న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటీరంగ హైరింగ్ 17 శాతం తగ్గుతుందని నాస్కామ్ అంచనా వేస్తోంది. ఆటోమేషన్ పెరగడం, ఆట్రిషన్ (ఉద్యోగుల వలస)తగ్గడం వంటి కారణాల వల్ల ఐటీ రంగంలో 1,50,000 -1,80,000 వరకూ కొత్త ఉద్యోగాలే వస్తాయని నాస్కామ్ ప్రెసిడెంట్ శోమ్ మిట్టల్ చెప్పారు. గత ఏడాది నికరంగా 1,80,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. ప్రస్తుతం 10,800 కోట్ల డాలర్ల భారత ఐటీ-ఐటీఈఎస్ రంగంలో 30 లక్షల మంది పనిచేస్తున్నారు.
ఐటీ రంగంలో కిందిస్థాయి ఉద్యోగాల్లో ఆటోమేషన్ పెరగడంతో డొమైన్ నిపుణుల అవసరం పెరిగిపోతోందని మిట్టల్ వివరించారు. పరిశ్రమ సగటు అట్రిషన్ రేటు 20 శాతంగా ఉండగా, ప్రస్తుతం ఐటీ రంగంలో ఈ రేటు 14-15 శాతానికి తగ్గిపోయిందని పేర్కొన్నారు. హైరింగ్ విధివిధానాలు మారడంతో క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు కూడా తగ్గుతున్నాయని చెప్పారు. గత ఏడాది ఉద్యోగ నియామకాల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లు 60 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. సాంకేతికపరిజ్ఞాన నైపుణ్యాలపైకాక సాఫ్ట్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలపై కంపెనీలు మరింతగా దృష్టి పెడుతున్నాయని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో భారత అగ్రశ్రేణి నాలుగు ఐటీ కంపెనీలు 10,900 కొత్త ఉద్యోగాలిచ్చాయని, ఈ ఏడాది ఇదే కాలానికి ఇది 4,100కు తగ్గిందని మిట్టల్ పేర్కొన్నారు.
ఐటీ హైరింగ్ 17 శాతం తగ్గొచ్చు: నాస్కామ్
Published Tue, Aug 6 2013 3:01 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM
Advertisement
Advertisement