Nasscom
-
టెక్ @300 బిలియన్ డాలర్లు
ముంబై: దేశీ టెక్నాలజీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతం వృద్ధితో సుమారు 283 బిలియన్ డాలర్లకు చేరనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇది 300 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు నెలకొన్నాయి. దేశీయ ఐటీ సేవలు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ కంపెనీలు మొదలైన సంస్థల సమాఖ్య నాస్కామ్ ఈ విషయాలు వెల్లడించింది. ఆదాయ వృద్ధి సరైన దిశలోనే ఉందని నాస్కామ్ ప్రెసిడెంట్ రాజేశ్ నంబియార్ తెలిపారు. పరిశ్రమ 2023–24లో 4 శాతంగా, 2024–25లో 5.1 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.1 శాతంగాను వృద్ధి చెందగలదని చెప్పారు. చుట్టూరా భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా టారిఫ్‌ల వడ్డన వంటి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ పరిశ్రమ మెరుగ్గా రాణిస్తోందని వివరించారు. 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 1.26 లక్షల ఉద్యోగాల కల్పనతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 58 లక్షలకు చేరిందని, తదుపరి ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే స్థాయిలో నియామకాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నామని నంబియార్ వివరించారు. ఐటీ ఆదాయం 4.3 శాతం అప్.. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలను విభాగాలవారీగా చూస్తే ఐటీ సేవల కంపెనీల ఆదాయాలు 4.3 శాతం వృద్ధితో 137.1 బిలియన్ డాలర్లకు, బీపీఎం పరిశ్రమ 4.7 శాతం వృద్ధితో 55.6 బిలియన్ డాలర్లకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇక ఇంజినీరింగ్ రీసెర్చ్, డెవలప్మెంట్ రంగం అత్యంత వేగంగా 7 శాతం స్థాయిలో పెరిగి 55.6 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అనూహ్యంగా అమెరికా.. దేశీ ఐటీ రంగానికి అమెరికాలో పరిస్థితులు అనూహ్యంగా ఉండొచ్చని నంబియార్ చెప్పారు. భారత ఐటీ పరిశ్రమ ఆదాయాల్లో అమెరికా వాటా 60–62 శాతం ఉంటుంది కాబట్టి, టారిఫ్‌ల బెదిరింపులనేవి పరిశ్రమకు అతి పెద్ద ముప్పని ఆయన పేర్కొన్నారు. నాస్కామ్ వార్షిక ఎన్టీఎల్ఎఫ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా నంబియార్ ఈ విషయాలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ల గురించి భారతీయ ఐటీ రంగం ఆందోళన చెందనక్కర్లేదని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ చెప్పారు. ఒకవేళ ట్రంప్ ప్రభుత్వం తీసుకునే చర్యలతో అమెరికన్ కంపెనీలు లాభపడితే, క్లయింట్లు బలోపేతం కావడం వల్ల భారతీయ ఐటీ కంపెనీలకు కూడా లబ్ధి చేకూరుతుందని వివరించారు. అమెరికాలోని సిబ్బంది సంఖ్యలో స్థానిక ఉద్యోగుల సంఖ్యను 60 శాతానికి పెంచుకోవడంలాంటి చర్యలతో గత కొన్నాళ్లుగా అమెరికాలో వ్యాపారాన్ని బలోపేతం చేసుకున్న నేపథ్యంలో హెచ్–1బీ వీసాలపై ఆధారపడే పరిస్థితి తగ్గిందని పరేఖ్ తెలిపారు. -
2047 నాటికి రూ.3,000 లక్షల కోట్ల ఆదాయం!
సేవల రంగం తోడ్పాటుతో భారత్ 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా అవతరిస్తుందని ఒక నివేదిక అంచనా వేసింది. అప్పటికి జీడీపీ 23–35 ట్రిలియన్ డాలర్లకు (రూ.1,978–3,010 లక్షల కోట్లు) చేరుకుంటుందని తెలిపింది. దేశ జీడీపీలో సేవల రంగం వాటా 60 శాతంగా, తయారీ రంగం వాటా 32 శాతం మేర ఉంటుందని పేర్కొంది. ఈ నివేదికను బెయిన్ అండ్ కంపెనీ, నాస్కామ్ సంయుక్తంగా రూపొందించాయి.‘రానున్న దశాబ్దాల్లో 20 కోట్ల మంది శ్రామికశక్తి అందుబాటులోకి వస్తారు. అధిక విలువ ఉద్యోగాలను కల్పించే వినూత్నమైన అవకాశం భారత్ ముందుంది. తద్వారా గణనీయమైన ఆర్థిక సామర్థ్యాలను వెలికితీయగలదు. ఇందుకు రంగాలవారీ టెక్నాలజీపరమైన కార్యాచరణ అవసరం. ఏఐ ఆధారిత చిప్ డిజైన్, విడిభాగాల తయారీకి కావాల్సిన ముడి సరుకుల సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడం వంటి చర్యలు పోటీతత్వాన్ని, ఆవిష్కరణలను పెంచుతాయి. దీనివల్ల ఎగుమతుల్లో తయారీ వాటా 24 శాతం నుంచి 2047 నాటికి 45–50 శాతానికి చేరుకుంటుంది’ అని ఈ నివేదిక వివరించింది. అలాగే ఆటో విడిభాగాల ఎగుమతులు 200–250 బిలియన్ డాలర్లు చేరుకోవచ్చని అంచనా వేసింది. ఇదీ చదవండి: ఈ–కామర్స్ దూకుడుఐదు కీలక రంగాలు..అంతర్జాతీయంగా నెలకొన్న ధోరణులు, విస్తృతమైన అవకాశాల దృష్ట్యా.. ఎలక్ట్రానిక్స్, ఇంధనం, కెమికల్స్, ఆటోమోటివ్, సేవలు భారత్‌కు వృద్ధి చోదకాలుగా పనిచేస్తాయని ఈ నివేదిక తెలిపింది. పెరిగే ఆదాయం, నైపుణ్య కార్మికులు, మౌలిక వసతుల కల్పన ఈ వృద్ధికి నడిపిస్తాయని పేర్కొంది. -
అమెరికా వృద్ధిలో కీలకంగా భారతీయులు
న్యూఢిల్లీ: హెచ్–1బీ వీసా వర్కర్లంటే అమెరికా ఉద్యోగుల స్థానాన్ని ఆక్రమించే చౌక కార్మికులని, అక్కడి వేతనాల స్థాయిని కుదించేస్తారనేది అపోహ మాత్రమేనని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ వ్యాఖ్యానించారు. అమెరికా ఎకానమీ వృద్ధిలో భారతదేశం, భారతీయ నిపుణులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ వృద్ధిపై నిస్పృహకు లోను కావాల్సిన అవసరమేమీ లేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ విధానాలపైన, 250 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమ మీద వాటి ప్రభావాలపైన అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమెరికాలో పరిణామాలేమీ భారత ఐటీ పరిశ్రమ అవకాశాలపై ప్రతికూల ప్రభావం చూపబోవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్–1బీ వీసాలనేవి నాన్–ఇమిగ్రెంట్ వీసాలే కావడం వల్ల వివాదాస్పద వలసల సమస్యకు, వాటికి సంబంధమేమీ లేదని పేర్కొన్నారు. హెచ్–1బీ వీసాల్లో 70 శాతం వీసాలు భారతీయులకే లభిస్తుండటమనేది మన నైపుణ్యాలకు నెలకొన్న డిమాండ్‌కి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం వృద్ధి సాధనపై దృష్టి పెట్టడమనేది ఇరు దేశాలు కలిసి పని చేసేందుకు మరింతగా అవకాశాలను కల్పించగలదని సింగ్ చెప్పారు. భారతీయ కంపెనీలు అమెరికాలో అక్కడివారికి నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు 1.1 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేశాయని సింగ్ చెప్పారు. -
ఏఐ ప్రభావం.. వచ్చే ఏడాది జరిగేది ఇదే..
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలకుతోడు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావంతో 2025లో టెక్నాలజీ అమలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలకు ప్రాధాన్యం పెరుగుతుందని నాస్కామ్ చైర్పర్సన్ సింధు గంగాధరన్ అభిప్రాయపడ్డారు. ఏఐతో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు ఉంటాయన్న అంశంపై స్పందిస్తూ.. నైపుణ్యాల పెంపు, ఉత్పాదకత పెంపొందించడంలో ఏఐని సహాయకారిగా చూడాలన్నారు.దీన్ని అసాధారణ సాంకేతికతగా అభివర్ణించారు. దీనివల్ల ఉద్యోగాల నష్టం తక్కువేనంటూ.. ఉత్పాదకతను గణనీయంగా పెంచుతుందని, ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని పేర్కొన్నారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొనసాగాలంటే వ్యాపార సంస్థలు అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సి ఉంటుందని ఆమె చెప్పారు. ఇందుకు సంస్థ పరిమాణంతో సంబంధం లేదన్నారు.టెక్నాలజీ పరంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో బలమైన భాగస్వామ్యాలతోనే పెద్ద సవాళ్లను అధిగమించి, రాణించగలమన్నారు. లాంగ్వేజ్ నమూనాలను అర్థం చేసుకుని, వాటిని ఏ విధంగా వినియోగించుకోగలమో చూడాలని సూచించారు. భారత్‌లో ఏఐ మిషన్, నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.ఇదీ చదవండి: ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా చీఫ్‌గానూ పనిచేస్తున్న గంగాధరన్ ఏటా 2,500–3,000 మేర ఉద్యోగులను పెంచుకుంటున్నట్టు చెప్పారు. బెంగళూరు, గురుగ్రామ్, పుణె, ముంబై, హైదరాబాద్‌లో ఎస్ఏపీకి కేంద్రాలున్నాయి. ఇక్కడ అత్యుత్తమ నైపుణ్యాలను గుర్తించడం తమకు కీలకమన్నారు. ఎస్ఏపీకి భారత్ అత్యంత వేగవంతమైన వృద్ధి కేంద్రంగా ఉందని సంస్థ సీఈవో క్రిస్టియన్ క్లీన్ తెలిపారు. భవిష్యత్‌లో అతిపెద్ద కేంద్రాల్లో ఒకటిగా అవతరిస్తుందన్నారు. ప్రస్తుతం ఎస్ఏపీకి టాప్–10 దేశాల్లో ఒకటిగా ఉన్నట్టు చెప్పారు. -
ఏఐలో భారత్‌దే హవా!.. నాస్కామ్ చైర్పర్సన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ బాగా అభివృద్ధి చెందుతోంది. దాదాపు ప్రతి రంగంలోనూ ఏఐను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ తరుణంలో నాస్కామ్ కొత్త చైర్పర్సన్ 'సింధు గంగాధరన్' ఏఐ గురించి ప్రస్తావిస్తూ.. భారత్ ఈ రంగంలో అగ్రగామిగా మారుతుందని అన్నారు.ఇప్పటికే అనేక ఐటీ కంపెనీలు ఏఐను ఉపయోగించుకుని వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అయితే సంస్థలో పనిచేసే సిబ్బంది మానసిక, భౌతిక పరిస్థితి మెరుగ్గా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కంపెనీలకు ఉందని సింధు గంగాధరన్ పేర్కొన్నారు. ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగుల మీద ఒత్తిడి పెరుగుతోందన్న ప్రచారాన్ని తగ్గించాలి, కాబట్టి ఉద్యోగిపై కూడా కొంత శ్రద్ద వహించాలని అన్నారు.ఇటీవల ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలో ఒక యువ ఉద్యోగి మరణించిన నేపథ్యంలో గంగాధరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో కార్పొరేట్ ఇండియాలో పని ప్రదేశాలలో అధిక ఒత్తిడి గురించి చర్చ మొదలైంది. ఏఐ నైపుణ్యం భారత్ తన ప్రతిభను నిరూపించుకుంటుందని చెబుతూ.. రాబోయే రోజుల్లో ఇండియా 'జీసీసీ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్'గా నిలుస్తుందని సింధు గంగాధరన్ అన్నారు.ఇదీ చదవండి: రేపటి నుంచే కొత్త రూల్స్.. ఇవన్నీ మారుతాయిఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయాల గురించి మాట్లాడుతూ.. టెక్నాలజీ ఉత్పాదకతలో లాభాలను, కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుందని అన్నారు. అయితే ఉద్యోగులు మరింత క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలి. అప్పుడు టెక్నాలజీ మిమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. -
నాస్కామ్ ప్రెసిడెంట్‌గా రాజేశ్ నంబియార్
న్యూఢిల్లీ: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్, సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) నూతన ప్రెసిడెంట్‌గా కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ రాజేశ్ నంబియార్ నియమితులయ్యారు. దేబ్జానీ ఘోష్ పదవీకాలం పూర్తయిన తర్వాత నవంబర్ 2024లో నాస్కామ్ ప్రెసిడెంట్‌గా నంబియార్ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడైన ఆయన 2023లో నాస్కామ్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. టీసీఎస్, ఐబీఎం, సియెనా వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. కాగా, రాజేశ్ నంబియార్ కాగ్నిజెంట్ సీఎండీ పదవికి రాజీనామా చేశారు. గ్లోబల్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్, ఇండియా సీఎండీగా రాజేశ్ వారియర్‌ను ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ నియమించుకుంది.సెప్టెంబర్ 2 నుంచి గ్లోబల్ హెడ్‌గా, అక్టోబర్ 1 నుంచి సీఎండీగా బాధ్యతలు అందుకుంటారు. కాగ్నిజెంట్‌లో చేరక ముందు హెడ్ ఆఫ్ గ్లోబల్ సర్వీసెస్, ఇన్ఫోసిస్ అమెరికాస్ ఈవీపీగా వారియర్ పనిచేశారు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్, యాక్టివ్క్యూబ్స్ వంటి సంస్థల్లోనూ ఉద్యోగం చేశారు. -
పన్నుల విషయంలో అనిశ్చితి
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌కు రూ. 32,400 కోట్ల జీఎస్టీ ఎగవేత నోటీసులివ్వడంపై ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ స్పందించింది. ఐటీ పరిశ్రమ నిర్వహణ విధానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదనడానికి తాజా పన్ను నోటీసుల ఉదంతమే నిదర్శనమని పేర్కొంది. పలు కంపెనీలు ఇలాంటి అనవసరమైన లిటిగేషన్లను, పన్నుల విషయంలో అనిశి్చతిని ఎదుర్కొంటున్నాయని కూడా తెలిపింది. ‘పరిశ్రమ వ్యాప్తంగా ఇలాంటి సమస్య నెలకొంది. జీఎస్టీ కౌన్సిల్లో తీసుక్ను నిర్ణయాలు, సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేస్తుంది. చట్టాలను అమలు చేసే యంత్రాంగాలు వీటిని పాటించాలి. దీనివల్ల నోటీసులతో అనిశి్చతికి దారితీయదు, అలాగే భారత్‌లో వ్యాపార సానుకూలతపై ప్రభావం చూపకుండా ఉంటుంది’ అని నాస్కామ్ పేర్కొంది. రివర్స్ చార్జ్ మెకానిజం (ఆర్సీఎం) ద్వారా జీఎస్టీని వర్తింపజేయడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోందని అభిప్రాయపడింది. ‘భారత ఐటీ కంపెనీల ప్రధాన కార్యాలయాలు తమ విదేశీ శాఖలకు పంపే నిధులపై జీఎస్టీ అధికారులు పన్ను ఎగవేత నోటీసులు ఇస్తున్నారు. ఈ ఆర్సీఎం విషయంలో హెడ్ ఆఫీసు, విదేశీ బ్రాంచ్ మధ్య ఎలాంటి సేవల లావాదేవీలు జరగలేదు. ఇది బ్రాంచ్ నుంచి హెడ్ ఆఫీసు సేవలను పొందడం కిందికి రాదనే విషయాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. ఇదేమీ కొత్త సమస్య కాదు. ఇప్పటికే పలు కేసుల్లో కోర్టులు ఐటీ పరిశ్రమకు అనుకూలంగా తీర్పులిచ్చాయి. ఓ పెద్ద ఐటీ కంపెనీకి ఇలాంటి కేసులోనే జారీ చేసిన జీఎస్టీ నోటీసుపై కర్నాటక హైకోర్టు స్టే ఇచ్చింది’ అని నాస్కామ్ వివరించింది. దీనికి సంబంధించి స్పష్టతనిచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులివ్వాలని విజ్ఞప్తి చేసింది. -
చిప్ తయారీకి విధానాలు ముఖ్యం
ముంబై: దేశీయంగా చిప్ తయారీ వ్యవస్థ విజయవంతమయ్యేందుకు విధానాలలో స్పష్టత, నిలకడ అవసరమని మనీష్ భాటియా పేర్కొన్నారు. అత్యధిక పెట్టుబడుల ఆవశ్యకత కలిగిన పరిశ్రమకావడంతో ఈ రెండింటికీ ప్రాధాన్యత ఉన్నట్లు యూఎస్ చిప్ తయారీ దిగ్గజం మైక్రాన్ టెక్నాలజీ గ్లోబల్ కార్యకలాపాల ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ మనీష్ తెలియజేశారు. మైక్రాన్ టెక్నాలజీస్ దేశీయంగా గుజరాత్‌లోని సణంద్‌లో 2.75 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో సెమీకండక్టర్ అసెంబ్లీ, ప్యాకేజింగ్ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. ఐటీ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక సదస్సులో భాటియా ప్రసంగించారు. చిప్ తయారీ వ్యవస్థ వేళ్లూనుకునేందుకు దేశీయంగా ఎన్ని సౌకర్యాలను కలి్పంచినప్పటికీ విధానాలలో స్పష్టత, నిలకడ కీలకపాత్ర పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. చిప్ తయారీలో విస్తారిత వ్యవస్థకు ఇవి దోహదం చేస్తాయని తెలియజేశారు. భారత్‌కు అవకాశాలు ఇతర అభివృద్ధి చెందుతున్న పలు దేశాలతో పోలిస్తే భారత్‌కు పలు ప్రయోజనాలున్నాయని, దీంతో తయారీ రంగంలో భారీ పెట్టుబడులకు అవకాశమున్నదని మనీష్ భాటియా వివరించారు. వెరసి మైక్రాన్ వంటి మరిన్ని దిగ్గజాలను ఆకట్టుకోవాలంటే రానున్న ఐదేళ్లకుకాకుండా 25 ఏళ్లకుమించి విధానాలకు తెరతీయవలసి ఉన్నట్లు ప్రస్తావించారు. సణంద్‌లో ప్లాంటు ఏర్పాటుకు గతేడాది సెపె్టంబర్లో మైక్రాన్ తెరతీయగా.. 2024 డిసెంబర్‌కల్లా ప్రారంభంకాగలదని అంచనా. 2025 ప్రారంభంలో ప్లాంటు సిద్ధంకాగలదని భాటియా తాజాగా అభిప్రాయపడ్డారు. ఈ ప్లాంటుకు కేంద్ర నుంచి సవరించిన అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ పథ కంకింద అనుమతి లభించిన విషయం విదితమే. -
మూడేళ్లలో 17 బిలియన్ డాలర్లకు!
నాస్కామ్–బీసీజీ నివేదిక ముంబై: దేశీయంగా కృత్రిమ మేధ (ఏఐ) మార్కెట్ ఏటా 25–35% వృద్ధి చెందుతోంది. కంపెనీలు టెక్నాలజీపై మరింతగా ఖర్చు చేస్తుండటం, ఏఐ నిపుణులు.. ఏఐపై పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో 2027 నాటికి ఇది 17 బిలియన్ డాలర్లకు చేరనుంది. టెక్నాలజీ, లీడర్ షిప్ ఫోరం 2024 సందర్భంగా సంయుక్త నివేదికలో టెక్ సంస్థల సమాఖ్య నాస్కామ్, బీసీజీ ఈ మేరకు అంచనా వేశాయి. అంతర్జాతీయంగా ఏఐపై పెట్టుబడులు 2019 నుంచి ఏటా 24% వృద్ధి చెందాయి. 2023లో 83 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. ఎక్కువగా డేటా అనలిటిక్స్, జెన్ఏఐ, ఎంఎల్ అల్గోరిథమ్స్ ప్లాట్‌ఫామ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. వినూత్న సొల్యూషన్స్ .. టెక్నాలజీ సర్విస్ ప్రొవైడర్లు సాంప్రదాయ ఐటీ సర్వీసుల పరిధిని దాటి ఏఐ ఆధారిత వినూత్న సేవలు, సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఆటోమేషన్ టూల్స్, డేటా అనలిటిక్స్ సొల్యూషన్స్‌తో పాటు హెల్త్‌కేర్, బ్యాంకింగ్ .. ఫైనాన్స్, రిటైల్ వంటి నిర్దిష్ట రంగాల అవసరాలకు అనుగుణమైన ప్రొప్రైటరీ ఏఐ.. జనరేటివ్‌ఏఐ ప్లాట్‌ఫామ్స్ కూడా వీటిలో ఉన్నట్లు వివరించింది. ► ఇతర దేశాలతో పోలిస్తే దేశీయంగా ఏఐ నైపుణ్యాలున్న ప్రతిభావంతులు మూడు రెట్లు అధికంగా ఉన్నారు. గత ఏడేళ్లుగా చూస్తే ఏఐ నిపుణుల సంఖ్య 14 రెట్లు పెరిగింది. ఏఐ నిపుణుల విషయంలో టాప్ అయిదు దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. ► ఏఐలో పెట్టుబడులు పెరిగే కొద్దీ భారత్‌లో కృత్రిమ మేధ నిపుణుల సంఖ్య 2027 నాటికి వార్షికంగా 15 శాతం మేర వృద్ధి చెందనుంది. -
టెక్ పరిశ్రమ ఆదాయం 254 బిలియన్ డాలర్లకు!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీ టెక్నాలజీ పరిశ్రమ ఆదాయం 3.8 శాతం వృద్ధి చెంది 254 బిలియన్ డాలర్లకు చేరవచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ అంచనా వేసింది. టెక్ రంగం గత ఆర్థిక సంవత్సరంలో 244.6 బిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. ఈసారి హార్డ్‌వేర్‌ని మినహాయిస్తే ఆదాయం 3.3 శాతం పెరిగి 199 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని వార్షిక నివేదికలో నాస్కామ్ తెలిపింది. గతేడాది టెక్నాలజీపై కంపెనీలు చేసే వ్యయాలు 50 శాతం మేర, టెక్ కాంట్రాక్టులు 6 శాతం మేర తగ్గిపోయినప్పటికీ దేశీ పరిశ్రమ 3.8 శాతం (9.3 బిలియన్ డాలర్లు) వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొంది. అలాగే నికరంగా 60,000 ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించింది. ‘ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం పరిశ్రమ వృద్ధి చెందనుంది. ఆశ్చర్యకరంగా ఎగుమతులు కొంత తగ్గినప్పటికీ దేశీ మార్కెట్ గణనీయంగా పుంజుకుంది. దేశీయ మార్కెట్‌కి ఇది అత్యంత వేగవంతమైన వృద్ధి కావచ్చు‘ అని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వం, కంపెనీలు ఖర్చులు చేయడం వల్ల దేశీయంగా పరిశ్రమ ఆదాయ వృద్ధికి ఊతం లభిస్తోందని ఆమె వివరించారు. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలకు భారత్ అత్యంత ప్రాధాన్య హబ్‌గా కొనసాగుతోందని తెలిపారు. ఎగుమతుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో ఇంజినీరింగ్ రీసెర్చ్, డెవలప్మెంట్ (ఈఆర్డీ) విభాగం వాటా 48 శాతంగా ఉందని ఘోష్ చెప్పారు. ఈ రంగం అంచనాలకు మించిన పనితీరు కనపర్చవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. ఏఐ, క్లౌడ్‌లో ఉద్యోగాలు.. కృత్రిమ మేథ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతున్నాయంటూ వార్తలు వచ్చినప్పటికీ వాస్తవానికి ఉపాధి కల్పన పెరిగిందని ఘోష్ చెప్పారు. పరిశ్రమలో నికరంగా 60,000 ఉద్యోగాల కల్పన జరిగిందని, మొత్తం సిబ్బంది సంఖ్య 54.3 లక్షలకు చేరిందని ఆమె తెలిపారు. ఏఐ, డేటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో నియామకాలు ఉండనున్నాయని చెప్పారు. దీంతో కంపెనీలు తమ సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడంపై మరింతగా కృషి చేస్తున్నాయన్నారు. అంతర్జాతీయంగా 6,50,000 మంది పైచిలుకు ఉద్యోగులు జనరేటివ్ ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారని ఘోష్ చెప్పారు. -
తక్షణం ఆందోళన చెందాల్సినదేమీ లేదు
న్యూఢిల్లీ: భారత్–కెనడా మధ్య తలెత్తిన దౌత్యపరమైన వివాద పరిణామాలను దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిశితంగా పరిశీలిస్తోంది. కెనడాలోని తమ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వారి అభిప్రాయం ప్రకారం తక్షణం ఆందోళన చెందాల్సినదేమీ లేదని పేర్కొంది. ఖలిస్తానీ వేర్పాటువాది హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. పలు భారతీయ ఐటీ దిగ్గజాలు కెనడాలో కార్యకలాపాలను సాగిస్తుండటంతో పాటు అక్కడ పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాస్కామ్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ప్రస్తుతానికైతే టెక్ పరిశ్రమ వ్యాపారంపై ఎటువంటి ప్రభావం లేకపోయినా.. ఈ వివాదం ఎంతకాలం కొనసాగుతుందనేది వేచి చూడాల్సి ఉంటుందని పరిశ్రమ దిగ్గజం టీవీ మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. -
నాస్కామ్-డెలాయిట్ సర్వే: ఎమర్జింగ్ ఐటీ సిటీ విశాఖపట్నం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ నగరాలపై అధికంగా దృష్టిసారిస్తున్నట్లు నాస్కామ్–డెలాయిట్ సంయుక్త సర్వే వెల్లడించింది. దేశీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను పెద్ద నగరాలు కంటే చిన్న నగరాలకు విస్తరించడానికి మొగ్గుచూపుతున్నాయని ఈ సర్వే నివేదిక తెలిపింది. ఈ విస్తరణకు ఐదు కీలక అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా 26 ఎమర్జింగ్ ఐటీ హబ్స్‌ను నాస్కామ్–డెలాయిట్ ఎంపిక చేసింది. ఇందులో మన రాష్ట్రం నుంచి విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాలకు చోటు దక్కగా, తెలంగాణ నుంచి వరంగల్ ఎంపికైంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలికవసతులు, రిస్్క–వ్యవస్థల నియంత్రణ, స్టార్టప్ ఎకోసిస్టమ్, సోషల్–లివింగ్ ఎన్విరాన్మెంట్ అనే అయిదు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని వీటిని ఎంపిక చేసినట్లు వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం బీచ్ ఐటీ పేరుతో ఇప్పటికే విశాఖ నగరాన్ని ప్రోత్సహిస్తుండటమే కాకుండా నూతనతరం సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లు, స్టార్టప్ ఇంక్యుబేటర్స్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్, రాండ్‌శాండ్, బీఈఎల్, అమెజాన్ వంటి ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను విశాఖకు విస్తరించగా మరికొన్ని కంపెనీలు త్వరలో కార్యకలాపాలను ప్రారంభించడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి. విశాఖలో మొత్తం 1,120 స్టార్టప్స్ కార్యకలాపాలను సాగిస్తున్నాయి. వీటిలో 20 శాతానికిపైగా స్టార్టప్స్ టెక్నాలజీ రంగానికి చెందినవే ఉన్నాయి. ఇప్పటికే 250కి పైగా ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు విశాఖ వేదికగా పనిచేస్తున్నాయి. ఇదే సమయంలో విజయవాడలో 80కి పైగా టెక్నాలజీకి చెందిన స్టార్టప్స్ ఉండగా, 550కి పైగా టెక్నాలజీ ఆధారిత వ్యాపారసంస్థలు ఉన్నాయి. చదవండి: వియ్యంకుల వారి భూ విందు అంతేగాకుండా ఏటా 25 వేలమందికి పైగా ఐటీ నిపుణులు అందుబాటులోకి వస్తున్నారు. ఐటీ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి ముందువరుసలో ఉంటోంది. తిరుపతిలో ఇప్పటికే 25 టెక్నాలజీ స్టార్టప్స్ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, 50కి పైగా టెక్నాలజీ బేస్డ్ సంస్థలున్నాయి. ఇవన్నీ ఈ మూడు నగరాల్లో పెట్టుబడులను పెట్టే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. 30% వ్యయం తక్కువ పెద్ద నగరాలతో పోలిస్తే నైపుణ్యం కలిగిన మానవ వనరులు ద్వితీయశ్రేణి నగరాల్లో లభిస్తుండటం, రియల్ ఎస్టేట్ ధరలూ తక్కువగా ఉండటంతో ఐటీ కంపెనీలు ఈ 26 నగరాల్లో కార్యకలాపాలు మొదలు పెట్టడానికి ప్రధాన కారణమని నాస్కామ్–డెలాయిట్ పేర్కొంది. పెద్ద నగరాలతో పోలిస్తే మానవ వనరుల వ్యయం 25 నుంచి 30 శాతం తగ్గుతున్నట్లు తెలిపింది. దేశీయ ఐటీ నిపుణుల్లో 15 శాతం ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల నుంచి వస్తున్నవారే కావడంతో వారి వద్దకే కార్యాలయాలను తీసుకెళ్లే యోచనలో కంపెనీలున్నాయి. రియల్ ఎస్టేట్ భవనాలు, అద్దెల వంటివీ చిన్న నగరాల్లో తక్కువగా ఉంటున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఐటీ కంపెనీలు టైర్–2 సిటీస్ బాట పడుతున్నట్లు ఆ నివేదిక విశ్లేషించింది. -
నాస్కామ్ చైర్‌పర్సన్‌గా రాజేశ్ నంబియార్
ముంబై: కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రాజేశ్ నంబియార్‌ను తన చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్లు టెక్నాలజీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం నాస్కామ్ చైర్‌పర్సన్‌గా మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి బాధ్యతలు నిర్వహిస్తుండగా, నంబియార్ వైస్ చైర్పర్సన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా అనంత్ మహేశ్వరి నుంచి నంబియార్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. నాస్కామ్ భారత్‌కు సంబంధించి ఐటీ, టెక్ ట్రేడ్ సంస్థ. ప్రభుత్వం, ఐటీ పరిశ్రమ మధ్య సమన్వయం పెంపొందడానికి ఈ సంస్థ విశేష కృషి చేస్తోంది. ‘‘నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు చైర్‌పర్సన్‌గా నియమితులు కావడాన్ని గౌరవప్రదమైన అంశంగా భావిస్తున్నాను. ప్రపంచానికి అత్యంత విశ్వసనీయమైన సాంకేతిక భాగస్వామిగా భారతదేశ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి సంబంధిత అన్ని వర్గాలతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను’’ అని తన నియామకం సందర్భంగా నంబియార్ పేర్కొన్నారు. -
ఉద్యోగాలపై ఏఐ ప్రభావం మీద స్పష్టత లేదు
న్యూఢిల్లీ: జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా కాకుండా వారు తమ విధులను మరింత మెరుగ్గా నిర్వహించడానికి తోడ్పడే సాధనంగా ఉపయోగపడే అవకాశం ఉందని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా తెలిపారు. దేశీయంగా ఉద్యోగాలపై దీని ప్రభావాలు ఎలా ఉంటాయనే అంశంపై కాలక్రమేణా స్పష్టత రాగలదని ఆమె పేర్కొన్నారు. సాంకేతిక, సాంకేతికయేతర రంగాల్లో ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావాలు పడుతున్న నేపథ్యంలో గుప్తా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాస్కామ్ వార్షిక టెక్నాలజీ సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, వారానికి 40 గంటల పని విధానాన్ని ఏఐ మార్చేయగలదని, ఉద్యోగులు తమకు ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై దృష్టి పెట్టేందుకు తగినంత సమయం లభించేందుకు ఇది తోడ్పడగలదని యాక్సెంచర్ గ్లోబల్ సీనియర్ ఎండీ మార్క్ క్యారెల్ బిలియార్డ్ తెలిపారు. అటు, విదేశాల్లో లిస్టయిన అంకుర సంస్థలను భారత్‌కు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గుప్తా స్పందించారు. సాధారణంగా తమ ఇన్వెస్టర్ల ప్రయోజనాల రీత్యా, అలాగే వ్యాపారాల నిర్వహణకు సులభతరమైన పరిస్థితుల కారణంగా పలు స్టార్టప్‌లు విదేశాల్లో లిస్టింగ్ వైపు మొగ్గు చూపుతుంటాయని ఆమె తెలిపారు. వాటిని తిరిగి భారత్‌కు తెప్పించే క్రమంలో దేశీయంగా పన్నులపరమైన విధానాలు, ఎసాప్ (ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్ ఇవ్వడం) పాలసీలు మొదలైన వాటిని తగు రీతిలో సరిదిద్దేలా నాస్కామ్.. ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందని గుప్తా వివరించారు. డీప్‌టెక్ పరిశ్రమకు ప్రతిభావంతులు, పెట్టుబడులు, తగిన మౌలిక సదుపాయాల కొరత సమస్యగా ఉంటోందన్న నివేదిక వివరాలను సదస్సు సందర్భంగా నాస్కామ్, కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఆవిష్కరించాయి. -
టెక్ ఒప్పందాల జోరుకు బ్రేకులు
న్యూఢిల్లీ: టెక్నాలజీ సర్వీసుల రంగంలో ఒప్పందాల జోరు తగ్గింది. ఈ ఏడాది (2023) తొలి త్రైమాసికంలో లావాదేవీల సంఖ్య 150కి పరిమితమైంది. గతేడాది ఇదే వ్యవధిలో 270 పైగా, 2021లో 220 పైచిలుకు ఒప్పందాలు కుదిరాయి. కన్సల్టెన్సీ ఈవై, ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2022లో విలీనాలు, కొనుగోళ్ల డీల్స్, ప్రైవేట్ ఈక్విటీ ఒప్పందాలు 57 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. 2020తో పోలిస్తే (27 బిలియన్ డాలర్లు) ఇది రెట్టింపు కావడం గమనార్హం. అయితే, గతేడాది ఆఖరులో నుంచి ఈ ఏడాది తొలి త్రైమాసికం వరకు డీల్స్ నెమ్మదించినట్లు నివేదిక తెలిపింది. అయినప్పటికీ రాబోయే రోజుల్లో మధ్య స్థాయి కంపెనీల మధ్య లావాదేవీలు మెరుగ్గానే ఉండవచ్చని భావిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది మిగతా కాలంలో రిస్కులను తగ్గించుకునే ఉద్దేశంతో ఒప్పందాలను కుదుర్చుకునేటప్పుడు సంస్థలు మరింతగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందని వివరించింది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ►2022లో ఐటీ సర్వీసులు, బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్), ఈ–ఆర్అండ్డీ (ఇంజినీరింగ్, ఆర్అండ్డీ) తదితర విభాగాల్లో 947 డీల్స్ కుదిరాయి. అయిదేళ్లలో ఇదే అత్యధికం. ► 2020తో పోలిస్తే 2022లో మొత్తం ఒప్పందాల విలువ, పరిమాణం రెట్టింపైంది. ►ఐటీ సర్వీసుల ఒప్పందాల్లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థల భాగస్వామ్యం 2020తో పోలిస్తే 2022లో 2.5 రెట్లు పెరిగింది. భారీ ఒప్పందాల సెగ్మెంట్లో (500 మిలియన్ డాలర్ల పై స్థాయి) 62.5 శాతం వాటా దక్కించుకుంది. ► అధునాతన టెక్నాలజీలను దక్కించుకునే ఉద్దేశంతో ఐటీ సర్వీసుల కంపెనీలు ఎక్కువగా ఐపీ/ప్రోడక్ట్ సంస్థల్లో వాటాలను కొనుగోలు చేయడంపై ఆసక్తి చూపుతున్నాయి. ►భారీ సంస్థలు ప్రధానంగా ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్), ఏఆర్/వీఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ), హైపర్–ఆటోమేషన్, కోడింగ్ తక్కువగా ఉండే లేదా అసలు కోడింగ్ అవసరం ఉండని కొత్త టెక్నాలజీలపై ఆసక్తిగా ఉంటున్నాయి. ►ప్రస్తుతం ఆర్థిక అనిశ్చితులు ఎలా ఉన్నప్పటికీ కంపెనీల డిజిటల్ పరివర్తన ప్రక్రియ పలు దశాబ్దాల పాటు కొనసాగనుంది. దీనిపై సంస్థలు బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు ఇన్వెస్ట్ చేయనున్నాయి. తద్వారా రాబోయే రోజుల్లోనూ అధునాతన ఐటీ సొల్యూషన్స్‌కు డిమాండ్ భారీగానే ఉండనుంది. ►గడిచిన 24 నెలల్లో కంపెనీల పెట్టుబడుల ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచ్చాయి. సంస్థలు డిజిటల్, వ్యాపార పరివర్తన మీద ఇన్వెస్ట్ చేయడంపై దృష్టి పెడుతున్నాయి. ► ప్రస్తుతం తయారీ, ఆటోమోటివ్, సరఫరా వ్యవస్థలు మొదలైన విభాగాల్లో ఏఆర్, వీఆర్, ఐవోటీ వంటి టెక్నాలజీల వినియోగం పెరుగుతోంది. టెక్నాలజీ రంగంలో డిజిటైజేషన్, క్లౌడిఫికేషన్, డిజిటల్ సీఎక్స్ (కస్టమర్ అనుభూతి) వంటి విభాగాలు వృద్ధి చెందనున్నాయి. -
నాస్కామ్ చైర్‌పర్సన్‌గా అనంత్ మహేశ్వరి
న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమ అత్యున్నత సంఘమైన నాస్కామ్ చైర్‌పర్సన్‌గా 2023–24 సంవత్సరానికి అనంత్ మహేశ్వరి ఎంపికయ్యారు. మహేశ్వరి ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు నాస్కామ్ వైస్ చైర్మన్‌గానూ ఇప్పటి వరకు సేవలు అందించారు. టీసీఎస్ బిజినెస్, టెక్నాలజీ విభాగం ప్రెసిడెంట్ అయిన కృష్ణన్ రామానుజం ఇప్పటి వరకు నాస్కామ్ చైర్ పర్సన్‌గా సేవలు అందించగా, ఆయన స్థానంలో అనంత్ మహేశ్వరి పని చేయనున్నారు. కాగ్నిజంట్ ఇండియా చైర్మన్, ఎండీగా ఉన్న రాజేష్ నంబియార్‌ను నాస్కామ్ వైస్ చైర్మన్‌గా నియమించారు. -
90 శాతం భారతీయ ఆవిష్కరణలు ’కాపీలే’
ముంబై: దాదాపు 90 శాతం భారతీయ ఆవిష్కరణలన్నీ ’కాపీక్యాట్ ఐడియాలే’నని హాట్‌మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా విమర్శించారు. క్రియేటర్ల దేశంగా మారేందుకు భారత్ ఇంకా సన్నద్ధంగా లేదని నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. టెస్లా వంటి ఆధునిక సంస్థల ప్లాంట్లలో 300–400 మంది మాత్రమే పనిచేస్తున్న నేపథ్యంలో దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు మేకిన్ ఇండియా లాంటి కార్యక్రమాల వల్ల పెద్ద ఉపయోగం ఉండదని భాటియా చెప్పారు. చైనా ఇప్పటికే తయారీ దేశ స్థానాన్ని ఆక్రమించినందున భవిష్యత్తులో తయారీ రంగానికి కాకుండా క్రియేటర్ల దేశానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అయితే ఆ స్థాయికి ఎదిగేందుకు భారత్ ఇంకా సన్నద్ధంగా లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో సమస్యలను స్వతంత్రంగా గుర్తించి, వాటిని పరిష్కరించేందుకు ఐడియాలను రూపొందించే దిశగా నిర్ణయాలు తీసుకోవడంలో వికేంద్రీకరణ విధానం అవసరమని భాటియా సూచించారు. ప్రజలు తమ సమస్యలను గుర్తించి, తామే పరిష్కరించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఎయిర్‌బీఎన్‌బీ, టెస్లా, ఉబర్ వంటి ఆవిష్కరణలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. -
ఐటీ.. వృద్ధి మందగమనం!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ రంగం వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మందగించనుంది. 8.4 శాతానికి పరిమితమై 245 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదు కానుంది. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఈ మేరకు అంచనాలు వెలువరించింది. గత ఆర్థిక సంవత్సరంలో టెక్ పరిశ్రమ 15.5 శాతం పెరిగి 226 బిలియన్ డాలర్లకు చేరింది. దశాబ్దకాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. కోవిడ్ మహమ్మారిపరమైన మార్పులతో కంపెనీలు టెక్నాలజీపై మరింతగా వ్యయాలు చేయడం ఇందుకు దోహదపడింది. అయితే, తాజాగా రష్యా–ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు భౌగోళికరాజకీయ సవాళ్లు విసురుతుండటం, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుండటం, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు పెరుగుతుండటం తదితర అంశాలు టెక్నాలజీ పరిశ్రమకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నాస్కామ్ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న సీఈవోలు భవిష్యత్‌పై ’జాగరూకతతో కూడిన ఆశావహ’ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్ణయాల్లో జాప్యం.. భౌగోళికరాజకీయ ఆందోళనల వల్ల ఐటీ కాంట్రాక్టులు ఇవ్వడంపై కంపెనీలు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతోందని, కొన్ని మార్కెట్లలో డిమాండ్ కూడా తగ్గుతోందని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ తెలిపారు. కొన్ని కంపెనీలకు మాత్రమే పటిష్టమైన ఆర్డర్లు ఉన్నాయని, పరిశ్రమకు ఇదే కాస్త ఊతంగా ఉంటోందని ఆమె వివరించారు. టాప్ 5 కంపెనీల ఆర్డర్ బుక్ 18 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండటం, నిర్దిష్ట కంపెనీల క్లయింట్ల సంఖ్య 10 శాతం మేర పెరగడం, సామరŠాధ్యల వినియోగం 6–7 శాతం పెంచుకోగలగడం వంటి సానుకూల అంశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఉద్యోగార్థుల్లో ఉద్యోగ సామర్థ్యాల కొరత ఉంటోందని ఘోష్ చెప్పారు. మన విద్యావ్యవస్థలోనే దీనికి మూలం ఉందని, ఫలితంగా సరైన నైపుణ్యాలున్న తాజా గ్రాడ్యుయేట్లు పరిశ్రమకు లభించడం లేదని ఆమె పేర్కొన్నారు. దీంతో తమ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా వారికి శిక్షణనిచ్చేందుకు కంపెనీలు భారీగా వెచ్చించాల్సి వస్తోందని ఘోష్ వివరించారు. చాట్‌జీపీటీ లాంటి జనరేటివ్ కృత్రిమ మేథ (ఏఐ) ప్లాట్‌ఫాంల ప్రభావం ఉద్యోగాలపై పరిమితంగానే ఉంటుందని, వాస్తవానికి ఏఐతో ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆమె చెప్పారు. 54 లక్షలకు ఐటీ సిబ్బంది.. : మార్చి 31తో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో ఐటీలో ఉద్యోగుల సంఖ్య 2.90 లక్షలు పెరిగి మొత్తం 54 లక్షలకు చేరనుంది. వీరిలో 20 లక్షల మంది మహిళలు ఉండగా, 36 శాతం మందికి డిజిటల్ నైపుణ్యాలు ఉన్నట్లు నాస్కామ్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (4.5 లక్షల వృద్ధి) తక్కువే అయినప్పటికీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే ఇది ఎక్కువేనని పేర్కొంది. గత రెండు ఆర్థిక సంవత్సరాలు అసాధారణమైనవని వివరించింది. ఐటీ కంపెనీలకు ఇటీవల సమస్యగా మారిన అట్రిషన్ (ఉద్యోగుల వలసలు) రేటు జూన్ క్వార్టర్‌తో పోలిస్తే (25.7 శాతం) డిసెంబర్ త్రైమాసికంలో కాస్త నెమ్మదించి 21.8 శాతానికి చేరింది. ఇక భారత ఐటీ ఎగుమతులు 9.4 శాతం పెరిగి 194 బిలియన్ డాలర్లకు చేరగలవని నాస్కామ్ పేర్కొంది. 2030 నాటికి దేశీ ఐటీ రంగం 500 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేసింది. -
ప్రపంచాన్ని ఊపేస్తున్న మెటావర్స్ ఫీవర్..వినియోగంలోకి వచ్చేది అప్పుడే!
న్యూఢిల్లీ : మెటావర్స్కు ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో భారీ ఎత్తున వినియోగంలోకి రావడానికి మరో 8–10 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. 2030 నాటికి రిటైల్, తయారీ, మీడియా, హెల్త్‌కేర్, టెలికం, ప్రొఫెషనల్ సర్వీసెస్, బ్యాంకింగ్ తదితర రంగాలు దీనిపై గణనీయంగా వెచ్చించనున్నాయి. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్, కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే అండ్ కంపెనీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇందులో మెటావర్స్ సాధనాల వినియోగం తీరుతెన్నులను వివరించారు. దీని ప్రకారం 2017లో కృత్రిమ మేథ (ఏఐ) విషయంలో ఎలాంటి ధోరణులు కనిపించాయో ఇప్పుటు మెటావర్స్‌ను కంపెనీలు వినియోగించడంపైనా అలాంటి ధోరణులే కనిపిస్తున్నాయి. స్వల్ప, దీర్ఘకాలికంగా మెటావర్స్ సొల్యూషన్స్‌ను ప్రస్తుతం అమలు చేస్తున్నట్లు గతేడాది 57 శాతం మంది చీఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్స్ తెలిపినట్లు సర్వేలో తేలింది. ఇటీవలి సాంకేతికత పురోగతి కారణంగా ఇంటర్నెట్లో తదుపరి విప్లవంగా మెటావర్స్ ముందు వరుసలో ఉండనుందని నివేదిక పేర్కొంది. భారీగా పెట్టుబడులు .. మెటావర్స్ విభాగంలోకి ప్రైవేట్ ఈక్విటీ/వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు గణనీయంగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. గతేడాది ప్రథమార్ధంలో 120 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది. వివిధ మాధ్యమాల ద్వారా కస్టమర్‌కు సర్వీసులు అందించడం, రియల్ టైమ్‌లో ఉత్పత్తుల డిజైనింగ్‌ను పరీక్షించడం వంటి అంశాల్లో ఇది ఉపయోగపడగలదని వివరించింది. 3డీ/టెక్నికల్ ఆర్టిస్ట్‌లు, మోషన్ డిజైనర్లు, గ్రాఫిక్స్ ఇంజినీర్లు మొదలైన వారు ఈ టెక్నాలజీ విస్తరణలో కీలకపాత్ర పోషిస్తారని నివేదిక తెలిపింది. అయితే, దీన్ని భారీ స్థాయిలో విస్తరించాలంటే .. పెట్టుబడులపై రాబడులు, టెక్నాలజీ, టాలెంట్ సంసిద్ధత వంటి అంశాలపై స్పష్టత అవసరమని నివేదిక పేర్కొంది. -
డీప్ టెక్ స్టార్టప్స్‌లోకి మరిన్ని పెట్టుబడులు రావాలి
బెంగళూరు: దేశీ డీప్ టెక్నాలజీ స్టార్టప్ సంస్థలు వేగంగా ఎదిగేందుకు వాటికి ప్రారంభ దశలో మరింత ఎక్కువగా పెట్టుబడులు అందాల్సిన అవసరం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ చెప్పారు. ప్రస్తుతం టెక్నాలజీ రంగంలోకి వచ్చే పెట్టుబడుల్లో కేవలం 11 శాతం మాత్రమే డీప్ టెక్ స్టార్టప్‌లకు లభిస్తున్నాయని తెలిపారు. చైనా, అమెరికా వంటి దేశాలు తమ డీప్ టెక్ స్టార్టప్ వ్యవస్థను పటిష్టం చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తుండగా, దేశీయంగానూ వీటి నిధుల అవసరాలపై మరింత దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) నిర్వహించిన స్టార్టప్‌లు, ఎంట్రప్రెన్యూర్షిప్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. దేశీయంగా 25,000 పైచిలుకు టెక్ స్టార్టప్‌లు ఉండగా.. వీటిలో డీప్‌టెక్‌కు సంబంధించినవి 12 శాతం (3,000) మాత్రమే ఉన్నాయని తెలిపారు. కృత్రిమ మేథ (ఏఐ), రోబోటిక్స్, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), డ్రోన్లు మొదలైన టెక్నాలజీపై డీప్ టెక్ సంస్థలు పని చేస్తుంటాయి. ఇలాంటి సంస్థల పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై సమయం వెచ్చించాల్సి ఉంటుంది కాబట్టి వాటి ఉత్పత్తులు మార్కెట్లోకి రావడానికి ఎక్కువ సమయం పడుతుందన్న విషయాన్ని ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థలు గుర్తించాలని దేవయాని ఘోష్ చెప్పారు. ప్రతిభావంతులు చాలా మందే ఉంటున్నప్పటికీ .. వారిని అందుకోవడం సమస్యగా మారిన నేపథ్యంలో సింగపూర్ వంటి దేశాల్లో మిలిటరీ సర్వీసును తప్పనిసరి చేసిన విధంగా ’స్టార్టప్ సర్వీసు’ను కూడా ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించవచ్చని తెలిపారు. తద్వారా మూడు, నాలుగో సంవత్సరంలోని ఇంజినీరింగ్ విద్యార్థులు ఏడాది పాటు ఏదైనా టెక్ స్టార్టప్స్‌లోకి వెళ్లి పనిచేయొచ్చని పేర్కొన్నారు. ఆ రకంగా ప్రతిభావంతుల తోడ్పాటుతో ఆయా అంకుర సంస్థలు, పెద్ద కంపెనీలతో పోటీపడవచ్చన్నారు. అవ్రా మెడికల్ రోబోటిక్స్‌లో ఎస్ఎస్ఐకి వాటాలు న్యూఢిల్లీ: దేశీ మెడ్‌టెక్ స్టార్టప్ కంపెనీ ఎస్ఎస్ ఇన్నోవేషన్ తాజాగా అమెరికాకు చెందిన నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ అవ్రా మెడికల్ రోబోటిక్స్‌లో నియంత్రణ వాటాలను కొనుగోలు చేసింది. దీనితో తమకు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రవేశించేందుకు అవకాశం లభించినట్లవుతుందని సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ సుధీర్ పి. శ్రీవాస్తవ తెలిపారు. ’ఎస్ఎస్ఐ మంత్ర’ రూపంలో ఇప్పటికే తాము మేడిన్ ఇండియా సర్జికల్ రోబో వ్యవస్థను ప్రవేశపెట్టామని ఆయన చెప్పారు. అవ్రాతో భాగస్వామ్యం .. రోబోటిక్ సర్జరీలకు సంబంధించి వైద్య సేవల్లో కొత్త మార్పులు తేగలదని శ్రీవాస్తవ వివరించారు. -
‘అలా చేస్తే మీకే కాదు..నా ఉద్యోగానికే దిక్కుండదు’, రషీద్ ప్రేమ్‌జీ సంచలన వ్యాఖ్యలు
మూన్‌లైటింగ్‌కు పాల్పడుతున్నారనే కారణంగా ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. దీంతో ఆ సంస్థ యాజమాన్యంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించిన సమయంలో తమ సంస్థకు చెందిన ఓ టాప్ ఎగ్జిక్యూటీవ్‌ను ఫైర్ చేసినట్లు విప్రో ఛైర్మన్ రషీద్ ప్రేమ్‌జీ బహిర్ఘతం చేశారు. బెంగళూరు కేంద్రంగా జరిగిన నాస్కామ్ ప్రొడక్ట్ కన్క్లేవ్ కార్యక్రమంలో రషీద్ ప్రేమ్‌జీ మాట్లాడారు. విప్రోలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న టాప్ - 20 ఎగ్జిక్యూటీవ్‌లలో ఓ ఉద్యోగి సంస్థ మోరల్స్‌ను ఉల్లంఘించారు. సంస్థకు అతని అవసరం ఎంటో బాగా తెలుసు. కానీ కొన్నిసమయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మేం (రషీద్ ప్రేమ్‌జీ) అదే చేశాం. కేవలం పదే పది నిమిషాల్లో అతన్ని విధుల నుంచి ఫైర్ చేసినట్లు చెప్పారు. సదరు సీనియర్ ఉద్యోగి మూన్‌లైటింగ్‌కు పాల్పడ్డారా? లేదంటే ఇంకేదైనా కారణంతో సంస్థ నుంచి బయటకు పంపారనే విషయంపై విప్రో ఛైర్మన్ వెల్లడించలేదు. అయితే విప్రోకు మోరల్స్ ఉన్నాయి. ఎవరైనా నిబంధనల్ని ఉల్లంఘించినా, లేదంటే వేధింపులకు పాల్పడితే ఎవరి ఉద్యోగం ఉండదు. అంతెందుకు నేను ఆ రెండింటిలో ఏ ఒక్కదాన్ని ఉల్లంఘించినా విప్రోలో నా ఉద్యోగం కూడా ఉండదని తెలిపారు. ఉద్యోగుల తొలగింపు సెప్టెంబర్ 21 న, ప్రేమ్‌జీ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. విప్రోలో మూన్‌లైటింగ్‌కు పాల్పడిన వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు ఆఫీస్ నుంచి విధులు నిర్వహిస్తున్న మొత్తం 300 మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు. "వాస్తవం ఏంటంటే ఈ రోజు విప్రో కోసం పనిచేసేందుకు చాలా మంది ఉద్యోగులే ఉన్నారు. ఆ ఉద్యోగులే కాంపిటీటర్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. గత కొన్ని నెలల్లో 300మందిని గుర్తించి ఇంటికి పంపించినట్లు చెప్పిన విషయం తెలిసిందే. చదవండి👉 మూన్‌లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’ -
ఈ టెక్నాలజీతో..కొత్తగా 1.4 కోట్లకు పైగా ఐటీ ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: క్లౌడ్ సర్వీసుల వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో 2026 నాటికి దీని ద్వారా 1.4 కోట్ల పైచిలుకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ పేర్కొంది. క్లౌడ్ విభాగానికి భారత్ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 380 బిలియన్ డాలర్ల వాటా ఉండగలదని ఒక ప్రకటనలో వెల్లడించింది. క్లౌడ్ వినియోగంతో పౌరులకు సేవలు మెరుగుపర్చవచ్చని, డిజిటల్ మాధ్యమం ద్వారా అందరికీ వైద్యం, విద్య, ఆర్థిక సేవలను అందుబాటులోకి తేవచ్చని తెలిపింది. అలాగే దేశీయంగా నవకల్పనలకు ఊతం, ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కొత్త అవకాశాల రూపంలో తోడ్పాటు లభించగలదని నాస్కామ్ తెలిపింది. అన్ని వర్గాల నుంచి సహకారం లభిస్తే వచ్చే అయిదేళ్లలో క్లౌడ్‌పై వెచ్చించే నిధులు 25–30 శాతం పెరిగి 18.5 బిలియన్ డాలర్లకు చేరగలవని వివరించింది. తద్వారా క్లౌడ్ అవకాశాలను భారత్ పూర్తి సామర్ధ్యంతో వినియోగించుకోగలదని నాస్కామ్ పేర్కొంది. -
స్టార్టప్స్‌లోకి భారీగా తగ్గిన పెట్టుబడులు.. ఎంత శాతం అంటే!
న్యూఢిల్లీ: మార్కెట్లో ప్రతికూల సెంటిమెంట్ నెలకొన్న నేపథ్యంలో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అంకుర సంస్థల్లోకి పెట్టుబడులు తగ్గాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 17 శాతం క్షీణించి 6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 47,800 కోట్లు) పరిమితమయ్యాయి. పీజీఏ ల్యాబ్స్‌తో కలిసి ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘ఈ క్యాలెండర్ సంవత్సరం (2022) రెండో త్రైమాసికంలో 16 భారీ డీల్స్ కుదిరాయి. వీటి ద్వారా 6 బిలియన్ డాలర్లు వచ్చాయి. ఈ వ్యవధిలో కొత్తగా 4 యూనికార్న్ సంస్థలు (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గలవి) ఏర్పడ్డాయి. దీనితో ప్రథమార్ధంలో మొత్తం యూనికార్న్‌ల సంఖ్య 20కి చేరింది. వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 26 శాతం భాగం ఫిన్‌టెక్ విభాగం దక్కించుకుంది’ అని నివేదిక వివరించింది. క్రెడ్, డైలీహంట్ వంటి సంస్థల్లోకి భారీగా నిధులు రావడంతో ఫిన్‌టెక్, మీడియా.. వినోద రంగాల్లోకి వచ్చే పెట్టుబడుల పరిమాణం గణనీయంగా పెరిగినట్లు పేర్కొంది. క్యూ2లో వచ్చిన పెట్టుబడుల్లో ఈ విభాగాలు 45 శాతం వాటా దక్కించుకున్నాయని తెలిపింది. మొత్తం ఫండింగ్‌లో 58 శాతం పెట్టుబడులు .. వృద్ధి దశలో ఉన్న సంస్థల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఒక నిర్దిష్ట స్థాయికి చేరిన స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపినట్లు నివేదిక వివరించింది. -
వేలకోట్ల బిజినెస్: అమెరికాను ఏలేస్తున్న ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీలు!
మనదేశానికి చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీలు అమెరికా ఆర్ధిక వ్యవస్థను శాసిస్తున్నాయి. లక్షల మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పిస్తున్నాయి. వేలకోట్ల బిజినెస్ మార్కెట్‌తో అమెరికా ఎకానమీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని నాస్కామ్ - ఐహెచ్ఎస్ మార్కిట్ ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలో భారతీయ టెక్ కంపెనీల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నాస్కామ్ - ఐహెచ్ఎస్ మార్కిట్ నివేదిక ప్రకారం..2017 నుంచి భారత్‌కు చెందిన టెక్ కంపెనీలు 22శాతం వృద్దితో అమెరికన్లకు ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్నాయి. అలా నాటి నుంచి యావరేజ్ శాలరీ ఒక్కొక్కరికి 1,06,360 డాలర్లను చెల్లిస్తూ 2లక్షల మందికి పైగా అమెరికన్లతో పలు ప్రాజెక్ట్‌లపై పనిచేయించుకుంటున్నాయి. "మన దేశానికి చెందిన టెక్ సంస్థలు అమెరికన్ ఉద్యోగులతో పాటు కొత్త కొత్త టెక్నాలజీపై భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. తద్వారా పరిశ్రమలు, క్లయింట్ల కోసం అత్యాధునిక ఆవిష్కరణలను వెలుగులోకి తెస్తున్నాయని" నాస్కామ్ ప్రెసిడెంట్ దేబ్జానీ ఘోష్ అన్నారు. అమెరికాలోనే ఎక్కువ వరల్డ్ వైడ్‌గా ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో డిమాండ్ - సప్లయ్ ఎక్కువగా ఉంటుందని ఘోష్ తెలిపారు. వాటి ఆధారంగా ఈ డిజిటల్ వరల్డ్‌లో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ..సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో అందుకు కావాల్సిన నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ ఫార్చ్యూన్ - 500 కంపెనీస్‌లో సుమారు 75శాతం ఇండియన్ కంపెనీలు అమెరికా ప్రధాన కేంద్రంగా ప్రాజెక్ట్‌లపై వర్క్ చేస్తున్నాయి. అమెరికన్ ఎకానమీకి వెన్నుదన్నుగా కరోనాతో పాటు ఇతర సంక్షోభాల నుంచి గట్టెక్కేలా అమెరికా ఎకానమీకి వెన్నుదన్నుగా భారత్ కంపెనీలు నిలుస్తున్నాయి. అలా 2021 అమెరికాకు చెందిన 20 రాష్ట్రాలలో 1.6 మిలియన్ మందికి ఉద్యోగ అవకాశాల్ని కల్పించడంతో పాటు 396 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిపాయి. తద్వారా 198 బిలియన్ డాలర్ల నిధుల్ని అందించి అమెరికా ఎకానమీకి పరోక్షంగా సహకరిస్తున్నాయి. స్వామి కార్యం స్వకార్యం స్వామి కార్యం స్వకార్యం అన్న చందంగా భారత్ టెక్ కంపెనీలు అమెరికాలో పెట్టబడులతో లాభాల్ని అర్జిస్తున్నాయి. అదే సమయంలో అమెరికన్ల వృద్ది కోసం పాటు పడుతున్నాయి. అంతేకాదు ప్రజెంట్ జనరేషన్ తో పాటు నెక్ట్స్ జనరేషన్లో ఈజీగా జాబ్స్ పొందేలా ఇప్పటి నుంచే ప్రోత్సహిస్తూ భారత్ టెక్ కంపెనీలు భారీగా నిధుల్ని ఖర్చు చేస్తున్నాయని నాస్కామ్ నివేదిక హైలెట్ చేసింది. స్టెమ్‌లో రాణించేలా నాస్కామ్ నివేదికలో పేర్కొన్నట్లుగా..ఇండియన్ టెక్ కంపెనీలు అమెరికాలో 180 యూనివర్సీలు, కాలేజీలు, కమ్యూనిటీ కాలేజీలతో పాటు ఇతర ఎడ్యుకేషన్‌కు సంబంధించిన స్వచ్ఛంద సంస్థల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్(స్టెమ్) వ్యవస్థను బలోపేతం చేసేలా 1.1 బిలియన్ డాలర్ల నిధుల్ని ఖర్చు చేశాయి. దీంతో పాటు స్కూల్స్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పటిష్టం చేసేందుకు, అకడమిక్, కార్యాచరణ, ప్రోగ్రామ్, అడ్మినిస్ట్రేటివ్ సవాళ్లను పరిష్కరించడంలో నిష్ణాతులయ్యేలా డిజైన్ చేసిన కే-12 అనే కార్యక్రమం కోసం 3 మిలియన్లకు పైగా ఖర్చు చేశాయి. ఆ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 2.9 మిలియన్ల మంది విద్యార్ధులు, ఉపాధ్యాయులు లబ్ధి పొందారు. అదనంగా, 2,55,000 మంది ప్రస్తుత ఉద్యోగులు ఈ రంగం ద్వారా నైపుణ్యం పొందారు అవకాశాల గని అమెరికాలో వచ్చే దశాబ్దంలో ఇతర వృత్తుల కంటే స్టెమ్ వృత్తుల డిమాండ్ 1.5 రెట్లు వేగంగా పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం యూఎస్‌లో ఐటీ రంగం 70శాతం వృద్ది నమోదు చేస్తుంటే..2030 నాటికి స్టెమ్ విభాగంలో ఉపాధి అవకాశాలు 51 శాతంగా ఉండనున్నాయి. అమెరికాలో అలా భారత్‌లో ఇలా అమెరికాలో టెక్నాలజీ రంగంలో విసృత అవకాశాలతో పాటు ఉద్యోగాల రూప కల్పన జరుగుతుంది. కానీ భారత్‌లో టెక్ కంపెనీల పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశీయంగా హెచ్‌సీఎల్ సంస్థ జూన్ 2022తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం 6వేల మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకున్నట్లు తెలిపింది. అయినప్పటికీ అట్రిషన్ రేట్ ఆ సంస్థను కుదిపేస్తుంది. టీసీఎస్ సైతం జూన్, 2022 త్రైమాసికంలో 14,136 మంది ఉద్యోగుల్ని హయర్ చేసుకుంది. జూన్, 2022 త్రైమాసికంలో ఐటీ విభాగంలో అట్రిషన్ రేటు 19.7 శాతంగా ఉంది. ఇది అంతకుముందు త్రైమాసికంలో 17.4 శాతంతో పోలిస్తే ఎక్కువ అని టీసీఎస్ తెలిపింది. -
గ్రామీణ మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం కాల్‌సెంటర్
న్యూఢిల్లీ: గ్రామీణ మహిళా ఎంట్రప్రెన్యూర్ల కోసం నాస్కామ్ ఫౌండేషన్, టెక్నాలజీ దిగ్గజం గూగుల్, స్వచ్ఛంద సంస్థ ఐఎస్ఏపీ కలిసి సంయుక్తంగా ’డిజివాణి కాల్‌సెంటర్’ ఏర్పాటు చేశాయి. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ తదితర ఆరు రాష్ట్రాల్లో దీన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చినట్లు నాస్కామ్ ఫౌండేషన్ సీఈవో నిధి భాసిన్ తెలిపారు. ప్రాథమికంగా 20,000 మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు దీని ద్వారా సేవలు అందించాలని నిర్దేశించుకున్నట్లు వివరించారు. తమకు ఉపయోగపడే వివిధ పథకాలు, వ్యాపార వృద్ధికి సహాయపడే స్కీములు లేదా ఇతరత్రా సమాచారం మొదలైన వాటన్నింటి గురించి డిజివాణి ద్వారా తెలుసుకోవచ్చని భాసిన్ వివరించారు. దీనికి అవసరమైన నిధులను గూగుల్ సమకూరుస్తోందని, ఏడాది తర్వాత డిజివాణి సేవలను విస్తరించడంపై దృష్టి పెట్టనున్నామని పేర్కొన్నారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రిబిజినెస్ ప్రొఫెషనల్స్ (ఐఎస్ఏపీ)కి చెందిన ఢిల్లీ, లక్నో ఆఫీసుల్లో ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్లలో 19 మంది సిబ్బంది ఉన్నారు. -
టెక్ సంస్థలకు జవాబుదారీతనం ఉండాలి
న్యూఢిల్లీ: ఫేస్బుక్, గూగుల్ వంటి బడా టెక్ కంపెనీలు.. సమాజం పట్ల జవాబుదారీతనంతో ఉండేలా చూసేందుకు ప్రపంచ దేశాలన్నీ కలిసి రావాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఈ దిశగా భారత ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను.. వాక్ స్వాతంత్య్రానికి వ్యతిరేకమైనవిగా ప్రచారం చేయరాదని ఆయన స్పష్టం చేశారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన వార్షిక ఎన్టీఎల్ఎఫ్ (నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ప్రోగ్రాం) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రశేఖర్ ఈ విషయాలు తెలిపారు. దేశీయంగా పరిస్థితుల రీత్యా అభ్యంతరమైన కంటెంట్‌ను తొలగించాలంటూ యూట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలను ప్రభుత్వం ఇటీవల తరచుగా ఆదేశిస్తుండటాన్ని.. వాక్స్వాతంత్య్రంపై దాడిగా కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘బడా టెక్ కంపెనీలు, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌లు తాము సర్వీసులు అందించే సమాజం, వర్గాల పట్ల మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేలా చూడాలంటే, దేశాలు పరస్పరం సహకరించుకోవాలి‘ అని చంద్రశేఖర్ చెప్పారు. సైబర్ నేరాలు, సైబర్‌భద్రత తదితర అంశాల్లో పాటించాల్సిన నియంత్రణపరమైన సూత్రాలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. డేటా భద్రత బిల్లుకు మరింత సమయం.. డేటా భద్రత బిల్లును ప్రవేశపెట్టడంపై జాప్యం జరిగే అవకాశం ఉందని మంత్రి ఈ సందర్భంగా సూచనప్రాయంగా తెలిపారు. దీనిపై హడావుడిగా చట్టం చేసి ఆ తర్వాత సవరణలు చేస్తూ పోయే యోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ బిల్లుకు మద్దతుగా, వ్యతిరేకంగా భారీ స్థాయిలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని, అనేక సలహాలు.. సూచనలు కూడా వస్తున్నాయని ఆయన తెలిపారు. వీటన్నింటిపై చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. గోప్యతకి సంబంధించిన ఆందోళనలపై స్పందిస్తూ.. భద్రత, నమ్మకం, జవాబుదారీతనం, స్వేచ్ఛ మొదలైనవన్నీ పరస్పర విరుద్ధమైన సూత్రాలని.. సౌలభ్యాన్ని బట్టి ఎంచుకోవడం మారుతూ ఉంటుందని చంద్రశేఖర్ చెప్పారు. అయితే, ప్రభుత్వ విధానాల రీత్యా భద్రత, నమ్మకం అత్యంత ముఖ్యమైనవిగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ‘దేశాన్ని డిజిటైజ్ చేయడం ఎంత ముఖ్యమో, మన ప్రజాస్వామ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవడం .. వినియోగించే టెక్నాలజీ విశ్వసనీయమైనదిగా, జవాబుదారీతనంతో కూడుకున్నదై ఉండేలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం‘ అని మంత్రి అభిప్రాయపడ్డారు. 55 వేలకు పైగా ఫ్రెషర్ల హైరింగ్: ఇన్ఫీ దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా భారీగా నియామకాలు చేపట్టనుంది. సుమారు 55,000 మంది పైచిలుకు ఫ్రెషర్లను నియమించుకునే యోచనలో ఉంది. ఎన్టీఎల్ఎఫ్లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో సలిల్ పరేఖ్ ఈ విషయాలు తెలిపారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కాలేజ్ గ్రాడ్యుయేట్ల నియామకాలు 55,000 స్థాయిలో ఉంటుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా ఇదే స్థాయిలో లేదా ఇంతకన్నా ఎక్కువే రిక్రూట్ చేసుకుంటాం‘ అని వివరించారు. ఇంజినీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్లకు టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని పరేఖ్ తెలిపారు. ఆవిష్కరణలపై కంపెనీలు దృష్టి పెట్టాలి: విప్రో సీఈవో థియెరీ కొత్త ఆవిష్కరణలను రూపొందించడంపై కంపెనీలు మరింతగా కసరత్తు చేయాలని ఎన్టీఎల్ఎఫ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విప్రో సీఈవో థియెరీ టెలాపోర్ట్ అభిప్రాయపడ్డారు. ఈ టెక్నాలజీ దశాబ్దంలో మరింత సమర్ధత పెంచుకోవడం, బాధ్యతాయుతంగా పనిచేయడంపై దృష్టి పెట్టడంతో పాటు ప్రతిభావంతులను అట్టే పెట్టుకునేలా తమ విధానాలను సవరించుకోవాలని సూచించారు. అన్ని పరిశ్రమలు, మార్కెట్లలోని సంస్థలు తమ వ్యాపార సమస్యలను పరిష్కరించుకునేందుకు డిజిటల్ బాట పడుతున్నాయని, రాబోయే సంవత్సరాల్లో ఈ ధోరణి మరింతగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
కొత్తగా 4.5 లక్షల కొలువులు..సానుకూలంగా రిక్రూట్మెంట్స్..!
ముంబై: కరోనా మహమ్మారి పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా డిజిటైజేషన్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం 227 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. దశాబ్దకాలంలోనే అత్యధిక స్థాయిలో 15.5 శాతం వృద్ధి నమోదు చేయనుంది. 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వ్యూహాత్మక సమీక్ష సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ మంగళవారం ఈ విషయాలు వెల్లడించింది. మహమ్మారి పరిణామాలు తలెత్తిన వెంటనే పరిశ్రమ దీటుగా ఎదురునిల్చిందని, మరుసటి ఏడాది గణనీయంగా పుంజుకుందని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ పేర్కొన్నారు. కోవిడ్ పూర్వం కన్నా రెట్టింపు స్థాయి వృద్ధి సాధించనుందని ఆమె తెలిపారు. 2021 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయాలు 2.3 శాతం వృద్ధి చెంది 194 బిలియన్ డాలర్లకు చేరినట్లు వివరించారు. నాస్కామ్ ప్రకారం.. 2021–22లో కొత్తగా 4.5 లక్షల కొత్త కొలువులు రావడంతో ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య మొత్తం 51 లక్షలకు చేరనుంది. కొత్తగా రిక్రూట్ అయిన వారిలో 44 శాతం వాటాతో.. మొత్తం ఉద్యోగుల్లో మహిళల సంఖ్య 18 లక్షలుగా చేరుతుంది. 2026 నాటికి 350 బిలియన్ డాలర్లకు.. కొన్నాళ్లుగా వృద్ధి అంచనాలను ప్రకటించడాన్ని నిలిపివేసిన నాస్కామ్.. తాజా పరిణామాల దన్నుతో దేశీ ఐటీ పరిశ్రమ 2026 నాటికి 350 బిలియన్ డాలర్లకు చేరగలదని ధీమా వ్యక్తం చేసింది. ఇందుకు అవసరమైన సామర్థ్యాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని ఘోష్ పేర్కొన్నారు. దీనికోసం విధానకర్తలు కూడా కొంత తోడ్పాటు అందించాలని కోరారు. తొలి 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించడానికి పరిశ్రమకు 30 ఏళ్లు పట్టగా, రెండో బిలియన్ డాలర్ల మార్కును దశాబ్దకాలంలోనే సాధించినట్లు ఆమె తెలిపారు. మరోవైపు, ఐటీ పరిశ్రమ వృద్ధిని స్వాగతించిన కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్..పరిశ్రమకు అవసరమైన పూర్తి మద్దతును ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఎగుమతులు 17 శాతం అప్.. నాస్కామ్ ప్రకారం.. సమీక్షా కాలంలో ఎగుమతి ఆదాయాలు 17.2 శాతం పెరిగి 178 బిలియన్ డాలర్లకు చేరనుండగా, దేశీయంగా ఆదాయాలు 10 శాతం వృద్ధితో 49 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. కీలక విభాగాల వారీగా చూస్తే.. సైబర్‌సెక్యూరిటీ, ఇంటెలిజెంట్ ఆటోమేషన్, అనలిటిక్స్‌కు డిమాండ్ నేపథ్యంలో ఐటీ సర్వీసుల ఆదాయం 16.9 శాతం, సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వృద్ధి అత్యధికంగా 18.7 శాతం, హార్డ్‌వేర్ అత్యంత తక్కువగా 7.3 శాతంగా నమోదు కానుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా వృద్ధి జోరు కొనసాగుతుందని సీఈవోలు ఆశావహంగా ఉన్నట్లు నాస్కామ్ సర్వేలో తేలింది. ఫార్మా/హెల్త్‌కేర్, బ్యాంకింగ్, ఆర్థిక సర్వీసులు, బీమా, తయారీ, రిటైల్/ఈ–కామర్స్ మొదలైన రంగాల కంపెనీల ఐటీ వ్యయాలు ఎక్కువగా ఉండగలవని సీఈవోలు అభిప్రాయపడ్డారు. అలాగే, 2022–23లోనూ రిక్రూట్మెంట్పై సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. గరిష్ట స్థాయికి అట్రిషన్.. అట్రిషన్ సమస్య గరిష్ట స్థాయికి చేరిందని, ఇక నుంచి క్రమంగా తగ్గగలదని నాస్కామ్ వైస్ చైర్మన్ కృష్ణన్ రామానుజం తెలిపారు. టాప్ 10 ఐటీ కంపెనీల డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు చూస్తే ఉద్యోగుల వలసలు.. మరీ తగ్గకపోయినప్పటికీ, ఒక మోస్తరు స్థాయికే పరిమితం కావడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ‘ఇది గరిష్ట స్థాయికి చేరి ఉంటుందని, ఇక నుంచి పరిస్థితులు మెరుగుపడగలవని ఆశాభావం నెలకొన్నట్లుగా కనిపిస్తోంది‘ అని ఆయన వివరించారు. ప్రతిభావంతులు చేజారిపోకుండా చూసుకోవడం ఇటు పరిశ్రమకు అటు దేశానికి ముఖ్యమని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ పేర్కొన్నారు. ఇందుకోసం కంపెనీలు, నాస్కామ్ కూడా పలు చర్యలు తీసుకుంటున్నాయని వివరించారు. ఇటీవల కొన్ని త్రైమాసికాల్లో అట్రిషన్ ఏకంగా 20 శాతం పైగా నమోదైన నేపథ్యంలో తాజా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చిన్న పట్టణాల్లో మైక్రో ఐటీ హబ్‌లు.. బెంగళూరు, హైదరాబాద్, పుణే వంటి నగరాలకు పరిమితమైన ఐటీ కార్యకలాపాలను చిన్న పట్టణాలకు కూడా విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఘోష్ చెప్పారు. ఇండోర్, జైపూర్, కోల్‌కతా, కోయంబత్తూర్, అహ్మదాబాద్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి సెంటర్లలో మైక్రో ఐటీ హబ్‌లు ఏర్పాటయ్యాయని ఆమె వివరించారు. చిన్న పట్టణాలకు ఐటీ మరింతగా విస్తరించాలంటే నిరంతర విద్యుత్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలతో పాటు నిపుణుల లభ్యత, తగినంత ఉద్యోగావకాశాలు కల్పించే పరిస్థితి ఉండాలని ఘోష్ తెలిపారు. చదవండి: జనవరిలో ఎగుమతుల్లో 25% వృద్ధి -
‘కూ’ యాప్‌కి నాస్కామ్ అత్యుత్తమ పురస్కారం...
మన స్వదేశీ బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌గా ప్రసిద్ధి చెందిన కూ యాప్... అనతి కాలంలోనే అత్యధిక సంఖ్యాక ప్రజలకు చేరువవుతూ, అద్భుత విజయాలు స్వంతం చేసుకుంటోంది. అదే క్రమంలో తాజాగా నాస్కామ్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని కూడా అందుకుంది. ‘నాస్కామ్ లీగ్ ఆఫ్ 10 ఎమర్జ్ 50 అవార్డ్’ను గెలచుకుంది భారతదేశపు 50 అత్యుత్తమ వైవిధ్య భరిత సాఫ్ట్వేర్ ఉత్పత్తుల తయారీ కంపెనీలను గుర్తించి ఈ అవార్డులను అందిస్తారు. ఇందులోనూ సంస్థ మరిన్ని విజయాలను స్వంతం చేసుకుని, ఎక్కువ మంది ప్రజల మీద ప్రభావం చూపిన విధానాన్ని బట్టి లీగ్ ఆఫ్ 10లో స్థానం కల్పిస్తారు. ఆ జాబితాలో ఏకైక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌గా కూ కు అగ్రస్థానం దక్కడం విశేషం. -
గుడ్ న్యూస్: వారంలో 3 రోజులే పని..! వచ్చే ఏడాది నుంచే అమలు..?!
వర్క్ ఫ్రం హోంకే పరిమితమైన ఉద్యోగులకు ఆయా కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పనున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి వారానికి మూడు రోజుల పాటు ఆఫీస్‌లో పనిచేసేలా వర్క్ కల్చర్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ -ఇండీడ్ సర్వే తెలిపింది. అంతేకాదు ఇప్పటికే పలు కంపెనీలు అమలు చేసిన వారానికి మూడు రోజుల పని విధానాన్ని గుర్తి చేశారు. కరోనా కారణంగా ఉద్యోగులు ఏడాదిన్నరగా ఇంటి వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో పాటు ఉద్యోగులు సైతం ఆఫీస్‌లకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో నాస్కామ్-ఇండీడ్ సంస్థలు ‘నాస్కామ్ రిటర్న్ టు వర్క్‌ప్లేస్ సర్వే’ నిర్వహించాయి. ఈ సర్వేలో ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల అభిప్రాయాల్ని సేకరించింది. ఇందులో 25 నుంచి 40 ఏండ్లకు పైనున్న ఉద్యోగులు ఎప్పుడెప్పుడు ఆఫీస్‌కు వెళ్దామా' అని ఎదురు చూస్తున్నట్లు సర్వేలో తేలింది. ఐటీ కంపెనీలు తెచ్చిన ఐబ్రిడ్ వర్క్ కల్చర్ పట్ల ఉద్యోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని నాస్కామ్ తెలిపింది. ‘నాస్కామ్ రిటర్న్ టు వర్క్‌ప్లేస్ సర్వే’ ► నాస్కామ్-ఇండీడ్ సర్వేలో దాదాపు 50 శాతం మంది ఉద్యోగులు వచ్చే ఏడాది జనవరి నుండి వారానికి 3రోజుల పాటు ఆఫీస్‌లకు వచ్చే అవకాశం ఉంది. యజమానులు, ఉద్యోగులు ఇద్దరూ హైబ్రిడ్ సెటప్‌లో కార్యాలయాలకు తిరిగి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. ► ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ , విప్రో, హెచ్‌సీఎల్ టెక్ కంపెనీలు ఇప్పటికే సీనియర్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగస్తుల్ని కార్యాలయాలకు రప్పించాయి. ఇతర ఉద్యోగులు సైతం ఆఫీస్‌కు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాయి. ► ఉద్యోగులు స్వచ్ఛందంగా ఆఫీస్‌కు వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. ► 81 శాతానికి పైగా సంస్థలు ఉద్యుగుల్ని ఆఫీస్‌లకు రప్పించే విషయంలో ఉద్యోగుల ఆరోగ్యం, భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తేలింది. ► దాదాపు 72 శాతం సంస్థలు వచ్చే ఏడాది నుంచి గరిష్టంగా 50 శాతం ఉద్యోగుల్ని ఆఫీసుల్లో పనిచేసేందుకు చూస్తున్నాయి. ► 70 శాతంపైగా ఐటీ, ఇతర కంపెనీలు దీర్ఘకాలిక హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు మొగ్గుచూపుతున్నాయని ‘నాస్కామ్ రిటర్న్ టు వర్క్‌ప్లేస్ సర్వే’ లో తేలింది. ఇప్పటికే కొన్ని కంపెనల్లో వారానికి మూడు రోజుల పని అమలు వారానికి ఆరు రోజుల పని, ఓ రోజు సెలవు. సాధారణంగా ఇది అన్ని చోట్లా ఉండేదే. కొన్ని కార్పొరేట్ కంపెనీల్లో ఐదు రోజుల పనిదినాలు ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీలు కేవలం మూడు రోజుల పనిదినాల విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి. వారానికి మూడురోజుల పనిచేసినా మార్కెట్‌కు అనుగుణంగా 80శాతం వేతనాల్ని చెల్లిస్తామని ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ ‘స్లైస్’ ఈ విధానాన్ని అమలు చేసింది. స్లైస్‌లో పనిచేస్తున్న 450 మంది ఉద్యోగులు వారానికి మూడు రోజులే పనిచేస్తున్నారు. హైబ్రిడ్ వర్క్ కల్చర్ హైబ్రిడ్ వర్క్ కల్చర్ అంటే 25 శాతం ఉద్యోగులతో ఆఫీసుల్ని.. దశలవారీగా మిగతా వాళ్లతో వర్క్‌ఫ్రమ్ హోంను నిర్వహించడం. ఇప్పటికే టీసీఎస్ ఈ పని విధానాన్ని 2025 నుంచి పూర్తిగా అమలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎన్జీ సుబ్రమణియం ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. చదవండి: కొత్త వ్యూహం..నవంబర్ 15లోపు ఆఫీసుకు రండి..! -
క్లౌడ్ నిపుణుల అడ్డా భారత్
న్యూఢిల్లీ: క్లౌడ్ నిపుణుల విషయంలో ప్రపంచంలో రెండవ కేంద్రంగా భారత్‌కు అవకాశం ఉందని నాస్కామ్ వెల్లడించింది. ప్రభుత్వ, విద్య, నైపుణ్య కేంద్రాలు, సాంకేతిక సంస్థల సహకారంతో ఇది సాధ్యపడుతుందని తెలిపింది. డ్రౌప్ సహకారంతో నాస్కామ్ రూపొందించిన నివేదిక ప్రకారం.. మూడవ స్థానంలో ఉన్న భారత్‌లో 2021 మార్చి నాటికి 6,08,000 మంది క్లౌడ్ నిపుణులు ఉన్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 15 లక్షలకు చేరుకుంటుంది. ఆ సమయానికి డిమాండ్ 20 లక్షలుగా ఉంటుంది. పెద్ద ఎత్తున నైపుణ్య కార్యక్రమాలు చేపడితే నిపుణుల సంఖ్య నాలుగేళ్లలో 18 లక్షలకు పెరుగుతుంది. 26 శాతం వార్షిక వృద్ధితో క్లౌడ్ మార్కెట్ 2022 నాటికి రూ.41,510 కోట్లను తాకుతుంది’ అని నాస్కామ్ తెలిపింది. నివేదిక రూపకల్పనలో టీసీఎస్, యాక్సెంచర్ సహకారం అందించాయి. క్లౌడ్ సేవలకు డిమాండ్: డిజిటలీకరణ పెద్ద ఎత్తున జరుగుతుండడంతో క్లౌడ్ సేవలకు డిమాండ్ పెరుగుతోంది. మౌలిక వసతులు, అనుకూలత, తక్కువ ఖర్చుల కారణంగా క్లౌడ్ వైపు చిన్న కంపెనీలు సైతం మొగ్గు చూపుతున్నాయి. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ మరో కారణం’ అని నాస్కామ్ వివరించింది. ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ పేరుతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహకారంతో నాస్కామ్ ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం, క్లౌడ్ విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తోంది. క్లౌడ్ రంగంలో 2020లో 3,80,000 ఉద్యోగాల కోసం డిమాండ్ ఏర్పడింది. 2019తో పోలిస్తే ఇది 40 శాతం అధికం. క్లౌడ్ నైపుణ్యాల డిమాండ్ ప్రస్తుత సరఫరాను మించిపోయింది. నైపుణ్యతపై దృష్టి పెట్టాలి అని నాస్కామ్ తెలిపింది. -
ఈకామర్స్ ఫ్లాష్‌సేల్స్, కేంద్రానికి నాస్కామ్ సిఫార్సులు
న్యూఢిల్లీ: ఆన్లైన్ కంపెనీల కార్యకలాపాలకు అనుగుణంగానే వాటి బాధ్యతలను కూడా క్రమబద్ధీకరించాలని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అలాగే వినియోగదారులకు సకాలంలో రీఫండ్ అందేలా చూసేంత వరకు మాతమ్రే వాటి బాధ్యతలను పరిమితం చేయాలని పేర్కొంది. ఈ–కామర్స్ సంస్థల నిబంధనల ముసాయిదాకు సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనలపై నాస్కామ్ ఈ మేరకు తన అభిప్రాయాలు తెలియజేసింది. మోసపూరిత ఫ్లాష్ సేల్స్, ఉత్పత్తులు.. సర్వీసులను మోసపూరితంగా విక్రయించడం వంటి వాటిని నిషేధించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం జూన్ 21 ఈ నిబంధనలను ప్రతిపాదించింది. వీటిపై పరిశ్రమ వర్గాలు, ప్రజలు అభిప్రాయాలు తెలియజేయడానికి జూలై 6 ఆఖరు తేదీ అయినప్పటికీ ఆగస్టు 5 దాకా పొడిగించింది. వీటిపైనే నాస్కామ్ తాజాగా తమ అభిప్రాయాలు తెలియజేసింది. ప్రతిపాదిత నిబంధనల్లోని కొన్ని అంశాలు వినియోగదారుల రక్షణ చట్టం 2019 పరిధిలోకి కాకుండా కాంపిటీషన్ చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం పరిధిలోకి వచ్చే విధంగా ఉన్నాయని పేర్కొంది. కొన్ని కార్యకలాపాలను నిషేధించడం కాకుండా వినియోగదారుల హక్కులు కాపాడేందుకు అవసరమైతే సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) విచారణ జరిపేలా.. అనుచిత వాణిజ్య విధానాలకు సంబంధించి సూచనప్రాయంగా ఒక జాబితాలాంటిది పొందుపర్చవచ్చని నాస్కామ్ తెలిపింది. -
టాప్-5 ఐటీ కంపెనీల్లోనే 96 వేల ఉద్యోగాలు: నాస్కామ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంతో ఐటీ నిపుణులకు అవకాశాలు మెండుగా వచ్చి పడుతున్నాయని ఐటీ పరిశ్రమ వాదిస్తోంది. ఆటోమేషన్‌వల్ల ఐటీ రంగంలో ఉద్యోగులకు భారీ ఎత్తున నష్టం ఏర్పడుతోందన్న తాజా వాదనపై స్పందించిన ఐటీ పరిశ్రమ బాడీ నాస్కామ్ ప్రస్తుతం ఐటీ పప్రొఫెషనల్స్కు భారీ డిమాండ్ కనిపిస్తోందని గురువారం పేర్కొంది. ముఖ్యంగా దేశంలోని టాప్-5 ఐటీ సంస్థలు 2021-22లో 96వేలమంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నాయని తెలిపింది. 2022 సంవత్సరం నాటికి భారతీయ సాఫ్ట్వేర్ సంస్థలు 30 లక్షల ఉద్యోగాలను తొలగించబోతున్నాయని, తద్వారా సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లను ఆదా చేసుకోవాలని భావిస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదించిన తర్వాత నాస్కామ్ ప్రకటన రావడం గమనార్హం. దేశీయ ఐటీ రంగంలో 2021-22 సంవత్సరంలో నియామకాలు పుంజుకోనున్నాయని నాస్కామ వాదించింది.ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలకు ముప్పు ఉందన్న బీఓఏ వ్యాఖ్యలపై స్పందిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో, పెరుగుతున్న ఆటోమేషన్ కారణంగా సాంప్రదాయ ఐటీ ఉద్యోగాలు, పాత్రల స్వభావం మారనుందని, ఫలితంగా కొత్త ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని వ్యాఖ్యానించింది. నిపుణులకు, ప్రతిభావంతులకు డిమాండ్ బాగుందని, 2021 ఏడాదిలో 1,38,000 ఉద్యోగులను చేర్చుకుందని నాస్కామ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. టాప్-5 సంస్థలే సుమారు 96 వేల మందిని రిక్రూట్ చేసుకోబోతున్నాయని పేర్కొంది. దీంతోపాటు 2 లక్షల 50వేల మందికి పైగా ఉద్యోగుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందిస్తోందని, అలాగే 40 వేలమందిని డిజిటల్ ప్రతిభావంతులను నియమించిందని తెలిపింది. దేశంలో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) రంగంలో1.4 మిలియన్ల మంది ఉద్యోగులున్నారని నాస్కామ్ తెలిపింది. ఆటోమేషన్‌లో కీలకమైన ఐటీ-బీపీఎంలో మార్చి 2021నాటికి ఐటీ-బీపీఎంలోరంగంలో మొత్తం 4.5 మిలియన్ల మంది ఉద్యోగులున్నారని పేర్కొంది. గత 3 సంవత్సరాల్లో ఆటోమేషన్, ఆర్‌పిఎ (రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్) బీపీఎం రంగంలో ఉద్యోగాల సృష్టికి దారితీసిందని అసోసియేషన్ వివరించింది. చదవండి: కరోనా సంక్షోభం: గూగుల్ మరోసారి భారీ సాయం Edible oil: వినియోగదారులకు భారీ ఊరట -
రిటైల్ 4.0తో కోటికి పైగా కొత్త కొలువులు
న్యూఢిల్లీ: రిటైల్ రంగానికి సంబంధించి ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాలు రెండూ కలిస్తే గణనీయంగా కొత్త కొలువులు వచ్చేందుకు, ఎగుమతులనూ పెంచుకునేందుకు అవకాశం లభించనుంది. కన్సల్టింగ్ సంస్థ టెక్నోపాక్తో కలిసి దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు ఉన్నాయి. రిటైల్ 4.0 పేరిట రూపొందించిన ఈ నివేదిక ప్రకారం ఆన్లైన్ + ఆఫ్‌లైన్ విధానంతో కొత్తగా 1.2 కోట్ల మేర కొత్త కొలువులు రాగలవు. అలాగే రిటైల్ ఎగుమతులు 125 బిలియన్ డాలర్ల దాకా పెరగగలవని అంచనా. గడిచిన దశాబ్దకాలంలో భారత రిటైల్ మార్కెట్ మూడు రెట్లు వృద్ధి చెందింది. 2019–20లో భారత స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో రిటైల్ రంగం వాటా 10% దాకా ఉండగా, 3.5 కోట్ల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ‘కోవిడ్–19 అనేది ఒక అగ్నిపరీక్షలాంటిది. డిజిటల్ మాధ్యమాన్ని అందిపుచ్చుకో వడం, వేగవంతంగా ఆన్లైన్ వైపు మళ్లడం ద్వారా దేశీ రిటైల్ రంగం ఈ సంక్షోభం నుంచి మెరుగ్గానే బైటపడగలిగింది‘ అని నివేదిక పేర్కొంది. మార్కెట్ వృద్ధి..: నివేదిక ప్రకారం .. 2030 ఆర్థిక సంవత్సరం నాటికి దేశీ రిటైల్ మార్కెట్ 1.5 లక్షల కోట్ల డాలర్లకు చేరనుంది. 2.5 కోట్ల మేర కొత్త కొలువులు రానున్నాయి. ఇందులో సగభాగం వాటా ఆఫ్‌లైన్+ఆఫ్‌లైన్ విధానానిదే ఉండనుంది. 1.2 కోట్ల కొలువులు, 125 బిలియన్ డాలర్ల విలువ చేసే ఎగుమతులు దీన్నుంచి రానున్నాయి. అలాగే, మొత్తం రిటైల్ రంగం కట్టే పన్నుల్లో ఈ విభాగం వాటా 37 శాతం దాకా ఉండనుంది. సాంకేతికత ఊతం..: రాబోయే రోజుల్లో రిటైల్ రంగం వృద్ధి చెందడంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని నివేదిక ఆవిష్కరణ సందర్భంగా నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. దేశీయంగా రిటైల్ వ్యాపారానికి అనువైన పరిస్థితులు కల్పించేందుకు కేంద్రం జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని రూపొందించే ప్రయత్నాల్లో ఉందన్నారు. రిటైల్ 4.0 ప్రయోజనాలు పొం దేందుకు రిటైల్ వర్గాలతో పాటు విధాన నిర్ణేతలు, అనుబంధ పరిశ్రమలు కలిసి రావాలని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ అభిప్రాయపడ్డారు. -
విలువైన సంస్థలను సృష్టించాలి
న్యూఢిల్లీ: వేల్యుయేషన్లు, నిష్క్రమించే వ్యూహాలే లక్ష్యంగా పనిచేయకుండా .. శతాబ్దాల పాటు మనుగడ సాగించే సంస్థలను సృష్టించడంపై దృష్టి పెట్టాలని స్టార్టప్ సంస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పగలిగే ప్రపంచ స్థాయి ఉత్పత్తులను రూపొందించాలని పేర్కొన్నారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశీ మార్కెట్‌ను సంస్థలు ఎంతో విలువైన ఆస్తిగా పరిగణించాలని ప్రధాని అభివర్ణించారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వ హించిన టెక్నాలజీ, లీడర్షిప్ ఫోరం 29వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల బాలల్లో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించే విధంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాలపైనా ఐటీ కంపెనీలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కొత్త ఐడియాలకు దేశంలో కొదవ లేదని, కానీ అవి వాస్తవ రూపం దాల్చేలా సరైన మార్గంలో నడిపించే దిశా నిర్దేశకులు అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు. ఆప్టికల్ ఫైబర్ లక్ష్యాలు సాధిస్తాం.. ఇంటర్నెట్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే దిశగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్ ఏర్పాటు లక్ష్యాలు సాధించడంపై తాను వ్యక్తిగతంగా దృష్టి పెడతానని ప్రధాని తెలిపారు. అదే సమయంలో విస్తృతమైన నెట్వర్క్ ఊతంతో సమాజానికి ప్రయోజనం చేకూర్చే పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఐటీ పరిశ్రమ కృషి చేయాలని చెప్పారు. కరోనా వైరస్ కష్టకాలంలోనూ దేశీ ఐటీ రంగం అవిశ్రాంతంగా కృషి చేసిందని ఆయన కితాబిచ్చారు. నిబంధనలపరమైన అడ్డంకుల కారణంగా గతంలో భారతీయ ఐటీ పరిశ్రమ .. అనేక అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయిందని ప్రధాని చెప్పారు. దీనివల్ల డిజిటల్ అంతరాలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ ఉత్పత్తుల హబ్‌గా తీర్చిదిద్దేందుకు నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్ పాలసీని రూపొందించినట్లు ఆయన వివరించారు. కనిష్ట స్థాయి ప్రభుత్వ యంత్రాంగంతో గరిష్టంగా పాలనను అందించడంలో సాంకేతిక ఆవిష్కరణలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రధాని చెప్పారు. దూసుకెళ్తున్న భారత్ .. చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో భారత్ ముందుకు దూసుకెడుతోందని.. సరిహద్దుల్లోని పరిణామాలు, జియోస్పేషియల్ డేటా నిబంధనలను సరళతరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రిస్కులు తీసుకోగలగాలి: ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ నూతన ఆవిష్కరణలకు అంతర్జాతీయ హబ్‌గా భారత్ ఎదగాలంటే విధానాలు, రిస్కు తీసుకునే సామర్థ్యాలు, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడం వంటి అంశాలు కీలకంగా ఉంటాయని ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ అభిప్రాయపడ్డారు. మూడు ఐడియాలొస్తే ఒక్కటి మాత్రమే విజయవంతమయ్యే అవకాశం ఉంటుందని, నవకల్పనల ఆవిష్కరణల్లో ఇలాంటి రిస్కులు తప్పవని నాస్కామ్ సదస్సులో ఆయన పేర్కొన్నారు. డేటా భద్రతకు సంబంధించి నిబంధనలు, విధానాలు ఇటు దేశ ఎకానమీకి ప్రయోజనకరంగా ఉండటంతో పాటు అటు సర్వీసులు, సాఫ్ట్వేర్ ఎగుమతుల వృద్ధికి కూడా అనువైనవిగా ఉండాలని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ అనేది ఈ దశాబ్దంలోనే అత్యంత పెద్ద రిస్కని ఆయన చెప్పారు. -
అపోహలతోనే ‘హెచ్1బీ’ నిర్ణయం: నాస్కామ్
న్యూఢిల్లీ : అమెరికాలో ఉద్యోగ నియామకాల్లో అమెరికన్లకే ప్రాధాన్యమివ్వాలన్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధోరణులు భారత ఐటీ సంస్థలకు సమస్యగా మారుతున్నాయి. తాజాగా ఫెడరల్ ఏజెన్సీలు.. విదేశీ ఉద్యోగులను, ముఖ్యంగా హెచ్–1బీ వీసాలపై ఉన్నవారిని తీసుకోకుండా నిరోధించేలా ట్రంప్ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదంగా మారింది. ఇది పూర్తి అపోహలకు, తప్పుడు సమాచారంతో తీసుకున్న నిర్ణయంలాగా కనిపిస్తోందని భారత ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ వ్యాఖ్యానించింది. కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తున్న తరుణంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగవంతంగా కోలుకోవడానికి ప్రతిభావంతుల లభ్యత చాలా కీలకమని పేర్కొంది. ఇలాంటి వారిపై ఆంక్షలు విధిస్తే అమెరికా ఎకానమీ, ఉద్యోగాలు, నవకల్పనలు, పరిశోధన .. అభివృద్ధి కార్యకలాపాల రికవరీ దశ మందగించే అవకాశం ఉందని నాస్కామ్ పేర్కొంది. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, లెక్కలు (స్టెమ్) నైపుణ్యాలు గల వారి కొరత తీవ్రంగా ఉందని తెలిపింది. -
దీర్ఘకాల లాక్‌డౌన్‌తో ఐటీ ఉద్యోగాలకు ముప్పు
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్డౌన్ .. దేశీయంగా ఐటీ రంగంలో ఉద్యోగాల కోతకు దారితీయొచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ మాజీ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ చెప్పారు. పరిస్థితి మరింతగా దిగజారితే.. వెంచర్ క్యాపిటలిస్టుల పెట్టుబడులతో మనుగడ సాగిస్తున్న స్టార్టప్ సంస్థలు.. ఇంకా గడ్డుకాలం ఎదుర్కొనాల్సి వస్తుందన్నారు. ‘పెద్ద కంపెనీలు రెండు కారణాలతో ఉద్యోగాలను తక్షణమే తీయకపోవచ్చు. ఉద్యోగులను పోగొట్టుకోవడం ఇష్టం లేకపోవడం ఒకటి కాగా.. వాటి దగ్గర జీతాల చెల్లింపునకు పుష్కలంగా నిధులు ఉండటం మరో కారణం. ఒకవేళ తగ్గించుకుంటే తాత్కాలిక సిబ్బంది, ఇంటర్న్‌షిప్ చేస్తున్న వారు ఉండొచ్చు. అయితే, ఒక స్థాయికి మించి.. రెండు మూడు నెలలు దాటేస్తే ఆ కంపెనీలు కూడా ఒత్తిడి తట్టుకోలేవు’ అని అన్నారు. -
హిప్.. హిప్.. స్టార్టప్!
బెంగళూరు: స్టార్టప్ వ్యవస్థకు సంబంధించి భారత్ మూడో అతి పెద్ద దేశంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కొత్తగా 1,100 స్టార్టప్స్ ఏర్పాటయ్యాయి. దీంతో గడిచిన అయిదేళ్లలో టెక్నాలజీ అంకుర సంస్థల సంఖ్య సుమారు 8,900–9,300 స్థాయికి చేరినట్లయిందని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ మంగళవారం వెల్లడించింది. గతేడాది టెక్ స్టార్టప్‌ల సంఖ్య సుమారు 7,800–8,200 దాకా ఉంది. ఇదే ఊపు కొనసాగితే 2014–2025 మధ్య కాలంలో భారత స్టార్టప్ వ్యవస్థ 10 రెట్లు వృద్ధి నమోదు చేయగలదని పేర్కొంది.ఇక 2025 నాటికి యూనికార్న్‌ల (1 బిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు) సంఖ్య దేశీయంగా 95–105 శ్రేణిలో ఉండొచ్చని నాస్కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ తెలిపారు. 2014లో 10–20 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న స్టార్టప్ వ్యవస్థ వేల్యుయేషన్ 2025 నాటికి 350–390 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని, 10 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని ఆమె పేర్కొన్నారు. ‘భారత స్టార్టప్ వ్యవస్థ వృద్ధి ఒక అద్భుత గా«థ. ప్రభుత్వం, పరిశ్రమ మద్దతుతో మరింత వేగంగా 10 రెట్లు వృద్ధి సాధించడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి‘ అని ఘోష్ వివరించారు. 16వ నాస్కామ్ ప్రోడక్ట్ సదస్సులో కార్యక్రమంలో దేశీ టెక్నాలజీ స్టార్టప్ వ్యవస్థపై నివేదిక విడుదల చేసిన సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. స్టార్టప్‌ల కేంద్రంగా బెంగళూరు .. సంఖ్యాపరంగా అత్యధిక టెక్నాలజీ స్టార్టప్‌లతో బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ–ఎన్సీఆర్ తర్వాత స్థానంలో ఉంది. కొత్తగా వస్తున్న టెక్ స్టార్టప్‌ల్లో 12–15 శాతం సంస్థలు వర్ధమాన నగరాల నుంచి ఉంటుండటం గమనార్హం. స్టార్టప్స్‌లోకి గతేడాది 4.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. ఈ ఏడాది ఇప్పటిదాకా 4.4 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయని ఘోష్ చెప్పారు. గతేడాది 17గా ఉన్న యూనికార్న్‌ల సంఖ్య ఈసారి 24కి పెరిగిందని, ఏడాది ముగిసేలోగా మరో 2–3 కొత్తగా జతవ్వొచ్చని వివరించారు. గతేడాది టెక్ స్టార్టప్‌లు ప్రత్యక్షంగా 40,000 ఉద్యోగాలు, పరోక్షంగా 1.6 లక్షల పైచిలుకు ఉద్యోగాలు కలి్పంచాయని చెప్పారు. ఈ ఏడాది 60,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 1.3–1.8 లక్షల పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగిందని ఘోష్ వివరించారు. దేశీ స్టార్టప్‌లకు మార్కెట్, నిధుల లభ్యతపరమైన సవాళ్లు ఉంటున్నాయని చెప్పారు. -
కృత్రిమ మేథో సంవత్సరంగా 2020
సాక్షి, హైదరాబాద్: ‘కృత్రిమ మేథస్సు సంవత్సరం’గా 2020ను ప్రకటిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. వ్యవసాయం, పట్టణ రవాణా, ఆరోగ్య రక్షణ రంగాల్లో కృత్రిమ మేథస్సు వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నాస్కామ్ అధ్యక్షురాలు దేవయాని ఘోష్ తో ప్రగతిభవన్‌లో శుక్రవారం కేటీఆర్ భేటీ అయ్యారు. వచ్చే ఏడాది పొడవునా కృత్రిమ మేథస్సు అంశంపై అనేక కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. నూతన సాంకేతికతలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవను దేవయానికి కేటీఆర్ వివరించారు. డేటా సైన్సెస్‌లో యువతకు శిక్షణ ఇవ్వడంలో ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై దేవయాని హర్షం వ్యక్తం చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరక్టర్ రమాదేవి, డిజిటల్ మీడియా డైరక్టర్ కొణతం దిలీప్ సమావేశంలో పాల్గొన్నారు. -
క్రిప్టోకరెన్సీ చట్టవిరుద్ధం: నాస్కామ్
బెంగళూరు: బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీ వినియోగం చట్టవిరుద్ధమని, దేశీ చట్టాలను గౌరవించాల్సి ఉంటుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ప్రెసిడెంట్ దేబ్జాని ఘోష్ వ్యాఖ్యానించారు. యూనోకాయిన్ పేరిట బెంగళూరులో తాజాగా దేశంలోనే తొలి బిట్‌కాయిన్ ఏటీఎం ఏర్పాటుకావడం.. ఆ సంస్థ వ్యవస్థాపకుడు సాత్విక్ విశ్వనాథ్, సహ వ్యవస్థాపకుడు హరీశ్ బీవీలను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేయడంపై స్పందించిన ఆమె, క్రిప్టోకరెన్సీ ఉపయోగంలో ఉన్నటువంటి సానుకూల అంశాలను వివరించి ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయాలి తప్పించి చట్టాల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సరైనది కాదని అన్నారు. -
నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేవయాని ఘోష్
న్యూఢిల్లీ: భారత్ ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేవయాని ఘోష్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమె ఇంతకుముందు ఇంటెల్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. ఆర్.చంద్రశేఖర్ స్ధానాన్ని ఇప్పుడు దేవయాని భర్తీ చేశారు. ‘ప్రస్తుత డిజిటల్ గ్లోబలైజేషన్ యుగంలో ఐటీ పరిశ్రమకే అధిక ప్రాధాన్యత ఉంది. ఈ పరిశ్రమ మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి కృషి చేస్తాం. దీనికోసం అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం’ అని దేవయాని తెలిపారు. దేశంలోని వివిధ పరిశ్రమల డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఐటీ–బీపీఎం కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో దేవయాని ఘోష్ బాధ్యతలు చేపట్టారు. -
ఐటీలో కొత్తగా లక్ష ఉద్యోగాలు -నాస్కామ్
సాక్షి, హైదరాబాద్: ఐటీ పరిశ్రమ విభాగం సంస్థ నాస్కామ్ 2017-18 ఐటీ రిపోర్ట్ ను విడుదల చేసింది. వరుసగా రెండవ సంవత్సరం ఐటీ పరిశ్రమ వృద్ది ఫ్లాట్‌గా ఉందని, అయితే రాబోయే ఏడాదికి పరిస్థితి మెరుగ్గా ఉంటుందని తెలిపింది. వచ్చే ఏడాదికి ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు 7-8శాతంగా ఉంటుందని అంచనా వేసింది. 2019 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ 10-12 శాతం ఆదాయాన్ని అంచనా వేసినట్టు నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ ప్రకటించారు. నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం 30 శాతం వాటాతో 2017-18లో ఐటి సేవల మొత్తం ఆదాయంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ విభాగం నిలవగా ఇంజనీరింగ్, ఆర్ అండ్ డి 13 శాతం, వ్యాపార ప్రక్రియ నిర్వహణ 8 శాతంతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఐటీ, ఐటీ సంబంధిత రంగాల్లో కొత్తగా లక్ష ఉద్యోగాలు వస్తాయనీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ ద్వారా ఇది సాధ్యమవుతుందని చెప్పింది. అయితే ఈ వృద్ధి అంచనా వేసిన దాని కంటే 50శాతం తక్కువని వెల్లడించింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో 7-9 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. 2018-19 నాటికి 10-12 శాతం వృద్దితో 167 బిలియన్ డాలర్స్ ఆదాయం సాధించ వచ్చన్నారు. భారతదేశ మొత్తం ఎగుమతుల్లో 24శాతం ఐటీ ఎగుమతులే. డిజిటల్ బిజినెస్1.5-2శాతం వృద్ధిని నమోదు చేయనుండగా, దేశీయంగా ఇది రెండంకెల వృద్ధిని కొనసాగిస్తుందని చెప్పింది. కాగా గత జూన్‌లో నాస్కామ్ 2018 ఆర్థిక సంవత్సరానికి ఫ్లాట్ వృద్ధి రేటును అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు ఆదాయాలు కేవలం 7.6 శాతం మాత్రమే పెరిగాయి. దేశీయ ఆదాయం 10-11 శాతం పెరిగింది. అయితే పరిస్థితి ఆశాజనకంగా ఉందనీ, ట్రెండ్ పాజిటివ్‌గానే ఉండటంతో మంచి వ్యాపార అవకాశాలు లభించనున్నాయని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. దీంతో స్టాక్మార్కెట్లో ఐటీ రంగ షేర్లు బాగా లాభపడుతున్నాయి. -
అలా చేస్తే అమెరికాకే దెబ్బ: నాస్కామ్
బెంగళూరు : గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న హెచ్-1బీ వీసాదారులకు వారి వీసాలను పొడిగించకుండా డొనాల్డ్ ట్రంప్ కార్యాలయం తీసుకొస్తున్న నిబంధనలు అమెరికాను భారీగా దెబ్బతీయనున్నట్టు ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ పేర్కొంది. ఒకవేళ ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తే, కేవలం దేశీయ ఐటీ నిపుణులపై ప్రతికూల ప్రభావం చూపడం మాత్రమే కాకుండా... అమెరికా పోటీతత్వంపై భారీగా ప్రభావం చూపనుందని తెలిపింది. నిబంధనల్లో అకస్మిక మార్పుల తీసుకొస్తే అమెరికాలో ప్రతిభావంతులైన నిపుణులు తగ్గిపోనున్నారని పేర్కొంది. స్థానిక నియామకం కూడా కష్టతరమవుతుందని వివరించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమేటిక్స్(ఎస్టీఈఎం) స్కిల్స్ ఉన్న వారు అమెరికాలో తక్కువగా ఉన్నారని, ఈ కారణంతోనే బహుళ జాతీయ కంపెనీలు వేలమంది ప్రతిభావంతులైన ఉద్యోగులను హెచ్-1బీ వీసాలపై అమెరికాకు తీసుకెళ్తున్నాయని నాస్కామ్ తెలిపింది. ''అమెరికాలో చాలా ఎక్కువగా నిపుణుల కొరత ఉంది. ఎస్టీఈఎం ఉద్యోగాల్లో ఖాళీ ఉన్న రెండు మిలియన్లలో, ఒక మిలియన్ ఉద్యోగాలు ఐటీకి చెందినవే. ప్రస్తుతం ట్రంప్ కార్యాలయం తీసుకుంటున్న చర్యలన్నీ, అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనున్నాయి. స్కిల్ గ్యాప్‌నూ పూరించలేదు. ఈ అంశాలన్నింటిన్నీ పరిగణలోకి తీసుకుని ట్రంప్ కార్యాలయం నిర్ణయం తీసుకోవాలి'' అని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ చెప్పారు. మరోవైపు ట్రంప్ కార్యాలయం తీసుకొస్తున్న ఈ నిబంధనలపై కోర్టుకు ఎక్కాలని టెక్ దిగ్గజాలు చూస్తున్నాయి. కేవలం దేశీయ ఐటీ కంపెనీలు మాత్రమేకాక, అమెరికా టెక్ దిగ్గజాలు గూగుల్, ఐబీఎంలు కూడా తీవ్రంగా ప్రభావితం కానున్నట్టు తెలుస్తోంది. ఈ కంపెనీల్లో పనిచేసే చాలా మంది హెచ్-1బీ వీసా ఉద్యోగులు, దశాబ్దం కింద నుంచి గ్రీన్ కార్డుల కోసం వేచిచూస్తున్నారని నిపుణులు చెప్పారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యోగులను కాపాడుకోవడానికి అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కంపెనీలు దావా దాఖలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. -
ఆ డీల్‌తో మన సత్తా చాటాం
సాక్షి, బెంగళూర్: భారత ఐటీ పరిశ్రమ సత్తాపై అంతర్జాతీయ విపణిలో విశ్వాసం కొనసాగుతోందని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ అన్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ నీల్సన్‌తో టీసీఎస్ ఒప్పందం భారత ఐటీ పరిశ్రమ పట్ల క్లెయింట్ల విశ్వాసం చెక్కుచెదరలేదని నిరూపించిందని చెప్పారు. తమ సాంకేతిక పనుల కోసం భారత ఐటీ పరిశ్రమపై ఆధారపడిన అంతర్జాతీయ సంస్థలు తమ డిజిటల్ కార్యకలాపాలనూ భారత్‌కే ఆఫర్ చేయడం కొనసాగిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సంప్రదాయ టెక్నాలజీలపై వెచ్చించే భారత ఐటీ పరిశ్రమ క్లెయింట్లు క్రమంగా డిజిటల్ కార్యకలాపాలను భారత కంపెనీలకు మళ్లిస్తారని అభిప్రాయపడ్డారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి నూతన టెక్నాలజీలపై సేవలు అందించేందుకు భారత ఐటీ సేవల పరిశ్రమ సంసిద్ధంగా ఉందన్నారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర వంటి కంపెనీలు గత ఏడాది తమ ఆదాయాల్లో 17 నుంచి 22 శాతం డిజిటల్ టెక్నాలజీ సేవల ద్వారానే ఆర్జించాయి. -
ఉద్యోగుల తొలగింపులో పారదర్శకత ఉండాలి
నాస్కామ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ చెన్నై: ఏ ఉద్యోగినైనా తొలగించాల్సి వచ్చినప్పుడు ఐటీ కంపెనీలు కటువుగా కాకుండా పారదర్శకంగా, సున్నితంగా వ్యవహరించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ చెప్పారు. ఇటీవల ఓ ఐటీ కంపెనీలో ఉద్వాసనకు గురైన ఉద్యోగితో మానవ వనరుల విభాగం సిబ్బంది కటువుగా వ్యవహరించిన ఆడియో లీకైన ఉదంతంపై స్పందిస్తూ చంద్రశేఖర్ ఈ విషయం చెప్పారు. ఎవరూ ఉద్యోగాలు కోల్పోవాలని తాము కోరుకోమని, కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. ఏ ఒక్క సంస్థ గురించో ప్రత్యేకంగా తాను మాట్లాడబోనని,∙కంపెనీలు ఇలాంటి సందర్భాల్లో సున్నితత్వంతోనూ, పారదర్శకంగా, నేర్పుగా వ్యహరించాలని చంద్రశేఖర్ తెలిపారు. ‘పరిస్థితులు అత్యంత వేగంగా మారిపోతున్న ప్రస్తుత తరుణంలో ఏ కంపెనీ కూడా మా పాలసీ ఇదే.. మరో పదేళ్లయినా.. ఇరవై ఏళ్లయినా ఇలాగే ఉంటుందంటూ భీష్మించుకుని కూర్చునే పరిస్థితి లేదు‘ అని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపర్చాలి ఐటీ రంగం మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తున్నప్పటికీ .. సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడం పరిశ్రమకు ముఖ్య అవసరంగా మారుతోందని చంద్రశేఖర్ చెప్పారు. ఆటోమేషన్తో ఉద్యోగాలకు కోత పడినా.. పరిశ్రమ అధిక స్థాయిలో వృద్ధి చెందుతున్న పక్షంలో నికరంగా ఉద్యోగాల కల్పన పెరుగుతూనే ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఇదే∙పరిస్థితి ఉందని.. ఉద్యోగాల కోత కన్నా ఎక్కువగా ఉద్యోగాల కల్పన జరుగుతోందని వివరించారు. -
ఈ ఏడాది ఐటీ రంగం వృద్ధి 8 శాతమే!
♦ గతేడాది 7.5 శాతం; 1.5 లక్షల ఉద్యోగ అవకాశాలు ♦ జపాన్, చైనా, ఆఫ్రికా ఐరోపా దేశాలకు విస్తరణ: నాస్కామ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఐటీ ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం (2017–18)లో స్వల్ప పెరుగుదలతో 8 శాతానికి చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. అయితే దేశీయ ఐటీ విపణి మాత్రం 10–11 శాతం మేర వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. ‘‘2017–18 ఆర్ధిక సంవత్సరంలో ఐటీ–బీపీఎం రంగాల్లో కొత్తగా 1.3–1.5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలొస్తాయని.. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ నికర నియామకాలు 1.7 లక్షలుగా ఉందని’’ నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. అమెరికా హెచ్1బీ వీసాపై ఆంక్షలు, బ్రెగ్జిట్ ఇతర అంతర్జాతీయ మార్కెట్లో రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు ఇందుకు కారణమని.. స్థానిక ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఖర్చులు, అలాగే గతేడాది ఐటీ కంపెనీల పనితీరును వంటిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు ఐటీ రంగం సానుకూలంగా ఉంటుందని ఆయన వివరించారు. దేశీయ ఐటీ పరిశ్రమ పరిమాణం 154 బిలియన్ డాలర్లని.. గత ఆర్థిక సంవత్సరంలో 11 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిందని తెలియజేశారు. కొత్త భౌగోళికాలకు విస్తరణ.. బ్యాంకింగ్, ఆర్థిక, హెల్త్‌కేర్ వంటి అన్ని రంగాలు అనిశ్చితిలో ఉన్నాయని.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోవటంలో జాప్యం కారణంగా ఐటీ రంగంలోనూ అవకాశాలు సన్నగిల్లాయని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం దేశీయ ఐటీ పరిశ్రమలో డిజిటల్ విప్లవం నడుస్తోంది. ప్రస్తుతమున్న 15–20 లక్షల మంది ఐటీ నిపుణులు తమ నైపుణ్యాలకు సానబెట్టి.. భవిష్యత్తు అవసరాలకు సిద్ధంగా ఉండాలి’’ అని చంద్రశేఖర్ సూచించారు. భారత ఐటీ పరిశ్రమ 80%కి పైగా అమెరికా, యూకే వంటి దేశాలపై ఆధారపడి ఉంది. కొత్తగా ఐరోపా, జపాన్, చైనా, ఆఫ్రికా వంటి కొత్త భౌగోళిక ప్రాంతాల్లో విస్తరిస్తుందని పేర్కొన్నారు. -
టెకీలకు మరో హెచ్చరిక
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగ ఉద్యోగాల విషయంలో ప్రతిష్టంభన నెలకొన సంగతి తెలిసిందే. ఆటోమేషన్, కొత్త డిజిటల్ టెక్నాలజీస్ పెనుముప్పుగా విజృంభిస్తుండటంతో కంపెనీలు ఉద్యోగులపై భారీగానే వేటు వేస్తున్నాయి. అంతేకాక భవిష్యత్తులోనూ ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా? అనే దానిపైన గ్యారెంటీ లేదు. ఈ సవాళ్లు భారత్ కు అతిపెద్ద సవాల్ గా ఉన్నాయని, దేశీయ ఐటీ కంపెనీలు తమ స్టాఫ్ ను రీ-ట్రైన్ చేయడం చాలా కష్టతరమని హెచ్చరికలు వస్తున్నాయి. 1.5 మిలియన్ మందిని లేదా ఇండస్ట్రీ వర్క్ ఫోర్స్ లో సగం మందిని రీ-ట్రైన్ చేయాల్సినవసరం ఉందని ఇటీవల ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ పేర్కొంది. కానీ ప్రస్తుతం నాస్కామ్, కన్సల్టింగ్ సంస్థ క్యాప్‌జెమినీతో కలిసి చేసిన అంచనాల్లో, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కొత్త స్కిల్-సెట్ లలో మధ్య, సీనియర్ స్థాయి దేశీయ ఐటీ కార్మికులు ఇమడలేరని తెలిపాయి. దీంతో మధ్యస్థాయి, సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో కోత ప్రభావం అధికంగా ఉంటుందని తాజాగా హెచ్చరించాయి. తాను నిరాశాపూరిత విషయాన్ని చెప్పడం లేదని, కానీ ఇది ఎంతో సవాలుతో కూడుకున్న విషయమని క్యాప్‌జెమినీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్ కందుల చెప్పారు. 60-65 శాతం మంది శిక్షణ పొందలేరని పేర్కొన్నారు. వీరిలో చాలామంది మధ్యస్థాయి నుంచి సీనియర్ స్థాయి వరకున్న వారేనని తెలిపారు. దీంతో వారు అత్యధికంగా నిరుద్యోగులుగా మారే అవకాశముందని చెప్పారు. ఐటీ కంపెనీలు కూడా మధ్యస్థాయి ఉద్యోగులకు ఎక్కువ వేతనాలు ఇచ్చే బదులు ఎక్కువ ప్రతిభావంతులనే తమ కంపెనీలో ఉంచుకోవడానికి మొగ్గుచూపుతాయని పేర్కొన్నారు. మధ్యస్థాయి ఉద్యోగులు కొత్త స్కిల్-సెట్లలో ఇమిడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, దీంతో వారు ఉద్యోగాల కోత బారిన పడతారని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. తక్కువ స్థాయి స్టాఫ్ కు లేదా కార్మికులకు తేలికగా కంపెనీ రీట్రైన్ చేస్తాయని చెప్పాయి. -
ఐటీ పరిశ్రమకు ఢోకా లేదు: నాస్కామ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీయుల వలసలపై కఠిన ఆంక్షలు విధించడం, ఆటోమేషన్ ఊహించని దానికన్నా వేగంగా విస్తరిస్తుండడం, మూకుమ్మడి లేఆఫ్‌లంటూ వదంతులు వ్యాపించడంతో 15,000 కోట్ల డాలర్ల భారతీయ ఐటి పరిశ్రమ వణుకుతోంది. దీనిపై అపోహలు తొలగించేందుకు నాస్కామ్ ప్రయత్నిస్తోంది. ఆటోమేషన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు నైపుణ్యాన్ని పెంచుకున్నట్లయితే ఐటీ పరిశ్రమకు కూడా ఢోకా ఏమీ లేదని చైర్మన్ రామన్ రాయ్ తెలిపారు. 2018 ఆర్థిక సంవత్సరాని భారత్‌లో కొత్తగా 1,50,000 ఐటీ ఉద్యోగులు పెరుగుతారని నాస్కామ్ అంచనా వేసింది. గతేడాది 1,70,000 ఐటీ ఉద్యోగులు పెరిగారని, దానితో పోలిస్తే తగ్గే ఉద్యోగాలు 20 వేలు మాత్రమేనని తెలిపింది. 2025 సంవత్సరం నాటికి ఐటీ పరిశ్రమ 35,000 కోట్ల డాలర్లకు కూడా పెరుగుతుందన్నది అంచనా. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగ లక్ష్యాలను సవరించుకుంటే ఐటీ పరిశ్రమలో లేఆఫ్‌లు ఉండవని బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో కలసి పనిచేస్తున్న నాస్కామ్ తెలిపింది. ఏ కంపెనీ కూడా అనుభవజ్ఞులైన ఉద్యోగులను వదులుకోదని ఐటీలో ఐదవ పెద్ద కంపెనీ అయిన టెక్ మహేంద్ర సీఈవో సీపీ గుర్నానీ కూడా స్పష్టం చేశారు. పనితీరు, సామర్థ్యంలేని కారణంగా ఉద్యోగాలు పోయే వారి సంఖ్య కూడా రానున్న సంవత్సరంలో 0.5 శాతం నుంచి 3 శాతానికి మధ్యనే ఉంటుందని నాస్కామ్ తెలిపింది. -
టెకీలకు నాస్కామ్ కొత్త మంత్రం
న్యూఢిల్లీ : ఐటీ ఇండస్ట్రీలో పొంచుకొస్తున్న ఆటోమేషన్ ప్రభావంతో ఉద్యోగుల్లో తీవ్ర ఒత్తిళ్లు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ టెకీలకు కొత్త మంత్రం ఉపదేశిస్తోంది. నిరంతరం రీస్కిలింగ్ చేసుకోవాలని లేదా నిష్క్రమించడానికి సన్నద్దమై ఉండాలని నాస్కామ్ చెబుతోంది. ప్రస్తుతం టెక్ ఇండస్ట్రిలో ఉన్న కొత్తమంత్రం ఇదేనని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖరన్ చెప్పారు. ఇప్పటివరకున్న ఐటీ ప్రొఫిషినల్స్ లో 40 శాతం మంది తప్పనిసరిగా రీ-స్కిల్ చేసుకోవాల్సినవసరం ఉందని నాస్కామ్ పేర్కొంది. అంటే 40 లక్షల మంది వర్క్ ఫోర్స్ తమకు తాముగా రీస్కిల్ చేసుకుని, మారుతున్న మార్పులకు ఎదురొడ్డి పోరాడల్సిందే. స్కిల్స్ ను అప్ గ్రేట్ చేసుకోవడంతో ఉద్యోగ పోయే ప్రమాద స్థాయిని తక్కువ చేసుకోవచ్చని నాస్కామ్ తెలిపింది. ఆటోమేషన్ వంకతో ఇటీవల ఐటీ ఇండస్ట్రిలో భారీగా ఉద్యోగాల కోత చేపడుతున్న సంగతి తెలిసిందే. టెకీలు ఎక్కువ మొత్తంలో స్కిల్ అప్ గ్రేడేషన్ చేపట్టాల్సి ఉందని నాస్కామ్ బాడీ చైర్మన్ ప్రమన్ రాయ్ కూడా చెప్పారు. వర్చ్యువల్ రియాల్టి, అగ్మెంటెడ్ రియాల్టి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త టెక్నాలజీల గురించి ఎప్పడికప్పుడూ అప్ గ్రేడ్ అవుతుండాలని సూచించారు. ముందస్తు కంటే ప్రస్తుతం చాలా వేగవంతంగా రీ-స్కిల్ చేసుకోవాల్సినవసరం ఉందని టెక్ మహింద్రా సీఈవో సీపీ గుర్నాని చెప్పారు. ఆటోమేషన్, కొత్త టెక్నాలజీల నుంచి సవాళ్లు ఎదురవుతున్నా.. దేశీయ ఐటీ ఇండస్ట్రి బలంగానే ఉంటుందని, కొత్త ఉద్యోగాల సృష్టి జరుపుతుందని తెలిపారు. ఐటీ ఇండస్ట్రిలో ఎలాంటి ఆందోళన లేదని, భారీగా ఉద్యోగాల కోత నిజం కాదని తెలిపారు. వచ్చే మూడేళ్లలో ఆరులక్షల కొత్త ఉద్యోగాలను కల్పించనున్నట్టు చెప్పారు. -
ఈ యాప్ స్పెషల్ గా టెకీలకే..
బెంగళూరు : ఇటీవల ఐటీ ఇండస్ట్రీలో నెలకొన్న ఉద్యోగాల కోతతో చాలామంది టెకీలు జాబ్స్ ఎలా దొరుకుతాయోనని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలకే ఐటీ ఇండస్ట్రి తిరోగమనంలో ఉంది, జాబ్ పోతే, మరో ఉద్యోగం ఎలా వెతుకోవాలా? అని సతమతమవుతున్నారు. టెకీల ఆందోళనను గమనించిన ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్, వారికి సాయం చేయడం కోసం ప్రత్యేకంగా ఓ యాప్ తీసుకొచ్చింది. 'స్టార్టప్ జాబ్స్' పేరిట ఈ యాప్ ను లాంచ్ చేసింది. ఎక్కడ ఖాళీలున్నా ఈ యాప్ వెంటనే టెక్నాలజీ ప్రొఫిషనల్స్ కు అలర్ట్ లను పంపిస్తుంది. టెక్నాలజీ, సేల్స్, మార్కెటింగ్ ఆపరేషన్స్ లాంటి స్టార్టప్స్ లో ఎంపికచేసిన జాబ్ ఓపెనింగ్స్ ను ఈ యాప్ ఆఫర్ చేస్తోంది. అభ్యర్థులు ఈ యాప్ లో తమ వీడియో ప్రొఫైల్స్ అప్ లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. దీంతో కంపెనీలు అభ్యర్థులు ప్రొఫైల్స్ ను చూసి, ఇంటర్వ్యూకు పిలువవచ్చు. కంపెనీలు తమ ప్రొఫైల్స్ ను చూసిన తర్వాత వెంటనే స్టేటస్ అప్ డేట్లను కూడా అభ్యర్థులు పొందుతారు. బెంగళూరుకు చెందిన హెచ్ఆర్ టెక్ స్టార్టప్ ఈ-పోయిస్ సిస్టమ్స్ ఈ యాప్ ను అభివృద్ది చేసింది. లండన్ బిజినెస్ స్కూల్ అల్యూమినీ సచిన్ అగర్వాల్, బిశాన్ సింగ్ ఈ స్టార్టప్ ను స్థాపించారు. హెచ్‌పీ, సిమెన్స్, ఫ్లిప్ కార్ట్, ఫస్ట్ సోర్స్, ఓలా, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, రిలయన్స్ దీనికి కస్టమర్లు. ఈ క్లిష్టతరమైన మార్కెట్లో తమకు నెప్పే ఉద్యోగాలను వెతుకోవడంలో ఈ యాప్ టెకీలకు ప్రత్యామ్నాయ మార్గమని 10వేల స్టార్టప్ కార్యక్రమ అధినేత కేఎస్ విశ్వనాథన్ చెప్పారు. -
అమెరికాపై నాస్కామ్ కౌంటర్ అటాక్
హెచ్-1బీ వీసాలను ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీలు అక్రమంగా కైవసం చేసుకుంటున్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ తిప్పికొట్టింది. ఈ రెండు కంపెనీలకు కేవలం 8.8 శాతం అంటే 7,504 వీసాలు మాత్రమే 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఆమోదమయ్యాయని నాస్కామ్ సోమవారం పేర్కొంది. టాప్ 20 హెచ్-1బీ గ్రహీతల్లో భారత కంపెనీలు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయని కూడా నాస్కామ్ తెలిపింది. వీసా లాటరీ సిస్టమ్ దుర్వినియోగపరుస్తూ దేశీయ టాప్ టెక్ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రోలు ఎక్కువగా లబ్ది పొందుతాయని అమెరికా ఆరోపించిన సంగతి తెలిసిందే. మూడు టాప్ హెచ్-1బీ వీసాల గ్రహీతల్లో టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ కంపెనీలే ఉన్నాయని వైట్ హౌస్ పేర్కొంది. అమెరికా డేటాపై నాస్కామ్ కౌంటరిచ్చింది. మొత్తం ఆమోదమయ్యే హెచ్-1బీ వీసాలలో 20శాతం కంటే తక్కువే భారత ఐటీ కంపెనీలకు దక్కుతున్నాయని తెలిపింది. అమెరికా వర్క్ ఫోర్స్‌లోని కంప్యూటర్ సైన్స్ దిగ్గజాల్లో సప్లై, డిమాండ్ల మధ్య విపరీతమైన కొరత ఏర్పడుతుందని కూడా నాస్కామ్ పేర్కొంది. ముఖ్యంగా క్లౌడ్, బిగ్ డేటా, మొబైల్ కంప్యూటింగ్లలో ఈ కొరత ఎక్కువగా ఉందని వివరించింది. దేశీయ ఐటీ సర్వీసు కంపెనీల్లో తాత్కాలిక వీసాపై పనిచేసే భారత ఐటీ నిపుణులు మొత్తం 158 మిలియన్ మెంబర్ల అమెరికా వర్క్ ఫోర్స్ లో కేవలం 0.009 శాతమేనని వెల్లడించింది. వీసా హోల్డర్ల కనీసం వేతనం 82వేల డార్లకు పైనే ఉందని, ఇంకా ఫిక్స్డ్ వ్యయాలు 15వేల డాలర్లు ఉంటాయని తెలిపింది. అయితే ఈ మూడు కంపెనీల్లో హెచ్1బీ వీసా హోల్డర్లకు ఏడాదికి సగటు వేతనం 60,000 నుంచి 65,000 డాలర్ల మధ్య ఉందని అమెరికా పేర్కొంటోంది. కార్మిక శాఖ నిర్దేశించిన వేతనాలకు అనుగుణంగా కేవలం 5–6% హెచ్1బీ వీసా హోల్డర్లే వేతనాలను పొందుతున్నారని అమెరికా ఆరోపిస్తోంది. హెచ్-1బీ వీసాలపై కంపెనీలు తాత్కాలికంగా భారత ఉద్యోగులను అమెరికాలోని తమ కంపెనీల్లో పనిచేయడానికి నియమించుకుంటున్నాయి. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హెచ్-1బీ వీసాలు దుర్వినియోగమవుతున్నాయనే ఆరోపణలు అత్యధికమయ్యాయి. ఐటీ కంపెనీలకు భారీగా షాకిస్తూ ట్రంప్ హెచ్-1బీ వీసాల కఠినతరంపై బై అమెరికన్, హైర్ అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై కూడా సంతకం చేశారు. -
వీసాల లొల్లి: లాబీయింగ్ ఖర్చు 2.8 కోట్లు
హెచ్1 బీ వీసాలో తీసుకొస్తున్న కఠినతరమైన నిబంధనలతో దేశీయ ఐటీ కంపెనీలకు కంటిమీద కునుకు లేదనే చెప్పొచ్చు. వీసా నిబంధనల్లో కొత్త ప్రతిపాదనలు మొదలైనప్పటి నుంచి కంపెనీలు ఆందోళనలు వ్యక్తంచేస్తూనే ఉన్నాయి. దేశీయ ఐటీ కంపెనీల ఆందోళలనకు స్పందించిన ఇండస్ట్రీ బాడీ నాస్కామ్, విదేశాంగమంత్రిత్వ శాఖ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమెరికా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాయి. కానీ ట్రంప్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ తో లాబీయింగ్ కోసం ఐటీ బాడీ నాస్కామ్ సుమారు 2.8 కోట్ల రూపాయలను వెచ్చించినట్టు తెలిసింది. 2013 నుంచి ఇదే అత్యధిక మొత్తమని ఇండస్ట్రి వర్గాలంటున్నాయి. 2003 నుంచి నాస్కామ్, అమెరికా లాబీయింగ్ సంస్థ హిల్ సేవలను వాడుకుంటూ, అమెరికా కాంగ్రెస్ తో లాబీయింగ్ చర్చలు జరుపుతూ ఉంది. దేశీయ ఐటీ ఇంజనీర్లకు నిబంధనలు సరళీకరం చేసేందుకు నాస్కామ్ ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అమెరికాకు 45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి వచ్చిన తర్వాత హెచ్1బీ వీసాలపై ఆందోళన మరింత ఎక్కువైన సంగతి తెలిసిందే. అమెరికానే ఫస్ట్, అమెరికాను మళ్లీ గ్రేట్ గా రూపొందించడానికి ఉద్యోగాలు మళ్లీ వెనక్కి తీసుకొస్తానంటూ ట్రంప్ వాగ్ధానాలు చేశారు. ఈ వాగ్ధానాల మేరకు ఆయన మరింత దూకుడుగా వ్యవహరిస్తూ ఇప్పటికే పలు వివాదాస్పద ఆర్డర్లపై సంతకాలు చేశారు. హెచ్-1బీ వీసా ప్రొగ్రామ్ లో ప్రతిపాదిస్తున్న కొత్త సంస్కరణలు కూడా ఈ కోవకు చెందినవే. ఈ ప్రతిపాదనలకు ట్రంప్ నుంచి స్ట్రాంగ్ మద్దతు ఉందని తెలుస్తోంది. అయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వల్ల అమెరికాకే లాభమని నాస్కామ్ వాదిస్తోంది. -
నాస్కామ్ కొత్త చైర్మన్‌గా రామన్ రాయ్
వైస్ చైర్మన్‌గా రిషద్ ప్రేమ్‌జీ నియామకం న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ కొత్త చైర్మన్‌గా రామన్ రాయ్ నియమితులయ్యారు. క్వాట్రో సీఎండీగా ఉన్న ఈయన 2017–18 ఆర్థిక సంవత్సరానికి గానూ నాస్కామ్ చీఫ్‌గా కొనసాగుతారు. అలాగే నాస్కామ్ వైస్ చైర్మన్‌గా రిషద్ ప్రేమ్‌జీ ఎంపికయ్యారు. అజీమ్ ప్రేమ్‌జీ కుమారుడైన ఈయన విప్రో చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో నాస్కామ్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన రామన్ రాయ్ నేటి నుంచి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కాగా టెక్ మహీంద్రా ఎండీ, సీఈవో అయిన సి.పి.గుర్నానీ నుంచి రామన్ రాయ్ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక నాస్కామ్ ప్రెసిడెంట్‌గా ఆర్.చంద్రశేఖర్ ఉన్నారు. -
నాస్కామ్ అంచనాలపై ట్రంప్ ఎఫెక్ట్
ఐటి పరిశ్రమ యొక్క అత్యున్నత కమిటీ నాస్కామ్ తొలిసారి వెనకడుగు వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ పరిశ్రమపై అంచనాలపై దూరంగా జరిగింది. నాస్కామ్ ఏర్పాటైన 25 సంవత్సరాల చరిత్రలో మొదటిసారి ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా అమెరికా, యూరప్ లో రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో 2018 ఆర్థిక సంవత్సర అంచనాలపై ప్రధానంగా సాఫ్ట్వేర్ ఎగుమతులపై ఆధారపడే ఐటీ పరిశ్రమ మందగింపు ప్రభావంతో ఈ వైఖరి తీసుకుంది. నాస్కామ్ ఇండియా లీడర్ షిప్ ఫోరం వార్షిక సమావేశాల సందర్బంగా మీడియాతో మాట్లాడిన నాస్కామ్ ఈ వ్యాఖ్యలు చేసింది. పరిశ్రమలో తాత్కాలికంగా పరిస్థితి అనిశ్చితంగా ఉందని పేర్కొంది. తమ నిపుణుల గణాంకాలు ఆధారంగా 6-10 శాతం వృద్ధి సలహా ఇచ్చినప్పటికీ వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నట్టు చెప్పారు. మరో క్వార్టర్ వరకు తమ గైడెన్స్ అంచనాలను వాయిదా వేసుకున్నట్టు నాస్కాం ఛైర్మన్ సీపీ గుర్నాని తెలిపారు. అనేక అనిశ్చితుల నేపథ్యంలో ఐటీ పరిశ్రమ ప్రభావితమైనట్టు తెలిపారు. ఈ క్రమంలో తరువాతి త్రైమాసికంలో మాత్రమే అంచనాలను అందివ్వగలమని చెప్పారు. వినియోగదారులు, ఇతర వాటాదరారులతో లోతుగా చర్చించిన అనంతరం అపూర్వమైన నిర్ణయం తీసుకున్నట్టు నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ చెప్పారు. ఐటీ, బిజనెస్ ప్రాసెస్ మేనేజ్ మెంట్ సెక్టార్ల తరువాతి త్రైమాసికానికి సంబంధించిన అంచనాలను బహుశా మే నెలలో అందిస్తామన్నారు. సాంకేతిక రంగంలో జరుగుతున్న డిజిటల్ వార్ కారణంగా ఐటీ సెక్టార్ నైపుణ్యతలను పెంచుకోవాలని చెప్పారు. సుమారు 1.5 కోట్ల ఉద్యోగులకి తదుపరి రెండు మూడు సంవత్సరాల్లో నైపుణ్యత శిక్షణ కావాలన్నారు. మరోవైపు 2017 ఆర్థిక సంవత్సరానికి ఐటీ పరిశ్రమ వృద్ధి8.6 శాతం ఉండనుందని అంచనా. దీనిలో 12-15 శాతం ఐటి రంగంలో చోటుచేసుకోనున్న డిజిటల్ రంగానిదేనని విశ్లేషించారు. కాగా ఐటీ పరిశ్రమ గైడెన్స్‌పై 10-12 శాతంగా నిర్ణయించిన నాస్కామ్ తన అంచనాలను గత డిసెంబర్లో సవరించిన సంగతి తెలిసిందే. -
వీసా ఆందోళనలు : రంగంలోకి మంత్రి
న్యూఢిల్లీ : హెచ్-1బీ వీసాపై రేకెత్తిన ఆందోళనల నేపథ్యంలో వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రంగంలోకి దిగనున్నారు. అమెరికా వీసా విధానంపై టెక్ పరిశ్రమల సమాఖ్య నాస్కామ్తో త్వరలోనే మంత్రి భేటీ కానున్నట్టు సోమవారం తెలిపారు. అమెరికా ఇటీవల హెచ్-1బీ వీసాలో సవరణలు చేపట్టడానికి తీసుకొచ్చిన బిల్లు ఇండియన్ ఐటీ ఇండస్ట్రిపై ప్రభావం చూపనుందని తెలిపారు. మన టెకీస్ అక్కడ పనిచేస్తున్నారన్నారు. ఈ విషయంపై అమెరికా అథారిటీలపై నిరంతరం టచ్‌లో ఉంటున్నామని మంత్రి చెప్పారు. ''హెచ్-1బీ వీసాలో మార్పులు ప్రతిపాదించడం కచ్చితంగా భారత్‌పై ప్రభావం చూపనుంది. ఈ విషయంపై పార్లమెంటరీ సమావేశాలనంతరం నాస్కామ్తో చర్చిస్తాం. అమెరికాలో ఎక్కువగా పేరులోకి వచ్చిన దేశీయ కంపెనీలు, ఆ వాతారణంలో ఎలా పనిచేస్తున్నాయనే దానిపై వారితో సంప్రదింపులు జరుపుతాం. ఎలాంటి వ్యూహాలను వారు అమలుచేస్తున్నారో కూడా తెలుసుకుంటాం'' అని చెప్పారు. నాస్కామ్ ప్రత్యేక బృందం సైతం ఈ నెల 22-24 మధ్యలో అమెరికాకు వెళ్లనుంది. కొత్తగా ఏర్పడిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వర్గాలతో, సెనేటర్లతో సమావేశం కానుంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన అనంతరం దేశీయ ఐటీ కంపెనీల్లో ఆందోళనలు రేపుతూ హెచ్-1బీ వీసా విధానంలో మార్పులను ప్రతిపాదించారు. ఈ బిల్లు ప్రకారం హెచ్-1బీ వీసా హోల్డర్స్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనం రెట్టింపు కానుంది. విదేశీ ఉద్యోగులకు వీసా జారీలు కఠినతరం కానున్నాయి. దీంతో దేశీయ ఐటీ కంపెనీలపై నిర్వహణ వ్యయాల భారం భారీగా పడనుంది. -
వీసా కష్టాలపై అమెరికాకు నాస్కామ్
న్యూఢిల్లీ: కఠినతర హెచ్1బీ వీసా నిబంధనలపై దేశీ ఐటీ రంగంలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్.. అమెరికా ప్రభుత్వ వర్గాలతో భేటీ కానుంది. ఇందుకోసం ఈ నెల 22–24 మధ్యలో ప్రత్యేక బృందం అమెరికా వెళ్లనున్నట్లు నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ వెల్లడించారు. కొత్తగా ఏర్పడిన డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ వర్గాలతో, సెనేటర్లతో సమావేశం కానున్నట్లు తెలిపారు. అమెరికాలో ప్రత్యక్ష ఉద్యోగాల కల్పనలోను, దేశ ఎకానమీ వృద్ధిలోనూ భారత ఐటీ కంపెనీలు పోషిస్తున్న కీలక పాత్ర గురించి వారికి వివరించనున్నట్లు ఆయన చెప్పారు. బృంద సభ్యులు, సమావేశాల వివరాలపై కసరత్తు జరుగుతోందని చంద్రశేఖర్ వివరించారు. స్థూల దేశీయోత్పత్తిలో భారత ఐటీ రంగం వాటా 9.3 శాతం మేర ఉంది. సుమారు 37 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. దేశీ ఐటీ సంస్థల ఎగుమతుల్లో 62 శాతం వాటా అమెరికాదే ఉంటోంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత హెచ్1బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడం, వీసాహోల్డర్ల కనీస వేతనాలను ఏకంగా రెట్టింపు చేసే ప్రతిపాదనలను తెరపైకి తేవడం తదితర అంశాలు భారత ఐటీ సంస్థలను కలవరపరుస్తున్నాయి. -
ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాల్లో కోత
ఈ ఏడాది 8-10 శాతానికి కుదించిన నాస్కామ్ న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమ సమాఖ్య సాస్కామ్ తాజాగా 2016-17 ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాలను తగ్గించింది. వీటిని 8-10 శాతానికి పరిమితం చేసింది. అంతర్జాతీయ ఆర్థిక ఇబ్బందులు, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్ర్కమణ వంటి అంశాలను దీనికి కారణంగా పేర్కొంది. కాగా నాస్కామ్ ఈ ఏడాది ప్రారంభంలో దేశీ సాఫ్ట్వేర్ సర్వీసుల్లో 10-12 శాతం వృద్ధిని అంచనా వేసింది. ఇక 2016-17కి సంబంధించి పెరిగే ఆదాయం 8-10 బిలియన్ డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని పేర్కొంది. ఇది 2015-16లో 10 బిలియన్ డాలర్లుగా ఉంది. బ్రెగ్జిట్, అమెరికా ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు, కరెన్సీ ఒడిదుడుకులు వంటి పలు అంశాలు వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. ఇక ఐటీ కంపెనీల ఆదాయంలో స్తబ్దత నెలకొని ఉండటంతో వృద్ధి రేటు 1-2 శాతం పారుుంట్లు మేర తగ్గొచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డారుు. కాగా ఎగుమతుల ఆదాయ వృద్ధి (స్థిర కరెన్సీ పరంగా) 2015-16లో 12.3 శాతంగా నమోదరుు్యంది. -
దేశంలో 2020కి 10,500 స్టార్టప్స్
• అమెరికా, యూకే తర్వాత మూడో స్థానం • 2016-17 ఆదాయ వృద్ధి అంచనాల్లో కోత! • ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ముంబై: భారత్‌లోని స్టార్టప్స్ సంఖ్య 2020 నాటికి 2.2 రెట్ల వృద్ధితో 10,500కి చేరుతుందని ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ అంచనా వేసింది. గతేడాది దేశంలో స్టార్టప్స్ జోరు కొద్దిమేర తగ్గిందని పలు నివేదికలో పేర్కొంటున్నా.. భారత్ మాత్రం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్స్ గల దేశంగా కొనసాగుతుందని పేర్కొంది. స్టార్టప్స్ అధికంగా గత దేశాల్లో అమెరికా, యూకే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయని తన తాజా నివేదికలో తెలిపింది. భారత్‌లో బెంగళూరు, ఎన్సీఆర్, ముంబై ప్రాంతాలు స్టార్టప్స్ హబ్‌గా మారతాయని పేర్కొంది. ఇన్వెస్టర్లు ప్రధానంగా హెల్త్‌టెక్, ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, డేటా అనలిటిక్స్, బీ2బీ కామర్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాలకు చెందిన స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నారని వివరించింది. టెక్ స్టార్టప్స్ సంఖ్య ఈ ఏడాది చివరకు 10-12 శాతం వృద్ధితో 4,750కి చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. 2016లో 1,400 కొత్త స్టార్టప్స్ ఏర్పాటు జరుగుతుందని పేర్కొంది. ఎగుమతుల ఆదాయ వృద్ధి అంచనాల త గ్గింపు! నాస్కామ్ తాజాగా 2016-17 ఎగుమతుల ఆదాయ వృద్ధి అంచనాలను (10-12 శాతం) తగ్గించనుంది. ఐటీ రంగంలోని ప్రధాన కంపెనీలు తాజా క్యూ2లో ప్రకటించిన ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఈ అభిప్రాయానికి వచ్చామని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. మరిన్ని కంపెనీల ఆర్థిక ఫలితాల వెల్లడి అనంతరం ఒక నిర్ణయానికి వచ్చి, సవరించిన ఆదాయ వృద్ధి అంచనాలను రెండు వారాల్లోగా వెల్లడిస్తామని పేర్కొన్నారు. -
జోరుగా భారత ఐఓటీ మార్కెట్
2020 కల్లా 1,500 కోట్ల డాలర్లకు నాస్కామ్-డెలాయిట్ నివేదిక న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్(ఐఓటీ) మార్కెట్ భారత్‌లో జోరుగా పెరగనున్నదని నాస్కామ్ అంచనా వేస్తోంది. తయారీ, వాహన, రవాణా, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో ఐఓటీ అనువర్తనం కారణంగా భారత్‌లో ఐఓటీ మంచి వృద్ధిని సాధిస్తుందని డెలాయిట్‌తో నాస్కామ్ రూపొందించిన నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న పరికరాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న నెట్‌వర్క్‌ను ఐఓటీ అంటారు. ఉదాహరణకు, రోడ్ల మీద ఎలాంటి ట్రాఫిక్ లేకపోతే వీధిలైట్లు వాటంతట అవే ఆఫ్ అయిపోతాయి. ఫలితంగా విద్యుత్తు ఆదా అవుతుంది. వినియోగదారుల, పారిశ్రామిక రంగాల్లో ఐఓటీ వినియోగం ప్రారంభమైందని ఐఓటీని ఆవిష్కరించిన కెవిన్ ఆష్టన్ పేర్కొన్నారు. ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు..., ప్రస్తుతం 560 కోట్ల డాలర్లుగా ఉన్న ఐఓటీ మార్కెట్ 2020 కల్లా 1,500 కోట్ల డాలర్లకు పెరుగుతుంది. వివిధ రంగాలకు చెందిన 120కు పైగా సంస్థలు ఐఓటీ ఈకో సిస్టమ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది 20 కోట్ల యూనిట్లతో అనుసంధానమై ఉన్న భారత ఐఓటీ మార్కెట్ 2020 కల్లా 270 కోట్ల యూనిట్లకు పెరుగుతుంది. ఇదే తరహా వృద్ధి ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని అంచనా. ఐఓటీ వృద్ధికి వినియోగదారుల, పారిశ్రామిక రంగాలు చోదక శక్తిగా పనిచేస్తాయి. -
ఆటోమేషన్తో కొత్త ఐటీ ఉద్యోగాలు
ఆటోమేషన్ ఎఫెక్ట్‌తో హడలిపోతున్న ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లతో ఐటీ రంగంలో సమూల మార్పులు జరిగి, ఐటీ ఉద్యోగాలకు గండికొడుతుందనే అపోహలకు తెరదించుతూ.. కొత్త ఉద్యోగాలు సృష్టికి ఈ టెక్నాలజీలు సహకరిస్తాయని నాస్కామ్ వెల్లడించింది. ఈ కొత్త టెక్నాలజీలతో లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు కనుమరుగవుతాయని గత కొంత కాలంగా పలు సర్వేలు, నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెక్నాలజీలు తీసుకొచ్చే మార్పులతో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని నాస్కామ్ అధ్యక్షుడు చంద్ర శేఖర్ తెలిపారు. భారత్‌కు సంబంధించినంత వరకు ఈ టెక్నాలజీల భయాలు తక్కువేనని వెల్లడించారు. కొన్ని ఉద్యోగాలు కనుమరుగైనప్పటికీ, అధికనైపుణ్యాలతో కూడిన కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపారు. అయితే కోల్పోయే ఉద్యోగాల కంటే తక్కువగానే కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే టెక్నాలజీతో కోల్పోయ్యే ఉద్యోగాల కంటే సృష్టించే ఉద్యోగాలే ఎక్కువగా ఉంటున్నాయని చంద్రశేఖర్ వివరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇండస్ట్రి స్పందించాలని, భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. -
జీఎస్టీ.. ఎవరిలెక్కలేంటి?
♦ సందేహాలున్నాయి: నాస్కామ్ ♦ బిల్లింగ్, రివర్స్ చార్జీపై స్పష్టతకు డిమాండ్ న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు 2017 ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందన్న అంచనాల నేపథ్యంలో... క్లిష్టమైన బిల్లింగ్, ఇన్వాయిస్ అవసరాలు సహా పలు అంశాలపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందని సాఫ్ట్వేర్ కంపెనీల సమాఖ్య నాస్కామ్ ప్రకటించింది. దిగుమతి చేసుకునే సేవలపై విధించే రివర్స్ చార్జీ... ఎగుమతుల్ని దెబ్బతీసేలా ఉండరాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అదే సమయంలో జీఎస్టీ ఆమోదంపై హర్షం ప్రకటిస్తూ... నూతన బిల్లు పన్నుల వ్యవస్థను గాడిలో పెడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. అయితే, దీన్ని మరింత పారదర్శకంగా మార్చాలని కోరింది. నాస్కామ్ అభ్యంతరాలు ⇔ దేశవ్యాప్తంగా సేవల రంగంలో ఉన్న కంపెనీలు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్రం వద్ద నమోదు చేసుకోవాల్సి రావడం ఇబ్బందికరం. ⇔ క్లిష్టమైన బిల్లింగ్, ఇన్వాయిస్ అవసరాల కారణంగా ఐటీ రంగం ఎగుమతి పోటీతత్వంపై ప్రభావం పడుతుంది. ⇔ ఎగమతి చేసే సేవల కోసం దిగుమతి చేసుకునే సర్వీసులపై విధించే రివర్స్ చార్జీపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. పన్ను రూపంలో చెల్లింపులతో మూలధనం వినియోగించుకునే వీలు లేకుండా పోతుంది. బిల్లులో ఏమున్నదో చూడాలి ‘ఎగుమతి ఆధారిత కంపెనీలు దిగుమతి చేసుకునే సేవలపై (ఈఆర్పీ లెసైన్స్, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ) సేవాపన్ను పడుతుంది. అయితే, తర్వాత ఈ పన్ను రిఫండ్ క్లెయిమ్ చేయొచ్చు. కానీ ఇది సమయం తీసుకుంటుంది. ఇప్పటి వరకు రివర్స్ చార్జీ కేవలం సేవలపైనే ఉంది. జీఎస్టీతో ఇది సరుకులకూ విస్తరిస్తుంది. అయితే, ఏవి సరుకులు, ఏవి సేవలు అనే దానిపై ఏం చెప్పారో చూడాల్సి ఉంది’ - సలోనీ రాయ్, డెలాయిట్ సీనియర్ డెరైక్టర్ వినియోగదారుడు.. పరిశ్రమకూ మేలే కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల మాట న్యూఢిల్లీ: జీఎస్టీతో సరఫరా వ్యవస్థ స్థీరీకరణ చెందుతుందని, సరుకుల రవాణా భారం తగ్గుతుందని కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల తయారీదారులు పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణ మరింత సులభంగా మారుతుందని ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ తయారీదారుల సంఘం (సీమ) తెలిపింది. లావాదేవీల ఖర్చు, రవాణా వ్యయం తగ్గడం ద్వారా స్థానిక తయారీ రంగం మరింత వృద్ధి చెందుతుందని పేర్కొంది. పెద్ద ఎత్తున ప్రయోజనం.. పన్ను రేటు 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గుతుంది. దీని వల్ల పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. ఇది క్రమంగా వినియోగదారుడికి బదిలీ అవుతుంది. సరఫరా వ్వవస్థ్థీరీకరణకు, రవాణా భారాన్ని తగ్గించుకునేందుకు మా వంటి బ్రాండెడ్ కంపెనీలకు అవకాశం లభిస్తుంది. - మనీష్ శర్మ, పానాసోనిక్ ఇండియా ప్రెసిడెంట్ వినియోగదారుడికి లాభం.. ధరల పరంగా వినియోగదారుడికి ప్రయోజనం. పరిశ్రమకు సానుకూల పరిణామం. - ఎరిక్ బ్రగాంజా, హెయర్ ఇండియా ప్రెసిడెంట్ వృద్ధి పెరుగుతుంది: మూడిస్ న్యూఢిల్లీ: జీఎస్టీ అమలు దేశ ఆర్థిక వృద్ధికి అనుకూలమని, ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. అయితే, రెవెన్యూ న్యూట్రల్ శ్రేణికి అనుగుణంగా పన్ను రేట్లున్నపుడే ఇది సాధ్యమని స్పష్టం చేసింది. రెవెన్యూ న్యూట్రల్ శ్రేణి అంటే... కొత్త పన్ను వ్యవస్థను అమలు చేసినా కేంద్రం, రాష్ట్రాలు ప్రస్తుతం వస్తున్న ఆదాయం కోల్పోకుండా ఉండేంత స్థాయి. అదే సమయంలో ఇతర వివాదాస్పద సంస్కరణల్లో ప్రగతి నిదానంగా ఉండవచ్చని మూడీస్ అంచనా వేసింది. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం... సంస్కరణల్లో ప్రగతి... కాస్త నిదానంగా రాజకీయ సహకారంపై ఆధారపడి ఉంటుందన్న తమ అంచనాల ప్రకారమే జరుగుతున్నట్లు మూడీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మారీ డిరోన్ అన్నారు. . ఒకే పన్నుతో ‘ఆటో’ జోరు... స్వాగతమన్న ఆటోమొబైల్స్ జీఎస్టీ విషయంలో ఆటోమొబైల్ రంగం యావత్తూ సానుకూలంగా స్పందిం చింది. ప్రస్తుత భిన్న రకాల పన్నుల వ్యవస్థ స్థిరీకరణ చెందుతుందని ఈ రంగం అభిప్రాయపడింది. ఆటోమోటివ్ పరిశ్రమ ఒకే దేశం, ఒకే పన్ను విధానంతో లబ్ధి పొందుతుందని ఫోర్డ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనుగాగ్ మెహ్రోత్రా చెప్పారు. ప్రస్తుతం వాహనం కొలతలు, ఇంజన్ సామర్థ్యం ఆధారంగా ఆటో పరిశ్రమపై నాలుగు శ్లాబుల ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. చిన్న కార్లపై (నాలుగు మీటర్లలోపు పొడవు ఉన్నవి) 12 శాతం ఎక్సైజ్ పన్నుంటే... అంతకు మించిన పొడవున్న పెద్ద కార్లపై 24 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధిస్తున్నారు. ఇవన్నీ 1500 సీసీ సామర్థ్యంలోపున్నవే. ఈ సామర్థ్యం దాటిన వాటిపై పన్ను ఇంకా అధికంగా ఉంది. ఆటోమొబైల్ రంగానికి చక్కని అవకాశం... జీడీపీలో తయారీ రంగం నుంచి 45 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న ఆటోమొబైల్ రంగంలో ప్రస్తుతమున్న భిన్న రకాల పన్నుల వ్యవస్థను స్థిరీకరణ చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం లభించింది. - యోచిరో యునో, హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ పన్నుల భారం తగ్గుతుంది... వాహన పరిశ్రమపై అధిక పన్నులు విధిస్తున్నారు. జీఎస్టీతో ఈ భారం తగ్గి, సులభతరమైన, పారదర్శక విధానం వస్తుంది. సామర్థ్యం, ఉత్పాదకత పెరుగుదలతో పోటీపడగల అతిపెద్ద ఏకైక మార్కెట్‌గా అవతరిస్తుంది. - రాకేష్ శ్రీవాత్సవ, వైస్ ప్రెసిడెంట్, హ్యుందాయ్ మోటార్ ఇండియా భారత్‌ను మరింత బలోపేతం చేస్తుంది దేశ ఆర్థిక రంగాన్ని మరింత బలమైన, ఓపెన్ మార్కెట్‌గా జీఎస్టీ చేయగలదు. అంతర్జాతీయంగా మరింత పోటీపడేలా చేస్తుంది. - పవన్ ముంజాల్, చైర్మన్, ఎండీ, హీరోమోటోకార్ప్ ఈ- కామర్స్ వృద్ధికి విఘాతం: పరిశ్రమ మూలం వద్దే పన్ను వసూలు (టీసీఎస్) జీఎస్టీ నిబంధన ఈ కామర్స్ పోర్టళ్ల (మార్కెట్ ప్లేస్ మోడల్) అభివృద్ధికి పెద్ద విఘాతమని, చిన్న వర్తకులకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఎదురవుతుందని ఈ రంగం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కామర్స్ సంస్థలు తమ వేదిక ద్వారా... వినియోగదారులు ఏదైనా వస్తువు లేదా సేవను కొనుగోలు చేసినప్పుడు చెల్లించే మొత్తం నుంచి టీసీఎస్ రూపంలో కొంత మినహాయించాల్సి ఉంటుంది. విక్రయదారులు తమ పన్నులో ఇది సర్దుబాటు చేసుకోవచ్చు. అయితే, దీని కారణంగా తక్కువ లాభంపై పనిచేసే చిన్న వ్యాపారస్తులకు వర్కింగ్ క్యాపిటల్ సమస్య ఎదురవుతుందని విశ్లేషకుల అంచనా. దీంతో ఈ కామర్స్ పోర్టళ్ల ద్వారా వ్యాపారం చేసే వారిని నిరుత్సాహపరిచినట్టు అవుతుందని అంటున్నారు. అయితే, ఈ కామర్స్ రంగానికి జీఎస్టీ మంచి ఉత్ప్రేరకమని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. టీసీఎస్‌పై పునఃపరిశీలన అవసరం ఈ అంశాన్ని పునః పరిశీలించాల్సిన అవసరం ఉంది. జీఎస్టీ సంస్కరణల స్ఫూర్తి అమలులో కనిపించాలి. ప్రస్తుత చిక్కుముళ్ల స్థానంలో కొత్త అడ్డంకులను సృష్టించరాదు. - కునాల్ భాయ్, సీఈవో, స్నాప్‌డీల్ సంస్కరణలకు జోష్: ఫిచ్ న్యూఢిల్లీ: ‘వాణిజ్య పరంగా ఉన్న అడ్డంకులను జీఎస్టీ తొలగిస్తుంది. ఇదొక కీలక సంస్కరణ. ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. దీర్ఘకాలంలో అభివృద్ధికి తోడ్పడుతుంది’ అని రేటింగ్ సంస్థ ఫిచ్ తెలిపింది. అయితే, స్వల్ప కాలంలో ద్రవ్యలోటు పరంగా ఏమంత ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. బిల్లు ఆమోదం పొందడంతో కీలక సంస్కరణల విషయంలో ప్రభుత్వ సామర్థ్య పరంగా సానుకూల సంకేతాలను ఇచ్చినట్టయిందని అభివర్ణించింది. జీఎస్టీ అమలుతో ప్రభుత్వానికి అధిక పన్ను ఆదాయం సమకూరుతుందా అన్నది వేచి చూడాల్సి ఉందని పేర్కొంది. పన్ను రేటును ఎంత నిర్ణయిస్తారు వంటి ఎన్నో అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందని తన నివేదికలో ఫిచ్ తెలిపింది. -
ఐటీ కంపెనీల లాభాలపై ఒత్తిడి..
♦ తగ్గనున్న నియామకాలు ♦ నాస్కాం ప్రెసిడెంట్ చంద్రశేఖర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : దేశీయ ఐటీ కంపెనీల లాభాలపై ఈ ఏడాది ఒత్తిడి ఉంటుందని నాస్కాం చెబుతోంది. నియామకాలూ తగ్గుతాయని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ బుధవారమిక్కడ వెల్లడించారు. ఈ పరిస్థితులు ప్రస్తుత ఏడాది ప్రస్ఫుటంగా కనపడతాయని అన్నారు. ‘అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం ఉంది. యూరప్‌లో వృద్ధి రేటు చాలా తక్కువగా ఉంది. ప్రధానంగా దక్షిణ యూరప్‌లో తిరోగమన వృద్ధి నమోదైంది. బ్రెగ్జిట్ నేపథ్యంలో పౌండ్ విలువ తగ్గింది. పౌండ్ల రూపంలో కాంట్రాక్టులను కుదుర్చుకున్న ఐటీ కంపెనీల మార్జిన్లపై ప్రభావం ఉండే అవకాశం ఉంది’ అని వెల్లడించారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆటోమేషన్తో... ఐటీ కంపెనీల్లో నియామకాలు స్వల్పంగా తగ్గుతాయని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆటోమేషన్ విస్తృతం కావడంతోపాటు ఉద్యోగుల సామర్థ్యం పెరగడమే ఇందుకు కారణమని అన్నారు. దేశంలో ఐటీ, ఐటీఈఎస్ పరిశ్రమ 100 బిలియన్ డాలర్లకు చేరుకున్నప్పుడు మొత్తం 30 లక్షల మందికి ఉపాధి అవకాశాలను తెచ్చిపెట్టింది. మరో 100 బిలియన్ డాలర్లు జతకూడేందుకు కొత్తగా 15 లక్షల మంది అవసరమవుతారని అంచనాలు ఉన్నాయన్నారు. -
ఐటీ ఉపాధి కల్పనలో టీసీఎస్ టాప్: నాస్కామ్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ పరిశ్రమలో సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) టాప్ ఎంప్లాయర్‌గా నిలిచింది. ఇందులో 3.62 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రకారం.. టీసీఎస్ తర్వాతి స్థానాల్లో ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, విప్రో, క్యాప్‌జెమిని ఉన్నాయి. కాగ్నిజెంట్.. అమెరికా కంపెనీ అయినప్పటికీ ఆ కంపెనీ దేశంలో చాలా మందికి ఉపాధి కల్పిస్తోందని నాస్కామ్ పేర్కొంది. దీనికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. జూన్ నెల చివరకు.. టీసీఎస్‌లో 3.62 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఇన్ఫోసిస్, విప్రోలలో వరుసగా 1.97 లక్షలు, 1.73 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక టాప్-10లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, జెన్‌ప్యాక్ట్, ఇంటెలిజెంట్ గ్లోబల్ సర్వీసెస్, ఏజీస్ వంటి సంస్థలున్నాయి. టాప్-20లో హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్, సీఎస్సీ ఇండియా, డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్, సింటెల్, ఎంఫసిస్, ఈఎక్స్ఎల్, ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ, ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్, సీజీఐ వంటి కంపెనీలు స్థానం పొందాయి. దేశీ ఐటీ-బీపీఎం పరిశ్రమ దాదాపు 37 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇందులో మహిళా ఉద్యోగుల వాటా 13 లక్షలు. -
ఈ ఏడాది ఐటీ వృద్ధి10-12 శాతంగానే..
♦ మా అంచనాలు పరిశ్రమ మొత్తానికి వర్తిస్తాయి ♦ ఏదో ఒకటి రెండు కంపెనీలవి కాదు: నాస్కామ్ న్యూఢిల్లీ: దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు జూన్ త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించినప్పటికీ... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఐటీ రంగ వృద్ధి మాత్రం అంచనాలకు తగ్గట్టు 10-12 శాతంగానే ఉంటుందని నాస్కామ్ అభిప్రాయపడింది. అంచనాలను తగ్గించేందుకు ఎలాంటి కారణాలు కనిపించడం లేదని వ్యాఖ్యానించింది. జూన్ త్రైమాసికంలో ప్రముఖ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, విప్రో ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం, భవిష్యత్తు ఆదాయాలపై కూడా పెద్దగా ఆశాభావం వ్యక్తం చేయకపోవడం తెలిసిందే. విప్రో నికర లాభం ఏకంగా 6 శాతం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ అంశంపై ఆయన పీటీఐతో మాట్లాడుతూ... ‘‘ఇప్పటి వరకైతే వృద్ధిలో ఎలాంటి క్షీణతా లేదు. పరిశ్రమలోని అన్ని విభాగాల్లో, సేవల్లో ఈ వృద్ధి ఏకరీతిన చక్కగా కొనసాగుతోంది’’ అన్నారాయన. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బీపీవో ఎగుమతులు 10 నుంచి 12% వృద్ధి చెందుతాయని నాస్కామ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అంచనా వేయటం తెలిసిందే. అయితే తమ అంచనాలు ఐటీ రంగం మొత్తానికి సంబంధించి నవి, ఏవో కొన్ని పెద్ద కంపెనీలకు మాత్రమే పరి మితం కాదని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మార్జిన్లపై ఒత్తిడి ఉన్నప్పటికీ ఆదాయాల్లో మంచి వృద్ధి నమోదవుతుందన్నారు. అంతర్జాతీయంగా ఆర్థిక సమస్యలు నెలకొని ఉన్నా ఐటీ రంగంలో బలమైన గిరాకీ ఉందని, ఈ రంగంలో పెట్టుబడులు కూడా తగ్గబోవని ఆయన స్పష్టంచేశారు. అంతర్జాతీయంగా భారత ఐటీ రంగం వాటా కూడా పెరుగుతోందని ఆయన చెప్పారు. -
ఐటీ రంగంలో అనిశ్చితి తప్పదు...
♦ భవిష్యత్తులో సవాళ్లతోపాటు అవకాశాలు ♦ నాస్కాం ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రెగ్జిట్ వల్ల 108 బిలియన్ డాలర్ల భారత ఐటీ రంగంలో స్వల్పకాలంలో అనిశ్చితి తప్పదని నాస్కామ్ హెచ్చరించింది. దీర్ఘకాలంలో సవాళ్లతోపాటు అవకాశాలూ ఉంటాయని వెల్లడించింది. ‘భారత్‌కు అత్యంత ప్రాధాన్య మార్కెట్లలో యూరప్ ఒకటి. మనకు రెండో అతిపెద్ద మార్కెట్. దేశీ ఎగుమతుల్లో 30 శాతం యూరప్దే. ఈ విపణిలో యూకే చాలా కీలకం. యూరోపియన్ యూనియన్‌లో పెట్టుబడులకు యూకే ద్వారంగా నిలుస్తోంది’ అని నాస్కామ్ వివరించింది. స్వల్పకాలంలో ప్రభావమిలా.. ♦ పౌండ్ విలువ పడిపోవచ్చు. క్లయింట్లను సంప్రతించి కాంట్రాక్టు విలువ సర్దుబాటు చేసుకోకపోతే కంపెనీ ఆదాయం తగ్గుతుంది. ♦ ఈయూలో భారీ ప్రాజెక్టులు అనిశ్చితిలో పడతాయి. ♦ ఈయూ కోసం ప్రత్యేకంగా కార్యాలయాలు, కార్యకలాపాలను భారత ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలి. ఈ క్రమంలో యూకే నుంచి కొంత పెట్టుబడుల ఉపసంహరణ జరగొచ్చు. ♦ నిపుణులైన మానవ వనరులను ఈయూ, యూకేకు సర్దుబాటు చేయడంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. ♦ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకుల మార్పుల వల్ల కరెన్సీపై ప్రభావం. స్పష్టత ఇవ్వాలి..: చంద్రశేఖర్ బ్రసెల్స్, లండన్‌లోని విధాన నిర్ణేతలు తదుపరి చర్యలపై సాధ్యమైనంత త్వరగా స్పష్టతనిస్తే యూకే, యూరప్‌లో పెట్టుబడులు కొనసాగించేందుకు నమ్మకం ఏర్పడుతుందని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ చెప్పారు. రెఫరెండం వల్ల ఏర్పడే వ్యతిరేక ప్రభావం తగ్గించేందుకు యూకే కట్టుబడి ఉందన్న విషయం అక్కడి విధాన నిర్ణేతల వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోందన్నారు. యూకేలోని 800 భారత కంపెనీల్లో 1,10,000 మంది స్థానికులు పనిచేస్తున్నారు. కాబట్టి భారత్‌తో పటిష్టమైన భాగస్వామ్యం కోసం బ్రిటన్ ఆసక్తి చూపవచ్చు. ఈయూకు చెందిన ఇతర సభ్యదేశాల మానవ వనరులపై యూకే పెద్దగా ఆధారపడలేదు. ఈ క్రమంలో భారత్‌తో సహా ఈయూయేతర దేశాల నిపుణులకు యూకే ద్వారాలు తెరిచినట్టే’ అని అన్నారు. ఐటీకి ప్రతికూలం:గోపాలకృష్ణన్ స్వల్పకాలంలో మన ఐటీ రంగానికి ప్రతికూలమేనని ఇన్ఫోసిస్ మాజీ సీఈవో ఎస్.గోపాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. అనిశ్చితి పరిశ్రమకు శ్రేయస్కరం కాదన్నారు. -
16 బిలియన్ డాలర్లకు అనలిటిక్స్ పరిశ్రమ: నాస్కామ్
హైదరాబాద్: దేశీ అనలిటిక్స్ పరిశ్రమ 2025 నాటికి 16 బిలియన్ డాలర్లకి చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. ప్రస్తుతం ఇది 2 బిలియన్ డాలర్లుగా ఉంది. భారత్‌లో 600కు పైగా అనలిటిక్స్ సంస్థలు (వీటిలో 400 వరకు స్టార్టప్స్ ఉన్నాయి) ఉన్నాయని, దేశాన్ని అనలిటిక్స్ సొల్యూషన్స్‌కు సంబంధించి గ్లోబల్ హబ్‌గా మార్చే సత్తా వీటికి ఉందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ కె.ఎస్.విశ్వనాథన్ తెలిపారు. ఆయన ‘బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ సమిట్ 2016’ నాల్గవ ఎడిషన్ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడారు. అంతర్జాతీయంగా అనలిటి క్స్ సొల్యూషన్స్‌ను అందించే టాప్-10 దేశాల్లో భారత్ ఒకటన్నారు. 2025 నాటికి ఇండియా టాప్-3లోకి చేరాలనేది తమ కోరికని తెలిపారు. అనలిటిక్స్ పరిశ్రమ వృద్ధితో దేశంలో ఉపాధి కూడా పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం 90,000ల మంది అనలిటిక్స్ ప్రొఫెషనల్స్ హెచ్ఆర్, మార్కెటింగ్, హెల్త్‌కేర్, రిటైల్ వంటి విభాగాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వృద్ధి అంచనాలను పరిశీలిస్తే.. త్వరలోనే భారత్ ప్రపంచంలోనే బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ హబ్‌గా అవతరించనుందని నాస్కామ్ మాజీ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఐటీ ఇంజినీర్ల కన్నా అధిక సంపాదన.. దేశంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ల కన్నా డేటా అనలిస్ట్‌లే ఎక్కువ సంపాదిస్తున్నారు. డిమాండ్-సప్లై మధ్య అంతరం ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని కోక్యూబ్స్ టెక్నాలజీస్ తన నివేదికలో తెలిపింది. ప్రారంభ స్థాయిలో సగటున డేటా అనలిస్ట్‌ల వార్షిక వేతనం రూ.7 లక్షలుగా ఉంటే.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ల జీతం రూ.3.2 లక్షలుగా ఉందని పేర్కొంది. -
నాస్కామ్ ఇనోట్రెక్ కు 39 స్టార్టప్ లు ఎంపిక
ఐటీ పరిశ్రమ సంస్థ నాస్కామ్ నిర్వహించే మూడో ఎడిషన్ 'ఇనోట్రెక్' ప్రొగ్రామ్ కు భారత్ నుంచి 39 స్టార్టప్ కంపెనీలు సెలక్ట్ అయ్యాయి. ఈ ప్రొగ్రామ్ మే 2 నుంచి 7 వరకూ అమెరికాలో నాస్కామ్ నిర్వహిస్తుంది. కొత్తగా వ్యాపారం నిర్వహించే టెక్ వ్యాపారవేత్తలకు పెట్టుబడిదారులను కలిసే అవకాశం, అనుభవజ్ఞుల నుంచి వ్యాపార నైపుణ్యాలను నేర్చుకునే సౌకర్యం ఈ ప్రొగ్రామ్ ద్వారా స్టార్టప్ లకు నాస్కామ్ అందిస్తుంది. టెక్నాలజీ సంస్థలకు మారుపేరుగా ఉన్న సిలికాన్ వ్యాలీ నుంచి అనుభవజ్ఞులు, కార్పొరేషన్లు ఈ ప్రొగ్రామ్ లో పాలుపంచుకుంటున్నారని నాస్కామ్ 10,000 స్టార్టప్ ల సీనియర్ డైరెక్టర్ రజత్ టాండన్ తెలిపారు. భారత్ లో కొత్తగా ఏర్పాటుచేయబోయే సంస్థలు గ్లోబల్ గా ఎలా ఎదగాలి...ఆ కార్పొరేషన్లతో పొత్తు ఏర్పాటుచేసుకుని పోటీతత్వ ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో నేర్చుకోవచ్చని ఆయన చెప్పారు. స్పెక్ట్రమ్ ఇంటర్నెట్, గేమింగ్, హెల్త్ కేర్, ఫిన్ టెక్, స్పోర్ట్స్ టెక్ స్టార్టప్ లను తాము ఈ ప్రొగ్రామ్ కు ఎంపికచేసుకున్నామని తెలిపారు. గ్లోబల్ గా ఈ ప్రొడక్ట్స్ కు డిమాండ్ అధికంగా ఉంటుందని, గొప్ప వ్యక్తుల్ని కలవడానికి సిలికాన్ వ్యాలీ ఓ మంచి అవకాశమన్నారు. మొదటి ఏడాదిలో 25 స్టార్టప్ లు, గతేడాది 34 స్టార్టప్ లను, ఈ ఏడాది 39 స్టార్టప్ లను ఈ ప్రొగ్రామ్ కు నాస్కామ్ ఎంపికచేసుకుంది. -
ఈ ఏడాది ఐటీ ఉద్యోగాలు తగ్గుతాయ్
2016-17లో 2.3 లక్షల ఐటీ ఉద్యోగ నియామకాల అంచనా ♦ గతేడాదితో పోలిస్తే 20% తక్కువ ♦ పరిశ్రమ ఆదాయంలో రెండంకెల వృద్ధి ♦ నాస్కామ్ చైర్మన్ సి.పి.గుర్నాని హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరం ఐటీ రంగంలో వృద్ధి నమోదైనా ఆ మేరకు కొత్త ఉద్యోగ నియామకాలు ఉండకపోవచ్చని నాస్కామ్ పేర్కొంది. గతేడాది కంటే ఐటీ కంపెనీల ఆదాయంలో 10-11% వృద్ధి నమోదయ్యే అవకాశాలున్నాయని, కానీ ఇదే సమయంలో నియామకాల్లో 20% తగ్గొచ్చని అంచనా వేస్తున్నట్లు నాస్కామ్ చైర్మన్ సి.పి.గుర్నాని తెలిపారు. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ప్రధాన ఐటీ కంపెనీలు ఆటోమేషన్‌పై అత్యధికంగా దృష్టిసారిస్తుండటం నియామకాలు తగ్గడానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు. 143 బిలియన్ డాలర్ల పరిమాణం గల దేశీయ ఐటీ పరిశ్రమ 2016-17లో 2.75 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్స్ కాన్క్లేవ్’ సదస్సుకు గుర్నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ అమెరికా ఎన్నికలు ఐటీ పరిశ్రమపై పెద్దగా ప్రభావం చూపవన్నారు. అమెరికా, భారత్‌లకు ఒకరి అవసరం ఒకరికి ఉండటంతో ఎవ రు అధికారంలోకి వచ్చినా పరిశ్రమపై పెద్దగా ప్రతి కూల ప్రభావం ఏమీ ఉండదన్నారు. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు వ్యయనియంత్రణకు ఇండియా చక్కటి వేదిక అని, ఇక్కడ గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్స్(జీఐసీ) ఏర్పాటు చేయడం ద్వారా వ్యయాలను తగ్గించుకోవచ్చని నాస్కామ్ పేర్కొంది. -
2025 నాటికి 10 లక్షల ఐటీ ఉద్యోగాలు
న్యూఢిల్లీ: 2025 సంవత్సారానికి దేశంలో 10 లక్షల నిపుణులైన ఐటి ఉద్యోగులను సైబర్ సెక్యూరిటీ రంగం నియమించుకునే అవకాశం ఉందని నాస్కామ్ అంచనావేస్తోంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో నిపుణులైన వారికి డిమాండ్ భారీగా పెరుగుతుందని చెపుతోంది. ఈ రంగంలో దాదాపు మూడువేల అయిదువందలకోట్లు లాభాలను ఆర్జించనున్న నేపథ్యంలో ఇబ్బడిముబ్బడిగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయని భావిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల నిరోధానికిగాను ఇంత పెద్ద మొత్తంలో ఐటి నిపుణులు కావాల్పి వస్తుందని సైబర్ సెక్యూరిటీ టాస్క్ ఫోర్స్ ప్రతినిధి రాజేంద్ర పవార్ తెలిపారు. సైబర్ భద్రతా రంగంలో 3వేల అయిదువందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుందని నాస్కామ్ అంచనా వేసింది. ఈ రంగంలో పెరుగుతున్న ఆదరణ, ఆదాయం నేపథ్యంలో లక్షలాది ఐటి నిపుణులను ఆయా సంస్థలు నియమించుకుంటారని నాస్కామ్ భావిస్తోంది. అలాగే ఉనికిలోకి వస్తున్న చిన్న కంపెనీల మూలంగా ఐటి నిపుణుల ఆవశ్యకత మరింత పెరగనుందన్నారు. భవిష్యత్తు సుమారు వెయ్యి స్టార్ట్ ఆప్ లు రాబోతున్నాయన్నారు. ఆయా సంస్థలపై సైబర్ దాడి సంఘటనలు పెరుగుతున్నందువల్ల సైబర్ భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వక తప్పదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తమ సురక్షితపై సెక్యూరిటీ రంగ నిపుణులపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారన్నారు. కాగా గత ఏడాది నాస్కామ్, సైబర్ భద్రతా పరిష్కారాల లక్ష్యంగా టాస్క్ ఫో ర్స్ ను ఏర్పాటు చేసింది. సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ లో ఇండియా ను గ్లోబల్ హబ్ గా రూపొందించే ప్రణాళికతో దీన్ని రూపొందించింది. నాస్కామ్ , డాటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఐటి సంస్థ సిమాంటెక్ సంయుక్తంగా 'నేషనల్ ఆక్యుపేషనల్ స్టాండర్డ్స్' ను బుధవారం ప్రారంభించింది. దీని ద్వారా సిమాంటెక్ సంస్థ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ చేస్తున్న మహిళా అభ్యర్థులకు వెయ్యి రూపాయల స్కాలర్ షిప్ ను ప్రకటించింది. -
ఎస్టీపీఐ యూనిట్లకు ఎస్ఈఐఎస్ ప్రయోజనాలు: నాస్కామ్
హైదరాబాద్: సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) యూనిట్లకు సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా స్కీమ్ (ఎస్ఈఐఎస్) ప్రయోజనాలను 2016-17 బడ్జెట్లో వర్తింపజేయాలని నాస్కామ్ ప్రభుత్వాన్ని కోరింది. ఐటీ, ఐటీఈఎస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ కంపెనీలకు వచ్చే బడ్జెట్ చాలా కీలకమని నాస్కామ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి తెలిపారు. ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ నియమాల్లో స్పష్టత లేకపోవడంతో ఇక్కడి కంపెనీలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వ్యాఖ్యానించారు. సేఫ్ హార్బర్ మార్జిన్స్‌పై ఉన్న 20-30 శాతం అధిక వడ్డీ రేట్లను ఈ బడ్జెట్లో అయినా సవరించాలన్నారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు వాటికి వ్యాపారానికి అనువైన పరిస్థితులకు కల్పించాలని కోరారు. మ్యాట్తోసహా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల నుంచి స్టార్టప్స్‌కు మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రారంభ దశలో ఉన్న కంపెనీలకు ప్రభుత్వం పెట్టుబడి సహాయం చేయాలని విన్నవించారు. -
అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారత్ ఐటీ దన్ను
టాప్ 5 నగరాల్లో కాలిఫోర్నియా.. భారతీయ ఐటీ కంపెనీలు ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పిస్తున్న టాప్ 5 అమెరికన్ నగరాల్లో కాలిఫోర్నియా, టెక్సాస్, ఇలినాయి, న్యూజెర్సీ, న్యూయార్క్ ఉన్నట్లు నివేదిక పేర్కొంది. విదేశీ ఉద్యోగులు అమెరికన్ల ఉద్యోగావకాశాలు దెబ్బతీస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను నివేదిక తోసిపుచ్చింది. అక్కడి స్థానికంగా నిపుణుల కొరతే దీనికి కారణమని వివరించింది. - 4 లక్షల ఉద్యోగాల కల్పన - 20 బిలియన్ డాలర్ల పన్నుల చెల్లింపు - నాస్కామ్ నివేదిక వాషింగ్టన్: ఉద్యోగాల కల్పన, పెద్ద ఎత్తున పన్నుల చెల్లింపు రూపంలో భారతీయ ఐటీ కంపెనీలు అమెరికా ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా తోడ్పాటు అందిస్తున్నాయని దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఒక నివేదికలో పేర్కొంది. 2011-15 మధ్య కాలంలో అమెరికాలో భారతీయ ఐటీ కంపెనీలు దాదాపు 4,11,000 ఉద్యోగాలు కల్పించాయని, 20 బిలియన్ డాలర్ల మేర పన్నులు చెల్లించాయని, 2 బిలియన్ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. అమెరికా ఎకానమీకి భారతీయ టెక్ పరిశ్రమ తోడ్పాటు పేరిట రూపొందించిన ఈ నివేదికను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఆవిష్కరించారు. భారత్ అమెరికా మధ్య తొలి వ్యూహాత్మక, వాణిజ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. భారతీయుల నైపుణ్యాలను ఉపయోగించుకుని అమెరికా సంస్థలు వినూత్న ఆవిష్కరణలు, సేవలతో అంతర్జాతీయ మార్కెట్లో తమ వాటాను మెరుగుపర్చుకోగలిగాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే సామాజిక సంక్షేమ కార్యక్రమాల రూపంలో 1,20,000 మంది అమెరికన్లకు భారతీయ కంపెనీలు తోడ్పాటు అందించాయని వివరించారు. దీనికి తోడు ఫార్చూన్ 500 కంపెనీలతో పాటు వేల కొద్దీ అమెరికన్ వ్యాపార సంస్థలకు ఆర్థిక, నిర్వహణ అంశాలపరంగా భారతీయ ఐటీ కంపెనీలు గణనీయంగా సేవలు అందిస్తున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. -
నాస్కామ్తో ఐఈఎస్ఏ ఒప్పందం
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ఎలక్ట్రానిక్స్, ఐటీ వాటాను పెంచే దిశగా ఐటీ కంపెనీల సమాఖ్య నాస్కామ్, ఎల క్ట్రానిక్స్ తయారీ కంపెనీల సమాఖ్య ఐఈఎస్ఏ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం 2025 నాటికల్లా జీడీపీలో వీటి వాటా 25 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నాయి. ఇందుకు సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ చైర్మన్ వినయ్ షెనాయ్ తెలిపారు. 2013లో 76 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్డీఎం) మార్కెట్.. 2015లో 94 బిలియన్ డాలర్లకు, 2020 నాటికి 400 బిలియన్ డాలర్ల స్థాయికి ఎదుగుతుందని అంచనాలు ఉన్నట్లు ఆయన వివరించారు. భారత ఎలక్ట్రానిక్ మార్కెట్లో 90 శాతం దిగుమతులే ఉంటున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం కింద దేశీ ఎలక్ట్రానిక్స్, ఐటీకి మరింత ప్రాధాన్యం లభించగలదని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. మరోవైపు, రూ. 65,000 కోట్ల మేర ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రతిపాదనలు కేంద్రానికి అందినట్లు టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. 21 ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లకు సూత్రప్రాయ అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. -
నాస్కామ్ సైబర్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్
న్యూఢిల్లీ: సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్ రూపకల్పనకు భారత్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ తాజాగా సైబర్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (డీఎస్‌సీఐ)తో చేతులు కలిపింది. భారత సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోతగిన చర్యలు, ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాల గురించి ఈ టాస్క్‌ఫోర్స్ అధ్యయనం చేసి 12 వారాల్లోగా నివేదికనిస్తుంది. ఎన్ఐఐటీ చైర్మన్ రాజేంద్ర పవార్ సారథ్యంలో ఏర్పాటైన సైబర్ సెక్యూరిటీ టాస్క్‌ఫోర్స్‌లో ఐటీ, బ్యాంకింగ్, టెలికం రంగాల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు సభ్యులుగా ఉంటారు. -
నాస్కామ్ చైర్మన్‌గా బీవీఆర్ మోహన్‌రెడ్డి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ ఇంజనీరింగ్ సేవల సంస్థ సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి 2015-16 సంవత్సరానికి గాను సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్‌గా బుధవారం ఎంపికయ్యారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఆర్.చంద్రశేఖరన్ ఉన్నారు. ఏప్రిల్ 9న మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపడతారు. ఇక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వైస్ చైర్మన్‌గా.. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ ఎంపికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కేవలం పెద్ద సంస్థలే కాకుండా చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ), స్టార్టప్స్‌కి ప్రాతినిధ్యం కల్పించేందుకు కృషి చేస్తానని మోహన్‌రెడ్డి తెలిపారు. 100 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ-బీపీఎం పరిశ్రమకు నాస్కామ్ ప్రాతినిధ్యం వహిస్తోంది. -
గూగుల్ మనకెందుకు లేదు?
న్యూఢిల్లీ: సైబర్ భద్రత ప్రపంచానికి సవాల్ మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీని సరైన పరిష్కారం కనుగొనాలని ఐటీ ప్రొఫెషనల్స్ ను ఆయన కోరారు. జీడీపీ వృద్ధిలో 'కనెక్టివిటీ' కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. గూగుల్ లాంటి సెర్చ్ ఇంజిన్ భారత్ కు ఎందుకు లేదని ఐటీ పరిశ్రమను ఆయన ప్రశ్నించారు. నాస్కామ్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 25 ఏళ్ల క్రితం 100 మిలియన్ డాలర్లుగా ఉన్న ఐటీ పరిశ్రమ నేడు 146 బిలియన్ డాలర్లకు చేరిందని మోదీ తెలిపారు. పీఎంఓ మొబైల్ ఆప్ రూపొందించేందుకు ఆలోచనలు(ఐడియాలు) పంపాలని ప్రధాని కోరారు. -
ఐటీ వృద్ధి 12-14 శాతం: నాస్కామ్
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరం దేశీ ఐటీ ఎగుమతులు 12 నుంచి 14 శాతం పెరుగుతాయని నాస్కామ్ తెలిపింది. గత అంచనా వృద్ధి 13-15 శాతంతో పోలిస్తే ఇది తక్కువ. కరెన్సీ విలువలో అస్థిరత, స్థూల ఆర్థిక ఒడి దుడుకులను దీనికి కారణాలుగా పేర్కొంది. భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ వృద్ధిని స్థిరంగా కొనసాగిస్తామని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్, వైస్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డిలు పేర్కొన్నారు. వారు మంగళవారం మీడియాతో మాట్లాడారు. దేశీ, ఈ-కామర్స్ ఆదాయాలతోపాటు మొత్తం ఐటీ పరిశ్రమ ఆదాయం ఈ ఏడాది 146 బిలియన్ డాలర్లుగా, వచ్చే ఏడాది 165 -169 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 2020 నాటికి ఈ మొత్తం 300 బిలియన్ డాలర్లకు చేరుతుందని తెలిపారు. దీనిలో ఈ-కామర్స్ విభాగం వాటా 75 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొన్నారు. దాదాపు 35 నుంచి 40% వరకు ఐటీ పరిశ్రమ ఆదాయం డాలర్లకు రూపంలో కాకుండా యూరోలలో వస్తున్నాయని చెప్పారు. దీంతోపాటు కొత్తగా 2.3 లక్షల ఉద్యోగాల కల్పనతో ఐటీ పరిశ్రమలో మొత్తం ఉద్యోగులు 35 లక్షలకు చేరుతారని తెలిపారు. కానీ ఉద్యోగ నియామకాలు క్రమంగా తగ్గుతున్నాయన్నారు. అధిక ఉత్పాదకత కారణంగానే పరిశ్రమ ఆదాయంతో పోలిస్తే ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు. సిబ్బంది లో దాదాపు 1/3 వ వంతు మహిళలే ఉన్నారని పేర్కొన్నారు. రెండేళ్లలో రెండో అతి పెద్ద స్టార్టప్ కేంద్రంగా భారత్ వచ్చే రెండేళ్లలో యూఎస్ తర్వాత రెండో అతి పెద్ద స్టార్టప్ కేంద్రంగా భారత్ ఆవిర్భవించనుందని చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఏడాది భారత్‌లో 800 కొత్త టెక్నాలజీ స్టార్టప్‌లు ప్రారంభకానున్నాయని తెలిపారు. దీంతో దేశంలో మొత్తం స్టార్టప్‌ల సంఖ్య 3,100కు చేరుతుందని పేర్కొన్నారు. బ్రిటన్,ఇజ్రాయెల్‌లతో పోలిస్తే భారత్‌లోనే స్టార్టప్‌ల వృద్ధి రేటు ఎక్కువగా ఉందని తెలిపారు. దేశీ కంపెనీలు స్థానికంగానే కాకుండా విదేశాల్లో కూడా మంచి వృద్ధిని నమోదుచేస్తున్నాయని చె ప్పారు. ఈ కంపెనీలు 2010 నుంచి ఇప్పటివరకు 2.3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాయని తెలిపారు. స్టార్టప్‌లు టెక్నాలజీ, డాటా అండ్ అనలైటిక్, రియాల్టీ, విద్యా, హెల్త్‌కేర్, తదితర విభాగాల్లో నిమగ్నమై ఉన్నాయని పేర్కొన్నారు. చిన్న సంఖ్యలో ఉన్న పెద్ద కంపెనీలతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో విజయవంతమైన చిన్న కంపెనీలు దేశంలో చాలా ఉన్నాయని తెలిపారు. -
2025 కల్లా 50 బిలియన్ డాలర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ ఐటీ పరిశ్రమ 2025 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని సాఫ్ట్వేర్ సంస్థల సమాఖ్య నాస్కామ్ వైస్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ ఎగుమతులు దాదాపు 10 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆయన వివరించారు. దేశీ ఐటీ పరిశ్రమ 120 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉందని ఆయన తెలిపారు. నాస్కామ్ ఏర్పడి 25 ఏళ్లు అయిన సందర్భంగా శుక్రవారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ రెడ్డి ఈ విషయాలు చెప్పారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం సుమారు వెయ్యి ఎకరాల్లో 800 పైచిలుకు ఐటీ సంస్థలు విస్తరించి ఉన్నాయని ఆయన వివరించారు. వీటి ద్వారా 4.5 లక్షల మంది ప్రత్యక్షంగాను, 10 లక్షల మంది పరోక్షంగాను ఉపాధి పొందుతున్నారని చెప్పారు. దేశం మొత్తం మీద జరిగే ఐటీ రిక్రూట్మెంట్స్లో 20 శాతం హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయని మోహన్‌రెడ్డి తెలిపారు. 2010 నుంచి ఇప్పటిదాకా ఇక్కడ 200 పైచిలుకు స్టార్టప్స్ ఏర్పాటయ్యాయన్నారు. ప్రధానంగా బిగ్ డేటా, సోషల్ మీడియా తదితర విభాగాల్లో పనిచేస్తున్న ఈ సంస్థలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని ఆయన చెప్పారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టుల్లో దేశీ ఐటీ రంగానికి అపార అవకాశాలు ఉన్నాయని మోహన్ రెడ్డి చెప్పారు. వినూత్న ఆవిష్కరణలు, అత్యున్నత ఆశయాలు, అవకాశాలతో రాబోయే పాతిక సంవత్సరాల్లో ఐటీ పరిశ్రమ ప్రస్థానం ఉజ్వలంగా ఉంటుందని నాస్కామ్ భావిస్తోందని ఆయన వివరించారు. పలువురు దేశీ ఐటీ దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
టీసీఎస్ లాభం 45% అప్
ముంబై: సాఫ్ట్వేర్ సేవలకు టాప్ ర్యాంక్‌లో ఉన్న దేశీ దిగ్గజం టీసీఎస్ మరోసారి ప్రోత్సాహకర ఫలితాలను సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2014-15) క్యూ1(ఏప్రిల్-జూన్)లో 45% అధికంగా రూ. 5,568 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది(2013-14) ఇదే కాలంలో రూ. 3,840 కోట్లను మాత్రమే ఆర్జించింది. ఇదే కాలానికి ఆదాయం సైతం 23% ఎగసి రూ. 22,111 కోట్లను తాకింది. గతంలో రూ. 17,987 కోట్లు నమోదైంది. దేశీ అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారం వెల్లడించిన కన్సాలిడేటెడ్ ఫలితాలివి. పబ్లిక్ ఇష్యూ చేపట్టి 10 వసంతాలు పూర్తయిన సందర్భంగా వాటాదారులకు షేరుకి రూ. 40 ప్రత్యేక డివిడెండ్‌ను ప్రతిపాదించింది. పటిష్ట నిర్వహణ కారణంగా కరెన్సీ కదలికలు, తరుగుదల, వేతన పెంపు వంటి ప్రతికూల అంశాలను సమర్థవంతంగా ఎదుర్కోగలిగినట్లు కంపెనీ సీఎఫ్‌వో రాజేష్ గోపీనాథన్ పేర్కొన్నారు. ఆశలు తక్కువే... మధ్యప్రాచ్యం, ఆఫ్రికా మార్కెట్ల నుంచి సవాళ్లు ఎదురయ్యాయని, బీమా రంగం మినహా ఇతర విభాగాలలో ప్రోత్సాహకర పనితీరును చూపగలిగామని చంద్రశేఖరన్ వివరించారు. అయితే బీమా రంగ విభాగంపై అధిక అంచనాలు లేకపోవడంతో ఆందోళనచెందాల్సినదేమీ లేదని వ్యాఖ్యానించారు. కొత్త ప్రభుత్వం ఐటీ ఆధారిత ప్రకటనలు చేసినప్పటికీ, దేశీ మార్కెట్‌పై అంతగా ఆశలు పెట్టుకోలేదని, అయితే అవకాశాలను అందిపుచ్చుకుంటామని పేర్కొన్నారు. కాగా, తరుగుదల లెక్కింపు విధానాల్లో చోటుచేసుకున్న మార్పులవల్ల రూ. 490 కోట్లమేర లాభాలు పెరిగినట్లు రాజేష్ తెలిపారు. అయితే అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం చూస్తే లాభాలపై ఇదే స్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. ఫలితాలపై అంచనాల నేపథ్యంలో బీఎస్ఈలో షేరు 0.8% క్షీణించి రూ. 2,381 వద్ద ముగిసింది. క్యూ1 ఫలితాలను కంపెనీ మార్కెట్లు ముగిశాక సాయంత్రం విడుదల చేసింది. ఇతర కీలక అంశాలివీ... క్యూ1లో స్థూలంగా 15,817 మందికి ఉద్యోగాలివ్వగా, నికరంగా 4,967 మంది మిగిలారు. దీంతో జూన్ చివరికి మొత్తం సిబ్బంది సంఖ్య 3,05,431కు చేరింది. గత 12 నెలల్లోలేని విధంగా ఉద్యోగవలస రేటు 12%గా నమోదైంది. మొత్తం 25,000 మంది క్యాంపస్ విద్యార్థులను ఎంపిక చేసుకోగా, 3,000 మందితో ఇప్పటికే శిక్షణా తరగతులను మొదలుపెట్టినట్లు కంపెనీ మానవ వనరుల గ్లోబల్ హెడ్ అజయ్ ముఖర్జీ చెప్పారు. మిగిలినవారిని కూడా ఈ ఏడాదిలో తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 55,000 మందికి ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్లు అజయ్ తెలిపారు. నిర్వహణ లాభం 22.5%గా నమోదైంది. ట్రయినీలను మినహాయిస్తే ఉద్యోగుల వినియోగ రేటు అత్యధికంగా 85.3%ను తాకింది. డాలర్లలో క్యూ1: నికర లాభం 20.5% పుంజుకుని 84.5 కోట్ల డాలర్లను తాకింది. గతంలో 70.1 కోట్ల డాలర్లు ఆర్జించింది. ఆదాయం కూడా 16.4% పెరిగి 369 కోట్ల డాలర్లకు చేరింది. గతంలో 317 కోట్ల డాలర్ల ఆదాయం నమోదైంది. మీడియా, ఇన్ఫర్మేషన్ సర్వీసులు, లైఫ్‌సెన్సైస్, రిటైల్, టెలికం వంటి బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌యేతర సర్వీసులలో 5% వృద్ధిని సాధించినట్లు కంపెనీ పేర్కొంది. రిటైల్, లైఫ్‌సెన్సైస్, బ్యాంకింగ్ రంగాలలో 5 కోట్ల డాలర్ల స్థాయిలో 7 భారీ ఆర్డర్లను సంపాదించింది. ప్రస్తుతం ఇలాంటి మరో 8 కాంట్రాక్ట్‌ల కోసం చర్చలు నిర్వహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
మేడిన్ ఇండియా సాఫ్ట్‌వేర్‌పై కేంద్రం దృష్టి
నేడు బెంగళూరులో ఐటీ పంచాయత్ న్యూఢిల్లీ: భారత్‌ను సాఫ్ట్వేర్ తయారీ కేంద్రంగా మలచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ ఐటీ సేవల పరిశ్రమ పదివేల కోట్ల డాలర్లకు మించిపోయింది. పలు ఐటీ కంపెనీలు మేడిన్ ఇండియా సాఫ్ట్వేర్ తయారీపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) బెంగళూరులో ఐటీ పంచాయత్ జరుగుతోంది. నాస్కామ్ ఇతర కొన్ని కీలకమైన సంఘాల భాగస్వామ్యంతో జరుగుతోన్న ఈ ఐటీ పంచాయత్‌లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలోనే ఆయన మేడిన్ ఇండియా సాఫ్ట్వేర్ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించనున్నారని ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. వచ్చే వారంలో బడ్జెట్ రానున్న సందర్భంగా జరుగుతున్న ఈ సమావేశం సాఫ్ట్వేర్ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన అవకాశాలు, అడ్డంకులు తదితర అంశాలపై దృష్టి సారిస్తుందని తెలిపారు. దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఐటీ వినియోగం అంశంపై కూడా చర్చ జరుగుతుందని తెలిపారు. కాగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్(ఐటీ-బీపీఎం) పరిశ్రమ 10,900 డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. మరోవైపు ఐటీ ఉత్పత్తుల ఆదాయం 220 కోట్ల డాలర్లుగానే ఉంది. ఈ ఆదాయాన్ని 2020 కల్లా 1,000 డాలర్లకు పెంచాలని నాస్కామ్ లక్ష్యంగా నిర్దేశించింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో వాడే ఆపరేటింగ్ సిస్టమ్‌లను మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు తయారు చేస్తున్నాయి. ఇలాంటి సాఫ్ట్వేర్లను దేశీయంగా తయారు చేయాలనేది ప్రభుత్వం సంకల్పం. -
స్టార్టప్స్‌కు తోడ్పాటునిచ్చే చర్యలు కావాలి
నాస్కామ్ ప్రీ-బడ్జెట్ ప్రతిపాదనలు బెంగళూరు: ఔత్సాహిక వ్యాపారవేత్తలు, స్టార్టప్స్‌ని, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీ-బీపీవో సంస్థల సమాఖ్య నాస్కామ్ కేంద్రాన్ని కోరింది. అలాగే, ఫండింగ్, ట్యాక్సేషన్, కంపెనీ నెలకొల్పడం..మూసివేతకు సంబంధించి నిబంధనలు సడలించడం తదితర అంశాలపై కూడా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ కసరత్తు నేపథ్యంలో పలు విషయాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లినట్లు నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ సోమవారం తెలిపారు. పెద్ద కంపెనీలకు నియంత్రణ సంస్థలపరమైన నిబంధనల్లో కూడా మరింత పారదర్శకత అవసరమని వివరించారు. వీటన్నింటి కోసం ప్రభుత్వం ప్రాథమికంగా రూ. 500 కోట్లు కేటాయించాలని కోరినట్లు ఆయన వివరించారు. ఇటువంటి ఇండియా టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్షిప్ మిషన్‌తో 50,000 టెక్నాలజీ స్టార్టప్స్ రాగలవని, 30 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగలవని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 2020 నాటికి ఐటీ-బీపీవో రగం 300 బిలియ్ డాలర్లకు చేరుకోనుండగా.. అందులో 100 బిలియన్ డాలర్లు ఈ విభాగం నుంచే రాగలవని అంచనాలు ఉన్నట్లు తెలిపారు. 10,000 స్టార్టప్స్ మూడో దశ.. కొత్త టెక్నాలజీ కంపెనీల కోసం ఉద్దేశించిన 10,000 స్టార్టప్స్ కార్యక్రమంలో భాగంగా మూడో విడత పోటీలను చంద్రశేఖర్ సోమవారం ప్రారంభించారు. వెబ్, మొబైల్, ఈకామర్స్ తదితర అంశాల్లో ఏర్పాటయ్యే స్టార్టప్స్ వివరాలను పొందుపర్చేందుకు టెక్నాలజీ స్టార్టప్ రిజిస్ట్రీ పేరిట రిపాజిటరీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
ఇరు ప్రభుత్వాలూ ఐటీకి అనుకూలమే..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గత రెండేళ్లుగా రాష్ట్ర విభజన సమస్య ఐటీ రంగ వృద్ధిని దెబ్బతీసిందని, ఇప్పుడు ఆ సమస్య లేకపోవడంతో ఇరు రాష్ట్రాల్లో ఐటీ రంగం వేగంగా వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని నాస్కామ్ వ్యక్తం చేసింది. ఇరు రాష్ట్రాలు ఐటీ రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇప్పటికే సంకేతాలను ఇవ్వడం సానుకూల పరిణామమని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ వ్యక్తం చేశారు. విభజన సమస్య తీరడంతో హైదరాబాద్‌లో ఐటీ రంగానికి పూర్వవైభవం వస్తుందని, కాని ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగ వృద్ధి అనేది అక్కడి ప్రభుత్వం తీసుకునే చర్యలు, కల్పించే మౌలిక వసతులపై ఆధారపడి ఉంటుదన్నారు. హైదరాబాద్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రాలో కొత్తగా ఒక సిటీని రూపొందించి దానికి బ్రాండ్ తీసుకురావడమే అత్యంత క్లిష్టమైన అంశమన్నారు. ఇలా బ్రాండ్ తీసుకొచ్చినా అక్కడ పట్టణ వాతావరణానికి సంబంధించిన మౌలిక వసతులు లేకపోతే పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకొచ్చినా, ఉద్యోగస్తులు రాని పరిస్థితి ఉంటుందని, ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర ప్రభుత్వం ఐటీ రంగం కోసం నగరాలను అభివృద్ధి చేయడమే కాకుండా ప్రోత్సాహకాలను ఇవ్వాల్సి ఉంటుందన్నారు. స్మాక్దే భవిష్యత్తు ఈ ఏడాది దేశంలో ఐటీ, ఐటీ ఆధారిత సేవల వ్యాపారంలో 13- 15 శాతం వృద్ధి అంచనా వేస్తున్నట్లు నాస్కామ్ పేర్కొంది. ప్రస్తుతం రూ.7,08,000 కోట్లుగా (118 బిలియన్ డాలర్లు) ఉన్న ఐటీ పరిశ్రమ ఈ ఏడాది రూ.8,20,000 కోట్లుదాటుతుందని అంచనా వేసింది. ప్రస్తుతం పరిశ్రమ సగటు వృద్ధి రేటుకు రెట్టింపు స్థాయిలో సోషల్ మీడియా, మొబైల్, ఎనలటిక్స్, క్లౌడ్(స్మాక్- ఎస్ఎంఏసీ) రంగాల్లో వృద్ధి నమోదవుతున్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. నాస్కామ్ నిర్వహిస్తున్న రెండవ బిగ్ డేటా సదస్సుకు హాజరైన చంద్ర శేఖర్ మాట్లాడుతూ స్టార్ట్అప్ కంపెనీలకు మౌలిక వసతులు కల్పించడానికి రూ.500 కోట్లతో మూలధన నిధిని ఏ ర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ఎనలటిక్స్ వ్యాపారం 100 కోట్ల డాలర్లుగా ఉందని, ఇది 2017-18 నాటికి 230 కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు బ్లూఓషన్ నివేదికలో వెల్లడించింది. -
రచ్చ గెలిచాం, ఇంట మాత్రం నిరాశ
న్యూఢిల్లీ: భారత ఐటీ రంగం అంతర్జాతీయంగా అద్భుతాలు సృష్టిస్తోందని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ చెప్పారు. భారత ఐటీ రంగం రచ్చ గెలుస్తోంది కానీ, ఇంట మాత్రం చతికిలపడుతోందని ఆయన బుధవారం చెప్పారు. ఐటీ పరిశ్రమ అంటే భారతేనన్న పేరు వస్తోందని పేర్కొన్నారు. భారత ఐటీ రంగం ఒకప్పుడు 12-14 శాతం చొప్పున వృద్ధి సాధించిందని వివరించారు. కానీ దేశీయంగా చూస్తే ఈ రంగం ఆదాయం నిరాశాజనకంగా ఉందని వివరించారు. గత ఏడాది దేశీయ ఐటీ రంగం ఆదాయం అంతంత మాత్రంగానే ఉందని పేర్కొన్నారు. దేశీయ ఐటీ రంగం రూపాయిల్లో 10 శాతం వృద్ధి సాధించిందని, డాలర్ బలహీనపడిన కారణంగానే ఈ వృద్ధి సాధ్యమైందని తెలిపారు. కానీ డాలర్ల పరంగా వృద్ధి నామమాత్రమేనని , ఇది ఆందోళన కలిగిస్తోందని వివరించారు. వచ్చే ఏడాది బావుంటుంది ఇతర దేశాల్లో భారత ఐటీ రంగం అద్భుతాలు సృష్టిస్తోందని, ఉత్పాదకతను పెంచుతోందని పేర్కొన్నారు. కానీ, దేశీయంగా చూస్తే ఐటీ సేవల వినియోగం స్వల్పంగానే ఉందని తెలిపారు. మొత్తం భారత ఐటీ పరిశ్రమలో దేశీయ మార్కెట్ వాటా 10 శాతమే అయినప్పటికీ, దేశీయ మార్కెట్లో ఐటీ వృద్ధి తీరు ఆందోళనకరంగానే ఉందని వివరించారు. భారత-ఐటీ బీపీఎం పరిశ్రమ ఎగుమతి ఆదాయం 13 శాతం వృద్ధితో గత ఆర్థిక సంవత్సరంలో 8,600 కోట్ల డాలర్లకు చేరగా, దేశీయ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.1.15 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఎగుమతులు 13-15 శాతం, దేశీయ మార్కెట్ 9-12 శాతం చొప్పున వృద్ధి సాధిస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, అన్నీ కుదురుకోవడానికి ఆరు నెలలు పడుతుందని చంద్రశేఖర్ వివరించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే తగిన సూచనలందిస్తామని పేర్కొన్నారు. కొన్ని సరైన నిర్ణయాలు జరిగే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది పెద్ద మార్పులేమీ లేనప్పటికీ, వచ్చే ఏడాది బావుంటుందని చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
నాస్కామ్ వైస్ చైర్మన్‌గా ఇన్ఫోటెక్ మోహన్ రెడ్డి
న్యూఢిల్లీ: నాస్కామ్ వైస్ చైర్మన్‌గా నగరానికి చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోటెక్ సీఎండీ బీవీఆర్ మోహన్ రెడ్డి నియమితులయ్యారు. చైర్మన్‌గా కాగ్నిజెంట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్. చంద్రశేఖరన్ నియమితులయ్యారని నాస్కామ్ బుధవారం తెలిపింది. కృష్ణకుమార్ నటరాజన్(మైండ్‌ట్రీ సీఈవో) స్థానంలో నియమితులైన చంద్రశేఖరన్ 2014-15 ఏడాదికి నాస్కామ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. గతేడాది భారత ఐటీ-బీపీఎం పరిశ్రమ వ్యవస్థాగత మార్పులకు గురైందని చంద్రశేఖరన్ అన్నారు. వాణిజ్య కార్యకలాపాలూ జోరుగా ఉన్నాయని, ఫలితంగా ఈ పరిశ్రమలో అవకాశాలు పెరుగుతాయని, నవకల్పనలు జోరందుకుంటాయని చెప్పారు. ఈ పరిశ్రమ మరింత వృద్ధి సాధించడానికి నాస్కామ్లోని ఇతర సభ్యులతోనూ, ఈ రంగంలోని అనుభవజ్ఞులతోనూ కలసి పనిచేస్తానని పేర్కొన్నారు. భారత ఐటీ పరిశ్రమ 10 కోట్ల డాలర్ల స్థాయి నుంచి ఇరవై ఏళ్లలో 10,000 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుందని నాస్కామ్కు వైస్ చైర్మన్‌గా నియమితులైన బీవీఆర్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడానికి నాస్కామ్ కృషి చేస్తుందని తెలిపారు. 10,800 కోట్ల డాలర్ల భారత ఐటీ-బీపీవో రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాస్కామ్ ఏర్పాటై 25 ఏళ్లు. -
2025 నాటికి ఐటీ ఉత్పత్తుల వ్యాపారం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఐటీ ఉత్పత్తుల రంగం వేగంగా విస్తరిస్తోందని, 2025 నాటికి ఇది 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు నాస్కామ్ పేర్కొంది. దేశంలో 10,000కి పైగా ఐటీ ఉత్పత్తుల స్టార్టప్ కంపెనీలు ఉన్నప్పటికీ ఇవన్నీ ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, వీటికి తగినంత నిధులను సమకూర్చాల్సిన అవసరం ఉందని నాస్కామ్ ప్రోడక్ట్ కౌన్సిల్ చైర్మన్ రవి గురురాజ్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘నాస్కామ్ ప్రోడక్ట్ కాన్క్లేవ్ 2014’ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది కనీసం 100 స్టార్టప్ కంపెనీలకు ఫండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా సిలికాన్ వ్యాలీ సందర్శించడానికి 25 కంపెనీలను ఎంపిక చేశామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐటీ ప్రోడక్టు కంపెనీలు ఊహించని వృద్ధి నమోదవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెయైంట్ (ఇన్ఫోటెక్) చైర్మన్ బి.వి.ఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో 3,500కిపైగా సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కంపెనీలు పరిపక్వ దశకు చేరుకున్నప్పటికీ వాటి విలువ చాలా తక్కువగా ఉందన్నారు. సగం స్టార్టప్ కంపెనీల విలువ 10 మిలియన్ డాలర్లలోపే ఉందన్నారు. కాని ఇప్పుడు అహ్మదాబాద్, తిరువనంతపురం వంటి చిన్న పట్టణాలకు విస్తరిస్తుండటంతో ఈ కంపెనీలు తట్టుకొని నిలబడగలుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్వేర్ రంగానికి చెందిన వివిధ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
రెండు రాష్ట్రాల్లోనూ... ఎస్ఎంఈలను ప్రోత్సహించాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ విపణిలో చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంఈ) కీలకమని నాస్కామ్ అధ్యక్షుడు ఆర్.చంద్రశేఖర్ అన్నారు. గతేడాది ఐటీ, బీపీఓ రంగాల్లో ఎస్ఎంఈల ఎగుమతుల వాటా 20 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. సుమారు 108 బిలియన్ డాలర్లు ఆదాయాన్ని ఆర్జించిందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణ, సీమాంధ్ర రెండు రాష్ట్రాల్లోనూ ఏర్పడే కొత్త ప్రభుత్వాలు ఎస్ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేలా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. బుధవారమిక్కడ జరిగిన ఆంధ్రప్రదేశ్ ఐటీ పరిశ్రమ సంఘం (ఇట్స్‌ఏపీ) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘పరిశ్రమల రంగం- ఎస్ఎంఈలకు అవకాశాలు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. ప్రభుత్వం, పరిశ్రమల రంగం రెండూ పరస్పరం సహకరించుకోవాలన్నారు. అప్పుడే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా నిపుణుల కొరత ఉందని, దీన్ని ఎస్ఎంఈ రంగం అందిపుచ్చుకోవాలని సూచించారు. రాజకీయ అస్థిరత, ఆర్థిక లోటు, విధాన, పాలనాపరమైన నిర్ణయాల లోపాలు వంటి అనేక కారణాల వల్ల మూడేళ్లుగా దేశీయ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోందన్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. ఏటా 30% వృద్ధిని నమోదు చేసే పరిశ్రమల రంగం రెండేళ్లుగా కేవలం 10% వృద్ధిని మాత్రమే నమోదు చేస్తుండటమే ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చన్నారు. అయితే ఈ ఏడాది కొంచెం మెరుగ్గా 13% వృద్ధిని నమోదు చేసిందని చెప్పారు. కొత్త పెట్టుబడిదారులు దేశీయ విపణిలోకి రావట్లేదని, ఉన్న కంపెనీలు పెట్టుబడులను విస్తరించట్లేదని, కొన్ని చిన్న కంపెనీలైతే బోర్డు తిప్పేశాయని చంద్రశేఖర్ వివరించారు. అయితే ప్రస్తుతం అనిశ్చితి తొలగిందని భవిష్యత్తులో దేశ, విదేశీ పెట్టుబడులకు ఆస్కారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గతేడాది పరిశ్రమల రంగం 108 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిందన్నారు. ఈ ఏడాది 118 బిలియన్ డాలర్ల ఆదాయం లక్ష్యంగా ఉందని చెప్పారు. సంజయ్ జాజు మాట్లాడుతూ... ఐటీ పరిశ్రమ అభివృద్ధిలో చిన్న,మధ్య తరహా పరిశ్రమల పాత్ర ఎంతో ఉంటుందన్నారు. ఐటీలో 80% పెద్ద కంపెనీలు, 20% చిన్న, మధ్య తరహా పరిశ్రమలున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు అన్నారు. వాట్సప్, గూగుల్, ఫేస్బుక్, ఆపిల్లాంటి సంస్థలు ఒకప్పుడు చిన్న చిన్న గ్యారేజీలలో ప్రారంభించినవేనన్నారు. మన దేశంలో ఇప్పుడు ఫ్లిప్‌కార్డ్ ఇద్దరు యువకుల చేత ప్రారంభమయి, సంవత్సరానికి ఆరువేల కోట్ల లావాదేవీలను జరుపుతోందన్నారు. వచ్చే దశాబ్దంలో ఐడియాలున్న పారిశ్రామికవేత్తలకే కొత్త కంపెనీలు పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. కంపెనీలన్నీ పరస్పర సహకారంతోనే అభివృద్ధి చెందాలన్నారు. మొబైల్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ ద్వారా వచ్చిన అంతరాలను పూరించడానికి ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎన్నో రకాల ప్రోత్సాహకాలను అందిస్తుందన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రోక్యూర్మెంట్ కోనుగొలు చేస్తుందన్నారు. ఇందులో 10% చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి ప్రభుత్వం కోనుగోలు చేస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇట్స్ఎపి అధ్యక్షులు వి.రాజన్న, ఐడెంటీస్ టెక్ సొల్యూషన్స్ యండి. యల్.సురేష్, రామ్ఇన్ఫో మేనేజింగ్ డెరైక్టర్ శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. -
నాస్కామ్ ప్రెసిడెంట్‌గా చంద్రశేఖర్
న్యూఢిల్లీ:ఐటీ కంపెనీల అసోసియేషన్.. నాస్కామ్ ప్రెసిడెంట్‌గా మాజీ టెలికం సెక్రటరీ రెంటాల చంద్రశేఖర్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.1975 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆర్. చంద్రశేఖర్... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. 1997, జూన్ నుంచి 1999 డిసెంబర్ వరకూ ఆయన ఈ సేవలందించారు. కీలక పదవులు... ఐఐటీ-ముంబైలో ఎం.ఎస్సీ (కెమిస్ట్రీ) అభ్యసించిన ఆయన ఎం.ఎస్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్)ను అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ నుంచి పొందారు. ఐటీ, టెలికం కార్యదర్శులుగా కూడా పనిచేసిన ఆయన జాతియ టెలికం విధానం 2012, తొలి జాతీయ ఐటీ విధానం, జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానాల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారు. ఇక నాస్కామ్ సంస్థ 10,800 కోట్ల డాలర్ల ఐటీ-బీపీఎం పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తోంది. నాస్కామ్ సంస్థకు 2007-13 వరకూ అధ్యక్షుడిగా వ్యవహరించిన సోమ్ మిట్టల్ స్థానంలో చంద్రశేఖర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాస్కామ్ ప్రెసిడెంట్ పదవి స్వీకరించడం ఆనందంగా ఉందని చంద్రశేఖర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భారత ఐటీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అపారంగా ఉన్నాయని, 2020 నాటికల్లా భారత ఐటీ పరిశ్రమ 30,000 కోట్ల డాలర్లకు చేరే లక్ష్యం కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. -
ఐటీ హైరింగ్ 17 శాతం తగ్గొచ్చు: నాస్కామ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీరంగ హైరింగ్ 17 శాతం తగ్గుతుందని నాస్కామ్ అంచనా వేస్తోంది. ఆటోమేషన్ పెరగడం, ఆట్రిషన్ (ఉద్యోగుల వలస)తగ్గడం వంటి కారణాల వల్ల ఐటీ రంగంలో 1,50,000 -1,80,000 వరకూ కొత్త ఉద్యోగాలే వస్తాయని నాస్కామ్ ప్రెసిడెంట్ శోమ్ మిట్టల్ చెప్పారు. గత ఏడాది నికరంగా 1,80,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. ప్రస్తుతం 10,800 కోట్ల డాలర్ల భారత ఐటీ-ఐటీఈఎస్ రంగంలో 30 లక్షల మంది పనిచేస్తున్నారు. ఐటీ రంగంలో కిందిస్థాయి ఉద్యోగాల్లో ఆటోమేషన్ పెరగడంతో డొమైన్ నిపుణుల అవసరం పెరిగిపోతోందని మిట్టల్ వివరించారు. పరిశ్రమ సగటు అట్రిషన్ రేటు 20 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఐటీ రంగంలో ఈ రేటు 14-15 శాతానికి తగ్గిపోయిందని పేర్కొన్నారు. హైరింగ్ విధివిధానాలు మారడంతో క్యాంపస్ రిక్రూట్మెంట్లు కూడా తగ్గుతున్నాయని చెప్పారు. గత ఏడాది ఉద్యోగ నియామకాల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు 60 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. సాంకేతికపరిజ్ఞాన నైపుణ్యాలపైకాక సాఫ్ట్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్లో భారత అగ్రశ్రేణి నాలుగు ఐటీ కంపెనీలు 10,900 కొత్త ఉద్యోగాలిచ్చాయని, ఈ ఏడాది ఇదే కాలానికి ఇది 4,100కు తగ్గిందని మిట్టల్ పేర్కొన్నారు.