
దేశంలో 2020కి 10,500 స్టార్టప్స్
• అమెరికా, యూకే తర్వాత మూడో స్థానం
• 2016-17 ఆదాయ వృద్ధి అంచనాల్లో కోత!
• ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్
ముంబై: భారత్‌లోని స్టార్టప్స్ సంఖ్య 2020 నాటికి 2.2 రెట్ల వృద్ధితో 10,500కి చేరుతుందని ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ అంచనా వేసింది. గతేడాది దేశంలో స్టార్టప్స్ జోరు కొద్దిమేర తగ్గిందని పలు నివేదికలో పేర్కొంటున్నా.. భారత్ మాత్రం ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్స్ గల దేశంగా కొనసాగుతుందని పేర్కొంది. స్టార్టప్స్ అధికంగా గత దేశాల్లో అమెరికా, యూకే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయని తన తాజా నివేదికలో తెలిపింది. భారత్‌లో బెంగళూరు, ఎన్‌సీఆర్, ముంబై ప్రాంతాలు స్టార్టప్స్ హబ్‌గా మారతాయని పేర్కొంది. ఇన్వెస్టర్లు ప్రధానంగా హెల్త్‌టెక్, ఫిన్‌టెక్, ఎడ్యుటెక్, డేటా అనలిటిక్స్, బీ2బీ కామర్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వంటి విభాగాలకు చెందిన స్టార్టప్స్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నారని వివరించింది. టెక్ స్టార్టప్స్ సంఖ్య ఈ ఏడాది చివరకు 10-12 శాతం వృద్ధితో 4,750కి చేరుతుందని నాస్కామ్ అంచనా వేసింది. 2016లో 1,400 కొత్త స్టార్టప్స్ ఏర్పాటు జరుగుతుందని పేర్కొంది.
ఎగుమతుల ఆదాయ వృద్ధి అంచనాల త గ్గింపు!
నాస్కామ్ తాజాగా 2016-17 ఎగుమతుల ఆదాయ వృద్ధి అంచనాలను (10-12 శాతం) తగ్గించనుంది. ఐటీ రంగంలోని ప్రధాన కంపెనీలు తాజా క్యూ2లో ప్రకటించిన ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఈ అభిప్రాయానికి వచ్చామని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. మరిన్ని కంపెనీల ఆర్థిక ఫలితాల వెల్లడి అనంతరం ఒక నిర్ణయానికి వచ్చి, సవరించిన ఆదాయ వృద్ధి అంచనాలను రెండు వారాల్లోగా వెల్లడిస్తామని పేర్కొన్నారు.