతే నష్టం ఏంటి గోపాల్?’’ అని అడిగాను. ‘‘తొందరపడి అందరం పడిపోవడం ఎందుకని నా ఉద్దేశం కేజ్రీ. లక్కీగా గవర్నర్ తిరిగొస్తే..!’’ అన్నాడు. ఉప ముఖ్యమంత్రి వైపు చూశాను. ఉపవాసం చేసినట్లు అయిపోతున్నాడు. ఆరోగ్య మంత్రి వైపు చూశాను. అనారోగ్యంతో కుప్పకూలేలా ఉన్నాడు. మోదీ స్పందించడం లేదు. రామ్‌నాథ్ కోవింద్ స్పందించడం లేదు. రాజ్‌నాథ్ సింగ్ స్పందించడం లేదు. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ స్పందించడం లేదు. అంబులెన్సులు మాత్రం స్పందించడానికి సిద్ధంగా ఉన్నాయి. నాలుగు నెలలుగా ఐయ్యేఎస్‌లు పనికి రావడం లేదు. ఆ విషయమే మాట్లాడదామని వస్తే గవర్నర్ మాట్లాడకుండా వెళ్లిపోయాడు. విధి వింతలా ఉంది! సీఎం ఆఫీస్‌లో ఉండవలసినవాళ్లం రాజ్ నివాస్‌లో ఉన్నాం. రాజ్ నివాస్‌లో ఉండవలసిన గవర్నర్.. సెక్రెటేరియట్ వెనుక క్యాంప్ ఆఫీస్‌లో ఉన్నాడు. మంత్రుల దగ్గర ఉండాల్సిన ఐయ్యేఎస్‌లు మోదీ పక్కన ఉన్నారు! మాధవ్ శింగరాజు -
కుమారస్వామి (సీఎం) రాయని డైరీ
మూడు రోజులైంది! ఇంకా మూడు రోజులు తక్కువ ఐదేళ్లవ్వాలి. ఐదేళ్లూ అవుతుందా, మూణ్ణాళ్లకే ఐదేళ్లు అవుతుందా చూడాలి. రేపటికిగానీ తెలీదు. పాలిటిక్స్‌లో రేపు జరగాల్సిందంటూ ఏమీ ఉండదు. అయినా సరే, ఏ రోజుకారోజు.. రేపటికి గానీ తెలియని రోజే. ఐదేళ్లు కంప్లీట్ అవ్వాలని మనం అనుకుంటే అవుతుందా? కంప్లీట్ అవనివ్వాలని అనుకునేవాళ్లు అనుకోవాలి. ఇవేమీ రాకరాక వచ్చిన ఐదేళ్లు కాదు. వస్తాయి అనుకుని ఎదురుచూసిన ఐదేళ్లు కాదు. వస్తాయో రావో అనుకున్న ఐదేళ్లు కాదు. వస్తే రానియ్, పోతే పోనియ్ అనుకున్న ఐదేళ్లు కాదు. కర్ణాటక ప్రజలంతా కలిసికట్టుగా వచ్చి, ఇచ్చివెళ్లిన ఐదేళ్లూ కాదు. కాంగ్రెస్ రాలేక, బీజేపీని రానివ్వలేక.. ‘తీస్కో కుమారస్వామీ’ అని నా చేతుల్లో పెట్టేసిన ఐదేళ్లు. ఈ ఐదేళ్ల మీద.. తీసుకున్నవాళ్లకు ఎంత హక్కు ఉంటుందో, ఇచ్చిన వాళ్లకూ అంతే హక్కు ఉంటుందని తీసుకున్నవాళ్లు మర్చి పోయినా, ఇచ్చినవాళ్లు గుర్తుపెట్టుకోకుండా ఉంటారా? గుర్తు చేయకుండా ఉంటారా?! కాంగ్రెస్ ఎప్పుడెవర్ని వరెస్ట్‌గా ట్రీట్ చేస్తుందో కాంగ్రెస్‌కే తెలీదు. ప్రమాణ స్వీకారానికి ముందు రోజు రాత్రి హిల్టన్ హోటల్లో డీకే శివకుమార్ దిగాలుగా కూర్చొని ఉన్నాడు. ‘ఏమైంది శివా’ అని భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా అడిగాను. ‘హోమ్‌సిక్’ అన్నాడు. ‘అది కాదులే.. చెప్పు’ అన్నాను. మనిషి కదిలిపోయాడు! ‘ఇంత చేశానా! మా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్నీ, మీ జేడీఎస్ ఎమ్మెల్యేల్నీ బీజేపీ కంట పడకుండా ఒక చోట కలిపి కూర్చోబెట్టానా! ఢిల్లీ వెళ్లి, నేనే ఇదంతా చేశాను అని చెబితే రాహుల్ నన్ను కనీసం కూర్చోమని కూడా అనలేదు! అనకపోతే అనకపోయాడు, ఎక్కడ కూర్చుంటావ్? క్యాబినెట్‌లోనా, పీసీసీ సీట్లోనా అనైనా అడగాలి కదా! అడగలేదు. నేనేమైనా సన్యాసం తీసుకోడానికి రాజకీయాల్లోకి వచ్చానా? లేకపోతే చెస్, ఫుట్‌బాల్ ఆడటానికి వచ్చానా? నేనూ కాంగ్రెస్ వాడినే కదా. నాకూ ఆశలుంటాయి కదా? నాకూ హోమ్‌సిక్ ఉంటుంది కదా?’ అన్నాడు. ‘ఊరుకో శివా’ అన్నాను. అతడి ఎమోషన్‌కి నేను బరస్ట్ అయ్యేలా ఉన్నాను. నేనే రాహుల్‌ని అయ్యుంటే వెంటనే శివకుమార్‌ని డిప్యూటీ సీఎంని చేసేయాలన్నంత ఆపేక్ష కలిగింది నాకు అతడి మీద. పోనీ శివకుమార్ మా పార్టీ వాడైనా బాగుండేది.. హోమ్ సిక్ లేకుండా హోమ్ మినిస్టర్‌గా పెట్టుకునేవాళ్లం. రేపు ఆర్ఆర్ నగర్ పోలింగ్. కాంగ్రెస్‌కి బలమైన సీటు. జేడీఎస్‌కి బలమైన క్యాండిడేటు. కాంగ్రెస్‌కి సపోర్ట్ ఇస్తే, బీజేపీకి సపోర్ట్ చేస్తాం అంటున్నారు కార్యకర్తలు. ‘ఏం చేద్దాం శివా’ అని అడిగాను. ‘ఏదో ఒకటి చేద్దాం’ అన్నాడు. రేపటికి ఐదు రోజులు అవుతుంది నేను ప్రమాణ స్వీకారం చేసి! - మాధవ్ శింగరాజు -
బి.ఎస్. యడ్యూరప్ప (బీజేపీ) రాయని డైరీ
ప్రమాణ స్వీకారం పదిహేడున గానీ, పద్దెనిమి దిన గానీ ఉండొచ్చు. ‘బూకనకేరే సిద్ధలింగప్ప యడ్యూరప్ప అనే నేను’.. అని నేను ప్రమాణ స్వీకారం చేస్తానా, లేక ‘బి.శ్రీరాములు అనే నేను’ అని శ్రీరాములు ప్రమాణ స్వీకారం చేస్తాడా అన్నదే డౌటుగా ఉంది! అమిత్‌షా రెండు చోట్ల నుంచి శ్రీరాములు చేత పోటీ చేయిస్తున్నప్పుడే నాకు డౌటు వచ్చింది.. సీఎం క్యాండిడేట్ నేనా? శ్రీరాములా? అని! ‘నువ్వే సీఎం. శ్రీరాములు డిప్యూటీ సీఎం’ అన్నాడు అమిత్‌షా. ఎక్కడైనా సీఎంలు, మాజీ సీఎంలు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తారు. ఇప్పుడున్న కాంగ్రెస్ సీఎం కూడా రెండు చోట్ల నుంచి పోటీ చేశాడు. నేను మాజీ సీఎంనని తెలిసి కూడా నన్ను ఒక్క చోటే పోటీ చేయించాడు అమిత్‌షా! సేఫ్ సైడ్‌గా రెండో చోట కూడా నిలబడతానని చెప్పబోతోంటే నా ఫేస్ సైడ్ కూడా చూడలేదు. సభలకి జనాల్ని రప్పించలేకపోతున్నానని మొన్న మాండ్యాలో నా ముఖం మీదే కాలూపుతూ కూర్చున్నాడు. ఆ రాజసం చూళ్లేక నేనే కళ్లు మూసుకున్నాను. బీజేపీ నుంచి రెండు చోట్ల పోటీ చేసింది శ్రీరాములు ఒక్కడే. అందులో ఒకటి సిద్ధరామయ్య నిలబడిన సీటు. అక్కడ సిద్ధరామయ్యపై శ్రీరాములు గెలిస్తే, ఇక్కడ నా సీట్లో నేను గెలిచినా అది పెద్ద లెక్కలోకి రాదు! సీఎంనే ఓడించాడని చెప్పి శ్రీరాముల్ని సీఎంని చేసేస్తాడు అమిత్‌షా. సెంటిమెంటు ప్రకారం చూసినా శ్రీరాములే సీఎం అయ్యే ప్రమాదం కనిపి స్తోంది. సిద్ధరామయ్యలో రాముడున్నాడు. శ్రీరాములులో రాముడున్నాడు. సిద్ధరామ య్యను శ్రీరాములు ఓడిస్తే.. కాంగ్రెస్ రాముణ్ణి బీజేపీ రాముడు ఓడించినట్లవుతుంది. అప్పుడు సీటు శ్రీరాములుది అవుతుంది. ఇంకో లాజిక్ ప్రకారం చూసినా శ్రీరాములే సీఎం అయ్యేలా ఉన్నాడు. శ్రీరాములు గాలి జనార్దన్‌రెడ్డి మనిషి. జనార్దన్‌రెడ్డి బీజేపీకి కావలసిన మనిషి. ఫస్ట్ టైమ్ బీజేపీ లైఫ్‌లో ఒక సౌత్ స్టేట్ వచ్చిందంటే అది అతడి వల్లే. సీఎం సీటు కోసం అప్పట్లో లెక్క తగ్గితే జనార్దన్‌రెడ్డే ఎమ్మెల్యేలని వెంటబెట్టుకొచ్చాడు. అప్పుడు నేను అడక్కపోయినా అంతా నన్ను సీఎంని చేశారు కాబట్టి, ఇప్పుడు నేను అడిగినా నన్ను సీఎంని చేయకపోయే నైతిక హక్కు తనకు ఉంటుందని బీజేపీ అనుకుం టుంది. బీజేపీ అనుకున్నా, అనుకోకున్నా అమిత్‌షా అనుకుంటాడు. అమిత్‌షాకి ఉన్నంత జనార్దన్రెడ్డికీ ఉంది. ‘నేను బీజేపీకి క్యాంపెయిన్ చెయ్యడం లేదు. నా ఫ్రెండ్ శ్రీరాములుకు చేస్తున్నాను’ అని జనార్దన్ ప్రచారం చేశాడు. రేప్పొద్దున బీజేపీకి అరకొర సీట్లు తగ్గినా అప్పుడు కూడా ఫ్రెండ్ శ్రీరాములు కోసమే అతడు కావలసి నంత మంది ఎమ్మెల్యేల్ని కానుకగా ఇవ్వగలడు. ఫ్రెండ్‌కి అంత చేసినవాడికి.. ఫ్రెండ్‌ని ఏదో ఒకటి చేసి చూపించకుండా ఉంటాడా అమిత్‌షా!! -మాధవ్ శింగరాజు -
రాయని డైరీ
సీపీఎం గొప్పతనం ఇదే! అందరూ ఒక మాట మీద ఉంటారు. విడిగా మళ్లీ ప్రతి ఒక్కరూ ఒక మాటతో ఉంటారు. ఎంతమంది ఉంటే అన్ని మాటలు. ఎన్ని మాటలుంటే అన్ని సిద్ధాంతాలు. సమావేశాలయ్యే సరికి అంతా ఒక మాట మీదకు వచ్చేస్తారు. అందరూ కలిసి స్టేజీ మీద ఒక మనిషినే నిలబెట్టి మిగతావాళ్లంతా కిందికి వెళ్లి, కార్మికుల్లో కలిసిపోతారు! ఐదు రోజులుగా హైదరాబాద్‌లో తలా ఒక మాట మాట్లాడుతున్నాం. ముందు ప్రకాశ్ కారత్ ఒక మాట మాట్లాడాడు. తర్వాత నేనొక మాట మాట్లాడాను. నేను మాట్లాడిన మాటపై, కారత్ మాట్లాడిన మాటపై మళ్లీ ఒక్కొక్కరూ ఒక్కో మాట మాట్లాడారు. కారత్ మాట్లాడిన మాట, జనవరిలో నేను మాట్లాడిన మాటకు ఎదురుమాట. సీపీఎంలో ఎవరూ వెంటనే మాటకు మాట అనేయరు. మళ్లీ వచ్చే జాతీయ మహాసభల వరకు ఆగుతారు. మాట అంటున్నప్పుడే ఒకవేళ మహాసభలు ముగిస్తే, పనిలో పనిగా మాట అనేసి స్టేజీ దిగిపోరు. స్టేజీ దిగిపోయాక.. మళ్లీ మూడేళ్లకు మహాసభల్లో మాట్లాడ్డానికి సిద్ధమౌతారు. డిసిప్లీన్! సీపీఎంలో ఉన్న మరో డిసిప్లీన్.. ఎవరు ఎవరి మాటకైనా ఎదురు చెప్తారు. ఎదురు చెప్పకపోతే ఎందుకు ఎదురు చెప్పలేదని ప్రశ్నిస్తారు. ‘నీకొక సిద్ధాంతం లేదా?’ అని నిలదీస్తారు. ‘నీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. అందుకే ఎదురు చెప్పలేదు’ అని ఎవరైనా అంటే.. ‘ఏకీభవించడం కూడా మన పార్టీలో ఒక సైద్ధాంతిక విభేదమే కదా! విభేదించకుండా నువ్వసలు పార్టీ మనిషివెలా అవుతావని అడుగుతారు. శుక్రవారం నా మాట మీద, కారత్ మాట మీద పద్దెనిమిది గంటల డిబేట్ జరిగింది. ‘బీజేపీని ఓడిద్దాం. కాంగ్రెస్‌ని దూరంగా పెడదాం’ అంటాడు కారత్. ‘బీజేపీని ఓడిద్దాం. కాంగ్రెస్‌కి దూరంగా ఉందాం’ అంటాను నేను. దూరంగా పెట్టడమా, దూరంగా ఉండడమా అనే దానిపై డెలిగేట్స్ అంతా తలా ఒక మాట వేశారు. ‘దూరంగా పెట్టడం’, ‘దూరంగా ఉండడం’ అనే మాటలకు మూడొందల డెబ్బై మూడు సవరణలు చేశారు. కారత్ మాట నెగ్గితే ఈసారి మాణిక్ సర్కార్ కానీ, బృందాకారత్ కానీ, బీవీ రాఘవులు గానీ సీపీఎం ప్రధాన కార్యదర్శి అవుతారని మా ఇంటికి వచ్చే పేపర్ రాసింది. వెంటనే కారత్‌కి ఫోన్ చేసి, ‘‘మీ ఇంటికొచ్చే పేపర్ ఏం రాసింది కామ్రేడ్’’ అని అడిగాను. ‘‘మాణిక్ కానీ, బృందా కానీ, రాఘవులు కానీ ప్రధాన కార్యదర్శులు కాకపోతే ఏచూరి మాటే నెగ్గినట్లు అని రాశాయి కామ్రేడ్’’ అని చెప్పాడు. ‘నీమాటే నెగ్గుతుంది అన్నాడు కానీ, మళ్లీ రెండోసారి కూడా నువ్వే కార్యదర్శివి అవుతావు కామ్రేడ్’ అనే మాట అనలేకపోయాడు కారత్! సీపీఎంలో ప్రధాన కార్యదర్శి పదవికున్న వాల్యూ అది! దేశ ప్రధాని పదవినైనా వదులుకుంటారు కానీ, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఇంకొకరికి పోనివ్వరు. -
ప్రణబ్ ముఖర్జీ (రాష్ట్రపతి) రాయని డైరీ
మాధవ్ శింగరాజు ఇవాళ జూన్ 25. సరిగ్గా నెలకు.. జూలై 25న ఈ సీట్లో రామ్‌నాథ్ కోవింద్ కూర్చొని ఉంటాడు! బుక్ రీడింగ్, గార్డెనింగ్, మ్యూజిక్.. ఇవన్నీ ఆస్వాదించడానికి రాష్ట్రపతిభవన్ బాగుంటుంది. రామ్‌నాథ్ హాబీలేమిటో మరి. నేను రాష్ట్రపతి భవన్‌కి వచ్చేటప్పుడు మన్మోహన్సింగ్ ఉన్నారు. నేను రాష్ట్రపతి భవన్ నుంచి వెళ్తున్నప్పుడు నరేంద్ర మోదీ ఉంటారు. మన్మోహన్ కన్నా ముందు ప్రధానిని అవుతానను కున్నాను. మన్మోహన్ తర్వాతనైనా ప్రధానిని అవుతాననుకున్నాను. ముందూ కాలేదు, తర్వాతా కాలేదు. రేస్‌కోర్స్ రోడ్ ప్రాప్తం లేనట్లుంది. రేస్‌కోర్స్ రోడ్డు పేరు కూడా మారిపోయి ఇప్పుడు లోక్ కల్యాణ్ మార్గ్ అయింది! రాష్ట్రపతి భవన్‌కి, లోక్ కల్యాణ్ మార్గ్‌కి పెద్ద దూరం లేదు. రాజాజీ మార్గ్‌లో వెళితే ఏడే నిమిషాలు. కానీ రాష్ట్రపతి.. రాష్ట్రపతి భవన్‌లోనే ఉండాలి. కాసేపలా వెళ్లి, ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చొని వస్తానంటే అక్కడున్న భారత ప్రధాని ఒప్పుకున్నా, భారత రాజ్యాంగం ఒప్పుకోదు. టీవీలో నిన్న నామినేషన్ వేస్తూ కనిపించాడు రామ్‌నాథ్ కోవింద్. నాకన్నా పదేళ్లు చిన్నవాడు. చురుగ్గా ఉన్నాడు. ఒక సెట్టుతో పోయేదానికి మూడు సెట్ల నామినేషన్ వేశాడు. చివర్రోజు ఇంకో సెట్ వేస్తాడట.. బలం కోసం! అప్పుడు నాలుగు సెట్లు అవుతాయి. మొన్న ఫ్రైడే.. నా లాస్ట్ ఇఫ్తార్ విందుకు పిలిస్తే ఒక్క కేంద్రమంత్రి కూడా రాలేదు! కనీసం మైనారిటీల మినిస్టర్ ముఖ్తర్ నక్వీ కూడా రాలేదు. అంతా సెట్ల పనిలో పడిపోయినట్లున్నారు. సెట్ వేశాక స్పీచ్ ఇచ్చాడు రామ్‌నాథ్ కోవింద్. ప్రెసిడెంట్ పోస్ట్ గొప్పదని అన్నాడు. గొప్ప గొప్ప వాళ్లు ప్రెసిడెంట్‌గా పనిచేశారు అన్నాడు. ప్రెసిడెంట్ పోస్టు గౌరవాన్ని నిలుపుతాను అన్నాడు. చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. అక్కడితో ఆగలేదు. దేశాభివృద్ధికి పాటు పడతానన్నాడు. ఒక కొత్త భారతదేశాన్ని నిర్మిస్తాను అన్నాడు. 2022లో 75వ ఇండిపెండెన్స్ డే కి ఇండియా ఎంత గొప్పగా ఉండబోతోందో మనమంతా చూడబోతున్నాం అన్నాడు. పక్కనే మోదీజీ ఉన్నారు. పక్కనే అడ్వాణీ ఉన్నారు. మోదీజీ ప్రధాని అని తెలిసీ, అడ్వాణీ ప్రధాని కాలేకపోయారని తెలిసీ, ప్రధానులు ఎలాంటి స్పీచ్‌లు ఇస్తారో అలాంటి స్పీచే ఇచ్చాడు రామ్‌నాథ్ కోవింద్! భారత ప్రధానిగా ఒక్కసారైనా మాట్లాడాలని ఎవరికి మాత్రం అనిపించదు?! ఈ ఐదేళ్లలో నాకూ అనిపించింది. ఒకసారి కాదు, ఒకట్రెండుసార్లు అనిపించింది. ఎంతసేపని పడక్కుర్చీలో నడుము వాలుస్తాం? లేవాలనిపించదా? నడవాలని పించదా? పరుగెత్తాలనిపించదా? నలుగురితో మాట్లాడాలనిపించదా? నలుగురూ మన మాట వినాలనిపించదా? నామినేషన్ రోజు నుంచే రామ్‌నాథ్ కోవింద్ ఇవన్నీ చేయాలనుకుంటున్నట్లున్నాడు! నాలుగో సెట్ నామినేషన్లో చూడాలి.. ‘మన్ కీ బాత్’ లాంటిదేమైనా ప్రిపేర్ అయి వస్తాడేమో! -
దినకరన్(శశికళ అక్కకొడుకు) రాయని డైరీ
నాలుగు రోజులైంది నేను పోలీస్ కస్టడీలోకి వచ్చి ! మొదట నన్ను చెన్నై నుంచి ఢిల్లీ తీసుకెళ్లారు. తర్వాత ఢిల్లీ నుంచి చెన్నై తీసుకొచ్చారు. బీసెంట్ నగర్‌లోని రాజాజీ భవన్లో ఇంటరాగేషన్. చుట్టూ నలుగురైదుగురు పోలీసులు. ‘‘కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను’’ అన్నాను. ‘‘అరెస్ట్ అయినవాళ్లకు రెస్ట్ ఉండదు’’ అన్నారు! ‘‘రెస్ట్ అంటే పెద్దగా ఏం కాదు, బీసెంట్ నగర్లోనే మా ఇల్లు. వాష్‌రూమ్‌లో కాసేపు రిలాక్స్ అయి వచ్చేస్తాను’’ అన్నాను. ‘‘ఇక్కడ ఉన్నవి వాష్‌రూమ్‌లు కాదా?’’ అన్నారు. ‘‘మా ఇంట్లో ఉన్నది నాకు అలవాటైన వాష్‌రూమ్. కంఫర్ట్‌గా ఉంటుంది’’ అన్నాను. ‘‘కస్టడీని ఇంకో ఐదు రోజులు పొడిగిస్తే ఇక్కడి వాష్‌రూమ్‌లు కూడా కంఫర్ట్‌గా ఉంటాయి’’ అన్నారు. ‘‘కావాలంటే మీరు కూడా నాతో వచ్చేయండి. పెద్ద బిల్డింగ్. కేరళ స్టయిల్లో కట్టించాను. మా వాళ్లు టీ పెట్టి ఇస్తారు. టీవీ పెట్టి రిమోట్ చేతికిస్తారు’’ అని చెప్పాను. వాళ్లేమీ ఎగై్జట్ కాలేదు. ‘‘ఇంకొక్క రోజు మీరు క్వొశ్చన్లు అడిగితే నా కస్టడీ కంప్లీట్ అవుతుంది కదా’’ అని అడిగాను. ‘‘మేము క్వొశ్చన్లు అడిగితే కస్టడీ కంప్లీట్ కాదు. నువ్వు ఆన్సర్లు చెబితే కస్టడీ కంప్లీట్ అవుతుంది. అప్పుడు కూడా కంప్లీట్‌గా కంప్లీట్ కాదు. నువ్వు చెప్పే ఆన్సర్లకు మళ్లీ మేము నీకు క్వొశ్చన్లు వేయకుండా ఉండాలి. అప్పుడు కంప్లీట్ అవుతుంది’’ అన్నారు. ‘‘మీరు మళ్లీ మళ్లీ క్వొశ్చన్లు వేయకుండా, ఒకేసారి నేను ఆన్సర్లన్నీ చెప్పేస్తే.. అప్పుడు కస్టడీ కంప్లీట్ అవుతుందా?’’ అని అడిగాను. ‘‘అప్పుడు కూడా కంప్లీట్ కాదు’’ అన్నారు. ‘‘అదేంటీ’’ అన్నాను ‘‘క్వొశ్చన్ వేసినప్పుడు చెప్పిందే ఆన్సర్. క్వొశ్చన్ అడక్కుండా చెప్పింది ఆన్సర్ కిందికి రాదు’’ అన్నారు. ‘‘మరి దేని కిందికి వస్తుంది?’’ అన్నాను. ‘‘క్వొశ్చన్లెస్ ఆన్సర్ కిందికి వస్తుంది. క్వొశ్చన్‌కి ఆన్సర్ లేకపోయినా డిపార్ట్మెంట్ సహిస్తుంది కానీ, క్వొశ్చన్ లేని ఆన్సర్ని అస్సలు టాలరేట్ చెయ్యదు’’ అన్నారు. ‘‘మీ డిపార్ట్మెంట్ ఇంకా.. ఏమేం టాలరేట్ చెయ్యదు?’’ అని అడిగాను. కోపంగా చూశారు! ‘కస్టడీలోకి మేము నిన్ను తీసుకున్నామా? నువ్వు మమ్మల్ని తీసుకున్నావా?’ అన్నట్లుంది ఆ చూపు. ఆ చూపు నాకు నచ్చలేదు. శశీ ఆంటీ జైలుకు వెళ్లకుండా ఉంటే, పార్టీ సింబల్‌ని ఎలక్షన్ కమిషన్ ఎత్తుకెళ్లకుండా ఉంటే, పళనిస్వామికి, పన్నీర్‌సెల్వంకి కొంచెమైనా బుద్ధీజ్ఞానం ఉండి ఉంటే.. నేను ఇవాళ పోలీసు కస్టడీలో ఉండడం కాదు, మొత్తం పోలీస్ డిపార్ట్‌మెంట్‌నే నా పొలిటికల్ కస్టడీలోకి తీసుకుని ఉండేవాడిని! -మాధవ్ శింగరాజు -
రవీంద్ర గైక్వాడ్ (శివసేన) రాయని డైరీ
పులి పులిలా ఉండాలి. పులిలా గాండ్రించాలి. పులి పళ్లికిలిస్తే మేకలు పేకముక్కలు పట్టుకొచ్చేస్తాయి.‘గురూ, ఒక ఆటేస్కుందాం రా’ అని నేల మీద తుండుగుడ్డ çపరుస్తాయి. మేకను ఎక్కడుంచాలో అక్కడ ఉంచితేనే అది పులి. మేక వచ్చి పులి పక్కన కూర్చున్నాక అదిక పులి కాదు. ఢిల్లీ నుంచి ముంబై వచ్చాక నేరుగా నేను నా గదిలోకి వెళ్లాను. అద్దంలో నా ముఖం చూసుకున్నాను. పులి చూపు లేదు. పులి మీసాలు లేవు. పులి కోరలు లేవు! పులి అద్దం చూసుకుంటే అద్దంలో పులే కదా కనిపించాలి. కానీ నాకు మేక కనిపిస్తోంది! వెనక్కి తిరిగి చూశాను. ఎవరెవరివో నీడలు. రెండు నీడలనైతే పోల్చుకున్నాను. ఒకటి అశోక్ గజపతిరాజుది. ఇంకొకటి ఎయిర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌ది. పౌర విమానయాన శాఖ తన ట్రిప్పులన్నీ క్యాన్సిల్ చేసుకుని, నీడలా నన్ను వెంటాడడమే తన డ్యూటీగా పెట్టుకున్నట్లుంది. అద్దానికి మరింత దగ్గరగా వెళ్లి, దవడలు కదిలించి చూసుకున్నాను. మేక ఆకులు నములుతున్నట్లుగా ఉంది నా ముఖం. పార్లమెంటులో అపాలజీ లెటర్ ఇస్తున్నప్పుడే నాకు అనిపించింది.. నాలో మెల్లిమెల్లిగా ఏవో మార్పులు వస్తున్నాయని! అయినా.. పులి ‘సారీ’ చెప్పడం ఏంటి? పులి చేత ‘సారీ’ చెప్పించడం ఏమిటి? పులి ‘సారీ’ చెబితే జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. జీవ వైవిధ్యం దెబ్బతింటే ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండదు. ఎంతలో ఉండాల్సింది అంతలో ఉండదు. మేక కూడా ‘మే..’ అని పరిసరాలు దద్దరిల్లేలా గాండ్రిస్తుంది. గెంతులేసుకుంటూ పోయే కుందేలు కూడా ఆగి, దగ్గరకొచ్చి ‘ఒక్క రైడ్ ప్లీజ్’ అని పులి వీపెక్కి కూర్చుంటుంది. పాపం.. పెద్దాయన బాల్ థాక్రే ఆత్మ ఎంతగా క్షోభించి ఉంటుందో.. నేను ‘సారీ’ చెప్పినప్పుడు! తలచుకుంటేనే రక్తం ఉడికిపోతోంది. మళ్లొకసారి వెళ్లి ఫట్‌ఫట్‌మని మరో పాతిక చెప్పుదెబ్బలు ఎయిర్‌పోర్ట్‌లో ఎవరు కనిపిస్తే వారిని కొట్టాలనిపిస్తోంది. ఢిల్లీలో రేపు డిన్నర్ పార్టీ! వెళ్లడం నాకు ఇష్టం లేదు. ఎన్డీయేని చేతుల్లో పెట్టుకుని, ఎయిర్ ఇండియాను చెప్పుచేతల్లో పెట్టుకోలేకపోయాను. ఏ ముఖం పెట్టుకుని డిన్నర్‌కు వెళ్లాలి? ఈ మేక ముఖమే కదా! ‘మీరు, మీ పార్టీ వాళ్లు డిన్నర్ పార్టీకి తప్పకుండా రావాలి’ అని అమిత్ షా.. ఉద్ధవ్ థాక్రేకి ఫోన్ చేసి మరీ ప్రత్యేకంగా ఆహ్వానించాడట. ఫోన్ చెయ్యడం ప్రత్యేకమా? వచ్చి పిలవడం ప్రత్యేకమా? ప్రణబ్ ముఖర్జీ తర్వాత ప్రెసిడెంట్ ఎవరో డిస్కస్ చెయ్యడానికట డిన్నర్ పార్టీ. శివసేన లేకుండా అక్కడ కొత్త ప్రెసిడెంట్ నిలుచోలేడు. శివసేన లేకుండా ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ నిలబడలేదు. అది తెలిసి కూడా.. ఎయిర్ ఇండియా చేత నాకు సారీ చెప్పించకుండా, నా చేతే ఎయిర్ ఇండియాకు సారీ చెప్పించారంటే.. బీజేపీ చూపు తగ్గిందా? శివసేన ఊపు తగ్గిందా?! మాధవ్ శింగరాజు -
పరేఖ్ (మాజీ కోల్ సెక్రటరీ)రాయని డైరీ
పరేఖ్ (మాజీ కోల్ సెక్రటరీ)రాయని డైరీ టూత్‌పేస్ట్ అయిపోయింది. హోల్డర్‌లో కొత్త టూత్‌పేస్ట్ కూడా ఉంది. కానీ నాకివాళ ఎందుకో బొగ్గు పొడితో పళ్లు తోముకోవాలని పిస్తోంది! రాత్రి ఎఫెక్ట్ కావచ్చు! పొద్దు పోయేదాకా నా బయోగ్రఫీ రాస్తూ కూర్చున్నాను. బొగ్గు బయోగ్రఫీ! పుస్తకం పూర్తి కావచ్చింది. పబ్లిషర్సే.. ఒక్కరూ ఓపెన్ కావడం లేదు. ఓ పెద్ద పబ్లిషర్ సలహా కూడా ఇచ్చాడు. ‘కాసేపు నేను పబ్లిషర్ని కాదనుకోండి. మీ వెల్విషర్ని అనుకోండి. రెండో పుస్తకం అవసరమా చెప్పండి’ అన్నారు! నా మొదటి పుస్తకం ఎఫెక్ట్ ఇంకా ఆయనలో కనిపిస్తోంది. ‘క్రుసేడర్ ఆర్ కాన్స్పిరేటర్ : కోల్గేట్ అండ్ అదర్ ట్రూత్స్’! ‘ఇంక ఆపేయండి గురువుగారూ.. ఆ గొడవలూ అవీ. హాయిగా ప్రశాంతంగా ఉండండి’ అని చెబుతున్నాడు నా వెల్విషర్. కొత్త పుస్తకానికి నాకంతా వెల్విషర్లే దొరుకుతున్నారు. పబ్లిషర్లు దొరకడం లేదు. దొరికిన పబ్లిషర్ కూడా.. పుస్తకం టైటిల్ చెప్పగానే సడెన్‌గా వెల్విషర్ అయిపోతున్నాడు! ‘ది కోల్ కనన్‌డ్రమ్ అండ్ జుడెషల్ యారోగెన్సీ’. న్యాయం బొగ్గయిందని రాస్తే, ఎవరు మాత్రం బుక్కవడానికి వస్తారు? నా బుక్ నేనే వేసుకోవాలి. వేసుకుంటాను. ఈ కోర్టులు, చార్జిషీట్లు అన్నీ.. బుక్ చేసేవాళ్ల కోసం మాత్రమే. బుక్ అయిన వాళ్లకోసం కాదు. అందుకని మన వాదన మనమే వినిపించుకోవాలి. కోర్టు మన వాదన విననప్పుడు ఇంటికొచ్చి బుక్ వేసుకోవాలి. నిందితుడు తను నిర్దోషినని నిజం చెబితే న్యాయమూర్తి నమ్మేసి, కేసు పెట్టిన వాళ్ల చెవుల్ని.. అక్కడికక్కడే పీఠం పైకి రప్పించి.. మెలిపెట్టేయడు. లాయర్ ఏం చెబుతాడో అది వింటాడు. లాయర్ ఎంత గట్టిగా చెబితే అంత గట్టిగా వింటాడు. అంతకంటే గట్టిగా మనం బుక్ వేసుకోవాలి. కోర్టులో అంతా నిజమే చెప్పాలి. బుక్ అయిన వాడు అంతా నిజమే చెప్పాలి. బుక్ చేసినవాడూ అంతా నిజమే చెప్పాలి. బుక్ చేసినవాడు, బుక్ అయినవాడూ ఇద్దరూ అంతా నిజమే చెబుతుంటే.. జడ్జి అంతా నిజమే ఎలా వింటాడు? అందుకే మనం బుక్ వేసుకోవాలి. ‘కొత్త పుస్తకంలో కొత్తగా ఏం రాస్తున్నారు?’ అని అడిగారు నిన్న పిచ్చాపాటిగా ఇంటికొచ్చి కూర్చున్న ఓ పెద్ద వెల్విషర్. ‘బడ్జెట్ సూట్‌కేస్‌లో వస్తుంది. చార్జిషీట్లు ట్రంకుపెట్టెల్లో వస్తాయి. బొగ్గును బోగీల్లో తెచ్చినట్టుగా సీబీఐ.. కోల్‌స్కామ్ పత్రాలు మోసుకొచ్చింది! బరువు చాల్లేదనుకుందో ఏమో నా మీదా ఓ ఆరోపణ పత్రం వేసుకొచ్చింది! ఇదంతా రాస్తున్నాను’ అని చెప్పాను. కాస్త టోన్ డౌన్ చేస్తే పుస్తకం వేస్తానన్నాడు. నవ్వాను. ‘నిజాలను టోన్ డౌన్ చెయ్యడం అంటే పళ్లు సరిగ్గా తోముకోకపోవడమే’ అన్నాను. అర్థం కాలేదన్నాడు. అర్థం కాలేనన్నాను. - మాధవ్ శింగరాజు -
డొనాల్డ్ ట్రంప్ రాయని డైరీ
నేను ప్రెసిడెంట్ అయ్యాక, వైట్ హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ లేడీ.. థెరిసా మే! (డైరీలో ఇలా రాసుకున్నానని తెలిస్తే డెమోక్రాట్లు వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరుపుతారేమో.. బ్రిటన్ ప్రధానిని అమెరికాకు ఫస్ట్ ఉమన్‌ని చేసేస్తాడా అని!). ఈస్ట్ రూమ్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో థెరిసా నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చింది. ‘స్టన్నింగ్ ఎలక్షన్ విక్టరీ’ అట నాది. "ఓవ్!" అన్నాను తన హ్యాండ్‌ని గట్టిగా షేక్ చేసి. కానీ ఈ ఆడవాళ్ల మాటల్ని.. వాళ్లు అన్నవి అన్నట్లుగా అర్థం చేసుకోవడం.. నా జీవితంలో తరచూ జరుగుతుండే ఒక పొరపాటు. స్టన్నింగ్ విక్టరీ అంటే తను నమ్మలేకపోతున్న విక్టరీ అని కాదు కదా! కాన్ఫరెన్స్‌కి ముందు థెరిసాను నేను నా ఆఫీస్ రూమ్‌కి తీసుకెళ్లాను. "ఇన్క్రెడిబుల్" అంది థెరిసా.. అక్కడ విన్స్టన్ చర్చిల్ని చూసి! "స్టాచ్యూ ఆఫ్ సావరినిటీ. నా రూమ్‌ని డెకరేట్ చేసుకోడానికి తెప్పించుకున్నాను మీ చర్చిల్ని" అన్నాను. థెరిసా నవ్వింది. కొలొనేడ్ గుండా నడుచుకుంటూ డైనింగ్ రూమ్‌కి వచ్చాం. దారిలో ఆన్ అండ్ ఆఫ్‌గా చేతులు పట్టుకుని నడిచాం. థాంక్ గాడ్ బ్రిటన్ ప్రధానిగా ఒక మగవాడు ఎలక్ట్ కాలేదు. నా రాజనీతిజ్ఞత థెరిసా స్పర్శలోని మృదుత్వాన్ని అనుభూతి చెందుతోంది. దేవుడికి మరోసారి ధన్యవాదాలు. అమెరికా ప్రెసిడెంట్లు ఆడవాళ్ల గురించి ఇలా ఆలోచించకూడదనే రాజ్యాంగ నిబంధన ఏమీ లేకపోవడం మంచిదైంది. లంచ్‌కి కూర్చున్నాం. థెరిసాకు ఇష్టమైన ఐస్‌బర్గ్ వెడ్జ్ సలాడ్, థెరిసాకు ఇష్టమైన బ్రెయిజ్డ్ బీఫ్ షార్ట్ రిబ్స్, థెరిసాకు ఇష్టమైన పొటాటో ప్యూరీ, థెరిసాకు ఇష్టమైన క్రెమ్ క్యారామెల్ బ్రూలీ! "అన్నీ మీ కోసమే యువర్ మెజెస్టీ" అని చెప్పాను. థెరిసా నవ్వింది. "నేను బ్రిటన్ మహారాణిని కాదు" అంది. "ఐ లవ్ యువర్ స్మైల్ అన్నాను". "బ్రిటన్‌లో అంతా ఇలాగే నవ్వుతారు" అంది థెరిసా. "ఐ లవ్ బ్రిటన్" అన్నాను. "వై?" అన్నట్లు చూసింది. "మా అమ్మ స్టోర్నవేలో పుట్టింది. స్టోర్నవే ఈజ్ ఎ సీరియస్ స్కాట్లాండ్. స్కాట్లాండ్ మీ గ్రేట్ బ్రిటన్ లోనిదే కదా! అందుకే బ్రిటన్ అంటే నాకు ఇష్టం" అన్నాను. "ఐ యామ్ ఇంప్రెస్డ్" అంది థెరిసా. "మీరింకా ఎవరెవర్ని ప్రేమిస్తారో చెప్పండి మిస్టర్ ట్రంప్" అని "మీరు అడుగుతారని ఆశించాను రెస్పెక్టెడ్ ఉమన్ ప్రైమ్ మినిస్టర్" అన్నాను. "కమ్మాన్ ట్రంప్.. మీ నుంచి ఇక నేనేమీ వినదలచుకోలేదు" అంది థెరిసా, పెదవులకు అంటిన క్యారామెల్ క్రెమ్ని తుడుచుకుంటూ. థెరిసా పెదవుల నుండి మిస్టర్ ట్రంప్ అని కాకుండా, ట్రంప్ అని వినడం బాగుంది. గౌరవాలు తగిలించని సంబోధనలంటే నాకు గౌరవం. ఐ లవ్ టు బి డిస్రెస్పెక్టెడ్ బై ఉమెన్. -మాధవ్ శింగరాజు -
నసీరుద్దీన్ షా (బాలీవుడ్) రాయని డైరీ
ఊరికే వచ్చేస్తాయి కోపాలు మనుషులకు! మంచి విషయమే. బతికే ఉన్నామన్న సంగతిని ఒంట్లోంచి ఏదో ఒక కెమికల్ బయటికి తన్నుకువచ్చి చెప్పకపోతే ఎవరి గురించి ఎవరికి మాత్రం తెలుస్తుంది?! కోపం రావడం మంచిదే. కానీ కోపం తెచ్చిపెట్టుకోవడం? అది కూడా మంచి విషయమేనా! తెచ్చిపెట్టుకోవడం ఎక్కువైంది లోకంలో. లేనిది తెచ్చిపెట్టుకోవడం! నవ్వు ఉండదు. తెచ్చిపెట్టుకుంటారు. ప్రేమ ఉండదు. తెచ్చిపెట్టుకుంటారు. పోనీ అవంటే వేషాలు బతికేయడానికి. కానీ కోపాన్ని కూడానా తెచ్చిపెట్టుకోవడం! అప్పుడు మనం బతికి ఉన్నట్టా? బతికే ఉన్నాం అని చెప్పుకున్నట్టా? జావెద్ అఖ్తర్‌ని అడగాలి. బాల్కనీలోంచి కిందికి చూస్తూ కూర్చున్నాను.. రోడ్డు మీదకి. సన్నటి జల్లు. ముంబై మబ్బు పట్టేసి ఉంది. కొంచెం మిస్ట్ కూడా! ‘‘ఏమిటి చూస్తున్నారు’’ అంది రత్న నా పక్కనే వచ్చి నిలబడి. తన చేతిలోంచి నా చేతిలోకి ఒక కప్పు టీ అందడం నా జీవితంలో ఎప్పటికీ ఒక హృదయపూర్వక సందర్భం... రోజులో అది ఏ సమయంలోనైనా! ఎప్పుడూ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటుంది తను. అసలు ఇవ్వడానికే తను నా దగ్గరికి వస్తుంది. ఇచ్చాక తన పనిలోకి వెళ్లిపోతుంది. రోడ్డు మీదకే చూస్తూ ఉన్నాను. రాలిన చినుకులు పూల విత్తనాలై నేలలోకి ఇంకిపోతు న్నాయి. ప్రకృతిలోని చల్లదనంలో నన్ను సంతోషపరి చేదేమిటో ఎప్పటికీ నేను కనుక్కోలేను. ప్రకృతి దగ్గర, రత్న దగ్గర నేను యాంబివలెంట్! చిన్న పిల్లాడు. ఒక్కడే నడుస్తున్నాడు. వాణ్ణే చూస్తున్నాను. డక్బ్యాక్ రెయిన్ కోట్, భుజాలకు స్కూల్ బ్యాగ్. వాడు వాడిలా లేడు. నాలా ఉన్నాడు. దుఃఖపు వర్షంలో వణికిపోతూ, ఇష్టం లేకుండా నేనెలాగైతే స్కూలుకు వెళ్లేవాడినో వాడూ అలాగే వెళుతున్నాడు! పిల్లల వీపుల పైకెక్కి, దున్నపోతుల్లా కూర్చొనే స్కూలు బ్యాగులపై మాత్రం నాకు ఎలాంటి యాంబివలెన్స్ లేదు. ఐ స్టిల్ హేట్ ద డ్యామ్ థింగ్స్. జీవితంలోని పెద్ద అసంబద్ధత ఈ చదువు! కష్టాలను తట్టుకునే శక్తి లేనివారే లైఫ్ నుంచి పారిపోయి సినిమాల్లో నటించడానికి వచ్చేస్తారని నా నమ్మకం. చదువూ అంతే. జీవితంలో కష్టపడిపోతా రేమోనన్న భయంతో పిల్లల్ని కష్టపెట్టి చదివించడం! చినుకులు పెద్దవయ్యాయి. లోపలికొచ్చి కూర్చున్నాను. ‘వెయిటింగ్ ఫర్ గాడో’ని తిరిగి ర్యాక్‌లో పెట్టేశాను. జీవితం నిండా అసంబద్ధతలే అంటాడు బెకెట్. జీవితం నిండా కాదు, జీవితమే ఒక అసంబద్ధత. ఎంత అసంబద్ధత కాకపోతే కిశోర్‌కుమార్ మీద, ఆర్డీ బర్మన్ మీద బయోపిక్‌లు తీయడానికి తయారైపోతారు వీళ్లు... పాటలు, డాన్సులతో తలలు పగలగొట్టే ఈ డైరెక్టర్లు! ‘‘వద్దు, ఆర్ట్ పీస్‌లను అలా వదిలేద్దాం’’ అన్నాను. కోపాలొచ్చే శాయ్. అఖ్తర్జీకీ వచ్చింది! రావడం మంచిదే. ఆయనేమిటో నాకు తెలుస్తుంది. తెచ్చిపెట్టుకుంటేనే.. నేనేమిటో అఖ్తర్జీకి తెలియదా అనిపిస్తుంది. -మాధవ్ శింగరాజు -
ఆ మినిస్టర్ నిన్నేమైనా అన్నాడా?
అమృత ఇవాళ కూడా అలసిపోయి ఇంటికి వచ్చింది. రాజ్యసభ టీవీలో తను న్యూస్ యాంకర్. ‘‘వర్షాకాల సమావేశాలు అయిపోయాయి కదా, ఇంకా దేనికి అమృత.. ఈ అలసట’’ అని తన ముంగురుల్ని సవరిస్తూ అడిగాను. నవ్వి ఊరుకుంది. నవ్వినప్పుడు తను బాగుంటుంది. నవ్వి ఊరుకోవడమే బాగుండదు. ‘‘ఏమైంది అమృత?’’... మళ్లీ అడిగాను. తను మాట్లాడకపోతే నాకేమీ తోచదు. తోచనప్పుడు బయటికెళ్లి ఏదో ఒక ప్రెస్‌మీట్ పెట్టేయాలనిపిస్తుంది. ప్రెస్‌మీట్ పెట్టి వచ్చాక కూడా అమృత ఏమీ మాట్లాడకపోతే రాజ్యసభ చానల్ ఆన్ చేయాలని పిస్తుంది. అందులో అమృత చదివొచ్చిన వార్తల్నే.. అవి మళ్లీ టెలికాస్ట్ అవుతున్నప్పుడు చూస్తుంటాను. పక్కన అమృతను పెట్టుకుని, టీవీలో అమృతను చూస్తుండడం నాకు బాగుంటుంది. స్నానం చేసి వచ్చి సోఫాలో కూర్చుంది అమృత. తన వైపే చూస్తూ కూర్చున్నాను. అందంగా ఉంది. నెలాఖర్లో మా ఫస్ట్ యానివర్సరీ. పెళ్లయి అప్పుడే ఏడాది అవుతోందా! ‘‘విజయ్.. నేను ఉద్యోగం మానేస్తాను’’ అంది అమత సడెన్‌గా! నా కన్నా పాతికేళ్ల చిన్న పిల్ల నన్ను విజయ్ అనడం.. రియల్లీ ఐ లైక్ ఇట్. తన వయసులోకి నా వయసుని అలా ఏమాత్రం గౌరవం లేకుండా ఈడ్చుకెళ్లడాన్ని నేను ఇష్టపడతాను. ‘‘వాట్ హ్యాపెన్డ్ అమృత..’’ అన్నాను. ‘‘ఒకే ఫీల్డులో ఉన్నవాళ్లు పెళ్లి చేసుకోవచ్చు కానీ, పెళ్లి చేసుకున్నాక ఒకే ఫీల్డులో ఉండకూడదు విజయ్..’’ అంది అమత. ‘‘ఏం జరిగింది అమతా’’ అని అడిగాను. ‘‘ఏం లేదు’’ అంది. ఏం లేకుండా ఉంటుందా? తను రాజ్యసభ యాంకర్, నేను రాజ్యసభ మెంబర్. తను నా భార్య, నేను తన భర్త. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి అనేస్తుంది లోకం. ‘‘ఆ... ఐ అండ్ బి మినిస్టర్ నిన్నేమైనా అన్నాడా?’’ అన్నాను. ‘‘ఛ ఛ.. అలాంటిదేమీ లేదు’’ అంది అమృత. ‘‘పోనీ, నన్నేమైనా అన్నాడా?’’ అన్నాను. ‘‘కాంగ్రెస్, బీజేపీ.. ఎప్పుడూ ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటాయిగా’’ అంది అమృత. ‘‘మరి.. నిన్నూ అనక, నన్నూ అనక..?’’ అన్నాను. ‘‘ఇద్దర్నీ కలిపి అన్నారట విజయ్! మా డైరెక్టర్ చెప్పారు.. ‘తప్పుల్లేకుండా ఎలా మాట్లాడాలో ఇంటికెళ్లాక వాళ్లాయనకు నేర్పించమని ఆ పిల్లకు చెప్పు’ అన్నారట ఐ అండ్ బి మినిస్టర్’’ అంది అమత. అర్థమైంది. ‘పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్’ అనడానికి బదులు పొరపాటున నేను ‘ఇండియా ఆక్యుపైడ్ కశ్మీర్’ అన్నందుకు వెంకయ్యనాయుడు సెటైర్ వేసినట్లున్నారు! పెద్ద పార్టీ అన్నాక ఏవో చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఆ చిన్న చిన్న పొరపాట్లను పట్టుకుంటే.. పెద్ద పార్టీ అయిపోవచ్చని బీజేపీ భ్రమపడుతున్నట్లుంది. వెదికే పనిలో ఉన్నవారు ఎప్పటికీ ఎదగలేరని రేపు ఉదయాన్నే నాయుడు గారికి ఫోన్ చేసి చెప్పాలి. -మాధవ్ శింగరాజు దిగ్విజయ్‌సింగ్ (కాంగ్రెస్)రాయని డైరీ -
కోదండరాం రాయని డైరీ
యూనివర్సిటీ పిలగాండ్లకు జెప్పిన. అబిడ్స్‌కి బోయేటప్పుడు నేను గూడ వస్తనని. అక్కడ సెకండ్ హ్యాండ్ బుక్స్ అమ్ముతరు. ముప్పై రోజులల్ల ఇంగ్లిష్, ముప్పై రోజులల్ల హిందీ, ముప్పై రోజులల్ల తమిళం పుస్తకాలు ఉంటయ్ అక్కడ. గట్లనే ముప్పై రోజులల్ల మనకు రావొద్దనుకున్న భాష ముక్కున బడకుండా ఎట్ల దాస్కోవాల్నో నేర్పించే బుక్కు కూడా ఉంటే బాగుంటది. దాన్నెవరైన రాసి బుక్కేసిన్రేమో తెల్వది. గానీ అసొంటి బుక్కు ఉండాలె. తెలంగాణ వచ్చినంక, మినిస్టర్లైనంక నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, ఈటల రాజేందర్, జగ దీశ్‌రెడ్డి.. ఏదో కొత్త భాష మాట్లాడుతుండ్రు. ఆంధ్రోల్ల భాషే నయంగుంటది. గట్ల మాట్లాడుతుండ్రు! బాల్క సుమన్ ఢిల్లీల విలేకర్ల మీటింగ్ బెట్టి నోటికొచ్చిన భాష మాట్లాడిండు. అమెరికా పోయొచ్చినంక నాకేదో అయ్యిందట. ఏమైతది! నీకు భయమైతది. రాజేంద రైతే ‘పార్టీ బెట్టి మాట్లాడు కోదండ రామ్’ అంటున్నడు! మాట్లాడేటందుకు పార్టీ వెట్టాల్న? నీగ్గావాలె పార్టీ.. మంత్రి అయ్యేటందుకు. నాకెందుకు? నేను ఏమన్న! నీకు కావల్సినట్టు గాదు, జనానికి ఏం గావాల్నో గది చెయ్యిమన్నా. అంతే గదా. గింత పెద్ద ఉద్యమం నడిపి ఆంధ్రా పాలకుల్ని తరిమినం. వాళ్లు ఇక్కడ జేసినయన్నీ వాళ్లతోనే పోవాల్నా లేదా? మల్లా హైద్రాబాదేనా? మల్లా గీ రియల్ ఎస్టేట్ డీలర్లు, కార్పొరేట్ శక్తులేనా? తెలంగాణకు వేరే అభివృద్ధి లేదా? తెలంగాణ సంస్కృతి అభివృద్ధి చెందకూడదా? సీతాఫల్ మనకు ఒక అస్తిత్వం గదా. అది ఒక్క మన దగ్గరే దొరుకుతది గదా. ఒక్క సీతాఫల్ ఫెస్టివల్ చేసినమా? నేను మొన్న అమెరికా పోతే నాకు ఆశ్చర్యమైంది. ఆ ఊళ్లల్ల ఎల్లిపాయలు పండుతయట. ఎల్లిపాయల ఫెస్టివల్ పెట్టుకుంటరు వాళ్లు! నాయకులు ప్రజల వెనకాలె ఉండాలె. ముందు గాదు. ప్రజలు ఎటు పొమ్మంటే అటుపోవాలె. గీ నాయకులు అట్లా జేస్తున్నరా? చేయాలనుకున్నదే చేస్తున్నరు. అమెరికా పోయినప్పుడు అక్కడి ప్రొఫెసర్లు జె ప్పిన్రు నాకు. ప్రపంచంలో ఎక్కడ గూడా గిట్ల ప్రజల తరుఫున నిలబడి ప్రభుత్వానికి ‘మాకిది కావాలె’ అని చెప్తున్న ప్రజాసంఘాలు తెలంగాణలో తప్ప లేవట! ప్రతిపక్షం అధికారం కోసం కొట్లాడుతది. అధికారపక్షమేమో పవర్లో కూర్చోవాలని ప్రయత్నం జేస్తది. జేఏసీకి ఈ రెండు కోరికలూ లేవు. జేఏసీ వీళ్లతో లేదు. వాళ్లతో లేదు. ప్రజలతో ఉంది. ‘ఎవరో ఉన్నరు వెనుక’ అంటున్నడు మినిస్టర్ జోగు రామయ్య. ఎవరుంటరు నా వెనుక. వచ్చి చూడు. హరగోపాల్ ఉంటడు. సచ్చిపోయిన ప్రొఫెసర్ జయశంకర్‌గారు ఉంటరు. మా ముందట ప్రజలుంటరు. విద్యార్థులుంటరు. నిరుద్యోగు లుంటరు. పైసల్లేని రైతులుంటరు. గిప్పుడు మెదక్ జిల్లా ఉంది. మల్లన్నసాగర్ బాధితులున్నరు. గీ ప్రభుత్వం గిట్లనే ఉంటే.. వచ్చే మూడేండ్లల్ల మల్లా తెలంగాణ మొత్తం మా ముందట ఉంటది. ప్రజలు ముందుండి నడిపిస్తే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినంక ప్రజల్ని వెనకొదిలి, ముందటికి పోతమంటే తెలంగాణ ఊకుంటదా? మల్లా జెండా ఎత్తకుంటదా? మల్లా ‘జై తెలంగాణ’ అనకుంటదా?