స్టార్టప్స్‌కు తోడ్పాటునిచ్చే చర్యలు కావాలి
నాస్కామ్ ప్రీ-బడ్జెట్ ప్రతిపాదనలు
బెంగళూరు: ఔత్సాహిక వ్యాపారవేత్తలు, స్టార్టప్స్‌ని, కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఐటీ-బీపీవో సంస్థల సమాఖ్య నాస్కామ్ కేంద్రాన్ని కోరింది. అలాగే, ఫండింగ్, ట్యాక్సేషన్, కంపెనీ నెలకొల్పడం..మూసివేతకు సంబంధించి నిబంధనలు సడలించడం తదితర అంశాలపై కూడా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. బడ్జెట్ కసరత్తు నేపథ్యంలో పలు విషయాలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టికి తీసుకెళ్లినట్లు నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ సోమవారం తెలిపారు.
పెద్ద కంపెనీలకు నియంత్రణ సంస్థలపరమైన నిబంధనల్లో కూడా మరింత పారదర్శకత అవసరమని వివరించారు. వీటన్నింటి కోసం ప్రభుత్వం ప్రాథమికంగా రూ. 500 కోట్లు కేటాయించాలని కోరినట్లు ఆయన వివరించారు. ఇటువంటి ఇండియా టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్ మిషన్‌తో 50,000 టెక్నాలజీ స్టార్టప్స్ రాగలవని, 30 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించగలవని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 2020 నాటికి ఐటీ-బీపీవో రగం 300 బిలియ్ డాలర్లకు చేరుకోనుండగా.. అందులో 100 బిలియన్ డాలర్లు ఈ విభాగం నుంచే రాగలవని అంచనాలు ఉన్నట్లు తెలిపారు.
10,000 స్టార్టప్స్ మూడో దశ..
కొత్త టెక్నాలజీ కంపెనీల కోసం ఉద్దేశించిన 10,000 స్టార్టప్స్ కార్యక్రమంలో భాగంగా మూడో విడత పోటీలను చంద్రశేఖర్ సోమవారం ప్రారంభించారు. వెబ్, మొబైల్, ఈకామర్స్ తదితర అంశాల్లో ఏర్పాటయ్యే స్టార్టప్స్ వివరాలను పొందుపర్చేందుకు టెక్నాలజీ స్టార్టప్ రిజిస్ట్రీ పేరిట రిపాజిటరీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.