నాస్కామ్ వైస్ చైర్మన్‌గా ఇన్ఫోటెక్ మోహన్ రెడ్డి
న్యూఢిల్లీ: నాస్కామ్ వైస్ చైర్మన్‌గా నగరానికి చెందిన ఐటీ కంపెనీ ఇన్ఫోటెక్ సీఎండీ బీవీఆర్ మోహన్ రెడ్డి నియమితులయ్యారు. చైర్మన్‌గా కాగ్నిజెంట్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆర్. చంద్రశేఖరన్ నియమితులయ్యారని నాస్కామ్ బుధవారం తెలిపింది. కృష్ణకుమార్ నటరాజన్(మైండ్‌ట్రీ సీఈవో) స్థానంలో నియమితులైన చంద్రశేఖరన్ 2014-15 ఏడాదికి నాస్కామ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. గతేడాది భారత ఐటీ-బీపీఎం పరిశ్రమ వ్యవస్థాగత మార్పులకు గురైందని చంద్రశేఖరన్ అన్నారు.
వాణిజ్య కార్యకలాపాలూ జోరుగా ఉన్నాయని, ఫలితంగా ఈ పరిశ్రమలో అవకాశాలు పెరుగుతాయని, నవకల్పనలు జోరందుకుంటాయని చెప్పారు. ఈ పరిశ్రమ మరింత వృద్ధి సాధించడానికి నాస్కామ్‌లోని ఇతర సభ్యులతోనూ, ఈ రంగంలోని అనుభవజ్ఞులతోనూ కలసి పనిచేస్తానని పేర్కొన్నారు. భారత ఐటీ పరిశ్రమ 10 కోట్ల డాలర్ల స్థాయి నుంచి ఇరవై ఏళ్లలో 10,000 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుందని నాస్కామ్‌కు వైస్ చైర్మన్‌గా నియమితులైన బీవీఆర్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడానికి నాస్కామ్ కృషి చేస్తుందని తెలిపారు. 10,800 కోట్ల డాలర్ల భారత ఐటీ-బీపీవో రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాస్కామ్ ఏర్పాటై 25 ఏళ్లు.