న్యూఢిల్లీ: భారత్–కెనడా మధ్య తలెత్తిన దౌత్యపరమైన వివాద పరిణామాలను దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిశితంగా పరిశీలిస్తోంది. కెనడాలోని తమ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వారి అభిప్రాయం ప్రకారం తక్షణం ఆందోళన చెందాల్సినదేమీ లేదని పేర్కొంది. ఖలిస్తానీ వేర్పాటువాది హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.
పలు భారతీయ ఐటీ దిగ్గజాలు కెనడాలో కార్యకలాపాలను సాగిస్తుండటంతో పాటు అక్కడ పెట్టుబడులు పెట్టి, ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాస్కామ్ స్పందన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు, ప్రస్తుతానికైతే టెక్ పరిశ్రమ వ్యాపారంపై ఎటువంటి ప్రభావం లేకపోయినా.. ఈ వివాదం ఎంతకాలం కొనసాగుతుందనేది వేచి చూడాల్సి ఉంటుందని పరిశ్రమ దిగ్గజం టీవీ మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment