mid-day meal scheme
-
మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపు ఈనెల నుంచే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈనెల నుంచి ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వేతనాలను పెంచడం వల్ల ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో పని చేస్తున్న 54,201 మంది కుక్–కమ్ హెల్పర్లకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. తద్వారా ప్రభుత్వంపై ఏటా రూ.108.40 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. శనివారం తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన జిల్లా విద్యాశాఖాధికారుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. పాఠశాల విద్యలో ప్రధానంగా ప్రాథమిక స్థాయిలో చోటు చేసుకున్న అభ్యాసన సంక్షోభాన్ని నివారించి తరగతి వారీగా భాషా, గణితాల సామర్థ్యాలను సాధించేందుకు తొలి మెట్టు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో ఉన్న కనీస సామర్థ్యాలను గుర్తించేందుకు ఈ సంవత్సరం నుంచి ప్రతీ ఏటా స్టేట్ లెవెల్ అచీవ్ మెంట్ సర్వే నిర్వహించనున్నామని మంత్రి వెల్లడించారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం.... పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రూ.కోటి కన్నా ఎక్కువ వ్యయమయ్యే పనులను పాఠశాల నిర్వహణ కమిటీలకు (ఎస్.ఎం.సి) అప్పగించి పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పలు జిల్లాల్లో విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తులు అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని, మరో వారం రోజుల్లోగా అందజేయకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. -
మధ్యాహ్న భోజనం ఖర్చును పెంచిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనం ధరలను పెంచింది. రెండేళ్ల విరామం అనంతరం ఒక్కో విద్యార్థిపై గతంలో అందిస్తున్న వంట ఖర్చు(ఆహార దినుసులు, గ్యాస్ తదితరాలు కలిపి)ను 9.6 శాతం మేర పెంచింది. 2020లో చివరిసారి వంట ఖర్చును పెంచిన సమయంలో ప్రాథమిక తరగతి (1–4వ తరగతి వరకు)లో ఒక్కో చిన్నారికి భోజనానికి రోజుకు రూ.4.97 చెల్లించగా, దానిని ఇప్పుడు రూ.5.45కు సవరించింది. ప్రాథమికోన్నత (6– 8వ తరగతి వరకు) స్థాయిలో భోజనం ఖర్చు రూ.7.45 నుంచి రూ.8.17కు పెంచుతూ కేంద్ర ఆర్ధిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 11.20 లక్షల ప్రభుత్వం, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 11.80 కోట్ల విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. పెంచిన ధరలు ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్రం రాష్ట్రాలకు లేఖలు రాసింది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో నిధులు సమకూరుస్తాయి. 2022–23 బడ్జెట్లో కేంద్రం ఈ పథకానికి రూ.10,233 కోట్లు కేటాయించగా, రాష్ట్రాలు రూ.6,277 కోట్లు ఖర్చు చేయనున్నాయి. కేంద్రంపై అదనంగా రూ.600 కోట్ల భారం పడనుందని సమాచారం. -
యోగి సార్ ఇటూ చూడండి! మిడ్డే మీల్లో విద్యార్థులకు 'సాల్ట్ రైస్'
లక్నో: ఒక ప్రభుత్వ స్కూల్లోని ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు మిడ్ డే మీల్లో భాగంగా సరైన భోజనం అందించకుండా నిర్లక్ష పూరితంగా వ్యవహరించడంతో సస్పెన్షన్‌కి గురయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పౌష్టికరమైన భోజనం అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఐతే యూపీలోని అయోధ్య జిల్లాలో ఒక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ఉప్పుతో కలిపిన భోజనం పెడుతున్నారు. పిల్లలంతా నేలపైనే కూర్చొని ఆ అన్నమే తింటున్నారు. ఈ విషయమై ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గానీ గ్రామాధికారి గానీ భాద్యతలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని విద్యార్థుల తల్లిదండ్రుల తీసి యోగి సార్ ఇలాంటి పాఠశాలకు ఎవరైన తమ పిల్లలను పంపించగలరా అని ప్రశ్నించారు. యోగి బాబా మీరైన ఈ వీడియో చూసి పట్టించుకోండి అని విద్యార్థి తల్లిదండ్రులు అభ్యర్థించారు. వాస్తవానికి ఆ స్కూల్ గోడలపై ఉన్న మిడ్ డే మెనులో పాలు, రోటీలు, పప్పు, కూరగాయలు, బియ్యం లిస్ట్ ఉంది. కానీ ఆ పాఠశాల్లో మాత్రం ఉప్పుతో కూడిన భోజనం అందిస్తున్నారు. ఈ విషయంపై జిల్లా మెజిస్ట్రేట్ అధికారి నితిష్‌కుమార్ స్పందించి...మెనులో ఉన్న ప్రకారమే భోజనం అందించమనే ఆదేశించాం. ఇలాంటి విషయాల్లో నిర్లక్షపూరిత వైఖరిని సహించేదే లేదని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతేగాదు సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడుని విధుల నుంచి తొలగించడమే కాకుండా ఈ విషయం పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. (చదవండి: అయోధ్యలో రూ. 7.9 కోట్లతో భారీ వీణ... లెజండరి సింగర్ పేరిట చౌక్) -
ఆధార్ లేని విద్యార్థులకూ మధ్యాహ్న భోజనం
న్యూఢిల్లీ: ఆధార్‌కార్డు లేని విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం కొనసాగుతుందని కేంద్రం స్పష్టం చేసింది. మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి ప్రకాశ్ జవడేకర్ రాజ్యసభలో సమాధానమిస్తూ.. ప్రతి ఒక్క విద్యార్థికీ మధ్యాహ్న భోజనం అందుతుందని, అలాగే ఆధార్‌కార్డును అందిస్తామని వివరించారు. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు ఆధార్‌కార్డులు ఉన్నాయని, మిగిలిన వారికి కూడా అందజేస్తామన్నారు. ఆధార్ మంజూరుకు సదుపాయాలు లేనిచోట, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు విశిష్ట గుర్తింపు నంబర్లను అందజేస్తాయని తెలిపారు. -
ఆధార్ ఉంటేనే భోజనం
⇒మధ్యాహ్న భోజన పథకం అమలులో పారదర్శకత ⇒పాఠశాలలకు త్వరలోనే నోటిఫికేషన్ ⇒వంట చేసే కార్మికులూ వివరాలు ఇవ్వాల్సిందే.. ⇒కార్డులు లేని వారికి జూన్ 30వరకు గడువు ⇒జిల్లాలో 45,521 మంది విద్యార్థులు, 1,209 మంది కార్మికులు వరంగల్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో కేంద్రప్రభుత్వం కొత్త నిబంధన చేర్చనుంది. ఈ పథకంలో భాగంగా భోజనం చేసే విద్యార్థులే కాకుండా వంట చేసే కార్మికుల ఆధార్ కార్డు వివరాలు సేకరించాలని కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయించింది. ఈ శాఖ ఆధీనంలోని ‘ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ’ ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ త్వరలోనే పాఠశాలలకు పంపించనుంది. నిధుల వినియోగంలో పారదర్శకత పాఠశాలల్లో డ్రాపౌట్లు ఉండొద్దన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకాన్ని కొన్నేళ్లుగా అమలుచేస్తున్నాయి. అయితే, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్వహణ నిధులు, బియ్యాన్ని అందజేస్తాయి. ఈ మేరకు కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను తప్పుగా చూపిస్తూ నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పథకం నిర్వహణలో పారదర్శకత కోసం విద్యార్థులు, వంట కార్మికుల ఆధార్ కార్డుల నంబర్లు సేకరించాలని నిర్ణయించింది. విద్యార్థులు భోజనం చేస్తున్నందున.. ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నందున కార్మికుల నంబర్లు కూడా సేకరించనున్నారు. అయితే, ఇప్పటి వరకు ఆధార్ కార్డులు లేని వారు జూన్ నెల 30వ తేదీలోగా పొందేందుకు గడువు ఇస్తారు. జిల్లాలో 45,521మంది విద్యార్థులు వరంగల్ రూరల్ జిల్లాలోని 15 మండలాలకు చెందిన 694 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అవుతోంది. ఇందులో 472 ప్రాథమిక పాఠశాలలు, 81 ప్రాథమికోన్నత పాఠశాలలు, 141 జిల్లా పరిషత్ పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా 45,521 మంది విద్యార్థులు ఉండగా, 1,209 మంది వంట కార్మికులు పని చేస్తున్నారు. వంట చేసే వర్కర్లకు నెలకు రూ.వెయ్యి చొప్పున ప్రతినెలా మొత్తం రూ.1,20,900 చెల్లిస్తున్నారు. అలాగే, విద్యార్థుల ఆహారానికి సంబంధించి రోజుకు రూ.3,25,021, నెలకు రూ.78,00,507 ఖర్చు అవుతోంది. -
బిల్లులివ్వండి మహాప్రభో..
►నాలుగు నెలలుగా నిర్వాహకులకు అందని గౌరవ వేతనం ►రెండు నెలలుగా పెండింగ్‌లో భోజన బిల్లులు ఎల్లారెడ్డిపేట: బడిబయట పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం నిర్వాహణకు నిధులు కరువయ్యాయి. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లోని 64ప్రభుత్వ పాఠశాలల్లో 132మంది నిర్వాహకులు మధ్యాహ్న భోజనం తయారు చేసిపెడుతున్నారు. ఈపథకం ద్వారా సుమారు 6280మంది విద్యార్థులు లబ్ధిపొందుతున్నారు. వంట నిర్వాహకులకు ప్రతీనెల ప్రభుత్వం రూ.వెయ్యి చొప్పున గౌరవ వేతనం అందిస్తోంది. ఇప్పటివరకు ఆరు నెలలుగా గౌరవ వేతనం అందక ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ క్రమం తప్పకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని తయారుచేసిపెడుతున్నారు. పేరుకుపోయిన రూ.5.28లక్షల వేతనాలు మధ్యాహ్న భోజనం వండిపెట్టే నిర్వాహకులు మరోపని చేసుకోకుండా దీనిపైనే ఆధారపడగా నాలుగు నెలలుగా వేతనాలు అందక పూటగడవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 132మంది నిర్వాహకులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున నాలుగు నెలలకు సంబంధించి రూ.5.28లక్షలు బకాయిలు రావాల్సి ఉంది. రూ. 4.50లక్షల మధ్యాహ్న భోజన బకాయిలు 64పాఠశాలల్లో మధ్యాహ్న భోజన వంటకాలు కొనసాగుతుండగా డిసెంబరు వరకు రెండు నెలల భోజన బిల్లులు రాలేదు. ఇప్పటి వరకు రూ.4.50లక్షల బకాయిలు ఉండగా వారు అప్పులు చేసి నిత్యావసర సరుకులను తీసుకొచ్చి విద్యార్థులకు వండిపెడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న బిల్లులతో పాటు నిర్వాహకుల వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు. ఆశతో ఉన్నాం నాలుగు నెలలుగా నిర్వాహకులకు గౌరవ వేతనం అందడం లేదు. రెండు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లులు రాక కిరాణ దుకాణాల్లో అప్పులు చేస్తున్నాం. ఇంకో పని చేసుకోలేక మధ్యాహ్న భోజనాన్ని నమ్ముకొని అప్పుల పాలవుతున్నాం. గౌరవ వేతనం, భోజన బిల్లులు చెల్లించి మమ్మల్ని ముందుకు నడుపాలి. – పోతుల లక్ష్మి, నిర్వాహకురాలు, ఎల్లారెడ్డిపేట బడ్జెట్ రాగానే ఖాతాల్లో జమచేస్తాం బడ్జెట్ రాగానే గౌరవ వేతనాన్ని నిర్వాహకుల ఖాతాల్లో జమచేస్తాం. నాలుగు నెలలుగా గౌరవ వేతనం రాక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. గౌరవ వేతనం, మధ్యాహ్న బిల్లుల బకాయిలపై ప్రతిపాదనలు పంపాం. డబ్బులు రాగానే అందరికి పంపిణీ చేస్తాం. – మంకు రాజయ్య, ఎంఈవో, ఎల్లారెడ్డిపేట -
అవినీతిపరులకు బయోందోళనే
మధ్యాహ్న భోజన పథకం అమలులో అక్రమాలకు చెక్ పాఠశాలల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ జిల్లాలో తొలివిడతగా 1,508 స్కూళ్లలో అమలు జాబితా విడుదల చేసిన ప్రభుత్వం అనంతపురం ఎడ్యుకేషన్ : ఓ పాఠశాలలో 120 మంది విద్యార్థులుంటే వారిలో 30 మంది పాఠశాలకు హాజరుకాలేదు. కానీ మధ్యాహ్న భోజనం అటెండెన్స్ రిజిష్టర్‌లో మాత్రం అందరూ వచ్చినట్లు నమోదు చేశారు. గైర్హాజరు పిల్లలకు సంబంధించిన బిల్లు మొత్తాన్ని సదరు ఏజెన్సీ, హెచ్ఎం ఇద్దరూ స్వాహా చేశారు. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే..ఇలాంటి పరిస్థితి చాలా స్కూళ్లలో ఉంది. చాలా రోజులుగా ఈ అక్ర మాల తంతు జరుగుతోంది. ఫలితంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. పాఠశాలల్లో బోగస్ అటెండెన్స్‌కు చెక్ పెట్టేందుకు, అక్రమాలకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం బయో మెట్రిక్ పద్ధతిని ప్రవేశపెట్టనుంది. తద్వారా ఎంత మంది మధ్యాహ్న భోజనం తిన్నారో.. అంత మందికి మాత్రమే బిల్లు మంజూరవుతుంది. జిల్లాలో 3783 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఆయా స్కూళ్లలో 3,43,557 మంది విద్యార్థులు భోజనం తింటున్నారు. టీచర్లు, విద్యార్థుల అటెండెన్స్ బయోమెట్రిక్ ద్వారా తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ముందుగా మధ్యాహ్న భోజన పథకం అమలులో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో విద్యార్థులకు అమలుకు పూనుకున్నారు. వేలిముద్ర పడితేనే బిల్లు : విద్యార్థి వేలిముద్ర పడితేనే ఏజెన్సీకి బిల్లు మంజూరవుతుంది. బయో అటెండెన్స్ ఆధారంగానే ఏరోజుకారోజు ఆన్లైన్లో బిల్లు జనరేట్ అవుతుంది. నెలలో ఏ విద్యార్థి ఎన్ని రోజులు మధ్యాహ్నం భోజనం చేశాడో క్రోడీకరించి, బిల్లు పంపుతారు. ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు ఓసారి, మధ్యాహ్నం భోజన సమయంలో మరోసారి అటెండెన్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఉదయం ఆలస్యమైనా కొందరు విద్యార్థులు భోజన సమయానికి వస్తారు. ఉదయం వచ్చీ మధ్యాహ్న భోజనానికి హాజరుకాని విద్యార్థులూ ఉంటారు. దీంతో రెండు పూటలా అటెండెన్స్ తీసుకుంటారు. మధ్యాహ్నం భోజనం తర్వాత ఆటోమేటిక్‌గా ఆన్లైన్ అంటెండెన్స్ తీసుకోదు. తర్వాత నమోదు చేసినా లాభం ఉండదు. ఎంతసేపూ గడువులోపు నమోదు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ విద్యార్థుల సంఖ్య ఉన్న స్కూళ్లకు సమయం కాస్త ఎక్కువగా కేటాయిస్తారు. నిన్నటి రోజు కొందరి పిల్లలు నమోదు చేయలేదు.. ఈరోజు చేస్తామంటే కుదరదు. ఏరోజుకారోజు అటెండెన్స్ వేయాలి. తొలివిడతగా 1,508 స్కూళ్లలో అమలు : జిల్లాలోని 3,783 స్కూళ్లకు గాను తొలివిడతగా 1,508 స్కూళ్లలో అమలు చేయనున్నారు. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, మోడల్ స్కూళ్లు ఉంటాయి. జాబితాను ప్రభుత్వం జిల్లా విద్యాశాఖకు పంపింది. అనంతపురం డివిజన్లో 268 పాఠశాలలు, ధర్మవరం డివిజన్లో 428, గుత్తి డివిజన్లో 447, పెనుకొండ డివిజన్లో 365 స్కూళ్లలో అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆయా స్కూళ్లలో బయోమెట్రిక్ మిషన్లు, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్మెంట్ చేసేందుకు, ఏజెన్సీ నిర్వాహకులు, హెచ్ఎంలకు అవగాహన కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి సెలవులు పూర్తయ్యేనాటికి ఈ ప్రక్రియ పూర్తయి అమలు చేసే అవకాశం ఉంటుందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. వేలిముద్రలు నమోదు చేస్తున్నాం : శామ్యూల్, డీఈఓ బయోమెట్రిక్ అమలు నేపథ్యంలో ఇప్పటికే పాఠశాలల వారీగా విద్యార్థుల వివరాలను ఆన్లైన్ చేస్తున్నాం. మీసేవ, ఆన్లైన్ కేంద్రాలకు విద్యార్థులను తీసుకెళ్లి వేలిముద్రలు నమోదు చేయిస్తున్నాం. జిల్లాలో తొలివిడతగా 1,505 స్కూళ్లలో అమలు కానుంది. ముందుగా ఆయా స్కూళ్లకు ప్రాధాన్యత ఇచ్చి ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే తర్వాత చెప్తాం. -
ప్రత్యేక సంచుల్లో సన్నబియ్యం
► విద్యార్థులకు కడుపునిండా తిండి ► ఆక్రమాలకు అడ్డుకట్ట ► సంచులపై టీఎస్ఎస్సీఎల్ ముద్ర ఆదిలాబాద్ టౌన్ : పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు గతంలో దొడ్డు బియ్యం సరఫరా అయ్యేవి, దీంతో అన్నం సరిగా ఉడకకపోవడం వల్ల విద్యార్థులు సరిగా తినలేక పోయేవారు. విద్యార్థుల అవస్థలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యాన్ని సరఫరా చేస్తోంది. సన్నబియ్యం రాక అక్రమార్కులకు వరంగా మారింది. ఇటు చౌక దుకాణాలు, అటు పాఠశాలలు, వసతి గృహలకు ఒకే రకమైన సంచుల్లో సన్న, దొడ్డు బియ్యం సరఫరా చేయడం వల్ల ఇన్నాళ్లు అక్రమార్కులకు కాసులు కురిపించారుు. ఈ క్రమంలో అవి పక్కదారి పట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేక సంచుల్లో సన్నబియ్యం సరఫరా చేసేందుకు శ్రీకారం చుట్టింది. అక్రమాలను నిరోదించడానికి పాలిథీన్ సంచుల్లో బడి బియ్యం సరఫరా చేస్తున్నారు. నియోజక వర్గంలో.. ఆదిలాబాద్ నియోజక వర్గంలోని ఆదిలాబాద్ మండలంలో101 ప్రాథమిక పాఠశాలలు, 18 యూపీఎస్, 21 ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. జైనథ్ మండలంలో 39 పీఎస్‌లు, 9 యూపీఎస్‌లు, 8 ఉన్నత పాఠశాలలు ఉన్నారుు. బేల మండలంలో 34 పీఎస్‌లు, 11 యూపీఎస్, 5 ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. వీటితో పాటు నియోజక వర్గంలోని ఆశ్రమ, సాంఘీక సంక్షేమ, బీసీ సంక్షేమ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు సన్నబియ్యాన్ని వడ్డిస్తున్నారు. మొత్తం నియోజక వర్గంలో 20 వేల వరకు విద్యార్థులు ఉన్నారు. పక్కదారి పట్టించకుండా... ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం ఇప్పటిదాకా పాఠశాలలు, వసతి గృహలు, రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యం అన్ని సంచులు ఒకే విధంగా ఉండేవి. 50 కిలోల గోనే సంచుల్లో అందజేసేవారు. దీంతో ఏవి దొడ్డు రకం..ఏవి సన్న రకమో.. సంచి తెరచి పరిశీలిస్తే కానీ తెలిసేది కాదు. దీన్ని ఆసరాగా చేసుకోని అక్రమార్కులు పక్కదారి పట్టించేవారన్న ఆరోపణలు ఉన్నారుు. అలాగే సంచుల్లో బియ్యం తూకం తక్కువగా ఉంటున్నాయన్న ఫిర్యాదులు వచ్చేవి. ఈ నేపథ్యంలో గత నెల నుంచి 50 కిలోల ప్రత్యేక సంచి (తెలుపురంగు)లో సన్న బియ్యం పంపిణీకి అధికారులు శ్రీకారం చుట్టారు. సంచులపై టీఎస్ఎస్సీఎల్ (తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ)ముద్రతో పాటు వసతి గృహాలు, మధ్యాహ్న భోజన పథకం బియ్యం, ప్యాకింగ్ చేసిన తేదిని ముద్రించారు. ఆక్రమాలను అరికట్టేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో, వసతిగృహల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రభుత్వం సన్నబియ్యం సరఫరా చేస్తోంది. ఇది వరకు గోనే సంచుల్లో చౌకదరల దుకాణాలకు సరఫరా అయ్యే బియ్యం సంచుల్లో ఇవి కూడా పంపిణీ చేసేవారు. ఇప్పుడు ప్రత్యేకమైన పాలిధీన్ సంచుల్లో 50 కిలో సంచుల్లో సరఫరా చేస్తున్నాం. దీంతో దొడ్డు బియ్యం పాఠశాలలకు వెళ్లే అవకాశం ఉండదు. -శ్రీకాంత్‌రెడ్డి, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి -
ఫస్ట్ డే..పస్తులే..!
గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కడుపు నింపేందుకు ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకం విద్యాసంవత్సరం మొదటి రోజే విద్యార్థుల కడుపులు మాడ్చింది. డ్వాక్రా మహిళలు, ఏజెన్సీల స్థానంలో మధ్యాహ్న భోజన పథక నిర్వహణ (ఎండీఎం)ను ఆర్భాటంగా ప్రభుత్వం కట్టబెట్టిన ప్రైవేటు సంస్థ పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు ఆహారం అందించకుండా చేతులెత్తేసింది. ఫలితంగా తొలి రోజు ఉదయం ఎంతో ఆనందంగా పాఠశాలకు వచ్చిన విద్యార్థులు సాయంత్రం వరకూ ఖాళీ కడుపులతో గడిపారు. ఆ మూడు మండలాల్లో.. ప్రభుత్వ పాఠశాలల్లో ఎండీఎం నిర్వహణను సంవత్సరాల తరబడి డ్వాక్రా మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన పలువురు మహిళలు నిర్వహిస్తున్నారు. రాజధాని పరిధిలోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల పరిధిలోని పాఠశాలలను ప్రైవేటు సంస్థకు కట్టబెడుతూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. అయితే సోమవారం మధ్యాహ్నం ఆయా మండలాల్లోని పాఠశాలల విద్యార్థులకు ఆహారం సరఫరా చేయలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. మళ్లీ ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడండి .. పెనుమాకలోని పాఠశాలను పాఠశాల విద్య ఆర్జేడీ పి.పార్వతి, డీఈవో కేవీ శ్రీనివాసులురెడ్డి సందర్శించి అక్కడి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మూడు మండలాల పరిధిలోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా కాలేదని తెలుసుకున్న అధికారులు అక్కడి నుంచి సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. మొదటి రోజు కావడంతో రవాణా సమస్య తలెత్తి భోజనం సరఫరా చేయలేకపోయామని సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు అధికారులు తెలిపారు. మళ్లీ ఇటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని వారికి సూచించారు. పాఠశాలలు తెరిచిన మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. మోసం చేయడం చంద్రబాబుకు అలవాటే : ఎమ్మెల్యే ఆర్కే రాజధాని (తాడేపల్లి రూరల్) : పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. తన కార్యాలయం నుంచి సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. మిడ్ డే మీల్స్‌ను కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పి పిల్లలలను పస్తులుంచుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజధాని ప్రాంతంలో మోసాలు చేయడం చంద్రబాబునాయుడుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. కలెక్టర్ కాంతిలాల్ దండేకు విషయాన్ని తెలియజేయడంతో విషయం తనకు తెలియదని, దీనిపై వివరణ తీసుకుంటానని చెప్పినట్లు తెలిపారు. దీనిపై మంగళగిరి, తాడేపల్లి ఎంఈవోలను ప్రశ్నించగా వారు సైతం పరిశీలిస్తున్నామన్నారేగానీ, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. -
‘మధ్యాహ్న భోజనాన్ని’ ప్రైవేట్‌పరం చేయవద్దు
శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ కమల గాంధీనగర్ : మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ ఎ. కమల డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్ర ఫౌండేషన్‌కు కట్టబెట్టాలన్న ఆలోచనను నిరసిస్తూ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం లెనిన్‌సెంటర్‌లో ధర్నా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ అరకొర వసతులతోనే పదిహేనేళ్లుగా భోజనపథకం నిర్వహిస్తున్నామన్నారు. నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించడం లేదన్నారు. భోజన పథకం కార్మికులకు కనీస వసతులు కల్పించడం లేదని చెప్పారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. పథకంలో పనిచేస్తున్న వారిని కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచాలని, సరైన సౌకర్యాలు కల్పించి గతం నుంచి పనిచేస్తున్న కార్మికులకే మధ్యాహ్న భోజన పథకం అప్పగించాలని డిమాండ్‌చేశారు. సమస్యల ప రిష్కరించాలని కోరుతూ విజయవాడ నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు అందజేయనున్నామని చెప్పారు. కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ నగర అధ్యక్షురాలు దుర్గాభవానీ, పి. లక్ష్మీ, రమాదేవి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
‘మధ్యాహ్న భోజన’ తీరు అధ్వానం
రాష్ట్రంలో పథకం అమలుపై కేంద్ర ప్రభుత్వం అసంతృప్తి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లలో భోజనాన్ని ఆలస్యంగా అందిస్తున్నారని, తల్లిదండ్రులెవరూ కూడా ఆ భోజనాన్ని రుచి చూడటంలేదని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆక్షేపించింది. చిత్తూరు జిల్లాలో ఒక ఎన్జీవో తమ వంట గది నుంచి దాదాపుగా 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూళ్లకు భోజనాన్ని సరఫరా చేస్తోందని, దీనివల్ల రెండు గంటల ఆలస్యంగా పిల్లలకు భోజనం అందుతోందని పేర్కొంది. ఇలాంటి పరిస్థితి చాలాచోట్ల ఉందని తెలిపింది. 2015-16 సంవత్సరానికి గాను ఏప్రిల్-డిసెంబర్ మధ్య రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలును కేంద్ర మానవ వనరుల అభివృధ్ది మంత్రిత్వ శాఖ సమీక్షించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కేవలం 37 శాతం స్కూళ్లలోనే తల్లిదండ్రులు భోజనాన్ని రుచిచూడటం పట్ల కేంద్ర మంత్రిత్వ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. మధ్యాహ్న భోజనం పిల్లలకు అందించే సమయంలో ప్రతి స్కూల్లో కనీసం ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని రాష్ట్రానికి సూచించింది. -
సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
ఆదిలాబాద్ అర్బన్ : కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని 2016-17 సెలవుల్లోనూ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని సంయుక్త కలెక్టర్ సుందర్ అబ్నార్ జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో విద్యా శాఖఅధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జేసీ పాల్గొని మధ్యాహ్న భోజనం ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నుంచి పదో తరగతి వరకు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గురువారం నుంచి మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో కూడా మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. సమావేశంలో డీఈవో సత్యనారాయణరెడ్డి, డిప్యూటీ డీఈవో శ్యాం పాల్గొన్నారు. -
మొక్కు‘బడి’గా భోజనం
► మండుతున్న ఎండలే ప్రధాన కారణం ► చాలా చోట్ల ప్రారంభం కాని పథకం కరీంనగర్‌ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకం ఫలితమివ్వలేదు. మండుతున్న ఎండలు, నెలరోజుల ముందే పరీక్షలు ముగియడంతో చాలా పాఠశాలల్లో విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. జిల్లాలో 1955 ప్రాథమిక, 327 ప్రాథమికోన్నత, 644 ఉన్నత పాఠశాలల్లో సుమారు 2.12 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మొదటి రోజు తక్కువ మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి హాజరయ్యారు. పెద్దపల్లి, హుజూరాబాద్, ధర్మపురి, గోదావరిఖని, మంథని నియోజకవర్గాల్లో భోజన పథకం అసలే ప్రారంభంకాలేదు. వేములవాడ, మాన కొండూర్, చొప్పదండి, కరీంన గర్, సిరిసిల్ల, కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల్లోని కొన్ని పాఠశాలల్లో పథకం ప్రారంభమైనా.. మరికొన్నింటిలో అసలే ప్రారంభం కాలేదు. ఎండలు...వసతుల లేమి.... జిల్లాలోని 57 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించేలా జిల్లాయంత్రాంగం ఏర్పాట్లు చేసినా.. ఎండ కారణంగా విద్యార్థులు పాఠశాలకు వచ్చి భోజనం చేయడానికి ఆసక్తి చూపలేదు. ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులు పక్క గ్రామాల నుంచి తాము చదువుకునే పాఠశాలకు వచ్చేందుకు ముందుకు రావడం లేదు. మరోవైపు పాఠశాలల్లో తాగేందుకు నీళ్లు లేకపోవడంతో ఇబ్బందులు తప్పడంలేదు. ఏజెన్సీల నిర్వాహకులూ ఎండలు చూసి భయపడుతున్నారు. ఇదీ పరిస్థితి.. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, వ్యాసరచన, ఆటపాటలు, పెయింటింగ్‌పై శిక్షణ కార్యక్రమాలు ఇవ్వాలనే ఆదేశాలు ఎక్కడా అమలు కావడంలేదు. ఉపాధ్యాయులూ పాఠశాలలకు వచ్చేందుకు ముందుకు రావడంలేదు. కరీంనగర్ నియోజకవర్గంలో 136 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 98 పాఠశాలల్లో బుధవారం మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించారు. 13,320 మంది విద్యార్థులకు కేవలం 1400 మంది విద్యార్థులు మాత్రమే మధ్యాహ్న భోజనానికి హాజరయ్యారు. జగిత్యాల నియోజకవర్గ పరిధిలో 180 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 12,859 మంది విద్యార్థులున్నారు. అయితే మధ్యాహ్న భోజనం ఆరగించేందుకు కేవలం 3,223 మంది విద్యార్థులే హాజరయ్యారు. కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్ మండలంలో 4,465 మంది విద్యార్థులకు గాను 2,680 విద్యార్థులు హాజరయ్యారు. మెట్పల్లి మండలంలో 4,163 మంది విద్యార్థులకు గాను 1,050 మంది హాజరయ్యారు. కోరుట్ల అర్బన్, రూరల్ పరిధి పాఠశాలల్లో 6 వేల మంది విద్యార్థులకు గాను 580 మంది హాజరయ్యారు. చాలా పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడంతో వంట ఏజెన్సీ నిర్వాహకులు వెనుదిరుగుతున్న పరిస్థితి కనిపించింది. మానకొండూర్ నియోజకవర్గంలో తిమ్మాపూర్ మండలంలో 3,466 మంది విద్యార్థులకుగాను 803 మంది మధ్యాహ్న భోజనం తిన్నారు. ఇల్లంతకుంట మండలంలో 51 పాఠశాలల్లో 3,508 మంది విద్యార్థులకుగాను 948 మంది హాజరయ్యారు. మానకొండూరు మండలంలో 57 ప్రభుత్వ పాఠశాలల్లో 4005 మంది విద్యార్థులకు గాను 719 మంది మాత్రమే భోజనం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 237 ప్రభుత్వ పాఠశాలల్లో 27842 మంది విద్యార్థులకు గాను 4656 మంది మధ్యాహ్న భోజనానికి వచ్చారు. తొమ్మిది స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా తినేందుకు రాకపోవడం విశేషం.వేములవాడ నియోజక వర్గంలో వేములవాడ అర్బన్, రూరల్‌తో పాటు చందుర్తి, కోనరావుపేట, కథలాపూర్, మేడిపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో 21,026 మంది విద్యార్థులకు గాను 3,420 మంది విద్యార్థులు హాజరయ్యారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఒక్క చిగురుమామిడి మండలంలోని కొన్ని గ్రామాల్లో మాత్రమే మధ్యాహ్న భోజనం నిర్వహించారు. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, బోయినపల్లి మండలాల్లో మధ్యాహ్న భోజనం నిర్వహించారు. పూర్తి వివరాలు అందలేదు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ మొదటి రోజు సగం నియోజకవర్గాల్లోనే కొనసాగింది. గురువారం నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అమలవుతుం ది. ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులు ఇతర గ్రామాల నుంచి వచ్చేవారు కాబట్టి హాజరు శాతం ఉండడంలేదు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థుల హాజరు శాతం 45 మాత్రమే ఉంది. జిల్లా వ్యాప్తంగా భోజనం చేసిన విద్యార్థుల వివరాలు అందలేదు. గురువారం నుంచి ఎస్ఎంఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రధానోపాధ్యాయులు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పాఠశాల యూడైస్ కోడ్ కొట్టి స్పేస్ ఇచ్చి ఎండీఎంటీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి విద్యార్థుల సంఖ్యను టైప్ చేసి 99634 72066 నంబర్‌కు ఎస్ఎంఎస్ చేయాలి. - శ్రీనివాసాచారి, డీఈవో -
నేటి నుంచే భోజనం
♦ అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాట్లు ♦ 1.48 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి ♦ వలసల నివారణకు చర్యలు ♦ రోజూ విద్యార్థుల సంఖ్యను పేర్కొనాలని ఆదేశాలు పాపన్నపేట: కరువు వేళ విద్యార్థుల ఆకలి తీర్చి.. వలసలు నివారించాలన్న లక్ష్యంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఆహార భద్రత చట్టం అమలు చేసి విద్యార్థులకు పోషకాహారం అందించాలన్న ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం 1నుంచి 8 తరగతుల విద్యార్థులకు వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి తోడు 9,10 తరగతుల విద్యార్థులకు కూడా పథకాన్ని వర్తింప చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ముందుకొచ్చింది. లక్షన్నర మందికి లబ్ధి జిల్లాలోని 46 మండలాల్లో 2,358 ప్రభుత్వ పాఠశాలల్లో 1,48,324 మంది విద్యార్థులకు భోజనాన్ని ఇవ్వనున్నారు. గురువారం ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయి. 10.30 వరకు విద్యార్థులకు బేసిక్స్‌తో పాటు ఆటపాటలు, సాంస్క ృతిక కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ మేరకు అన్ని మండలాల్లో ఎంఈఓలు ప్రధానోపాధ్యాయుల సమావేశాలు ఏర్పాటు చేసి పథకాన్ని ప్రారంభించే చర్యలు తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్న భోజన పథక అమలు గురించి గ్రామాల్లో దండోరా వేయించారు. రోజు భోజనం కాగానే విద్యార్థు ల సంఖ్యను ఎస్ఎంఎస్ల రూపంలో ఎంఈఓ కార్యాలయాలకు అందజేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, 2009లోనూ ఇలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని వేసవి సెలవుల్లో కొనసాగించారు. -
బాధ్యతలు ఎవరికి?
♦ సెలవుల్లో మధ్యాహ్న భోజనంపై కరువు మండలాల్లో సందిగ్ధత ♦ జిల్లా కలెక్టర్లు చూసుకుంటారు: ఉప ముఖ్యమంత్రి కడియం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 231 కరువు మండలాల్లో వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై కొంత గందరగోళం నెలకొంది. ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈనెల 23 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ప్రారంభం అవుతాయని, అప్పటినుంచి మధ్నాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ఎండల తీవ్రత దృష్ట్యా వేసవి సెలవులను ఈనెల 16 నుంచే ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కరువు మండలాల్లో 16 నుంచి మధ్యాహ్న భోజనం పథకం కొనసాగిస్తారా? లేక ఈనెల 23నుంచి అమలు చేస్తారా? అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. శుక్రవారం రాత్రి వరకు కూడా దీనిపై ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారులకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో భోజనం బాధ్యతలను ఎవరికి అప్పగించాలనేదానిపై ప్రధానోపాధ్యాయులు అయోమయంలో పడ్డారు. అయితే మౌఖికంగా మాత్రం స్థానికంగా ఉండే గ్రామ కార్యదర్శులకు బాధ్యత అప్పగిస్తే బాగుంటుందన్న ఆలోచనలు చేశారు. ఇదే విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని వివరణ కోరగా.. ఆ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించామని పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులను బట్టి వారు చూసుకుంటారని ఆయన తెలిపారు. -
‘మధ్యాహ్న భోజనం’పై అసంతృప్తి
పథకంలో లోటుపాట్లు సరిచేయాలని కేంద్రం సూచన సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం పెదవి విరిచింది. మెదక్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలో వంటగదులు, వాటిని నిర్మించడానికి స్థలం ఉన్నప్పటికీ, ఓ ఎన్జీవో ఏర్పాటు చేసిన సెంట్రల్ కిచెన్ నుంచి మాత్రమే మధ్యాహ్న భోజనం చేరుతోందని, ఇది కచ్చితంగా ఈ పథకం మార్గదర్శకాల ఉల్లంఘనేనని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ఈ పథకం కింద పిల్లల కవరేజ్ కూడా తక్కువేనని, రెండు ఎన్జీవోలు కేంద్రీయ వంటగదుల నుంచి భోజనాన్ని సరఫరా చేస్తున్నాయంది. పథకం కింద స్కూల్ ఆధారిత వంట గదులను, ఆ ప్రాంతంలోని ప్రజల ప్రమేయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించింది. 2015-16కి గాను ఏప్రిల్- డిసెంబర్ మధ్య పథకం అమలును మంత్రిత్వశాఖ సమీక్షించింది. 30,408 వంటగదులు, స్టోర్లు మంజూరు కాగా, 25 శాతం మాత్రమే పూర్తయ్యాయని, 15,348 వంటగదులు, స్టోర్ల నిర్మాణపు పనులు ప్రారంభమే కాలేదంది. తెలంగాణలో 48 శాతం పాఠశాలలోనే ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయని, అన్ని పాఠశాలలకు అందించాలని శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. పిల్లల కవరేజ్ తక్కువ: రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద తెలంగాణలో పిల్లల కవరేజ్ అతి తక్కువని, నమోదైన పిల్లలలో కేవలం 69శాతం మందికే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారని కేంద్రం గుర్తించింది. 58శాతం పిల్లలకు ఐరన్ ఫోలిక్ యాసిడ్(ఐఎఫ్ఏ), 14శాతం మందికి విటమిన్ ‘ఏ’, 40శాతం మందికి డీవార్మింగ్ టాబ్లెట్లు అందించారని గమనించింది. ఈ పథకం కింద మేనేజ్మెంట్, మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్నిధులు12 శాతం మాత్రమే వినియోగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. -
హమ్మయ్య
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిధులను ఎట్టకేలకు ప్రభుత్వం పెంచింది. ఏజెన్సీ నిర్వాహకుల ఇబ్బందులను కొంత వరకు తగ్గించింది. నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందించడానికి వెసులుబాటు కల్పించింది. పెరిగిన మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నిధులు ‘జీవో 31’ జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి ప్రతి నెలా జిల్లాపై రూ.30 లక్షల అదనపు భారం సత్తెనపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నిర్వహణ నిధులు పెంచాలని ఏజెన్సీ నిర్వాహకులు కొంతకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఇచ్చే నిధులను కొంత పెంచుతూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా శుక్రవారం జీవో 31 జారీ చేశారు. ఈ ఉత్తర్వులు గత ఏడాది జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8 తరగతులు చదువుతున్న విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన సదుపాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. 1 నుంచి 8 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అయ్యే ఖర్చును ఆయా ప్రభుత్వాలు ఉమ్మడిగా భరిస్తాయి. 9,10 తరగతుల విద్యార్థులకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మధ్యాహ్న భోజన నిర్వహణ నిధులు అప్పటికి అమల్లో ఉన్న మెస్ ఛార్జీలను బట్టి ఏటా 7.5 శాతం తక్కువ కాకుండా పెంచాల్సి ఉంది. దీని ప్రకారం ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా ప్రభుత్వం పెంచింది. కొంత ఆలస్యమైనప్పటికీ గత ఏడాది జూలై నుంచి వర్తింపు జేయడంతో నష్టపోయిన మొత్తాన్ని పూడ్చినట్లు అయింది. జిల్లాపై రూ.30 లక్షల భారం... జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 2,739, ప్రాథమికోన్నత పాఠశాలలు 439, ఉన్నత పాఠశాలలు 408 ఉన్నాయి. మొత్తం 3,586 పాఠశాలలు ఉండగా వీటిలో 3,21,307 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 2,11,916 మంది ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.2 కోట్లు ఖర్చు చేస్తుంది. ప్రభుత్వం తాజాగా మెస్ చార్జీలు పెంచడంతో ప్రతి నెలా రూ. 30 లక్షల వరకు జిల్లా పై అదనపు భారం పడుతుందని అంచనా. జిల్లా వ్యాప్తంగా ఈ పథకాన్ని 3,696 నిర్వాహణ ఏజన్సీలు అమలు చేస్తున్నాయి. మొత్తం 6,647 మంది వంట సిబ్బంది పని చేస్తున్నారు. తాజాగా పెరిగిన ధరలతో అప్పుల భారం నుంచి కొంత మేరకు వీరికి ఉపశమనం కలుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలు ఇలా.. ఒక్కో విద్యార్థికి ఒక రోజుకు పెంచిన ధరలు ఇలా ఉన్నాయి పాఠశాల ప్రస్తుత ధర కొత్త ధర పెరిగిన మొత్తం ప్రాథమిక రూ. 4.60 రూ. 4.86 26 పైసలు ప్రాథమి కోన్నత రూ. 6.38 రూ. 6.78 40 పైసలు ఉన్నత రూ. 6.38 రూ. 6.78 40 పైసలు -
‘అప్పు’ చేసి.. పప్పు కూడు
మధ్యాహ్న భోజన పథకం మెనూ ఇలా.. సోమ, గురువారం : అన్నం + కూరగాయలతో కూడిన సాంబారు మంగళవారం, శుక్రవారం : ఏదైనా ఒక కూర+ రసం బుధవారం, శనివారం : పప్పు, ఆకు కూర పప్పు వీటితో పాటు వారానికిరెండు రోజులు కోడిగుడ్డును అందించాలి. ధర్మవరం : మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు ఐదు నెలలుగా బిల్లులు మంజూరు కాలేదు. దీంతో ఏజెన్సీలను నడిపేందుకు నిర్వాహకులు పడరాని పాట్లు పడుతున్నారు. అప్పో సప్పో చేసి అన్నం పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించలేక పోతున్నామని వారు వాపోతున్నారు.జిల్లా వ్యాప్తంగా 3,742 ప్రాథమిక, 596 ప్రాథమికోన్నత, 603 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,90,782 మంది చదువుతున్నారు. 4,491 ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం 1 నుంచి 8వ తరగతి పిల్లలకు ఒక్కొక్కరికి రూ.4.60 పైసలు, 9,10 తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6.30 చొప్పున చెల్లిస్తోంది. రూ. లక్షల్లో బకాయిలు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు వేతనాలు, బిల్లుల రూపంలో రూ.లక్షల్లో బకాయిలున్నాయి. సగటున వంద మంది విద్యార్థులకు భోజనం అందిస్తున్న ఏజెన్సీకి నెలకు రూ.20 వేల దాకా బిల్లు అందాల్సివుంది. అంటే ఐదు నెలలకు కలిపి రూ.లక్ష దాకా బకాయి ఉంది. ప్రాథమిక పాఠశాలలకు 2015 నవంబర్ నుంచి.. ఉన్నత పాఠశాలలకు అక్టోబర్ నుంచి బిల్లులు చెల్లించాల్సివుంది. -
కాలేజీల్లో ‘మధ్యాహ్నం’
డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: పేద విద్యార్థులకు పట్టెడన్నం పెట్టాలనే సంకల్పానికి జిల్లా యంత్రాంగం కార్యరూపం ఇచ్చింది. ఇప్పటికే పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మధ్యాహ్న భోజనాన్ని డిగ్రీ విద్యార్థులకు కూడా అందుబాటులోకి తెచ్చింది. ఆకలి కడుపుతో కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు అక్కడే ఆహారా న్ని వడ్డించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించింది. శనివారం కూకట్పల్లి, మల్కాజిగిరి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, తాండూ రు, వికారాబాద్‌లోని డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. కటిక దారిధ్యం అనుభవిస్తున్న విద్యార్థులే సర్కారు కాలేజీల్లో చదువుతున్నారని భావించిన కలెక్టర్ రఘునందన్‌రావు డిగ్రీ తృతీయ ఏడాది విద్యార్థుల కడుపు నింపాలని నిర్ణయించారు. ఒక పూట భోజనం పెట్టడం ద్వారా చదువుపై శ్రద్ధ పెరిగి, ఉత్తీర్ణతాశాతం పెరుగుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిర్వహించిన సర్వేలో కూడా ఈ విషయం స్పష్టం కావడంతో ప్రయోగాత్మకంగా డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు మధ్యాహ్నభోజ నం వడ్డించాలనే ఆలోచనకు వచ్చారు. తన విచక్షణాధికారంతో ప్రత్యేకంగా నిధులను కూడా కేటాయించారు. వంట సామగ్రి, కూరగాయలు, ప్లేట్లను సమకూర్చుకోవడానికి నిధులు కేటాయించారు. ఈ క్రమంలోనే జిల్లావ్యాప్తంగా డిగ్రీ మూడో ఏడాది చదివే 1200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందుబాటులోకి తెచ్చారు. దశలవారీగా ఈ పథకాన్ని ఇంటర్మీడియట్, డిగ్రీ ఒకటి, రెండో సంవత్సరం విద్యార్థులకు కూడా అమలు చేయాలని నిర్ణయించారు. చాలాచోట్ల డిగ్రీ, జూనియర్ కాలేజీలు ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి. దీంతో ఉదయం పూట అ ల్పాహారం తీసుకోకుండానే కళాశాలకు హాజరవుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టనున్నారు. అదేసమయంలో మధ్యాహ్న వేళల్లో నడిచే విద్యార్థులకు ఆహారం తీసుకున్న తర్వాతే క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఫ్యాకల్టీకి కూడా అక్కడే! డిగ్రీ కాలేజీల్లోని ఫ్యాకల్టీ కూడా అక్కడే భోజనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చాలా కాలేజీల్లో అధ్యాపకుల కొరత వేధిస్తుండడం.. అరకొరగా బోధనలు సాగుతుం డడం కూడా సర్కారు కాలేజీల్లో విద్యాప్రమాణాలు తగ్గిపోవడానికి కారణమని అంచనాకొచ్చిన ఆయన.. మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టిన కళాశాలల్లో వార్షిక పరీక్షల వరకు అదనంగా మూడు తరగుతులు బోధించాలని లెక్చరర్లకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థు లు కడుపునిండా తిని.. మెదడుకు పనిపెడితే ఉత్తీర్ణతాశాతం అదంతట అదే పెరుగుతుంద ని భావిస్తున్నారు. ఈ ప్రయోగం సఫలమైతే జూనియర్ కాలేజీల్లో చదివే 4,140 మంది విద్యార్థులకు కూడా మధ్యాహ్నభోజనం పెట్టేలా నిర్ణయం తీసుకోనున్నారు. -
మధ్యాహ్న భోజనంపై ‘మూడో కన్ను’
♦ జనవరి 18 నుంచి ప్రత్యేక బృందాలతో తనిఖీలు ♦ నిర్ణయించిన విద్యాశాఖ.. షెడ్యూలు ఖరారు ♦ వంట నుంచి పాత్రలు కడిగే వరకు పరిస్థితులపై అధ్యయనం ♦ సెస్, ఎన్ఐఎన్, హోంసైన్స్ కాలేజీ ప్రతినిధులతో తనిఖీ బృందాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం తీరును తెలుసుకునేందుకు విద్యాశాఖ ‘మూడో కన్ను’ను ప్రయోగించనుంది. సేవాసంస్థలతో ఏర్పాటైన బృందాలు ‘థర్డ్ పార్టీ’ తనిఖీలను చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటోంది. ఈ తనఖీలను జనవరి 18, 19, 20, 21 తేదీల్లో నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. భోజనం వండటం మొదలుకొని నిల్వ చేయడం, విద్యార్థులకు పెట్టడం, ఆ తరువాత పాత్రలు శుభ్ర పరిచే వరకూ అన్నింటా ఎలా పని చేస్తున్నారన్న అంశాలను తెలుసుకునేందుకు ఈ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి వంటి కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడో ఉదయం 5 గంటలకు వండిన భోజనం మధ్యాహ్నం విద్యార్థులకు పెడుతున్నారని, దీంతో అది పాడవుతోందని, దుర్వాసన వస్తోందన్న ఫిర్యాదులు ఇటీవల విద్యాశాఖకు అందాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు తీరుపై అధ్యయనం చేసేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. ఈ తనిఖీలను విద్యాశాఖ నేతృత్వంలో కాకుండా ‘థర్డ్ పార్టీ’ నేతృత్వంలో చేపట్టాలని, తద్వారా కచ్చితమైన నివేదిక వస్తుందన్న ఆలోచనలతో ఈ చర్యలు చేపట్టింది. దాంతో తదుపరి చర్యలపై పక్కాగా దృష్టి సారించవచ్చని భావిస్తోంది. ఇందులో భాగంగా సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), హోంసైన్స్ కాలేజీ, స్వచ్ఛంద సంస్థకు చెందిన ప్రతినిధులు సభ్యులుగా కలిగిన బృందాల నేతృత్వంలో ఈ తనిఖీలకు చర్యలు చేపడుతోంది. మొదటి దశలో వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తనిఖీలకు ఏర్పాట్లు చేస్తోంది. ఒక్కో బృందం ఒక్కో జిల్లాలో రెండు రోజుల పాటు పాఠశాలల్లో పర్యటించి భోజనం అందిస్తున్న తీరుపై అధ్యయనం చేస్తుంది. ఆ తరువాత ఆయా బృందాలను విద్యాశాఖకు అందజేసే నివేదిక ఆధారంగా అవసరమైన చర్యలు చేపట్టవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మధ్యాహ్న భోజనం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకటో నుంచి 8వ తరగతి వరకున్న 22,44,322 మంది విద్యార్థులకు భోజనం అందించేందుకు ఏటా రూ.324 కోట్లు వెచ్చిస్తోంది. అలాగే 9, 10 తరగతుల 4,70,571 మంది విద్యార్థులకు భోజనం అందించేందుకు ఏటా రూ. 90 కోట్లు వెచ్చిస్తోంది. ఇలా మధ్యాహ్న భోజనం అందించేందుకు ఒక్కో విద్యార్థిపై చెల్లిస్తున్న మొత్తంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రోజుకు రూపాయి వంతున వారంలో రెండు కోడిగుడ్లు అందించేందుకు అదనంగా చర్యలు చేపట్టింది. సన్నబియ్యంతో వండిన భోజనం అందిస్తోంది. అయినా ఫిర్యాదులందుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనానికి సిద్ధమైంది. ఆహార నాణ్యతపైనా పరీక్షలు భోజనం నాణ్యత, పోషక విలువలపైనా పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఇందుకోసం ఎన్ఐఎన్ వంటి జాతీయ స్థాయి ఆహార పరిశోధన సంస్థలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలు కలిగిన ఆహారం అందించకపోతే వృథానేనన్న భావనతో ఈ చర్యలకు సిద్ధం అవుతోంది. ఆకస్మిక తనిఖీల ద్వారా ఆహార శాంపిళ్లను సేకరించి పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. -
ఆన్లైన్లో భోజన పథకం వివరాలు
విశాఖ : ఇకపై మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని పథకం రాష్ట్ర అసిస్టెంట్ డెరైక్టర్ గౌరీశంకర్ తెలిపారు. విశాఖలోని ఓ ప్రైవేట్ స్కూల్లో బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఎంఈఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తదితర వివరాలను ప్రతి నెలా ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు దగ్గర నుంచి తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ప్రహరీలు, విద్యార్థుల సంఖ్య తదితర వివరాలతో కూడిన యు డైస్‌ను సిద్ధం చేయాలని ప్లానింగ్ అధికారులకు సూచించారు. తరువాత రైల్వే న్యూ కాలనీలో గల కె.ఎన్.ఎం.స్కూల్, ఎంసీహెచ్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం తీరును పరిశీలించారు. నాణ్యమైన భోజనం పెట్టాలని అధికారులు ఆదేశించగా మధ్యాహ్న భోజన పథకం బకాయిలు విడుదల చేయాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు. -
ఇంటర్లో మధ్యాహ్న భోజనం
గోదావరిఖని కళాశాలలో ప్రారంభం గోదావరిఖని టౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కళశాల విద్యార్థుల కోసం ఇలాంటి పథకం లేదు. కానీ, కరీంనగర్ జిల్లా గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో దాతల సహకారంతో సోమవారం మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు సాయంత్రం 4 గంటల వరకు కళాశాలలో ఉండాల్సి వస్తుంది. అయితే, చాలా మంది విద్యార్థులు మధ్యాహ్నమే కళాశాలకు డుమ్మా కొడుతున్నారు. దీంతో విద్యార్థుల హాజరు, ఉత్తీర్ణత తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ మాధవి, అధ్యాపకులు.. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని భావించారు. ఇందు కోసం జిల్లా అధికారుల చర్చించిన ప్రిన్సిపాల్ వారి అనుమతి పొందారు. పట్టణంలోని రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వాణిజ్య, స్వచ్ఛంద సంస్థల వారిని కలిశారు. విరాళాలు ఇవ్వాలని కోరగా, సానుకూల స్పందన వచ్చింది. దాతల బియ్యం, వంట సామగ్రి ఇచ్చారు. కళాశాలలో మొత్తంగా 800 మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం పెరుగన్నం, చట్నీలతో వారికి భోజనం వడ్డిస్తున్నారు. -
వెతల నడుమ కుతకుతలు
మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల అవస్థలు సగం కూడా పూర్తికాని వంట షెడ్ల నిర్మాణం మంజూరైనవి 1043...నిర్మాణం పూర్తయినవి 405 అసలు పనులు ప్రారంభించనవి 232 షెడ్లు మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ నిమిత్తం సర్వశిక్ష అభియాన్ కింద 1043 వంటషెడ్లు మంజూరైనా అందులో సగం కూడా నిర్మాణం పూర్తి చేసుకోలేదు. దీంతో పథకం నిర్వాహక ఏజెన్సీ మహిళలు అవస్థలు పడుతున్నారు. ఎండైనా...వానైనా.. ఆరు బయటే వంటలు చేసి సమయానికి అందజేయాల్సిన బాధ్యతను మోయలేకపోతున్నారు. కొవ్వూరు : సర్వశిక్షా అభియాన్ కింద జిల్లాకు 1043 వంటషెడ్లు మంజూరు కాగా వీటి నిర్మాణ బాధ్యతలను తొమ్మిది ప్రభుత్వ ఏజెన్సీలకు అప్పగించారు. ఒక్కో వంట షెడ్డుకి రూ.1.50 లక్షలు చొప్పున 2012-13 ఆర్థిక సంవత్సరంలో సర్వశిక్షాభియాన్ నుంచి జిల్లాకు రూ.15.64 కోట్లు మంజూరు చేశారు. వీటిలో మొదటి విడతగా జిల్లాకు రూ.9.62 కోట్లు విడుదల చేశారు. ఇంకా రూ.6.02 కోట్లు ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సి ఉంది. జిల్లాకు కేటాయించిన వంట షెడ్ల నిర్మాణ బాధ్యతలను గృహానిర్మాణ శాఖ, రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం), ఐటీడీఏ, భీమవరం, ఏలూరు, నరసాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు మునిసిపాలిటీలకు అప్పగించారు. మంజూరైన వంట షెడ్లల్లో ఇప్పటి వరకు 405 షెడ్లు పూర్తిచేయగా 232 షెడ్లు నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. 276 షెడ్లు రూఫ్లెవల్లోనూ, 38 లెంటల్ లెవెల్, 65 బేస్మెంట్ లెవెల్ ఉండగా, 27 షెడ్ల పనులు ఇటీవలే ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 8 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. చాలా పాఠశాలల్లో మధ్యాహ్నా భోజనం పథకం నిర్వహణకు కనీసం నిలువ నీడ లేదు. దీంతో కొన్నిచోట్ల తాటాకు పాకల్లోను, మరికొన్నిచోట్ల సైకిల్ షెడ్లలో, ఆరుబయట, పాఠశాల అరుగులపైన వంటలు చేస్తూ మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. పురోగతి లేని వంటషెడ్ల నిర్మాణం గృహనిర్మాణ శాఖకు 449 షెడ్ల నిర్మాణం కేటాయించారు. నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో పూర్తికాకపోవడంతో వీటిలో 125 షెడ్లను రాజీవ్ విద్యామిషన్‌కు అప్పగించారు. వీటిలో కేవలం 44 షెడ్లే పూర్తయ్యాయి. 67 షెడ్లు ప్రారంభానికి నోచుకోలేదు. ఐటీడీఏకు 33 కేటాయించగా 28 పూర్తిచేశారు. మరో 5 ప్రారంభం కాలేదు. ఆర్వీఎంకు 634 కేటాయించగా 324 షెడ్లు పూర్తిచేశారు. మరో 125 షెడ్లు ప్రారంభం కాలేదు. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. భీమవరం, పాలకొల్లు మునిసిపాలిటీలకు 12 వంట షెడ్లు చొప్పున కేటాయించగా రెండుచోట్ల ఏ ఒక్కటీ ప్రారంభించలేదు. ఏలూరు కార్పొరేషన్‌కు ఏడు కేటాయించగా ఆరు పూర్తి చేశారు. మరొకటి నిర్మించాల్సి ఉంది. నిడదవోలు పురపాలక సంఘానికి ఐదు కేటాయించగా నాలుగు షెడ్లు నేటికీ ప్రారంభించలేదు. తాడేపల్లిగూడెం మునిసిపాలిటీకి 11 కేటాయించగా అతి కష్టం మీద 3 పూర్తిచేశారు. ఒక షెడ్డు ఇప్పటికీ ప్రారంభించకపోగా మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. నరసాపురం మునిసిపాలిటీకి ఐదు కేటాయించగా ఒక షెడ్డు పనులు ప్రారంభించలేదు. ఆగస్టు 15 నాటికి పూర్తి చేస్తాం అసంపూర్తిగా ఉన్న వంటషెడ్లను ఈనె ల 15వ తేదీ నాటికి పూర్తి చేస్తాం. ఇప్పటికే దిగువస్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పనులు అప్పగించిన ఏజెన్సీలు నెలరోజులు గడువు అడుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వారంలో అన్ని షెడ్ల నిర్మాణం పూర్తి చేయిస్తాం. డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖాధికారి -
దొడ్డుబియ్యం.. పురుగుల అన్నం..
♦ అమలుకాని ప్రభుత్వ ఆదేశాలు ♦ కొరవడిన అధికారుల పర్యవేక్షణ ♦ ఇబ్బందులు ఎదుర్కొంటున్న రేగోడ్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపవుట్స్‌ను తగ్గించి విద్యార్థు లకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన మధ్యాహ్న భోజన పథకం అభాసుపాలవుతోంది. సన్న బియ్యం సరఫరా మూన్నాళ్ల ముచ్చటగా మారింది. ప్రభుత్వ ఆదేశాలు మచ్చుకైనా కానరావడం లేదు. పర్య వేక్షించాల్సిన అధికారులు పత్తా లేకపోవడంతో దొడ్డు బియ్యం.. పురుగుల అన్నం.. నీళ్లచారుతో విద్యార్థులు బక్కచిక్కిపోతున్నారు. - రేగోడ్ సర్కారు బడుల్లో చదువుకునే పేద విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కానీ సన్నబియ్యం వంట మూన్నాళ్ల ముచ్చటగా మారింది. పాలకులకు.. అధికారులు పథకం ప్రారంభంలో చూపిన శ్రద్ధ ఇపుడు కనిపించడం లేదు. ఫలితంగా రేగోడ్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దొడ్డుబియ్యం.. పురుగుల అన్నం పెడుతున్న సంఘటన మంగళవారం వెలుగుచూసింది. వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదవతరగతి నుంచి పదోతరగతి వరకు 385 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే మంగళవారం అక్షయపాత్ర ద్వారా వచ్చిన వంటకాల ను వడ్డించారు. ఈ సమయంలో పాఠశాలను సందర్శించిన విలేకరులు విద్యార్థులకు పెట్టిన భోజనంలో పురుగులు ఉండడం, సన్నబియ్యం బదులు దొడ్డు బియ్యం ఉండడం కనిపించింది. అప్పటికే 300 మం దికి పైగా విద్యార్థులు, పలువురు ఉపాధ్యాయులు భోజనం చేశారు. మరికొంత మంది భోజనాన్ని బహిష్కరించి అరటిపళ్లతో సరిపెట్టుకున్నారు. విద్యార్థులకు బొడ్డుబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నా ఉపాధ్యాయులు అధికారుల దృష్టికి తీసుక వెళ్లకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ఐ విచారణ దొడ్డు బియ్యం.. పురుగుల అన్నం విషయం తెలుసుకున్న స్థానిక ఎంఆర్ఐ మర్రి ప్రదీప్, వీఆర్ఓ ఆదర్శ్ స్థానిక ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్షయపాత్ర ద్వారా విదార్థుల కోసం వండి తెచ్చిన అన్నాన్ని పరిశీలించారు. దొడ్డుబియ్యం.. అన్నంలో పురుగులు ఉండటాన్ని గమనించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. అన్నం తినలేదు పురుగులు ఉన్నాయని అన్నం తినలేదు. అరటిపళ్లను తిని క్లాసుకు వెళ్లాను. రోజూ దొడ్డుబియ్యం అన్నం పెడుతున్నారు. సన్నబియ్యం అన్నమాటేగానీ కనిపించడం లేదు. కూరల్లో కూడా నాణ్యత ఉండడం లేదు. - ప్రశాంత్, పదోతరగతి పర్యవేక్షణ కరువైంది సన్నబియ్యం పథకంపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. దొడ్డు బియ్యంతో విద్యార్థులకు భోజనం పెట్టడం దారుణం. కలెక్టర్ చొరవ చూపి ఈ ఘనటనపై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. - పూర్ణచందర్, నోబుల్యూత్ బాధ్యుడు -
ఆ భోజనం మాకొద్దు
చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన క్షీరభాగ్యతో పాటు మధ్యాహ్న భోజన పధకాన్ని లక్షలాది మంది చిన్నారులు వద్దంటున్నారు. రాష్ట్రంలోని దాదాపు 2.67లక్షల మంది భోజనాన్ని వద్దనుకుంటే, మరో 2.46లక్షల మంది క్షీరభాగ్య పథకానికి దూరంగా ఉంటున్నారు. ఇవి ప్రభుత్వ గణాంకాల ద్వారా వెల్లడవుతున్న అంశాలు. బెంగళూరు: రాష్ట్రంలోని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నతస్థాయి పాఠశాలలతోపాటు మదరసాల్లో సైతం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాలు అందజేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 5,582 పాఠశాలలుండగా, వీటిలో మొత్తం 64.74లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో గత ఏడాది 62.07లక్షల మంది మధ్యాహ్న భోజనం తీసుకుంటే, 61.28 లక్షల మంది చిన్నారులు క్షీరభాగ్యలో భాగంగా అందజేసే పాలను తీసుకున్నారు. అంటే పాఠశాలల్లోని మొత్తం విద్యార్థుల్లో 2.67లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి, 2.46లక్షల మంది చిన్నారులు క్షీరభాగ్యకు దూరంగా ఉండిపోయారు. వీరంతా కావాలనే మధ్యాహ్నభోజనాన్ని, క్షీరభాగ్యలో ఇచ్చే పాలను వద్దనుకుంటున్నారని అధికారులే చెబుతున్నారు. కారణాలివే: విద్యార్థులు తమంతట తామే మ ధ్యాహ్న భోజ నాన్ని, క్షీరభాగ్య పథకాన్ని వద్దనుకోవడానికి కొన్ని కారణాలను అధికారులు అన్వేషించారు. ప్రస్తుతం క్షీరభాగ్య పథకంలో పాలను పాల పొడిని కలపడం ద్వారా వి ద్యార్థులకు అందజేస్తున్నారు. 18 గ్రాముల పాలపొడిని నీటిలో కలపడం ద్వారా 150 మిల్లీలీటర్ల పాలను తయారు చేసి ఒక్కో విద్యార్థికి వారంలో మూడు రోజుల పాటు అందజేస్తున్నారు. అయితే పాలపొడి ద్వారా తయారుచేసిన పాలను తాగడం ద్వారా ఆడపిల్లలు లావుగా తయారవుతారనే భావన చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. తమ ఆడపిల్లలు ఊబకాయం బారిన పడతారనే ఉద్దేశంతోనే చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్షీరభాగ్యకు దూరంగా ఉంచుతున్నారు. ఇదే సందర్భంలో ప్రతి రోజూ ఏదో ఒక చోట మధ్యాహ్న భోజనాన్ని తీసుకున్న చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మ ధ్యా హ్న భోజనానికి దూరంగా ఉంచుతున్నారు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల్లో అందజేసే భోజనంలో నాణ్యత లేదని, ఆ భోజనం తయారీలో ఉపయోగించే సరుకులు నాసిరకమైనవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. అందువల్ల లక్షల సంఖ్యలో చిన్నారులు మ ధ్యాహ్న భోజనానికి దూరంగా ఉంటున్నారని అక్షర దాసోహ అధికారులు చెబుతున్నారు. ప్రయత్నాలు ఫలించలేదు పాఠశాలల్లోని విద్యార్థులందరినీ మధ్యాహ్న భోజనం, క్షీరభాగ్య పథకాల్లో భాగస్వాములను చేసేందుకు అక్షర దాసోహ అధికారులు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించడం లేదని అధికారులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనం, క్షీరభాగ్య ఆవశ్యకతను తల్లిదండ్రులకు తెలియజేసేందుకు అక్షర దా సోహ అధికారులు ఇంటింటికీ వెళ్లి జాగృతి కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు. అం దువల్ల వచ్చే విద్యా ఏడాది మధ్యాహ్న భోజ నం, క్షీరభాగ్యలో భాగస్వాములయ్యే విద్యార్థుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
మింగుడు పడని ముద్ద
మధ్యాహ్న భోజనం బకాయిల చెల్లింపుల్లో జాప్యం ధరల పెరుగులతో భారంగా మారిన నిర్వహణ విద్యార్థులకు అందని పౌష్టికాహారం కష్టాల్లో నిర్వాహకులు ప్రతి ఒక్కరికి విద్య అందాలనే లక్ష్యంతో.. చదువు విద్యార్థికి భారం కాకూడదని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఓ వైపు విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో విద్యనందిస్తూనే, విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం ద్వారా అక్షరాస్యత శాతం పెంచాలనేది ప్రభుత్వ ఆలోచన. క్రమంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వ ల్ల ఈ పథకం ప్రమాదంలో పడే పరిస్థితి నెలకొంది. దీనికి ధరల పెరుగుదల తోడై భోజనం పెట్టేవారికి.. తినే వారికి ముద్ద మింగుడుపడ్డం లేదు. - విశాఖ ఎడ్యుకేషన్ ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో మహిళా సంఘాలు మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వీరికి ఈ పథకం నిర్వహణ ద్వారా వచ్చే వెయ్యి రూపాయిల భృతి కోసం.. కుటుంబానికి ఓ ఆధారం, భరోసా దొరుకుతుందని వీటి నిర్వహణబాధ్యతలు తీసుకున్నారు. ప్రభుత్వం ఈ పథకం కింద డబ్బులు ఎప్పటికప్పుడు చెల్లించడంతో మొద ట్లో భాగానే నడిచింది. కానీ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నెలల కొద్ది బకాయిలు చెల్లించకుండా ఎప్పటికప్పుడు తాత్సారం చేస్తూ నిర్వహకులపై తీవ్ర భారం మోపింది. అయితే పిల్లలకు భోజనం ఆగిపోకూడదనే ఉద్దేశంతో తప్పని పరిస్థితుల్లో కిరాణా షాపుల వద్ద అరువు పెట్టి సరుకులు తీసుకొచ్చి ఒడ్డించి పెడుతున్నారు. కిరాణా సరుకులకు లక్షలు అయ్యే సమయంలో ఎవరివద్దనైనా అప్పు చేసి వారికి చెల్లించడం చేస్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజన నిర్వహణ సక్రమంగానే జరుగుతుండటంతో.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు కాలయాపన చేస్తూ బకాయిలు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. 10 నెలలుగా బకాయిలు..: గత 10 నెలల నుంచి మధ్యాహ్న భోజన నిర్వహణకు సంబంధించిన జీతాలు, సరుకుల బకాయిలు ప్రభుత్వం నిర్వాహకులకు అందించలేదు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల జీతాలు వెయ్యి రూపాయిల చొప్పున మొత్తం రూ.4 కోట్లు, సరుకులకుగాను రూ.9 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభం సమయానికి మొత్తం బకాయిలు చెల్లిస్తామని నాయకులు చెప్పిన మాట వాస్తవ రూపంలోకి మాత్రం రాలేదు. నిర్వాహకుల వేతనం ఇప్పటికే విడుదలైనప్పటికీ.. ఆ మొత్తం అందించడంలో కూడా అధికారులు జాప్యం చేస్తున్నారు.పెరిగిన ధరలతో అదనపు భారం..: మధ్యాహ్న భోజన పథక నిర్వహణలో భాగంగా 1 నుంచి 5 వ తరగతి విద్యార్థికి రూ.4.65, 6 నుంచి 10 విద్యార్థులకు రూ 6.10 చెల్లిస్తూ వస్తోంది. దీంతో 5వ తరగతి వరకు విద్యార్థులకు 50 గ్రాముల బియ్యం, 10వ తరగతి వరకు విద్యార్ధులకు 100 గ్రాముల బియ్యం అందిస్తోంది. ప్రతి వారం మెనూలో అన్నంతో పాటు సాంబారు, పప్పు, కూరలు, వారానికి రెండు రోజులు గుడ్లు విద్యార్థులకు అందించాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరల్లో ఒక్కో గుడ్డు ఖరీదు రూ. 4.50. అలాగే కందిపప్పు ఖరీదు రూ. 60 నుంచి రూ. 130కు చేరింది. కూరగాయ ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరల కారణంగా మెనూ ప్రకారం పథకం నిర్వహించాలంటే తడిపిమోపుడవుతోంది. అదనంగా అరటిపండ్లు కూడా అందించాలని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కోవిద్యార్థిపై ఇది అదనపు ఖర్చు. ఏడాదికి ఆ ఏడాది ఖర్చులు పెరిగిపోతుంటే.. బడ్జెట్లో విద్య కోసం వెచ్చించే నిధులు మాత్రం తగ్గించుకుంటూ పోతోంది. గత ఏడాది రూ.13 వేల కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. -
కడుపు కాలిపోతాంది..
►నవంబర్ నుంచి బిల్లుల బకాయి ►కార్మికులకూ అందని వేతనాలు ►సెలవులు వచ్చినా రాని బిల్లులు ►అప్పుల పాలై విలవిల్లాడు తున్నామని మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల వేడుకోలు ఈమె పేరు నాగమ్మ. ప్రొద్దుటూరు పట్టణంలోని హోమస్పేట మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో వంట ఏజెన్సీ నిర్వహిస్తోంది. పాఠశాలలో 214 మంది విద్యార్థులు చదువుతుండగా ప్రతి రోజు వీరికి భోజనం వడ్డించేందుకు దాదాపు రూ.800 ఖర్చవుతోంది. ఈ ప్రకారం నెలకు రూ.18 వేల వరకు నాగమ్మ వెచ్చించింది. అయితే ప్రభుత్వం గత ఏడాది నవంబర్ నుంచి ఈమెకు బిల్లులు చెల్లించలేదు. ఎస్సీ వర్గానికి చెందిన ఈమె కడుపేదరాలు. ఏజెన్సీ నిర్వహణకు డబ్బు లేకపోవడంతో కొంత మంది ఉపాధ్యాయుల వద్ద అప్పు తీసుకుంది. అది సరిపోక తన ఇంటితోపాటు తన మనుమరాలి పెళ్లి కోసం సిద్ధం చేసుకున్న బంగారు హారం, మాటీలు, కమ్మలు, ఉంగరాలు తాకట్టు పెట్టింది. ఈమెకు గత ఏడాది ఆగస్టు నుంచి రూ.1000 వేతనం కూడా రాలేదు. ప్రస్తుతం అప్పుల ఊబిలో కూరుకపోయిన ఈమె.. తాను ఈ పథకాన్ని నిర్వహించలేనని అధికారులకు విన్నవించింది. ఈమెకు బకాయిలు చెల్లించిన తర్వాతే మరొకరికి ఈ ఏజెన్సీని అప్పగించాలని అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ప్రొద్దుటూరు : జిల్లాలో 3,561 పాఠశాలల్లో రోజూ మధ్యాహ్న భోజనం పథకం కింద 2,59,329 మంది విద్యార్థులకు అన్నం పెడుతున్నారు. ఇందుకుగాను సుమారు 9 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి గత ఏడాది నవంబర్ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు 6 నెలలకు సంబంధించిన మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఉన్నత పాఠశాలలకు సంబంధించి జనవరి నుంచి ఏప్రిల్ 24వ తేది వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. 1-8వ తరగతి విద్యార్థులకు రూ.4.60 చొప్పున, 9, 10 తరగతి విద్యార్థులకు రూ.6.30లు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ ప్రకారం ఒక్క ప్రొద్దుటూరు మండలంలోని 129 పాఠశాలలకు సంబంధించి మధ్యాహ్న భోజన బకాయిల బిల్లులు రూ.15 లక్షల వరకు చెల్లించాల్సి ఉందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోంది. బిల్లులు రాకపోవడంతో నిర్వాహకులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా పాఠశాలల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు గుడ్డు ఇవ్వడం లేదు. వారం లో ఓ రోజు గుడ్డు ఇస్తే మరో రోజు అరటిపండు ఇస్తున్నారు. చాలా మండలాల్లో ఈ సమస్య ఎంఈఓల దృష్టికి వెళ్లింది. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో పోషకాహారం అందక విద్యార్థులు నష్టపోతున్నారు. బిల్లులు చెల్లించలేని కారణంగా ఉపాధ్యాయులు కూడా నిర్వాహకులను గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్న బోజన బిల్లులకు సంబంధించి తరచూ ఇలాంటి సమస్య ఏర్పడుతుండటంతో దుకాణదారులు వీరికి సరుకులు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. ప్రత్యేకంగా గుడ్ల దుకాణ యజమానులు మాత్రం అప్పు ఇచ్చేందుకు అంగీకరించడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లాగే తమకూప్రభుత్వమే గుడ్లు సరఫరా చేస్తే బావుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది వేసవి సెలవులు వచ్చేనాటికి బకాయిలు లేకుండా బిల్లులు చెల్లించేవారు. ప్రొద్దుటూరుకు చెందిన పలువురు మధ్యాహ్న భోజన నిర్వాహకులు బకాయిలు చెల్లించాలని ఏకంగా గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్‌కు విన్నవించారు. ముఖ్యమంత్రికి సైతం లేఖలు పంపారు. ప్రస్తుతం పాఠశాల పునఃప్రారంభ సమయం సమీపిస్తున్నా ఇంకా బిల్లులు రాకపోవడం గమనార్హం. కార్మికులకు కూడా వేతనాలు లేవు మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహణకు సంబంధించి జిల్లాలో సుమారు 9 వేల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.1000 చొప్పున ప్రభుత్వం గౌరవ వేతనం చెల్లిస్తోంది. అయితే గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు వీరికి వేతనాలు రాలేదు. బిల్లులు మంజూరవుతూనే చెల్లిస్తాం మధ్యాహ్న భోజన బిల్లుల బకాయిలు ప్రభుత్వం నుంచి మంజూరవుతూనే చెల్లిస్తాం. చాలా మంది నిర్వాహకులు ఈ విషయాన్ని అడుగుతున్నారు. ట్రెజరీ ఆంక్షల కారణంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి. -
ఆరుబయట వ(మ)ంటలు
కడప ఎడ్యుకేషన్: రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించి పదేళ్లు దాటినా నేటికి సరైన వసతులు సమకూరలేదు. దీంతో వంట ఏజెన్సీ నిర్వాహకులు చెట్ల కింద, ఆరుబయట, గోడ పంచల కింద మధ్యాహ్న భోజనాన్ని వండి విద్యార్థులకు వడ్డిస్తున్నారు. దీంతో విద్యార్థుల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. జిల్లా వ్యాప్తంగా మొదటి విడత కింద 1150 వ ంట గదులు మంజూరు కాగా ఇందులో 912 గదుల పనులు ప్రారంభించారు. ఇందులో 676 నిర్మాణం పూర్తి గాకా ఇంకా 236కు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. రెండవ విడత కింద 637 వంట గదులు మంజూరు కాగా ఇందులో 274 పనులను ప్రారంభించారు. ఇందులో 84 వంట గదుల పనులు పూర్తి కాగా మిగతా 190 గదుల పనులు వివిధ ధశల్లో ఉన్నాయి. పనులు ఎప్పటికి పూర్తయ్యేనో: మెదటి, రెండవ విడత కింద మంజూరైన వంట గదుల పనులు పూర్తి కాలేదు. ఇందులో రెండు విడతలకు సంబంధించి 426 వంట గదుల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. కొంత మంది నిధులు తక్కవని అసలు పనులను మొదలే పెట్టలేదు. మొదటి విడత కింద మంజూరైన వంట గదులకు ఒకొక్క వంట గదికి రూ. 75 వేలు రాగా రెండవ విడత కింద మంజూరైన వాటికి ఒకొక్క దానికి 1.50 లక్షలు మంజూరయ్యాయి. అయినా కొన్ని చోట్ల నిధులు సరిపడవని పనులను ప్రారంభించలేదు. గాలిలో దీపంలా: ఆరుబయట వంటలు చేయటం వల్ల ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఉంది. ఏదైనా పొరపాటు జరిగితే విద్యార్థుల జీవితాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది. జిల్లా వ్యాప్తంగా 2.50 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందుతుంది. జిల్లా వ్యాప్తంగా 6498 వంట ఏజెన్సీలు పని చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజనానికి వసతులను ఏర్పాటు చేయాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
బువ్వ బిల్లు.. అందక ఘొల్లు
మధ్యాహ్న భోజన పథకం సదుపాయకర్తలకు రూ.37.94 కోట్లు బకాయి సొమ్ము అందకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్న మహిళలు ఏలూరు సిటీ : సర్కారు బడుల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులను ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. భోజనం నాణ్యతపై మాత్రమే దృష్టిసారిస్తున్న అధికారులు సదుపాయకర్తలకు (ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు) బిల్లులు చెల్లించే విషయంలో శ్రద్ధ చూపటం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో సదుపాయకర్తలకు నాలుగు నెలలు, ఉన్నత పాఠశాలల్లో పథకాన్ని అమలు చేస్తున్న నిర్వాహకులకు ఐదు నెలల నుంచి బిల్లులు విడుదల చేయకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో లక్షలాది రూపాయల మేర అప్పుతెచ్చి మరీ విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. పాత బకాయిలకు సంబంధించి మంజూరైన రూ.34.28 కోట్ల నిధుల్లో రూ.18.20 కోట్లను మాత్రమే సదుపాయకర్తలకు చెల్లిం చారు. మిగిలిన రూ.16.08 కోట్లు సదుపాయకర్తలకు అందలేదు. దీంతోపాటు రూ.21.86 కోట్ల కొత్త బకాయితో కలిపి మొత్తం రూ.37.94 కోట్ల మేర పేరుకుపోయాయి. ఖజానా నుంచి నిధులు విడుదల చేసే విషయమై ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో మంజూరైన నిధులు సైతం విడుదల కావడం లేదు. జీతాలూ ఇవ్వట్లేదు ఏలూరు వన్‌టౌన్‌లోని కస్తూరిబా బాలికోన్నత పాఠశాలలో 860 మందికి పైగా విద్యార్థినులు చదువుతున్నారు. రోజూ 600 నుంచి 700మంది ఆ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుంటారు. ఇక్కడి సదుపాయకర్తలకు నెలకు సుమారు రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతోంది. ఐదు నెలలుగా వీరికి బిల్లులు చెల్లించలేదు. లక్షలాది రూపాయలు అప్పులు తెచ్చి మరీ భోజనం పెట్టాల్సి వస్తోందని సదుపాయకర్తలు బావురుమంటున్నారు. ఆర్‌ఆర్‌పేటలోని ఈదర సుబ్బమ్మదేవి నగరపాలకోన్నత పాఠశాలలో సుమారు 500 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ రోజూ సుమారుగా 350నుంచి 400మంది పిల్లలు భోజనం చేస్తారు. పథకం నిర్వాహకులకు నెలకు రూ.30వేల నుంచి రూ.40 వేల వరకూ ఖర్చవుతోంది. ఇక్కడి వారికీ ఐదు నెలలుగా బిల్లులు రాలేదు. ఆదివారపుపేటలోని ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణ ఉన్నత పాఠశాలలో 500 మందికి పైగా విద్యార్థులున్నారు. నిత్యం 350మందికి పైగా పిల్లలు భోజనం చేస్తారు. ఇక్కడా బిల్లులు చెల్లించకపోవటంతో సదుపాయకర్తలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం వంట పనివారికి చెల్లించాల్సిన జీతం కూడా ఇవ్వటం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. నెలంతా పనిచేస్తే వారికిచ్చేది రూ.వెయ్యి మాత్రమే. అదికూడా విడుదల చేయటం లేదు. 3,350 స్కూళ్లు.. రూ.37.94 కోట్ల బకాయిలు జిల్లాలోని 2,637 ప్రాథమిక పాఠశాలల్లో 1,30,508 మంది, 276 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 76,304 మంది, 437 ఉన్నత పాఠశాలల్లో 46,354 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. ఒక్కో పాఠశాలలో భోజనం వండి వడ్డించే బాధ్యతను స్వయం సహా యక మహిళా సంఘాలకు అప్పగించారు. ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థికి రూ.6.38 చొప్పున, ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.4.60 చొప్పున చెల్లిస్తారు. వారానికి రెండుసార్లు కోడిగుడ్డు వేయాల్సి ఉంటుంది. ఒక్కో గుడ్డు ధర మార్కెట్లో రూ.4 ఉంది. విద్యార్థులకు ఇచ్చే కొద్దిమొత్తంలో కోడిగుడ్లు ఎలా కొనాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు. ఏడాదికి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి జిల్లాకు సుమారు రూ.61 కోట్లు వరకు నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటికే రూ.34.28 కోట్లు నిధులు మంజూరు చేశారు. కానీ నిర్వాహకులకు మాత్రం ఆ సొమ్ములో జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.18.20 కోట్లు చెల్లించగా, మిగిలిన రూ.16.08 కోట్లు ఇప్పటికీ అందలేదు. దీంతోపాటు సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఐదు నెలలకు బిల్లులు చెల్లించలేదని చెబుతున్నారు. ఖజానాలో నిధుల్లేక పోవటంతో పేరుకు మంజూరైనా ఉపయోగం లేకుండా పోయింది. మరో రూ.21.86 కోట్లు నిధులు విడుదల కావాల్సి ఉంది. నిర్వాహకులు వేతనాలుగా రూ.4.86 కోట్లు చెల్లించాల్సి ఉంది. -
‘మధ్యాహ్నా’నికి కట్టెల పొయ్యిలే దిక్కు
నిజాంసాగర్ : మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రభుత్వం సరఫరా చేసిన గ్యాస్ సిలిండర్లు, స్టౌలు మూలనపడ్డాయి. పాఠశాలల వారీగా అందించిన గ్యాస్ కనెక్షన్లకు ప్రభుత్వం సబ్సిడీని వర్తింపజేయకపోవడంతో వంట ఏజెన్సీలకు కట్టెల పొయ్యిలే దిక్కయ్యాయి. ఇరుకుగా ఉన్న వంటశాల గదులు, వరండాల్లో వంట తయారీకి ఏజెన్సీల నిర్వాహకులు నానా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఒక్క పూట సంపూర్ణ భోజనాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం వంట ఏజెన్సీల కష్టాలపై దృష్టి సారించడం లేదు. పాఠశాలల్లోని విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న నిర్వాహకులకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు రెం డు అంచెల పద్ధతిన బిల్లులు చెల్లిస్తున్నాయి. అవి వంట ఏజెన్సీలకు స్లాబ్ ధరలు ఏమాత్రం కడుపునింపడం లేవు. నెలనెలా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కార్మికులు, వంట ఏజెన్సీ నిర్వాహకులు అప్పుల పాలవుతున్నా రు. పాఠశాలల గ్యాస్ బండలకు సబ్సిడీ ఇవ్వకపోవడంతో నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో కట్టెలపొయ్యిలనే ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 2,303 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు ఒక్క పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నారు. 2 లక్షల కు పైగా విద్యార్థులు మధ్యాహ్న భోజనం లబ్ధిపొందుతున్నారు. పథకం అమలును పర్యవేక్షిస్తున్న అధికారులు.. వంట ఏజెన్సీ నిర్వాహకుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. విద్యార్థులకు ఒక్కపూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్న ప్రభుత్వం స్లాబ్రేట్లను పెంచకపోవడంతో కార్మికులు కష్టాలను ఎదుర్కుంటున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రూ. 4.35, ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు రూ. 6 చొప్పున వంట ఏజెన్సీలకు బిల్లులను చెల్లిస్తోంది. ప్రభుత్వం వంట కార్మికులకు చెల్లిస్తున్న బిల్లులు నిర్వాహకులకు ఏమాత్రం సరిపోకపోవడంతో అప్పులపాలవుతున్నారు. సిలిండర్లను సబ్సిడీపై సరఫరా చేయకపోవడంతో కట్టెల పొయ్యిలపైనే వంట చేస్తున్నారు. దీంతో సిలిండర్లను, గ్యాస్ స్టౌలను మూలన పడేశారు. -
అప్పుచేసి ‘మధ్యాహ్నం’
మూన్నెళ్లుగా అందని బిల్లులు * ఏజెన్సీ నిర్వాహకుల ఆందోళన * వంట కార్మికులకూ వేతనాలు కరువు నాగిరెడ్డిపేట : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ‘మధ్యాహ్న భోజన’పథకానికి సంబంధించిన బిల్లు లు మూడునెలలుగా పేరుకుపోయాయి.దీంతో పథకాన్ని అమలు పర్చేందుకు ఏజెన్సీ నిర్వాహకులు నానా అవస్థలు పడుతున్నారు. అప్పుచేసి పథకాన్ని అమలు పర్చక తప్పడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల కోసం వారు నిత్యం మండల కేంద్రాల్లోని విద్యావనరుల కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.11కోట్ల వరకు బకాయి పడినట్లు ఏజెన్సీ నిర్వాహకులు తెలుపుతున్నారు. జిల్లాలోని 2,303 పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలవుతోంది. వంటకార్మికులకు వెతలు పాఠశాలల్లో మధ్యాహ్నభోజనం వండిపెడుతున్న కార్మికులకు సైతం మూడునెలలుగా వేతనాలు అందడంలేదు. 1నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు మధ్యాహ్నభోజనం తింటే ఒక్కొక్కరికి రూ.4.35 పైసలు, 6 నుండి10వ తరగతి వరకు చదివే విద్యార్థులలో ఒక్కొక్కరికి రూ.6 చొప్పున వేతనాలు ఇస్తారు. దీంతోపాటు 100 మందిలోపు విద్యార్థులు మధ్యాహ్నభోజనం చేసే పాఠశాలల్లో వంటచేసే వారికి నెలకు రూ.వెయ్యి, 100-200 మంది విద్యార్థులు భోజనంచేసే పాటశాలల్లోని నెలకు రూ.2వేలు, 200-300మంది విద్యార్థులు భోజనంచేసే పాఠశాలల్లో నెలకు రూ.3 వేల చొప్పున వేతనాలు చెల్లిస్తారు. ఏజెన్సీ నిర్వాహకులకు, వంటచేసే కార్మికులకు సకాలంలో బిల్లులు, వేతనాలు అందకపోవడంతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టలేకపోతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పాఠశాలల విద్యార్థులు సైతం నాణ్యమైన భోజనం పెట్టించేందుకు ఏజెన్సీలపై ఒత్తిడి చేయలేకపోతున్నారు. -
హాస్టళ్లలో ‘సూపర్’ భోజనం
ఆదిలాబాద్ అర్బన్/ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు కొత్త సంవత్సరంలో తీపి కబురునందించింది. జనవరి ఒకటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు, వసతిగృహాల్లోని వారికి ఇక నుంచి దొడ్డు అన్నానికి బదులు సూపర్‌ఫైన్ (సన్నరకం) బియ్యం అందించి వారికి భోజనం అందించనుంది. చాలా మంది విద్యార్థులు దొడ్డు అన్నం తినలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ విషయం పేద విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి భరోసాగా మారనుంది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమస్యలు ఇకనుంచి మెరుగుపడనున్నాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులకు, పౌర సరఫరాల శాఖ అధికారులకు సోమవారం ఆదేశాలు జారీ చేశారు. 4.02 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం.. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,849 ఉన్నాయి. ఇందులో 3,24,491 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. దీంతోపాటు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, గిరిజన, సాంఘిక సంక్షేమ, బీసీ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో 78,294 మంది విద్యార్థులు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 4,02,785 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నాసిరకం బియ్యంతోనే భోజనం పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనంలో పురుగులు, రాళ్లు, ఉడకని అన్నం, తదితర సమస్యలతో విద్యార్థులు పలుసార్లు అవస్థలు పడిన విషయం తెలిసిందే. కాగా, ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. సన్నబియ్యం కేటాయింపు ఇలా.. 2015 జనవరి నుంచి పాఠశాలలు, వసతిగృహాలు, మధ్యాహ్న భోజన పథకానికి ఇక సూపర్‌ఫైన్ బియ్యం (సన్నరకం) అందనున్నాయి. జనవరి నెలకు సంబంధించి గురుకుల పాఠశాలలకు, వసతి గృహాలకు కలిపి 11,523 క్వింటాళ్ల బియ్యం అవసరం కాగా, మధ్యాహ్న భోజన పథకానికి నెలకు 11,820 క్వింటాళ్ల బియ్యం అవసరమవుతాయి. అయితే మధ్యాహ్న భోజనానికి సంబంధించి 19 రోజులకు సరిపడా బియ్యం 7,486 క్వింటాళ్ల సన్నరకం బియ్యం అందించేందుకు కేటాయింపులు చేశారు. నాసిరకం బియ్యం కాకుండా సూపర్‌ఫైన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలకు 7,487 క్వింటాళ్ల బియ్యం, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు 2,332 క్వింటాళ్లు, బీసీ సంక్షేమ వసతి గృహాలకు 721 క్వింటాళ్లు, మైనార్టీ సంక్షేమ శాఖ వసతి గృహాలకు 7.35 క్వింటాళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలకు 121 క్వింటాళ్లు, బీసీ గురుకుల పాఠశాలలకు 112 క్వింటాళ్లు, ఏపీ గురుకుల కేజీబీవీ పాఠశాలలకు 264 క్వింటాళ్లు, ఆర్వీఎం ద్వారా నడుస్తున్న ఆర్బీసీ, కేజీబీవీ పాఠశాలలకు 475 క్వింటాళ్లు మొత్తం 11,523 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేయనున్నారు. అదే విధంగా జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యాల ద్వారా నడిపిస్తున్న 52 మండలాల్లోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు (19 రోజులకు సరిపడా బియ్యం) 7,486 క్వింటాళ్ల బియ్యాన్ని కేటాయిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అమలుపై అనుమానాలు..! విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమే అయినా.. ఈ పథకం అమలు తీరు ఎలా ఉంటుందోననే అనుమానాలే వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలకు బియ్యం సరఫరా చేసేందుకు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యా శాఖ అధికారుల నుంచి తహశీల్దార్లకు ఆర్వోలు వెళ్తాయి. వారు అంగకరీస్తే ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా బియ్యం సరఫరా అవుతాయి. అక్కడి నుంచి డీలర్లు పేదలకు అందించే బియ్యంతోపాటు పాఠశాలలకు అందించే బియ్యం కూడా తీసుకొస్తారు. ఈ పరిస్థితుల్లో సన్న బియ్యం పాఠశాలలకు పంపడంలో చేతులు మారే అవకాశం ఉంది. గతంలో ఎంఎల్ఎస్ పాయింట్లకు వచ్చిన బియ్యంలో మేలిమి రకమైనవి పాఠశాలలకు అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా డీలర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ అధికారులు కుమ్మక్కై మేలిమి బియ్యాన్ని పక్కదారి పట్టించిన సందర్భాలున్నాయి. దీంతోపాటు పాఠశాలల్లో బియ్యం మాయం కావడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు సన్న బియ్యం సరఫరా అయినా.. అలాంటివి ఇంకా పెరిగే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం లెవీ తగ్గిచడంతోపాటు ఈ సంవత్సరం ఉత్పత్తి కూడా తగ్గింది. సాగైన పంటలో సగానికి పైగా దొడ్డు రకం ధాన్యమే. ఇలాంటి పరిస్థితుల్లో సన్న బియ్యం సరఫరాకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. -
మంత్రి గంటావి అనుచిత వ్యాఖ్యలు
మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘ అధ్యక్షురాలు నాగమణి పాలకొండ : మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావడం లేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అనుచిత వాఖ్యలు చేయడం తగదని మధ్యాహ్న భోజన నిర్వాహకుల సంఘ జిల్లా అధ్యక్షురాలు కె.నాగమని అన్నారు. మంత్రి వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం పాలకొండలో ఆమె విలేకరులతో మాట్లాడారు. భోజన పథకం మన రాష్ట్రంలోనే సక్రమంగా అమలవుతోందన్నారు. కనీస సదుపాలయాలు లేకపోయినా పథకం అమలు చేస్తున్నామన్న విషయాన్ని మంత్రి గంటా గుర్తించాలన్నారు. కేవలం ప్రైవేటు వ్యక్తులకు నిర్వాహణ అప్పగించి, డబ్బులు దండుకోవడానికి మంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆలోచనలు విరమించుకోక పోతే తీవ్రపరిణామాలు చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. కనీసం వంటగదులు లేకపోయినా పట్టించుకునేవారు లేరన్నారు. జిల్లాలో ఇప్పటికే రూ. 3 కోట్లు బిల్లులు బకాయిలు ఉన్న విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. సకాలంలో బిల్లులు రాకపోయినా, వసతులు లేకపోయినా, ఎటువంటి ఫిర్యాదులు లేకుండా పథకాన్ని కొనసాగిస్తున్నారన్నారు. తమినాడులో ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలు ఇక్కడా కల్పించాలని డిమాండ చేశారు. అమెతో పాటు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.పద్మ, ఉపాధ్యక్షురాలు ఎ.మహాలక్ష్మి, నారాయణమ్మ ఉన్నారు. -
అప్పు చేసి పప్పు కూడు
కొవ్వూరు :ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు బిల్లులు చెల్లించకపోవడంతో భోజన సదుపాయకర్తలైన (ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ) మహిళలు అష్టకష్టాలు పడుతూ పథకాన్ని నెట్టుకొస్తున్నారు. అప్పులు చేసి వంటలు వండి విద్యార్థులకు వడ్డిస్తున్న ఆ మహిళల గోడు పట్టించుకునే నాథులే కరువయ్యారు. జిల్లా వ్యాప్తంగా 3,260 పాఠశాలల్లో 3,35,506 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. 1నుంచి 8వ తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులు వెచ్చిస్తుండగా, 9, 10 తరగతుల విద్యార్థులకు పూర్తిగా రాష్ట్ర ప్రభు త్వ నిధులతోనే ఈ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ఇందుకోసం జిల్లాలో ప్రతి నెలా రూ.2.20 కోట్ల మేర ఖర్చవుతోంది. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు ఈ ఏడాది ఆగస్టు వరకు బిల్లులు చెల్లిం చారు. కొన్ని మండలాల్లో స్వల్పంగా నిధులు మిగలడంతో అక్కడక్కడా కొన్ని పాఠశాలలకు కొంతమేర సెప్టెం బర్ నెలకు సంబంధించిన బిల్లులు చెల్లించారు. నాలుగు నెలలుగా వంట ఖర్చులు, సదుపాయకర్తలకు గౌరవ వేతనాలు ఇవ్వకపోవడంతో పాఠశాలల్లో వంట చేస్తున్న మహిళలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నా యి. చిన్నారులలో పౌష్టిహాకార లోపం నివారణ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, 14ఏళ్ల లోపు చిన్నారులకు నిర్బంధ ప్రాథమిక విద్య అందించే క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమల వుతోంది. ఇంతటి ప్రాముఖ్యత గల ఈ పథకం నిర్వహణపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. డిసెంబర్‌తో నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా బకాయిలు చెల్లించకపోవడంతో సదుపాయకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం నిధులొచ్చినా.. కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు మంగళవారం విడుదలైనట్టు అధికారులు చెబుతున్నారు. 1 నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఇచ్చే 25 శాతం నిధులతోపాటు 9, 10 తరగతి విద్యార్థులకు సంబంధించి సెప్టెంబర్ వరకు సుమారు రూ.90 లక్షల మేర బకాయిలు విడుదల కాలేదు. గౌరవ వేతనం అరకొరే జిల్లాలోని పాఠశాలల్లో ఈ పథకం అమలుకు 6,733 మంది మహిళలను ప్రభుత్వం సదుపాయకర్తలుగా నియమిం చింది. వారికి గౌరవ వేతనం కింద సెప్టెంబర్ నెల నుంచి నవంబర్ వరకు రూ.2.02 కోట్ల మేర నిధులు విడుదల కావాల్సి ఉండగా ప్రస్తుతం రూ.1.55 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. మరో వారం రోజుల్లో డిసెంబర్ నెల ముగియనుంది. ఈనెల గౌరవ వేతనం కలిపితే ఇంకా రూ.1.14 కోట్లు రావాల్సి ఉంటుంది. -
శాసనమండలి ప్రశ్నోత్తరాలు
మధ్యాహ్న భోజనంలో గౌరవ వేతనం పెంపు లేదు: గంటా హైదరాబాద్: మధ్యాహ్న భోజన పథకంలో వంట వారికి చెల్లిస్తున్న వెయ్యి రూపాయల గౌరవవేతనం పెంపు ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం పరిశీలనలో లేదని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం శాసనమండలికి తెలిపారు. 2.51 లక్షల మందికి పంటల బీమా: ప్రత్తిపాటి ఏపీలో ఈ ఆర్థిక ఏడాదిలో 2.51 లక్షల మంది రైతులు పంటల బీమా సదుపాయం వినియోగించుకున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మంగళవారం శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న 2.31 లక్షల మంది పంట లను బీమా చేయించుకున్నారని చెప్పారు. అమ్మహస్తం కొనసాగించడం లేదు: మంత్రి సునీత అమ్మ హస్తం పథకం ద్వారా 9 రకాల సరుకులు అందించే కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగించడం లేదని మంత్రి పరిటాల సునీత చెప్పారు. శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. ఇసుక సీనరేజీ రూ. 5.07 కోట్లు కొత్త ఇసుక విధానం ప్రకటించాక అమ్మకాలపై ఈ నెల 17వరకు రూ.5.07 కోట్లు సీనరేజీ రూపేణా వసూలైనట్లు మంత్రి పీతల సుజాత శాసనమండలికి తెలిపారు. -
ఆ గ్యాస్ స్టవ్‌లు ఏమైనట్టు?
⇒ కట్టెలపొయ్యిలతో మధ్యాహ్న భోజన ⇒ ఏజె న్సీల తంటాలు పరిగి: ప్రభుత్వ పాఠశాలల్లో పొగ కష్టాలు తప్పడం లేదు. సర్కారు అందజేసిన గ్యాస్ స్టవ్‌లు అటకెక్కాయి. సిలిండర్లను స్కూల్ గడప దాటించారు. వంటగదులు నిర్మిస్తారని చాలా కాలంగా ఎదురు చూస్తున్న మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు నిరాశే మిగులుతోంది. పాఠశాలలు ప్రారంభమై ఏడు నెలలు కావస్తున్నా సర్కారు వంట గదుల ఊసే ఎత్తడ ంలేదు. బడులన్నీ పొగ రాజుకుంటున్నా ఎవరూ పట్టించుకోవటంలేదు. వంటవారికి కట్టెల పొయ్యిలే దిక్కవుతున్నాయి. 2004-05 విద్యా సంవత్సంరలో ప్రభుత్వం పాఠశాలలకు పంపిణీ చేసిన గ్యాస్ పొయ్యిలు, సిలిండర్లు మూణ్నాళ్లకే మూలనపడ్డాయి. మరో వైపు సగం పాఠశాలలకు వంటగదులు లేక మధ్యాహ్న భోజన ఏజెన్సీ మహిళలు తంటాలు పడుతున్నారు. పక్కదారి పట్టిన ప్రభుత్వ పొయ్యిలు 2004-05 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం పాఠశాలలకు పంపిణీ చేసిన పొయ్యిలు పక్కదారి పట్టాయి. ఆ విషయం అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారే తప్ప వాటిని రికవరీ చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. పంపిణీ సమయంలో పాఠశాలల విద్యాకమిటీ చైర్మన్లు, ప్రధానోపాధ్యాయులు.. వారి వారి ఇళ్లకు సిలిండర్లు చేరవేసుకున్నారు. పొయ్యిలు మాత్రం కొన్ని చోట్ల పాఠశాలల్లో ఓ మూలన పడేశారు. వీటి నిర్వహణపై పదే పదే విమర్శలు వినిపిస్తున్నా అధికారులు తిరిగి గ్యాస్‌పొయ్యిలు వెలిగించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. దీంతో అధికారుల తీరుపై గ్రామాల్లో తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి పరిగి మండలంలో 8 ప్రాథమికోన్నత, 48 ప్రాథమిక పాఠశాలలకు, దోమలో 3 ప్రాథమికోన్నత, 48 ప్రాథమిక, కుల్కచర్లలో 7 ప్రాథమికోన్నత, 94 ప్రాథమిక, గండేడ్‌లో 7 ప్రాథమికోన్నత, 84 ప్రాథమిక, పూడూరులో 6 ప్రాథమికోన్నత, 39 ప్రాథమిక పాఠశాలలకు మొత్తం 394 పాఠశాలలకు గ్యాస్‌స్టవ్‌లు, సిలిండర్లు పంపిణీ చేయగా ప్రస్తుతం ఏ ఒక్క పాఠశాలలోనూ సిలిండర్లతో వంటలు చేయడం లేదు. పొగచూరుతున్న పాఠశాల గదులు ప్రభుత్వ పాఠశాలల్లో కట్టెల పొయ్యిలపైనే మధ్యాహ్న భోజనం వండుతుండటంతో గదులన్నీ పొగబారి నల్లగా మారుతున్నాయి. మరోవైపు వంటచెరుకు సేకరించేందుకు ఏజెన్సీలు నానా తంటాలు పడుతున్నాయి. సమకూర్చుకున్న పొయ్యిల కట్టెలు పాఠశాలల ఆవరణల్లో, గదుల్లో నిల్వ చేస్తుండటంతో విద్యార్థులకు నానా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వానొస్తే వరండాలో.. లేకుంటే ఆరుబయట అన్న చందంగా విద్యార్థుల మధ్యాహ్నం భోజనం వంట పరిస్థితి తయారయ్యింది. గ్యాస్ పొయ్యిల విషయం తమకు తెలియదని సంబంధిత అధికారులు చెబుతుండటం గమనార్హం. -
అధ్వాన భోజనం
జిల్లాలో మధ్యాహ్న భోజనం పథకం అమలుతీరు ఘోరం బిల్లులు రాకపోవడంతో నాణ్యత పాటించలేకపోతున్న ఏజెన్సీలు కొన్నిచోట్ల గుడ్డు లేదు... మరికొన్నిచోట్ల ముద్దన్నం అధికారుల పర్యవేక్షణ కరువు నెల్లూరు (అర్బన్): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం.. విద్యార్థులకు రోజూ ఉచితంగా మధ్యాహ్న భోజనం పెడతాం.. పాఠ్యపుస్తకాలిస్తాం.. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.. ఇవి బడి పిలుస్తోంది కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వం చెప్పిన గొప్పలు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. అందుకు ఉదాహరణే జిల్లాలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం. ప్రధానంగా మెనూ పాటించడం లేదు. పురుగుల బియ్యం... నాణ్యతలేమి..అలాగే ఏజెన్సీలకు సకాలంలో బిల్లు లు చెల్లించడం లేదు. దీంతో పథకం అస్తవ్యస్తంగా నడుస్తోంది. మంగళవారం సాక్షి నిర్వహించిన విజిట్‌లో పథకం అమలులో చోటుచేసుకున్న అనేక లోటుపాట్లు వెలుగుచూశాయి. సకాలంలో అందని బిల్లులు : జిల్లావ్యాప్తంగా 3,551 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఇస్కాన్ సిటీ వాళ్లు 315 పాఠశాలకు భోజనం సరఫరా చేస్తుండగా, 336 పాఠశాలల్లో పొదుపు మహిళలు పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇస్కాన్ టెంపుల్ కింద నెల్లూరు సిటీ, రూరల్ ప్రాంతాల్లో 223 పాఠశాలలు, కోవూరు మండలంలో 72, వెంకటాచలం మండలంలో 20 పాఠశాలలున్నాయి. జిల్లావ్యాప్తంగా 2,11,772 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. కాగా భోజనం తయారు చేస్తున్నందుకు ఏజెన్సీలకు సకాలంలో బిల్లులు అందడంలేదు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించి సుమారు రూ.కోటి వరకు బిల్లులు రావాల్సి ఉంది. అలాగే జిల్లాలో 6,472 మంది నిర్వాహకులుండగా, ఇందులో 3,236 మంది వంటవాళ్లు, 3,236 మంది హెల్పర్లున్నారు. వీరికి మూడు నెలలకు గాను రూ.1,94,16,000 చెల్లించాల్సి ఉంది. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయి. అలాగే బిల్లులు సకాలంలో రాకపోవడంతో ఏజెన్సీలు విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టలేకపోతున్నాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. పర్యవేక్షణ కరువు : జిల్లాస్థాయిలో మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా విద్యాశాఖాధికాారి కార్యాలయంలో సిబ్బంది ఉండాలి. ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్‌ను నియమించుకోవచ్చునని అప్పట్లో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇంతవరకు ఆ పోస్టుల భర్తీ జరగలేదు. దీంతో బిల్లుల చెల్లింపులు, బడ్జెట్ కేటాయింపులు, పర్యవేక్షణ, తనిఖీలు ఆశించిన స్థాయిలో జరగడంలేదు. ఆయా డివిజన్ల ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు రోజూ కనీసం రెండు పాఠశాలల్లో పథకాన్ని పరిశీలించాలి. అయితే పరిశీలిస్తున్న దాఖలాలు మాత్రం లేవు. ► వాకాడు మండలం తుపిలిపాళెం ప్రాథమిక పాఠశాలల్లో ఇద్దరు ఒకే ప్లేటులో భోజనం చేయడం కనిపించింది. ► బుచ్చిరెడ్డిపాళెంలో బీఎల్ఎన్కే ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు ఉడికీ ఉడకని భోజనం పెట్టారు. ► దగదర్తి జెడ్పీహెచ్ఎస్లో 20 రోజులుగా గుడ్డు పెట్టడంలేదు. ► జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వం ఏజన్సీలకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పులు చేసి పథకాన్ని జరిపిస్తున్నట్లు ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. -
మా పొట్టలు కొట్టొద్దు
17 నెలల బకాయిలు చెల్లించండి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల డిమాండ్ సిరిపురం : మధ్యాహ్న భోజన పథకం నుంచి డ్వాక్రా గ్రూపులను తొలగించి వేరే వారికివ్వాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరుతూ ఆ పథకం కార్మికులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ‘మా పొట్టలు కొట్టొద్దని’ రాసిన ప్లకార్డులు పట్టుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎలాగైనా ఆ పథకం నుంచి తమను తొలగించి వేరేవారికి అప్పగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. అందుకే 17 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదని దుయ్యబట్టారు. జిల్లాలో 17 నెలలుగా 4వేల 8వందల మంది కార్మికులు పాఠశాలల్లో 9, 10 తరగతి చదువుతున్న పిల్లలకు సొంత పెట్టుబడితో మధ్యాహ్న భోజనం వండుతుంటే, బిల్లులు చెల్లించకుండా భయబ్రాంతుల్ని చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి ఇప్పటి వరకూ రూ.16 కోట్ల బకాయిలుంటే కేవలం రూ.80 లక్షలు విడుదల చేశారని విమర్శించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షురాలు కె.ద్రాక్షాయణి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరలక్ష్మి, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సత్యవతి, మహాలక్ష్మి, రాజి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
ఖైదీలకే నయం
మధ్యాహ్న భోజన పథకం లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికొదిలేసింది. భావిభారత పౌరులను ఖైదీల కన్నా హీనంగా చూస్తోంది. పెరిగిన ధరలకు అనుగుణంగా నిధుల మొత్తాన్ని పెంచాల్సిన సర్కారు ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకేయడంలేదు. ఇటీవల ఒక్కో విద్యార్థికి 25 పైసల చొప్పున పెంచి చేతులు దులుపుకుంది. ఒక్కో ఖైదీకి సరాసరి రోజుకు రూ.50 వెచ్చిస్తుండగా అదే విద్యార్థులకు రూ.4.60 నుంచి రూ.6.38 వరకు చెల్లించడం ఎంతవరకు సమంజసమని భోజన ఏజెన్సీ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. - భావిభారత పౌరులతో సర్కార్ ఆటలు - ఒక్కో విద్యార్థికి 25 పైసల పెంపు - దీనికి ఏమొస్తాయో చెప్పాలంటున్న వంట ఏజెన్సీలు - భారంగా మారిన మధ్యాహ్న భోజన పథకం తిరుపతి తుడా/తిరుచానూరు: జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నవ్వులపాలవుతోంది. చాలీచాలని నిధులతో వంట నిర్వాహకులు మెనూను గాలికొదిలేశారు. తమకు తోచి న విధంగా వడ్డిస్తున్నారు. జిల్లాలో దాదాపు 4 వేల ప్రాథమిక, 490 ప్రాథమికోన్నత, 608 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 3.73 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడం, విద్యార్థుల సంఖ్యను పెంచడంతో పాటు బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం ప్రాథమిక పా ఠశాల విద్యార్థి ఒకరికి 100 గ్రాముల బి య్యం, రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ఒకరికి 150 గ్రాము ల బియ్యం, రూ.6 అందజేస్తున్నారు. వారాని కి ఒక్కో విద్యార్థికి రెండు కోడిగుడ్లతో పాటు పప్పు, కూరగాయలు, ఆకుకూరలు, గ్యాసు, వంటనూనె వంటి ఆహార పదార్థాలను ఆ మొత్తంలోనే వంట నిర్వాహకులు కొనుగోలు చేయాలి. ఈ మొత్తం చాలక వంట ఏజెన్సీలు చేతులెత్తేస్తున్నాయి. పైగా నెలల తరబడి బిల్లు లు మంజూరుకాకపోవడంతో అప్పులపాలవుతున్నారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సం ఘాల నాయకు లు డబ్బులు పెంచాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఫలితం లేదు. ఖైదీల కన్నా హీనమే జైల్లోని ఖైదీలకన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చది వే విద్యార్థులను ప్రభుత్వం హీనంగా చూస్తోం ది. ఒక్కో ఖైదీకి రోజుకి 600 గ్రాముల బి య్యం, 100 గ్రాముల పప్పు, 140 మి.లీ పాలు, 250 గ్రాముల కూరగాయలను అంది స్తోంది. వీటితో పాటు ఉదయం అల్పాహారం కింద చపాతి, ఉప్మా, పొంగల్, లెమన్ రైస్ ఇస్తున్నారు. వారానికి ఒకరోజు గుడ్డు, 175 గ్రాముల మాంసం ఇస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో ఖైదీకి సుమారుగా రూ.50 వరకు ఖర్చు చేస్తున్నారు. అదే పేద విద్యార్థికి ఒక పూట పొట్ట నింపేందుకు ప్రభుత్వం రూ.4.60 నుం చి రూ.6.38 వరకు మంజూరు చేస్తోంది. పేరుకే మెనూ.. ఒక రోజుకి విద్యార్థికి సగటున 1,500 నుంచి 1,700 క్యాలరీలు పౌష్టికాహారం అందించాల ని న్యూట్రీషియన్లు పేర్కొంటున్నారు. అయితే మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఒక పూటకి 150 నుంచి 200 క్యాలరీల వరకే అందుతోం ది. పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలకు సరిపడ పౌష్టికాహారాన్ని ప్రభుత్వం ఇవ్వడం లేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. పెంచిన ధర ఇలా.. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి ఇదివరకు రూ.4.35, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు రూ.6 చెల్లించేవారు. అయితే తాజాగా ప్రాథమిక పాఠశాల విద్యార్థికి 25 పైసలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థులకు 38 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద మొత్తంలో పెంచాలి మధ్యాహ్న భోజన పథకానికి ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బు సరిపోవడం లేదని పలుమార్లు మా సంఘం తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాము. ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.7, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ.10 పెంచాలని డిమాండ్ చేశాం. అయితే ప్రభుత్వం కేవలం పైసల్లో మాత్రమే పెంచి చేతులు దులుపుకోవడం శోచనీయం. - కత్తి నరసింహారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్టీయూ గుడ్డుకే చాలదు మధ్యాహ్నం భోజన పథకానికి ఒక్కో విద్యార్థికి చెల్లిస్తున్న డబ్బు గుడ్డుకే సరి పోదు. అలాంటప్పుడు పౌష్టికాహారా న్ని విద్యార్థులకు ఎలా అందించగలుగుతాం. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. పౌష్టికాహారం, గుడ్డు అందించాలంటే ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై అధనంగా డబ్బులు అందించాలి. -కే.ముత్యాల్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి, యూటీఎఫ్ పౌష్టికాహారం అంతంతమాత్రమే మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం అధిక శాతం నాసిరకమే. దీంతో ఆ బియ్యంతో వండిన అన్నం తినేందుకు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థికి సగటున చెల్లిస్తున్న డబ్బులో ఎటువంటి పౌష్టికాహారం అందించాలో ఆ ప్రభుత్వమే తెలియజేయాలి. -టీ.గోపాల్, రాష్ట్ర అధ్యక్షుడు, ఆర్జేయూపీ పైసల్ అవుతున్న బతుకులు పెరిగే వయస్సులో విద్యార్థికి నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాల్సి ఉంది. అప్పుడే విద్యార్థి ఆరోగ్యంగా ఎదుగుతూ చదువుపై దృష్టి పెట్టగలుగుతాడు. అయితే మొక్కుబడిగా ప్రభుత్వం పైసలు పెంచి విద్యార్థులను పైసల్ చేస్తోంది. దీనికి తోడు వంట ఏజెన్సీలకు బకాయిలు చెల్లించడంలో జరుగుతున్న జాప్యం కూడా విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. -వై.శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది ప్రభుత్వం పేద విద్యార్థులపై చిన్నచూపు చూస్తోంది. రూ. 4.48 పైసలకు భోజనం ఎలా పెడతారు. కోడి గుడ్డుకే రూ.4 చెల్లించాలి. 48 పైసలతో భోజనం ఎలా వస్తుంది. పైసలను పెంచి ప్రభుత్వం వందలు పెంచినట్టు గొప్పలు చెబుతోంది. పేద విద్యార్థులు చదివే పాఠశాలలపై నిర్లక్ష్యం వీడాలి. -కె.అక్కులప్పనాయక్, టీఎస్ఎఫ్, రాష్ట్ర కార్యదర్శి రూ.20కు పెంచాలి విద్యార్థుల మిడ్డే మీల్స్ రూ.20కి పెం చాలి. చాలీ చాలని డబ్బులతో విద్యార్థుల కడుపులు కాలుస్తున్నారు. ఖైదీల కంటే హీనంగా విద్యార్థులకు పట్టెడన్నం పెట్టమని నిధులు కేటాయించడం సిగ్గుచేటు. ప్రభుత్వానికి సర్కారుబడుల విద్యార్థులపై ఉన్న చిన్నచూపు పోవాలి. అవసరమైన నిధులను కేటాయించి పేద విద్యార్థులను ఆదుకోవాలి. -హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం పౌష్టికాహారం అందివ్వాలి ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు పౌష్టికాహరం అందించేందుకు చర్యలు చేపట్టాలి. చాలిచాలని డబ్బు లు కేటాయించడం వల్ల అందాల్సిన పౌష్టికాహారం అందడంలేదు. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థికి 100 గ్రాముల అన్నం ఎలా సరిపోతుంది. పదోతరగతి చదువుతున్న విద్యార్థికి 150 గ్రాముల అన్నం ఏమూలకు సరిపోతుంది. కడుపుకాల్చుకుని చదువుకునే దుస్థితి రావడం దౌర్భాగ్యకరం. - జయచంద్ర, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐ డ్రాపౌట్స్ పెరిగే ప్రమాదం ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో డ్రాపౌట్స్ సంఖ్య అధికంగా ఉంది. మధ్యాహ్న భోజన పథకం అందుబాటులోకి వచ్చాక చాలామంది పేద విద్యార్థులు తిరిగి సర్కారు బడుల్లో చేరా రు. అయితే సరైన పోషక విలువలు, సరిపడా అన్నం పెట్టకపోవడంతో మళ్లీ స్కూళ్లలో డ్రా పౌట్స్ పెరిగే ప్రమాదం ఉంది. ఇది ప్రభుత్వ విద్యావ్యవస్థ మనుగడకే ప్రమాదకరం. - శంకర్‌నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు, జీవీఎస్ సీఎం దృష్టికి తీసుకెళ్తాం మధ్యాహ్న భోజన పథకంపై పూర్తి స్థాయి నివేదికను తీసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళతాం. మధ్యాహ్న భోజనానికి సగటున విద్యార్థికి చెల్లిస్తున్న డబ్బులను, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా పెంచాలని ఆయనకు విన్నవించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. - రవినాయుడు, జాతీయ సమన్వయకర్త, టీఎన్ఎస్ఎఫ్. నిర్లక్ష్యం తగదు ప్రభుత్వ బడుల్లో చదువుతున్నది ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులే. వీరిపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రూ.4కు భోజనం పెట్టడం ఏ కాలంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకు వర్తిస్తుందో ప్రభుత్వమే సమాధానమివ్వాలి. పేదలపై ప్రభుత్వానికి చిత్తశుధ్ది ఉంటే పూర్తిస్థాయిలో పౌష్టికాహారాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలి. - దామినేటి కేశవులు, ఎస్సీసంక్షేమ సంఘం నాయకులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళతాం మధ్యాహ్న భోజనానికి కేటాయించిన డబ్బులను పెంచాలని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్న బడుల్లో ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బులు చాలడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. భోజన పథకంలో నిర్ణీత ధరలు పెంచే విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాను. - రవికుమార్‌నాయుడు, ఎంపీడీవో, తిరుపతి రూరల్. ఇబ్బందులు ఉన్నాయి తక్కువ మంది ఉన్న పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నష్టాల్లో నడుస్తోంది. చాలీచాలని డబ్బులతో వంట ఏజెన్సీలు వంటలు చేయలేమని ఫిర్యాదులు చేస్తున్నారు. తాజాగా పెంచిన పెంపు వీరికి ఏమాత్రం సరిపోదు. ఇలాంటి నేపథ్యంలో తక్కువ మంది పిల్లలున్న పాఠశాలలపై ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తే బావుంటుంది. -ఎం.ప్రసాద్, ఎంఈవో, తిరుపతి రూరల్ బకాయిలతో ఇబ్బందులు గత నాలుగు నెలలుగా ప్రభుత్వం నుంచి రావాల్సిన మధ్యా హ్న భోజన డబ్బులు బకాయి పడడంతో ఇబ్బందులు పడుతున్నాం. దీంతో అప్పులు చేసి వి ద్యార్థులకు వండి పెడుతున్నాం. పెరిగిన కూరగాయల ధరతో ప్రభుత్వం ఇస్తున్న డబ్బు లు సరిపోవడం లేదు. వారంలో రెండు రోజులు విద్యార్థి కి ఇచ్చే డబ్బు కోడి గుడ్డుకే ఖర్చవుతోంది. ఇలాగైతే ఎలా బతకాలి. - రంగమ్మ, వంట ఏజెన్సీ సభ్యురాలు పది రూపాయలు చెల్లించాలి మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి ఇస్తున్న డబ్బు చాలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన భోజనం ఎలా ఇవ్వగలుగుతాం. అయినా పిల్లలకు అన్యా యం చేయకూడదనే ఉద్ధేశంతో తమకు ఆదాయం లేకున్నా మంచి భోజనం పెట్టేందుకు నగలు కుదవ పెట్టాం. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ. 10 చెల్లించాలి. -కే.కుమారి, వంట ఏజెన్సీ సభ్యురాలు రూ.80 వేలు బకాయిలు రావాలి మధ్యాహ్న భోజనం ద్వారా తమకు ఇప్పటి వరకు రూ.80 వేలు బకాయిలు రావాల్సి ఉంది. దీంతో రూ.5 వడ్డీకి అప్పు తెచ్చి మధ్యాహ్న భోజనం పెడుతున్నాం. నెల వచ్చేసరికి తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించలేకపోతున్నాం. ప్రభుత్వం పునరాలోచించి ఏ నెలకు ఆ నెల డబ్బులు చెల్లించాలి. -బీ.కుమారి, వంట ఏజెన్సీ సభ్యురాలు చిన్న చూపు ఎందుకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివేది పేద విద్యార్థులే. అలాంటి పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తోంది. ఒక పూట తిండి పెట్టేందుకు లెక్కలు వేసుకుంటూ చిన్నచూపు చూస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి. -మోషి, 10వ తరగతి విద్యార్థి -
‘బియ్యం సరఫరా లేదు.. భోజనం పెట్టలేం’
ఇస్కాన్ మందిర నగర అధ్యక్షుడు సత్య గోపీనాథ్ రాజమండ్రి సిటీ : ఇస్కాన్ ఫుడ్ రిలీప్ ఫండ్‌కు ఇవ్వాల్సిన బియ్యం సరఫరాను రెవెన్యూ అధికారులు నిలిపివేయడంతో శనివారం నుంచి ఇస్కాన్ మందిరంలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేస్తున్నట్టు ఇస్కాన్ మందిరం రాజమండ్రి శాఖ అధ్యక్షుడు సత్యగోపీనాథ్ శుక్రవారం వెల్లడించారు. ఇస్కాన్ మందిరంలో ఆయన మాట్లాడుతూ తమకు అందాల్సిన 200 క్వింటాళ్ల బియ్యం నిలిచిపోయాయని, అందువల్ల భోజనం సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. 2012 సంవత్సరానికి సంబంధించి ప్రతి పాఠశాలకు నెలకు రూ.వెయ్యి చొప్పున పనివారికి ఇచ్చేందుకు నెలకు రూ.58 వేల చొప్పున రిలీజ్ అయ్యాయని, వాటినిజిల్లా విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులు స్వాహా చేసి ఉంటారని ఆయన ఆరోపించారు. ఇస్కాన్‌కు మధ్యాహ్న భోజన పథక పునరుద్ధరణ విషయమై నగర కమిషనర్ రవీంద్రబాబును వివరణ కోరగా విద్యాశాఖ నుంచి వినతులు అందలేదన్నారు. -
వెచ్చాల్లేకుండా వండిపెట్టేదెలా?
* మధ్యాహ్న భోజన పథకంపై సర్కారు నిర్లక్ష్యం * రెండు నెలలుగా విడుదల కాని నిధులు * అప్పులతో నెట్టుకొస్తున్న ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు అమలాపురం : బియ్యం, నీళ్లు ఇవ్వకుండా వట్టి కుండ, కట్టెలు ఇచ్చి, అన్నం వండమన్నట్టుంది సర్కారు తీరు. మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు రెండు, మూడు నెలులగా నిధులు విడుదల కాక, మూడు నెలలుగా సిబ్బందికి జీతాలందక పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు అక్టోబరు, నవంబరు నెలల్లో మధ్యాహ్న భోజన పథకానికి రావాల్సిన సొమ్ములు అందలేదు. కొన్ని పాఠశాలలకైతే సెప్టెంబరులో రావాల్సిన సొమ్ములు కూడా చేతికందలేదు. మధ్యాహ్న భోజనానికి పౌరసరపరాల శాఖ ద్వారా బియ్యం అందుతుండగా, వారికి అన్నంతోపాటు అందించే పప్పు, కాయగూరలు, ఇతర నిత్యావసర వస్తువులకుగాను ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలకు నిధులు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు రూ.3.78 కోట్ల వరకు అందించాల్సి ఉంది. నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు పెరిగిన నేపథ్యంలో తమకు గిట్టుబాటు కావడం లేదని ఏజెన్సీలు ఇప్పటికే గగ్గోలు పెడుతున్న విషయం తెలిసిందే. వారానికి రెండుసార్లు అందించాల్సిన కోడిగుడ్డు ధర కూడా మండిపడడం వారికి మరీ భారమవుతోంది. ఈ పథకానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. చాలా ఏజెన్సీలు అప్పులు చేసి విద్యార్థులకు భోజనం అందించాల్సి వస్తోంది. -
మధ్యాహ్న భోజనం అమలుపై అధికారుల ఆగ్రహం
ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును ‘సాక్షి’ మంగళవారం పరిశీలించింది. భోజన పథకంలో అనేక లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. దీనిపై ‘ఇదే మెనూ..చచ్చినట్టు తినూ..’ అనే శీర్షికతో ప్రచురితమైన వార్త కథనానికి జిల్లా విద్యాశాఖ యంత్రాంగం కదిలివచ్చింది. బుధవారం పలు పాఠశాలల్లో డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి సహా పలువురు డిప్యూటీ డీఈవోలు, మండల విద్యాశాఖాధికారులు తనిఖీలు నిర్వహించారు. భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. పలువురు హెచ్ఎంలు, వంట ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నాణ్యమైన భోజనం అందించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలుత డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, ఖమ్మం అర్బన్ ఎంఈవో శ్రీనివాస్‌తో కలిసి నగరంలోని నయాబజార్, రిక్కాబజార్ పాఠశాలల్లో పథకం అమలు తీరును పరిశీలించారు. అన్నం, కూరలను చూసి అవాక్కయ్యారు. నీళ్లచారు, ముద్ద అన్నం పెడుతున్నారని విద్యార్థుల ద్వారా తెలుసుకుని వంట ఏజెన్సీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లావ్యాప్తంగా డిప్యూటీ డీఈవోలు, ఎంఈవోలు ఆయా పాఠశాలల్లో పరిశీలన జరపాల్సిందిగా డీఈఓ ఉన్నపళంగా ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే విస్తృత తనిఖీలు మొదలయ్యాయి. భోజన పథకం అమలుతీరు, రుచి, శుచిశుభ్రత, తాగునీటి వసతులు ఇలా అన్ని అంశాలను పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న సత్తుపల్లి పాఠశాలను మధిర డిప్యూటీ డీఈవో రాములు పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయునికి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. బయ్యారంలో బయటి ప్రాంతాల నుంచి అన్నం వండుకు తెస్తున్న ఏజెన్సీలపై స్థానిక ఎంఈవో మండిపడ్డారు. జిల్లాలో నిరుపయోగంగా ఉన్న వంటగదుల వివరాలనూ తెలపాలని డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. కోట్లాది రూపాయల వ్యయంతో అమలు చేస్తున్న భోజన పథకాన్ని సక్రమంగా నిర్వహించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎదిగే దశలో ఉన్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనేదే భోజన పథకం ముఖ్యోద్దేశమని అటువంటప్పుడు నీళ్లచారు, ముద్ద అన్నంపెడితే ఉపయోగమేంటని ప్రశ్నించారు. మెనూ ప్రకారం కాకుండా ఇతర వంటకాలు, నాసిరకం ఆహారం అందిస్తే సహించేది లేదన్నారు. మధ్యాహ్నభోజనం బిల్లులు, వంట నిర్వాహకులకు నెలనెలా వేత నాలు అందుతున్నాయన్నారు. 9,10 తరగతులకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయం వాస్తవమేనన్నారు. దీన్ని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో ఈ పెండింగ్ బిల్లులు కూడా మంజూరు చేసేలా ప్రయత్నిస్తామని తెలిపారు. ఖమ్మంలో భోజన ఏజెన్సీల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. మెనూ సక్రమంగా అమలు చేయని ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెట్టి తొలగిస్తామన్నారు. హెచ్ఎంలు ప్రతిరోజూ అన్నం, కూరలను పరిశీలించాలన్నారు. ఎస్ఎంఎస్ చైర్మన్లూ పరిశీలించాలని కోరారు. అవసరమైన సలహాలు, సూచనలు చేయాల్సిందిగా కోరారు. భోజన పథకం అమలుతీరు, తాగునీరు, వంటగదుల కొరత తదితర అంశాలపై పరిశీలన జరిపి పూర్తిస్థాయిలో రిపోర్టు తయారు చేసి కలెక్టర్‌కు సమర్పిస్తామని డీఈవో చెప్పారు. -
ఇదే మెనూ.. చచ్చినట్టు తినూ..
ఖమ్మం: మధ్యాహ్నభోజనం అధ్వానంగా మారింది. ఏదో మొక్కు‘బడి’గా పెడుతున్నారే తప్ప మెనూ..గినూ జాన్తనై. నీళ్లచారు, ముద్ద అన్నం పెట్టి ఇదే మెనూ..చచ్చినట్టు తినూ అనే రీతిలో వండివార్చుతున్నారు. పెట్ట అన్నం కూడా సరిపడా పెట్టడం లేదు. అర్థాకలితోనే విద్యార్థులు అలమటించాల్సి వస్తోంది. అన్నం ఉంటే కూర ఉండదు..కూర ఉంటే అన్న ఉండట్లేదని విద్యార్థులు వాపోతున్నారు. శుచీ శుభ్రతలేని వాతావరణం మధ్య విద్యార్థులు భోజనాలు చేయాల్సి వస్తోంది. చాలా పాఠశాలల్లో వంటగదులు లేవు. పలు పాఠశాలల్లో ఉన్నా శిథిలావస్థకు చేరాయి. విద్యార్థులకు ఎండలోనే వడ్డిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే మధ్యాహ్నభోజన పథకం నిర్వహణ ఎవరికీ పట్టనది అయిపోయింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు, ప్రధానోపాధ్యాయులు పట్టించుకున్న పాపాన పోలేదు. మామూళ్ల మత్తులో ఉండి వసూళ్లకు పాల్పడుతుంటంతో ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పుచ్చు కూరగాయలు, చౌకబారుగా దొరికేవే రోజూ వండి పెడుతున్నారని, హాస్టల్స్‌లో మధ్యాహ్న భోజనం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తింటున్నామని విద్యార్థులు వాపోతున్నారు. మధ్యాహ్న భోజనం ఏరోజు మెనూ ఏమిటనే విషయం కూడా పలుపాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియకపోవడం గమనార్హం. అప్పులే మిగిలేది.. మధ్యాహ్నభోజన పథకంతో తమకు ఒరిగేదేమీ లేదని మరోవైపు నిర్వాహకులు వాపోతున్నారు. గత సంవత్సరం 9, 10 తరగతుల విద్యార్థులకు వండిపెట్టిన డబ్బులు ఇప్పటి వరకు రాలేదని తెలిపారు. అప్పులు చేసి వండి పెడుతున్నామని వంట ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. పలుచోట్ల వంటగదులు లేకపోవడంతో గాలిదుమారం వచ్చినా ఆరుబయటే, చెట్ల కిందే వంట చేస్తున్నారు. తాగునీటి వసతి లేక పలు పాఠశాలల్లో విద్యార్థులు, వంట నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్ మొత్తం 34,000 పాఠశాలల్లో ఈ పథకం అమలవుతోంది. 1,17,013 మంది ప్రాథమిక, 63,679 మంది యూపీఎస్, 43,453 మంది హైస్కూల్ విద్యార్థులకు మధ్యాహ్నభోజనం అమలవుతోంది. నీళ్లచారు..ముద్ద అన్నమే... ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా నిర్వాహకులు నీళ్ల చారు.. ముద్ద అన్నమే పెడుతున్నారు. ప్రభుత్వం ఎంఎల్ఎస్ పాయింట్ల నుండి బియ్యం తీసుకోవాల్సిరావడంతో పలువురు డీలర్లు మంచి బియ్యం వారు తీసుకొని ముక్కినవి, తడిసిన బియ్యం పాఠశాలలకు వంపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటిని నివారించేందుకు పైయిలెట్గా కొన్ని పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రధానోపాధ్యాయులు బియ్యం తీసుకురావాలని జిల్లా అధికారులు చెప్పినా పలువురు ప్రధానోపాధ్యాయులు వెళ్లడం లేదని తెలుస్తోంది. ఖమ్మం నగరంతోపాటు పలుచోట్ల ఏజెన్సీలకు అప్పగించడంతో పెద్ద మొత్తంలో ఒకే చోట వండుతున్నారు. అది కూడా అధ్వాన్నంగా ఉంటోందని విద్యార్థులు వాపోతున్నారు. వారానికి రెండురోజులకు బదులు ఒకే రోజు గుడ్డు ఇస్తున్నారు. తాగునీరు, వంటషెడ్లు లేక ఇబ్బందులు.. జిల్లాలోని సగానికి పైగా పాఠశాలల్లో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. వంటగదులు లేకపోవడం, పలు పాఠశాలల్లో వంటగదుల నిర్మాణం అర్థాతరంగా నిలిచిపోవడంతో చెట్ల కిందే వండిపెడుతున్నారు. ఓవైపు పందులు తిరుగుతుంటే మరోవైపు విద్యార్థులు భోజనాలు చేయాల్సి వస్తోంది. పలు పాఠశాలల్లో తాగునీటి కుళాయిల వద్ద అపరిశుభ్రంగా ఉంది. -
అర్ధాకలే
చప్పిడి చారు.. పలచని పప్పు.. సుద్ద అన్నం.. వెరసి పొగచూరిన వంటలు.. వారానికి రెండు రోజులు ఇవ్వాల్సిన గుడ్డు ఒక్కరోజుకే పరిమితం.. ఇదీ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు. మరోపక్క ఏజెన్సీ నిర్వాహకులకు రెండు నెలలుగా బిల్లులు చెల్లించని వైనం. దీంతో వారు అప్పులు చేసి మరీ మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న పరిస్థితి. మెనూ మమ అనిపిస్తుండటంతో చిన్నారులు అర్ధాకలితో అలమటిస్తున్న దుస్థితి. సోమవారం జిల్లాలోని పాఠశాలల్లో నిర్వహించిన ‘సాక్షి విజిట్’లో వెలుగుచూసిన వాస్తవాలివి. ►మధ్యాహ్న భోజన పథకంలో అమలు కాని మెనూ ► బిల్లులు విడుదల కాక ►కింగ్ ఏజెన్సీల అవస్థలు ► అప్పుల ఊబిలో నిర్వాహకులు ►5 నెలలుగా గౌరవవేతనం లేదు ►నిధులు విడుదలైనా మంజూరు చేయని ఎంఈవోలు ►‘సాక్షి విజిట్’లో వెలుగుచూసిన వాస్తవాలు మచిలీపట్నం : జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ అధ్వానంగా మారింది. మెనూ అమలు కాక.. కూరల్లో నాణ్యత లేక అర్ధాకలితో విద్యార్థులు అలమటిస్తున్నారు. కుకింగ్ ఏజెన్సీల నిర్వాహకులకు బిల్లులు సకాలంలో రాక అప్పులు చేసి మరీ పథకాన్ని కొనసాగిస్తున్నారు. సోమ, గురువారాల్లో విద్యార్థులకు కోడిగుడ్డు అందించాల్సి ఉండగా ఒక్కరోజుకే పరిమితం చేస్తున్నారు. గుడ్డు ధర మార్కెట్లో రూ.4.25కు పెరగడంతో విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు గుడ్డుకే సరిపెట్టాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 3,340 పాఠశాలలు ఉండగా 2,56,584 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ కుకింగ్ ఏజెన్సీల ఆధ్వర్యంలో పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏజెన్సీల నిర్వాహకులకు గత రెండు నెలలుగా బిల్లులు చెల్లించలేదు. దీంతో ఉన్నత పాఠశాలల్లో అధికంగా విద్యార్థులు ఉంటే రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు అప్పు చేసి విద్యార్థులకు వండి పెట్టాల్సిన దుస్థితి నెలకొంది. అప్పులు ఇచ్చిన కిరాణా షాపు యజమానుల నుంచి వేధింపులు అధికం కావడంతో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి వారికి చెల్లిస్తూ పథకాన్ని కొనసాగిస్తున్నారు. 35 పైసలు పెంచారు... ఓ వైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఇవేమీ పరిగణనలోకి తీసుకోకుండా ఈ ఏడాది జూన్ నుంచి కుకింగ్ ఏజెన్సీలకు ఇచ్చే కమీషన్‌ను నామమాత్రంగా పెంచింది. గతంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4 చెల్లించేవారు. దానిని రూ.4.35కు, ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు చెల్లించే రూ.6ను రూ.6.35కు పెంచారు. ప్రస్తుత మార్కెట్లో పెరిగిన కూరగాయలు, నిత్యావసరాల ధరలకు, పెంచిన చార్జీలకు పొంతన లేకపోవడం గమనార్హం. ఈ ఖర్చులోనే వారానికి రెండుసార్లు గుడ్డు, వంటకు ఉపయోగించే కట్టెలు సమకూర్చాల్సి ఉంది. దీంతో కుకింగ్ ఏజెన్సీల నిర్వాహకులు అత్తెసరు మెనూ అమలు చేస్తూ మమ అనిపిస్తున్నారు. సోమవారం పలు ఏజెన్సీలు సాంబారు, ఉడకబెట్టిన గుడ్డు మాత్రమే వడ్డించాయి. సాంబారులో వివిధ రకాల కూరగాయలు, కందిపప్పు వేయాల్సి ఉండగా నాలుగు బెండకాయ ముక్కలు వేసి సరిపెట్టారు. అదేమని ప్రశ్నిస్తే ఈరోజు కోడి గుడ్డు ధర రూ.4.25లు ఉందని, ప్రభుత్వం విద్యార్థికి వంట చేసిపెట్టినందుకు ఇచ్చేది రూ.4.35 అని, కోడిగుడ్డు కొనుగోలుకు ఈ నగదు ఖర్చయితే పది పైసలు మిగులుతోందని దీంతో నూనె, కందిపప్పు, కూరగాయలు ఎలా కొనుగోలు చేయాలని ఏజెన్సీ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ఐదు నెలలుగా గౌరవవేతనం లేదు... ప్రభుత్వ పాఠశాలలో వంట ఏజెన్సీల నిర్వాహకురాలికి సహాయకులుగా ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకరు లేక ఇద్దరు పనిచేస్తున్నారు. వారికి ఒక్కొక్కరికి గౌరవవేతనంగా నెలకు రూ.1000 చెల్లించాల్సి ఉంది. ఐదు నెలలుగా గౌరవవేతనం చెల్లించటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు ఉన్నత పాఠశాలల్లో 100 నుంచి 1600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. 140 మంది విద్యార్థులు చదివే ఉన్నత పాఠశాలలో కుకింగ్ ఏజెన్సీకి నెలకు కనీసంగా రూ.25 వేలు బిల్లుగా వస్తోంది. గత రెండు నెలలుగా ఈ బిల్లులు ఇవ్వకపోవటంతో బందరు మండలంలోని చిట్టిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకురాలు రూ.50 వేలు అప్పు చేసి వంట చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మూడో నెల పూర్తయ్యే దశలో ఉంది. ఈ మూడు నెలలు కలుపుకుంటే రూ.70 వేల వరకు బిల్లులు రావాల్సి ఉంది. సరకులు, కూరగాయలు తీసుకున్న షాపు యజమానులు అప్పు తీర్చమని ఒత్తిడి తెస్తున్నారని నిర్వాహకురాలు వాపోయింది. అప్పుల పాలవుతున్నాం... గన్నవరంలోని ఓ ఉన్నత పాఠశాలలో నెలకు రూ.70 వేల వరకు బిల్లు రావాల్సి ఉంది. రెండు నెలలుగా బిల్లులు అందకపోవటంతో రూ.1.50 లక్షల వరకు ఏజెన్సీ నిర్వాహకురాలు అప్పుల పాలైంది. ఈ బిల్లులు ఎప్పటికి వస్తాయో, ఎప్పటికి అప్పులు తీర్చాలోనని ఏజెన్సీ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమైన అనంతరం ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఏప్రిల్, జూన్ నెలలకు సంబంధించి మొదటి క్వార్టర్‌గా రూ.3.69 కోట్లు, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.10.41 కోట్ల నగదును ఆయా మండలాలకు సంబంధించి ఎంఈవోల ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 9, 10 తరగతులకు సంబంధించి మధ్యాహ్న భోజన బిల్లులను మొదటి క్వార్టర్‌గా రూ.51.39 లక్షలు, 2వ క్వార్టర్‌గా రూ.67.18 లక్షలు, 3వ క్వార్టర్‌గా రూ.94.62 లక్షలు ఎంఈవోల ఖాతాల్లో జమ చేసినట్లు వారు తెలిపారు. సకాలంలో బిల్లులు రాకపోవటంతో ఇంట్లోని బంగారు వస్తువులు తాకట్టు పెట్టి కుకింగ్ ఏజెన్సీలు నడుపుతున్నామని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్టెల పొయ్యి పైనే వంట... జిల్లాలోని 90 శాతం పాఠశాలల్లో కట్టెల పొయ్యి పైనే వంట చేస్తున్నారు. రెండేళ్ల క్రితం పాఠశాలలకు గ్యాస్ పొయ్యిలు అందజేసినా, గ్యాస్ సిలిండర్లు ఇవ్వలేదు. దీంతో గ్యాస్ పొయ్యిలు మూలనపడి పాడైపోయే స్థితికి చేరుకున్నాయి. పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలంటే సంబంధిత పాఠశాల హెచ్ఎం లేదా కుకింగ్ ఏజెన్సీ పేరున తీసుకోవాల్సి ఉంది. పాఠశాల హెచ్ఎం బదిలీపై వెళ్లినా, కుకింగ్ ఏజెన్సీని రద్దు చేసి వేరొకరికి అప్పగించినా గ్యాస్ కనెక్షన్ ద్వారా సిలిండర్ తీసుకోవటం ఇబ్బందికరంగా మారుతుందనే కారణంతో ఈ ప్రయత్నాన్ని విరమించారు. కొన్ని పాఠశాలలకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చినా నెలకు ఒక సిలిండర్ మాత్రమే వాడాలనే నిబంధన విధించటంతో ఒక సిలిండర్ ఎటూ చాలక కట్టెల పొయ్యి పైనే ఆధార పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు కోసం వచ్చే బియ్యం నాణ్యత తక్కువగా ఉండటంతో ఏ మాత్రం అజాగ్రత్తగా వండినా అన్నం సుద్దగా మారుతోందని, ఇలా అయితే విద్యార్థులు భోజనం చేయని పరిస్థితి నెలకొంటోందని ఉపాధ్యాయులతో పాటు కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. -
అప్పుల ‘భోజనం’
బి.కొత్తకోట: జిల్లాలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్న వంట ఏజెన్సీల నిర్వాహకులు అప్పులపాలవుతున్నారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలల విద్యార్థులకు వంట ఏజెన్సీల నిర్వాహకులే భోజనం వండీ పెడ్తారు. బియ్యాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ఇందుకోసం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.4.35, ఆరు నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి రూ.6 చొప్పున నిర్వాహకులకు ప్రభుత్వం చెల్లించాలి. ఈ నిధులతో విద్యార్థులకు అందించే భోజనంలో కూరలు, గుడ్లు వడ్డించాలి. అయితే ఏజెన్సీ నిర్వాహకులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను చెల్లించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 9.63కోట్లు పెండింగ్ జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 3.2 లక్షల మంది బాలబాలికలు చదువుతున్నారు. వీరిలో 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు 70వేల మందికిపైగా ఉన్నారు. మిగిలిన వారంతా 1 నుంచి 8 వరకు చదువుతున్న వా రే. వీరికి భోజనం అందిస్తున్న నిర్వాహకులకు మొత్తం రూ.9.63కోట్లు బకాయిపడ్డారు. రాష్ట్రప్రభుత్వ నిధుల విడుదలలో జాప్యం జరిగేది. కేంద్ర నిధులు సకాలంలో అందేవి. ప్రస్తుతం రెండు ప్రభుత్వాల నిధులు అందలేదు. ఇందు లో 1 నుంచి 8వ తరగతి వరకు రూ.5.12కోట్లను ఈ ఆగస్టు నుంచి ఇప్పటివరకు కేంద్ర నిధులు అందాల్సి ఉంది. 9,10 తరగతుల విద్యార్థులకు ఈ ఫిబ్రవరి నుంచి రూ.4.51 కోట్ల నిధులు అందలేదు. ఒకేసారి కేంద్ర, రాష్ట్ర నిధులు అందకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వడ్డీలకు అప్పులు సకాలంలో మధ్యాహ్న భోజన నిధులు మంజూరుకాకపోవడంతో నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఏజెన్సీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఒక్కో ఏజెన్సీకి రూ.2లక్షల నుంచి నాలుగైదు లక్షల బకాయిలు రావాల్సి ఉంటుంది. నిర్వహణ ఆపలేక రూ.100కు రూ.3నుంచి రూ.6 వడ్డీకి డబ్బు అప్పులకు తీసుకొచ్చి పథకం అమలుచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పథకం నిర్వహణ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. -
మధ్యాహ్న భోజనానికి బకాయి పోటు
ఉదయగిరి: జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం గాడితప్పింది. నాలుగు నెలల నుంచి బిల్లులు మంజూరుచేయకపోవడంతో నిర్వాహక ఏజెన్సీలు చేతులెత్తేశారు. మధ్యాహ్న మెనూను మమ అనిపిస్తున్నారు. దీంతో విద్యార్థులు చప్పిడి చారు, అన్నం తినలేక అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది. ఈ విద్యాసంవత్సరంలో మొదటి మూడు నెలలకు నిధులు మంజూరుచేసిన ప్రభుత్వం ఆ తర్వాత పథకాన్ని పట్టించుకోలేదు. దీంతో మధ్యాహ్న భోజన పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. జిల్లాలో 2,642 ప్రాథమిక, 289 ప్రాథమికోన్నత, 387 ఉన్నత పాఠశాలలతో పాటు 115 ఎయిడెడ్, 777 ప్రైవేటు పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో ఐదు లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 3.7 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్నం పూట ఆయా పాఠశాలల్లో భోజనం చేస్తున్నారు. 1-5 తరగతుల వరకు ఒక్కో విద్యార్థికి వంద గ్రాముల బియ్యం, రూ.4.35 నగదు, 6-10 తరగతుల విద్యార్థులకు 150 గ్రాముల బియ్యం, రూ.6 నగదు ప్రభుత్వం అందజేస్తోంది. ఈ నగదుతోనే పప్పుదినుసులు, కోడిగుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు కొనుగోలు చేయాలి. బియ్యం మాత్రం నిర్వాహక ఏజెన్సీలకు చౌకదుకాణాల ద్వారా ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. ప్రతి నెలా బిల్లులు నిర్వాహక ఏజెన్సీలకు సక్రమంగా అందజేస్తే..వారు మెనూ కూడా సక్రమంగా అమలుచేసే అవకాశముంటుంది. కానీ రెండు నెలలకో, మూడు నెలలకో ఒకసారి బిల్లులు ఇస్తుండటంతో నిర్వాహక ఏజెన్సీలకు ఇబ్బందిగా మారింది. దుకాణదారులు సరుకులు అప్పు ఇవ్వకపోవడంతో ఈ పథకాన్ని అరకొర మెనూతో నెట్టుకొస్తున్నారు. నాలుగు నెలలుగా అందని బియ్యం ప్రభుత్వానికి ముందుచూపు కొరవడటంతో మధ్యాహ్న భోజన పథకానికి బిల్లుల చెల్లింపులో ఆటంకం ఏర్పడింది. మొదటి మూడు మాసాలకు గత ఏడాది మంజూరుచేసిన బడ్జెట్లో నిధులను సర్దుబాటు చేశారు. కానీ ప్రభుత్వం మిగతా నెలలకు సంబంధించి పైసా కూడా బడ్జెట్ విడుదల చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో అన్ని పాఠశాలల్లో నిర్వాహక ఏజెన్సీలు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మాసాలతో పాటు నవంబరు మాసం కూడా ద్వితీయార్థం ముగిసినా బిల్లులు అందే పరిస్థితి కనిపించలేదు. అదేవిధంగా నిర్వాహక ఏజెన్సీలకు నెలనెలా ఇవ్వవల్సిన రూ.1000 గౌరవ వేతనం కూడా అందటంలేదు. దీంతో దీనిపై ఆధారపడిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పెరిగిన ధరలు ప్రభుత్వం ఏడాది నుంచి మెనూ చార్జీలు పెంచలేదు. కానీ చిల్లర సరుకులు, కూరగాయల ధరలు మాత్రం పెరిగాయి. దీంతో నిర్వాహకులు కూడా తగిన మోతాదులో వీటిని వినియోగించలేని పరిస్థితి నెలకొంది. వారానికి రెండు రోజులు ఇవ్వవలసిన కోడిగుడ్లను ఇస్తే ఒకటో అరో ఇస్తున్నారు. లేకపోతే అసలు లేదు. ఈ పరిస్థితిలో మధ్యాహ్న భోజన పథక మెనూ విద్యార్థులకు అసంతృప్తినే మిగులుస్తోంది. స్వల్పంగా పెరిగిన మెనూ చార్జీలు ప్రభుత్వం ఈ నెలలో మెనూ చార్జీలను స్వల్పంగా పెంచింది. 1-5 తరగతుల వరకు ప్రస్తుతం ఇస్తున్న రూ.4.35 నుంచి రూ.4.65కు, 6-10 తరగతులకు ఇస్తున్న రూ.6ను రూ.6.30కి పెంచింది. అయితే ఇంతవరకు పెంచిన మెనూ చార్జీలు మాత్రం అమలులోకి రాలేదు. నాలుగు నెలలుగా అందని జీతాలు: గత నాలుగు నెలలనుంచి నాకు రావలసిన గౌరవ వేతనం రాలేదు. దీంతో ఇంట్లో గడవడం లేదు. బయట పనికెళ్లినా రోజూ రూ.200 వస్తుంది. కానీ దీనిమీద ఆధారపడి ఉన్నా ఇచ్చే కొద్దోగొప్పో కూడా ఇవ్వడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గౌరవ వేతనాన్ని వెంటనే మంజూరుచేయాలి. -పోలమ్మ, మధ్యాహ్న భోజన పథకం హెల్పర్, ఉదయగిరి సరుకులు అప్పు ఇవ్వడం లేదు: నాలుగు నెలల నుంచి బిల్లులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దుకాణదారులు సరుకులు కూడా అప్పు ఇవ్వడం లేదు. నిర్వహణ కష్టంగా మారింది. ఈ నెలలో బిల్లులు ఇవ్వకపోతే మధ్యాహ్న భోజనంఆపివేయడం తప్ప వేరే గత్యంతరం లేదు. -నల్లిపోగు నాగమణి, ఏజెన్సీ నిర్వాహకురాలు. -
కొండెక్కిన కోడిగుడ్డు
గుంటూరు ఎడ్యుకేషన్ వంట గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు గతంలోనే పెరిగిపోగా.. తాజాగా కోడిగుడ్డు ధర కొండెక్కటంతో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న సొమ్ముతో మెనూ సరిగా పాటించలేక, విద్యార్థుల కడుపు పూర్తిగా నింపలేక సతమతమవుతున్నారు. జిల్లాలోని 3,600 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి రోజు 2.50 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఆరగిస్తున్నారు. బియ్యాన్ని ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా కూరగాయలు, పప్పు, నూనె ఇతర నిత్యావసరాలను ఏజెన్సీ నిర్వాహకులే సమకూర్చుకుంటున్నారు. ఇందుకుగాను ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రోజుకు రూ.4, ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ.6 చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. వీరందరికీ వారంలో రెండు రోజులు కోడిగుడ్డు అందించాలని మెనూలో స్పష్టం చేసింది. ప్రస్తుతం కోడిగుడ్డు ధర నాలుగు రూపాయలకు చేరింది. దీంతో విద్యార్థికి కేటారుుస్తున్న సొమ్ము గుడ్డు కొనుగోలుకే సరిపోతోందని, మిగిలిన వస్తువుల కోనుగోలుకు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోందని ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. మరోవైపు వంట గ్యాస్‌కు సబ్సిడీ ధర వర్తించకపోవటం భారంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో విద్యార్థికి రూ.10 చొప్పున ఇవ్వాలని వంట ఏజెన్సీల నిర్వాహకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా దీనిపై ప్రభుత్వం ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పులు చేయాల్సి వస్తోంది.. మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం ఇస్తున్న నిధులు చాలడం లేదు. ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వమిచ్చే 6 రూపాయల్లో కోడిగుడ్డుకే రూ.4 సరిపోతోంది. ఇక నూనె, కందిపప్పు, కూరగాయలు కొనుగోలు చేయటానికి అప్పులు చేయూల్సి వస్తోంది. బడ్జెట్ పెంచితేనే అందరి కష్టాలు తీరతారుు. -వై.మహేశ్వరి, వంట ఏజెన్సీ నిర్వాహకురాలు, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, గుంటూరు -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపాలని, బకాయిలను చెల్లించాలిని కోరుతూ ఆ కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఉదయాన్నే సీఐటీయూ ఆధ్వర్యంలో వందలాది మంది కార్మికులు కలెక్టరేట్‌కు చేరుకుని నినాదాలు చేశారు. ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. కలెక్టరేట్‌లోకి ఎవరూ వెళ్ల్లేందుకు అవకాశం లేకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని వారిని విరమింపజేసే ప్రయత్నం చేశారు. ఉద్యమకారులు విరమించకుండా నినాదాలు చేసి బైఠాయించడంతో సీఐ తాతారావు ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి మహిళలను అరెస్టు చేసి శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ సంఘటనలో 653 మంది వంట కార్మికులను అరెస్టు చేసి, అనంతరం పూచీ కత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం పథకం సంఘ అధ్యక్షురాలు కె. నాగమణి, సీఐటీయూ కార్యరద్శి డి.గోవిందరావు తదితరులు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని, లేకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు యు.తిరుపతిరావు, ఉపాధ్యక్షురాలు పి.అరుణ, వృత్తిదారుల సంఘం నాయకులు టి.తిరుపతిరావుపాల్గొన్నారు. సమస్యలు పరిష్కరించాలని జూడాల ధర్నా రిమ్స్‌క్యాంపస్: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రిమ్స్ జూనియర్ డాక్టర్లు (జూడాలు) సోమవారం ధర్నా చేశారు. రిమ్స్ ఆవరణలోని రాజీవ్‌గాంధీ విగ్రహం ఎదుట జూనియర్ డాక్టర్లంతా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా రిమ్స్ జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు ద్వారకానాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. కేవలం రోగులకు ఇంజక్షన్లు ఇవ్వడం, కట్లు కట్టడానికే వాడుతున్నారని వాపోయారు. మార్చి 29 నుంచి రోగులకు సేవచేస్తూ వస్తున్నామన్నారు. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ సేవలు అందిస్తున్నామని తెలిపారు. అయితే అప్పటి నుంచి నేటి వరకు స్కాలర్షిప్లు విడుదల చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 91 మంది జూనియర్ డాక్టర్లకు ఒక్క నెల మాత్రమే స్టైఫండ్ విడుదల చేశారని మిగిలిన నెలలు విడుదల చేయలేదన్నారు. తక్షణమే స్టైఫండ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పున్నం చందర్, అశ్విని పాల్గొన్నారు. -
24కు బదులు 94
గోదావరిఖనిటౌన్ :మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలకు పాల్పడుతున్న ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడి విషయం డీఈవో ఆకస్మిక తనిఖీలో వెల్లడైంది. గోదావరిఖని గాంధీనగర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో 24 మంది విద్యార్థులు ఉండగా ప్రతీ దినం 94 మంది విద్యార్థులు వస్తున్నట్లు రిజిస్టర్లో హెచ్ఎం వెంకటేశ్వర్లు చూపిస్తున్నారు. శనివారం డీఈవో లింగయ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించడంతో విషయం వెలుగుచూసింది. కేవలం ఇరవై మంది లోపే విద్యార్థులు భోజనం చేస్తున్నట్లు బయటపడింది. కొంతకాలంగా సాగుతున్న ఈ తంతులో రూ.లక్షల్లో అక్రమాలు జరిగాయని తెలుస్తోంది. అందరూ అందరే.. ఈ అక్రమాలు పాఠశాల సిబ్బందికి, ప్రధానోపాధ్యాయుడికి తెలిసే జరుగుతున్నాయని తెలిసింది. రెండేళ్లుగా ఇలా చేస్తున్నారని, ఈ విషయంలో ఉపాధ్యాయులు, సిబ్బంది అంతా కుమ్మక్కయ్యారని తెలుస్తోంది. ప్రతీ విద్యార్థికి రోజుకు రూ.4 చొప్పున ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ లెక్కన అక్రమాలు లక్షల్లో జరిగినట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు ప్రభుత్వ పాఠశాలల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి లింగయ్య హెచ్చరించారు. విద్యార్థుల సంక్షేమాన్ని చూడాల్సిన ఉపాధ్యాయులు ధనార్జన కోసం, వారి జీవితాలతో ఆటలాడద్దని అన్నారు. గోదావరిఖని బాలుర పాఠశాలలో అక్రమాలకు పాల్పడిన ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లుపై వేటు పడక తప్పదని తెలిపారు. త్వరలోనే ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం, విద్యార్థుల శ్రేయస్సు కోసం మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. -
మధ్యాహ్న భోజన.. లెక్కలు కక్కండి!
శ్రీకాకుళం : లెక్కల చిక్కులు విద్యాశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరేళ్ల లెక్కలు కక్కమని కేంద్ర ప్రభుత్వం కోరడంతో అధికారుల నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. మింగలేక.. కక్కలేక.. గత 45 రోజులు గా మల్లగుల్లాలు పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 208 నుంచి 2014 వరకు విడుదలైన నిధులు, ఖర్చులతోపాటు బియ్యం వివరాలు పంపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. అక్కడి నుంచి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తాఖీదులు వెళ్లాయి. అయితే ఇన్నేళ్ల లెక్కలు చెప్పడం కష్టమని ఉపాధ్యాయ వర్గంతో పాటు జిల్లా అధికారులు అంటున్నారు. కాగ్(కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం వివరాలు కోరినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి ఖో-ఖో ఆట తరహాలో పాఠశాలల ప్రధానోపాధ్యాయుల వరకు ఒకరి నుంచి ఒకరికి వివరాలు ఇవ్వాలన్న సమాచార మార్పిడి జరుగుతోందే తప్ప అసలు పని ముందుకు సాగడం లేదు. ఆరేళ్ల వివరాలు ఇవ్వడం కొంత కష్టమే అయినప్పటికీ, అసాధ్యమేమీ కాదు. రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు పౌరసరఫరాల శాఖ పాఠశాలలకు బియ్యం సరఫరా చేస్తోంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను విద్యాశాఖాధికారులు ఆయా మండలాల్లోని విద్యార్ధుల సంఖ్యను బట్టి కేటాయింపులు జరుపుతుం టారు. ఎవరి నుంచి ఎవరికి బియ్యం, నిధులు వచ్చినా.. అవన్నీ ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదవుతాయి. ఆ రికార్డులు ఉంటే లెక్కలు చెప్పడం కష్టం కాదు. మధ్యాహ్న భోజన పథకం నిధులు పక్కదారి పడుతున్నాయన్న విమర్శలు ఏనాటి నుంచో ఉన్నా యి. ప్రస్తుతం లెక్కలు చెప్పడం కష్టమని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు వ్యాఖ్యానిస్తుండటానికి ఇదే కారణం కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అన్ని పాఠశాలల్లో కాకపోయినా అత్యధిక శాతం పాఠశాలల్లో అవినీతి జరుగుతుందనే వ్యాఖ్యలు బహిరంగంగానే విన్పిస్తున్నాయి. ఇటువంటి ఆరోపణలను తిప్పికొట్టేందుకైనా విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే వివరాలు కోరి 45 రోజులు దాటినా లెక్కలు ఒక కొలిక్కి రాలేదు. కాగా వివరాలు సమర్పించకుంటే ఇకముందు నిధులు మంజూరు చేయరాదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నట్టు సమాచారం. దీని వల్ల పేద విద్యార్థులు నష్టపోతారు. -
మధ్యాహ్న భోజన పథకానికి నాణ్యమైన బియ్యం
తెర్లాం రూరల్: మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పాఠశాలలకు నాణ్యమైన బియ్యాన్నే పంపిణీ చేస్తున్నామని, గోదాముల ద్వారా సరఫరా చేసే బియ్యంలో ఎటువంటి తేడాలు లేవని పౌర సరఫరాల శాఖ జిల్లా సహాయ మేనేజర్(టెక్నికల్) జె.భాస్కర శర్మ స్పష్టం చేశారు. తెర్లాంలోని పౌర సరఫరాల గోదాములో సరుకుల నిల్వలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసే బియ్యం నాసిరకంగా ఉంటున్నాయని, పురుగులు ఉంటున్నాయని ఇటీవల ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని స్టేజ్-1, స్టేజ్ గోదాములను తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఏ గోదాములో కూడా బియ్యం పురుగులు పట్టడం గానీ, నాసిరకమైన బియ్యంగానీ లేవన్నారు. ప్రతి నెలా స్టేజ్-1కు వచ్చే బియ్యాన్ని స్టేజ్-2 గోదాములకు పంపిణీ చేస్తామని, అక్కడ నుంచి రేషన్ డిపోలకు, వసతి గృహాలకు, పాఠశాలలకు పంపిణీ చేస్తామని తెలిపారు. పౌర సరఫరాల గోదాముల నుంచి పంపిణీ చేస్తున్న బియ్యంలో తేడాలు లేవన్నారు. అయితే గోదాము నుంచి పాఠశాలలకు బియ్యం తీసుకువెళ్లినపుడు వచ్చే నెల వరకు నిల్వ ఉంచడం, నిల్వలను కింద ఉంచడం వల్ల బియ్యం ముక్కిపోవడం, పురుగులు పట్టడం జరుగుతుందన్నారు. పాఠశాలలకు, వసతి గృహాలకు సంబంధించి ఉపాధ్యాయులు, వార్డెన్లు గోదాములకు వచ్చి బియ్యం బస్తాలను ఎంచుకొని తీసుకువెళ్లే సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. పాఠశాలలకు, వసతి గృహాలకు పంపిణీ చేసే బియ్యం బాగా లేకపోయినా వాటిని మార్చాలని గోదాము ఇన్చార్జిలకు సూచించామన్నారు. కార్యక్రమంలో తెర్లాం గోదాము ఇన్చార్జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెమలాం ఉన్నత పాఠశాల బియ్యం పరిశీలన నెమలాం ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం బియ్యం బాగాలేవని పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో పౌర సరఫరా శాఖ జిల్లా సహాయ మేనేజరు(టెక్నికల్) భాస్కరశర్మ, తెర్లాం గోదాము ఇన్చార్జి నాగేశ్వరరావులు పాఠశాలకు వెళ్లి బియ్యం పరిశీలించారు. బియ్యాన్ని నెలల తరబడి నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు వినియోగిస్తే పురుగులు పట్టే అవకాశం ఉండదన్నారు. -
సైన్స్ఫెయిర్లతో సృజనాత్మకత
తాండూరు టౌన్: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకే ఇన్స్పైర్ అవార్డ్స్ సైన్స్‌ఫెయిర్లను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి రమేష్ పేర్కొన్నారు. ఆది వారం ఆయన పట్టణంలోని సెయింట్ మార్క్స్ పాఠశాలలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఇన్స్పైర్ అవార్డ్స్ సైన్స్‌ఫెయిర్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి వచ్చే నెల 11 వరకు నాలుగు చోట్ల సైన్స్‌ఫెయిర్లను నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 25 నుంచి 27వరకు తాండూరులో, 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు పరిగిలో, సెప్టెంబర్ 2 నుంచి 4 వరకు ఇబ్రహీంపట్నంలో, 9 నుంచి 11 వరకు కుత్బుల్లాపూర్‌లలో సైన్స్ఫెయిర్లు నిర్వహించనున్నామన్నారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. సైన్స్‌ఫెయిర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,34,35,500 వెచ్చిస్తోందని ఆయన తెలిపారు. ఇందులో ఒక్కో నమూనా తయారీకి ఒక్కో విద్యార్థికి రూ.5 వేల చొప్పున రూ.1,03,35,000, 3 రోజుల పాటు జరగనున్న సైన్స్‌ఫెయిర్ సందర్భంగా భోజనం తదితర వసతుల కల్పనకు ఒక్కో విద్యార్థికి రూ.1500 చొప్పున మొత్తం రూ. 31,00,500 ఖర్చు చేయనున్నట్లు రమేష్ చెప్పారు. జిల్లావ్యాప్తంగా 2,067 నమూనాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేశామన్నారు. సైన్స్‌ఫెయిర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నమూనాలను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో 500 నమూనాల ప్రదర్శనకు సిద్ధం చేశామని డీఈఓ తెలిపారు. జిల్లాలోని 4 కేంద్రాల్లో ఒక్కో దాని నుంచి 7.5 శాతం చొప్పున నమూనాలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అక్కడ 5 శాతం ఎంపిక చేసి జాతీయస్థాయి పోటీలకు పంపుతారన్నారు. రాష్ట్రస్థాయిలో వచ్చే నెల చివరి వారంలో సైన్స్‌ఫెయిర్ జరుగుతుందన్నారు. వికారాబాద్ డివిజన్ పరిధిలోని తాండూరులో సోమవారం జరగనున్న సైన్స్‌ఫెయిర్‌లో 382 నమూనాలు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవానికి రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. అనుమతి లేని పాఠశాలలు 15 రోజుల్లో సీజ్ అనుమతి లేని పాఠశాలలకు ఇచ్చిన 2 నెలల గడువు మరో 15 రోజుల్లో ముగిసిపోతుందని డీఈఓ రమేష్ గుర్తు చేశారు. అనంతరం ఆయా పాఠశాలలను సీజ్ చేయనున్నట్లు చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు డీజీ, టాలెంట్, కాన్సెప్ట్, గ్రామర్, టెక్నో వంటి పేర్లను తొలగించాలంటూ నోటీసులు జారీ చేయనున్నామన్నారు. ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ కింద రూ.50 వేలు మంజూరయ్యాయన్నారు. జిల్లాలో ఎస్జీటీ, ఎస్ఏ కలిపి సుమారు 100 వరకు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఉపాధ్యాయులు విధిగా పాఠ్యప్రణాళిక, డైరీలను రాయాలన్నారు. మహిళా ఉపాధ్యాయులు వారికి కేటాయించిన 27 సెలవులను యథావిధిగా వినియోగించుకోవచ్చన్నారు. ఎన్ఐఆర్డీ అధికారులు పాఠశాలల్లో కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం, నాణ్యమైన విద్య తదితర అంశాలపై 12 మంది టీం సభ్యులుగా తనిఖీలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. -
వంటలో రాజకీయ మంట
విజయనగరం అర్బన్: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉద్యోగాలు కల్పించడం మాటెలాఉన్నా.... ఉన్న ఉపాధి ఊడగొట్టే చర్యలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో మ ధ్యాహ్న భోజన పథక నిర్వాహక మహిళా సంఘాలపై వారి కన్ను పడింది.బడిబయట విద్యార్థులను తగ్గించాలనే ఉద్దేశంతో పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యా హ్న భోజన నిర్వాహక వ్యవస్థలో రాజకీయ జోక్యం పెరుగుతోంది. ఏళ్లతరపడి మధ్యాహ్న భోజన వంట ను వృత్తిగా చేసుకొని ఉపాధి పొందుతున్న మహిళా గ్రూప్ సభ్యులను ఇంటికి పంపేందుకు అధికార పార్టీ గ్రామస్థాయి నాయకులు ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో జిల్లాలో 11 పాఠశాల భోజన నిర్వాహక ఏజెన్సీలను రద్దు చేస్తూ అధికారులు ఇటీవల ఆదేశాలిచ్చారు. నిబంధనల మేరకు పక్కాగా నిర్వహిస్తున్నా ఏజెన్సీలను రద్దు చేయడంపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణలో ఎలాంటి లోపాలూ లేనప్పటికీ స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్లే మార్చుతున్నారని మహిళాగ్రూపులు వాపోతున్నాయి. పాఠశాల పరిసరాల్లో ఉన్న మహిళా సంఘాలకు మాత్రమే నిర్వహణ బాధ్యత అప్పగించాలి. మహిళా సంఘాలు ముందుకు రాకపోతే సంఘం తీర్మానం చేసిన మహిళలకు మాత్రమే ఆ బాధ్యత ఇవ్వాలి.అయితే తమకు చెందిన వారికి ఈ బాధ్యతను అప్పగించేందుకు టీడీపీనేతలు అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. 11 స్కూళ్లలో ఏజెన్సీల మార్పు జిల్లాలో 11 పాఠశాలల్లో ఏజెన్సీలను మార్చుతూ అధికారులు ఆదేశాలుజారీ చేశారు. గుర్ల మండలంలో తెట్టంగి ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, పెదబంటుబిల్లి, రాగోలు ప్రాథమిక పాఠశాలలు , గం ట్యాడ మండలంలోని పెంటశ్రీరామపురం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, నెల్లిమర్ల మండలలోని నెల్లిమర్ల, చినబోరాడ పేట ప్రాథమిక పాఠశాలలు, చీపురుపల్లిలో పెదనడిపల్లి, భోగాపురం మండలంలో పోలి పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల, రామభద్రపురం మండ లం మిర్తివలస ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహక ఏజెన్సీలను మార్చుతూ ఆదేశాలి చ్చారు. దీంతో మిగతా ఏజెన్సీల మహిళలూ ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి ఫిర్యాదు లేకపోయినా రద్దు చేశారు భోజన నిర్వహణపై ఇంతవరకూ ఎప్పుడూ ఎలాం టి ఫిర్యాదూ నాపై నమోదు కాలేదు. రాజకీయ ఒత్తిళ్లవల్లే నా ఏజెన్సీని రద్దు చేశారు. ఈ నెల 5వ తేదీ సాయంత్రం రద్దు ఆదేశాలిచ్చారు. మరుసుటిరోజు నుంచి అధికార పార్టీ వాళ్లకు ఇచ్చేశారు. -జె.అప్పలనరసమ్మ, తెట్టంగి పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు మండల స్థాయి కమిటీ తీసుకున్న నిర్ణయం పాఠశాల మధ్యాహ్నభోజన పథక నిర్వహణ ఏజెన్సీల ను తాహశీల్దార్, ఎంఈఓలతో కూడిన మండల కమిటీ, వీఏఓ, వీఆర్ఓ, కార్యదర్శిలతో గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తాయి. వాటిపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా పరిశీలించి రద్దు చేయాలన్నా, కొనసాగించాలన్నా ఆయా కమిటీలకే సర్వాధికారాలున్నాయి. జిల్లాలోని తాజాగా జరిగిన 11 ఏజెన్సీల మార్పునకు కారణాలు ఇంకా జిల్లా కేంద్రానికి రావాల్సి ఉంది. -జి.కృష్ణారావు, డీఈఓ -
వంట..మంట!
ఎమ్మిగనూరు టౌన్: అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీల మార్పునకు విద్యాశాఖ అధికారులు తీసుకున్న నిర్ణయం వివాదాలకు దారితీస్తోంది. పాత ఏజెన్సీలు హై కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా, అనుమతించ వద్దంటూ కొందరు అధికార పార్టీ నాయకులు హుకుం జారీ చేస్తుండటంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. సోమవారం రెండు వంట ఏజెన్సీల మధ్య చెలరేగిన వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళితే... పట్టణంలోని 31 పాఠశాలల్లో ఇప్పటి వరకు మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న ఏజెన్సీలను రద్దు చేయాలంటూ అధికార పార్టీ నాయకులు ఆ పథకం త్రిసభ్య కమిటీపై ఒత్తిడి తెచ్చారు. విషయాన్ని పసిగట్టిన ఐదు పాఠశాలల ఏజెన్సీలు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు జూలై 3న స్టే విధించింది. అయితే హైకోర్టు స్టేను అధికారులు లేక్క చేయలేదు. త్రిసభ్య కమిటీలోని ఎంఈఓ, ఎంపీడీఓలు పట్టణంలోని 31 ఏజెన్సీలను రద్దు చేసినట్లు ఉత్తర్వులను ఈనెల 12న ఆయా పాఠశాలల హెచ్ఎంలకు పంపారు. కాని త్రిసభ్య కమిటీలో సభ్యుడైన తహశీల్దార్ సంతకం పెట్టేందుకు నిరాకరించినా ఉత్తర్వులను మాత్రం హెచ్ఎంలకు పంపడం గమనార్హం. -
మిథ్యాన్నమే!
ఉడికీ ఉడకని మధ్యాహ్న భోజనం... సాక్షి, మహబూబ్‌నగర్: విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకం నీరుగారిపోతుంది. వంట ఏజెన్సీలకు ఈ ఏడాది ఇప్పటి వరకు నిధులు రాకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రెండు నెలలుగా ప్రభుత్వం పైసలివ్వకపోవడంతో విద్యార్థులకు ఉడకని అన్నం... నీళ్ల చారే దిక్కైంది. మెనూ ప్రకారం విద్యార్థులకు ఎక్కడా భోజనం అందించడంలేదు. ఉడికీ ఉడకని అన్నం నీళ్లచారుతో నిర్వాహకులు సరిపెడుతున్నారు. వారానికి ఒకసా రి ఇవ్వాల్సిన గుడ్డు, అరటిపండు సంగతే పట్టించుకోవడం లేదు. భోజనం తర్వాత కనీసం తాగడానికి మంచి నీళ్లు కూడా లేక విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో ఆవరణలో విద్యార్థులు భోజనం చేస్తుండగా వారి వద్దకు పందులు, కుక్కలు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి. బుధవారం ‘సాక్షి’ విజిట్‌లో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.8 కోట్ల బకాయిలు జిల్లాలో మొత్తం 3,799 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. పాఠశాలలో హాజరు శాతాన్ని పెంచుతూ, డ్రాపవుట్ శాతం తగ్గించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ పథకం కింద అన్ని పాఠశాలల పరిధిలో దాదాపు 4,48,227 మంది విద్యార్థులకు భోజనం పెడుతున్నట్లు అధికార గణాంకాలు సూచిస్తున్నాయి. వీటి నిర్వహణకు ప్రతి నెల రూ.5కోట్ల నిధులను ప్రభుత్వాలు మంజూరు చేస్తున్నాయి. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా స్కూళ్లు ప్రారంభమైన నాటి నుంచి నిధులు రాలేదు. కేవలం 9, 10 తరగతుల విద్యార్థుల కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ నిధులు *కోటిన్నర మంజూరయ్యాయి. ఒకటి నుంచి 8 తరగతుల విద్యార్థుల అమలు కోసం 8కోట్ల రూపాయలు ఇప్పటి దాకా మంజూరు కాలేదు. ప్రభుత్వం నుంచి కేవలం బియ్యం మాత్రమే అందుతుండటంతో, మిగతా వంట సరకుల కోసం నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కిరాణషాపులలో అప్పు పుట్టకపోవడంతో చాలా చోట్ల నీళ్ల చారుతో సరిపెడుతున్నారు. ఇరుకు గదులతో ఇక్కట్లు.. జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇప్పటికీ వంటగదులు లేవు. దీంతో నిర్వాహకులు ఆరుబయటే వంట చేస్తున్నారు. జిల్లాకు ఇప్పటి వరకు రెండు విడతలుగా 4,660 గదుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. వీటిలో కేవలం 1,107 మాత్రమే పూర్తయ్యాయి. 500వరకు వివిధ దశలలో కొనసాగుతున్నాయి. మిగతావి పనులు చేపట్టిన దాఖలాలే లేవు. కొన్ని చోట్ల కిచెన్ షెడ్లు ఇరుకుగా ఉండటం వల్ల వంట ఏజెన్సీ మహిళలు ఆరుబయటే వంటలు చేస్తుండటంతో పొగ కమ్ముకుని విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయి. చాలా పాఠశాలల్లో తాగునీటి సౌకర్య లేకపోవడంతో వంట ఏజెన్సీలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో తినలేమంటూ కొందరు విద్యార్థులు ఇళ్లనుంచే భోజనం తెచ్చుకుంటున్నారు. ఉపాధ్యాయులు నచ్చచెబుతున్నా కొన్ని చోట్ల సామాజిక అంతరాలను సాకుగా చూపుతూ కొందరు విద్యార్థులు ఈ పథకానికి దూరంగా ఉంటున్నారు. వంట ఎవరు చేయాలనే అంశంపై ఏజెన్సీల నడుమ గొడవలు జరిగి అధికారుల దృష్టిని వెళ్లిన దాఖలా కూడా వుంది. వంట ఏజెన్సీల నియామకంలో రాజకీయ జోక్యం కూడా ఉండటంతో సిగపట్లకు దారితీస్తోంది. -
అప్పుల అన్నం
సాక్షి, ఖమ్మం: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వాహకులను ఆ పథకం అప్పుల పాలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా వీరికి బిల్లు మంజూరు కావడం లేదు. అయితే విద్యార్థుల కడుపు మాడ్చలేక వీరు అప్పు చేసైనా సరే అన్నం పెడుతున్నారు. ఈ అప్పుకు వడ్డీ పెరిగిపోతున్నా బిల్లులు మాత్రం మంజూరు కావడం లేదు. గత ఏడాది బిల్లు రూ.2 కోట్లు పెండింగ్‌లో ఉన్నా ఇప్పటికీ ఏజెన్సీ నిర్వాహకులకు అందలేదు. ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు రూ.10.8 కోట్లు విడుదల చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నా ఇదీ అందక వారు మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలో 3,416 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. డ్వాక్రా సంఘాల మహిళలు, ఇతర మహిళలు ఏజన్సీలుగా ఏర్పడి ఆయా పాఠశాలల్లోని 2.50 లక్షల మంది విద్యార్థులకు భోజనం వడ్డిస్తున్నారు. ఏజెన్సీలకు ప్రతి నెల సక్రమంగా బిల్లు అందితేనే మరుసటి నెలలో మెనూ ప్రకారం పెట్టే కూరగాయలు, ఉప్పు, నూనె, చింతపండు, కారం కొనుగోలు చేస్తారు. ఈ పథకం నిబంధనల ప్రకారం ప్రతినెల బిల్లులు అందించాల్సి ఉన్నప్పటికీ.. ప్రభుత్వం ఐదారు నెలలకు ఒకసారి మంజూరు చేస్తోంది. దీంతో నిర్వాహకులకు అప్పుల భారం అధికమవుతోంది. కిరాణ దుకాణాల వద్ద వంట పదార్థాలు తేవడంతో ప్రతి నెల బిల్లు తడిసిమోపెడవుతోంది. ఒక నెల చెల్లించకపోతే దుకాణదారులు ఆ మొత్తాన్ని వడ్డీకి రాసుకుంటున్నారు. జిల్లాలో గత విద్యా సంవత్సరంలో అక్టోబర్ నుంచి మార్చి వరకు ఆర్నెళ్లకు సంబంధించి రూ.2 కోట్ల బిల్లు పెండింగ్‌లో ఉంది. ఇక ఈ విద్యా సంవత్సరం జూన్, జూలై, ఆగస్టు మూడు నెలలకు రూ. 10.8 కోట్లు విడుదల చేసినట్లు విద్యాశాఖ అదికారులు పేర్కొంటున్నారు. అయితే ట్రెజరీ కమిషన్ నుంచి ఆథరైజేషన్ రాకపోవడంతో ఈ బిల్లులు ట్రెజరీలోనే మూలుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలైనా ఇప్పటి వరకు ఏజెన్సీలకు ఒక్క రూపాయి కూడా చెల్లించకపోవడం గమనార్హం. బిల్లులు రాకపోవడంతో తమకు తోచిన కూరగాయలు కొనుగోలు చేసి పెడుతున్నామని, మెనూ ప్రకారం వడ్డించాలనే అధికారుల ఆదేశాలు ఎలా సాధ్యమని నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. కాగా, జిల్లాలో 5,982 మంది కుకింగ్ కమ్ హెల్పర్స్(సీసీహెచ్)కు ఇవ్వాల్సిన రూ.1000 గౌరవ వేతనం నెలల తరబడి రావడం లేదు. ఇవి వచ్చినా వంట పదార్థాల కొనుగోలుకు ఆసరా అయ్యేవని వారు అంటున్నారు. గిట్టుబాటు కాక.. మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి వారానికి రెండు రోజులు గుడ్లు పెట్టాలి. గుడ్డు ధర రూ. 4కు పైగా పెరగడంతో ఏజన్సీల మహిళలు నష్టాల పాలవుతున్నారు. పెరిగిన ధర ప్రకారం వారికి బిల్లు రావడం లేదు. ప్రాథమిక తరగతుల విద్యార్థులకు మెస్ చార్జీ రూ.4.35 పైసలు, ఉన్నత తరగతి విద్యార్థులకు రూ.6కు పెంచినా ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పు, కారం, పసుపు, నూనెలు ఐఎస్ఐ, ఆగ్మార్క్ ఉన్నవి వాడాలనే నిబంధన ఉండటంతో నిర్వహణ వ్యయం అధికమవుతోందని, పెరిగిన ధరల ప్రకారం సకాలంలో బిల్లు ఇవ్వకపోవడంతో తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన ప్రభుత్వమైనా గత ఏడాది బిల్లుతో పాటు ఈ విద్యా సంవత్సరం ఎప్పటికప్పుడు బిల్లు మంజూరు చేస్తేనే మధ్యహ్న భోజనం నాణ్యతగా విద్యార్థులకు అందే అవకాశం ఉంటుం దని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
పాతబస్టాండ్: కలెక్టరేట్ సోమవారం ఉదయం ధర్నాలతో దద్దరిల్లింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పలు సంఘాలు ఉద్యమించాయి. జీతాలు, భోజనం తయారీ బిల్లులు చెల్లించాలని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, ‘ఉపాధి’ ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారి సంఘ సభ్యులు, జ్యూట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వారి సంఘాలు ధర్నాలు నిర్వహించాయి. దీంతో మధ్యాహ్నం వరకూ వారి నినాదాలతో కలెక్టరేట్ ప్రాంగణం మారుమోగింది. వంట కార్మికులకు రూ.2 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలి వంట ఏజెన్సీలకు రూ.2 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని వారి ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.నాగమణి డిమాండ్ చేశారు. వంట నిర్వాహకులు చేసిన ధర్నానుద్దేశించి ఆమె మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు నింగినంటాయని, కంటింజెన్సీ నిధులు రెట్టింపు చేయాలన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ వంట చేస్తున్న వారిపై రాజకీయ వేధింపులు ఎక్కువవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. వంట చేయడానికి గ్యాస్ సరఫరా చేయాలని, గుడ్డు, స్వీటు పెట్టిన రోజు అదనపు బడ్జెట్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సంఘ ప్రధాన కార్యదర్శి మహలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జూట్ లాకౌట్ ఎత్తివేయాలి పైడిభీమవరంలోని స్వర్ణాంధ్ర, జి.సిగడాం మండలం చీడివలస వద్దనున్న శ్రీకాకుళం జూట్ కర్మాగారం లాకౌట్లను ఎత్తివేయాలని ఆ కర్మాగారాల యూనియన్ ప్రతినిధులు ఎ.శ్రీనివాస్, జి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నానుద్దేశించి వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యాలు కుమ్మక్కై కార్మికులను రోడ్డుపైకి నెట్టారని విమర్శించారు. ముందస్తునోటీసు ఇవ్వకుండా లాకౌట్ ప్రకటించడం దారుణమన్నారు. ఏళ్ల తరబడి వేతన సమస్యలు తీర్చకుండా కాలంగడుపుతూ వస్తోందని, పలుసార్లు యాజమాన్యాలకు విన్నవించుకున్నా ప్రయోజనం లేకపోయిందన్నారు. న్యాయమైన కోర్కెలు పరిష్కరిస్తూ లాకౌట్ ఎత్తివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం.తిరుపతిరావు, డి.బలరాం తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర సహాయకులను కొనసాగించాలి ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యత్నాలను విరమించుకోవాలని వారి సంఘ నాయకుడు కె.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ యోచనకు వ్యతిరేకంగా ఎన్ఆర్ఈజీఎస్ క్షేత్ర సహాయకుల రిలే నిరాహారదీక్షలను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతిరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు, తిరుపతిరావు మాట్లాడుతూ ఉపాధి వ్యవస్థను బలీయం చేసి సహకరించాల్సిన తరుణంలో ఈ వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. అడ్డగోలుగా విడుదల చేసిన జీవో 2614, 1090లను నిలుపుదల చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మందిని తొలగించేందుకు చేసే ప్రయత్నాన్ని నిలుపుదల చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్.సూరిబాబు, డి.గోవిందరావు, పంచాది పాపారావు, టి.తిరుపతిరావు, బి.సూరయ్య, డి.గణేశ్ ప్రసంగించారు. తొలిరోజు దీక్షలో కె.లక్ష్మణరావు, ఎన్.రామకృష్ణ, కె.చంద్రశేఖర్, కె.లచ్చుము, నారాయణరావు, కిశోర్‌కుమార్, రామారావు, శ్యామలరావు, గోవిందమ్మ, రామకృష ఉన్నారు. -
రాజకీయ వేధింపులు ఆపాలి
విజయనగరం కంటోన్మెంట్ : మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులపై రాజకీయ వేధింపులు ఆపాలని ఏపీ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. జయలక్ష్మి, బి. సుధారాణి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తే, ఇప్పుడు ఆ పార్టీ నాయకులే వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పన్నెండేళ్ల నుంచి మధ్యాహ్న భోజన పథకం నిర్వహణలో 5 వేల మంది నిర్వాహకులు పని చేస్తున్నారన్నారు. వీరికి గౌరవ వేతనం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తున్నారన్నారు. బిల్లులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. నెల్లిమర్ల రెల్లివీధి స్కూల్, గాజుల రేగ రాళ్లమాలపల్లి స్కూల్, గుర్ల మండలం తెట్టంగి, చీపురుపల్లి మండలం చిననడిపల్లి, పెదనడిపల్లి పాఠశాలల్లో నిర్వాహకులపై వేధింపులు ఎక్కువగా ఉన్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి డీఈఓ హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని స్పష్టం చేశారు. ఎట్టకేలకు అధికారులు స్పందించి మంగళవారం చర్చలు జరుపుతామని చెప్పడంతో నిర్వాహకులు వెనుదిరిగారు. కార్యక్రమంలో ఉమామహేశ్వరి, జి తులసి, చల్లా జగన్, డి. అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘వంట’ ఏజెన్సీలపై తమ్ముళ్ల కన్ను!
కొలిమిగుండ్ల: మధ్యాహ్న భోజన పథకంపై అధికారపార్టీ నాయకుల కన్ను పడింది. ఎలాగైనా ప్రభుత్వ పాఠశాలల్లో వంట ఏజెన్సీలుగా తమ వాళ్లే ఉండాలని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్లితే..స్థానిక జెడ్పీ ఉన్నత, మోడల్ స్కూల్‌తో పాటు ప్రాథమిక మెయిన్, బీసీ, ఎస్సీ ప్రాథమిక పాఠశాలల్లో గత కొన్నేళ్లుగా గ్రామైక్య సంఘాల మహిళలు మధ్నాహ్న భోజనం తయారు చేసి వడ్డిస్తున్నారు. పార్టీలకు సంబంధం లేకుండా వీరు పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో స్థానిక ఆ పార్టీనాయకులు, కార్యకర్తల ఆగడాలు ఎక్కువయ్యాయి. ఇప్పటి వరకు కొనసాగుతున్న వంట ఏజెన్సీలను తొలగించి తమవారికి అవకాశం కల్పించాలని అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరికొందరు రెండు రోజులుగా గ్రామాల్లో కలియ తిరుగుతూ ఇతరులు వంట చేస్తున్నారని, నిర్వహణ సరిగా లేదని విద్యార్థులతో గుట్టుచ ప్పుడు కాకుండా సంతకాలు సేకరిస్తున్నారు. తర్వాత ఈసంతకాలు, ఫిర్యాదులతో ఎంఈవోను కలిసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇటీవల ఇటిక్యాల డిపెప్ ప్రాథమిక పాఠశాలలో టీడీపీ వర్గీయులకు చెందిన ఓ మహిళ ఏకంగా ఇంటి వద్దనే వంట చేసి తీసుకెళ్లి పాఠశాలలో విద్యార్థులకు వడ్డించింది. ఈమెకు ఎవరూ ఏజెన్సీ బాధ్యతలు అప్పగించలేదు. ఇదే విషయాన్ని అదే పాఠశాలలో ఐదేళ్లుగా వంట తయారు చేస్తున్న నిర్వాహకురాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. తనకు తెలియజేయకుండా మరొకరికి ఏజెన్సీ ఎప్పుడు అప్పగించారని ప్రశ్నించింది. ఖంగుతున్న అధికారులు విచారించి ఐదేళ్లుగా కొనసాగుతున్న నిర్వాహకురాలికే బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం వివిధ గ్రామాలకు చెందిన వంట ఏజెన్సీలు ఇన్చార్జి తహశీల్దార్‌తో పాటు త్రిసభ్య కమిటీ సభ్యులను కలిశారు. కారణం లేకుండా తమను తొలగించరాదని, మధ్యాహ్నభోజన పథకంలో రాజకీయ జోక్యం తగ్గించాలని వారు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. -
పచ్చని పల్లెల్లో పచ్చ మంటలు
పెద్దకడబూరు : పచ్చని పల్లెల్లో పచ్చ నాయకులు మంటలను ఎగదోస్తున్నారు. అధికారం చాటున తెలుగుదేశం నాయకులు ఆగడాలకు తెరతీస్తున్నారు. గ్రామాల్లో కొత్త వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. సాఫీగా సాగుతున్న మధ్యాహ్న భోజనం పథకంలో జోక్యం చేసుకుంటూ,, అధికారులకు తలనొప్పిగా మారుతున్నారు. దేవాలయాల్లాంటి బడుల్లో రాజకీయాలు నెరుపుతున్నారు. పెద్దకడబూరు మండలం ముచ్చగిరి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పదేళ్లుగా పొదుపు గ్రూపు మహిళ వంట ఏజెన్సీ నిర్వహిస్తోంది. ఎలాంటి ఆరోపణలు లేకున్నా ఆ ఏజెన్సీని మార్చాలని తెలుగు తమ్ముళ్లు ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓలపై ఒత్తిడి తెస్తున్నారు. అయితే వారు ససేమిరా అంటున్నారు. అనుమతి ఉన్న ఏజెన్సీకే రేషన్, బిల్లులు ఇస్తామని వారు స్పష్టం చేస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని టీడీపీ నాయకులకు సూచిస్తున్నారు. వీరి మాటలను లెక్కచేయకుండా మరో మహిళను రెచ్చగొట్టి, మధ్యాహ్న భోజనం వండించి, పిల్లలకు వడ్డిస్తున్నారు. విద్యార్థులు ఎవరి వద్దకు వెళ్లి అన్నం పెట్టించుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. అనుమతి లేకుండా వంట చేయవద్దని ఆ మహిళకు ప్రధానోపాధ్యాయుడు రామ్మోహన్ సూచిస్తే.. ‘మా నాయకులు చెప్పారని, వారు చెప్పినట్లు చేస్తున్నానని’ ఆమె ఎదురు సమాధానం చెబుతోంది. రేషన్ దుకాణంలోకి వెళ్లి దౌర్జన్యంగా రేషన్ కూడా తెచ్చుకున్నట్లు సమాచారం. ఈ వివాదాన్ని హెచ్ఎం బుధవారం సర్పంచ్, గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెన్సీ మహిళే వంట చేయడం సమంజసమని వారు స్పష్టం చేశారు. కాగా.. ముచ్చగిరిలో కాక దొడ్డిమేకల పాఠశాలలోనూ ఇలాంటి వివాదమే తలెత్తినట్లు తమ దృష్టికి వచ్చిందని ఎంఈఓ జగదీశ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ అనుమతి వచ్చే వరకు ఆగమని చెప్పినా వారు పట్టించుకోవడం లేదన్నారు. అయితే ఇప్పటిదాకా ప్రభుత్వ అనుమతి ఉన్న ఏజెన్సీకే బిల్లులు మంజూరు చేస్తామన్నారు. -
జైపూర్ చేరుకున్న బిల్ క్లింటన్!
జైపూర్: అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సోమవారం అర్ధరాత్రి ప్రత్యేక చార్డెట్ విమానంలో జైపూర్ చేరుకున్నారు. లక్షలాది మంది పాఠశాల విద్యార్ధులకు భోజన ఏర్పాటు చేస్తున్న ఓ స్వచ్చంద సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్లింటన్ పాలుపంచుకోనున్నారు. సోమవారం అర్ధరాత్రి జైపూర్ చేరుకున్న క్లింటన్ ఒబెరాయ్ రాజ్ విలాస్ లో బస చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాది పాఠశాల విద్యార్ధులకు మధ్యాహ్న భోజన సదుపాయాన్ని కల్పిస్తున్న అక్షయ పాత్ర అనే స్వచ్చంద సంస్థ నిర్వహించే అతిపెద్ద వంటశాలను బుధవారం క్లింటన్ సందర్శిస్తారని నిర్వహకులు, పోలీసులు వెల్లడించారు. జైపూర్ జిల్లాలోనే ప్రతి రోజు 1100 పాఠశాలల్లో 1.25 లక్షల విద్యార్ధులకు మధ్యాహ్న భోజనాన్ని అక్షయ పాత్ర ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా జైపూర్ లోని 20 వేల అంగన్ వాడి కార్యకర్తలకు, 4 వేల రోజువారి కూలీలకు కేవలం 5 రూపాయలకే భోజనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జైపూర్ లోనే కాకుండా రాజస్థాన్ లోని నతద్వారా, జోధ్ పూర్, బరాన్ పట్టణాల్లో వంటశాలలను నిర్వహిస్తోంది. జైపూర్ లోని ప్రతాప్ నగర్ లో సంస్కృత వేద పాఠశాలను కూడా క్లింటన్ సందర్శిస్తారని నిర్వహాకులు తెలిపారు. గురువారం ఉత్తర ప్రదేశ్ లోని లక్నోలో పర్యటించనున్నారు. -
‘మధ్యాహ్నం’ ఇంటికే!
పాములపాడు: విద్యార్థుల హాజరు శాతం పెంపొందించేందుకు ఉద్దేశించిన మధ్యాహ్న భోజనం పథకం అభాసుపాలవుతోంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా మండల పరిధిలోని వాడాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెల రోజులుగా పథకం నిలిచిపోయింది. విధిలేని పరిస్థితుల్లో విద్యార్థులు మధ్యాహ్నం ఇళ్లకు వెళ్లి భోజనం చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా పలువురు విద్యార్థులు మధ్యాహ్నం తర్వాత పాఠశాలకు వచ్చేందుకు విముఖత చూపుతున్నారు. పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 119 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంపై విద్యార్థులు గగ్గోలు పెడుతున్నా అధికారులెవరూ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉపాధ్యాయులు త్రిసభ్య కమిటీకి విషయాన్ని తెలియజేయడంతో చేతులు దులిపేసుకున్నారు. గత ఐదు సంవత్సరాలుగా పాఠశాలలో ఆశ గ్రూపు వంట బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇద్దరు వంట మనుషులను ఏర్పాటు చేశారు. గిట్టుబాటు కావడం లేదనే సాకుతో విద్యార్థుల సంఖ్యను పెంచి చూపడం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తుండగా.. మెనూ పాటించకపోవడం వల్ల విద్యార్థులు తరచూ గొడవ చేస్తున్నారు. సమస్య తలెత్తినప్పుడు మండల అధికారులు పరిష్కారం చూపడం.. ఆ తర్వాత షరా మామూలు కావడంతో మధ్యాహ్న వేళ విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికైనా పథకం సక్రమంగా అమలయ్యేలా అధికారులు చొరవ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
రోజుకో వంటకం
- పౌష్టికాహార పథకంలో మార్పులు - 13 రకాల స్పెషల్స్‌తో మెనూ రెడీ - జిల్లాకు మూడు స్కూళ్లలో అమలు సాక్షి, చెన్నై: పౌష్టికాహార పథకంలో మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక విద్యార్థులకు రోజుకో వంటకంతో రుచి, సుచితో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అందించనుంది. ప్రయోగాత్మకంగా జిల్లాకు మూడు పాఠశాలల్లో 13 రకాల స్పెషల్ డిష్ వడ్డించే పనిలో సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో విద్యా వ్యాప్తి, పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని దివంగత మాజీ ముఖ్యమంత్రులు కామరాజర్, ఎంజీయార్ల హయాంలలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు మారినా ఈ పథకం మాత్రం నిర్విరామంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పౌష్టికాహార పథకం పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న 43 వేల పాఠశాలల్లో ఈ పథకం అమల్లో ఉంది. ఈ పథకం ద్వారా సుమారు యాభై లక్షలకు పైగా విద్యార్థులకు ప్రతి రోజూ మధ్యాహ్నం వేళ అన్నం, సాంబారుతో పాటు ఉడకబెట్టిన గుడ్డును అందిస్తూ వస్తున్నారు. ఏళ్ల తరబడి అన్నం, సాంబారుతో మధ్యాహ్న భోజనం అందిస్తూ రావడంతో కొందరు విద్యార్థులు విముఖత చూపుతున్నారు. చేసిన అన్నం, సాంబారు వృథా అవుతున్నాయి. పథకంలో మార్పు మధ్యాహ్న భోజనం వృథా అవుతుండడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తగ్గుతుండటాన్ని విద్యా శాఖ పరిగణనలోకి తీసుకుంది. విద్యా వ్యాప్తి లక్ష్యంగా ఆంగ్ల తరగతులు, ప్రైవేటు విద్యా సంస్థలకు దీటుగా ప్రత్యేక విద్యా విధానాలు ప్రభుత్వ స్కూళ్లల్లో అమల్లోకి వస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు వీటి మీద దృష్టి పెట్టే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్ని ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పౌష్టికాహార పథకం మెనూలో మార్పునకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్లను కేటాయించింది. 13 రకాలతో మెనూ సిద్ధం ప్రతి రోజూ ఒకే తరహా వంటకాలు అందించడంకన్నా రోజుకో వంటకం రూపంలో పౌష్టికాహారం అందించడం ద్వారా విద్యార్థులకు కడుపు నిండా తిండి పెట్టేందుకు వీలు కలుగుతుందని అధికారులు భావించారు. అలాగే స్వతహాగా తమ పిల్లల్ని పాఠశాలలకు పంపించేందుకు గ్రామీణ ప్రాంతాల్లోని పేద తల్లిదండ్రులు ముందుకు వస్తారన్న ఆకాంక్షతో ఈ పథకం కోసం ప్రత్యేక మెనూను పౌష్టికాహార పథకం అధికారులు సిద్ధం చేశారు. ఇందుకోసం 13 రకాల డిష్‌తో పెద్ద మెనూ రెడీ అయ్యింది. అన్నం, సాంబారు ఒక రోజు, మిగిలిన రోజుల్లో ప్రైడ్ రైస్, విజిటబుల్ బిరియాని, లెమన్ రైస్, పులి హోర, బిస్మిల్లా బాత్, పలావ్, కరివే పాకు రైస్, టామాట రైస్, కాయగూరలతో మిక్స్డ్ రైస్ వంటి వాటిని విద్యార్థులకు అందించేందుకు నిర్ణయించారు. గుడ్డును ఒక్కో రోజు ఒక్కో విధంగా పంపిణీ చేయడానికి రెడీ అయ్యారు. ఒక రోజు బాయిల్ చేసిన గుడ్డును, మిగిలిన రోజుల్లో పెప్పర్ మిక్స్డ్ గుడ్డు, మసాల మిక్స్డ్ గుడ్డు, గుడ్డు పొడి మాసు తరహాలో అందించనున్నారు. వీటితో పాటు వారంలో రెండు లేదా మూడు రోజులు ఉల్లగడ్డ మసాల, చెన్నా మసాల, అలసందల మాసాలాల్ని సైడ్ డిష్‌లుగా ఇవ్వనున్నారు. ప్రయోగాత్మకంగా అమల్లోకి 13 రకాల డిష్‌తో కూడిన మెనూలోని వంటకాల్ని సిద్ధం చేయడానికి పౌష్టికాహార సిబ్బందికి ప్రావీణ్యం లేదని చెప్పవచ్చు. చెన్నైలో ప్రముఖంగా ఉన్న నలుగురు చెప్లు, వారి సిబ్బంది సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పౌష్టికాహార సిబ్బందికి వంటకాల తయారీపై శిక్షణ ఇచ్చారు. అన్ని స్కూళ్లలో ఒకే రకంగా వంటకాల్లో నాణ్యత ప్రమాణాలు ఉండే విధంగా ఈ శిక్షణను పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెనూకు ఆమోద ముద్ర వేయడంతో ప్రయోగాత్మకంగా విద్యార్థులకు వంటకాల రుచి అందించేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు మూడు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ మెనూ అమల్లోకి వచ్చింది. సరికొత్త మెనూలోని వంటకాలను విద్యార్థులు ఆవురాావురంటూ ఆరగించడం కనిపించింది. ఆరోగ్యపరంగా దోహదపడే రీతిలో రుచి, సుచికర వంటకాలు మధ్యాహ్నం వేళల్లో ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థుల ముంగిటకు త్వరలోనే వాలబోతున్నాయి. -
‘మిథ్యా’హ్న భోజనం
కర్నూలు(విద్య) : అధికారుల నిర్లక్ష్యం, వంట ఏజెన్సీల అవినీతితో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అభాసుపాలవుతోంది. బడిలో పిల్లల సంఖ్యకు.. భోజనం వడ్డిస్తున్న విద్యార్థుల సంఖ్యకు పొంతన కుదరని పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున ప్రజాధనం వృథా అవుతున్నా పర్యవేక్షణ కొరవడింది. కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు కలసి వంట ఏజెన్సీలతో కుమ్మక్కై నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 2,909 ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలలు, మదర్సాలు, ఎన్సీఎల్పీ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అధికారుల లెక్కల ప్రకారం 1 నుంచి 8వ తరగతి వరకు జిల్లాలో 4 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉండగా.. 3.70 లక్షల మంది ఈ పథకం కింద భోజనం చేస్తున్నారు. ఇందుకు గత యేడాది రూ.6,66,70,000 విడుదల చేశారు. 9, 10వ తరగతులకు మరో రూ.56లక్షలు నిధులు పంపిణీ చేశారు. గత ఏప్రిల్‌లో 16 రోజుల బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. సాధారణంగా డైస్ లెక్కల ప్రకారం ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ పథకం అమలుకు బిల్లులు మంజూరు చేస్తారు. ఆయా పాఠశాలల్లో ఎంత మంది విద్యార్థులున్నారనే విషయాన్ని హెచ్ఎంలు, ఎంఈవోలు ఆర్వీఎంకు నివేదిక అందజేస్తారు. దీని ఆధారంగా డైస్ లెక్కలను తయారు చేస్తారు. ఆ మేరకు పాఠశాలల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తారు. అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపి నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు కాపాడుకునేందుకు విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపుతున్నారని, జిల్లా మొత్తంగా 30 శాతం పైగాా నిధులు స్వాహా చేస్తున్నట్లు సమాచారం. నాసిరకం భోజనంతో అనారోగ్యం మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రతి విద్యార్థికి రూ.4.35లతో పాటు 100 గ్రాముల బియ్యం ఇస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు రూ.6లతో పాటు 150 గ్రాముల బియ్యం కేటాయిస్తారు. ప్రతిరోజూ విద్యార్థులకు అన్నంతో పాటు సాంబార్, పప్పు వండి పెట్టాలి. వారానికి రెండుసార్లు కోడిగుడ్లు అందజేయాలి. ఏజెన్సీల కక్కుర్తితో నాసిరకం కూరగాయలతో నీళ్లచారును వడ్డిస్తున్నారు. దీనికి తోడు వారంలో రెండుసార్లు కాకుండా ఒకసారి మాత్రమే గుడ్లను అందిస్తున్నారు. కొన్ని చోట్ల గుడ్లకు బదులు అరటి పండ్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. లావుపాటి బియ్యంతో చేసిన అన్నాన్ని తినలేక అధికశాతం పిల్లలు సగం తిని పారేస్తున్నారు. ఆహారం సహించలేని పిల్లలకు కడుపునొప్పితో ఇబ్బంది పడుతున్నారు. దీంతో అధికశాతం పాఠశాలల్లో 60 శాతం కూడా భోజనం చేయడం లేదు. అయినా పాఠశాలల్లో దాదాపు 90 శాతం పిల్లలు భోజనం చేశారని నిధులు డ్రా చేస్తున్నారు. ఈ పథకాన్ని ఎంఈవోలు తనిఖీ చేసి జిల్లా అధికారులకు నివేదిక పంపాల్సి ఉన్నా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. తనిఖీలకు వెళ్లినా ఏజెన్సీలు ప్రజాప్రతినిదులచే ఒత్తిడి చేయించి వారి నోరు మూయిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ప్రభుత్వం మారడంతో ప్రస్తుత ఏజెన్సీలను రద్దు చేసి, టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టాలని ప్రజాప్రతినిదుల నుంచి అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది. నత్తనడక వంటగదుల నిర్మాణం మధ్యాహ్న భోజన పథకంలో ప్రధాన సమస్య అయిన వంటగదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. ఈ పథకం కింద 2011-12లో మొదటి ఫేస్‌లో 2308 మంజూరు కాగా.. అందులో 1,732 నిర్మాణం చేయాలని నిర్ణయించారు. వీటిలో 356 మాత్రమే పూర్తి కాగా.. 895 వివిధ దశల్లో ఉన్నాయి. ఒక్కో వంట గదిని 132 చదరపు మీటర్లలో రూ.75 వేలతో నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 21 శాతం నిధులు రూ.3.63కోట్లు విడుదల చేశారు. ఒక్క గది నిర్మాణానికి రూ.75 వేలు చాలా తక్కువని, ఈ మొత్తంతో నిర్మించలేమని పంచాయతీరాజ్ శాఖ తేల్చి చెప్పేసింది. దీంతో ప్రభుత్వం హౌసింగ్ విభాగానికి ఈ పనులను అప్పజెప్పింది. రాజకీయ జోక్యం, ఎన్నికల కోడ్ తదితర కారణాలతో వంట గదుల నిర్మాణం నత్తనడకన సాగుతోంది. 2012-13లో సెకండ్ ఫేస్ కింద 1572 వంట గదులు మంజూరు కాగా వాటికి రూ.9.62 కోట్లు విడుదలయ్యాయి. ఒక్కోదానిని 301.4 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ.1.50 లక్షలతో నిర్మించాలని నిర్ణయించారు. ఈ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి దాకా డిజైన్ రాకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. -
ప్రభుత్వం మొద్దు నిద్ర
కవాడిగూడ, న్యూస్‌లైన్: ప్రభుత్వం హామీ ఇచ్చి 10 నెలలు గడుస్తున్నా నేటికీ మధ్యాహ్న భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించలేదని ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. రమ ధ్వజమెత్తారు. హత్యలు, అత్యాచారాలు చేసి జైల్లో ఉన్న ఖైదీలకు రోజుకి రూ. 30 నుంచి రూ. 40 వెచ్చిస్తున్న ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి కేవలం రూ. 4.25 లే కేటాయించడం ఏమి సబబన్నారు. ఎమ్మెల్యే, మంత్రులకు కార్లు, తిరగడానికి పెట్రోల్ వంటి సదుపాయాలను ఉచితంగా పొందుతున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల 829 పాఠశాలలో 67 శాతం పాఠశాలలో వంట గదులు లేవు, 22 శాతం నీటి వసతి లేదు, 84 శాతం గ్యాస్ కనెక్షన్ లేదని స్వయంగా కాగ్ నివేదిక వెల్లడించినా ఘనత వహించిన నాయకులకు పట్టడం లేదని విమర్శించారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రమాద బీమా, పెండింగ్ బిల్లుల తక్షణ చెల్లింపు తదితర తమ ప్రధాన డిమాండ్లన్నింటిని ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చలో సెక్రటేరియట్‌కు వేల మంది మధ్యాహ్న భోజన కార్మికులు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబా, ఉపాధ్యక్షులు పుణ్యవతి, కార్యదర్శులు పాలడగు భాస్కర్, వంగూరు రాములు, ఏపీ నాగేశ్వర రావులు హాజరై మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు మద్దతు తెలిపారు. -
అధ్వాన భోజనం
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: అధికారుల మధ్య సమన్వయ లోపంతో జిల్లాలోని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అధ్వానంగా తయారైంది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ పథకం అమలుకు పూనుకున్న ప్రభుత్వం ఆచరణలో అలవిమాలిన అలసత్వం ప్రదర్శిస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ‘న్యూస్‌లైన్’ బృందం శుక్రవారం పరిశీలించింది. సకాలంలో బియ్యం అందించడంలో అధికారులు విఫలమవుతుండటంతో పథకం అమలులో అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో ఏటా రూ. 40 కోట్ల వ్యయంతో అమలు చేస్తున్న ఈ పథకంపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 3591 పాఠశాలల్లో అమలు జిల్లాలో మొత్తం 3591 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. మొత్తం 3,29,000 మంది విద్యార్థుల్లో 2,62,000 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు. 2790 ప్రాథమిక పాఠశాలల్లో, 1,99,000 మందికిగాను, 1,68,000 మంది 416 ప్రాథమికోన్నత పాఠశాలల్లో, 81,000 మందికి గాను 62,000 మంది 385 ఉన్నత పాఠశాలల్లో 40,000 మందికి 32,000 మంది మధ్యాహ్న భోజనం తీసుకుంటున్నారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోజుకు 100 గ్రాముల బియ్యం, ప్రాథమికోన్నతస్థాయి విద్యార్థులకు 6 నుంచి 10 తరగతుల వరకు 150గ్రాములు ఇస్తారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి రూ.4.65, ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.6 ఇస్తారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి నెలకు 4 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తం 10 నెలలకు 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఈ రూ.40 కోట్లు ఖజానా కార్యాలయానికి విడుదల చేస్తారు. బిల్లుల చెల్లింపునకు సంబంధించి ఎటువంటి సమస్యలు లేవు. ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయి 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు సంబంధించి బిల్లులను డిసెంబర్ వరకు చెల్లించారు. 9,10 తరగతుల విద్యార్థులకు కుక్ కం హెల్పర్లకు నవంబర్ వరకు చెల్లింపులు జరిగాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే మిగిలిన చెల్లింపులు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. మెనూ ఊసేదీ... మధ్యాహ్న భోజన పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన మెనూకు, పాఠశాలల్లో అమలు చేస్తున్న మెనూకు అసలు సంబంధమే లేదు. వారంలో రెండు రోజులు గుడ్లు ఇవ్వాల్సి ఉండగా అతి కొద్ది పాఠశాలల్లోనే రెండు గుడ్లు ఇస్తున్నారు. మెజారిటీ పాఠశాలల్లో వారంలో కేవలం ఒక గుడ్డు మాత్రమే ఇస్తున్నారు. పిల్లల మధ్యాహ్న భోజన పథకానికి ప్రభుత్వం దండిగానే నిధులు విడుదల చేస్తున్నా విద్యార్థులకు మాత్రం పౌష్టికాహారం అందడం లేదు. మెనూ ఎంత ఘనంగా ఉన్నా పిల్లలకు మాత్రం నీళ్లచారు, రుచీపచీ లేని కూరలే దిక్కయ్యాయి. వారానికి రెండు గుడ్లు పెట్టకపోయినా కుకింగ్ ఏజన్సీలను కొందరు హెచ్ఎంలు అదేమంటున్న దాఖలాల్లేవు. ప్రధానంగా తనిఖీ అధికారుల పర్యవేక్షణ లోపం, పథకం అమలుకు శాపంగా మారింది. పూర్తి కాని కుకింగ్ షెడ్లు: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు కుకింగ్ షెడ్లు మంజూరు చేసినా నిర్మాణానికి నోచుకోలేదు. మూడేళ్ల క్రితం మంజూరైన కుకింగ్ షెడ్లు నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. 4 జిల్లాలో మొత్తం 2388 పాఠశాలలకు ప్రభుత్వం కుకింగ్ షెడ్లు మంజూరు చేసింది. అయితే వీటిలో 501 షెడ్ల నిర్మాణానికి మాత్రమే నిధులు విడుదల చేసింది. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.75 వేల చొప్పున మొత్తం రూ. 3.75 కోట్లు విడుదల చేశారు. 4నిధులు మంజూరైన వాటిలో ఇప్పటి వరకు 299 కుకింగ్ షెడ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. 55 ఇప్పటి వరకు అసలు ప్రారంభం కాలేదు. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. 4 పాఠశాలల్లో కుకింగ్ షెడ్లు లేకపోవడంతో ఆరుబయటే విద్యార్థులకు వండి పెడుతున్నారు. పరిశుభ్రమైన ప్రదేశాల్లో, ఆహారం వండాలని ఆదేశిస్తున్న ప్రభుత్వం కుకింగ్ షెడ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేయకపోవడం గమనార్హం. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న పాఠశాలల్లో కేవలం పది శాతం లోపు పాఠశాలలకు మాత్రమే కుకింగ్ షెడ్లున్నాయి. నాసిరకం బియ్యం... పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలుకు ప్రభుత్వం నాసిరకం బియ్యం సరఫరా చేస్తుండటంతో పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు. జిల్లాలో అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం అమలుకు ప్రతినెలా 720 టన్నుల బియ్యం అవసరం. పాఠశాలలకు ‘పెయిర్ యావరేజ్ క్వాలిటీ’ బియ్యం సరఫరా చేయనున్న మండలాల స్థాయి స్టాకు పాయింట్ల నుంచి పాఠశాలలకు నాసిరకం బియ్యం సరఫరా అవుతున్నాయి. మంచి నాణ్యమైన బియ్యానికి విద్యాశాఖ టన్నుకు రూ.5650, ఒక శాతం పన్ను కూడా చెల్లిస్తున్నారు. బియ్యం రవాణాకు టన్నుకు రూ. 750 ఇస్తున్నారు. పాఠశాలలకు సరఫరా చేసే బియ్యం బస్తాలకు ప్రత్యేకంగా ట్యాగ్లు వేసి సరఫరా చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించినా పౌరసరఫరాల శాఖ అధికారులు ఆ పని చేయకపోవడంతో పాఠశాలలకు నాసిరకం బియ్యమే సరఫరా అవుతున్నాయి. దీంతో అన్నం ముద్దగా తయారవుతుండటంతో పిల్లలు పాఠశాలల్లో భోజనం చేసేందుకు ఇష్టపడటం లేదు. మధ్యాహ్న భోజన పథకం అమలుపై అధికారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకొని పిల్లలకు మంచి నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
‘పశ్చిమ’ విద్యార్థులకు పస్తే!
మార్కాపురం, న్యూస్‌లైన్ : పశ్చిమ ప్రకాశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి ముప్పు వాటిల్లింది. సమైక్యాంధ్ర సమ్మె కాలంలో ఎంఈఓలు బియ్యం ఇండెంట్లు సకాలంలో సమర్పించకపోవడమే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. పౌరసరఫరాల శాఖ బియ్యం సరఫరా నిలిపివేయటంతో ఇక రెండు మూడు రోజుల తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టలేమని కుకింగ్ ఏజెన్సీ నిర్వాహకులు చేతులెత్తేశారు. మార్కాపురం డివిజన్లోని 12 మండలాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే మార్కాపురం మండలంలో 40 పాఠశాలలు ఉండగా సుమారు 15 పాఠశాలలకు 10 రోజుల నుంచి బియ్యం సరఫరా నిలిచిపోయింది. వేములకోట, చింతగుంట్ల, రాయవరం తదితర పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు బియ్యాన్ని బయట కొనుగోలు చేసి విద్యార్థులకు వండిపెడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పథకాన్ని నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. మార్కాపురం డివిజన్లో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 6, జెడ్పీ ఉన్నత పాఠశాలలు 66, ఎయిడెడ్ పాఠశాలలు 17 ఉన్నాయి. సుమారు 10 వేల మంది విద్యార్థులు డివిజన్లోని వివిధ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. బేస్తవారిపేట, తర్లుపాడు, పెద్దారవీడు, రాచర్ల, మార్కాపురం, కంభం, మరికొన్ని మండలాల్లోని వివిధ పాఠశాలల్లో ఈ పరిస్థితి ఉండటంతో పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. కొన్ని ఏజెన్సీలు అంగన్వాడీ కేంద్రాల నుంచి బియ్యాన్ని అప్పు తీసుకుని వండి పెడుతున్నాయి. పాఠశాలల్లో డ్రాఫ్ అవుట్స్‌ను నిరోధించేందుకు ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి నెలా ఎంఈఓలు ఇచ్చే నివేదిక ఆధారంగా జిల్లా కేంద్రం నుంచి పాఠశాలలకు బియ్యం సరఫరా చేసేవారు. సమైక్యాంధ్ర సమ్మె సమయంలో ఏర్పడిన జాప్యం ప్రస్తుత పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం: రామ్మోహన్రావు, ఉప విద్యాశాఖాధికారి మార్కాపురం డివిజన్లోని 12 మండలాల పాఠశాలల్లో బియ్యం నిల్వలు అయిపోయి ఇబ్బందికర పరిస్థితులు ఉన్న మాట వాస్తవమే. కలెక్టర్, డీఈఓల దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. సాధ్యమైనంత త్వరలో బియ్యం సరఫరా చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. -
మధ్యాహ్న భోజన చెల్లింపులన్నీ ఆన్లైన్
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బడ్జెట్ కంటిజెన్సీ నిధులు వివరాలన్నీ మండల విద్యాధికారులకు ఆన్లైన్ ద్వారా తెలియజేస్తామని డీఈఓ ఏ రాజేశ్వరరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో నిర్వహించిన ఎంఈఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖజానా కార్యాలయాలకు పంపించిన బడ్జెట్ కేటాయింపు కాపీలను ఎంఈఓలకు మెయిల్లో చేస్తామన్నారు. వీటిని పరిశీలించుకొని తమకు కేటాయించిన బడ్జెట్ మేరకు బిల్లులు పెట్టుకోవాలని ఎంఈఓలకు సూచించారు. మధ్యాహ్న భోజన పథకం వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఎంఈఓలు తప్పనిసరిగా మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించాలని ఆదేశించారు. పాఠశాలల సందర్శన నివేదికలను ప్రతి బుధవారం ఆన్లైన్లో నమోదు చేసి సమర్పించాలని సూచించారు. బడిబయటి పిల్లలందరినీ (ఓఎన్సిసీ) పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 14 ఏళ్లు దాటిన వారిని ఓపెన్ స్కూలు సొసైటీలో చేర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు ప్రభుత్వరంగ పాఠశాలల్లో ఐదు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ఎస్సీ బాల, బాలికలందరికీ ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు సరస్వతి తెలిపారు. గతంలో 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనాలు మంజూరు చేసేవారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న ఎస్సీ బాల, బాలికలకూ వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. బాలురకు నెలకు రూ.100, బాలికలకు నెలకు రూ.150 ఉపకార వేతనంగా చెల్లిస్తామన్నారు. ఉపకార వేతనాల కోసం విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా నంబర్‌ను మీ సేవా కేంద్రంలో నమోదు చేయించుకోవాలని సూచించారు. 9, 10 తరగతుల విద్యార్థులు ఆధార్ నంబర్‌నూ నమోదు చేయించుకోవాలన్నారు. వీరికి రెగ్యులర్ స్కాలర్‌షిప్‌ల మొత్తాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థులు జీరో బ్యాలెన్సుతో బ్యాంకులో ఖాతాలు ప్రారంభించుకోవచ్చని తెలిపారు. సీజనల్ హాస్టళ్లకు ప్రతిపాదనలు తల్లిదండ్రులెవరైనా పనుల కోసం వలస వెళితే వారి పిల్లల కోసం సీజనల్ హాస్టళ్లను ప్రారంభించనున్నట్లు రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కే రామశేషు తెలిపారు. 25 నుంచి 50 మంది వరకు పిల్లలుంటే అక్కడ సీజనల్ హాస్టల్ ప్రారంభించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను కోరారు. దొనకొండ, పెదచెర్లోపల్లి మండలాల్లోని పాఠశాలల విద్యార్థులకు వెంటనే యూనిఫాం పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల్లేని పాఠశాలలకు గతేడాది విడుదలైన నిధులను వెంటనే ఆర్వీఎం ఖాతాకు జమ చేయాలని ఆర్వీఎం ఎఫ్ఎఓ యెహోషువా సూచించారు. అన్ని పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభించాలని ఆ విభాగం ఇన్చార్జి సీహెచ్ వాసంతి కోరారు. ఆరు లక్షల మంది నిరక్షరాస్యులు జిల్లాలో ఇప్పటికీ ఆరు లక్షల మంది నిరక్షరాస్యులున్నట్లు వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు సీ వీరభద్రరావు తెలిపారు. వీరిలో అధికంగా మహిళలే ఉన్నారన్నారు. వీరందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని డీఆర్డీఏ, డ్వామాలు స్వీకరించాని కోరారు. జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. నిధులెప్పుడిస్తారు ? రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం నుంచి మండల విద్యాధికారులకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంపై ఎంఈఓలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలకు రూ.1400 విడుదల చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు. ఇంత వరకు ఆ నిధులు విడుదల చేయలేదు. విద్యా పక్షోత్సవాలకు వినియోగించిన వాహనాలకు చెల్లించాల్సిన రూ.25 వేలు ఇప్పటికీ రాలేదు. మండలాల్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలకు నిధులు పూర్తిగా చెల్లించ లేదని పలువురు ఎంఈఓలు తెలిపారు. సమావేశంలో ఉపవిద్యాధికారులు బీ విజయభాస్కర్, వీ రామ్మోహనరావు, కే వెంకట్రావు, షేక్ చాంద్‌బేగం, అసిస్టెంట్ డెరైక్టర్లు డీవీ రామరాజు, రాజీవ్ విద్యామిషన్ సెక్టోరల్ అధికారులు ఎన్ అంజిరెడ్డి, జాన్‌వెస్లీ, ఎంఈఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు. -
అఖిలేష్ యాదవ్ కు మేనకాగాంధీ లేఖ
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాహ్నం భోజనం పథకం కింద పాఠశాల చిన్నారులకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను బీజేపీ సీనియర్ నాయకురాలు మేనకా గాంధీ కోరారు. ఈ మేరకు ఆమె సీఎంకు లేఖ రాశారని ఆయన కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. చిన్నారులకు వడ్డిస్తున్న భోజనంలో పురుగులు, బల్లులు వస్తున్నాయని ఆమె ఆరోపించారు. యూపీలోని తన నియోజకవర్గమైన అనొలలో పర్యటనలో భాగంగా ఆ విషయాన్ని గుర్తించినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆహార పదార్థాలను తయారు చేసేటప్పుడు కూడా ఆ పరిసరాలు తగు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అయితే గత నెలరోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పాఠశాల చిన్నారులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారని, కానీ కొన్ని ప్రదేశాల్లో ఆ భోజనంలో క్రిమికీటకాలు ఉంటున్నాయని తెలిపారు. గతనెల్లో బీహార్ రాష్ట్రంలో శరన్ జిల్లాలోని చాప్రా డివిజన్లో గందమయిలోని పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసి 23 మంది మరణించిన సంగతిని మేనకా గాంధీ రాసిన లేఖలో ప్రస్తావించారు. అయితే మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఇప్పటికే అఖిలేష్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ రాయబరేలి జిల్లాలోని రైయిన్ గ్రామంలో ఆకస్మిక పర్యటన నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక పాఠశాలను ఆయన సందర్శించారు. భోజనంలో ఆహారం సరిగా ఉండటం లేదని పాఠశాల విద్యార్థులు అఖిలేష్‌కు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయన ఉన్నతాధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. స్థానిక విద్యాశాఖ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు.